Jul 20, 2018


గ్యాస్ డెలీవరీ బాయిస్ కు టిప్ ఇవ్వవద్దు

మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
  • వినియోగదారుల్లో అవగాహనకు చర్యలు
  • వినియోగదారుని సమక్షంలో గ్యాస్ తూకం వేసి ఇవ్వాలి
  • గ్యాస్ పూర్తిగా వినియోగించుకోవాలి
  • దీపం పథకం వారికి 2వ సిలిండెర్
  • వినియోగదారులను దృష్టిలోపెట్టుకొని సేవలు


            సచివాలయం, జూలై 20: గ్యాస్ డెలీవరీ బాయిస్  టిప్ డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాలు వస్తున్నాయని, వారికి గ్యాస్ డీలర్లు జీతాలు ఇస్తారని, అందువల్ల వారికి టిప్పు ఇవ్వవలసిన అవసరంలేదని గ్యాస్ కంపెనీల వారు వినియోగదారులకు అవగాహన కల్పించాలని  పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో శుక్రవారం ఉదయం మంత్రి ప్రభుత్వ రంగ ఎల్.పీ.జీ.సంస్థల ప్రతినిధులు, పౌరసరఫరాల శాఖ, తూనికలు, కొలతల శాఖ అధికారులు, రాష్ట్రంలోని ఎల్పీజీ డీలర్ల ప్రతినిధులతో గ్యాస్ కు సంబంధించిన అంశాలను సమీక్షించారు. గ్యాస్ డోర్ డెలివరీ ఛార్జీలను ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు చెల్లిస్తాయని, బిల్లులో నమోదు చేసిన ధర మాత్రమే చెల్లించాలని, అదనంగా చెల్లించవద్దని వినియోగదారులకు తెలియజేయాలన్నారు. అదనంగా వసూలు చేస్తే సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. గ్యాస్ డెలీవరీ బాయిస్  తమ వెంట తూనిక మిషన్ తీసుకువెళ్లి వినియోగదారుని సమక్షంలో తప్పనిసరిగా గ్యాస్ సిలండర్ ని తూకం వేసి ఇవ్వాలని, ఈ విషయమై కూడా వినియోగదారులకు అవగాహన కల్పించాలని మంత్రి చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఏజన్సీలు తక్కువగా ఉన్నాయని, అక్కడ ఏజన్సీలు పెంచాలన్నారు. డీలర్ల వద్దకు వెళ్లి ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి? ఎంత మంది డెలివరీ బాయిస్ ఉన్నారు? ఎన్ని తూనిక మిషన్లు ఉన్నాయి? తనిఖీ చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని డీలర్ల సంఖ్య, వారి వద్ద ఉంటే డెలివరీ బాయిస్, తూనిక మిషన్ల వివరాలు ఆగస్ట్ 14వ తేదీ లోపల అందజేయాలని మంత్రి చెప్పారు. వినియోగదారులను దృష్టిలోపెట్టుకొని సేవలు అందించాలన్నారు. దీపం కనెక్షన్ కింద ఒక్క సిలండర్ మాత్రమే ఇస్తున్నందున, పూర్తిగా గ్యాస్ వినియోగించుకోకుండానే వినియోగదారులు మరో సిలెండర్ తీసుకుంటున్నారని, అలా తీసుకోవడం వల్ల తిరిగి ఇచ్చే సిలిండర్ లో 1 నుంచి 2 కిలోల గ్యాస్ మిగిలిపోతుందని, ఆ విధంగా వినియోగదారులు నష్టపోతున్నారని, అందువల్ల వారికి రెండవ సిలిండర్ ఇవ్వాలని మంత్రి చెప్పారు. గ్యాస్‌ను నిర్ధేశించిన ధరకు సరైన తూకంతో వినియోగదారులకు అందుతుందా? లేదా? అన్నది  ప్రభుత్వం రంగా సంస్థల అధికారులు, పౌరసఫరాల శాఖ, తూనికలు కొలతల శాఖ అధికారుల ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిరంతరం తనిఖీలు చేయాలని చెప్పారు.  అవకతవకలు జరిగినట్లు తేలితే తక్షణం తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్యాకేజీ కమోడిటీస్ నిబంధనల ప్రకారం సరఫరా కంపెనీ పేరు, అడ్రస్, ఎంఆర్పీ,  ప్యాకింగ్ తేదీ, గ్యాస్ పరిమాణం మొదలైన తప్పనిసరి వివరాలను ప్రతి సిలెండర్‌పై కనిపించేవిధంగా  లేబుల్స్  అతికించాలని అయిల్ కంపెనీల ప్రతినిధులను మంత్రి ఆదేశించారు. భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న సిలెండర్లలో మాత్రమే గ్యాస్ నింపాలని, కాలం చెల్లిన సిలిండర్లను వినియోగదారులకు సరఫరా చేయవద్దని చెప్పారు.  గ్యాస్ పంపిణీ, అదనపు వసూళ్లు, తూకం వేయకుండా సిలెండర్ల డెలివరీ వంటి అంశాలకు సంబంధించి  1100 కు ఫిర్యాదు చేయాలని మంత్రి ప్రత్తిపాటి వినియోగదారులను కోరారు. 
           
