Feb 26, 2024
Feb 18, 2024
డయాబెటిస్ వారికి 11 ఉత్తమ ఆహారాలు
డయాబెటిస్ ఉన్నవారు వ్యాయామం, రెగ్యులర్ మెడికల్ చెక్-అప్స్, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) ఉన్న ఆహారాన్నితీసుకోవాలి.గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒక వ్యక్తి రక్తంలో చక్కెర స్థాయిలో ఆహారం ప్రభావం గురించి చెప్పే సంఖ్య. ఇది 0 నుండి 100 మధ్య స్కేల్ కలిగి ఉంది. 100 కు ఉదాహరణ స్వచ్ఛమైన గ్లూకోజ్. తక్కువ GI ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచవు. అధిక GI ఆహారాలు చక్కెర స్థాయిలలో తక్షణ పెంచుతాయి. 50 కన్నా తక్కువ GI విలువ తక్కువగా పరిగణిస్తారు. 50 ‐60 మధ్య GI విలువ సగటుగా పరిగణిస్తారు. 60 పైన జిఐ విలువ ఎక్కువ.
1. శనగలుChickpeas (Kabuli Channa): శనగలను ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది చక్కెర స్థాయిలలో వచ్చే చిక్కులను నివారించడానికి సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు గొప్ప ఎంపిక.
2. బీన్స్ Beans:అలసందలు, సోయాబీన్స్, చిక్కుడు, రాజ్మా, బఠాణీ వంటి అన్ని రకాల బీన్స్- కార్బోహైడ్రేట్లు, లీన్ ప్రోటీన్, ఫైబర్ గొప్ప వనరుగా పనిచేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బీన్స్ ని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది.
3. బ్రోకలీ Broccoli: బ్రోకలీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఫైబర్ అధికంగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న బ్రోకలీతో పాటు బచ్చలికూర వంటి ఇతర ఆకుకూరలు చక్కెర స్థాయిలను సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాయి,.
4. గోధుమ బ్రెడ్ Whole Grain Bread: ఇది మానవ శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. Whole Grain Bread శోషణ, జీర్ణక్రియకు మంచిది.
5. వోట్మీల్ Oatmeal;ఓట్మీల్ కరిగే ఫైబర్ గొప్ప మూలంగా పనిచేస్తుంది.కడుపులోని ఆహారం నుండి గ్లూకోజ్ శోషణను తగ్గిస్తుంది. ఇది మిమ్మల్ని ఎక్కువ గంటలు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. మంచి అల్పాహారం ఎంపికగా పరిగణిస్తారు.
6. యాపిల్స్ : రోజుకు ఒక ఆపిల్ వైద్యుడిని దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఆపిల్ అనేక విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉండే గొప్ప మూలం. ప్రతిరోజూ ఒక ఆపిల్‌ను తినాలి. అది తక్కువ GI పోషకాలతో నిండి ఉంటుంది. ఇతర తక్కువ GI పండ్లలో స్ట్రాబెర్రీ, బ్లాక్ జామున్, ఆరెంజ్ మొదలైనవి ఉన్నాయి.
జామ, బొప్పాయ, నేరేడు పండ్లు తినవచ్చు.
అరటి, మామిడి వంటి పండ్లు అధిక GI పండ్లు. అటువంటి పండ్లను మితంగా తినాలి.
7. కాకరకాయ Bitter Gourd: రుచిలో చేదు, అయితే కాకరకాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. డయాబెటిస్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడే మూడు క్రియాశీల యాంటీ డయాబెటిక్ సమ్మేళనాలు ఇందులో ఉన్నాయి. కాకరకాయలో కనిపించే చారంతిన్ అనే సమ్మేళనం గ్లూకోజ్ స్థాయిలను తక్కువగా, చక్కెరను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.
8. కోడి గుడ్లు రోజుకు ఆరు వరకు తినవచ్చు. నాన్ వెజ్ ఏదైనా ఓ కప్పు తినవచ్చు. సుగర్ ఉన్నవారికి ఉల్లిపాయలు ఓ వరం.
