May 18, 2025

విజయనగర సామ్రాజ్యంలో మంగళగిరి ఓ పట్టణం

 ‘మంగళగిరి 2.0’ పుస్తక సమీక్ష

చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, చేనేత, స్వర్ణకార వృత్తుల పరంగా, రాజకీయంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన పట్టణం గుంటూరు జిల్లాలోని మంగళగిరి. విజయనగర సామ్రాజ్యంలోనే మంగళగిరి ఓ పట్టణంగా గుర్తింపు పొందింది.   వినియోగదారుల ఉద్యమకారుడు, విశ్రాంత రైల్వే ఉద్యోగి, న్యాయవాది  మాదిరాజు గోవర్థన రావు తను పుట్టిపెరిగిన ఊరిపై ఉన్న అభిమానంతో 70 ఏళ్ల వయసులో ఎన్నో గ్రంథాలను అధ్యయనం చేసి, చరిత్రకారులను కలిసి  సుదీర్ఘ పరిశోధన చేసి  ‘మంగళగిరి 2.0’ పుస్తకం రాశారు. తన ఊరనే మమకారంతో పూనుకోవడం వల్లే ఇది సాధ్యమైంది. 36 పుస్తకాలు రాసిన అనుభవం ఉండటం వల్ల అన్ని అంశాలను సమగ్రంగా రాశారు. మంగళగిరి అంటే సాధారణంగా అందరికీ గుర్తుకు వచ్చేవి చేనేత, బంగారు వస్తువుల తయారీ, శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, 11 అంతస్తుల ఆలయ గాలిగోపురం,  కొండ శిఖరాన గండాలయ దీపం... వాటన్నిటి గురించి ఫొటోలతో సహా వివరంగా రాశారు. చేనేత, బంగారు వృత్తుల పరంగా  మంగళగిరి ఓ నైపుణ్యాల గని. చేనేత వస్త్రాలకు, బంగారు నగల తయారీకి మంగళగిరి ఎంత ప్రసిద్ధి చెందిందో, ఆధ్యాత్మికంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి కూడా చారిత్రకంగా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మంగళగిరి చేనేత వస్త్రాలు దేశవిదేశాలకు ఎలా ఎగుమతి అవుతాయో, దేశ విదేశీ భక్తులు అలా శ్రీలక్ష్మీనరసింహ స్వామిని, పానకాల స్వామిని దర్శించుకోవడానికి  ఇక్కడి వస్తుంటారు. ఆ విధంగా పర్యాట కేంద్రంగా కూడా మంగళగిరి ప్రసిద్ధి చెందింది. అత్యంత సన్నని పోగు(దారం)లకు రంగులు అద్దడానికి, పడుగులు తయారు చేయడానికి, వివిధ రకాల  వస్త్రాలను చేతితో నేయడానికి ఎంతో నైపుణ్యత కావాలి. అలాగే, వివిధ రకాల బంగారు ఆభరణాలను మెరుపులతో ఆకర్షణీయంగా తయారు  చేయడానికి ఆ రంగంలో  అత్యంత నిపుణులై ఉండాలి. ఈ రకమైన నైపుణ్యం గల కళాకారులు చేనేత రంగంలో గానీ, స్వర్ణకార వృత్తిలో గానీ  మంగళగిరిలో దాదాపు 25వేల మందికి పైగా  ఉన్నారు.   అందువల్లే ప్రభుత్వం ఇక్కడ చేనేత, గోల్డ్ హబ్‌లు ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇక్కడ చేనేత కార్మికులు అన్నా, స్వర్ణకారులు అన్నా అత్యధిక మంది పద్మశాలీ సామాజిక వర్గానికి చెందినవారే ఉంటారు. ముస్లింలు, వైశ్యులు, యాదవులు, మాదిగలు, మాలలు  కూడా గణనీయంగా ఉన్నప్పటికీ అత్యధిక మంది పద్మశాలీ సామాజిక వర్గం వారే ఉంటారు. అయితే, పూర్వ కాలంలో కుబేరులుగా వైశ్య సామాజిక వర్గానికి చెందిన ‘పారేపల్లి’వారు ఉండేవారు. సహజంగా వ్యాపార రంగంలో వారిదే పైచేయిగా ఉంటుంది. చేనేత రంగానికి ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో 1970 దశకంలో దాదాపు 10 వేల మగ్గాలు ఉండేవి. ప్రతి వీధిలోనూ మగ్గాలు ఉండేవి. కాల క్రమంలో పవర్ లూమ్ పోటీకి చేనేత రంగం తట్టుకుని నిలబడటం కష్టమైపోయింది. ఈ నేపథ్యంలో చేనేత కార్మిక కుటుంబాలు స్వర్ణకార వృత్తివైపు మళ్లారు. దాంతో వారు ఆర్థికంగా కూడ నిలదొక్కుకున్నారు.  దాదాపు 15 వేల మంది బంగారపు పనివారు ఇక్కడ ఉన్నారు. చేనేత, స్వర్ణకార వ‌ృత్తిలో నిపుణులతోపాటు రచయితలు, విద్య, క్రీడలు, శాస్త్రసాంకేతిక రంగాలలో కూడా అత్యంత ప్రావీణ్యత కలిగినవారు ఉన్నారు. అలాగే, ఆది నుంచి వ్యాపారం, విద్య సంస్థలు ... తదితరాలతోపాటు  సినిమా ధియేటర్లు కూడా ఈ సామాజిక వర్గం ఆధీనంలోనే ఉన్నాయి. 

రాజకీయంగా కూడా పద్మశాలీ సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. మంగళగిరికి చెందిన గోలి వీరాంజనేయులు, మురుగుడు హనుమంతరావు రెండుసార్లు, కాండ్రు కమల శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. హనుమంతరావు  మంత్రిగా ఆప్కో చైర్మన్ కూడా చేశారు. దామర్ల రమాకాంత రావు, మురుగుడు హనుమంతరావు శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు.  మంగళగిరి శాసనసభా నియోజకవర్గం కలిసిన తెనాలి లోక్ సభ స్థానం నుంచి కూడా ఒకసారి పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన ఊర్వశి బూదాటి శారద గెలిచారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా మంగళగిరి నుంచి  దామర్ల రమాకాంత రావు, కాండ్రు కమల, తమ్మిశెట్టి జానకీదేవి నియమితులయ్యారు. వీరు ముగ్గురూ ఆ సామాజిక వర్గం వారే. మంగళగిరి మునిసిపల్ చైర్మన్లు అందరూ కూడా చేనేత సామాజిక వర్గాలకు చెందినవారే గెలిచారు. 

