Sep 30, 2023

చేనేత సహకార సంఘాల ప్రక్షాళన అవసరం

దేశ ఆర్థిక వ్యవస్థలో, ఉపాధి కల్పనలో  చేనేత రంగం ప్రధాన పాత్ర పోషిస్తోంది.   వ్యవసాయం తర్వాత ఉపాధి అవకాశాలు చేనేత రంగంలోనే ఉన్నాయి. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారతీయ చేనేత వస్త్రాలకు మంచి డిమాండ్ ఉంది. దాంతో,  అత్యధిక మంది చేనేత, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో  దాదాపు 3 లక్షల మంది వరకు చేనేత రంగం ద్వారా  ప్రత్యక్షంగా, 8 లక్షల మంది వరకు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా లేక అనుబంధంగా అంటే..నూలు తయారు చేయడం, వడకడం, నూలుకు రంగులు అద్దడం, పట్టు, రేషన్ దారాలు తయారు చేయడం,  ఆసు తోడటం, పడుగులు చేయడం, చిలపలను కండెలుగా తయారు చేయడం, మగ్గాలు, దోనెలు, లాకలు, డిజైన్ డాబీలు,  రాట్నాలు, నాడెలు, కదుళ్లు, పన్నెలు, పన్నెల్లో ఉపయోగించే ఇత్తడి ఈనెలు వంటివాటిని తయారుచేయడంతోపాటు అత్యాధునిక డిజైన్స్ రూపకల్పన ద్వారా ఉపాధి పొందడం. ఇంతమంది ఆధారపడి జీవిస్తున్న ఈ రంగంపై ప్రభుత్వాలు అంతగా శ్రద్ధ వహించడంలేదు. దాంతో చేనేత రంగం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.  

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనేక మంది వృత్తి కళాకారులు, కార్మికులు మాదిరిగానే  సహకార వ్యవస్థ ద్వారా చేనేత కార్మికులు కూడా ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. చేనేత సహకార సంఘాల ద్వారా వడ్డీ, సబ్సిడీలు వంటి అనేక రాయితీలు అందుకుంటున్నారు. అలాగే, ఈ సంఘాల ద్వారా చేనేత కార్మికులు ఉపాధితోపాటు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ లో చేనేత సహకార సంఘాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. దానిని పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో  దాదాపు 1282 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వాటిలో సగానికిపైగా చేనేత సహకార సంఘాలు బోగస్ వే ఉన్నాయి. అంటే ఈ సొసైటీలలో చేనేత కార్మికులు ఉండరు. మగ్గాలు ఉండవు. రికార్డులలో మాత్రం అన్నీ ఉన్నట్లు రాసి, నాబార్డ్ రుణాలు, ప్రభుత్వ  రాయితీలన్నీ కొందరు వ్యక్తులు స్వాహా చేస్తున్నారు. చేనేత సొసైటీల ప్రక్షాళనకు సహకార శాఖ ఓ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి. సంఘాలన్నిటినీ తనిఖీ చేయాలి. జమా,ఖర్చులు, రుణాలు, సబ్సిడీలు, ఇతర రాయితీలతోపాటు  మగ్గాలను కూడా పరిశీలించాలి.  చేనేత కార్మికులు ఉండారో లేదో గమనించాలి. ఆ క్రమంలో బోగస్ గా తేలినవాటిని రద్దు చేయాలి. సొసైటీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేవాటిని ప్రత్యేకంగా గుర్తించాలి. నిజమైన చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆ కార్డుల ద్వారా వారు ప్రభుత్వం అందించే ప్రయోజనాలు పొందేందుకు అవకాశం కల్పించాలి. ఈ విధంగా చేనేత సహకార రంగంలో సంస్కరణలు చేస్తే నిజమైన చేనేత కార్మికులు లబ్ధిపొందే అవకాశం ఉంటుంది. వారు ఆర్థికంగా ఎదుగుతారు. 
  కేరళ, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలలో  సహకార సంఘాల వ్యవస్థ పఠిష్టంగా ఉంది.  అక్కడ చేనేత కార్మికులకు  పీఎఫ్, ఈఎస్ఐ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. మహిళా చేనేత కార్మికులకు ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నాయి. తెలంగాణలో చేనేత మిత్ర పథకం కింద నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నారు.బతకమ్మ చీరలను చేనేత రంగం నుంచే తీసుకుంటారు. ఆ రకంగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో  ఏపీలోని సహకార శాఖ వారు ముందు బోగస్ సొసైటీలను రద్దు చేయాలి. సహకార సంఘాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న సంఘాలను గుర్తించి, వాటిని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. నిజమైన సొసైటీలను, నిజంగా పనిచేసే చేనేత కార్మికులను గుర్తించి, వారికి ఉపాధి కల్పించడంతోపాటు సహకార సంఘాల ద్వారా వచ్చే రాయితీలు నేరుగా వారికి అందే ఏర్పాటు చేయాలి. వ్యవసాయమైనా, చేనేత.. ఏ రంగమైనా మార్కెటింగ్ ముఖ్యం. దళారులులేని మార్కెటింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటే చేనేత కార్మికులకు ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల విస్తృత స్థాయిలో సహకార సంఘాల నెట్ వర్క్ ఏర్పాటు చేసి, చేనేత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. అప్పుడే చేనేత కార్మికుల కళానైపుణ్యానికి తగిన గుర్తింపుతోపాటు ఉపాధి మెరుగుపడి, వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది.  

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్-9440222914 



Aug 15, 2023

టీటీడీ పాలకమండలి నియామకంపై వివాదాలు

రాజకీయం

భూమన కరుణాకరరెడ్డి నియామకంపై వివాదం

వివాదాలకు నిలయంగా టీటీడీ పాలకమండలి నియామకాలు

ఆధ్యాత్మిక అంశాలకు తగ్గిపోతున్న ప్రధాన్యం

టీటీడీ నియామకాల్లో కులం, మతం, రాజకీయ వివాదాలు

శ్రీవారి అత్తింటివారికి అవకాశం ఇచ్చే ఆలోచన!


తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి నియామకాల విషయంలో ఒక దశాబ్దకాలంగా వివాదాలు నెలకొంటున్నాయి.ప్రభుత్వాలు తగిన నియమనిబంధనలు పాటించకపోవడం, ముఖ్యంగా ఆధ్యాత్మిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా  చైర్మన్, సభ్యులను నియమించడం వివాదాలకు దారి తీస్తున్నాయి. పాండిత్యం, నడవడిక, భక్తిభావాలను పరిగణనలోకి తీసుకోకుండా, ముందు వెనక ఆలోచనలేకుండా ఎవరినిబడితే వారిని నియమించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల ఆలయ పాలనాబాధ్యతలు నిర్వర్తించేందుకు బ్రిటీష్‌ ప్రభుత్వం 1933లో కమిషనర్ల నేతృత్వంలో  పాలకమండలి వ్యవస్థను ఏర్పాటు చేసింది.  1951లో చేసిన హిందూమత చట్టం ప్రకారం కమిషనర్లందరినీ కార్యనిర్వాహక అధికారులు (ఈవో)గా మార్చారు. టీటీడీ  ధర్మకర్తల మండలిని ఏర్పాటుచేసి, దానికి అధ్యక్షుడిని నియమించారు. మొదట్లో హిందు ధర్మంపట్ల అచంచల విశ్వాసం కలిగిన భక్తులను మాత్రమే ఈ పాలక మండలిలో నియమించేవారు.  ప్రపంచంలోని ప్రతి హిందువు కులాలతో సంబంధంలేకుండా  ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునేంతటి ప్రాచుర్యం పొందిన దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరుడు. అంతర్జాతీయ స్థాయిలో అంతటి విశిష్టత కలిగిన దేవాలయ కమిటీ పాలకవర్గ సభ్యులు మతపరంగా, ఆధ్యాత్మికంగా, ఆలోచన, నడవడిక పరంగా ఉత్తమోత్తములై ఉండాలని భక్తులు ఆశిస్తారు. అటువంటి కమిటీ నియామకంలో నిర్లక్ష్యం వహించినా, పొరపాటు జరిగినా  అది సమాజంపైనే కాకుండా ప్రభుత్వంపైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నియామకాలు కులాలు, రాజకీయ ప్రాతిపదికన జరిగినప్పటికీ హిందువుల మనోభావాలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది.