           ప్రభుత్వ రంగ ఎల్.పీ.జీ.సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ మంత్రి ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తామని చెప్పారు. ఆగస్ట్ 14 నాటికి మంత్రి అడిగిన అన్ని వివరాలు అందజేస్తామన్నారు.  9 ఫిల్లింగ్ కేంద్రాలలో ఎలక్ట్రానిక్ విధానం అమలులోకి వచ్చినట్లు తెలిపారు. సిలిండర్లకు 5 సంవత్సరాలకు ఒకసారి రంగువేయిస్తున్నట్లు చెప్పారు. నోటిఫికేషన్ విడుదల చేశామని, గిరిజన ప్రాంతాల్లో అదనంగా డీలర్లను నియమిస్తామన్నారు. కొన్ని చోట్ల డీలర్లకు సొంత స్థలం లేక ఆగిపోయినట్లు తెలిపారు. దీపం కనెక్షన్ వారికి రెండవ సిలిండర్ ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో  పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్, లీగల్ మెట్రాలజీ ఐజీపీ ఈ.దామోదర్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ విజయ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.

Jul 19, 2018


మోడీకి అగ్ని పరీక్ష

ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్
దేశానికి ఎజండా ఫిక్స్ చేసిన చంద్రబాబు
                  సచివాలయం, జూలై 19: దేశ రాజకీయాల్లో రేపు అరుదైన సంఘటన జరుగబోతోందని, ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అగ్ని పరీక్ష అని ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశానికి ఎజండా ఫిక్స్ చేశారన్నారు. తెలుగు దేశం పార్టీ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై రేపు చర్చ జరుగబోతుందని చెప్పారు. పార్లమెంటు చట్టంపై మోడీకి గౌరవం ఉందో లేదో, దానిని అమలు చేస్తారో లేదో ఇప్పుడు తెలుస్తుందన్నారు. పార్లమెంటు చేసిన విభజన చట్టాన్ని మోడీ ప్రభుత్వం అమలు చేస్తుందని 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎదురు చూశారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో హామీలు అమలు చేయించుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు 29 సార్లు ఢిల్లీ వెళ్లారన్నారు. వారు హామీలు అమలు చేయనందున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవలసి వచ్చిందని చెప్పారు.  రాష్ట్ర భవిష్యత్ కోసం అందరూ కలసిన రావలసిన సమయం ఇదన్నారు. రాజకీయాలకు  అతీతంగా అందరి మద్దతు కూడగట్టవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ టీడీపీని టార్గెట్ చేయడం దురుదృష్టకరం అన్నారు. విభజన చట్టం అమలు చేసి పార్లమెంటుపై గౌరవం పెంచవలసిన అవసరం ఉందని చెప్పారు. హామీలు అమలు చేస్తే కేంద్రానికి, మోడీకి మంచిదన్నారు. ప్రజాస్వామ్యంపై గౌరవం పెరిగి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారు సంతోషిస్తారని చెప్పారు. మాయ మాటలు చెబితే ప్రజలు నమ్మరన్నారు.
         దేశవ్యాప్తంగా బీజేపీ హింసాత్మక సంఘటనలకు పాల్పడుతుందని విమర్శించారు. పాద యాత్రలకంటే పార్లమెంటు పవిత్రమైనదని వైసీపీ గుర్తించాలన్నారు. లోక్ సభలో వైసీపీ వారు ఉంటే ఇప్పుడు అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో పాల్గొనేవారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వారు ఆ అవకాశం కోల్పోయారన్నారు. పాదయాత్ర, ఓదార్పు యాత్రలకంటే పార్లమెంటు పవిత్రమైనదని చెప్పారు. అవిశ్వాసానికి అందరి మద్దతు కావాలని, ఇంతకు ముందు మద్దతు తెలుపుతామని ప్రకటించినవారు కూడా ముందుకు రావాలని డొక్కా విజ్ఞప్తి చేశారు.


