Jun 2, 2017

అవినీతిలేని ప్రభుత్వం-అదే నా బ్రాండ్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Ø రాష్ట్రం కోసం 2 నిమిషాలు ఆలోచించండి
Ø అవినీతిపై చర్యలు మొదలు
Ø పరిష్కార వేదిక ద్వారా ఫలితాలు
Ø పంటల బీమా కనీసం రూ.15వేలు
Ø ఏపీఎఫ్ఎంఐఎస్ చట్టంలో మార్పులు
Ø ఆగస్ట్ 1కి ప్రతి ఇంటికి గ్యాస్
Ø ఏపీజీఐసీ పాలసీ, 2017-2020
Ø డాక్టర్ షీలా భీడే కమిటీ సిఫార్సుల ఆమోదం

సచివాలయం, జూన్1: అవినీతిలేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తన 
లక్ష్యమని, అదే తన బ్రాండ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మంత్రి మండలి సమావేశం అనంతరం గురువారం సాయంత్రం సచివాలయం బ్లాక్ 1 సమావేశ మందిరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ సమావేశంలో అజెండాలో వున్న 25 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. రాజకీయ అవినీతి, మీడియా అవినీతి అని వేరు వేరు రంగులు ఉండవని అవినీతి అంతా ఒకటే రంగన్నారు. చర్యలు తీసుకోవడం మొదలుపెడితే తప్పులు జరగవని చెప్పారు. టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ 1100 (పరిష్కారవేదిక) ద్వారా మంచి ఫలితాలు వస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 25వేల ఫిర్యాదులు అందాయని, వాటిలో 550 మాత్రమే కొత్త ఫిర్యాదులని వివరించారు. ఈ  ఫిర్యాదులన్నిటినీ మీకోసం వెబ్ సైట్ లో పెడుతున్నట్లు తెలిపారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా హౌసింగ్, హాస్పటల్, ఫించన్లు,రేషన్ కార్డులు, చంద్రన్న బీమా వంటివి ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. ఫిర్యాదులు విచారణ దశలో ఉద్యోగులు, బ్రోకర్లు తీసుకున్న లంచాలను తిరిగి ఇచ్చివేసినట్లు తెలిపారు. ఒక్క రేషన్ కార్డుకు సంబంధించి ఫిర్యాదును విచారిస్తుంటే పది మంది వద్ద తీసుకున్న లంచం తిరిగి ఇచ్చివేసినట్లు వివరించారు. చర్యలు తీసుకోవడం మొదలుపెడితే అవినీతి దానంతట అదే ఆగిపోతుందన్నారు. సమస్యల పరిష్కారం విషయంలో ఫిర్యాదిదారుడు సంతృప్తిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించి ప్రతి పనికి కాలపరిమితి విధించినట్లు సీఎం తెలిపారు. ఆ కాలపరిమితి లోపల పనిచేయకపోతే సంబంధింత ఉద్యోగికి పనిష్మెంట్ ఉంటుందని చెప్పారు. అవినీతి చాలా వరకు తగ్గిందని, అయినప్పటికీ కొంతమంది కరుడుగట్టిన తప్పుడు వ్యక్తులు ఉంటుంటారని, వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  మునిసిపాలిటీల పరిధిలో చట్ట విరుద్ద నిర్మాణలపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. టెక్నాలజీ ఒకప్పుడు మేథావులకు ఉపయోగపడేదని, ఇప్పుడు అది సామాన్య మానవుడికి మిత్రుడైందన్నారు. చేతిలో సెల్ ఫోన్ ఉంటే అన్ని పనులు అయిపోతాయని చెప్పారు. ప్రభుత్వంలో ఇప్పుడు పనులు చకచకా ఎలా జరుగుతున్నాయో ఒక వ్యక్తి తన అనుభవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సీఎం సూచనల మేరకు మీడియా సమావేశంలో ప్రభుత్వ మీడియా సలహాదారు పరకా ప్రభాకర్ చదివి వినిపించారు.
 నీరు-ప్రగతి - ఏపీఎఫ్ఎంఐఎస్ చట్టంలో మార్పులు
మంత్రి మండలి సమావేశంలో నీరు-ప్రగతిపై చర్చించినట్లు సీఎం తెలిపారు. నీటి  యాజమాన్య పద్దతులు సమర్థవంతంగా నిర్వహించేందుకు రైతుల భాగస్వామ్యం ఉండేవిధంగా ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతుల యాజమాన్య నీటిపారుదల వ్యవస్థ(ఏపీఎఫ్ఎంఐఎస్) చట్టంలో మార్పులు తీసుకురానున్నట్లు చెప్పారు. నీటి సంఘాల ఎన్నికల ప్రక్రియను సరళతరం చేయనున్నట్లు, రైతులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో మాదిరి చట్టంలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. వారి పదవీ కాలపరిమితి రెండేళ్ల నుంచి 5 ఏళ్లకు పెంచనున్నట్లు చెప్పారు. రైతులకు రూ.1680 కోట్ల ఇన్ పుట్ సబ్జిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు.
కనీస పంటల బీమా రూ.15వేలు
రాష్ట్రంలో 9.45 లక్షల మంది రైతులకు రూ.595 కోట్లు పంటల బీమా అందించనున్నట్లు సీఎం తెలిపారు. ఒక్కో రైతుకు బీమా కనీసం రూ.15 వేల రూపాయలు అందజేస్తారన్నారు. అంతకంటే ఎక్కువ వచ్చేవారికి ఎక్కువ ఇస్తారన్నారు. తక్కువ వస్తే కనీసం రూ.15వేలు ఇస్తారని చెప్పారు.
ఏపీజీఐసీ పాలసీ, 2017-2020  పీపీపీ విధానంలో గ్లోబల్ ఇన్-హౌస్ సెంటర్లను నెలకొల్పేందుకు ఏపీజీఐసీ పాలసీ, 2017-2020ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ పాలసీతో మల్టీనేషనల్ కంపెనీలకు ఏపీ గమ్యస్థానం కానున్నదన్నారు. ఈ పాలసీ ద్వారా మౌలిక సౌకర్యాలను కల్పించడంతో పాటు ఉద్యోగాల కల్పనపై కూడా అవగాహన కుదురుతుందని చెప్పారు.
డాక్టర్ షీలా భీడే కమిటీ సిఫార్సుల ఆమోదం
ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్- 2014లోని షెడ్యూల్ 9 కింద వున్న 9 బీసీ ఫెడరేషన్లకు సంబంధించిన రెండు రాష్ట్రాల మధ్య జరగాల్సిన ఆస్తులు, అప్పుల పంపకాలపై డాక్టర్ షీలా భీడే కమిటీ చేసిన సిఫార్సులను మంత్రిమండలి ఆమోదించినట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న టీచింగ్ మెడికల్ ఫ్యాకల్టీ పదవి విరమణ వయస్సును 60 నుంచి 63 ఏళ్లకు పెంచుతూ మంత్రి మండలి తీర్మానించినట్లు చెప్పారు. 2017-18 విద్యా సంవత్సరానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్రానికి మెడికల్ పీజీ సీట్ల సంఖ్యను పెంచడం, అదే సమయంలో రాష్ట్రంలో పనిచేస్తున్న ఎక్కువమంది ప్రొఫెసర్లు పదవి విరమణ చేయనున్న దృష్ట్యా పదవి విరమణ వయో పరిమితిని పెంచాలని మంత్రిమండలి నిర్ణయించినట్లు చెప్పారు.
రాష్ట్రం కోసం 2 నిమిషాలు ఆలోచించండి
జూన్ 2వ తేది ఉదయం 10 గంటలకు నవనిర్మాణ దీక్ష సందర్భంగా ప్రజలందరూ రాష్ట్రం కోసం రెండు నిమిషాలు ఆలోచించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భావితరాల భవిష్యత్, మెరుగైన జీవనం కోసం స్వాతంత్ర్య దినోత్సవానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో దీనికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. యుద్ధ విమానంలో రాష్ట్ర విభజన బిల్లు తీసుకురావడం - పార్లమెంట్ లో టీవి ప్రసారాలను నిలిపివేయడం-వార్ రూమ్ ఏర్పాటు- కుట్ర రాజకీయాలు- లాలూచీ  హేతుబద్దం కానివిధంగా రాష్ట్ర విభజన అడుగడుగునా దగా  అసహనం  అభద్రత  ఆవేదన- అప్పులేగానీ, ఆస్తులు లేవు ... వంటి అంశాలనన్నిటినీ జ్ఞప్తికి తెచ్చుకోవాలన్నారు. అన్యాయం చేసినవారు సిగ్గుపడేవిధంగా అభివృద్ధి సాధించాలన్నారు. రెండవ ప్రపంచం యుద్ధం తరువాత బూడిదలో నుంచి కసి,