ఒక రకంగా మంగళగిరి చరిత్ర అంటే ఆ సామాజిక వర్గంతో ముడిపడి ఉంటుంది. చివరికి దేవుడి సంబరాలు కూడా వారితోనే ముడిపడి ఉంటాయి. 1915లో తమ హక్కులకు ఆటంకం కలిగినప్పుడు పద్మశాలీయులు కోర్టు వెళ్లి తమ హక్కలను సాధించుకున్నారు. పద్మశాలీయులు ‘సిరికి పుట్టింటి వారు-హరికి అత్తింటివారు’ అనేది ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అలాగే,  స్థానిక పద్మశాలీయులు దేవాలయంలో స్వామివారి కళ్యాణం సందర్భంగా మెట్టెలు, మంగళసూత్రాలు, తలంబ్రాలు, మధుపర్కాలు, ఉత్తర జందెం సమర్పించే ఆచారం కొనసాగుతోంది. అప్పటి దేవస్థానం ధర్మకర్త ఆ ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహరించారు. దాంతో, ఈ అంశం కోర్టు వరకు వెళ్లింది. అప్పటి మంగళగిరి దేవస్థాన ఆచార్యులు శ్రీకందాళ రంగాచార్యులు గుంటూరు అడిషనల్ జిల్లా మున్సిఫ్  కోర్టులో పద్మశాలీయులకు మద్దతుగా పురాణేతిహాసాల సారాంశాన్ని న్యాయమూర్తికి వివరించారు. ఆ వాదనలను అంగీకరించిన కోర్టు పద్మశాలీయులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి ఎటువంటి వివాదంలేకుండా ఆ ఆచారం అలాగే కొనసాగుతోంది. ఈ అంశాన్ని రచయిత చారిత్రక ఆధారాలు, కోర్టు తీర్పులతో సహా  ఈ పుస్తకంలో   స్పష్టంగా పేర్కొన్నారు.  

చరిత్రకు అందినప్పటి నుంచి పరిశీలిస్తే,  శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనంద గోత్రజులు, విష్ణుకుండినులు,చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యం, గోల్కొండ కుతుబ్ షాహీలు, ఫ్రెంచ్ వారు, ఆంగ్లేయుల పాలన కింద మంగళగిరి ఉండేది.  1950-58 మధ్య కాలంలో మంగళగిరి ప్రాంతం మిద్దె హద్దుగా ఇద్దరి పరిపాలనలో కొనసాగింది. చెన్నై-కోల్‌కత 16వ నెంబర్ జాతీయ రహదారిపై గుంటూరు-విజయవాడ నగరాల మధ్యన ఉన్న మంగళగిరి చారిత్రకంగా కూడా ప్రసిద్ధి చెందిన నగరం. విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఇక్కడి నుంచే వలస వెళ్లారు. విజయనగర రాజుల కాలంలోనే మంగళగిరిని పట్టణంగా పరిగణించేవారు.  రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన 157 అడుగులు, 11 అంతస్తుల శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురాన్ని 1807-09 కాలంలో అప్పటి  ధరణికోట ప్రాంత జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు  నిర్మించారు. తిరునాళ రథంపై గాంధీజీ ఫొటో వివాదం జరిగింది. క్రైస్తవం స్వీకరించిన మొదటి బ్రాహ్మణుడు మంగళగిరి వాడే. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత కూడా ఇది రాజకీయ చైతన్యం కలిగినటువంటి గడ్డ. మొదట్లో ఇక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువ. కాల క్రమంలో  కమ్యూనిస్టులు ఇక్కడ మసకబారిపోయారు.  మంగళగిరి ప్రజలు రాజకీయంగా ఎంత చైతన్యవంతులు అయినప్పటికీ, ఎన్ని విభేదాలు, గ్రూపులు ఉన్నప్పటికీ ఘర్షణలకు దిగేవారు కాదు. మహానటుడు ఎన్టీఆర్ ఇక్కడ ఉద్యోగం చేస్తే, ఆయన మనవడు నారా లోకేష్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఆరితేరిన రాజకీయ నేతగా ఎదుగుతున్నారు. లోకేష్ 2019 ఎన్నికల్లో ఓడి, 2024 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో రికార్డు సృష్టించారు. పచారి షాపులో గుమస్తాగా పనిచేస్తూ చదువుకున్న శిరందాసు లక్ష్మీనారాయణ ఐఏఎస్ అధికారి అయ్యారు.  పడుగులు చేస్తూ చదువుకున్న ఉడతా వెంకట బసవరావు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అయ్యారు.  మెగాస్టార్ చిరంజీవి తొలినాళ్లలో పాఠశాల విద్యను ఇక్కడే అభ్యసించారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఎయిమ్స్ ఆస్పత్రిని ఇక్కడే నిర్మించారు.  పైన రాసిన ప్రతి అంశాన్ని రచయిత  గోవర్థన రావు   దాదాపు ఏడాదిన్నరపాటు వివిధ గ్రంథాలను చదివి, చరిత్రకారులను కలిసి, చరిత్ర, శాసనాధారలతో  ఈ పుస్తకం రాశారు. గ్రామ పంచాయతీ నుంచి పంచాయతీ, ఫిర్కా, సమతి(సమితి), తాలూకా, మండలం, నియోజకవర్గం, పురపాలక సంఘం, కార్పోరేషన్ వరకు మంగళగిరి ఎదిగిన క్రమాన్ని ఎంతో చక్కగా వివరించారు. మంగళగిరి చేనేత కేంద్రంగా ఎలా ఎదిగిది? నిజాం బోర్డ్ చీర అంటే ఏమిటి? మంగళూరులో కట్టవలసిన రైల్వే స్టేషన్ మంగళగిరిలో ఎలా కట్టారు? పవర్ లిఫ్టింగ్ కేంద్రంగా ఎలా ఎదిగింది?.. వంటి విషయాలను ఇందులో చాలా పొందుపరిచారు. 544 పేజీల ఈ పుస్తకంలో ఎన్నో  ప్రత్యేకతలతోపాటు వింతలు, విశేషాలు, ఆసక్తికర అంశాలు చాలా ఉన్నాయి. ఇది మంగళగిరి చరిత్రే అయినా, దీనిని చదువుతుంటే, కాలానుగుణంగా తమ తమ గ్రామాలలో జరిగిన మార్పులు గుర్తుకు వస్తాయి. ఈ పుస్తకాన్ని ఇటీవలే మంగళగిరి శాసనసభ్యులు, విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. 

