Feb 9, 2018

పార్టీలకు అతీతంగా పోరాటం శుభపరిణామం


Ø సత్తా చాటిన ఆంధ్రులు
Ø లోక్ సభలో విశ్వరూపం చూపించిన గల్లా జయదేవ్

      వచ్చే ఏడాదికి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నిధుల కేటాయింపుల్లో  ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేయడంతో ఒక్క బీజేపీ వారు తప్ప అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఇక్కడ రోడ్డెక్కి తమ నిరసన గళం వినిపించారు. ఎంపీలు అక్కడ పార్లమెంటులోనూ తమ సత్తా చాటారు. ఆంధ్రులందరూ  కలసి రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం కోసం  ఈ విధంగా ఆందోళన చేయడం చాలా శుభ పరిణామం. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అందరూ ఆరోగ్యకరమైన వాతావరణంలో పోరాటం చేయడం వల్ల రాష్ట్రానికి మేలు జరిగే అవకాశం ఉంది. కేంద్రం దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది.  కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఏపీకి అన్యాయం చేస్తోందన్న భావన ప్రజల్లో ఉంది. దానికితోడు తాజా బడ్జెట్‌ కేటాయింపుల్లో మొండిచేయి చూపడంతో రాష్ట్రంలోని ప్రజలే కాకుండే దేశవిదేశాల్లో ఉన్న వారు కూడా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ లో రాష్ట్ర రెవెన్యూ లోటునూతన రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, రైల్వేజోన్ వంటి  ముఖ్య అంశాల ప్రస్తావన లేకపోవడంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీల నేతలతోపాటు ప్రజలందరూ మండిపడుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.  ఈ నెల 8వ తేదీ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌, వామపక్షాలు విజయవంతంగా బంద్‌ నిర్వహించాయి. విపక్ష వైసీపీ కూడా మద్దతు ఇచ్చింది. వారి నాయకులు, కార్యకర్తలు కూడా బంద్ లో పాల్గొన్నారుపవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ  కూడా ఇందుకు మద్దతు పలికింది. అంతేకాకుండా  తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు తెలియచేయాలని పిలుపు ఇచ్చింది. ఏపీ ప్రజల ఆగ్రహావేశాలు, అభిప్రాయాలు కేంద్రానికి తెలియాలనే ఉద్దేశంతో ఈ బంద్‌కు టీడీపీ అనధికారికంగా మద్దతు పలికినట్లుగా భావిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులపై ఢిల్లీలో పోరాడాలని, తమతో అక్కడ కలసిరావాలని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు మాట్లాడినప్పటికీ బంద్ విషయంలో మెతకవైఖరి అవలంభించడమేకాక వారు నేరుగా బంద్‌కు మద్దతు ఇవ్వకుండా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విద్యాశాఖ ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటించింది. సమస్య తీవ్రత దృష్ట్యా, రాష్ట్రాభివృద్ధిని దృష్టిలోపెట్టుకొని తెలుగుదేశం పార్టీ కూడా కేవలం పార్లమెంటులోనే ఈ ప్రజాందోళనలో కూడా పాలుపంచుకోవడం మంచిపనిగా భావిస్తున్నారు. రాష్ట్ర విభజన హామీలు  అమలు చేయాలని టీడీపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద వేరువేరుగా ఆందోళనలు చేశారుఫ్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలన్నారు.  విభజన హామీలను కేంద్రం అమలు చేయడం లేదని విరుచుకుపడ్డారు.  రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఏమేమి చేయాలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టంగా పేర్కొన్నారని, ప్రభుత్వం మారిన తర్వాత విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందన్నారు. విభజన హామీలను అమలుచేయాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు.
        రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్టీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికి పార్లమెంటులోనూ బయట తమ గళం వినిపించి తీవ్రస్థాయిలోనే  నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటులో అనేక విధాల వినూత్న రీతిలో నిరసన తెలిపారుప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ సీపీ ఎంపీలకు ధీటుగా తమ ఆగ్రహాహావేశాలను, ఆవేదనను వెళ్లగక్కారు. శివప్రసాద్ తనదైన శైలిలో, నిమ్మల కిష్టప్ప ఢమరుకం మోగిస్తూ నిరసన తెలిపారు. మరి ముఖ్యంగా గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ పార్లమెంటులో ప్రసంగం అమోఘం. లోక్ సభలో ఆయన 14 నిమిషాలు ఇంగ్లీషులో అనర్ఘళంగా మాట్లాడి  విశ్వరూపం చూపించారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చితీరాలని డిమాండ్ చేశారు. అందర్నీ, అన్ని సార్లూ మోసం చేయలేరు, ఆంధ్రులు ఫూల్స్‌ కాదని మీరు తెలుసుకోవాలి, విభజన చట్టంలోని 19 అంశాల్లో ఒక్కటీ అమలు కాలేదు, మీరిచ్చిన నిధులకన్నా బాహుబలి సినిమా కలెక్షన్స్‌ ఎక్కువగా ఉన్నాయని బయట ప్రజలు జోకులు వేసుకుంటున్నారు, ఏపీలో కాంగ్రెస్‌ గతే కోరుకుంటున్నారా?, ఇప్పుడు ఎన్నికలు లేవనే ఏపీకి నిధులివ్వలేదా?, హామీలపై ప్రధాని, ఆర్థిక మంత్రి  దీనిపై సమగ్ర వివరణ ఇవ్వాలని, లేకపోతే.. మీరు దురుద్దేశంతో ఉన్నట్లే భావించి, మీతో బంధంపై  ఆలోచించక తప్పదని కడిగిపారేశారు. ఓ మిత్రపక్ష ఎంపీ రాష్ట్రం కోసం ఇంత నిజాయితీగా లోక్ సభలో గళం విప్పడం సామాన్య విషయం కాదు. ఆయన ప్రసంగం అటు బీజేపీవారిని, ఇటు ఇతర పార్టీల వారిని, ప్రజలను ఆలోచింపజేసింది. ఎంపీగా ఆయన పార్లమెంటు వేదికను సమర్థవంతంగా వినియోగించుకున్నారు. ఇటువంటి ఎంపీలను అందరూ అభినందించాలి.