తపనతో జపాన్ అభివృద్ధి చెందిందని, ఆ మాదిరిగా మనం కూడా అత్యంత శక్తవంతమైన రాష్ట్రాన్ని రూపొందించుకోవాలని పిలుపు ఇచ్చారు. జూన్ 2న నవనిర్మాణ దీక్ష జరుపుకుంటున్నామని, చరిత్ర వున్నంత వరకు ఇది   జరుగుతుంది, ఇది ఎవరినో నిందించేందుకు కాదని అన్నారు. జూన్ 8న మహా సంకల్పం జరుపుకుంటున్నామని, వారం రోజులపాటు ఈ మూడేళ్లలో సాధించిన ప్రగతిపై చర్చ జరగాలన్నారు. దక్షిణ భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలకన్నా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం తక్కువుగా వుండటానికి ఎవరు కారణమో అందరూ ఆలోచించాలని, ప్రజలకు వివరించాల్సిన అవసరం వుందని చెప్పారు. జూన్ 8 నాటికి రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్ లేని ఇల్లు వుండకూడదని, వచ్చే ఏడాది నవనిర్మాణ దీక్ష నాటికి ఏం చేయాలో కూడా ఇప్పుడే నిర్ణయించుకుందామన్నారు. గత ఏడాది జూన్ 2 నాటికి వంద శాతం ఇళ్లకు విద్యుత్ అందించినట్లు చెప్పారు. ఈ ఏడాది ఆగస్ట్ 1 నాటికి వంద శాతం ఇళ్లకు గ్యాస్ అందిస్తామన్నారు.