Jul 16, 2018


లక్ష మందితో అవయవదాన ప్రతిజ్ఙకు యత్నం
మెప్మా ఎండి చిన తాతయ్య
మెప్మా, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, జీవన్ దాన్ ఫౌండేషన్ సమన్వయంతో అవయవదానంపై విస్తృత స్థాయి ప్రచారం
           సచివాలయం, జూలై 16: ఆగస్ట్ 6న అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో లక్ష మంది చేత అవయవ దాన ప్రతిజ్ఞ చేయించడానికి ప్రయత్నిస్తున్నట్లు మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) ఎండి చిన తాతయ్య చెప్పారు. సచివాలయం 2వ బ్లాక్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 13 జిల్లాలకు చెందిన మెప్మా అధికారులకు, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ డాక్టర్లకు ప్రజల్లో  అవయవ దానంపై అవగాహన కల్పిచడం ఎలా? అన్నదానికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మెప్మా, ఆరోగ్య విశ్వవిద్యాలయం, జీవన్ దాన్ ఫౌండేషన్ వారి సమన్వయంతో అవయవదానంపై అవగాహన కల్పించడానికి, పెద్ద ఎత్తున విస్తృత స్థాయిలో ప్రచారం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏడాదికి 1200 మందికి అవయవదానం అవసరం వస్తోందని, 20 శాతం మంది అవసరాలు మాత్రమే తీర్చగలుగుతున్నామని వివరించారు. అవగాహన లేకపోవడం, మూడ నమ్మకాల వల్ల ఇలా జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అత్యధిక మంది నుంచి అవయవదానానికి ఆమోదం తెలిపే పత్రాలు సేకరించడానికి పూనుకున్నట్లు తెలిపారు. సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిస్థితులలో మనిషి ప్రాణాన్ని కాపాడుకునే అవయవాలను కృత్రిమంగా తయారుచేస్తున్నప్పటికీ, అవి పూర్తి స్థాయిలో మనిషిని కాపాడుకోలేక పోతున్నాయని తెలిపారు. 2017లో సుమారు 1,46,377 మంది రహదారిపై ప్రమాదాల్లో మరణించారని,  వారిలో  0.1 శాతం మంది మాత్రమే అవయవ దానం చేయగలిగారని వివరించారు.  ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయినవారి నుంచి అవయవాలు తీసుకోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని తెలిపారు.  ప్రతి నిముషానికి 10 మంది మరణిస్తున్నారని, వారిలో కొద్ది మాత్రమే మరణానికి ముందు అవయవదానం గురించి ఆలోచిస్తున్నారన్నారు. సాధారణ మరణాలలో కేవలం కళ్ళు మాత్రమే దానం చేయటానికి అవకాశం ఉంటుందని చెప్పారు. మన దేశంలో రోజువారీ మరణించేవారు అవయువదానం చేయగలిగితే ఎవరూ అవయవలోపంతో ఉండరని చిన తాతయ్య అన్నారు.
              డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సివి రావు మాట్లాడుతూ అవయవ దానంపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ఈ కార్యక్రమం దారితప్పకుండా సరైన రీతిలో నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమమని చెప్పారు. మెప్మా సిబ్బంది, విశ్వవిద్యాలయం ఎస్ఎస్ఎస్ విభాగం డాక్టర్లు కలసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్నట్లు తెలిపారు. ఆగస్ట్ 6న  ఎంత ఎక్కవ మందితో అవకాశం ఉంటే అంత ఎక్కువ మందితో ప్రతిజ్ఞ చేయించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
               శిక్షణా కార్యక్రమంలో   జీవన్ దాన్ సీఈఓ  డాక్టర్ కృష్ణమూర్తి, విశ్వవిద్యాలయం ఎన్ఎస్ ఎస్  ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ కరుణామూర్తి,  ప్రోగ్రాం ఆఫీసర్లు, మెప్మా జిల్లా స్థాయి ఆరోగ్య, పౌష్టికాహార నిపుణులు పాల్గొన్నారు.

Jul 13, 2018


అధికారుల అలసత్వం వల్ల బీసీ విద్యార్థులకు అన్యాయం
బీసీ సంక్షేమ కమిటీ చైర్మన్ గుండుమల తిప్పేస్వామి