 


హిందూ దేవాలయాలలో విశిష్టత కలిగిన దేవాలయంగా టీటీడీకి ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు రావడంతో ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యుల పదవికి విపరీతమైన పోటీ పెరిగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడుతోపాటు దేశవ్యాప్తంగా అనేక మంది వ్యాపార ప్రముఖుల దృష్టి కూడా ఇక్కడే ఉంటుంది. ఈ కమిటీలో స్థానం పొందాలని ఆశిస్తుంటారు. దాంతో కాలక్రమంలో ఇవి పూర్తీగా రాజకీయ నియామకాలుగా మారిపోయాయి. వివాదాలు చెలరేగిన సందర్భాలలో  భక్తుల ఆందోళనను దృష్టిలోపెట్టుకుని కొన్ని ప్రభుత్వాలు మార్పులు,చేర్పులు చేస్తున్నాయి. కొన్ని ప్రభుత్వాలు భక్తుల ఆందోళనలను పరిగనణలోకి తీసుకోవడంలేదు. మరి కొన్ని సందర్భాలలో కొందరు వ్యక్తులు ఆయా పదవులను స్వీకరించడంలేదు. ఈ నియామకాల సందర్భంలో ఎక్కువగా ఆయా వ్యక్తులు క్రైస్తవ మతం పుచ్చుకున్నారని, క్రైస్తవ సభల్లో పాల్గొంటున్నారని, వారి వద్ద ఎప్పుడూ బైబిల్ ఉంటుందని, క్రైస్తవ మతాచారాలు పాటిస్తుంటారని, హిందూ దేవుళ్లపై నమ్మకంలేని వారని ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి.

పుట్టా సుధాకర్‌ యాదవ్‌, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. ఆ కమిటీ చైర్మన్ పదవి ఓ యాదవుడికి ఇవ్వడం పట్ల ఎవరూ అభ్యంతరం చెప్పరు. శ్రీకృష్ణుడు యాదవ వంశానికి చెందినవాడు. అందువల్ల యాదవులకు ఆ రకమైన గుర్తింపు ఉంది. అయితే ఇక్కడ సుధాకర్‌ యాదవ్‌ ను ఆ పదవికి ఎంపిక చేసినప్పుడే అభ్యంతరం వ్యక్తమైంది. ఆయన క్రిస్టియన్ మత ప్రచార సభలలో పాల్గొంటారని విమర్శలు వచ్చాయి. వైవీ సుబ్బారెడ్డి క్రైస్తవ మతస్థులని, భూమన కరుణాకరరెడ్డి తన కుమార్తె వివాహం క్రైస్తవ మత పద్దతిలో చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. 

 వాస్తవానికి సుధాకర్‌ యాదవ్‌ క్రైస్తవ సభలలో పాల్గొనడం తప్పేమీకాదు. అది మత సామరస్యానికి ప్రతీక కూడా. సామాజిక పరంగా అది మంచిపనే. అలాగే, భూమన కరుణాకరరెడ్డి తన కుమార్తెను ఒక క్రైస్తవుడికి ఇచ్చి పెళ్లి చేశారు. వారు వారి మత పద్దతిలో పెళ్లి చేసుకున్నారు. ఇది కూడా తప్పుకాదు.మతాంతర వివాహం చేసినందుకు సామాజికంగా ఆయనను అభినందించాలి. కరుణాకరరెడ్డి పక్కా హిందువు. వారి అబ్బాయి వివాహం కూడా హిందూ సంప్రదాయాల ప్రకారమే చేశారు. కాకపోతే గతంలో, అంటే ఆయన యువకుడుగా ఉన్నప్పుడు కమ్యునిస్టు, నాస్థికుడు. తర్వాత ఆయన భక్తుడిగా మారారు. ఇంతకు ముందు  2006 నుంచి 2008 వరకు ఆయన టీటీడీ చైర్మన్‌గా పని చేశారు. అప్పుడు కూడా భూమన కరుణాకర రెడ్డి నాస్తికుడని, ఆయన వెంకటేశ్వర స్వామిని నమ్మరని, ఆయనను దైవ సంబంధమైన  కమిటీలో ఎలా నియమిస్తారని విమర్శలు వచ్చాయి. వైవీ సుబ్బారెడ్డి తాను క్రైస్తవుడిని కాదని, హిందువునేనని చెప్పారు.  కమిటీ సభ్యురాలిగా గతంలో అప్పటి పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనిత నియామకం కూడా విమర్శలకు దారితీసింది. అంతకు ముందు  స్వయంగా ఆమే తన కారులో, తన బ్యాగ్ లో  తప్పనిసరిగా బైబిల్ ఉంటుందని చెప్పారు. ఆమె అటు క్రీస్తుని, ఇటు వెంకటేశ్వరుడిని నమ్మవచ్చు, పూజించవచ్చు, ప్రార్ధించవచ్చు. ఒక రకంగా అది మంచిదే. కానీ మత విశ్వాసాలు ఇటువంటి వాటిని అనుమతించవు. ఏ మత పెద్దలైనా ఇటువంటివాటిని అంగీకరించరు. చివరకు 

అనిత  గౌరవంగా తనంతట తానే తప్పుకున్నారు. పరిస్థితిని అర్ధం చేసుకొని తన నియామకాన్ని రద్దు చేయమని అప్పట్లో ఆమె కోరడం అభినందనీయం.  ఇటువంటి విమర్శలు, వివాదాల వెనుక రాజకీయ కారణాలు కూడా ఉంటుంటాయి. వాటిని కూడా మనం కాదనలేం. అయితే, ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏమిటంటే టీటీడీ అనేది హిందూ మతవిశ్వాసాలు బలంగా నాటుకుపోయిన సంస్థ. దానికి చైర్మన్ గానీ, సభ్యులుగా గానీ ఉండేవారు హిందూమతానికి చెందిన పరమ భక్తులై ఉండాలి. ఈ విషయంలో మరో మాటకు తావులేదు. సామాజిక అంశాలు, మత విశ్వాసాలు వేరు వేరు. ఏ మతమైనా  మతపరమైన వ్యక్తుల మనోభావాలు వేరుగా ఉంటాయి. ప్రస్తుత వ్యవస్థలో వాటిని ప్రభుత్వాలు గుర్తించి, గౌరవించక తప్పదు. అన్ని ప్రభుత్వాలు కూడా అలానే చేస్తున్నాయి. కానీ, అప్పుడప్పుడు ఇలాంటి వివాదాలు తలెత్తుతుంటాయి.  ఇది సున్నితమైన అంశమైనప్పటికీ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పుట్టా సుధాకర్‌ యాదవ్‌, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి వంటి వ్యక్తులకు  ప్రాధాన్యత ఇవ్వదలచుకుంటే ప్రభుత్వంలో మరో ఉన్నతమైన పదవి ఇవ్వవచ్చు.  టీటీడీ చైర్మన్ గా ఇటువంటి వివాదాలకు అవకాశంలేని వారిని నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇంతకు ముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయడం కూడా తీవ్రవివాదానికి, విమర్శలకు దారి తీసింది. పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభుత్వం 52 మంది నియామకాలను నిలిపివేసింది. అలా చేయడం సంతోషకర విషయమే.   

టీటీడీ మత సంబంధ సంస్థ అయినందున అత్యంత భక్తిశ్రద్ధలతో  శ్రీవారి సేవలో తరించే కొన్ని కులాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఉంది.  శ్రీవారికి అత్తింటివారమైన తమ కులస్తులకు కమిటీలో స్థానం దక్కడంలేదని పద్మశాలీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మశాలీయులు  సిరికి పుట్టింటివారు, హరికి అత్తింటివారని,  శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మశాలీయుల అల్లుడని తామ్ర శాసన ఆధారాలతో నిరూపణ అయింది. స్వామివారి జీవిత భాగస్వామి పద్మావతిదేవి పద్మశాలీయుల ఆడపడుచుగా తిరుమల బ్రహ్మాత్సవాలలో వారికి ఆ గౌరవం దక్కుతోంది. అయితే, కమిటీలో సభ్యత్వం లేదన్నదే వారి  బాధ. పద్మావతీదేవి తమ ఆడపడుచు అయినందున ప్రతిసారి కమిటీలో తమ వారికి ఒకరికి స్థానం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కమిటీలో పద్మశాలి కులస్తులకు ప్రధాన్యం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా చేస్తే రాష్ట్రంలో వ్యవసాయరంగం తరువాత అత్యధిక మంది ఆధారపడే  చేనేత రంగానికి సంబంధించిన కులాలను సంతృప్తిపరచినట్లు అవుతుందన్న భావన కూడా ఉంది.