-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Feb 8, 2018

బంద్ విరమించండి, పార్లమెంట్ లో కలసి రండి


వామపక్షాలకు ప్రభుత్వం తరపున అచ్చెన్నాయుడు, ఆనందబాబు వినతి
                      సచివాలయం, ఫిబ్రవరి 7: కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని వామపక్షాలు ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపుపై పునరాలోచన చేసి బంద్ విరమించాలని ప్రభుత్వం తరపున మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు విజ్ఞప్తి చేశారు. సమస్య న్యాయమైనదేనని, అయితే ఈ అంశంపై పార్లమెంటులో కలసిరావాలని కోరారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం మధ్యాహ్నం వారు మీడియాతో మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రం మూడున్నరేళ్ల చంటిబిడ్డ అని, చిన్నపిల్లలను ఎలా చూసుకుంటారో అలా  రాష్ట్రాన్ని చూసుకోవాల అన్నారు. రాష్ట్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టిపెట్టి ఒక స్థాయికి తీసుకువచ్చారని చెప్పారు. ప్రపంచం అంతా మనవైపు చూస్తున్న తరుణంలో ఈ ప్రతిష్టని ఇంకా పెంచుకోవాలన్నారు. విభజన చట్టంలోని హామీలను ఒక పద్దతిప్రకారం సాధించుకోవాలన్నారు. ఎన్డీఏలో తాము భాగస్వాములైనప్పటికీ రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం ప్రధాన మంత్రిని, కేంద్ర మంత్రులను కలుస్తూ నిరంతరం శ్రమిస్తూ మిత్రధర్మాన్ని పాటిస్తున్నారని చెప్పారు. హామీలు అమలు విషయంలో, కేంద్ర బడ్జెట్  కేటాయింపులలో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తడంలో జాతీయ స్థాయిలో టీడీపీ ఎంపీలు విజయం సాధించారని చెప్పారు. నష్టాల్లో ఉన్న రాష్ట్రంలో బంద్ చేయడం వల్ల మనకే నష్టం జరుగుతుందన్నారు. వామపక్షాలకు ఇక్కడ శాసనసభలో ప్రాతినిధ్యంలేకపోయినా పార్లమెంట్ లో వారి సభ్యులు ఉన్నందున కేంద్రంపై ఢిల్లీలో పోరాడాలన్నారు. ఈ అంశంలో ప్రధాని కల్పించుకున్నప్పటికీ స్పష్టమైన హామీ ఇచ్చేవరకు తమ పోరాటం ఆగదని చెప్పారు. మిత్రపక్షంగా ఉంటూ కేంద్రంపై ఈ విధమైన ఆందోళన చేయడం దేశంలో తాను మొదటిసారి చూస్తున్నానన్నారు. ఢిల్లీలో తమ ఎంపీలతో కలసి ఆ ఆందోళనకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. బంద్ వల్ల  రాష్ట్రానికి నష్టమేకాకుండా, ప్రజలు ఇబ్బందులుపడతారనిఅందువల్ల వామపక్షాలు, ఇతర పార్టీలు బంద్ పై పునరాలోచన చేసి విరమించాలని అచ్చెన్నాయుడు  కోరారు.

ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే ఆందోళన: ఆంనదబాబు
           ఎక్కడ అన్యాయం జరిగిందో అదే పార్లమెంట్ వద్ద జాతీయస్థాయిలో ప్రతిబింభించేవిధంగా ఆందోళన చేపట్టాలని మంత్రి ఆనందబాబు అన్నారు. ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారుహామీలు అమలు చేయమని అడగటం ఏపీ హక్కన్నారు. ఈ విషయంలో రాష్ట్రాన్ని విడదీసిన పార్టీలకు బాధ్యత ఉందని గుర్తుచేశారు. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నా ఆందోళనలు చేయడంలో వెనకాడేదిలేదని చెప్పారు. స్పష్టత వచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు. ఏపీలో నిరసన తెలియజేసి ఢిల్లీలో కలిసి ఆందోళన చేస్తే ప్రయోజనం ఉంటుందననారు. మంచి మనసుతో ఆలోచన చేసి బంద్ పిలుపు విరమించుకోవాలని ఆనందబాబు కోరారు.

Feb 7, 2018

ఆహారంలో మార్పుల ద్వారా మధుమేహం, బీపీ, ఊబకాయం అదుపు


వీరమాచనేని రామకృష్ణ

          సచివాలయం, ఫిబ్రవరి 6: ఆహారంలో మార్పుల ద్వారా మధుమేహం, బీపీ, ఊబకాయం వంటి జీవన శైలి వ్యాధులను నయం చేయవచ్చని వీరమాచనేని రామకృష్ణ చెప్పారు. సచివాలయం 3వ బ్లాక్ సచివాలయ ఉద్యోగుల సంఘం సమావేశ మందిరంలో మంగళవారం మధ్యాహ్నం ఆయన ఉచిత ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఆహారం తీసుకోవడంలో విచ్చలివిడితనం వల్ల ఇటువంటి వ్యాధులు వస్తాయని చెప్పారు.  ఆహారంలోనే మందులు ఉన్నాయని, మనం తినే ఆహారంలో మార్పు ద్వారా వీటిని నయం చేసుకోవచ్చని చూసించారు. తాను డాక్టర్ ని కాకపోయినా పరిశోధన చేసిన, మన ప్రాంతానికి అనుకూలమైన ఆహార కార్యక్రమాన్ని రూపొందించి, తన స్వానుభవంతో ఫలితాలు పొందానని తెలిపారు. ఈ విధానం ద్వారా లక్షల మంది ఫలితాలు చవిచూశారని చెప్పారు. మూడు నెలల ఈ కార్యక్రమంలో అనేక వ్యాధులు నయమవుతాయని నిరూపణ అయిందన్నారు. ఊబకాయం ఓ వ్యక్తి ఉన్న శరీర బరువును బట్టి  పది నుంచి 40 రోజులలోప తగ్గుతుందని చెప్పారు. శరీర బరువు తగ్గగానే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయచ్చని, ఆ తరువాత పిండిపదార్ధాలు తగ్గించి సాధారణ ఆహారం తీసుకోవచ్చని తెలిపారు. మధుమేహం ఉన్నవారు మాత్రం మూడు నెలలు ఈ విధానాన్ని అనుసరించవలసి ఉంటుందని చెప్పారు. ప్రకృతే మనకు పెద్ద డాక్టర్ అని, ప్రకృతే చాలా వ్యాధులను నయం చేస్తుందన్నారు. ఉదయం మొదలు మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు(పిండిపదార్ధాలు) ఎక్కవగా ఉంటాయని తెలిపారు. పిండి పదార్ధాలు, రిఫైన్డ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయని చెప్పారు. ఈ విధానాన్ని అనుసరించి లక్షల మంది ప్రయోజనం పొందారని, వారిలో డాక్టర్లు కూడా ఉన్నారని తెలిపారు.  తాను ఎవరి వద్ద నయాపైసా తీసుకోకుండా, సొంత ఖర్చులతో తిరుగుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఉచితంగా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు.