ఈ పుస్తకం ధర: రూ.490

కాపీల‌కు ఫోన్: 9440264336

                                  

            - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

మంగళగిరిపై పరిశోధన గ్రంథం

మంగళగిరి 2.0 పుస్తక సమీక్ష

గుంటూరు జిల్లా మంగళగిరి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది  చేనేత చీరలు, డ్రెస్ మెటీరియల్, శ్రీలక్ష్మీ నరశింహ స్వామితోపాటు 11 అంతస్తుల దేవాలయ గాలిగోపురం, కొండపైన పానకాల స్వామి.  మంగళగిరి చరిత్రతోపాటు చేనేత పరిశ్రమ విస్తరించడానికి కారణాలు, రంగుల ప్రత్యేకత, దేవాలయ విశిష్టత, బంగారు ఆభరణాల తయారి వంటి అన్ని అంశాలతో  ఈ నగరానికే  చెందిన న్యాయవాది మాదిరాజు గోవర్థన రావు ‘మంగళగిరి 2.0’ అనే పుస్తకం రాశారు. ఈ రచయితే, 2004లో ‘మన మంగళగిరి’ పేరుతో 176 పేజీలు పుస్తకం రాశారు. ఇప్పుడు రాజధాని అమరావతి ముఖద్వారంగా ఉంటూ, అందులో భాగంగా ఎదిగిన మంగళగిరి గురించి సమగ్రంగా 544 పేజీలతో దీనిని రూపొందించారు. 

మంగళగిరి అంటే చేనేత, చేనేత అంటే పద్మశాలీయులే. అందువల్ల ఈ పుస్తకంలో అత్యధిక మంది ప్రముఖుల పేర్లు పద్మశాలీయులవే ఉంటాయి. చేనేత పరిశ్రమ కొంత దెబ్బతిన్న సమయంలో   ఆ పద్మశాలీయులే స్వర్ణకార వృత్తిని ఎంచుకున్నారు.  ఇప్పుడు ఇక్కడ చేనేత కార్మికులను మించి  స్వర్ణకారులు వేల సంఖ్యలో ఉన్నారు.  బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమ బాగా  విస్తరించింది.  ఇక్కడి చేనేత వస్త్రాలు దేశవిదేశాలకు  ఎగుమతి అవుతున్నాయి. అలాగే, ఇక్కడ నైపుణ్యత గల స్వర్ణకారులు తయారుచేసే బంగారు ఆభరణాలు కూడా దేశంలోని  అన్ని రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.  అందువల్లే,  ప్రభుత్వం కూడా మంగళగిరిని చేనేత హబ్, గోల్డ్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పురాణ, ఇతిహాస కాలం నుంచి  సాంప్రదాయకంగా పద్మశాలీయులకు, దేవుడికి ఉన్న అనుబంధాన్ని కూడా రచయిత చారిత్రక ఆధారాలు, కోర్టు తీర్పులతో సహా  ఈ పుస్తకంలో   స్పష్టంగా వివరించారు. శాసనాల దగ్గర నుంచి పురాణ, చారిత్రక గ్రంథాలను  పరిశీలించి, పరిశోధించి, చరిత్రకారులను కలిసి పుట్టిన ఊరిపై మమకారంతో ఎంతో శ్రమించి మంగళగిరికి సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించారు. శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనంద గోత్రజులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యం, గోల్కొండ కుతుబ్ షాహీలు, ఫ్రెంచ్ వారు, ఆంగ్లేయులు,  స్వాతంత్య్రోద్యమం, మద్రాసు రాష్ట్రం, ఆంధ్రరాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌తో సహా అన్ని కాలాలలో మంగళగిరి ఎవరి పాలనలో ఎలా కొనసాగిందో  సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో చక్కగా వివరించారు. మంగళగిరిలో జరిగిన అనేక చారిత్రక సంఘటనలను అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అద్భుతంగా అందించారు. మంగళగిరికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చిన్న గ్రామం నుంచి పంచాయతీ, సమితి, మండలం, తాలూకా, మునిసిపాల్టీ, నగరం వరకు మంగళగిరి ఎదిగిన తీరుని, ఆయా కాలాలలో ఇక్కడ జరిగిన అనేక ఆసక్తికర సంఘటనలను చక్కగా తెలిపారు. 