9. పాలకూరతోపాటు అన్ని రకాల ఆకు కూరలు. కాయగూరలు దోస, కీరదోస... వంటివి తినగలిగినవి ఎన్నైనా తినవచ్చు. దంపుడు బియ్యం (బ్రౌన్ రైస్) ఉత్తమం. అన్నం తక్కువ, కూరలు ఎక్కువ తినాలి.
10.అన్ని రకాల చిరుధాన్యాలతో తయారు చేసే పిండితో చేసిన రొట్టెలు మంచివి. ప్రతి రోజూ ఓ స్పూన్ మెంతుపొడి తింటే మంచిది.
11. నట్స్, dark chocolate
Jan 13, 2024
మలబద్ధకం - చికిత్స
11 చిట్కాలు
మలబద్ధకం అంటే ఒక వ్యక్తికి మలవిసర్జన అవడం చాలా కష్టం కావటం. ప్రాసెస్ చేయబడిన మరియు శుద్ధి చేసిన ఆహారపు అలవాట్లు పెరగడంతో, మలబద్ధకం కూడా ప్రబలమైన సమస్యగా మారుతోంది. ఆహారం పెద్ద ప్రేగు గుండా వెళుతుంది, ఇక్కడ నీటిలో ఎక్కువ భాగం గ్రహించి మలం ఏర్పడుతుంది. ఇది శరీరం నుండి బహిష్కరించబడుతుంది మరియు మలబద్ధకం ఉంటే, ఈ మలం బయటకు వెళ్ళడం కష్టం, బాధాకరమైనది మరియు రక్తస్రావం కూడా కావచ్చు.
పిల్లలతో పాటు వృద్ధులలో మలబద్ధకం సాధారణం. పెద్దలతో పోలిస్తే పిల్లలు చాలా ఎక్కువ జంక్ ఫుడ్ తింటారు. వయస్సు పెరిగేకొద్దీ, పెద్దలు దంతాలు కోల్పోవడం ప్రారంభిస్తారు మరియు వారు తక్కువ నమలడం వల్ల అజీర్ణం మరియు మలబద్దకానికి దారితీస్తుంది. ఫైబర్, నీరు, కెఫిన్ మొదలైన అన్ని అంశాలతో సహా ఆహారo లో మార్పుల కలయిక మలబద్దకాన్ని సమర్థవంతంగా చికిత్స చేయడంలో సహాయపడుతుంది.
1. ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగటం మంచిది. దీనికి కొంచెం బేకింగ్ సోడా జోడించండి, ఇది ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది.
2. ఉదయాన్నే ప్రేగు కదలికలను ప్రేరేపించడానికి అల్లం టీ మరొక గొప్ప నివారణ.
3. కొద్దిగా తేనె లేదా చక్కెరతో ఒక గ్లాసు వెచ్చని పాలు మలబద్దకానికి మంచి ఔ షధంగా చెప్పవచ్చు.
4. సునాముఖి ఆకు పొడి మలబద్ధకాన్ని నివారిస్తుంది. గోరువెచ్చని నీటిలో ఈ ఆకు పొడిని కలిపి తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
5. నిద్రపోయేటప్పుడు నాభిపై కొన్ని చుక్కల గోరువెచ్చని ఆముదపు నూనెను పూయడం వల్ల ఉదయాన్నే మలం తేలికగా బయటకు పోతుంది.
6. జామ, నారింజ, ద్రాక్ష, బొప్పాయి, ఆపిల్, అరటి తదితర పండ్లు మలం సులభంగా బయటకు వెళ్ళడానికి సహాయపడతాయి.
7. మలబద్ధకం చికిత్సలో ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ లేదా బొప్పాయి రసం చాలా ఉపయోగపడుతుంది.
8. మలబద్దకం రాకుండా ఉండటానికి సుమారు 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగాలి..
9. అధిక కొవ్వు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, కెఫిన్ మలబద్దకానికి ప్రధాన కారణాలు. అందువల్ల వాటిని తీసుకోకూడదు.