జూన్ 2వ తేది ఉదయం 10 గంటల సమయానికి రాష్ట్రంలో ప్రతి ఒకరూ నవనిర్మాణ దీక్ష  ప్రతిజ్ఞ చేయాలన్నారు. బస్సులలో వెళుతున్నా రెండు నిమిషాలు ఆగి ప్రతిజ్ఞ చదవాలని విజ్ఞప్తి చేశారు. 3న ఆంధ్రప్రదేశ్ విభజన తీరు – 2014లో రాష్ట్రం పరిస్థితి  చట్టం, హామీలలో సాధించినవి, సాధించాల్సినవి - ఈ మూడేళ్లలో జరిగిన ప్రగతి  లక్ష్యాలపై  చర్చ జరగాలన్నారు. జూన్ 4 వ్యవసాయం - అనుబంధ రంగాలు  జల సంరక్షణ - సుస్థిర అభివృద్ధి వ్యూహం -కరువు రహిత రాష్ట్రం  తుఫాన్లు ఎదుర్కొన్న విధానం – ‘నీరు-చెట్టు’ – ‘నీరు-ప్రగతి’ – పట్టిసీమ - నదుల అనుసంధానం  పోలవరం - ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులు  చెక్‌డ్యాంలు - భూగర్భ జలాల పెంపు  రెయిన్ గన్లు  పంటకుంటలు  పొలం పిలుస్తోంది - భూసార పరీక్షలు  ఇన్‌పుట్ సబ్సిడీ  రుణ ఉపశమనం అంశాలపై చర్చించాలన్నారు. జూన్ 5 సంక్షేమం  సమ్మిళిత అభివృద్ధి - అధిక ఫలితాల సాధన  అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు  ప్రధానమైన సంక్షేమ అభివృద్ధి పథకాలపై చర్చ  ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ పథకాలు  డ్వాక్రా సంఘాలు- సామాజికరంగం అభివృద్ధిపై చర్చించాలని చెప్పారు. జూన్ 6 మానవ వనరుల అభివృద్ధి  పెట్టుబడుల ఆకర్షణ  ఉద్యోగ కల్పన -విద్య  వైద్యం  నైపుణ్యాభివృద్ధి  పరిశ్రమలు  రెండు భాగస్వామ్య సదస్సులు విజయవంతం-తాగునీరు- గ్రామీణ, పట్టణ ప్రాంత గృహ నిర్మాణం- విద్యుత్ రంగం-మౌలిక సదుపాయాలు-రోడ్ నెట్ వర్క్ వంటి అంశాలపై చర్చ జరగాలన్నారు. జూన్ 7న ప్రజలే ముందు  పారదర్శక,  జవాబుదారీ సుపరిపాలన  రెవిన్యూ-పోలీస్- మైనింగ్- జీవీఏ  సుస్థిర వృద్ధి లక్ష్యాలు  సమాజ వికాసం  కుటుంబ వికాసం  సంతోష ఆంధ్రప్రదేశ్  విజన్ 2022, 2029, 2050 - అవార్డులు  విజయాలపై చర్చించాలన్నారు. జూన్ 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు మహాసంకల్పం తీసుకోవాలన్నారు. విభజన అవమానాన్ని దిగమింగుకొని కసితో  రాష్ట్రాభివృద్ధిపై శ్రద్ధ వహించాలన్నారు. నవనిర్మాణ దీక్ష, మహాసంకల్పంలో ప్రజలందరూ  భాగస్వాములు కావాలని, ఆశీర్వదించాలని సీఎం కోరారు. మీడియా సమావేశంలో సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు కూడా పాల్గొన్నారు.