విజయనగర సామ్రాజ్య స్థాపకులు హరిహరరాయలు, బుక్కరాయలు మంగళగిరి నుంచే వలస వెళ్లారు.  పూర్వ కాలంలో కూడా మంగళగిరికి సమీపంలో అమరావతి, కంతేరు, విజయపురి, కొండపల్లి ప్రాంతాలు రాజధానులుగా ఉండేవి. క్రీస్తు పూర్వం 225 నాటికే ఉనికిలో ఉన్నట్లు ఆధారాలు ఉన్న  చారిత్రక ప్రసిద్ధిగాంచిన పట్టణం ఇది. రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన 157 అడుగులు, 11 అంతస్తుల శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురాన్ని 1807-09 కాలంలో అప్పటి  ధరణికోట ప్రాంత జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు  నిర్మించారు. గాలిలో ఠీవిగా నిలబడినట్లు కనిపించే ఈ గాలిగోపురం మంగళగిరి వారసత్వ సంపద. ఈ దేవాలయంలో మూలవిరాట్‌ని ద్వారప యుగంలో పాండవులు అరణ్యవాస కాలంలో ధర్మారాజు ప్రతిష్ఠించారని చెబుతాను. భారీ ఎత్తున జరిగే మంగళగిరి తిరునాళ్లకు వందల ఏళ్ల చరిత్ర ఉంది.   రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది. దేశవిదేశీ యాత్రికులు ఈ ఆలయ సందర్శనకు వస్తుంటారు. నటసార్వభౌమ నందమూరి తారక రామారావు మొదట ఇక్కడే ఉద్యోగం చేశారు. మెగాస్టార్ చిరంజీవి (కొణిదెల శివప్రసాద్) ఇక్కడ కూడా చదివారు.  అన్నపూర్ణగా పేరుపొందిన కైవారం బాలాంబ ఆకలితో వచ్చిన వారందరికీ భోజనం పెట్టారు. ఇక్కడి కోర్టులో ఓ జడ్జి ఒకే రోజు 111 క్రిమినల్ కేసులను పరిష్కరించి జాతీయ రికార్డు సృష్టించారు. 1972లోనే   ఏపీఎస్పీ 6వ బెటాలియన్, 2018లో దక్షిణ భారతదేశంలోనే మొదటి ఎయిమ్స్‌ ఇక్కడ  ఏర్పాటు చేశారు. ఇలాంటి ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి.  ఇక్కడ మంచినీటి సమస్య వల్ల, దూరాన ఉన్న భావులలో నీరుతోడుకుని, మోసుకురావాలని  ఒకప్పుడు మంగళగిరి అంటే ఆడపిల్లని ఇచ్చేవారు కాదు. లోతైన బావులలో నీరు తోడటానికి బక్కెట్‌కు కట్టే తాడు చాలా పొడవైనది వాడటం వల్ల, పొడవు గురించి చేప్పే సమయంలో ‘మంగళగిరి చాంతాడంత’ అనేవారు. చాంతాడు అంటే చేద+తాడు. ఇప్పడు ఆ సమస్యలేదులేండి. కృడష్ణానీరు వస్తోంది. 

ఇక్కడ మొదటి నుంచి కాంగ్రెస్, కమ్మూనిస్టులు, బీజేపీ, జనసంఘ, తర్వాత బీజేపీ, భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం(యూసీసీఆర్‌ఐ–ఎంఎల్‌) పార్టీలు ఉన్నాయి. రాజకీయంగా చైతన్యవంతమైన గడ్డ ఇది. ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడ...’ అనే పాట రాసిని కమ్యూనిస్టు పోరాట యోధుడు వేములపల్లి శ్రీకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచిన నేల ఇది. ఇక్కడ ఆయా పార్టీలలో నేతల మధ్య విభేదాలు, గ్రూపులు ఉంటాయి. స్థానిక సంస్థల నుంచి లోక్ సభ వరకు ఎన్నికలలో  అభ్యర్థులు పోటాపోటీగా  నిలుస్తారు. అయితే, ఎవరూ హింసకు దిగరు. అదే మంగళగిరి ప్రత్యేకత.  కృష్ణా జిల్లా మాన్యువల్ ప్రకటించిన గోర్డన్ మెకంజి కూడా చారిత్రకంగా యుద్ధాల మధ్య కూడా మంగళగిరిలో శాంతికి భంగం కలగకుండా ప్రశాంతత కొనసాడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంగళగిరికి సంబంధించి వివిధ అంశాలను సుదీర్ఘ పరిశోధన చేసి 30 భాగాలుగా విభజించి రచయిత రాశారు. పాలనాపరంగా, రాజకీయంగా, సామాజికంగా ఎన్నో ఆసక్తికర అంశాలు ఇందులో ఉన్నందున, మంగళగిరి వారితోపాటు ఇతరులు కూడా చదవదగిన పుస్తకం. వినియోగదారుల ఉద్యమకారుడైన విశ్రాంత రైల్వే ఉద్యోగి మాదిరాజు గోవర్థన రావు  ప్రశాంతంగా జీవనం గడపవలసిన 70 ఏళ్ల వయసులో   తను పుట్టిన గడ్డపై ఉన్న మక్కువతో సుదీర్ఘ పరిశోధన చేసి, పుస్తకాల చదువరులు తగ్గిన ఈ రోజుల్లో  ఇంత ఖర్చుతో ఈ పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయం.  