 అలాగే, ఇతర కులాల పరంగా కూడా ఆలోచన చేస్తే స్వామివారి సేవ, ఇతర భక్తిపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే విశ్వబ్రాహ్మణ, యాదవ, నాయిబ్రాహ్మణ, బ్రాహ్మణ కులాల వారికి కూడా  ప్రతి కమిటీలో స్థానం కల్పించవలసిన అవసరం ఉంది. కమిటీ సభ్యులుగా  ఎస్సీ, ఎస్టీ వ్యక్తులను కూడా నియమిస్తే మంచిదని పలవురు అభిప్రాయపడుతున్నారు. వారిని ఆధ్యాత్మికంగా, సామాజికంగా అందరితో సమానంగా గుర్తించి తగిన స్థానం ఇవ్వవలసిన బాధ్యత అందరిపై ఉంది. వారిని ఆ విధంగా గౌరవించిన నాడు తమను తక్కువగా చూస్తున్నారన్న భావన వారిలో తొలగిపోయే అవకాశం ఉంటుంది. మిగిలిన సభ్యులను ప్రభుత్వాలు తమకు ఇష్టమొచ్చిన ఇతర కులాల వారి నుంచి, వ్యాపార, పారిశ్రామికవేత్తల నుంచి   తీసుకోవచ్చు. అయితే, ఇటువంటి నియామకాల విషయంలో మత పరంగా వారి నడవడి, సమాజంలో వారికి ఉన్న గుర్తింపు వంటివాటిని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో చైర్మన్ నియామకంలో వివాదాలు, విమర్శలకు  రాజకీయాలు, మతంతోపాటు  కులం కూడా ఒక కారణం. వరుసగా ఒకే సామాజిక వర్గానికే చైర్మన్ పదవి ఇవ్వడం, అలాగే వారు ఇద్దరూ ముఖ్యమంత్రికి అతి సమీప బంధువులు అవడం విమర్శలకు అవకాశం ఇచ్చినట్లైంది. 

తిరుమలలో క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందని, దానిని అరికట్టాలని, ఉద్యోగులలో కొందరు క్రైస్తవులు ఉన్నారని, వారిని బదిలీ చేయాలని హిందువులు గగ్గోలు పెడుతున్నారు.   ఈ నేపథ్యంలో వివాదాలకు దారితీసే వారిని నియమించడం మంచిదికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  ఇటువంటి చర్యలు వేల సంవత్సరాలుగా హిందువులలో జీర్ణించుకుపోయిన మనోభావాలను దెబ్బతీస్తాయి. మనది లౌకక రాజ్యమైనా ఇటువంటి నియామకాల్లో మతపరమైన ఆనవాయితీలను గౌరవించకతప్పదు. ఇలాంటి నియామకాలు ప్రభుత్వాలకు కత్తిమీద సాములాంటివి.  మతపరమైన అంశాలతోపాటు అనేక సమాజిక వర్గాలను సంతృప్తిపరచవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ పదవిని అత్యంత గౌరవంగా భావించి అన్ని రంగాలలో ఉన్నతవర్గాల వారు, పారిశ్రామికవేత్తలు  పోటీపడుతుంటారు. ఇటువంటి సందర్భాలలో ఏదైనా పొరపాటు జరిగితే ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి ప్రతిపక్షాలు లబ్ధిపొందాలని చూస్తుంటాయి. ప్రభుత్వం అంటే గిట్టనివారు కూడా ఇటువంటి సందర్భాలను తమకు అనుకూలంగా వాడుకుంటుంటారు. అందువల్ల మత, సామాజిక పరంగానే కాకుండా రాజకీయంగా నష్టం జరుగకుండా కూడా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.

              - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914



Aug 6, 2023

ఆధునిక పోకడలను తట్టుకుని నిలుస్తున్న చేనేత వస్త్రాలు


మానవజాతి చరిత్రలో చేనేతకు అద్వితీయమైన స్థానం ఉంది. ముఖ్యంగా మనదేశానికి చేనేత వస్త్రాల తయారీకి సంబంధించి చాలా ప్రత్యేకత ఉంది. చేనేత భారతదేశ వారసత్వ సంపద. జాతీయోద్యమంలో కూడా  చేనేత కీలక పాత్ర పోషించింది. ఉద్యమానికి ఓ ఊపు తెచ్చింది. ఆ నాడు జాతీయ నేతలు  విదేశీ వస్తువులను, వస్త్రాలను బహిష్కరిస్తూ పిలుపు ఇచ్చారు. 1905, ఆగస్టు 7న  కోల్ కతాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేశారు. ఆ తరువాత చేనేత చిహ్నం రాట్నాన్ని జాతీయోద్యమ జెండాలో చేర్చారు. తకిలి అనే కదురు ద్వారా దూదితో నూలు వడకడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. మహాత్మా గాంధీ చర్ఖాతో నూలు వడుకుతుండేవారు. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచింది. విదేశీ వస్త్రాలను దగ్ధం చేసి జాతీయోధ్యమాన్ని ఓ మలుపు తిప్పిన  ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా జరపాలని చేనేత కార్మికులు కోరుతూ వచ్చారు. జాతీయ స్థాయిలో చేనేత పరిశ్రమ ప్రాధాన్యతను  గుర్తించి  2015లో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవం (నేషనల్ హ్యాండ్‌లూమ్-డే)గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతీయ చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.  రంగులతోపాటు వివిధ డిజైన్ల రూపకల్పన, అనేక పద్దతుల్లో చేనేత వస్త్రాలను తయారుచేయడం భారతీయ చేనేత కళాకారుల ప్రత్యేకత. వివిధ రకాల డిజైన్లతో చేనేత వస్త్రాలను నేయడంలో ఇక్కడి కళాకారులు నిష్ణాతులు. అగ్గిపెట్టెలో పట్టేంతటి చీరను తయారు చేయగల సమర్థులు ఆ నాడూ ఈనాడూ ఇక్కడ ఉన్నారు.  సాంకేతికాభివృద్ధితో సమాజం ఎన్ని కొత్తపోకడలు పోతున్నా ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు చేనేత వస్త్రాలపై మక్కువ మాత్రం తగ్గలేదు.   ఈ ప్రపంచానికి భారతదేశం ప్రసాదించిన వాటిలో చేనేత వస్త్రం ఒకటి. చేనేత మన జాతి సంపద. ప్రపంచీకరణ నేపథ్యంలో విపరీతమైన పోకడలను తట్టుకుంటూ దేశం వారసత్వ సంపదైన సంప్రదాయ  చేనేత వస్త్రాలను కాపాడుకుంటూ వస్తోంది. ఫ్యాషన్ షోలలో సైతం చేనేత వస్త్రాలను ధరిస్తున్నారంటే విదేశీ వస్త్రాలకు దీటుగా ఇవి నిలబడగలుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో మంగళగిరి, ధర్మవరం, చీరాల, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, నారాయణ్ పేట్, గద్వాల్ వంటి ప్రాంతాలు ప్రపంచ వ్యాప్తంగా చేనేతకు మంచి గుర్తింపు తెచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో నూలుకు రంగులు అద్దే కార్మికుల నైపుణ్యం వల్ల  ఆ రంగులలో నాణ్యత ఉంటుంది. ఆయా రంగుల వల్ల కూడా ఆయా ప్రాంతాల చేనేత వస్త్రాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే చేనేత వస్త్రాలలో  