నేటి నుండి నవనిర్మాణ దీక్ష

 ·        7 రోజుల పాటు ప్రసంగాలు, చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు
వెలగపూడి, జూన్ 1 :  నవనిర్మాణ దీక్ష జూన్ 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి యేటా జూన్ 2న ఈ దీక్షా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం  తెలిసిందే. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు నవనిర్మాణ దీక్ష జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్షను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగం, ప్రతిజ్ఞ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం జరుగుతాయి. జిల్లా స్థాయిల్లో కూడా బహిరంగ సభలు జరిగే ప్రదేశాల్లో నవనిర్మాణ దీక్షా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఉదయం జరిగే కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని ప్రతిజ్ఞ చేయాలి. అలాగే కుటుంబ సభ్యులంతా కూడా ఇళ్ల వద్ద ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొనాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిజ్ఞా కార్యక్రమం విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేసింది.  నవనిర్మాణ దీక్ష సందర్భంగా రాష్ట్రంలోని అన్ని శాసనసభా నియోజకవర్గాల్లో వారం రోజుల పాటు ప్రతిరోజూ ప్రజల భాగస్వామ్యంతో వివిధ అంశాలపై ప్రసంగాలు, చర్చా కార్యక్రమాలు ఈ కింద తెలిపినవిధంగా నిర్వహిస్తారు.
జూన్ 2 : ముఖ్యమంత్రి ప్రతిజ్ఞా కార్యక్రమం
జూన్ 3 : రాష్ట్ర పునర్విభజన చట్టం హామీలు అమలు పరిశీలన
జూన్ 4 : ప్రజలే ముందు (పీపుల్ ఫస్ట్) – పారదర్శకత, జవాబుదారీ పాలన అన్ని స్థాయిల్లో అవినీతి నిర్మూలన.
జూన్ 5 : రైతుల ఆదాయం రెట్టింపు చేయడం స్థిరమైన అభివృద్ధి విధానాలు, ఏకీభవించే విధానం జీవనోపాధి మెరుగుపరచడం, జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఈజిఎస్) – కరువు నివారణ పోలవరం సాగునీటి ప్రాజెక్టు పూర్తి.
జూన్ 6 : పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణ, రెండు విడతలు నిర్వహించిన పెట్టుబడి సదస్సుల ద్వారా వచ్చిన ప్రతిపాదనలకు మద్దతు కూడగట్టడం ఉద్యోగావకాశాలు మెరుగుపరచడం నైపుణ్యత
జూన్ 7 : అభివృద్ధితో కూడిన సంక్షేమం, వెనుకబడిన, పేద వర్గాలకు అభివృద్ధి ఫలాలు చేరేలా తీసుకోవాల్సిన చర్యలు సంక్షేమం, అభివృద్ధి పథకాలపై చర్చ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం సామాజిక వర్గాల అభివృద్ధి.
జూన్ 8 : మహా సంకల్పం
               జూన్ 8న కాకినాడలో జరిగే మహాసంకల్పం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.
               జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు  విజయవాడలో 10 వేల మంది ప్రజలు పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంశాల వారీగా ప్రతిరోజూ ప్రజా ప్రసంగాలు, చర్చలు నిర్వహించడంతో పాటు, ఆయా అంశాల ఆధారిత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సాయంత్రం వేళల్లో నిర్వహిస్తారు.
               జిల్లాల ఇన్ చార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో నవనిర్మాణ దీక్షా కార్యక్రమాల్లో ముఖ్యఅతిధులుగా పాల్గొంటారు. దీక్ష జరిగే వేదిక వద్ద ఆయా అంశాల ఆధారిత ఫొటో ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, జిల్లాల అధికార యంత్రాంగంతో నవనిర్మాణ దీక్షా కార్యక్రమాలను ఇన్ చార్జ్ మంత్రులు సమన్వయం చేస్తారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా ఓ ప్రత్యేక అధికారిని ఇన్ చార్జ్ గా జిల్లా కలెక్టర్ నియమించారు. ప్రజలను సమీకరించి విజయవంతం చేయడంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాధ్యత వహిస్తారు.     నవనిర్మాణ దీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఒక్కో జిల్లాకు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని ఇన్ చార్జ్ గా నియమించారు. వారు ఈ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ లతో సమన్వయం చేసుకుంటూ వారికి కేటాయించిన జిల్లాల్లో ఈ వారం రోజుల పాటు అందుబాటులో ఉంటూ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

May 21, 2017

ఆచ్ఛాదన, అశ్లీలతలేని అందమైన స్త్రీ మూర్తి!

అదే డాక్టర్ మాచిరాజు సృష్టి
    మేళకర్తల రాగాలకు కూడా
   వర్ణ రూపం ఇచ్చే  ప్రయత్నం

         ఆయన కుంచె కదిపినా, గీత గీసినా స్త్రీ రూపం సంతరించుకుంటుంది. స్త్రీ  అంటే ఆయనకు అంతటి గౌరవం, అభిమానం. స్తీ మహాశక్తి స్వరూపిణి. సౌందర్య రాశి. స్త్రీ సౌందర్యం మనసుకి, మాటలకు అందదు.  దానిని రంగులలో, గీతలలో కాన్వాస్పై ఆవిష్కరించే ప్రయత్నాలు ఆయన దీర్ఘకాలంగా కొనసాగిస్తున్నారు.  ఆచ్ఛాదన, అశ్లీలతలేని అందమైన స్త్రీ మూర్తిని సృష్టించగల దిట్ట. ఆయనే 'కళారత్న'డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు.   ఆయన వృత్తి వైద్యం. ప్రవృత్తి చిత్రకళ.  వైద్య వృత్తిలో ఊపిరిసలపకుండా ఉన్నప్పటికీ  చిత్రకళపై ఆయనకు మక్కువ ఏమాత్రం తగ్గలేదు. చిత్రకళలో కూడా ఉన్నత స్థాయికి ఎదిగారు.  ఆయన చిత్రకలకు ప్రధాన వస్తువు స్త్రీ మూర్తి. ప్రకృతి దృశ్యాలు - మనసులో మెదిలే భావాలు - ఆలోచనలు - స్త్రీ సౌందర్య రూపాలన్నింటినీ ఆయన కాన్వాస్ మీద ఆవిష్కరించారు. అశ్లీలత గోచరించకుండా అందమైన స్త్రీ రూపాన్ని అంతే అందగా, నగ్నంగా చిత్రించగల కళాపిపాసి. అవన్నీ ఆయన ప్రతిభకు అద్దం పడతాయి. అంతర్జాతీయ స్థాయి చిత్రకారుల కళారీతులను అధ్యయనం చేశారు. దేశ విదేశాల్లో అనేక మంది చిత్రకారులను కలసి వారితో భావాలను పంచుకున్నారు.  సాహిత్య, సంగీతంలో కూడా ఆయనకు ప్రవేశం ఉంది. ఇంగ్లీషు, తెలుగు భాషల్లో దిగ్గజాల రచనలు, కవితలు చదివి ఆయన ఓ గొప్ప తత్వవేత్తగా ఎదిగారు. సాహిత్యంలోని లోతులను ఎంతగా అవగాహన చేసుకుంటారో, సంగీతంలోని మాధుర్యాన్ని అంతగా ఆస్వాదిస్తారు. ఒక్క స్త్రీ సౌందర్యాన్నే కాకుండా, ప్రకృతిలోని అందాలతోపాటు 'వర్ణవిలాసంలో స్వర్ణవినాయకం' అని విఘ్నేశ్వరుని కూడా పలు రూపాలలో చిత్రించారు.  చిత్రకారులకు వినాయకుని రూపం ఓ వరం. 5,6 గీతలతో కూడా ఆ రూపాన్ని చూపించగలరు. మాచిరాజు కూడా వివిధ రంగుల్లో అనేక రూపాలకు జీవం పోశారు. తన అపురూప చిత్రాలతో ఖండాతరవాసులను కూడా ఆయన ముగ్దలను చేశారు. డాక్టర్ మాచిరాజు దేశవిదేశాల్లో హైదరాబాద్, బెంగళూరు, పాండిచేరి, ముంబై, న్యూఢిల్లీలతోపాటు మాంచెస్టర్, లివర్ పూల్, వేల్స్, చెష్టర్ షైర్ వంటి చోట్ల తన ఆర్ట్ ఎగ్జిబిషన్లు నిర్వహించారు.