పుస్తకం పేరు : మంగళగిరి 2.0

 వెల : రూ.490

కాపీల‌కు : 970198632

            - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914


May 15, 2025

పిట్టల దొరగా గంజి వెంకయ్య


పిట్టల దొర వేషం వేయడంలో మంగళగిరిలో  గంజి వెంకయ్య( గంజి చిరంజీవి తండ్రి) గారు టాప్.  మా ఇంటి ఎదరే వారు ఉండేవారు. నేను మామయ్య అనేవాడిని.    ఆయన ఆ వేషంలో మాటలు చెప్పడం నేను ఒకటి రెండుసార్లు మాత్రమే చూశాను.  ఆయన పక్కా సీపీఐ.  ప్రజానాట్యమండలి కళాకారులు.   తర్వాత తర్వాత ఆయన రెండు మగ్గాల షెడ్లకు మేస్త్రిగా, ఆ తర్వాత వస్త్ర వ్యాపారంలో బిజీ అయిపోవడంతో  ఆ కళకు పూర్తిగా దూరమైపోయారు.  పిట్లల దొరగా ఆయన ఏం చెబుతారో రాసుకుందామని, దానిని రికార్డు చేయాలని దీపాల సాయిబాబా చాలా ప్రయత్నించారు. దీపాల సాయిబాబా అంటే ఒకప్పుడు గంజి వెంకయ్యగారి బిల్డింగ్(మగ్గాల షెడ్)లో నేత నేసేవారు. భార్గవపేటలో ఉండేవారు.  ఆ తర్వాత ఆయన నేతాజీ హోటల్, తర్వాత అదే  ఉడిపి హోటల్ వద్ద కిల్లీ షాపు నడిపారు. వయసులో పెద్ద అయినా, నాకు మంచి మిత్రులు. గంజి వెంకయ్య గారి వద్దకు ఓ రోజు టేప్ రికార్డర్ తీసుకుని సాయిబాబా , నేను వెళ్లాం.  పిట్టల దొరగా ఏం చెబుతారో చెప్పమని సాయిబాబా అడిగారు.   ‘‘విడిగా చెప్పలేను. ఫ్లోలో చెప్పుకుంటూ పోతాను. రికార్డు చేసుకో’’ అని చెప్పారు. అప్పటికే ఆయనకు చాలా కాలం గ్యాప్ వచ్చింది. మధ్యమధ్యలో ఆపుకుంటూ, గుర్తు తెచ్చుకుంటూ చాలా సేపు చెప్పినట్లు గుర్తు. అప్పుడు రికార్డు చేశారు. అది ఉందో లేదో తెలియదు. పిట్టల దొర వేషంలో ఆయన చెప్పడం చాలా సరదాగా ఉండేది. నవ్వు ఆపుకోలేకపోయేవారం. స్థానిక సమస్యల నుంచి అంతర్జాతీయ సమస్య వరకు అన్నిటికి పరిష్కారాలు చెప్పేవారు. ఆయన కమ్యూనిస్టు అయినందున రష్యా, అమెరికాతో సహా చాలా విషయాలు ప్రస్తావించేవారు.  ఆయన చెప్పే తీరు, ఆయన భాషా శైలి కూడా నవ్వు తెప్పించేవిధంగా ఉండేది.  మంగళగిరి బుద్ధవిహార్ అధ్యక్షులు రేఖా క‌ృష్ణార్జున రావు గారు వాట్సాప్ గ్రూపులో  ఓ పిట్టల దొర ఈ ఫొటో పెట్టడంతో  నాకు మా గంజి వెంకయ్య మామ గుర్తుకు వచ్చారు.      ఇటువంటి కళలను ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, కళా సంస్థలు రికార్డ్ చేయాలని,  ఆ తర్వాత నాకు అనిపించింది.

క‌ృష్ణార్జున రావు గారు పెట్టిన ఫొటో 



May 12, 2025

మంగళగిరిలోనే చేనేత, గోల్డ్ హబ్‌‌లు ఎందుకు?

మంగళగిరి 2.0 పుస్తక సమీక్ష


గుంటూరు జిల్లా మంగళగిరి గురించి మనం తెలుసుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. మంగళగిరి అంటే  చేనేత పరిశ్రమ, బంగారు ఆభరణాలు, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, ఎత్తయిన గాలిగోపురం, తిరునాళ, కొండపైన పానకాల స్వామి, కొండ శిఖరాన గండాలయ దీపం.. అనేకం  గుర్తుకు వస్తాయి. క్రీస్తు పూర్వం 225 నాటికే ఉనికిలో ఉన్నట్లు ఆధారాలు ఉన్న  చారిత్రక ప్రసిద్ధిగాంచిన పట్టణం ఇది. ఆంధ్ర శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనందగోత్రిజులు,  విష్ణు కుండినులు, చాళుక్యులు, కాకతీయులు, ఢిల్లీ సుల్తానులు, రెడ్డి రాజులు, గజపతులు, శ్రీ కృష్ణదేవ రాయలు, కుతుబ్‌షాహీలు, ఆ తరువాత ఫ్రెంచ్, నిజాం, బ్రిటీష్ వారి పాలనలో మంగళగిరి ప్రాంతం ఉంది.  రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన 157 అడుగులు, 11 అంతస్తుల శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయ గాలిగోపురాన్ని 1807-09 కాలంలో అప్పటి  ధరణికోట  జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు  నిర్మించారు. ధరణికోట జమిందారు మంగళగిరిలో ఇంత పెద్ద గాలిగోపురం కట్టడం ఏమిటి? ఇది మంగళగిరికి ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఇటువంటి మంగళగిరి చరిత్రని 36 రచనలు చేసిన, చేయితిరిగిన రచయిత, న్యాయవాది  మాదిరాజు గోవర్థన రావు  సుదీర్ఘ పరిశోధన చేసి ఎన్నో అంశాలను కూలంకషంగా వివరిస్తూ ‘మంగళగిరి 2.0’ అనే పేరుతో పుస్తకం రాశారు. ఇటీవలే ఈ పుస్తకాన్ని విద్య, ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఇందులో మంగళగిరి గురించి చారిత్రకంగా, రాజకీయంగా, సామాజికంగా అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. చెన్నై-కోల్‌కత 16వ నెంబర్ జాతీయ రహదారిపైన గుంటూరు-విజయవాడ నగరాల మధ్యన ఉన్న ఓ గ్రామం కాల క్రమంలో నగరంగా ఎదిగిన క్రమాన్ని రచయిత చాలా చక్కగా వివరించారు. ఇక్కడ అత్యంత నైపుణ్యం గల చేనేత కార్మికులు, చేయితిరిగిన స్వర్ణకారులు, విద్యావంతులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు, క్రీడాకారులు అనేక మంది ఉన్నారు. చేనేత, దాని అనుబంధ వృత్తులు, వ్యాపారాలు, స్వర్ణకారులు ఇక్కడ 25 వేల మందికి పైగా ఉన్నారు. ఒక్క స్వర్ణకారులే 15 వేల మంది వరకు ఉంటారు. అందువల్లే ప్రభుత్వం మంగళగిరిని చేనేత, గోల్డ్ హబ్‌‌లుగా తిర్చిదిద్దుతోంది.  మంగళగిరికి సంబంధించిన  ఎన్నో చారిత్రక అంశాలను ఆధారలతోసహా రచయిత ఇందులో పొందుపరిచారు. పురాణలు, ఇతిహాసాలు, చారిత్రక గ్రంథాలను అధ్యయనం చేయడంతోపాటు చరిత్రకారులను, ఇతర అనేక మందిని కలిసి ఎంతో శ్రమించి గోవర్థన్ ఈ పుస్తకం రాశారు. పుస్తకాలకు కాలం చెల్లిందనుకుంటున్న రోజుల్లో సొంత ఊరిపై మక్కువతో ఆయన వ్యయప్రయాసలకోర్చి దీనిని తీసుకువచ్చారు.  