దాదాపు 14 శాతం తెలంగాణ వస్త్రాలే ఉంటాయి.  అంటే ఇక్కడి చేనేత వస్త్రాలకు ఎంత గుర్తింపు ఉందో అర్థం చేసుకోవచ్చు. విదేశాలలో స్థిరపడిన భారతీయ మహిళలు పండుగలు, వేడుకల సందర్భంగా మన సంప్రదాయ చేనేత వస్త్రాలనే ధరించి కళకళలాడుతూ హుందాగా వ్యవహరిస్తుంటారు. వారిలో భారతీయత ఉట్టిపడుతూ ఉంటుంది. 
తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ అనే చేనేత కళాకారుడు అగ్గిపెట్టెలో సరిపోయే పట్టుచీరను తయారు చేసి పద్మశాలీ ఆడపడుచైన  తిరుమల తిరుపతిలోని పద్మావతి దేవికి సమర్పించారు. 250 గ్రాముల బరువైన ఈ చీరను  25 రోజుల్లో తయారు చేశారు. దీని  తయారీలో కొంతమేర బంగారం, వెండి తీగలను ఉపయోగించారు. సిరిసిల్లకు చెందిన మరో కళాకారుడు  వెల్ది హరిప్రసాద్ 2001 నుంచి అగ్గిపెట్టెలో పట్టేంతటి పట్టు చీరలు తయారు చేస్తున్నారు. ఈ చీరల పొడవు 5.5 మీటర్లు, వెడల్పు 47 అంగుళాలు ఉంటాయి. ఆయనే దబ్బళం మొనలో దూరే 5.5 అడుగుల చీరలను కూడా తయారుచేసి ప్రముఖుల ప్రశంసలందుకున్నారు. హరి నైపుణ్యాన్ని ఇటీవల మన్ కీ బాత్ ప్రోగ్రాం లో భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా మెచ్చుకున్నారు.  హరి ఇప్పుడు ఓ కొత్త చీరను తయారు చేస్తున్నారు. అది రాజన్న సిరిసిల్ల ప్రత్యేకం. ఆ చీరపై  సిరిసిల్ల  కమాన్ తో పాటు రాట్నం వడికే మహిళ కూడా ఉంటుంది. ఈ చీరను జాతీయ చేనేత  దినోత్సవం రోజు  ప్రభుత్వానికి అందచేస్తానని హరి చెప్పారు.  అయోధ్యలోని రామమందిరం కోసం నాగరాజు, భుజంగరావు, సురేంద్రబాబు, తేజ అనే ఏపీలోని ధర్మవరం చేనేత కళాకారులు  ఇటీవల  16 కిలోల  పట్టుచీర తయారు చేశారు. 160 అడుగులున్న ఈ చీరపై  13 భారతీయ భాషల్లో 32 వేల 200 సార్లు శ్రీరామ నామం వచ్చింది. రామాయణంలోని 168 ప్రధాన ఘట్టాలు వచ్చేవిధంగా దీనిని రూపొందించారు. ఈ పట్టువస్త్రాన్ని అయోధ్య రామ మందిరానికి సమర్పించనున్నారు. ఇటువంటి ఉద్ధండులైన చేనేత కళాకారులకు ఇక్కడ కొదవలేదు. కానీ, వారికి ప్రోత్సాహమే కరువైంది.    

దేశ ఆర్థిక వ్యవస్థలో, ఉపాధి కల్పనలో  చేనేత రంగం కీలకమైనదిగా ఉంది. దేశంలో వ్యవసాయం తర్వాత ఉపాధికి అవకాశాలున్న రెండవ అతి పెద్ద పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. అందులో చేనేత రంగం వాటానే ఎక్కువ. ఈ రంగంలో దేశ వ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది ప్రత్యక్షంగా, 15 కోట్ల మంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. చేనేత కార్మికుల్లో పురుషులతోపాటు మహిళలు కూడా గణనీయంగా ఉంటారు. కొన్ని కుటుంబాల్లో వృద్ధుల నుంచి పిల్లల వరకు ఇదే వృత్తిలో ఉంటారు. పరోక్షంగా లేక అనుబంధంగా అంటే..నూలు తయారు చేయడం, వడకడం, అచ్చు అతకడం, పడుగులు చేయడం, చిలపలను కండెలుగా తయారు చేయడం, మగ్గాలు, డిజైన్ డాబీలు, రాట్నాలు, నాడెలు, పన్నెలు, పన్నెల్లో ఇత్తడి ఈనెలు... వంటివి తయారు చేయడం,  నూలుకు రంగులు అద్దడం, పట్టు, రేషన్ దారాలు తయారు చేయడం, ఆసు తోడటం వంటి పనుల ద్వారా ఉపాధి పొందడం. కొన్ని అనుబంధ వృత్తులపై చేనేత కాకుండా ఇతర సామాజిక వర్గాల వారు కూడా ఆధాపడి జీవిస్తుంటారు.  చేనేత రంగం అనేక ఒడిదుడుకులకు లోనవుతూ వస్తోంది. అయినా, మన దేశంలోని చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ మాత్రం తగ్గలేదు. చేనేతపై తయారు చేసిన వస్త్రాలకు ఉన్న ప్రత్యేకత వల్లే ఆ డిమాండ్ అలా కొనసాగుతోంది. చేనేతపై తయారయ్యే చీరలు, షర్టింగ్స్, టవల్స్, లుంగీలు, డ్రెస్ మెటీరియల్, దుప్పట్లు వంటివి ఆరోగ్యానికి మంచిదని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు నిర్ధారించారు. అందువల్ల కూడా అందరూ చేనేత వస్త్రాలపై మొగ్గుచూపడం ఎక్కువైపోతోంది. ఇప్పుడు ఆన్ లైన్ లో కూడా ప్రపంచ వ్యాప్తంగా  వేల కోట్ల రూపాయల చేనేత వస్త్రాల వ్యాపారం జరుగుతోంది. ఇంతటి ప్రాధాన్యం, ప్రాచుర్యం, ప్రాశస్త్యం కలిగిన చేనేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదరణ కరువైంది. తగిన ప్రోత్సాహం లేదు. చేనేత వస్త్రాలపై కేంద్రం 5 శాతం  జీఎస్‌టీని ఎత్తివేసి వారసత్వ సంపదను రక్షించుకోవలసిన అవసరం ఉంది.  

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

( ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా )

Aug 5, 2023

ఆధునిక వస్త్రాలకు దీటుగా.. చేనేత

ఆగస్ట్ 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 


మానవజాతి చరిత్రలో చేనేతకు అద్వితీయమైన స్థానం ఉంది. ముఖ్యంగా మనదేశానికి చేనేత వస్త్రాల తయారీకి సంబంధించి చాలా ప్రత్యేకత ఉంది. చేనేత భారతదేశ వారసత్వ సంపద. జాతీయోద్యమంలో కూడా  చేనేత కీలక పాత్ర పోషించింది. ఉద్యమానికి ఓ ఊపు తెచ్చింది చేనేత. ఆ నాడు జాతీయ నేతలు  విదేశీ వస్తువులను, వస్త్రాలను బహిష్కరిస్తూ పిలుపు ఇచ్చారు. 1905, ఆగస్టు 7న  కోల్ కతాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేశారు. ఆ తరువాత చేనేత చిహ్నం రాట్నాన్ని జాతీయోద్యమ జెండాలో చేర్చారు. తకిలి అనే కదురు ద్వారా దూదితో నూలు వడకడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. మహాత్మా గాంధీ చర్ఖాతో నూలు వడుకుతుండేవారు. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచింది. విదేశీ వస్త్రాలను దగ్ధం చేసి జాతీయోధ్యమాన్ని ఓ మలుపు తిప్పిన  ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా జరపాలని చేనేత కార్మికులు కోరుతూ వచ్చారు. జాతీయ స్థాయిలో చేనేత పరిశ్రమ ప్రాధాన్యతను  గుర్తించి  2015లో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవం (నేషనల్ హ్యాండ్‌లూమ్-డే)గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతీయ చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.  రంగులతోపాటు వివిధ డిజైన్ల రూపకల్పన, అనేక పద్దతుల్లో చేనేత వస్త్రాలను తయారుచేయడం భారతీయ చేనేత కళాకారుల ప్రత్యేకత. వివిధ రకాల డిజైన్లతో చేనేత వస్త్రాలను నేయడంలో ఇక్కడి కళాకారులు నిష్ణాతులు. అగ్గిపెట్టెలో పట్టేంతటి చీరను తయారు చేయగల సమర్థులు ఆ నాడూ ఈనాడూ ఇక్కడ ఉన్నారు.  సాంకేతికాభివృద్ధితో సమాజం ఎన్ని కొత్తపోకడలు పోతున్నా ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు చేనేత వస్త్రాలపై మక్కువ మాత్రం తగ్గలేదు.   ఈ ప్రపంచానికి భారతదేశం ప్రసాదించిన వాటిలో చేనేత వస్త్రం ఒకటి. చేనేత మన జాతి సంపద. ప్రపంచీకరణ నేపథ్యంలో విపరీతమైన పోకడలను తట్టుకుంటూ దేశం వారసత్వ సంపదైన సంప్రదాయ  చేనేత వస్త్రాలను కాపాడుకుంటూ వస్తోంది. ఫ్యాషన్ షోలలో సైతం చేనేత వస్త్రాలను ధరిస్తున్నారంటే విదేశీ వస్త్రాలకు దీటుగా ఇవి నిలబడగలుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో మంగళగిరి, ధర్మవరం, చీరాల, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల వంటి ప్రాంతాలు ప్రపంచ వ్యాప్తంగా చేనేతకు మంచి గుర్తింపు తెచ్చాయి. మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే చేనేత వస్త్రాలలో తెలుగు రాష్ట్రాలదే సింహ భాగం అంటే ఇక్కడి వస్త్రాలకు ఎంత గుర్తింపు ఉందో అర్థం చేసుకోవచ్చు. విదేశాలలో స్థిరపడిన భారతీయ మహిళలు పండుగలు, వేడుకల సందర్భంగా మన సంప్రదాయ చేనేత వస్త్రాలనే ధరించి కళకళలాడుతూ హుందాగా వ్యవహరిస్తుంటారు. వారిలో భారతీయత ఉట్టిపడుతూ ఉంటుంది. 