          పెన్సిల్తో మొదలై జలవర్ణం, తైలవర్ణం చిత్రాల వరకు - సాంప్రదాయ చిత్రాల నుంచి ఆధునిక నైరూప్య చిత్రాల వరకు -  ఒంగోలు నుంచి లండన్ వరకు ఆయన చిత్రకళా ప్రదర్శనల ప్రస్తానం కొనసాగుతోంది. ఆయన ఆలోచనల దొంతరుల నుంచి రూపుదిద్దుకున్న చిత్రాలు  కళాభిమానులను అబ్బుపరుస్తాయి. బాపు, ఎస్ వి రామారావు వంటి సుప్రసిద్ద చిత్రకారుల ప్రశంసలు అందుకున్నారు.   కాల క్రమంలో ఏడాదికేడాది కొత్త ఆలోచనలతో , కొత్త ఆవిష్కరణలతో ఆయన చిత్ర కళలో వైవిద్యం, పరిణతి కనిపిస్తోంది. ఎన్ని ఇజాలను ఆయన అధ్యయనం చేసినా, ఎంతమందిని అభిమానించినా  సాంప్రదాయ, ఆధునిక రీతుల మేళవింపుతో తనదైన ఓ కొత్త శైలిని రూపొందించుకున్నారు.  రంగుల ప్రపంచంలో నిత్యనూతనంగా ప్రయాణించే ఓ స్వాప్నికుడు. కొంగొత్త స్పూర్తితో మాయా సౌందర్యం  అంతఃకోణాన్ని నైరూప్యతతో నూతన పద్దతులలో చిత్రించడం కూడా మొదలుపెట్టారు. నైరూప్య చిత్రాల అస్పష్టతలోంచి స్పష్టత చూపే ప్రయత్నం చేస్తున్నారు. నైరూప్యత అంటే అదో చైతన్య స్రవంతి. సత్య సౌందర్యం. దృశ్యానికి భాష అవసంరలేదు.  కుంచె పట్టుకుంటే ఆయన ఓ తత్వవేత్తయిపోతారు. ఆ రంగుల్లో, ఆ గీతల్లో, ఆ ఒంపుల్లో చెప్పే అంశాలు అనంతం. అదో అద్భుత ప్రపంచం. ఆయన కుంచె నుంచి జాలువారిన  నైరూప్యతలో స్పష్టత వచ్చిన తరువాత, ఆ స్వచ్ఛత, ఆ నిర్మలత్వం, దాని అర్ధం బోధపడటం....ఆ అనుభూతి, ఆ ఆనందం, ఆ హాయి వేరు. అది అనుభవించవలసిందే. వర్ణించడం సాధ్యంకాదు. అదో మధురానుభూతుల మేళవింపు. ఆ రంగుల్లో, ఆ గీతల్లో, ఆ ఒంపుల్లో చెప్పే అంశాలు అనంతం. అదో అద్భుత ప్రపంచం. స్త్రీ మూర్తిని అర్ధం చేసుకోవడం, ఆమె సౌందర్యాన్ని  తెలుసుకోవడమేకాదు సాహిత్యం, సంగీతంలో కూడా ఆయనకు ప్రవేశం ఉంది. వాటిలో కూడా ఆయన  పరిపూర్ణత సాధించారు. జ్ఞాన దృష్టితో రాగాలను కూడా రంగులలోకి మార్చగల సమర్ధుడు. ఇప్పుడు రాగాలను కూడా  వర్ణ రూపంలోకి మార్చే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఆ బృహత్తర కార్యక్రమాన్ని ఓ  తపస్సు, యజ్ఞంలా  కొనసాగిస్తున్నారు.   మేళకర్తల రాగాలకు వర్ణ రూపం    తేవడానికి 15 ఏళ్లుగా డాక్టర్ మాచిరాజు కుంచెతో సృజనాత్మకంగా కుస్తీ పడుతున్నారు.

