Feb 8, 2019


08.02.2019
మంత్రిమండలి సమావేశంలోని ముఖ్య అంశాలు

మంత్రి మండలి నిర్ణయాలను సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, మానవవనరుల అభివృద్ధి  శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులు సచివాలయం 1వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో శుక్రవారం రాత్రి మీడియాకు వివరించారు.
ఉద్యోగులకు శుభవార్త :
·       1.7.2018 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయం. ఇది జూన్‌లో చెల్లించాలని నిర్ణయం.
·       విద్యా శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైంస్కేల్ ఇవ్వాలని నిర్ణయం.
·       డీఏ తప్ప పది రోజుల బ్రేక్ తో 12 నెలల జీతం చెల్లిస్తారు. మోటర్నటీ సెలవు ఇస్తారు.
·       విజయనగరంలో మహాకవి గురజాడ పేరున విశ్వవిద్యాలయం ఏర్పాటు.
·       ఎన్ఎంఆర్,డెయిలీ వేతనాలు పొందే ఉద్యోగులు కాజువల్ సెలవులు ఇస్తారు. హెల్త్ కార్డులు ఇస్తారు.
·       అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ఎక్స్ గ్రేషియా, మెటర్నటీ సెలవులు ఇస్తారు.
అగ్రిగోల్డ్ :
·         అగ్రిగోల్డ్ బాధితులకు హైకోర్టు ఆదేశాలను అనుసరించిసత్వరం చెల్లింపులు చేయాలని మంత్రిమండలి నిర్ణయం. ఏప్రిల్ మొదటి వారంలో చెల్లింపులకు అవకాశం.
·         అగ్రిగోల్డుపై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు అభినందించడంపై మంత్రిమండలిలో చర్చ. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్దిని కోర్టు కూడా ఆమోదించిందని పేర్కొన్న మంత్రిమండలి.
·         సత్వర ఊరటగా రూ.250కోట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మన డబ్బులు ఇవ్వడానికి హైకోర్టు అంగీకరించింది. ఇక భూముల వేలం త్వరితగతిన పూర్తిచేసి మిగిలిన బాధితులకు సత్వర న్యాయం జరిగేలా హైకోర్టు వేగవంతమైన చర్యలు తీసుకోవాల్సి వుందని అభిప్రాయపడింది.
ఏలూరు స్మార్ట్ సిటీ :
·         ఏలూరు స్మార్ట్ సిటీ అంశంపై చర్చ. వినూత్న నమూనాగా స్మార్ట్ ఏలూరు అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి సూచన.
వైకుంఠపురం ఎత్తిపోతల :
·         వైకుంఠపురం ఎత్తిపోతల పథకం నిర్మాణంపై మంత్రిమండలిలో చర్చ. గతంలో టెండర్లలో రాలేదు. ఇప్పుడు తక్కువకు ఎవరు వేస్తే వారికి ఇచ్చేయాలని నిర్ణయం.
·         రాజధాని అమరావతి భవిష్యత్ తాగునీటి అవసరాల దృష్ట్యా కృష్ణానదిపై వైకుంఠాపురం దగ్గర బ్యారేజ్ నిర్మించాలని గతంలో నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజ్‌కు 23 కి.మీ. ఎగువున, పులిచింతల ప్రాజెక్టుకు 60 కి.మీ. దిగువున వైకుంఠాపురం బ్యారేజ్ నిర్మాణం కానుంది. మొత్తం బ్యారేజ్ పొడవు 3.068 కి.మీ. వుంటుంది. 
·         వైకుంఠపురం దగ్గర కృష్ణానదిపై నిర్మించే ఈ బ్యారేజ్‌కు రూ. 3,278.60 కోట్లు వ్యయం కానుందని ప్రాథమిక అంచనా. దీని నిర్మాణానికి మూడేళ్ల సమయం పడుతుంది.
JNTU అమరావతి వర్శిటీ :
·       JNTU అమరావతి కొత్త యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయం. కొత్త వర్శిటీని మోడల్ యూనివర్శిటీగా ఏర్పాటుచేయాలని మంత్రిమండలి నిర్ణయం.
అకార్డ్ వర్శిటీకి భూమి :
·         విశాఖజిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో 70 ఎకరాలభూమినిఎకరా 10 లక్షలచొప్పున, విశాఖ రూరల్ మండలం యెండాడ గ్రామంలో 70 ఎకరాల భూమిని ఎకరా కోటి రూపాయిల చొప్పున అకార్డ్ యూనివర్శిటీకి కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదం.
·         హెల్త్ సైన్సస్ విభాగంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో కూడిన మల్టీ స్ట్రీమ్ యూనివర్శిటీని ఇక్కడ ఏర్పాటు చేస్తారు.