 అయోధ్యలోని రామమందిరం కోసం నాగరాజు, భుజంగరావు, సురేంద్రబాబు, తేజ అనే ధర్మవరం చేనేత కళాకారులు  ఇటీవల  16 కిలోల  పట్టుచీర తయారు చేశారు. 160 అడుగులున్న ఈ చీరపై  13 భారతీయ భాషల్లో 32 వేల 200 సార్లు శ్రీరామ నామం వచ్చింది. రామాయణంలోని 168 ప్రధాన ఘట్టాలు వచ్చేవిధంగా దీనిని రూపొందించారు. ఈ పట్టువస్త్రాన్ని అయోధ్య రామ మందిరానికి సమర్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ అనే చేనేత కళాకారుడు అగ్గిపెట్టెలో సరిపోయే పట్టుచీరను తయారు చేసి పద్మశాలీ ఆడపడుచైన పద్మావతి దేవికి సమర్పించాడు. సిరిసిల్లకు చెందిన మరో కళాకారుడు  వెల్ది హరిప్రసాద్ 2001 నుంచి అగ్గిపెట్టెలో పట్టేంతటి పట్టు చీరలు తయారు చేస్తున్నారు. ఇటువంటి ఉద్ధండులైన చేనేత కళాకారులకు ఇక్కడ కొదవలేదు. కానీ, వారికి ప్రోత్సాహమే కరువైంది.    

దేశ ఆర్థిక వ్యవస్థలో, ఉపాధి కల్పనలో  చేనేత రంగం కీలకమైనదిగా ఉంది. దేశంలో వ్యవసాయం తర్వాత ఉపాధికి అవకాశాలున్న రెండవ అతి పెద్ద పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. అందులో చేనేత రంగం వాటానే ఎక్కువ. ఈ రంగంలో దేశ వ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది ప్రత్యక్షంగా, 15 కోట్ల మంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చేనేత రంగంపై దాదాపు 3 లక్షల మంది వరకు ప్రత్యక్షంగా, 8 లక్షల మంది వరకు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. చేనేత కార్మికుల్లో పురుషులతోపాటు మహిళలు కూడా గణనీయంగా ఉంటారు. కొన్ని కుటుంబాల్లో వృద్ధుల నుంచి పిల్లల వరకు ఇదే వృత్తిలో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో  చేనేత వర్గాల జనాభా దాదాపు 15 శాతం వరకు ఉంటుందని అంచనా. పరోక్షంగా లేక అనుబంధంగా అంటే..నూలు తయారు చేయడం, వడకడం, అచ్చు అతకడం, పడుగులు చేయడం, చిలపలను కండెలుగా తయారు చేయడం, మగ్గాలు, డిజైన్ డాబీలు, రాట్నాలు, నాడెలు, పన్నెలు, పన్నెల్లో ఇత్తడి ఈనెలు... వంటివి తయారు చేయడం,  నూలుకు రంగులు అద్దడం, పట్టు, రేషన్ దారాలు తయారు చేయడం, ఆసు తోడటం వంటి పనుల ద్వారా ఉపాధి పొందడం. కొన్ని అనుబంధ వృత్తులపై చేనేత కాకుండా ఇతర సామాజిక వర్గాల వారు కూడా ఆధాపడి జీవిస్తుంటారు.  చేనేత రంగం అనేక ఒడిదుడుకులకు లోనవుతూ వస్తోంది. అయినా, మన దేశంలోని చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ మాత్రం తగ్గలేదు. చేనేతపై తయారు చేసిన వస్త్రాలకు ఉన్న ప్రత్యేకత వల్లే ఆ డిమాండ్ అలా కొనసాగుతోంది. చేనేతపై తయారయ్యే చీరలు, షర్టింగ్స్, టవల్స్, లుంగీలు, డ్రెస్ మెటీరియల్, దుప్పట్లు వంటివి ఆరోగ్యానికి మంచిదని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు నిర్ధారించారు. అందువల్ల కూడా అందరూ చేనేత వస్త్రాలపై మొగ్గుచూపడం ఎక్కువైపోతోంది. ఇప్పుడు ఆన్ లైన్ లో కూడా ప్రపంచ వ్యాప్తంగా  వేల కోట్ల రూపాయల చేనేత వస్త్రాల వ్యాపారం జరుగుతోంది. ఇంతటి ప్రాధాన్యం, ప్రాచుర్యం, ప్రాశస్త్యం కలిగిన చేనేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదరణ కరువైంది. తగిన ప్రోత్సాహం లేదు. చేనేత వస్త్రాలపై కేంద్రం 5 శాతం  జీఎస్‌టీని ఎత్తివేసి వారసత్వ సంపదను రక్షించుకోవలసిన అవసరం ఉంది.  

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Aug 3, 2023

దేశ వారసత్వ సంపద చేనేత

ఆగస్ట్ 7 జాతీయ చేనేత దినోత్సవం


మానవజాతి చరిత్రలో చేనేతకు అద్వితీయమైన స్థానం ఉంది. ముఖ్యంగా మనదేశానికి చేనేత వస్త్రాల తయారీలో మంచి గుర్తింపు, ప్రత్యేక స్థానం ఉంది. చేనేత భారతదేశ వారసత్వ సంపద. జాతీయోద్యమంలో కూడా  చేనేత కీలక పాత్ర పోషించింది.  ఉద్యమానికి ఓ ఊపు తెచ్చింది చేనేత. ఆ నాడు జాతీయ నేతలు  విదేశీ వస్తువులను, వస్త్రాలను బహిష్కరిస్తూ పిలుపు ఇచ్చారు.  1905, ఆగస్టు 7న  కోల్ కతాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేశారు. ఆ తరువాత చేనేత చిహ్నం రాట్నాన్ని జాతీయోద్యమ జెండాలో చేర్చారు. తకిలి అనే కదురు ద్వారా దూదితో నూలు వడకడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. మహాత్మా గాంధీ చర్ఖాతో నూలు వడుకుతుండేవారు. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచింది. విదేశీ వస్త్రాలను దగ్ధం చేసి జాతీయోధ్యమాన్ని ఓ మలుపు తిప్పిన  ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా జరపాలని చేనేత కార్మికులు కోరుతూ వచ్చారు. జాతీయ స్థాయిలో చేనేత పరిశ్రమ ప్రాధాన్యతను  గుర్తించి  2015లో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవం (నేషనల్ హ్యాండ్‌లూమ్-డే)గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

భారతీయ చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. రంగులతోపాటు వివిధ డిజైన్ల రూపకల్పన, అనేక పద్దతుల్లో చేనేత వస్త్రాలను తయారుచేయడం భారతీయ చేనేత కళాకారుల ప్రత్యేకత. అనేక రకాల డిజైన్లతో చేనేత వస్త్రాలను నేయడంలో ఇక్కడి కళాకారులు నిష్ణాతులు. అగ్గిపెట్టెలో పట్టేంతటి చీరను తయారు చేయగల సమర్థులు ఆ నాడు ఈనాడూ ఇక్కడ ఉన్నారు.  అయోధ్యలోని రామమందిరం కోసం నాగరాజు, భుజంగరావు, సురేంద్రబాబు, తేజ అనే ధర్మవరం చేనేత కళాకారులు  ఇటీవల  16 కిలోల  పట్టుచీర తయారు చేశారు. 160 అడుగులున్న ఈ చీరపై  13 భారతీయ భాషల్లో 32 వేల 200 సార్లు శ్రీరామ నామం వచ్చింది. రామాయణంలోని 168 ప్రధాన ఘట్టాలు వచ్చేవిధంగా దీనిని రూపొందించారు. ఈ పట్టువస్త్రాన్ని అయోధ్య రామ మందిరానికి సమర్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ అనే చేనేత కళాకారుడు  అగ్గిపెట్టెలో సరిపోయే పట్టుచీరను తయారు చేసి పద్మశాలీ ఆడపడుచైన పద్మావతి దేవికి సమర్పించాడు. 250 గ్రాముల బరువైన ఈ చీరను  25 రోజుల్లో తయారు చేశాడు. దీని  తయారీలో కొంతమేర బంగారం, వెండి తీగలను ఉపయోగించాడు. ఇటువంటి ఉద్ధండులైన చేనేత కళాకారులకు ఇక్కడ కొదవలేదు.   