        ఆయన సృష్టించే చిత్రాలకు ప్రేరణ గురించి ప్రస్తావించినప్పుడు, సమయం - వయసు - సందర్భం... ఏది ప్రభావితం చేస్తే అది కాన్వాస్ మీద ఆవిష్కరణ అవుతుందని చెప్పారు. స్త్రీ మూర్తిని నగ్నంగా చూపుతారన్న విమర్శకు  అందానికి ఆచ్ఛాదన దేనికి? అని ప్రశ్నించారు.  అలా అని స్త్రీని చపలచిత్తంతో చూడనని,  అందమైన దృష్టితోనే చూస్తానని, ఆ దృష్టితోనే తన మదిలో మెదిలిన రూపాన్ని గీస్తానని వివరించారు.  కర్ణాటక సంగీతంలో 72 తల్లి రాగాలు ఉన్నాయని, 72 మేళకర్తల రాగాలను వర్ణరూపంలోకి తీసుకువచ్చే ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్నట్లు తెలిపారు.  ఇది తన జీవిత లక్ష్యంగా పేర్కొన్నారు. 15 ఏళ్లుగా ఇది కొనసాగుతోందన్నారు. ఇప్పుడే తుది దశకు వచ్చినట్లు తెలిపారు. దీనిని పూర్తి చేసి ప్రపంచ వ్యాప్తంగా కళా ఉత్సవాలు నిర్వహించాలని అనుకుంటున్నట్లు డాక్టర్ మాచిరాజు అని తన మనసులోని మాటలు చెప్పారు.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

May 20, 2017

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యస్థీకరణ చట్టంలోని సెక్షన్ 108ని మరో 2 ఏళ్లు పొడిగించాలి

కేంద్రాన్ని కోరాలని రాష్ట్రం నిర్ణయం

Ø మీడియా సమావేశంలో మంత్రి కాలవ, మీడియా సలహాదారు పరకాల వెల్లడి
Ø రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీలేదు
Ø వివాదాలులేవు-ఇబ్బందులే!
Ø స్థానికత మరో 2 ఏళ్లు పెంచాలి

సచివాలయం, మే 19: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ 
పరకాల ప్రభాకర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 108ని మరో 2 ఏళ్లు పొడిగించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వారు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం 1 బ్లాక్ లోని తన కార్యాలయంలో శుక్రవారం చట్టం అమలును పర్యవేక్షించే ఉన్నతాధికారులతో సమావేశమై చట్టం అమలు తీరును, స్థానికత, సెక్షన్ 108, షెడ్యూల్ 9,10 తదితర అంశాలను సమీక్షించారని తెలిపారు. అనంతరం సచివాలయం 1వ బ్లాక్ లోని సమావేశమందిరంలో కాలువ శ్రీనివాసులు, పరకాల ప్రభాకర్ లు సమావేశం వివరాలను మీడియాకు తెలిపారు. చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో పొందుపరిచిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు వంటి 231 సంస్థల విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలు, ఇబ్బందులు తలెత్తిగే సెక్షన్ 108 ప్రకారం వాటిని రాష్ట్రపతికి తెలియజేసే అవకాశం ఉందన్నారు. అయితే జూన్ 1తో ఆ సెక్షన్ కాలపరిమితి ముగుస్తుందని, ప్రస్తుతానికి సమస్యలు ఏమీ లేకపోయినా, భవిష్యత్ ను దృష్టిలోపెట్టుకొని ముందు జాగ్రత్తతో ఆ సెక్షన్ ను రెండేళ్లు పొడిగించమని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఉన్నత విద్యా మండలికి సంబంధించి సుప్రీం కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిందని, దానికి విరుద్దంగా కేంద్రం జారి చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరినట్లు మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం ఏదైనా సంస్థ ప్రధాన కార్యాలయం ఏ భవనంలో ఉంటుందో దానినే హెడ్ క్వార్టర్ అనాలని, ఆ ప్రాంగణం మొత్తాన్ని పరిగణించరాదు, అయితే ఇది సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్దమని ఆయన తెలిపారు. 9 షెడ్యూల్ లోని 64 సంస్థలకు సంబంధించి షీలా బిడే కమిటీ అధ్యయనం చేసి సిఫారసులు చేసినట్లు. ఇంకా 35 సంస్థల సిబ్బంది విభజన ఆమోదించవలసి ఉందని తెలిపారు.