 

చేనేతకు ప్రసిద్ధి చెందిన నగరం అయినందున, ఆ వృత్తి, దాని అనుబంధ వృత్తులు చేసేవారందరూ పద్మశాలీ సామాజిక వర్గానికి చెందినవారే ఉంటారు. అందువల్ల మంగళగిరిలో  అత్యధిక మంది పద్మశాలీయులు, ఇతర చేనేత ఆ సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. ఇక్కడి విద్య సంస్థలు, వ్యాపారాలు, సినిమా హాళ్ల యాజమాన్యం... వంటివి వారి చేతిలోనే ఉంటాయి. రాజకీయాలు కూడా వారి చుట్టూనే తిరుగుతుంటాయి. ఇక్కడ నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా పద్మశాలీయులే గెలిచారు. ఇప్పటి వరకు ఇద్దరే ఎమ్మెల్సీలు అయ్యారు.  ఆ  ఇద్దరూ వారే. టీటీడీ బోర్డు సభ్యులుగా మంగళగిరి నుంచి ముగ్గురికి అవకాశం వచ్చింది. ఆ ముగ్గురూ పద్మశాలీయులే. మునిసిపల్ చైర్మన్లు కూడా అందరూ చేనేత వర్గంవారే. రచయితలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు.. కూడా వారే ఎక్కువగా ఉంటారు.  అలాగే, ఇక్కడి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం సందర్బంగా ముఖ్యమైన తంతు వారే నిర్వహిస్తారు.  బ్రహ్మాత్సవాలలో  స్వామివారి కళ్యాణం సందర్భంగా మెట్టెలు, మంగళసూత్రాలు, తలంబ్రాలు, మధుపర్కాలు, ఉత్తర జందెం  స్థానిక పద్మశాలీయులే సమర్పించే ఆచారం అనాదిగా కొనసాగుతోంది. అయితే,  1915లో అప్పటి దేవస్థానం ధర్మకర్త ఆ ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహరిస్తే, పద్మశాలీయులు కోర్టుకు వెళ్లి తమ హక్కుని సాధించుకున్నారు. అప్పటి నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ  సాంప్రదాయం అలాగే కొనసాగుతోంది.  ఇక్కడి చేనేత కార్మికులు అత్యంత నైపుణ్యంతో  చేనేత వస్త్రాలను తయారు చేస్తారు.  మంగళగిరి చేనేత కేంద్రంగా ఎదగడం, ఇక్కడి రంగుల ప్రత్యేకతలు, చేనేత వర్గం వారే స్వర్ణకారులుగా మారిన క్రమం ఇందులో వివరించారు. అతి సన్నని దారాలతో చేనేత వస్త్రాలను తయారు చేసే ఓర్పు, నైపుణ్యం వారికి ఉన్నందున, ఆ పరిశ్రమ దెబ్బతిన్న సమయంలో అంతే ఓర్పు, నైపుణ్యంతో చేసే బంగారు వస్తువుల తయారీలో వారు బాగా రాణించారు.   మంగళగిరి రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన నేల. ఎంతటి చైతన్యం ఉన్నా రాజకీయాలు శాంతియుతంగా నడపడం ఇక్కడి ప్రత్యేకత.  కాంగ్రెస్, జనసంఘ్, బీజేపీ, కమ్యూనీస్టులతోపాటు నాస్తిక, హేతువాద ఉద్యమాలు నడిచిన గడ్డ. ఇక్కడ ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువ. నాలుగు సార్లు వారే ఎమ్మెల్యేలుగా గెలిచారు.  వేములపల్లి శ్రీకృష్ణ  రెండు సార్లు గెలిచారు. విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకులైన హరిహరరాయలు, బుక్కరాయలు మంగళగిరి నుంచి వలస వెళ్లారు. మంగళగిరి కొండ, దేవాలయ విశిష్టత, ఆకలితో వచ్చిన అందరికీ 24X7-365 రోజులు భోజనం పెట్టిన  నిరతాన్నదాత్రి కైవారం బాలాంబ, మహానటుడు ఎన్టీఆర్ ఇక్కడ సబ్ రిజిస్ట్రార్‌ ఉద్యోగంలో చేరడం, ఆయన మనవడు లోకేష్  ఎమ్మెల్యేగా ఓడటం, గెలవడం, మెగాస్టార్ చిరంజీవి ఇక్కడ 2వ తరగతి  చదువుకోవడం, సీనీనటి జమున ఎన్నికలలో పోటీ చేయడం, రచయితలుగా, జర్నలిస్టులుగా కొలికపూడి బ్రదర్స్, శిరందాసు బ్రదర్స్ ఎదగడం, పూసపాటి నాగేశ్వరరావు, అందే నారాయణ స్వామి, ఏరోనాటికల్ ఇంజనీర్ నీలి రాజేంద్ర, రాయలసీమ యూనివర్సిటీ వీసీ ఉడతా వెంకట బసవ రావు వంటివారి గురించి,  మంగళగిరి రాజధానిలో భాగమైన తర్వాత ఐటీ పార్క్, ఎయిమ్స్‌ వంటివి   ఏర్పాటు కావడంతో ఏ విధంగా అభివృద్ధి చెందుతోంది... వంటి అన్ని అంశాలను ఆమూలాగ్రం  ఇందులో చోటు కల్పించారు.  మంగళగిరికి సంబంధించిన అన్ని అంశాలను 30 భాగాలు విభజించి,  544 పేజీలతో   సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో రచయిత గోవర్థన్ చక్కటి తెలుగులో  రాశారు. ఈ పుస్తకం చదివే పాఠకులకు తమ తమ గ్రామాలు అభివృద్ధి చెందిన క్రమం గుర్తుకు వస్తుంది. 