దేశ ఆర్థిక వ్యవస్థలో, ఉపాధి కల్పనలో  చేనేత రంగం కీలకమైనదిగా ఉంది. దేశంలో వ్యవసాయ తర్వాత ఉపాధికి అవకాశాలున్న రెండవ అతి పెద్ద పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. అందులో చేనేత రంగం వాటా ఎక్కువ. సహకార రంగంలో కూడా చేనేత ఉత్పత్తులు అనేకం తయారవుతున్నాయి.ఈ రంగంలో దేశ వ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది ప్రత్యక్షంగా, 15 కోట్ల మంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చేనేత రంగంపై దాదాపు 3 లక్షల మంది వరకు ప్రత్యక్షంగా, 8 లక్షల మంది వరకు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.  చేనేత వర్గాల వారు దాదాపు 65 లక్షల మంది, అంటే రాష్ట్ర జనాభాలో  13 శాతం మంది ఉన్నారు. పరోక్షంగా లేక అనుబంధంగా  అంటే..నూలు తయారు చేయడం, వడకడం, అచ్చు అతకడం, పడుగులు చేయడం, చిలపలను కండెలుగా తయారు చేయడం, మగ్గాలు, డిజైన్ డాబీలు, రాట్నాలు, నాడెలు, పన్నెలు, పన్నెల్లో ఇత్తడి ఈనెలు... వంటివి తయారు చేయడం,  నూలుకు రంగులు అద్దడం, పట్టు, రేషన్ దారాలు తయారు చేయడం, ఆసు తోడటం వంటి పనుల ద్వారా ఉపాధి పొందడం.  చేనేత రంగం అనేక వడిదుడుకులకు లోనవుతూ వస్తోంది. అయినా, మన దేశంలోని చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ మాత్రం తగ్గలేదు. చేనేతపై తయారు చేసిన వస్త్రాలకు ఉన్న ప్రత్యేకత వల్లే ఆ డిమాండ్ అలా కొనసాగుతోంది. చేనేతపై తయారయ్యే చీరలు, షర్టింగ్స్, టవల్స్, లుంగీలు, డ్రెస్ మెటీరియల్, దుప్పట్లు వంటివి ఆరోగ్యానికి మంచిదని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు నిర్ధారించారు. అందువల్ల కూడా అందరూ చేనేత వస్త్రాలపై మొగ్గుచూపడం ఎక్కువైపోతోంది.  ముఖ్యమైన ప్రపంచ దేశాలలో మన చేనేత వస్త్రప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. వాటికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇంతటి ప్రాధాన్యం, ప్రాచుర్యం, ప్రాశస్త్యం కలిగిన చేనేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదరణ కరువైంది.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Jul 30, 2023

రాజకీయ సాధికారతతోనే చేనేతల అభ్యున్నతి

వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఆశయసాధనలో భాగస్వామ్యులుకండి

వ్యవస్థాపక చైర్మన్ అంజన్ కర్నాటి, సభ్యులు రమేష్ మునుకుంట్ల, రాజ్ అడ్డగట్ల 

మంగళగిరిలో విజయవంతమైన వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ వరల్డ్ కాన్ఫరెన్స్-2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేతలు అధికంగా ఉన్న మంగళగిరిలో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వరల్డ్ కాన్ఫరెన్స్-2023కు ప్రజాప్రతినిధులు, అధికార, అనధికార ప్రముఖులు, వివిధ చేనేత సంఘాల ప్రతినిధులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.  మంగళగిరి బైపాస్ రోడ్డులోని ఆర్.ఆర్. కన్వెన్షన్ లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించిన సదస్సులో చేనేతల అభ్యున్నతే ప్రధాన ధ్యేయంగా అందుకు రాజకీయ సాధికారత సాధించాల్సిన ఆవశ్యకతపై నిర్వాహకులు, ముఖ్యఅతిథులు, వివిధ సంఘాల ప్రతినిధుల ప్రసంగాలు స్ఫూర్తిదాయకంగా కొనసాగాయి.

సదస్సులో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక చైర్మన్ అంజన్ కర్నాటి (అమెరికా), వ్యవస్థాపక సభ్యులు రమేశ్ మునుకుంట్ల (కెనడా), రాజ్ అడ్డగట్ల (చికాగో)లు ఈ సంస్థ ఎందుకు ఏర్పడిందీ.. దాని లక్ష్యాలను సవివరంగా వెల్లడించారు. ‘‘అమెరికాలోని న్యూజెర్సీలో 2021 మే నెలలో ఆవిర్భవించిన వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ కు అంజన్ కర్నాటి (అమెరికా), డాక్టర్ హరనాథ్ పోలిచర్ల (డెట్రాయిట్), రమేశ్ మునుకుంట్ల (కెనడా), రాజ్ అడ్డగట్ల (చికాగో), సారధి కార్యంపూడి (డల్లాస్) వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. అనుకోని కారణాల వల్ల డాక్టర్ హరనాథ్, సారథి సదస్సుకు హాజరుకాలేదు. వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద వృత్తిగా ఉన్న చేనేత అనేక ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చేనేతలకు అండగా నిలవాలంటే.. చే‘నేత’లందరూ ఐక్యంగా ముందుకు కదలాల్సిన ఆవశ్యకతను గుర్తించి..  చేనేతల్లోని అన్ని సామాజికవర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి చేనేతల అభ్యున్నతికి పాటుపడాలనే ప్రధాన లక్ష్యంతో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ను నెలకొల్పడం జరిగింది.


 ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో నివసిస్తున్న చేనేత కుటుంబాలను కలుపుకోవడం ప్రధాన లక్ష్యం. చేనేత కుటుంబాలకు ఆసరగా దాతృత్వ కార్యక్రమాలు చేపట్టడం. అందుకు  మన చేనేతలు ఉన్న ప్రాంతాల్లో స్థానిక సామాజిక సంఘాలు ప్రభుత్వ సహకారంతో చేనేతల సాధికారత కోసం కృషిచేయాలి.  ఇక చేనేత కుటుంబాల్లో ప్రతిభావంతులకు కొదవలేదు. మేధో సంపత్తిలో ఇతరులకు ఏమాత్రం తీసిపోరు. అయితే, చేనేత వృత్తుల్లో ఉన్న కుటుంబాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే ఔత్సాహికులకు అవసరమైన సహాయ, సహకారాలు అందించడం. కొత్తగా విదేశాలకు వెళ్లినవారు అక్కడ కుదురుకునేవరకు అవసరమైన సహకారం... ఇమ్మిగ్రేషన్ సూచనలు, సహాయం... ఆరోగ్య సంరక్షణ అవగాహన సెషన్స్/ వెబినార్లు/ శిబిరాలు. వృత్తిపరమైన సహాయం, వ్యాపార అవకాశాలు- పరస్పర సహకారం అందించడం. వివాహ ప్రయోజనాలు కల్పించడం. చేనేతలు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో ఉన్నత స్థితికి ఎదగాలి. అందుకు పరస్పరం సహకరించుకోవాలి. ఎవరు ఏ రంగంలో ఎదుగుతున్నారో.. వారు ఆ రంగంలో మరింత ఉన్నత స్థితికి వెళ్లేందుకు గల అవకాశాలను మెరుగుపరుకునేందుకు కృషి జరగాలి. అన్నింటికి మించి ప్రధానంగా రాజకీయ సాధికారత సాధనకు అందరూ సహకరించుకోవాలి’. ఇవీ  వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ప్రధానలక్ష్యాలు. వీటి సాధన కోసం ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వివిధ చేనేత సంఘాల ప్రతినిధులందరూ వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఆశయసాధన కోసం సహకరించాలని ఈ సదస్సులో వ్యవస్థాపక చైర్మన్  అంజన్ కర్నాటి, సభ్యులు రమేశ్ మునుకుంట్ల, రాజ్ అడ్డగట్ల విన్నవించారు. 