Ø రిజర్వేషన్ వర్గాలకు న్యాయం చేస్తాం
Ø సుప్రీం కోర్టు తీర్పు ప్రకారమే 550 జీఓ
Ø ఆధారాలు సమర్పించి స్టే రద్దు చేయిస్తాం
Ø మెడికల్ సీట్ల భర్తీ రీ కౌన్సిలింగ్ నిర్వహిస్తాం
Ø  
               సచివాలయం, జూలై 13: అధికారుల అలసత్వం వల్ల ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో రిజర్వేషన్ వర్గాలకు ముఖ్యంగా బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ చైర్మన్ గుండుమల తిప్పేస్వామి చెప్పారు. అమరావతిలోని వెలగపూడి శాసనసభ భవనం మొదటి అంతస్తులోని కమిటీ హాలులో శుక్రవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకు మెడికల్ కౌన్సిలింగ్ లో జరుగుతున్న అన్యాయంపై నెల రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోందన్నారు. బీసీ విద్యార్థులు, బీసీ సంఘాల వాదనలో న్యాయం ఉందన్నారు. ఉయయం జరిగిన కమిటీ సమావేశంలో ఈ అంశంపై ఉన్నత విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఎన్టీఆర్ వైద్య విశ్యవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సీ.వెంకటేశ్వర రావు, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ వి.రామారావు, ఇతర ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపారు. 2001లో సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా రూపొందించిన 550 జీఓ ప్రకారం 16 ఏళ్లుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మెడికల్ కౌన్సిలింగ్ లో సీట్లు భర్తీ చేశారని చెప్పారు. 2017 ఆగస్ట్ 30 కోర్టు ఇన్ టెర్మ స్టే ఇవ్వడం వల్ల ఈ సమస్య తలెత్తిందన్నారు. స్టే ఎత్తివేయడానికి కావలసి మద్దతు డాక్యుమెంట్లు, ఆధారాలు  ఉన్నత విద్యాశాఖ వద్ద ఉన్నాయని, వాటిని కోర్టుకు సమర్పించి స్టే ఎత్తివేయిస్తామని చెప్పారు. రిజర్వేషన్ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన కౌన్సిలింగ్ ఆపివేయమని ఆదేశించారన్నారు. కొందరు అధికారులు బాధ్యతగా వ్యవహరించకపోవడంతో స్టే ఎత్తివేయించడంలో ఇంత జాప్యం జరిగిందన్నారు. స్టే ఎత్తివేసిన తరువాత రీ కౌన్సిలింగ్ జరిపి రిజర్వేషన్ వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పారు. జాప్యానికి కారకులైన వారిపై వచ్చే కమిటీ సమావేశంలో చర్యలు తీసుకుంటామన్నారు.

     రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరుగకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు జరిగే విధంగా చూస్తామన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అన్యాయం జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల కమిటీ విజయనగరం జిల్లాలో పర్యటించిందని, అక్కడ అన్ని అంశాలను పరిశీలించామన్నారు. రిజర్వేషన్లను ఎవరు ఇష్టం వచ్చినట్లు వారికి అనుకూలంగా మలచుకోవడానికి వీలులేదని తిప్పేస్వామి హెచ్చరించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలు పి.అనంత లక్ష్మి, డాక్టర్ బి.అశోక్, బి.రామమూర్తి, ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు పాల్గొన్నారు.

స్టే ఎత్తివేయడానికి కోర్టుకు ఆధారాలు సమర్పణ
          మెడికల్ కౌన్సిలింగ్ లో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించి స్టే ని ఎత్తివేయమని కోరుతూ తగిన ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. అమరావతిలోని వెలగపూడి శాసనసభ భవనం మొదటి అంతస్తులోని కమిటీ హాలులో శుక్రవారం ఉదయం జరిగిన బీసీ సంక్షేమ కమిటీ సమావేశంలో రిజర్వేషన్ అంశాలకు సంబంధించి సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.550ని రూపొందించింది. ఈ జీఓ ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థి ఓపెన్ కేటగిరీలో ఒక కళాశాలలో చేరి, తరువాత రిజర్వేషన్ కేటగిరీలో మరో కళాశాల లేదా కోర్సులోకి మారితే ఏర్పడిన ఖాళీని అదే రిజర్వు కేటగిరి అభ్యర్థితో మెరిట్ ప్రకారం భర్తీ చేయాలి. 2001 నుంచి ఈ ప్రకారమే ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేస్తున్నారు. 2017లో తనకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి కౌన్సిలింగ్ ద్వారా సీట్లు కేటాయించారని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదన విన్న హైకోర్టు 2017 ఆగస్ట్ 30న ఆ రకమైన సీట్ల కేటాయింపు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు వెలువడే నాటికి సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి అయింది. కోర్టు మధ్యంతర ఉత్వర్వులను దృష్టిలోపెట్టుకొని ఈ ఏడాది సీట్లను భర్తీ చేస్తుండటంతో రిజర్వేషర్ వర్గాలు ఆందోళనకు దిగాయి. మధ్యంతర ఉత్తర్వులను తొలగించి, కేసును కొట్టివేయవలసిందిగా ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం హైకోర్టును కోరినట్లు, కేసు విచారణలో ఉన్నట్లు, సోమవారం విచారణ జరుగుతుందని  ఉన్నత విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఎన్టీఆర్ వైద్య విశ్యవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సీ.వెంకటేశ్వర రావులు కమిటీకి వివరించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ తిప్పేస్వామి మాట్లాడుతూ స్టే ఎత్తివేయించడానికి ఇంత కాలం ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు.  అధికారులు తగిన బాధ్యతతో వ్యవహరించకపోవడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరగడానికి వీలులేదన్నారు. వారికి న్యాయం జరగాలని చెప్పారు. అందుకు తగిన ఆధారాలను కోర్టుకు సమర్పించి స్టే ఎత్తివేయించడానికి తీవ్రంగా ప్రయత్నించాలని ఆదేశించారు. ఈ విషయంలో రిజర్వేషన్ వర్గాలకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఉన్నతాధికారులను, వైస్ ఛాన్సలర్ ని తిప్పేస్వామి కోరారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులతోపాటు బిసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ వి.రామారావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.