10. త్రిఫల సూర్ణంను వెచ్చని నీటితో కలిపి తీసుకుంటే మలబద్దకాన్ని నివారించవచ్చు. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ పరాన్నజీవి లక్షణాలను కలిగి ఉంది. ఇది పెద్దప్రేగు మొత్తం ప్రక్షాళనకు సహాయపడుతుంది.
11. పావన ముక్తసనం, యోగా ముద్ర, ధనూర్ ఆసనం, వజ్రాసనం వంటి యోగాసనాలు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. వీటి ద్వారా పేరుకుపోయిన వాయువును విడుదల చేయడం, మలం బయటకు వెళ్ళడం జరుగుతుంది.
ఈ చిట్కాలను అనుసరించడం తో పాటు మలబద్ధకం నుండి దీర్ఘకాలిక నివారణను అందించడంలో ఆహారం, జీవనశైలి క్రమశిక్షణ చాలా ప్రభావవంతంగా ఉంటుంది.తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఆకు కూరలు తీసుకోవడం మంచిది.
Jan 3, 2024
జాతి రత్నం సావిత్రిబాయి పూలే
మూఢవిశ్వాసాలతో ఛాందస మత గ్రంథాల నిర్బంధాల మధ్య స్త్రీ కి విద్య అవసరం లేదంటూ నిర్బంధాలు విధించిన ఛాందసవాదుల ను ఎదిరించి తానే విద్యకు శ్రీకారం చుట్టి భారతదేశ తొలి ఉపాధ్యయునిగా ఎంపికై భారత దేశ వ్యాప్తంగా విద్యను స్త్రీలకు అందించిన భారతదేశ జాతిరత్నం సావిత్రిబాయి పూలే అని ప్రముఖవైద్యులు కే వి ఎస్ సాయి ప్రసాద్ అన్నారు.. ది 3-1- 2024 బుధవారం ఉదయం పాత మంగళగిరి పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు కళానిలయంలో మంగళగిరి సాహితీ కళావేదిక ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటైన తొలి భారతీయ ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే 193 వ జయంతి సందర్భంగా మంగళగిరి సాహితీ కళా వేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు . 190 సంవత్సరాలకు పూర్వం ఆనాటి మత దురంకారులతో అనేక అవమానాలు గురైనా.. మొక్కవోని ధైర్యంతో స్త్రీలు ఎందుకు విద్యను అభ్యసించకూడదు అంటూ తానే విద్యను నేర్చుకుని ఉపాధ్యాయురాలుగా స్త్రీ విద్య వ్యాప్తికి శ్రీకారం చుట్టారన్నారు. నేటి స్త్రీ అభ్యున్నతికి సావిత్రిబాయి పూలే ఆదర్శమన్నారు... కానీ నేడు విద్య వింత పొగడలు పోతోందని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటూ ప్రజలకు విద్యను దూరం చేయాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి సమయంలో సావిత్రిబాయి పూలే ఆశయాలు స్ఫూర్తినిస్తాయన్నారు.
మంగళగిరి సాహితీ కళావేదిక కో కన్వీనర్ రేఖా కృష్ణార్జున్ రావు మాట్లాడుతూ నాటి దుర్భర పరిస్థితుల్లో సావిత్రిబాయి పోరాటాన్ని వివరిస్తూ వర్తమానంలోనే దుస్థితికి చైతన్య లోపమే కారణం అని దీనిని మనం అధిగమించాలన్నారు.నవ యువ కవి గోలి మధు మాట్లాడుతూ విద్యా ప్రాధాన్యతను గుర్తించి ప్రతి మహిళ విద్యా వంతురాలు కావాలని ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న ఆమె చేసిన, నేడు బ్రష్టు పట్టిన కార్పొరేట్ విధానానికి వ్యత్యాసాన్ని గుర్తించి ఈ పరిస్థితులు మారాలన్నారు. బుద్ధభూమి మాస పత్రిక వర్కింగ్ ఎడిటర్ గోలి సీతారామయ్య ప్రసంగిస్తూ సావిత్రిబాయిపూలే సేవలను తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన వారి కృషి గొప్పదని అన్నారు.కార్యక్రమంలో ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి డాక్టర్ సాయి ప్రసాద్ , ప్రముఖులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శిరందాసు నాగార్జున, అవ్వారు శ్రీనివాసరావు,సందుపట్ల భూపతి, ఆకురాతి రత్నరావు, మహమ్మద్ యూసఫ్, జొన్నాదుల నాగమల్లేశ్వరరావు, చిలక వెంకటేశ్వరరావు, కంచర్ల క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