ఈ పుస్త‌కం వెల రూ.490

కాపీల‌కు ఫోన్: 9440264336

                                          - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

May 11, 2025

తెలంగాణలో ఉద్యోగులు, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ఆస్పత్రులు

తెలంగాణలో ఉద్యోగులు, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ఆస్పత్రులు

Name of the Hospital                               mitra name                   contact number
Virinchi Hospital                                      Sriranganayakulu          8125549618
Medivision eye Hospital                         Sriranganayakulu             8125549618
Gleneagles (global) Hospital, Lakdikapul. TRIVENI 7729827915
Vasavi hospital                                         Sujala                             8019253712
Omega Hospital, Bnjarahills                     Naresh                         9440368472
Basavatarakam Hospital                             sai kiran                     9381901115
Apollo medical college                             Anitha                         7702225689
Apollo spectra HOSPITAL , Ameerpet     Siva                             9392713606
Wellness Hospital, Ameerpet                     Siva                             9392713606
Landmark Hospital                                 Swathi                            9700013046
Asterprime Hospital                                 Siva                                9392713606
SLG hospital                                             Vijaya                             9502734771
mamatha medical college Swami nayak 9000053526
Archana Hospital Hanuman naik 7893735490
Global eye Hospital Anusha 8184920245
Madhava Nursing home Devender 8106870135
kotagiri dental Hospital, secundrabad Devender 8106870135
AP super speciality Dental Hospital, Banjarahills Tarun 7396202297
Vascular care center, Somajiguda Mastan 9603607981
Anand eye Hospital Arunasri 9381221973
Pushphagiri eye Hospital Sirichandana 9703760068
kamineni Hospital,kingkoti Praveen 8179025959
Kamineni Hospital, LB nagar Divyapriya 9281068618
Kims BIBI Renova Hospital Kotaiah 7995707521
Century Renova Hospital Neelima 7780650432
Kamala tahalasemia Hospital Prabhuraj 9885187713
Mahaveer hospital Afjul begum 9160076663
MNJ cancer Hospital jakkiraiah 9959811024
Malla reddy Narayana Hospital padma 9087960841
Ramdev Rao Hospital Saba anjum 8801234223
Redcross Hospital Hemalatha 9866744618
Sri sri Holistic Hospital sulochala 9550888363
Prathima Hospital,KPHB Rajitha 9949321475
TX Hospital, uppal Manasa 6305661627
Durgabhai deshmuk Hospital Aparna 7995615451


May 5, 2025

బౌద్ధం విలసిల్లిన నేల

12న మంగళగిరిలో  2,569వ బుద్ధ జయంతి వేడుకలు


మానసిక ప్రశాంతత, మానవతా విలువలతో కూడిన ఉత్తమ పౌరుడిని తయారుచేయడమే బౌద్ధం ప్రధాన లక్షణం. క్రీస్తు పూర్వం 400 నుంచి 600 వరకు మంగళగిరి, అమరావతి ప్రాంతంలో బౌద్ధం విలసిల్లింది. కృష్ణానదీ తీరంలో బౌద్ధం పరిఢవిల్లింది.   పురాతన బౌద్ధ ఆరామాల ఆనవాళ్లు ఇప్పటికీ మంగళగిరి ప్రాంతం ఎర్రబాలెం కొండపై ఉన్నాయి. నిడమర్రులో బుద్ధుని విగ్రహాలు బయటపడ్డాయి. ఆరామాలు, విగ్రహాలకంటే బౌద్ధ భావజాలం ముఖ్యం. మన సమాజంలో వివిధ రూపాలలో బౌద్ధ భావజాలం అంతర్లీనంగా కొనసాగుతోంది. అందవల్లే పక్కన పల్నాడుకంటే ఈ ప్రాంతవాసులు శాంతికాముఖులుగా ఉంటారు.   ఈ ప్రాంతంలో నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు, మానవతావాదులు.. వంటి వారు కూడా బుద్ధుడి బోధనలకు ప్రాధాన్యత ఇచ్చారు. బౌద్ధం పరంగా ఈ ప్రాంత ప్రాధాన్యతను గుర్తించి  బౌద్ధ గురువు దలైలామా  2006లో అమరావతిలో పెద్ద ఎత్తున ‘కాలచక్ర’ ఉత్సవాలు నిర్వహించారు. బౌద్ధ భావజాలాన్ని ఔపోసన పట్టిన ఉత్తమ మానవుడు  రేఖా కృష్ణార్జున రావు 25 సంవత్సరాల క్రితం మంగళగిరిలో బుద్ధ విహార్‌ని ఏర్పాటు చేశారు. మంగళగిరి బుద్ధ విహార్‌ అధ్యక్షులుగా, ఆ భావజాలానికి దగ్గరగా ఉన్న వివిధ వర్గాలకు చెందిన అనేక మందిని సభ్యులుగా చేర్పించారు.  బుద్ధుని బోధనలకు విశేష ప్రాచుర్యం కల్పించారు. ఎంతో శ్రమకోర్చి, ఆర్థిక భారం భరిస్తూ ‘బుద్ధభూమి’ మాస పత్రికను దీర్ఘకాలంగా తీసుకువస్తున్నారు. మానవతా విలువలు కలిగిన శాంతియుత సమాజాన్ని సృష్టించాలన్నదే ఆ ఉత్తమ మానవుడు  కృష్ణార్జున రావు లక్ష్యం.  మంగళగిరి బుద్ధ విహార్ ఆధ్వర్యంలో బౌద్ధ అభిమానులను సమీకరించి, దేశంలోని బౌద్ధ కేంద్రాలను పర్యటిస్తుంటారు. బుద్ధ విహార్‌ ఆధ్వర్యంలో బుద్ధుని జన్మదిన వేడుకలు, బౌద్ధ బోధనలు, యోగా, బౌద్ధ భావజాలంపై అవగాహన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు.. వంటివి వందల సంఖ్యలో నిర్వహించారు.  మనవతావాది  కృష్ణార్జున రావు సారథ్యంలో బుద్ధ జయంతి(పూర్ణిమ) వేడుకలు 22 ఏళ్లపాటు ఘనంగా జరిగాయి. బౌద్ధంతోపాటు మానవ సంబంధాల విలువను ఆయన నుంచి నేర్చుకున్న అభ్యుదయ రచయిత, మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు, వేదిక ఇతర బాధ్యులు ఆ తర్వాత నుంచి బుద్ధ పూర్ణిమ వేడుకలను కొనసాగిస్తున్నారు.    రేఖా కృష్ణార్జున రావు అమూల్యమైన  సలహాలు, సూచనలు, సహాయ సహకారాలతో మానవతా వేదిక ఆధ్వర్యంలో ఈ ఏడాది  2,569వ బుద్ధ జయంతి వేడుకలు, మంగళగిరిలో బుద్ధపూర్ణిమ రజతోత్సవ వేడుకలు  ఘనంగా నిర్వహించతలపెట్టారు.  ఈ వేడుకలు ఈ నెల 12న  మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని నన్నపనేని నాగేశ్వరరావుకు చెందిన రాయల్ ఏసీ మెగా ఫంక్షన్ హాలులో జరుగుతాయి. ఈ వేడుకలు నిర్వహిస్తున్న మంగళగిరి బుద్ధి విహార్, మానవతా వేదిక వారికి అభినందనలు. ఈ వేడుకలకు మానవతావాదులందరూ హాజరుకావలసిందిగా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాను. 