·         చెన్నైలో వీరికి 7యూనివర్సిటీలు ఉన్నాయి. అన్ని విద్యాసంస్థలకు కలిపి 120ఎకరాలు కావాలని వీరు అభ్యర్థించారు. పదేళ్లలో రూ.5వేల కోట్లు పెడతామని అంటున్నారు. ఆలిండియా లెవల్లో ఈ సంస్థ ఏ ర్యాంకులో ఉందో పరిశీలించి ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం.నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచన.
విజయనగరం యూనివర్శిటీకి గురజాడ పేరు :
·         విజయనగరం విశ్వవిద్యాలయానికి గురజాడ అప్పారావు పేరు పెట్టాలని మంత్రిమండలిలో నిర్ణయం. డిగ్రీ కళాశాల కూడా ఇవ్వాలని నిర్ణయం.
·         విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు నిర్ణయం. విజయనగరం గవర్నమెంట్ మెడికల్ కాలేజి పేరుమీద మంజూరు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు :
·         అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులుఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయం.
పేదలకు ఇరిగేషన్ భూములు :
·         జల వనరుల శాఖకు చెందిన భూములలో 2వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయం. వేరే ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు కూడా వెంటనే ఇవ్వాలని ఆదేశం. ఏళ్ల తరబడి నివాసం ఏర్పరచుకున్న పేదలందరికీ ఇళ్ల పట్టాల సమస్యను వెంటనే పరిష్కరించాలని నిర్ణయం.
·         కర్నూలు జిల్లా సున్నిపెంటలో 76.4 ఎకరాలు, వెలిగోడు దగ్గర 20ఎకరాల భూముల్లో పేదలకు పట్టాలు ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం. మొత్తం 96.4ఎకరాల భూముల్లో పట్టాలు. జిల్లా కలెక్టర్లు పట్టాలు ఇచ్చేలా కేబినెట్ ఆమోదం.
ఇతర కేటాయింపులు :
·         కాకినాడ వెంకట్ నగర్‌లో ఉన్న 1040 చదరపు గజాల భూమినికల్యాణ మండపం నిర్మాణం నిమిత్తం వీవర్స్ కమ్యూనిటీకి 25 సంవత్సరాల లీజు ప్రాతిపదికన ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయం.
·         అనంతపురం జిల్లా మడకశిర మండలంలో గల పరిగి, సెరికొలెం గ్రామాలలోని 256.61 ఎకరాల భూమిని బెనిఫిసెంట్ నాలెడ్జ్ పార్కుకు ఇవ్వాలన్న ఏపీఐఐసీ ప్రతిపాదనకు మంత్రిమండలి అంగీకారం.
మినహాయింపులు :
·         రాజమహేంద్రవరంలో గల రామకృష్ణ మఠానికి రూ.23,49,981 విలువ గల ప్రాపర్టీ టాక్స్ బకాయిల నుంచి మినహాయింపును ఇవ్వాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం. రామకృష్ణ మిషన్ పేదలకు ఉచితంగా ఆస్పత్రిని నిర్వహిస్తున్నందున ఈ మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం.
·         విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్మిస్తున్న భవనానికి సంబంధించి రూ.48,36,273 విలువ గల బిల్డింగ్ లైసెన్స్ ఫీజును మినహాయించాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
·       ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం నాయునిపల్లి గ్రామంలో 48.53 ఎకరాల ప్రభుత్వ భూమిని అఫర్డబుల్ హౌసెస్ నిర్మాణం కోసం విజయవాడలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సీఎండీకి  అప్పగించే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం. మార్కెట్ ధర ప్రకారం ఎకరా ఒక్కింటికి రూ.5 లక్షల చెల్లించే షరతులకు లోబడి భూమి కేటాయింపు.
·       గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం రాజాపేట గ్రామంలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకోసం 6.96 ఎకరాల AWD భూమి గుంటూరు టెక్స్‌టైల్ పార్క్ యాజమాన్యానికి కేటాయింపు. ఎకరాకు రూ.18,15,000 చెల్లించే షరతు మీద కేటాయింపు.
ఇతర కేటాయింపులు :
·       కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో అమరావతి అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కు బదులుగా అమరావతి అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు 20 ఎకరాలు కేటాయింపు (కేవలం సంస్థ పేరులో స్వల్ప మార్పు) నకు మంత్రిమండలి నిర్ణయం
·       పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని చెరుకుమూడి గ్రామంలో లోర్విన్ గ్లాస్ టఫనింగ్ యూనిట్ ఏర్పాటుకు 2 ఎకరాల భూమి కేటాయింపునకు మంత్రిమండలి నిర్ణయం
·        కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండల కేంద్రంలో (1 బిల్డింగ్ పెయింటర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ కు 0.10 ఎకరాలు; 2 బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కు 0.10 ఎకరాలు; 3 కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ కు 0.15 ఎకరాలు; 4 ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ 0.10 ఎకరాలు) మొత్తం 0.45 ఎకరాలు కేటాయింపునకు మంత్రి మండలి ఆమోదం. యూనియన్ భవనాల నిర్మాణానికి ఈ భూమి కేటాయింపు.