Jul 12, 2018


పుస్తక సమీక్ష
 వారసత్వ, కుటుంబ రాజకీయాలపై పరిశోధన

·       నాలుగు జిల్లాల్లో పోటీచేసి గెలిచిన ఘనుడు
·       అయిదుసార్లు గెలిచిన బావబావమరుదులు
·       తండ్రి, కొడుకు, మనవడి గెలుపులు
       
 
   

 వారసత్వం అనేది అన్ని సందర్బాల్లో మంచి ఫలితాలివ్వదు. వ్యాపారాలు
, వృత్తులు వంటివాటిలో సాధ్యమైనా రాజకీయాల్లో మాత్రం సాధ్యం కాదు. అంతర్జాతీయంగా కొన్ని వ్యాపార సంస్థలు, మన దేశంలో టాటా, బిర్లా, అంబానీ వంటివారు, గ్రామాల్లో, పట్టణాల్లో వైశ్య కులం వారు వారసత్వంగా వ్యాపారాలు కొనసాగిస్తూ మంచి ఫలితాలు సాధిస్తూనే ఉన్నారు. అలాగే చేతి వృత్తులు ముఖ్యంగా పౌరోహిత్యం, చేనేత, విశ్వబ్రాహ్మణులు, నాయీబ్రాహ్మణులు వంటివారి వృత్తులు వేల సంవత్సరాలుగా వారసత్వంగానే కొనసాగుతున్నాయి. ఆయా రంగాల్లో నైపుణ్యత కూడా  అలవడుతోంది. రాజకీయాల్లో మాత్రం రాచరిక వ్యవస్థ నుంచి నేటి ప్రజాస్వామ్య రాజకీయాల వరకు ఒకటి రెండు తరాలకు మించి మంచి ఫలితాలిచ్చిన దాఖలాలులేవు. మన దేశంలో, రాష్ట్రంలో రాజకీయాల్లో వారసత్వ రాజకీయాల కోసం పాకులాట ఎక్కువగానే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, తండ్రీ కూతుళ్లు, తల్లీకొడుకులు, తల్లీకూతుళ్లు, తాతామనవడు వంటి వారసత్వంతోపాటు అన్నదమ్ములు, వియ్యంకులు, బావబావమరుదులు వంటి ఇతర కుటుంబ సభ్యుల రాజకీయ వారసత్వ పోకడలపై  సీనియర్ జర్నలిస్ట్ మదమంచి సాంబశివరావు పరిశోధన చేసి రాసిన పుస్తకం ఇది. వారసత్వ, కుటుంబ రాజకీయాల వల్ల నష్టాలు ఎన్నో జరిగాయి. అరాచకీయానికి దారితీశాయి. ఆయా నాయకుల ఆర్థిక స్తోమత, వ్యక్తిత్వాలు మీద ఆధారపడి వారు రాణించిన, ప్రజలకు మేలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి నాయకులు నిజంగా ప్రజాబలంతో నిలదొక్కుకున్నారు. కొందరు రాజకీయ నేతల మధ్య బంధుత్వాలకు సంబంధించి మనకి తెలియని అనేక విషయాలు ఇందులో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఒకే కుటుంబం నుంచి తండ్రి, కొడుకు, అల్లుడు, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. మనవడు ఎంపీ అయ్యాడు. వియ్యంకుడు ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు వీరిలో ఒక్కొక్కరు నాలుగుసార్లు, అయిదుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయిదుసార్లు ఎన్నికైనవారిలో బావబాబమరుదులు ఇద్దరూ ఉండటం విశేషం. అంతేకాకుండా కొందరు నాయకులు పార్టీలు మారి, నియోజకవర్గాలు, జిల్లాలు మారి పోటీ చేసి గెలుపొందారు. ఒక నేత మూడు పార్టీల తరపున శానసభకు, శానస మండలికి ప్రాతినిద్యంవహించారు. ఒక నియోజకవర్గంలో ఒకే కుటుంబం నుంచి 9 సార్లు ఎన్నికయ్యారు. ఒక నేత నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మరో నాయకుడు నాలుగు జిల్లాల్లో పోటీ చేసి మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందాడు. అతనే మూడుసార్లు మంత్రిగాఒకసారి ముఖ్యమంత్రిగా చేశాడు.    ఉమ్మడి ఏపీకి చెందిన ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు ఈ పుస్తకంలో అనేకం ఉన్నాయి. సాంబశివరావు చాలా శ్రమించి కుటుంబ రాజకీయాలను పరిశోధన చేసి చాలా చక్కగా విశ్లేషించారు. 