ఈ సదస్సుకు ముఖ్యఅతిథులుగా కర్నూలు ఎంపీ డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్, మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.నరహరి, ఎమ్మెల్సీలు ఎల్.రమణ, మురుగుడు హనుమంతరావు, పోతుల సునీత, పంచుమర్తి అనురాధ, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, ఏపీ దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, ఏపీ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్సీ బూదాటి రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బండారు ఆనందప్రసాద్ లతోపాటు వివిధ రంగాలకు చెందిన చేనేత ప్రముఖులు హాజరయ్యారు. 



ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా చేనేతలు రెండు కోట్ల జనాభావున్నారని ముఖ్యంగా తెలుగురాష్ట్రాల నుంచే వీరి మూలాలు వున్నాయని తెలిపారు. నాయకులు ఏ రాజకీయపార్టీకి అనుబంధంగా ఉన్నా చేనేతల సమస్యలపై, చేనేతలకు జరుగుతున్న అన్యాయాలను ఎదురించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మనమందరం ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. చేనేతలు ప్రతిభాశాలురని, చేనేత వృత్తిలోనే కాకుండా అనేకరంగాల్లో నిష్ణాతులున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీలకతీతంగా చేనేతల్లో ఐక్యత సాధించేదిశగా మనలో స్ఫూర్తిరావాలని ఎంపీ సంజీవ్ కుమార్ సూచించారు. 


మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.నరహరి మాట్లాడుతూ తాను 2001 బ్యాచ్ ఐఏఎస్ నని, తన సాధారణ కుటుంబ నేపథ్యం గురించి ప్రస్తావించారు. విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, సివిల్స్ , గ్రూపు వన్ ప్రధానపరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థికసహాయం అందించాలని.. 8, 9, 10 తరగతుల్లోనే విద్యార్థులు సివిల్స్ దిశగా లక్ష్యాలను ఏర్పర్చుకోవాలని సూచించారు. ప్రధానం రాజకీయ వ్యవస్థలో మన సామాజిక వర్గాల నుంచి ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం వుందన్నారు. 

తెలంగాణ ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ తనకు రాజకీయంగా దివంగత ఎన్టీరామారావు అవకాశమిస్తే చేనేత బిడ్డ నాయకుడిగా ఉన్నానంటే అందుకు వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ పుణ్యమేనని గుర్తుచేసుకున్నారు. ప్రతి ఒక్కరిలోనూ సర్వీసు చేయాలనే భావన ఉండాలని, రాబోయే కాలంలో మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, అందుకు పరస్పర సహకారం అవసరమని ఎల్.రమణ పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ తెలుగురాష్ట్రాల్లో చేనేతలకు బలమైన నియోజకవర్గాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదని, అందుకు అందరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సు ద్వారా చేనేత పిల్లల్లో కూడా మనం బాగా చదువుకోవాలని.. అటువంటివారికి వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ద్వారా మంచి భవిష్యత్తు ఉంటుందనే విధంగా సంస్థ వ్యవస్థాపకులు కృషిచేయాలని ఆయన సూచించారు.

ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ మనవాళ్లందరికోసం ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటుచేయడం గొప్పవిషయంగా పేర్కొన్నారు. అందుకు ఎన్నారైలు ముందుకు రావడం ముదావహమన్నారు. చేనేతలు అంటే సౌమ్యంగా ఉంటారని, ఎవరి జోలికి వెళ్లరని వారి పని వారుచేసుకుంటారనే పేరుందని చెబుతూ ఇటీవలి ధర్మవరం చేనేత వస్త్రవ్యాపారులపై దారుణ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. బాధితులకు అండగా చేనేతలు ఐక్యంగా ఉండబట్టే కొంతమేరకైనా న్యాయం జరిగిందన్నారు. కాలంమారింది.. సౌమ్యంగా ఉంటే కుదరదు.. న్యాయం కోసం ఫైటింగ్ చేయాలని పిలుపునిచ్చారు.  

ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ మన రాష్ట్రంలో చేనేతలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో మనమే పోటీచేసేవిధంగా చైతన్యం రావాలని, ఆ దిశగా మనల్ని మనం నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగురాష్ట్రాల్లో చేనేతలు రాజకీయ ప్రాధాన్యాన్ని పెంచుకోవాలని సునీత కోరారు.

ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి మాట్లాడుతూ తాము పుట్టిన జాతికోసం సహాయపడాలనే సదుద్దేశంతో ఎన్నారైలు వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటుచేయడం హర్షణీయమన్నారు. చేనేతలు బలహీనులుకాదని, సమాజానికి నాగరికత నేర్పిన జాతి అని గుర్తుచేశారు. చేనేతలు అన్ని రంగాల్లో రాణిస్తూ గతంకన్నాకొంత మెరుగ్గా వున్నారని తెలిపారు. పదవులు శాశ్వతం కాదని చెబుతూ, చేనేత నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత చేనేతలపై వుందన్నారు. చేనేతలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి వుండాలని, స్వార్థాన్ని పక్కనబెట్టి చేనేత సమాజం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రాల్లో చేనేత జాతి బలమైన నాయకత్వం వహించి సీట్లు సాధించుకోవాలని సూచించారు.

మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ చేనేతలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు గతంలో కూడా కృషిజరిగిందన్నారు. నాయకుల్లో ఎవరు గొప్ప అనే అంశం పక్కనబెట్టి నాయకత్వం కావాలని కోరుకోవాలని సూచించారు. చేనేతల్లో ఉపకులాల ప్రస్తావన తేకుండా ఐకమత్యంతో వుంటే రాజకీయపార్టీలను మనం శాసించవచ్చని నిమ్మల పేర్కొన్నారు. అలాగే మనం గెలవగలిగే సీట్లలో మన నాయకులను ప్రోత్సహించాలని సూచించారు.

మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల మాట్లాడుతూ ఇలాంటి సభలు పెట్టడం చాలా గొప్ప విషయమని అందుకు వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ నిర్వాహక ఎన్నారైలకు అభినందనలు తెలిపారు. మనం రాజకీయంగా ఎదగకపోవడానికి కారణం మనలో ఐక్యత లేకపోవడమేనన్నారు. చేనేతలు అంటే ఒకేకులం.. ఒకేబాటలో నడవాలని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ లక్ష్యం నెరవేరుతుందన్నారు. చేనేత కులాలు ఐక్యంగా వుండి ముందుకు వెళ్లగలిగినప్పుడే ఈ సభల ప్రయోజనం నెరవేరుతుందన్నారు. రాజకీయాల్లో ముందుకువెళుతున్న నాయకులను వెనక్కి లాగే ప్రయత్నాలు మంచి పరిణామం కాదన్నారు. చేనేత ఉపకులాల మధ్య వివాహాలను ప్రోత్సహించాలని సూచిస్తూ.. అలా ముందుకు వెళ్లగలిగినప్పుడు ఉపకులాల మధ్య అంతరాలు, విభేదాలు వైదొలుగుతాయని ఇది తన వ్యక్తిగత అభిప్రాయంగా కమల పేర్కొన్నారు. 

మాజీ ఎమ్మెల్సీ బూదాటి రామచంద్రయ్య మాట్లాడుతూ ఐకమత్యం, ఎడ్యుకేషన్, ఆర్థికాభివృద్ధి, రాజ్యాధికారం వంటి ప్రధాన అంశాలు చేనేతల ఎదుగుదలకు దోహదం చేస్తాయన్నారు. ఏ కులం నీదంటే.. చేనేత కులం అని చెప్పుకునే స్థాయికి చేనేతలు ఎదగాలని సూచించారు. చిన్నచిన్నవిషయాలకే కోపతాపాలకు పోయి సంఘాలు పుట్టుకొస్తున్నాయని ఇది మంచి పరిణామం కాదన్నారు. 