పీఎఫ్ ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తున్నాం
ప్రాంతీయ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్
గుంటూరు, జనవరి 2: ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) ఖాతాదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నట్లు గుంటూరు ప్రాంతీయ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ తెలిపారు. ఖాతాదారులు కార్యాలయానికి రాకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా సమస్యలను పరిష్కరించుకొనే విధంగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకొచ్చినట్లు చెప్పారు. బృందావన్గార్డెన్స్ పి ఎఫ్ కార్యాలయంలో మంగళవారం జర్నలిస్టులు, ఖాతాదారులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమం లో ఆయన ప్రసంగించారు. ఖాతాదారులకు ఇ-మెయిల్, ఎక్స్, కుకు., వాట్సాప్ 9494657469 వంటి ప్రచారసాధనాలు, గ్రీవెన్స్సెల్ ద్వారా సేవలందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు ప్రతినెల 15వతేదీ లోపు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగి, కార్మికుల జీతాల నుంచి మినహాయించిన సొమ్ముతోపాటు తమ వాటా ధనాన్ని కూడా పిఎఫ్ కార్యాలయానికి జమ చేయాలన్నారు. దీనిలో ఎవరికి మినహాయింపు లేదన్నారు. చెల్లింపులు ఆలస్యమైతే 33 నుంచి వంద శాతం జరిమానా, 12 శాతం వడ్డీ వసూలు చేస్తామని, కొన్ని సందర్భాలలో శిక్షలు విధిస్తామని ప్రాంతీయ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ హెచ్చరించారు. అసిస్టెంట్ కమిషనర్ జెఆర్ మాధవ శంకర్ మాట్లాడుతూ కనీసం 20 మంది సిబ్బంది పనిచేసే సంస్థలు పిఎఫ్ పరిధిలోకొస్తాయన్నారు. నెలకు రూ. 15 వేల పైన వేతనం పొందే కార్మికుడు, ఉద్యోగి బేసిక్, డిఎ మొత్తంపై యజమాని నుంచి షేర్ధనం పొందిన వారికి హయ్యర్ (అధిక) పెన్షన్ మార్గదర్శకాలు వర్తిస్తాయన్నారు. ఒకవేళ పెన్షనర్ అకాల మరణం చెందితే వారి జీవిత భాగస్వామికి జీవితాంతం కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ లభిస్తుందని తెలిపారు.
టెలికం జిల్లా సలహా కమిటీ సభ్యుడు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో పత్రికల్లో పనిచేస్తున్న 58 ఏళ్ళు నిండిన వారు సత్వరమే పెన్షన్ పొందటానికి పిఎఫ్ సిబ్బంది సహకరించాల న్నారు. ఈ సందర్భంగా కమిషనర్, సహాయ కమిషనర్లను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కె శరచ్చంద్రజ్యోతిశ్రీ, కందిమళ్ళ వెంకట్రావు, శిరందాసు నాగార్జున, షేక్ రాజా తదితరులు పాల్గొన్నారు.
Dec 17, 2023
తెలంగాణ ప్రభుత్వానికి కొత్త పథకం తెచ్చిన తంటా!