·       ప్రకాశం జిల్లా కొండెపి మండలం పరిడేపి గ్రామానికి చెందిన అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారిణి శ్రీమతి ఎం.కళ్యాణికి ఒంగోలు పట్టణంలో ఉచితంగా స్థలం కేటాయింపుకు మంత్రిమండలి నిర్ణయం.
·       కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలోని తోటపల్లి గ్రామంలో 50 ఎకరాల భూమిని.. ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ విభాగానికి కేటాయింపు.  సమగ్ర ఇంటిలిజెన్స్ శిక్షణ అకాడమీ కోసం భూమిని కేటాయస్తూ మంత్రి మండలి నిర్ణయం
·       ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ సిటీస్ ప్రమోషన్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎపేడెకో) ఏర్పాటుకు విజయవాడ గ్రామీణ మండలం.. జక్కంపూడి, వేమవరం గ్రామాల్లో 153 ఎకరాల భూమి కేటాయింపు. దీనిలో వేమవరంలో 60 ఎకరాలు, జక్కంపూడిలో 93 ఎకరాలున్నాయి. జక్కంపూడిలో మార్కెట్ ధర ఎకరాకు రూ. కోటి, వేమవరంలో మార్కెట్ ధర ఎకరా రూ. 50 లక్షల చొప్పున ధర నిర్ధారణ.
·       విజయనగరం జిల్లా కవులవాడ, రావాడ, ముంజేరు, కంచేరుపాలెం, గూడెపువలస, కంచేరు గ్రామాల్లో 500.14 ఎకరాల భూమిని భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి కేటాయింపు
·       విజయనగరం జిల్లా భోగాపురం మండలం బసవపాలెం గ్రామంలో మెగా పుడ్ పార్క్ ఏర్పాటుకు 70.18 ఎకరాల భూమి ఏపీఐఐసీకి అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయం (ఉచితంగా)
·       అనంతపురం జిల్లా పెనుకొండ మండలం యర్రమంచి గ్రామంలో కియా మోటార్స్ ఆర్వోబీ, వై జంక్షన్ ఏర్పాటుకు 5.89 ఎకరాలు భూమి ఏపీఐఐసీకి కేటాయింపు.
·       అలాగే...అనంతపురం జిల్లా పెనుకొండ మండలం యర్రమంచి గ్రామంలోనే ట్రక్ టెర్మినల్, రైల్వే సైడింగ్ ఏర్పాటుకు 5 ఎకరాలు కేటాయింపు
·       రెంటచింతల మండలం గోలి గ్రామం వద్ద జెట్టిపాలెంలో పరాశక్తి సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. తన 6.85 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్‌కు పైప్ లైన్, విద్యుత్ లైన్ల ఏర్పాటుకు 2.85 ఎకరాల భూమి కేటాయింపు
పాడేరు ఏరియా ఆసుపత్రి స్థాయి పెంపు :
·         విశాఖ జిల్లా పాడేరు ఏరియా ఆసుపత్రి 100 పడకల ఆస్పత్రి స్థాయి నుంచి 200 పడకల జిల్లా ఆస్పత్రి స్థాయికి పెంపు. రూ.27.50 కోట్ల అంచనా వ్యయంతో పోస్టుల మంజూరు. రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పోస్టుల మంజూరు. సివిల్ సర్జన్ పోస్టులు 7, డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టు 1, డిప్యూటీ డెంటల్ సర్జన్ 1, సివిల్ అసిస్టెంట్ సర్జన్/ఉమెన్ అసిస్టెంట్ సర్జన్ 6, హెడ్ నర్స్ 4, లే సెక్రటరీ గ్రేడ్ II అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ 1, ఆఫీసు సూపరింటెండెంట్ పోస్టులు 2, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 3, స్టాఫ్ నర్స్ పోస్టులు 38, టేబుల్ 1 కింద మొత్తం 63 పోస్టులు మంజూరు. టేబుల్ 2 కింద మరో 57 పోస్టులు మంజూరు.
బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో టీచింగ్ పోస్టుల భర్తీ :
·       బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలకు 9 టీచింగ్ పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం. ప్రపంచంలో వస్తున్న ఆధునిక సేద్య పద్ధతులు, అధికోత్పత్తికి, ఉత్పాదనకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కర్షకులకు పరిచయం చేసేందుకు శిక్షణ కార్యక్రమాలు. ఇందుకు వీలు కల్పిస్తూ వీరి నియామకం.
ఇతర పోస్టులు :
·         ల్యాండ్ హబ్ (భూసేవ) ప్రాజెక్టు నిమిత్తం అవసరమైన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ పద్దతిలో నియమించుకునేందుకు మంత్రిమండలి ఆమోదం.