శిరందాసు నాగార్జున రావు, సీనియర్ జర్నలిస్ట్.


May 2, 2025

ఎడిటోరియల్ పేజీ వ్యాస రచయితలకు గౌరవం

ఏపీ ఫెరా మాజీ చైర్మన్ డాక్టర్ రామనాధ్ వెలమాటి, ఎన్ఆర్ఐ శేషుల నుంచి మొమోంటో అందుకుంటున్న సీనియర్ జర్నలిస్ట్ శిరందాసు నాగార్జున రావు. పక్కన వరుసగా రేపటి కోసం ఎడిటర్ శాఖమూరి శివప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ మిక్కిలినేని శ్రీకాంత్, కాలం రైటర్ బొల్లాప్రగడ శ్రీదేవి.
-----------------------------------------------------------------------------------------------------------------

మేడే సాయంత్రం గుంటూరు LVR Club Convention Hallలో ‘రేపటి కోసం’ దినపత్రిక 7వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిధులు, వారి విలేకరులతోపాటు ఆ పత్రిక ఎడిటోరియల్ పేజీకి వ్యాసాలు రాసిన వారికి కూడా  మొమోంటోలు ఇచ్చి గౌరవించారు.  అదీ ఈ వార్షికోత్సవ ప్రత్యేకత.   ఈ వార్షికోత్సవంలో ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర, శాసనసభ్యురాలు గల్లా మాధవి, ఏపీ ఫెరా మాజీ చైర్మన్ డాక్టర్ రామనాధ్ వెలమాటి, లెడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాల రావు,ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, ఎన్ఆర్ఐ శేషు హాజరయ్యారు. 

నా మొదటి వ్యాసం 1984లో తెలుగు విద్యార్థి మాస పత్రికలో అచ్చయింది. అప్పుడు వారు ఆ పత్రిక కాపీని మా ఇంటికి పోస్ట్ చేశారు. అదే ఏడాది నేను రాసిన మరో వ్యాసం ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో వచ్చింది.  వారు రూ.50 రూపాయలు ఎంఓ చేశారు. అలా కొందరు ఎంతోకొంత ఇచ్చేవారు. సాక్షి పెట్టిన కొత్తలో చాలా కాలం వ్యాసానికి రెండు వేల రూపాయలు ఇచ్చేవారు. ఇటీవల కాలంలో ఆ సాంప్రదాయం అంతా పోయింది.   ఒక్క ఈనాడు మాత్రమే అలా ఇస్తున్నట్లుంది.  నేను ఈనాడు తప్ప దాదాపు అన్ని పత్రికల ఎడిటోరియల్ పేజీలకు వ్యాసాలు రాస్తుంటాను. డబ్బు ఎవ్వరూ ఇవ్వడంలేదు. సూర్య వారు  కేవీఎస్ సుబ్రహ్మణ్యం గారు బాధ్యులుగా ఉన్నప్పుడు మాత్రం డబ్బు పంపారు. ఇటీవల కాలంలో విశాలాంధ్ర వారు వ్యాసం ప్రచురించిన కాపీని పోస్టులో పంపేవారు.  ఇలాంటి పరిస్థితుల్లో ‘రేపటి కోసం’ యాజమాన్యం వారు వ్యాసాలు రాసిన వారిని పిలిచి మరీ గౌరవించడం సంతోషంగా ఉంది. వ్యాస రచయితలను కూడా గౌరవించినందుకు ధన్యవాదాలు.  


ఈ పత్రికతో నాకు చాలా కాలం నుంచి అనుబంధం ఉంది. దీనిని రిటైర్డ్ డీఎస్పీ బొప్పన విజయకుమార్ గారు దీనిని మాస పత్రికగా ప్రారంభించారు. దీనిని చాలా కాలం కమిలిశ్రీ గారు చూసేవారు. వీరిద్దరూ నాకు మంచి మిత్రులే.   అప్పట్లో విజయకుమార్ గారు అడిగితే,  ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తారు? దాని వల్ల కలిగే ప్రయోజనాలు, ఆ హోదా కలిగిన రాష్ట్రాలకు సంబంధించి అధ్యయనం చేసి వరసగా కొన్ని వ్యాసాలు రాసి ఇచ్చాను. ప్రచురించారు.  విజయకుమార్ గారి ఆరోగ్యం దెబ్బతినడంతో  మిక్కిలినేని శ్రీకాంత్ గారు దానిని ఏడాది నుంచి పెద్ద ఎత్తున దినపత్రికగా తీసుకువస్తున్నారు. డిజటల్ ఎడిషన్‌తోపాటు  దాదాపు ఏడు జిల్లాల్లో ఇది ప్రింట్ ఎడిషన్‌గా కూడా వస్తోంది. ఇప్పుడు దీనికి ఎడిటర్ శాఖమూరి శివప్రసాద్ గారు, మరో బాధ్యులుగా గుంటూరు చంద్రశేఖర్‌గారు ఉన్నారు. వీరితోపాటు ఆ పత్రిక బ్యూరో చీఫ్ మల్లికార్జున రావు గారు, సచివాలయ రిపోర్టర్ మల్లికార్జున తదితరులు కూడా నాకు మంచి మిత్రులే. చంద్రశేఖర్‌ గారు నాకంటే చాలా సీనియర్.నేను విశాఖ సిటీ డెస్క్ ఇన్ చార్జిగా చేసే సమయంలో ఆయన ఎడిషన్ ఇన్ చార్జిగా ఉండేవారు. 

                                                                                                       - శిరందాసు నాగార్జున