పుస్తకం పేరు: నేను నా కుటుంబం
 రచయిత : మదమంచి సాంబశివరావు
 పుస్తకాలు దొరుకు ప్రదేశం: 
గ్రీన్ థింకర్స్ పబ్లికేషన్స్,
సౌపాడు గ్రామం, వట్టిచెరుకూరు మండలం,
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 522017
సెల్ నెంబర్: 9885317835

-       శిరందాసు నాగార్జున - 9440222914

Jul 6, 2018


 ఎస్ఎస్సీ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల
10 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ : మంత్రి గంటా శ్రీనివాసరావు

·       52.42 శాతం ఉత్తీర్ణత
·       85.43 శాతం ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా ఫస్ట్
·       16.53 శాతంతో చివరి స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా

              సచివాలయం, జూలై 6: ఎస్ఎస్సీ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్ష-2018 ఫలితాలను విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు శుక్రవారం ఉదయం సచివాలయం 4వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో విడుదల చేశారు. ఫలితాల సీడీని మీడియాకు అందజేశారు. సీడీ పాస్ వర్డ్ POLAVARAM గా పేర్కొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షలు జూన్ 11 నుంచి 25 వరకు జరిగినట్లు తెలిపారు. 29, 30తేదీలలో రెండు రోజులు స్పాట్ వాల్యూషన్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ పరీక్షలకు మొత్తం 35,147 మంది హాజరు కాగా, 18,424 మంది ఉత్తీర్ణులైనట్లు వివరించారు. ఉత్తీర్ణత శాతం 52.42 శాతంగా పేర్కొన్నారు. గత ఏడాది 71.37 శాతం ఉత్తీర్ణులయ్యారని,  ఉత్తీర్ణత ఫలితాలు ఈ ఏడాది 18.95 శాతం  తగ్గినట్లు చెప్పారు.
బాలురు 18,440 మంది హాజరుకాగా, 9,679 మంది, బాలికలు 16,707 మంది హాజరు కాగా 8745 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. బాలురు 52.49 శాతం, బాలికలు 52.34 శాతం మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. బాలికలకంటే బాలురు 0.15 శాతం ఎక్కువ ఉత్తీర్ణలైనట్లు తెలిపారు. ఫలితాలను WWW.BSEAP.ORG వెబ్ సైట్ లో చూసుకోవచ్చని చెప్పారు.
          అత్యధిక 85.43 శాతం ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 16.53 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా చివరి స్థానంలో ఉన్నట్లు చెప్పారు. గత సాధారణ పరీక్షా ఫలితాల్లో కూడా ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో నిలిచిన విషయం గుర్తు చేశారు.   తూర్పుగోదావరి జిల్లాలో 83.39 శాతం, అనంతపురం జిల్లాలో 82.65 శాతం, వైఎస్ఆర్ కడప జిల్లాలో 81.85 శాతం, గుంటూరు జిల్లాలో 80.84 శాతం, చిత్తూరు జిల్లాలో 75.49 శాతం, విజయనగరం జిల్లాలో 65.27 శాతం, కృష్ణా జిల్లాలో 59.60 శాతం, విశాఖ జిల్లాలో 57.64 శాతం, కర్నూలు జిల్లాలో 58.71 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 53.92 శాతం, నెల్లూరు జిల్లాలో 41.03 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు వివరించారు. ఫలితాలు ప్రచురించిన 7 రోజుల లోపల సబ్జెక్ట్ కు రూ.500 లు చెల్లించి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయించుకోవచ్చని మంత్రి తెలిపారు. రీవెరిఫికేషన్ తోపాటు మార్కులు వేసిన జవాబు పత్రాలు కావాలంటే వెయ్యి రూపాయలు చెల్లించాలన్నారు.  ఉత్తీర్ణులయినవారికి, కానివారికి 15 రోజుల లోపల సర్టిఫికెట్లు అందజేస్తారని చెప్పారు.