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఓ కొత్త పథకం పెద్ద తంటా తెచ్చిపెట్టింది. ప్రభుత్వ పథకాల వల్ల ఎక్కువ మంది లబ్ధిపొందుతారు. సాధారణంగా ఆ పథకం పరిధిలోకి రానివారు కొందరు ఈర్ష్యపడుతుంటారు. అంతేగానీ, ఎవరూ నష్టపోరు. అయితే, ఈ పథకం ఒక వర్గానికి తీవ్ర నష్టం కలిగించింది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో భాగంగా ‘మహాలక్ష్మి పథకం’ ప్రకటించింది. ఇందులో తెలంగాణ మహాలక్ష్మి ఆర్థిక సహాయ పథకం, తెలంగాణ మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం, తెలంగాణ మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మూడు ఉన్నాయి. అందులో మొదటగా ‘ఉచిత బస్సు ప్రయాణ పథకం’ని ఈ నెల 9న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మహిళలు అత్యంత ఆనందం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం నొలబెట్టుకుందన్నారు. ఈ పథకం ద్వారా బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్స్ అందరూ తెలంగాణ అంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ పథకాన్ని 7,290 బస్సులకు వర్తింపజేస్తున్నారు. దీనికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎక్కువ మంది బస్సులు మాత్రమే ఎక్కుతున్నారు. మెట్రో రైళ్లు, ఆటోలు ఎక్కేవారు బాగా తగ్గిపోయారు. దీంతో, బస్సులన్నీ మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం గురించి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ప్రతిరోజూ టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. మహాలక్ష్మి పథకం వల్ల బస్సుల ఆక్యుపెన్సీ పెరుగుతుందన్నారు. ఈ నెల 11వ తేదీ కార్తీక సోమవారం కావడంతో రికార్డు స్థాయిలో 50 లక్షల మందికి పైగా ప్రయాణించినట్లు ఆర్టీసీ ఆపరేషన్ ఈడీ మునిశేఖర్ చెప్పారు. ఈ పథకం వల్ల మహిళా ప్రయాణికుల సంఖ్య ఏడాదికి 40 శాతం నుంచి 55 శాతానికి పెరుగుతుందని అంచనా.
ఇంతవరకు బాగానే ఉంది. మహిళలందరూ బస్సులు ఎక్కడం వల్ల ఆటోలు ఎక్కే మహిళలు లేరు.రాష్ట్రం అంతటా ఇదే సమస్య. ఈ పథకం వల్ల తాము ఉపాధి పోయి వీధినపడుతున్నామని ఆటోడ్రైవర్లు ఆందోళనకు దిగారు. మహిళలందరూ ఆర్టీసీ బస్సులు ఎక్కితే, ఎన్నో ఏళ్లుగా ఆటోలనే నమ్ముకున్న తాము బతికేదెలా అని వారు ప్రశ్నిస్తున్నారు. తాము కుటుంబాలతో సహా రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వారు వాపోతున్నారు. ఈ పథకం మహిళలకు మంచిదైనా, తమకు కష్టాలు తెచ్చిపెట్టిందని గగ్గోలు పెడుతున్నారు. ఆటో డ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షలకు పైగా ఉంటారని ఒక అంచనా. తమ ఇళ్ల అద్దెలు, పిల్లల చదువులకు ఫీజులు ఎలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ముందు విద్యార్థుల బలిదానాలు జరిగాయని, ఇప్పుడు ఆటోడ్రైవర్ల బలిదానాలు జరగాలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ధర్నాలు నిర్వహించారు. మహాలక్ష్మి పథకం రద్దుపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే డ్రైవర్లపై ఉన్న అన్ని రకాల ట్యాక్స్ లను రద్దుచేసి, తమకు ప్రతి నెలా రూ.20వేలు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ఆటో రిక్షా కోసం రోజుకు రూ.400 అద్దె చెల్లించాలని, డీజీల్/పెట్రోల్ కోసం మరో రూ.400 ఖర్చు చేస్తున్నామని, ఇప్పుడు తమ సంపాదన పడిపోయిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పథకం వల్ల ఎన్నడూ లేని మరో సమస్య వచ్చి పడింది. ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు కొన్ని సీట్లు కేటాయించాలని పురుషులు డిమాండ్ చేస్తున్నారు. ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల మహిళలతో బస్సులు నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్మూర్‌లో వాసు అనే వ్యక్తి బస్సు ముందు నిలబడి పురుషులకు కూడా కొన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశాడు.