·         కృష్ణాజిల్లా నిమ్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా  అప్‌గ్రేడు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం. అంచనా వ్యయం రూ.568.91 కోట్లతో పోస్టుల మంజూరు. రెగ్యులర్ ప్రాతిపదికన అదనంగా 11 పోస్టులు మంజూరు. రేడియోగ్రాఫర్, డార్క్ రూమ్ అసిస్టెంట్, 4 నర్సింగ్ సిబ్బంది, 7 శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మేన్ పోస్టులు అవుట్ సోర్సింగ్ పద్దతిలో నియామకం.
·       చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కోటాల గ్రామంలో రూ.191.19 లక్షల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి  మంత్రిమండలి ఆమోదం. పోస్టుల మంజూరు. ఫార్మసిస్టు గ్రేడ్-2, లాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, జూనియర్ అసిస్టెంట్, శానిటరీ అటెండర్/వాచ్‌మేన్ పోస్టులను ఔట్ సోర్సింగ్ సిబ్బందితో భర్తి చేయాలని నిర్ణయం
·       నంద్యాలలో ప్రస్తుతం ఉన్న 200 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నతీకరణ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం. మొత్తం 46 పోస్టులు మంజూరు. సివిల్ అసిస్టెంట్ సర్జెన్ పోస్టులు 3, నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్ట్ 1, హెడ్ నర్సులు 4, స్టాఫ్ నర్సులు 33, ఆఫీస్ సూపరింటెండెంట్ 3, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల మంజూరు.
ఇంధన రంగం :
·       సెంబ్ కార్ప్ గాయత్రి పవర్ లిమిటెడ్ నుంచి విద్యుత్తు ప్రొక్యూర్ మెంట్‌. విద్యుత్తు ఎంత సేకరించాలి? కొనుగోలు ధర ఖరారు విధివిధానాల ఖరారుకు APERC ముందు ప్రతిపాదించేందుకు APPCC/AP DISCOMSకు రాష్ట్ర  మంత్రిమండలి అనుమతి. విద్యుత్ ప్రొక్యూర్‌మెంట్   కోసం  సెంబ్ కార్ప్ గాయత్రి పవర్ లిమిటెడ్‌కు ముందుగా ఇఛ్చిన లీజు కాల పరిమితి 12 ఏళ్ల నుంచి 7 ఏళ్లకు కుదింపు. సెంబ్ కార్ప్ గాయత్రి పవర్ లిమిటెడ్‌కు ప్రొక్యూర్‌మెంట్‌తో  హెచ్.ఎన్.పి.సి.ఎల్, కె.ఎస్.కె మహానంది, శ్రీ వాస్తవ, RTTP, VTPS ఒప్పందాన్ని కొనసాగించరాదని మంత్రిమండలి నిర్ణయం. అగ్రిమెంట్ కాలపరిమితి 2017-18 నుంచి 2021-22 నాటికి ముగియనుంది.
·       31 హాస్పటళ్ల అప్ గ్రేడ్. 20 హాస్పటల్స్ 30 నుంచి 50 పడకలకు,  30 నుంచి 100 పడకలకు పెంచాలని నిర్ణయం. అరకులో 100 నుంచి 150 పడకలకు పెంచాలని మంత్రి మండలి నిర్ణయించింది.

Feb 7, 2019


కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న
చంద్రబాబుకు కృతజ్ఞతలు
కాపు కార్పోరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు
              సచివాలయం, ఫిబ్రవరి 7: కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాపు కార్పోరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు  కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద గురువారం రాత్రి ఆయన మాట్లాడారు. ఏ వర్గానికి అన్యాయం జరుగకుండా చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. మిగిలిన అగ్రవర్ణాలకు ఎటువంటి ఇబ్బందీ ఉండదన్నారు. ఈ కులాలు దశాబ్దాలుగా కోరుతున్న రిజర్వేషన్లను చంద్రబాబునాయుడు సాకారం చేశారని కొనియాడారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో హామీని నెరవేర్చిందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేశారని, వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిచారని, రిజర్వేషన్ కల్పించారని వివరించారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో కలుపుకొని కాపులకు రూ.4100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పేద కాపు విద్యార్థులు విదేశాలలో చదువుకుంటే రూ.11.5 లక్షల వరకు ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. ఉపాధి అవకాశాల కోసం శిక్షణ ఇప్పిస్తున్నామని, ప్లేస్ మెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. డ్రైవర్లకు సబ్సిడీపై కార్లు అందజేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు కుట్టులో, అల్లికలో శిక్షణ ఇప్పించి, వారికి కుట్టు మిషన్లు కూడా ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కాపు భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్సటి వరకు 300 భవనాలు నిర్మించినట్లు సుబ్బరాయుడు  చెప్పారు.