10 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్
           డీఎస్సీ నోటిఫికేషన్ 10 రోజుల్లో జారీ చేస్తామని మంత్రి చెప్పారు. ఇంతకు ముందు ఈ నెల 6న జారీ చేయాలని అనుకున్నామని, చిన్నచిన్న అవాంతరాల వల్ల ఇవ్వలేకపోయామన్నారు. ఆర్థిక శాఖ లేవనెత్తిన అభ్యంతరాలను, ఆ శాఖ చేసిన సూచనల ప్రకారం పరిష్కరిస్తామన్నారు. ఎన్సీటీఈ మార్గదర్శక సూత్రాల్లో కూడా కొన్ని మార్పులు చేసిన నేపధ్యంలో అన్ని అంశాలను చర్చించి వారం, పది రోజుల్లో ఒక నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఉపాధ్యాయ పోస్టులు ఏమీ పెరగవని, గతంలో ప్రకటించిన విధంగా 10,351 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని చెప్పారు. ప్రత్యేక డీఎస్సీ ద్వారా సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖలలో పోస్టులు భర్తీ చేస్తారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నీచర్ వంటి మౌలిక సదుపాయల కల్పనకు సంబంధించిన టెండర్లు ఎక్కువ కోట్ చేసినందున జాప్యం జరిగినట్లు తెలిపారు. తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత విద్యా పరంగా రాష్ట్రం 17వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకినట్లు తెలిపారు. గణితంలో మొదటి స్థానంలో నిలిచినట్లు మంత్రి గంటా చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

Jul 4, 2018


నిరుపేద‌ల సొంత ఇంటి క‌ల‌ల సాకారం

మంత్రి కాలవ శ్రీనివాసులు
Ø నేడు 3 లక్షల సామూహిక గృహప్రవేశాలు
Ø రాష్ట్రమంతటా పండుగ వాతావరణం
Ø 2019 మార్చికి ప‌ది ల‌క్షల ఇళ్లు లక్ష్యం
Ø 2022 నాటికి  ప్రతి కుటుంబానికి గృహ‌ వ‌స‌తి