ఆటోడ్రైవర్ల సమ్మె హెచ్చరిక
మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని స్వాగతిస్తున్నామని, అయితే, తమను అన్ని రకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర డ్రైవర్ల సంఘాల జేఏసీ కన్వీనర్ బి.వెంకటేశం, కో-కన్వీనర్లు వి.కిరణ్, బి.శ్రీకాంత్ తదితరులు డిమాండ్ చేశారు.కర్నాటకలో మాదిరిగా ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. వాహన రంగ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే త్వరలో నిరవధిక సమ్మెకు దిగుతామని ఆటో డ్రైవర్లు హెచ్చరించారు. ఆటో డ్రైవర్ల సమస్యపై ప్రముఖ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. ‘‘ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉంది వారి గురించి ఏదైనా ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి’’ అని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆటోడ్రైవర్ల సమస్యను పరిశీలించి, వారిని ఆదుకొనవలసిన అవసరం ఉంది.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914
Nov 9, 2023
తెలుగు సమాచారం
దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం
మూలలు :(1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం
వేదాలు :(1) ఋగ్వే దం,
(2) యజుర్వేదం,(3) సామవేదం,
(4) అదర్వణ వేదం
పురుషార్ధాలు :(1) ధర్మ, (2) అర్థ,
(3) కామ,(4) మోక్షా
పంచభూతాలు :(1) గాలి, (2) నీరు,
(3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని.
పంచేంద్రియాలు : (1) కన్ను,
(2) ముక్కు, (3) చెవి, (4) నాలుక,
(5) చర్మం.
లలిత కళలు :
(1) కవిత్వం, (2) చిత్రలేఖనం, (3) నాట్యం,
(4) సంగీతం, (5) శిల్పం.
పంచగంగలు : (1) గంగ, (2) కృష్ణ,
(3) గోదావరి, (4) కావేరి, (5) తుంగభద్ర.
దేవతావృక్షాలు : (1) మందారం,
(2) పారిజాతం, (3) కల్పవృక్షం,
(4) సంతానం, (5) హరిచందనం.
పంచోపచారాలు : (1) స్నానం,
(2) పూజ, (3) నైవేద్యం,
(4) ప్రదక్షిణం, )5) నమస్కారం.
పంచామృతాలు : (1) ఆవుపాలు,
(2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర,
(5) తేనె.
పంచలోహాలు : (1) బంగారం,
(2) వెండి, (3) రాగి,
(4) సీసం, (5) తగరం.
పంచారామాలు : )1) అమరావతి,
(2) భీమవరం, (3) పాలకొల్లు,
(4) సామర్లకోట, (5) ద్రాక్షారామం
షడ్రుచులు : (1) తీపి, (2) పులుపు,
(3) చేదు, (4) వగరు,
(5) కారం, (6) ఉప్పు.
అరిషడ్వర్గాలు షడ్గుణాలు:
(1) కామం, (2) క్రోధం, (3) లోభం, (4) మోహం,
(5) మదం, (6) మత్సరం.
ఋతువులు :
(1) వసంత,(2) గ్రీష్మ,
(3) వర్ష, (4) శరద్ఋతువు,
(5) హేమంత, (6) శిశిర
సప్త ఋషులు :
(1) కాశ్యపుడు,
(2) గౌతముడు, (3) అత్రి,
(4) విశ్వామిత్రుడు, (5) భరద్వాజ,
(6) జమదగ్ని, (7) వశిష్ఠుడు.
తిరుపతి సప్తగిరులు :
(1) శేషాద్రి,
(2) నీలాద్రి, (3) గరుడాద్రి,
(4) అంజనాద్రి, (5) వృషభాద్రి,
(6) నారాయణాద్రి, (7) వేంకటాద్రి.
సప్త వ్యసనాలు :
(1) జూదం,
(2) మద్యం, (3) దొంగతనం,
(4) వేట, (5) వ్యభిచారం,
(6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.
సప్త నదులు :
(1) గంగ, (2) యమునా, (3) సరస్వతి,
(4) గోదావరి, (5) సింధు,
(6) నర్మద, (7) కావేరి.
నవధాన్యాలు :
(1) గోధుమ,
(2) వడ్లు, (3) పెసలు,
(4) శనగలు, (5) కందులు,
(6) నువ్వులు, (7) మినుములు,
(😎 ఉలవలు, (9) అలసందలు.