విభజన చట్టంలోని హక్కులను చాలావరకు రాబట్టామని, అందులో లేనివి కూడా సాధించినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై త్రిసభ్య కమిటీ తరచూ గవర్నర్ తో సమావేశమవుతున్నట్లు తెలిపారు. ఆ సమావేశాలకు తెలంగాణ నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఇంకా ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆ ప్రయత్నాలను ఇంకా ముమ్మరం చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు పొందే విషయంలో రాజీలేదన్నారు. మనకు రావలసినవాటిని సాధించుకోవడంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంతోపాటు అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకుంటున్నట్లు వివరించారు. అయితే ఇంకా పరిష్కారం కాని అంశాలను ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకువెళుతున్నట్లు మంత్రి చెప్పారు. అన్ని అంశాలను తెలియజేస్తూ ఈ నెల 11న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కరించమని ఆ లేఖలో కోరినట్లు చెప్పారు. చట్ట ప్రకారం రావలసినవన్నీ దక్కించుకోవడానికి న్యాయం జరిగే వరకు కేంద్రం ద్వారా ప్రయత్నిస్తామన్నారు. ఏపీకి జరిగే నష్టాన్ని వివరించి రావలసిన ఆస్తులను రాబడతామని చెప్పారు. అలా కాని పక్షంలో సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తామన్నారు. త్వరలో తామిద్దరితోపాటు ఉన్నతాధికాలు కలసి ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రిని, హాం శాఖ అధికారులను కలిసి అన్ని అంశాలను వివరిస్తామని చెప్పారు.

వివాదాలు లేవు ఇబ్బందులే : డాక్టర్ పరకాల

ఉన్నత స్థాయిలో దఫదఫాలుగా సమావేశమవుతూ విభజన చట్టంలోని అంశాలను పరిష్కరిస్తున్నట్లు పరకాల ప్రభాకర్ తెలిపారు. విభజన విషయంలో ఇరు రాష్ట్రా మధ్య వివాదాలు ఏమీలేవని, ఇబ్బందులు మాత్రమే ఉన్నాయని, పరిపాలనా పరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుదని వివరించారు. ముందు జాగ్రత్త చర్యగా సెక్షన్ 108ని పొడిగించమని కోరుతున్నట్లు తెలిపారు. చత్తీస్ గఢ్, జార్ఖండ్ విడిపోయి ఇంతకాలమైనా వాటికి సంబంధించిన ఆస్తులు తరత్రా విభజనలు ఇంతవరకు పూర్తికాని విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని, ఆస్తులు, నగదు, భవనాలు, అప్పుల విభజనను పున:పరిశీలించమని విజ్ఙప్తి చేస్తున్నట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలతోపాటు అన్ని విధాల రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు చేయూతనివ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు. కొన్ని క్లిష్టమైన అంశాలు ఉంటాయని, త్వరగా పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. స్థానికత అంశం కూడా జూన్ 1తో ముగుస్తుందని, దానిని మరో రెండేళ్లు పొడిగించాలని కోరుతున్నట్లు తెలిపారు. అన్ని అంశాల్లో న్యాయం పొందేందుకు చివరి వరకు అన్ని విధాల ప్రయత్నిస్తామని, హక్కులను సాధించుకునేందుకు ఎంతవరకైనా వెళతామని, అవసరమైతే న్యాయం కోసం సుప్రీం కోర్టునైనా ఆశ్రయిస్తామని డాక్టర్ పరకాల చెప్పారు.

May 18, 2017

అసభ్యకరమైన వ్యాఖ్యలు భావప్రకటనా స్వేచ్ఛకు నిదర్శనమా?

ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్
·       జస్టిస్ కట్టూ ఇంట్లో ఆడవారిపై ఇటువంటి రాతలు రాస్తే సహిస్తారా?
·       సచివాలయంలోని కంప్యూటర్లపై వైరస్ ప్రభావం లేదు