Feb 3, 2019



వేగంగా నిర్మించిన
తాత్కాలిక హైకోర్టు భవనం
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి ప్రశంసలు
సచివాలయం, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టుని ఆధునిక టెక్నాలజీతో చాలా వేగంగా 192 రోజుల్లో నిర్మించారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి ప్రశంసించారు. రాజధాని అమరావతిలోని నేలపాడులో నిర్మించిన జ్యుడిషియల్ కాంప్లెక్స్ లో ఆదివారం మధ్యాహ్నం ఆయన తాత్కాలిక హైకోర్టుని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన ముఖ్య అతిధిగా మాట్లాడుతూ శాశ్విత హైకోర్టు భవనం కూడా ఇంతేవేగంగా నిర్మించాలన్నారు.  హైకోర్టు నిర్మాణం, తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుపై   సీఎంను అభినందించాల్సిన పనిలేదని, రాజ్యాంగపరమైన అవసరాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చారన్నారు. ఏపీ తాత్కాలిక హైకోర్టును ప్రారంభించడం తనకు సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇది ఆనందకరమైన క్షణంగా పేర్కొన్నారు.  దేశవ్యాప్తంగా 3 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని, అయితే ఈ కేసులను పెండింగ్ అనడానికి వీలులేదన్నారు. వీటిలో  25 లక్షల  కేసులు  పదేళ్లనాటివని,  81 లక్షల కేసులు ఏడాది లోపు ఫైల్ అయినవేనని, 50 లక్షలు పెట్టీ కేసులని వివరించారు. పెట్టీ కేసులు  పరిష్కరించడం తక్షణ కర్తవ్యంగా పేర్కొన్నారు.  వీటిపై న్యాయ వ్యవస్థ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  దేశంలోని  హైకోర్టులు పెట్టీ కేసుల పరిష్కరంలో చొరవ చూపాలన్నారు. పెండింగ్ కేసులు భారీగా ఉండటానికి  జడ్జీ పోస్ట్ లు ఖాళీగా ఉండటం ఒక కారణంగా పేర్కొన్నారు. జిల్లా కోర్టుల్లో  5 వేల  జడ్జీ, సబ్ ఆర్డినెట్ జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి ఈ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. హైకోర్టులలో  392 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటికి  సంబంధించి హై కోర్టుల నుంచి సిఫార్సు లు రావడం లేదన్నారు. హైకోర్టులు జడ్జి పోస్టుల ఖాళీలపై త్వరగా సిఫార్సు లు పంపాలని చెప్పారు.  సుప్రీంకోర్టులో వంద జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని  వారంలోపు భర్తీ చేస్తామన్నారు. పెండింగ్ కేసులను సమర్థవంతంగా పరిష్కరించేందుకు జడ్జీలు, న్యాయవాదులు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. న్యాయ వ్యవస్థను న్యాయముర్తులు, న్యాయవాదులు రక్షించాలన్నారు. న్యాయవ్యవస్థలో రాజ్యాంగ విలువలకే తప్ప వ్యక్తిగత అభిప్రాయాలకు తావుండకూడదని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి అన్నారు.
అమరావతి నిర్మాణంలో ఇది ఓ ప్రధాన ఘట్టం
రాజధాని అమరావతి నిర్మాణంలో హైకోర్టు భవనం ప్రారంభం ఓ ప్రధాన ఘట్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.  చారిత్ర ఘట్టంలో భాగస్వాములైన అందరికీ  ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర విభజన నాటి నుంచి ఏపీకి ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయని, రాజధానికి భూములు ఇచ్చి సహకరించిన రైతులందికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 34 వేల ఎకరాల భూమి త్యాగం చేశారన్నారు. రైతుల త్యాగం వృథాకాకుండా అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. అమరావతిలో నిర్మించే నవనగరాల్లో న్యాయనగరం కూడా ఒకటని తెలిపారు. బౌద్ధ స్థూపాకారంలో అద్భుతరీతిలో న్యాయనగరం నిర్మిస్తామన్నారు. న్యాయనగరంలో న్యాయాధికారులు, సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. కోర్టుల్లో 1.70 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వేగంగా పరిష్కరించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందజేస్తామని చెప్పారు.  ఏపీలో రానున్న నవ్య ఆవిష్కరణలు న్యాయవ్యవస్థకు కూడా దోహదం చేస్తాయని పేర్కొన్నారు.2022 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోని మొదటి మూడు రాష్ట్రాలలో ఒకటిగా, 2030 నాటికి అగ్ర రాష్ట్రంగా,  2050 నాటికి ప్రపంచంలోనే అత్యత్తమ రాష్ట్రాలలో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.  అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఏర్పాటు కూడా తమ ప్రణాళికలో భాగంగా పేర్కొన్నారు.  ఇక్కడకు వచ్చే అతిథులను అమరావతి అందాలు ఆకట్టుకుంటాయని చెప్పారు.  హైదరాబాద్ లో నల్సార్ ఏర్పాటుకు ఎంతో కృషి చేశానని,  అమరావతిలో కూడా నల్సార్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సుప్రీంకోర్టు సహకరించాలని కోరారు.  భూమితోపాటు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. అమరావతిలో ఉండే న్యాయాధికారులు, సిబ్బందికి ఉచిత వసతి కల్పిస్తామని చెప్పారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతి రహిత పాలన అందిస్తున్నామన్నారు. హైకోర్టు ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