ఆహార నియమాలను పాటించే ఈ విధానం ద్వారా ప్రృతికి దగ్గరవుతామని, రోగాలకు దూరమవుతామని తెలిపారు. యూట్యూబ్ లో త్వరలో  సొంత ఛానల్ ద్వారా ఈ విధానాన్ని తెలియజేస్తానని, అందరి అనుమానాలను నివృత్తి చేస్తానని, ప్రశ్నలకు సమాధానాలు చెబుతానని చెప్పారు. ఈ విధానంలో వంటలకు వాడే కొబ్బరి నూనె,  నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగుమీద మీగడ, వెన్న, ఛీజ్, సముద్రపు ఉప్పు వాడాలని చెప్పారు. శాఖాహారులు, మాంసాహారులు ఇద్దరికీ అనుకూలమైన రీతిలో నాలుగు పిల్లర్స్ గా ఈ ప్రోగ్రామ్ ని రూపొందించినట్లు రామకృష్ణ  వివరించారు. ఈ సదస్సులో సచివాలయ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యోగులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాదానాలు చెప్పారు. ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరిస్తున్నవారు తమకు ఒక్క రోజులోనే మధుమేహం తగ్గినట్లు రీడింగ్ వివరాలతో సహా తెలిపారు. మూడు నెలల వరకు కొనసాగిస్తామని చెప్పారు. ఊబకాయం పది రోజుల్లో తగ్గినట్లు కొందరు తెలిపారు. ఈ సదస్సులో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉప్పుటూరి మురళీ కృష్ణ , ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.

Feb 5, 2018

బడ్జెట్ లో ఆశించిన కేటాయింపులు జరుగలేదు


మంత్రి కాలవ శ్రీనివాసులు
              సచివాలయం, ఫిబ్రవరి 5: కేంద్ర తాజా బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఆశించిన కేటాయింపులు జరుగలేదని సమాచార, పౌరసంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు.  సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ లో రాష్ట్ర రెవెన్యూ లోటు , నూతన రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ అంశాల ప్రస్తావన లేకపోవడంతో రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలోని తెలుగువారందరూ అసహనానికి గురయ్యారని, కొందరు ఆగ్రహావేశాలు కూడా వ్యక్తం చేశారని చెప్పారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ నేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అసంతృప్తిని వ్యక్తం చేశారని, కేంద్రపై వత్తిడి తెస్తున్నారని తెలిపారు.  రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే పరమావధిగా భవిష్యత్ కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. బిజేపీ మిత్రపక్షమైనా తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ, కేంద్రంపై వత్తిడి తెస్తున్నామని,  రాష్ట్రాభివృద్ధి కోసం పోరాడతామని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల వేదికగా తమ పార్టీ అవతరించిందని, ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ తమ ఆలోచనలు, నిరసనలు తెలియజేస్తామన్నారు.  రాజీలేని పోరాటం చేస్తామన్నారు. బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో అడగవలసి ఉందని చెప్పారు. బడ్జెట్ లోని అన్ని అంశాలను అద్యయనం చేస్తున్నామని,  టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని నిలదీస్తున్నారన్నారు. ఫలితాలు సాధించేవరకు పోరాడతామని చెప్పారు.
విభజన హామీలు నెరవేర్చే విషయంలో అన్ని పార్టీలు బాధ్యత తీసుకోవాలన్నారు. ఎక్కడైతే విభజన జరిగిందో అక్కడే న్యాయం జరగాలన్నారు. పార్లమెంటుని వేదిక చేసుకొని తమ పార్టీ ఎంపీలు తమ వాదన వినిపిస్తున్నారని చెప్పారు. విభజన చట్టంలో చెప్పింది చేయమని అడుతున్నట్లు తెలిపారు. కొన్ని కార్యక్రమాలకు కేంద్రం సహాయం చేస్తుందని, ఆ విషయం తాము చెబుతూనే ఉన్నామన్నారు. కేంద్రం సహకరిస్తే రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చెస్తామని మంత్రి కాలవ చెప్పారు.