        
   సచివాలయం, మే 18: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యకరమైన వ్యాఖ్యలు, జుగుప్స కలిగించే అర్ధనగ్న చిత్రాల పోస్టింగ్స్, వాటిని సమర్థిస్తున్న ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ నేతల వ్యవహార శైలిపట్ల ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో గురువారం మధ్యాహ్నం జరిగిన  మీడియా సమావేశంలో ఆయన  మాట్లాడారు. సోషల్ మీడియా అరెస్టులపై  జస్టిస్ కట్టు మాట్లాడిన మాటలకు ఆయన అభ్యంతరం తెలిపారు. ఇటువంటి వాటిని అడ్డుకోవడానికి చట్టాలు ఉన్నాయని, వాటిని అమలు చేయడం ప్రభుత్వ బాధ్యతగా అని ఆయన పేర్కొన్నారు. వారు చేసిన పని రాజ్యాంగ విరుద్ధమైనదని, వారిని అరెస్ట్ చేయడం రాజ్యాంగాన్ని గౌరవించినట్లు అవుతుందన్నారు.  వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తరువాత క్షమాపణలు చెప్పడం ఆయనకు అలవాటన్నారు. సుప్రీకోర్టుపైన, సుప్రీం కోర్టు జడ్జిలపైన, జర్నలిస్టులపై ఆయన గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పిన విషయాలను గుర్తు చేశారు. వాస్తవాలు తెలిసిన తరువాత ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నామన్నారు. భావప్రకటనా స్వేచ్ఛపై ఈ ప్రభుత్వానికి నమ్మకంలేనట్లు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తమ ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అనేక వేదికలపై చెప్పినట్లు పేర్కొన్నారు. నిర్మాణాత్మక విమర్శలు చేయడాన్ని తమ ప్రభుత్వం ఆహ్వానిస్తుందన్నారు.
            వ్యక్తిత్వ హననం, సభ్య సమాజం అసహ్యించుకునే నీచమైన స్థాయిలో చిత్రాలు, భాషను సోషల్ మీడియా పేరుతో వాడడం సబబేనా అని ఆయన ప్రధాన  ప్రతిపక్షాన్ని సూటిగా ప్రశ్నించారు. మనం పలకలేని, ఏ పత్రికలో ప్రచురించడానికి, టీవీలో ప్రసారం చేయడానికి అర్హతలేని భాషను,  మార్ఫింగ్ చిత్రాలను, అర్థనగ్ర చిత్రాలను పోస్టు చేస్తున్నట్లు చెప్పారు. వీటిని వారి పత్రికల్లో ఎందుకు ప్రచురించడంలేదని, టీవీలో ఎందుకు ప్రసారం చేయడంలేదని ఆయన అడిగారు. కట్జూ ఇంట్లోని ఆడవారి మీద ఇలాంటి అసభ్య రాతలు రాస్తే అంగీకరిస్తారా? భావ ప్రకటన స్వేచ్ఛ అని ఊరుకుంటారా? అని  డాక్టర్ పరకాల ప్రశ్నించారు.
                  ప్రస్తుతం సోషల్ మీడియాలో అభ్యంతరక వ్యాఖ్యలు, చిత్రాలు పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేసిన ఇదే ఇంటూరి రవికిరణ్ మీద 31 జులై 2014లో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలే  విశాఖపట్నం జిల్లాలోని జీకే వీధి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అప్పటి ఎఫ్ఐఆర్ కాపీని కూడా చూపారు. కొత్తపల్లి గీత మీద రవికిరణ్ అసభ్య రాతలు, చిత్రాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఆ పార్టీ కార్యకర్తల ఫిర్యాదుపై ఇంటూరి రవికిరణ్, ఇప్పాల రవీంద్ర రెడ్డి అనే ఇద్దరిని  పోలీసులు అరెస్టులు చేశారని, ఆ తరువాత వారు కొన్ని నిబంధనలకు లోబడి బెయిల్ పై విడుదలైనట్లు చెప్పారు. ఆనాడు రవికిరణ్ మీద పెట్టిన కేసు భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమేనా? అప్పుడు ఆ పార్టీ వారు ఒక్కరు కూడా ఏమీ మాట్లాడలేదని చెప్పారు.  ఏడాది కాలంగా పెడుతున్న ఈ పోస్టింగులను ఇప్పుడు తొలగించారు. అరెస్టులు భావ ప్రకటన స్వేచ్ఛకు భంగకరమని నమ్ముతూ వుంటే ఎందుకు  పోస్టింగులు తీసేశారని ఆయన ప్రశ్నించారు. మహిళలను బికినీల్లో చూపించడం, పలకలేని భాషతో వ్యాఖ్యానాలు చేయడం, అక్రమ సంబంధాలు అంటగట్టడం.. తగునా అని ప్రశ్నించారు. డ్రయివర్లతో అక్కచెల్లెళ్లకు అక్రమ సంబంధాలు అంటగట్టడం ఏవిధమైన భావ ప్రకటన స్వేచ్ఛ అని మీరు అనుకుంటున్నారని ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు.   ఇటువంటి పోస్టింగులను తీవ్రంగా పరిగణించి  పౌర సమాజం చర్చించవలసిన అవసరం ఉందన్నారు.  సోషల్ మీడియాలో వస్తున్న అసభ్య రాతలను ఎంతవరకు అమోదించాలనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరగాలన్నారు. ఇందులో వున్న అనౌచిత్యాన్ని పౌరులు ప్రశ్నించనాడే మళ్లీ ఇలాంటి వారు అసభ్యమైన కార్టూన్లు పెట్టడానికి సాహసించరని చెప్పారు. కార్టూన్ అంటే కొంత వ్యంగ్యంగా, వెటకారంగా ఉంటుందని, అది అసభ్యంగా చిత్రీకరించడం కాదన్నారు. తమపై వేసిన కార్టూన్లను చూసిన ప్రముఖులు కూడా నవ్వుకుంటారని,  జవహర్ లాల్ నెహ్రూ మీద కూడా  కార్టూన్లు వేస్తే వాటిని చూసి ఆయన నవ్వుకునేవారని చెప్పారు.

సచివాలయంలో వైరస్ ప్రభావంలేదు
           రాష్ట్ర సచివాలయంలోని కంప్యూటర్లపై రాన్సమ్ వేర్ వన్నా క్రై వైరస్ ప్రభావం చూపిందని ఒక వర్గం మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని డాక్టర్ పరకాల ప్రభాకర్ చెప్పారు. ఈ విషయంలో ప్రజల్లో ఎటువంటి అయోమయం, అనుమానం లేకుండా ఉండేందుకు వివరణ ఇస్తున్నట్లు తెలిపారు. సచివాలయంలో వున్న  సిస్టమ్స్‌ అన్నీ పటిష్టమైన యాంటీ వైరస్‌తో సురక్షితంగా వున్నాయన్నారు. ఎవరూ ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని చెప్పారు. సచివాలయంలో మొత్తం 1350 సిస్టమ్స్ ఉన్నాయని తెలిపారు. వాటిని అన్నిటినీ పరీక్షించారని, ఎటువంటి వైరస్ లేదని చెప్పారు. 9 హార్డ్ డిస్క్ లు మాత్రం వాడటంలేదని, వాటిని తీసివేసినట్లు డాక్టర్ పరకాల తెలిపారు.