నవరత్నాలు :
(1) ముత్యం,
(2) పగడం, (3) గోమేధికం,
(4) వజ్రం, (5) కెంపు, (6) నీలం,
(7) కనకపుష్యరాగం,
(😎 పచ్చ (మరకతం),
(9) ఎరుపు (వైడూర్యం).
నవధాతువులు :
(1) బంగారం,
(2) వెండి, (3) ఇత్తడి, (4) రాగి,
(5) ఇనుము, (6) కంచు,
(7) సీసం, (😎 తగరం,
(9) కాంతలోహం.
నవరసాలు : (1) హాస్యం,(2) శృంగార,
(3) కరుణ, (4) శాంత, (5) రౌద్ర,
(6) భయానక, (7) బీభత్స,
(😎 అద్భుత, (9) వీర
నవదుర్గలు :
(1) శైలపుత్రి,
(2) బ్రహ్మ చారిణి, (3) చంద్రఘంట,
(4) కూష్మాండ, (5) స్కందమాత,
(6) కాత్యాయని, (7) కాళరాత్రి,
(😎 మహాగౌరి, (9) సిద్ధిధాత్రి.
దశ సంస్కారాలు :
(1 ) వివాహం,
( 2 ) గర్భాదానం, (3 ) పుంసవనం ,
(4 ) సీమంతం, (5) జాతకకర్మ,
(6 ) నామకరణం, (7) అన్నప్రాశనం,
(8 ) చూడకర్మ, (9 ) ఉపనయనం,
(10) సమవర్తనం
దశావతారాలు :
(1) మత్స్య,
(2) కూర్మ, (3 ) వరాహ,
(4) నరసింహ, (5) వామన,
(6) పరశురామ, (7) శ్రీరామ,
(😎 శ్రీకృష్ణ, (9) బుద్ధ, (10) కల్కి.
జ్యోతిర్లింగాలు :
హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .
కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .
మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)
గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)
మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)
ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)
తమిళనాడు ~ రామలింగేశ్వరం
తెలుగు వారాలు :
(1) ఆది, (2) సోమ,
(3) మంగళ, (4) బుధ, (5) గురు,
(6) శుక్ర, (7) శని.
తెలుగు నెలలు :
(1) చైత్రం,
(2) వైశాఖం,(3) జ్యేష్ఠం,(4) ఆషాఢం,
(5) శ్రావణం, (6) భాద్రపదం,
(7) ఆశ్వీయుజం, (😎 కార్తీకం,
(9) మార్గశిరం, (10) పుష్యం,
(11) మాఘం, (12) ఫాల్గుణం.
రాశులు :
(1) మేషం,(2) వృషభం,
(3) మిథునం, (4) కర్కాటకం,
(5) సింహం, (6) కన్య, (7) తుల,
(😎 వృశ్చికం, (9) ధనస్సు,
(10) మకరం, (11) కుంభం,
(12) మీనం.
తిథులు :
(1) పాఢ్యమి, (2) విధియ,
(3) తదియ, (4) చవితి,(5) పంచమి,
(6) షష్ఠి, (7) సప్తమి, (😎 అష్టమి,
(9) నవమి, (10) దశమి,(11) ఏకాదశి,
(12) ద్వాదశి, (13) త్రయోదశి,
(14) చతుర్దశి,
(15) అమావాస్య /పౌర్ణమి.
నక్షత్రాలు :
(1) అశ్విని, (2) భరణి,
(3) కృత్తిక, (4) రోహిణి, (5) మృగశిర,
(6) ఆరుద్ర, (7) పునర్వసు,
(😎 పుష్యమి, (9) ఆశ్లేష, (10) మఖ,
(11) పుబ్బ, (12) ఉత్తర, (13) హస్త,
(14) చిత్త, (15) స్వాతి, (16) విశాఖ,
(17) అనురాధ, (18) జ్యేష్ఠ,
(19) మూల, (20) పూర్వాషాఢ,
(21) ఉత్తరాషాఢ, (22) శ్రావణం,
(23) ధనిష్ఠ, (24) శతభిషం,
(25) పూర్వాబాద్ర, (26) ఉత్తరాబాద్ర,
(27) రేవతి.