ప్రభుత్వంవైపు ఆశగా చూస్తున్న హోం గార్డులు

        


  పోలీసులతో సమానంగా శాంతిభద్రతల విధులు నిర్వహిస్తూ కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రంలోని హోం గార్డులు తమ జీతాలు పెరిగే సమయం వచ్చేసిందని ఆశగా ఎదరు చూస్తున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలతోపాటు తెలుగు రాష్ట్రం తెలంగాణ కూడా దేశ అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాలను అమలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. పోలీసులతో సమానంగా బందోబస్తులో పాల్గొంటున్నా వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సదుపాయాలు లేవు. ఉద్యోగ భద్రతలేదు   ఆరోగ్యబీమా లేదు. కనీస వేతనాలు అందడంలేదు. ఎటుంటి అలవెన్సులూ లేవు. అయితే వారికి పని చేస్తారన్న గుర్తింపు మాత్రం ఉంది. ఆ గుర్తింపేతోనే తమకు  మంచి జరుగుతుందని భావిస్తున్నారు. పోలీసులకు సహాయపడేందుకు 1963లో హోం గార్డ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి వీరు కూడా పోలీసులతో సమానంగా ఎండనకవాననక రోడ్లపై బందోబస్తు, కార్యాలయాల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రాత్రి వేళల్లో గస్తీ వంటి అన్ని పనులను చేస్తూనే ఉన్నారు. ఇక రాష్ట్రపతి నుంచి ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి, మంత్రుల వరకు వారి పర్యటనల సమయంలో, పండుగలు, ఉత్సవాలు, అన్ని మతాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భారీ బహిరంగసభలు, సమ్మెలు, ఆందోళనల సందర్భంగా రోజుల తరబడి విధులు నిర్వహిస్తున్నారుఅంతేకాకుండా ఎస్పీ, డిఎస్పీ, సర్కిల్ పోలీస్ కార్యాలయాల్లో సేవలందిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు.  అనేక సందర్భాల్లో వీరికి భోజనం కూడా అందుబాటులో ఉండదు. అయినా విధులు నిర్వహిస్తూనే ఉంటారు. విధుల నిర్వహణలో పోలీసుల పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంటుంది. అయితే వారికి జీతం, ఇతర అలవెన్సులు, సౌకర్యాలు ఉంటాయి. హోం గార్డులకు ఏ రకమైన అలవెన్సులు, సౌకర్యాలు లేవు. బందోబస్తు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినా బస్ ఛార్జీలు కూడా ఇవ్వరు.