                   సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్.వి.రమణ మాట్లాడుతూ భూములు ఇచ్చిన రైతులను ప్రత్యేకంగా అభినందించారు. రైతుల త్యాగాన్ని ముందు తరాలు గుర్తుంచుకుంటాయన్నారు. ఇది ఓ చరిత్రాత్మకమైన రోజుగా పేర్కొన్నారు. అమరావతి కొత్త రాజధాని ఏమీ కాదని, దీనికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. శాతవాహనుల కాలంతో ధాన్యకటకంగా పేరొందిందని చెప్పారు. బౌద్ధులు నడయాడిన నేల ఇదని,  ప్రేమ, కరుణ, క్షమకు నిలయంగా ఉందన్నారు. మళ్లీ కొంత్త అధ్యాయం మొదలైందన్నారు. తాత్కాలిక హైకోర్టుని అత్యంత వేగంగా నిర్మించినందుకు ముఖ్యమంత్రిని అభినందించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎల్.నాగేశ్వర రావు మాట్లాడుతూ తాను గుంటూరులో ప్రాక్టీస్ చేసినట్లు చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు, మరో 9 మంది ప్రాణత్యాగం, కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు తదితర విషయాలను వివరించారు. న్యాయవాద వృత్తిలో ఉన్నవారందరూ ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ మద్రాస్ ప్రసిడెన్సీ నుంచి హైకోర్టు విడిపోయి, గుంటూరులో ఏర్పాటు, ఆ తరువాత హైదరాబాద్ లో ఏర్పాటు, రాష్ట్ర విభజన తరువాత ఇక్కడ హైకోర్టు ప్రారంభం తదితర విషయాలను వివరించారు. హైకోర్టు నిర్మాణం త్వరగా జరిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
                 తాత్కాలిక హైకోర్టు నిర్మాణ విశిష్టతలు తెలిపే ఏవీని స్క్రీన్ పై ప్రదర్శించారు. అంతకు ముందు తాత్కాలిక హైకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్ ఆవిష్కరించారు. భవనం లోపల గోడపై ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆ తరువాత ప్రధాన న్యాయమూర్తితోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర న్యాయమూర్తులు భవనంలో లోపల పలు కోర్టుల హాళ్లను  సందర్శించారు. సభ ప్రారంభంలో అచ్యుత మానస బృందం ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. చివరలో న్యాయమూర్తులందరికి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్ఞాపికలు ఇచ్చి, శాలువాలతో సత్కరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్ చంద్ర పునీఠ వందన సమర్పణ చేశారు.

                         ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆర్.సుభాష్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణణ్, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జి వెంకటరామిరెడ్డి,  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి సతీమణి నృపాంజలి, శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్,  మంత్రులు కొల్లు రవీంద్ర, డాక్టర్ నారాయణ, దేవినేని ఉమామహేశ్వర రావు, ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్ చంద్ర పునీఠ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర,  డీజీపీ ఆర్.పి.ఠాకూర్,  ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, జీఏడీ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ జి.రామారావు, పలువురు మాజీ న్యాయమూర్తులు, ప్రస్తుత న్యాయమూర్తులు, న్యాయవాదులు, రాజధాని రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Feb 1, 2019


ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో
ఉద్యానవన పంటలకు ప్రాధాన్యత ఎక్కువ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్ చంద్ర పునీఠ
             సచివాలయం, ఫిబ్రవరి 1: ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉద్యానవన పంటలకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్ చంద్ర పునీఠ చెప్పారు. . సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సీఎస్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఫుడ్ ప్రాసెసింగ్ రాష్ట్ర స్థాయి సాధికారిక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల విషయంలో ఉద్యానవన శాఖ ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపాదించిన  ఫుడ్ పార్కులను, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు త్వరితగతిన తగిన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. జనవరి 30న జరిగిన రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో 28 ప్రాజెక్టులను సాధికారిక కమిటీకి సిఫారసుల చేసినట్లు అధికారులు సీఎస్ కు తెలిపారు. వాటిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కొత్తవి 21, ప్రాథమిక ప్రాసెసింగ్ సెంటర్లు రెండు,  మోగా పార్క్, ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్, వేస్ట్ ప్రాసిసింగ్ యూనిట్, టెక్ అప్ గ్రేడింగ్ యూనిట్, ష్రిప్పింగ్ ప్రాసెసింగ్ కోసం కోల్డ్ చైన్ యూనిట్ ఒక్కొక్కటి ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు స్థాపించే సంస్థలు, ఉత్పత్తులు, ప్రాజెక్ట్ వ్యయం, ఆ ప్రాజెక్టులకు ఇచ్చే గ్రాంట్, ఉపాధి కల్పన, ప్రాజెక్ట్ స్థాపన కాల వ్యవధి తదితర అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక, డెయిరీ డెవలప్ మెంట్, ఫిషరీస్  శాఖ ముఖ్య కార్యదర్శి కె.దమయంతి,  పరిశ్రమలు, వాణిజ్య శాఖలోని ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం కార్యదర్శి ఎం.గిరిజా శంకర్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కెవివి సత్యనారాయణ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ వైవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

4వ తేదీకి సమాధానాలు అన్ని సిద్ధం చేయండి

                                ఉన్నతాధికారులకు సీఎస్ ఆదేశాలు