తెలుగు సంవత్సరాల పేర్లు :
(1) ప్రభవ :- 1927, 1987, 2047, 2107
(2) విభవ :- 1928, 1988, 2048, 2108
(3) శుక్ల :-1929, 1989, 2049, 2109
( 4 ) ప్రమోదూత :-1930, 1990, 2050, 2110
( 5 ) ప్రజోత్పత్తి :-1931, 1991, 2051, 2111
( 6 ) అంగీరస :- 1932, 1992, 2052, 2112
( 7 ) శ్రీముఖ :-1933, 1993, 2053, 2113
( 8 )భావ. - 1934, 1994, 2054, 2114
9యువ. - 1935, 1995, 2055, 2115
10.ధాత. - 1936, 1996, 2056, 2116
11.ఈశ్వర. - 1937, 1997, 2057, 2117
12.బహుధాన్య.-1938, 1998, 2058, 2118
13.ప్రమాది. - 1939, 1999, 2059, 2119
14.విక్రమ. - 1940, 2000, 2060, 2120
15.వృష.-1941, 2001, 2061, 2121
16.చిత్రభాను. - 1942, 2002, 2062, 2122
17.స్వభాను. - 1943, 2003, 2063, 2123
18.తారణ. - 1944, 2004, 2064, 2124
19.పార్థివ. - 1945, 2005, 2065, 2125
20.వ్యయ.-1946, 2006, 2066, 2126
21.సర్వజిత్తు. -1947, 2007, 2067, 2127
22.సర్వదారి. - 1948, 2008, 2068, 2128
23.విరోధి. - 1949, 2009, 2069, 2129
24.వికృతి. - 1950, 2010, 2070, 2130
25.ఖర. 1951, 2011, 2071, 2131
26.నందన.1952, 2012, 2072, 2132
27 విజయ.1953, 2013, 2073, 2133,
28.జయ. 1954, 2014, 2074, 2134
29.మన్మద.1955, 2015, 2075 , 2135
30.దుర్మిఖి. 1956, 2016, 2076, 2136
31.హేవళంబి. 1957, 2017, 2077, 2137
32.విళంబి. 1958, 2018, 2078, 2138
33.వికారి.1959, 2019, 2079, 2139
34.శార్వారి. 1960, 2020, 2080, 2140
35.ప్లవ 1961, 2021, 2081, 2141
36.శుభకృత్. 1962, 2022, 2082, 2142
37.శోభకృత్. 1963, 2023, 2083, 2143
38. క్రోది.1964, 2024, 2084, 2144,
39.విశ్వావసు.1965, 2025, 2085, 2145
40.పరాభవ.1966, 2026, 2086, 2146
41.ప్లవంగ. 1967, 2027, 2087, 2147
42.కీలక. 1968, 2028, 2088, 2148
43.సౌమ్య. 1969, 2029, 2089, 2149
44.సాధారణ . 1970, 2030, 2090, 2150
45.విరోధికృత్. 1971, 2031, 2091, 2151
46.పరీదావి. 1972, 2032, 2092, 2152
47.ప్రమాది. 1973, 2033, 2093, 2153
48.ఆనంద. 1974, 2034, 2094, 2154
49.రాక్షస. 1975, 2035, 2095, 2155
50.నల :-1976, 2036, 2096, 2156,
51.పింగళ 1977, 2037, 2097, 2157
52.కాళయుక్తి 1978, 2038, 2098, 2158
53.సిద్ధార్ధి 1979, 2039, 2099, 2159
54.రౌద్రి 1980, 2040, 2100, 2160
55.దుర్మతి 1981, 2041, 2101, 2161
56.దుందుభి 1982, 2042, 2102, 2162
57.రుదిరోద్గారి 1983, 2043, 2103, 2163
58.రక్తాక్షి 1984, 2044, 2104, 2164
59.క్రోదన 1985, 2045, 2105, 216
60.అక్షయ 1986, 2046, 2106, 2166.
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
మంగళగిరి అంటే చేనేత పరిశ్రమ, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, గాలిగోపురం, కొండపైన పానకాలస్వామి,...