దేశంలో హోంగార్డుల పరిస్థితిని తెలుసుకున్న సుప్రీం కోర్టు 2015 మార్చి 11, ఆ తరువాత 2016 మేలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం జీతం బేసిక్ రూ.16,400, డియర్ నెస్ అలవెన్స్(డీఏ) రూ.2950, ఇంటి అద్దె అలవెన్స్(హెచ్ఆర్ఏ) రూ.2000, వాషింగ్ అలవెన్స్ రూ.100 మొత్తం 21,450 చెల్లించాలని ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం హోం గార్డులకు జీతాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ హోంగార్డ్ డీజీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు గత ఏడాది  లేఖలు రాశారుదాంతో  కొన్ని  రాష్ట్రాలలో వేతనాలు పెంచారు. అలాగే పోలీసులకు మాదిరిగా ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం హోం గార్డులకు జీతాలు పెంచాలని గత ఏడాది నవంబర్ లో ఒడిషాలో హోం గార్డ్ కమాండెంట్ జనరల్ ప్రభుత్వానికి లేఖ రాశారు. హోం గార్డులకు డెయిలీ డ్యూటీ అలవెన్స్ రూ.675 గా నెలకు జీతం 20,250కి పెంచుతూ జనవరి 31న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందిఅంతే కాకుండా ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయల జీతం పెంపుట్రాఫిక్ విధులు నిర్వహించేవారికి కాలుష్య ప్రమాద అలవెన్స్ కింద పోలీస్ కానిస్టేబుల్స్ కు ఇచ్చే మాదిరిగా 30 గౌరవవేతనం ఇస్తారు. మహిళా హోం గార్డులకు మహిళా పోలీసులకు మాదిరిగా ఇద్దరు పిల్లల వరకు ఆరు నెలల ప్రసూతి సెలవులు, పురుష హోం గార్డులకు పోలీసులకు మాదిరిగా 15 రోజులు పితృత్వపు సెలవులు ఇస్తారు. అంతేకాకుండా హోంగార్డులకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మాణం, ఆరోగ్యబీమా సదుపాయం కల్పిస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు
            ఏపీలో దాదాపు 15,363 మంది హోం గార్డులు ఉన్నారు. వారిలో 12,163 మంది శాంతిభద్రతల విభాగంలో, 3,200 మంది విజిలెన్స్, అగ్నిమాపక విభాగం, ఆర్టీసీ, పురావస్తు, దేవాలయాలు తదితర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు.  ఈ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి వీరు అరకొర కూలీతోనే పని చేస్తూ అనేక ఇబ్బందులు పడుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. 2013 డిసెంబర్ వరకు వీరికి రోజుకు రూ.200 ఇచ్చేవారు. 2014 జనవరి నుంచి దానిని రూ.300కు పెంచారు. 2016 ఏప్రిల్ 1 నుంచి రూ.400లకు పెంచారు. వాషింగ్ అలవెన్స్ ని రూ.1000 నుంచి రూ.1500లకు పెంచారు. ప్రస్తుతం నెలకు రూ.12 వేలతో  విధులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యం బాగోక గానీ, అత్యవసర పని ఉండి ఒక్క రోజు రాకపోయినా జీతం కట్ చేస్తారు. ఇంత దయనీయంగా వీరు బతుకుతున్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం వేతనంపోలీసులుగా గుర్తింపు, ఉద్యోగ భద్రత, కుటుంబం మొత్తానికి ఆరోగ్యబీమా, పోలీస్ కానిస్టేబుల్ తో సమానంగా యూనిఫాం అలవెన్స్, బందోబస్తు సమయంలో వేతనంతోపాటు కరువుభత్యం, టీఏ, డీఏ, మరణానంతరం అంత్యక్రియ ఖర్చు రూ.15 వేలు, పోలీస్ కానిస్టేబుల్ ఎంపికలో హోం గార్డులకు 25 శాతం రిజర్వేషన్, వేతనంతో కూడిన సెలవులు, మహిళా హోం గార్డులకు ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా ప్రసూతి సెలవులు, పిల్లల చదువులకు ఫీజు మాఫీ, పక్కా గృహాలు, పదవీ విరమణ చేసిన హోం గార్డుకు రూ.5 లక్షలు, చనిపోయిన హోంగార్డు కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తింపు,   5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన హోం గార్డుని కానిస్టేబుల్ శిక్షణకు పంపడం వంటివి వారు  కోరుతున్నారు.  ఈ నేపధ్యంలో దేశంలోని పలు ఇతర రాష్ట్రాలతోపాటు తెలంగాణలో కూడా హోంగార్డుల వేతనం పెంచడంతో ఏపీ ప్రభుత్వం కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. హోంగార్డుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని  గతంలో కూడా వారి జీతాల పెంపు అంశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో  చర్చించారు.  తెలంగాణ ప్రభుత్వం జీఓ జారీ చేయడంతో ఇక్కడి హోం గార్డులు  తమకు సానుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.  వారి ఆశలు ఫలించాలని ఆశిద్ధాం.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914