          సచివాలయం, ఫిబ్రవరి 1:శాసనసభ, శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఈ నెల 4వ తేదీ నాటికి సిద్ధం చేయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనీల్ చంద్ర పునీఠా సంబంధిత శాఖల ఉన్నతాధికారులను అదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సీఎస్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాల విద్య, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, పట్టణ పరిపాలన, పట్టణ అభివృద్ధి, ఉన్నత విద్య శాఖలలో అందజేయవలసిన సమాధానాలు  ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. మిగిలిన అన్ని శాఖల వారు పెండింగ్ లో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వమని సీఎస్ సూచించారు. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ముఖ్య కార్యదర్శులు కె.దమయంతి, కెఎస్ జవహర రెడ్డి, ఏఆర్ అనురాధ, మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కె.కన్నబాబు తదితరులు తమతమ శాఖల తరపున ఈ శాసనసభ సమావేశాలకు అందించిన సమాధానాల వివరాలను తెలియజేశారు. 4వ తేదీ నాటికి పెండింగ్ లో ఉన్న అన్ని సమాధానాలను అందజేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మన్మోహన్ సింగ్,  నీరబ్ కుమార్ ప్రసాద్, ముఖ్య కార్యదర్శలు కె.ప్రవీణ్ కుమార్, కార్యదర్శులు శశిభూషణ్ కుమార్, ముఖేష్ కుమార్ మీనా, కాలేజీ విద్యా శాఖ ప్రత్యేక కమిషనర్ సుజాత శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎంల ట్యాంపరింగ్‌ దుమారం


  దేశానికి ఎన్నికల వేళైంది. ఈ సమయంలో కొత్త రాజకీయ పార్టీలు, రాజకీయ ఫిరాయింపులు, రాజకీయాలు మాట్లాడటం సహజం. కానీ ఈ సారి దేశమంతటా ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)ల ట్యాంపరింగ్‌(దురుద్దేశంతో పాడుచేయడం) పై మాట్లాడుతున్నారు. మాటలు కాదు పెద్ద దుమారమే చెలరేగుతోంది.  బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంది రాజకీయ నాయకులు
ఈవీఎంలను విశ్వసించడంలేదు. వాటి నిర్వహణ, వినియోగంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తారని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా ఈవీఎంల ట్యాంపరింగ్ లపై చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు ఊతం ఇచ్చాయి.  ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్-యూరప్ విభాగం  ఇటీవల లండన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో షుజా కాలిఫోర్నియా నుంచి లైవ్ వీడియో ద్వారా మాట్లాడారు. భారత్‌లో 2014 లోక్ సభ ఎన్నికలలలో ఉపయోగించిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్గుజరాత్మధ్యప్రదేశ్, రాజస్థాన్చత్తీస్ గడ్ఢిల్లీలలో రిగ్గింగ్ జరిగినట్లు వివరించారు. అలా చేయడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిచిందని చెప్పారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ సాయంతో ఫ్రీక్వెన్సీ తగ్గించి ఈవీఎంలను హ్యాక్ చేశారని ఆరోపించారు. 2009 నుంచి 2014 వరకు తాను ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) లో పనిచేశానని, 2014 లోక్‌సభ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలను రూపొందించిన బృందంలో తాను కూడా ఒక సభ్యుడిగా పనిచేసినట్లు షుజా చెప్పారు. ఈ ట్యాంపరింగ్‌ కు కేంద్రం హైదరాబాద్ అని కూడా అతను పేర్కొన్నారు.  2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలుఇటీవల జరిగిన మధ్యప్రదేశ్-ఛత్తీసగఢ్-రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో కూడా ఈవీఎంలను హ్యాక్ చేసి గెలిచేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. అయితే, తమ బృందం ఆ ప్రయత్నాలను అడ్డుకోవడం వల్ల బీజేపీ ఓటమిపాలైందన్నారు.  కేంద్ర మంత్రి గోపీనాధ్ ముండే మృతి, జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యలకూ ఈవీఎంల హ్యాకింగ్ కు సంబంధం ఉన్నట్లు కూడా షుజా  సంచలన ఆరోపణలు చేశారు.  అయితే ముందు చెప్పిన విధంగా షుజా ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఈవీఎంల ట్యాంపరింగ్ ని నిరూపించలేదు. లైవ్ లో చూపిస్తానని చెప్పి చూపించలేదు. సయీద్ షుజా ఆరోపణలను ఈసీఐఎల్  ఖండించింది. అతను తమ సంస్థలో రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేయలేదనితాము సేవలు పొందుతున్న ఇతర సంస్థల్లో కూడా పనిచేయలేదని స్పష్టం చేసింది.  షుజా ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) తీవ్రస్థాయిలో స్పందించింది. అతనిపై  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ఈసీఐఎల్ ఆధ్వర్యంలో ఉన్నత ప్రమాణాలతో,కట్టుదిట్టమైన భద్రతనిఘా మధ్య తయారైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై అనుమానాలకు తావులేదని ఈసీ పేర్కొంది. 2010లో నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో వీటిని తయారు చేసినట్లు  తెలిపింది. ఈవీఎంలను ట్యాంపర్‌ చేయడం సాధ్యం కానేకాదని స్పష్టం చేసింది. ఈవీఎం అనేది ఓట్లను నమోదు చేసే యంత్రం మాత్రమేననిదానిని ఎవరూ నియంత్రించ లేరని (ప్రోగ్రామ్‌ చేయలేరని) ఎన్నిక ప్రధాన అధికారి(సీఈసీ) సునీల్ అరోరా  స్పష్టం చేశారు.  డిల్లీలో 2014 లోక్‌సభ ఎన్నికల్లో, ఆ తరువాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో   ఫలితాలు భిన్నంగా వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికలలో మళ్లీ  బ్యాలెట్ విధానం ప్రవేశపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. 