ఏపీ దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర మాట్లాడుతూ చేనేతలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అందుకు వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ను ఒక వేదికగా భావించి చేనేతలందరూ భాగస్వామ్యం వహించాలని సూచించారు.

ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బండారు ఆనందప్రసాద్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా చేనేత నాయకులను ఒక వేదికపైకి తీసుకురావడం గొప్పవిషయమని అందుకు వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. చేనేతలకు  సంబంధించి దీర్ఘకాలికసమస్యలున్నాయని చెబుతూ వాటిని సాధించడం కోసం రాజకీయపార్టీలకతీతంగా చేనేతనాయకులు లాబీయింగ్ చేయాలని సూచించారు.

సదస్సు తీర్మానాలు

ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు చేనేత సామాజిక వర్గాలకు చట్ట సభల్లో తగినన్ని సీట్లు కేటాయించాలని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

శాసనసభ స్థానాలు : చీరాల, మంగళగిరి, రాజమండ్రి రూరల్, ఎమ్మిగనూరు, వెంకటగిరి, ధర్మవరం, గాజువాక, పిఠాపురం, 

పార్లమెంట్ స్థానాలు :  హిందూపురం, కర్నూలు, రాజమండ్రి కేటాయించాలని సదస్సు తీర్మానించింది.

చేనేత వుత్పత్తులపై, చిలపల నూలుపై జీఎస్టీ పూర్తిగా తొలగించాలని, నేషనల్ హండ్లూమ్ బోర్డ్ తో పాటు కేంద్ర ప్రభుత్వ చేనేత సంస్థల్ని పునరుద్ధరించాలని, 1985 చేనేత రిజర్వేషన్ యాక్ట్ ను పటిష్టం గా అమలు చేయాలని, చేనేత సహకార సంఘాల బకాయిలు వెంటనే చెల్లించి చేనేత పరిశ్రమను ఆదుకోవాలని సదస్సు తీర్మానించింది.

చేనేత సామాజికవర్గాలన్నీ ఒకటవుతున్న వేళ!

నేడు మంగళగిరిలో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ సదస్సు


రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలు, సామాజిక వర్గాలు ఏకమవడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వారు అసంఘటితవర్గాలుగా ఉండటం, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల వారు ఏకం కాలేకపోతున్నారు. కొన్ని వృత్తులకు సంబంధించి సామాజిక వర్గాలకు సమాజంలో మంచి గుర్తింపు ఉన్నా, ఉన్నత చదువులు చదువుకున్నా వారు రాజకీయంగా ఎదగలేకపోతున్నారు.  మనదేశంలో అనేక కులావారు  ఒకే వృత్తిలో ఉంటుంటారు. అటువంటివారిలో ఐక్యతాలోపం వల్ల రాజకీయంగా మంచి స్థానాన్ని పొందలేకపోతున్నారు. అటువంటి వారిలో చేనేత సామాజిక వర్గాల వారు కూడా ఒకరు. తెలుగు రాష్ట్రాలలో, దేశంలో గణనీయంగా ఉన్నా వారికి రాజకీయంగా తగిన స్థానం లభించడంలేదు. అయితే, చేనేత కులాలలో ఉన్నత చదువులు చదివి దేశవిదేశాలలో ఆర్థికంగా స్థిరపడినవారు అనేక మంది ఉన్నారు. శాస్త్రసాంకేతిక రంగాలలో నిష్ణాతులున్నారు. చేనేతకు సంబంధించి  పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుశాలి, సాలి, స్వకులశాలి, కురిమిసెట్టిశాలి,  సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, తొగటశాలీలు, తొగుల వీరక్షత్రియ,  కరికాలభక్తులు, సాధనాసూరులు, అచ్చుకట్లవాళ్ళు, దూదేకుల, కైకాల,  కుర్ని, ఖత్రి,  నీలి, నీలకంఠి, కోష్ఠి, నక్కల, పట్కార్ వంటి దాదాపు 25 కులాల వారు మన దేశంలో ఉన్నారు. వీరి ప్రధాన వృత్తి చేనేత. చేనేత వృత్తిగా ఉన్న వీరిలో కొన్ని కులాల వారికి తగిన గుర్తింపేలేదు.  అందువల్ల రాజకీయంగా, సామాజికంగా తగిన స్థానం సాధించుకోవాలన్న తపనతో   చేనేత వృత్తిగా గల ఈ కులాలవారినందరినీ  కలపడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక కుల సంఘాలు ఆ ప్రయత్నాలు చేస్తున్నాయి.   అందులో భాగంగా భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా చేనేత మూలాలున్న ఉన్నత విద్యావంతులు, మేథావులు కలిసి అంతర్జాతీయ చేనేత కార్మిక సంస్థ(వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్)ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అమెరికాలోని డెట్రాయిట్, డల్లాస్, చికాగో, న్యూజెర్సీ వంటి నగరాలతోపాటుకెనడాలలో ఉండే వారు ఈ సంస్థను స్థాపించారు.  దేశవ్యాప్తంగా ఉన్న, ఎన్ఆర్ఐ చేనేత కులాల వారిని ఒకే వేదికపైకి తీసుకురావడం, ఒక  బలమైన శక్తిగా రూపొందించండి ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. అలాగే, ప్రభుత్వాల సహకారంతో చేనేత కుల సంఘాలను కలుపుకొని ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టడం. చేనేత వర్గాలు  ఆర్థిక, విద్యా, సామాజిక, సాంస్కృతిక తదితర రంగాలలో నిలదొక్కుకోవడానికి సహాయ సహకారాలు అందించడం,  చేనేత వృత్తిపై ఆధారపడిన వారి వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచి, వారికి కావలసిన పరికరాలు అందించడం, చేనేత వస్త్రాల మార్కెటింగ్, చేనేత కుటుంబాలకు వైద్యం, విద్య వంటి ముఖ్యమైన విషయాలలో సహకారం, విదేశీ విద్య, ఉపాధి, వ్యాపారం, వివాహాలు వంటి అంశాలలో సహకారం అందించాలన్న ఉత్తమ ఉద్దేశాలతో దీనిని స్థాపించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాల సహకారంతో కూడా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. 


తెలంగాణ ప్రభుత్వం, భారతీయ ట్రస్ట్ సహకారంతో  2022 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పద్మశాలి భవన్ లో  వంద చేనేత కుటుంబాలకు  ఆసు యంత్రాలను ఈ సంస్థ అందించింది.  ఆంధ్రప్రదేశ్, తమిళనాడులతోపాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్న ఉద్దేశంలో ఈ సంస్థ ఉంది.  గత డిసెంబరు 10న తిరుచిరాపల్లిలో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ తమిళనాడు శాఖను ఏర్పాటు చేశారు. దేశంలోని చేనేత సామాజిక వర్గాల మధ్య సమన్వయం, సహకారం పెంపొందించేందుకు ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసిద్ధ చేనేత కేంద్రం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ సదస్సు-2023ని నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల చేనేత సామాజిక వర్గాలకు చెంది కుల సంఘాల   ప్రముఖ నేతలను, రాజకీయ, అధికార, అనధికార ప్రముఖులతోపాటు విదేశాలలో ఉండేవారిని  కూడా ఆహ్వానించారు. ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.నరహరి, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, ఎల్.రమణ, పంచుమర్తి అనురాధ, పోతుల సునీత,మాజీ ఎంపీలు బుట్టా రేణుక, రాపోలు ఆనందభాస్కర్, నిమ్మల కిష్టప్ప, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, ఎన్ఆర్ఐలు అంజన్ కర్నాటి, రమేష్ మునుకుట్ల, రాజ్ అడ్డగట్ల, సారథి కార్యంపూడి  వంటివారు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. చేనేత కులాల మధ్య ఐక్యత, అన్ని అంశాలలో పరస్పర సహకారం, రాజకీయంగా ఒక బలమైన శక్తిగా ఎదగడం వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. చేనేత కార్మికులకు అన్నివిధాల సహాయపడటంతో వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో  చేనేత వర్గాలకు అధిక సీట్లు సాధించుకోవాలన్నది ఈ సదస్సు ముఖ్య లక్ష్యం.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914