                    సచివాలయం, జూలై 4: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలోని నిరుపేద‌ల సొంత ఇంటి క‌ల‌లు సాకారం అవుతున్నట్లు గ్రామీణ గృహ నిర్మాణ శాఖ, సమాచార, పౌరసంబంధాల శాఖల  మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 5వ తేదీ గురువారం ఒకే రోజు రాష్ట్రంలో మూడు లక్షల మంది పేదలు తమ సొంత ఇళ్లలోకి గృహప్రవేశాలు జరిపే మహోన్నత కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్టం అంతటా పండుగ వాతావరణం నెలకొంటుదన్నారు.  రాష్ట్ర చరిత్రలో ఇదొక అద్వితీయ ఘట్టంగా ఆయన పేర్కొన్నారు.  ఆర్థిక ఇబ్బందులను అదిగమిస్తూ పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. యూనిట్ ధరను రూ.70 వేల నుంచి లక్షా 50వేల రూపాయలకు పెంచినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీఎంఏవై, ఎన్టీఆర్ గృహ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.2.5 లక్షలు సబ్జిడీగా అందజేస్తాయని చెప్పారు.  విజ‌య‌వాడ‌లోని ఇందిరా గాంధి స్టేడియంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దీనిని రాష్ట్రంలో ఓ ఉత్సవంగా, నూత‌న గృహ‌ప్రవేశాలు చేసిన కుటుంబాల జీవితాల్లో చిర‌కాలం గుర్తుండిపోయేలా నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలు, 9 నోటిఫైడ్ మున్సిపాలిటీల పరిధిలోని 2093 వార్డుల్లోనూ, 12,767 గ్రామ పంచాయతీల్లో మూడు లక్షల గృహప్రవేశాలను ఏకకాలంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు.  గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 2 లక్షల 71 వేల ఇళ్లు, పట్టణాల్లో 24,145 ఇళ్ళను ప్రారంభించ‌నున్నామని చెప్పారు.  ఒక్క నియోజకవర్గం తప్ప రాష్ట్రం నలుచెరుగులా 174 నియోజకవర్గాల్లో సామూహిక గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.  హూదూద్ తుఫాన్  బాధితులకు సంబంధించిన 5,118 ఇళ్ళు కూడా ఇదే కార్యక్రమంలో ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో తొలివిడ‌త ల‌క్ష సామూహిక గృహ‌ప్రవేశాల కార్యక్రమాన్ని గ‌త ఏడాది అక్టోబ‌రు 2న విజ‌య‌వంతంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.  ఇప్పుడు ఒకేసారి మూడు ల‌క్షల గృహ‌ప్రవేశాల‌ను నిర్వహించడం ఓ రికార్డుగా పేర్కొన్నారు. కుటుంబ ఆదాయంతోపాటు శాశ్విత గృహ వసతి కలిగి ఉండటం అభివృద్ధికి కొలమానంగా భావిస్తారన్నారు. దేశంలో మొదటిసారిగా పేదవారికి పక్కా ఇళ్లు సమకూర్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు.
        2019 మార్చి నాటికి రాష్ట్రంలో ప‌ది ల‌క్షల ప‌క్కా గృహాల‌ను ఎన్టీఆర్ గృహ‌నిర్మాణ ప‌థ‌కం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించాల‌ని సీఎం నిర్దేశించారని చెప్పారు.  ల‌క్ష్యాన్ని చేరుకొనే దిశ‌గా గృహ‌నిర్మాణాన్ని వేగ‌వంతం చేసినట్లు తెలిపారు.  2017 ఏప్రిల్ నుండి 2018 మార్చి వ‌ర‌కు ఏడాది వ్యవ‌ధిలో రికార్డు స్థాయిలో రూ.3,787 కోట్లు ఖ‌ర్చుచేసి 3.15 ల‌క్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసినట్లు వివరించారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా పారదర్శికంగా చెల్లింపులు చేస్తున్నట్లు తెలిపారు. నగదు లావాదేవీలు లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే నగదు జమ అవుతుందన్నారు. ఇల్లు కట్టకుండా బిల్లు తీసుకునే విధానం ఇక్కడ కుదరదని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో సామాన్యుడికి ప్లాన్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు.
                 2022 నాటికి  రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి గృహ‌వ‌స‌తి క‌ల్పించాల‌ని ఏపీ ప్రభుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.  ఎన్టీఆర్ గృహ‌నిర్మాణ ప‌థ‌కం కింద రాష్ట్రంలో రూ.19 వేల కోట్లతో 13 లక్షల ప‌క్కా ఇళ్లను  గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించాల‌ని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప‌థ‌కం కింద ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షల‌ పూర్తి రాయితీతో ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తోందన్నారు. 2015 నుండి గ‌త నాలుగేళ్ల కాలంలో ఈ ప‌థ‌కం ద్వారా రాష్ట్రంలో  8.34 ల‌క్షల ఇళ్ల నిర్మాణానికి ప‌రిపాల‌న అనుమ‌తులు మంజూరు చేయ‌గా, ఇందులో 6.47 ల‌క్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభ‌మ‌యినట్లు తెలిపారు. నాలుగేళ్లలో ఈ ప‌థ‌కం కింద 4.00 ల‌క్షల ఇళ్లను పూర్తిచేసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ గృహ‌నిర్మాణ ప‌థ‌కంతో సహా ఇత‌ర ప‌థ‌కాల‌ను క‌లుపుకొని రాష్ట్రంలో నాలుగేళ్ల కాలంలో రూ.6,203 కోట్లతో 5.80 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంలో ల‌బ్దిదారుల‌కు ఎలాంటి స‌మ‌స్యలు ఎదురుకాకుండా గృహ‌నిర్మాణ శాఖ చేప‌ట్టిన చ‌ర్యలు స‌త్ఫలితాలిస్తున్నాయన్నారు. అవినీతికి తావులేని విధంగా ల‌బ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే నిధులు జ‌మ‌చేయ‌డం, ఇళ్లను జియో ట్యాగింగ్‌, ఆధార్ ద్వారా అనుసంధానించ‌డం, సిమెంటు త‌దిత‌ర ఇంటి నిర్మాణ సామాగ్రి స‌ర‌స‌మైన ధ‌ర‌ల్లోనే ల‌బ్దిదారుల‌కు అందుబాటులో వుండేలా ఏర్పాట్లు చేయ‌డం, ఇళ్ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన సాంకేతిక స‌హాయాన్ని  గృహ‌నిర్మాణ శాఖ ద్వారా అందించ‌డం వంటి చ‌ర్యల కార‌ణంగా ఇళ్ల నిర్మాణం వేగవంతమయినట్లు మంత్రి కాలవ చెప్పారు.