                   మానవుడు విజ్ఙానవంతుడైన దగ్గర నుంచి ఓ పక్క సౌకర్యాలు పెరుగుతుంటే, మరో పక్క ప్రమాదాలు కూడా ముంచుకొస్తున్నాయి. అణు విజ్ఞానం మానవాళికి అపారమైన అనుభవం మిగిల్సింది. అమెరికా హిరోషిమా, నాగసాకీ నగరాలపై అణుబాంబుని ఉపయోగించడం వల్ల ఆ రెండు నగరాలు శవాల దిబ్బలయ్యాయి. వందేళ్లపాటు ఆ నేలపై మొక్క మొలవకుండా చేశారు. అదే అణు విజ్ఞానాన్ని మానవాళి సుఖంగా జీవించడానికి కూడా వినియోగించవచ్చు. ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్న అణు ఆయుధాలతో ప్రపంచం మొత్తం విద్యుత్ వెలుగులు నింపవచ్చు. నిరంతరం పరిశ్రమలను నడపవచ్చు. మనిషి ఆలోచనా విధానాలకు, వికృత చేష్టలకు నిదర్శనాలు ఇవి. నేటి ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో బ్యాంకులకు వెళ్లకుండా దేశంలో ఎక్కడైనా ఏటీఎంల ద్వారా డబ్బు డ్రా చేసుకోగలుగుతున్నాం. మరో పక్క కొందరు ఆ విజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ప్రపంచంలో నూతన ఆవిష్కరణలు ఎన్ని జరుగుతున్నాయో అంతకు మించి వాటిని దుర్వినియోగం చేసేవారు కూడా తయారవుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగిస్తున్నారో పరిశీలిస్తే ఈవీఎంల ట్యాంపరింగ్‌ అసాధ్యమేమీ కాదని అర్ధమవుతోంది. ప్రపంచం వ్యాప్తంగా 120 దేశాల్లో వీటిని వినియోగించడంలేదు. 20 దేశాలలో మాత్రమే వినియోగిస్తున్నారు.  పలువురు సీనియర్ రాజకీయ నేతలతోపాటు  టెక్నాలజీని ప్రమోట్ చేసే చంద్రబాబు నాయుడు కూడా ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నారంటే ఆలోచించవలసిన విషయమే. ప్రజాస్వామ్యాన్ని యంత్రాలపై ఆధారపడేలా చేయడం సమంజసం కాదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. బ్యాలెట్ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాడతామని కూడా ఆయన  స్పష్టం చేశారు. దమ్ముంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో  బ్యాలెట్‌తో పోలింగ్ నిర్వహించాలని  బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి ఛాలెంజ్ విసిరారు. ఈవీఎంలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న దృష్టా వచ్చే ఎన్నికలలో బ్యాలెట్ లనే వినియోగించాలని జాతీయ స్థాయిలో 22 బీజేపీయేతర పార్టీల ప్రతినిధులు త్వరలో ఎన్నికల సంఘాన్ని కలిసి కోరనున్నాయి. ఈవీఎంలపై ఇన్ని అనుమానాలు, ఇంత దుమారం రేగుతున్న సమయంలో ఎన్నికల సంఘం బాధ్యత మరింత పెరుగుతోంది. రాజకీయ పరంగా ఈవీఎంలను దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉన్నందున ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా బ్యాలెట్ల అంశాన్ని ఎన్నికల సంఘం పరిశీలించాలి. ఒక వేళ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో వాటినే వినియోగించినా  తగిన జాగ్రత్తలు, గట్టి భద్రతా చర్యలు తీసుకోవలసిన అవసరం ఈసీఐపై ఉంది.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914