May 12, 2017

15 నుంచి సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు

వెలగపూడి సచివాలయంలో పని చేసే అధికారులు, ఉద్యోగులందరూ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్  ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయ ఉద్యోగులు వారానికి 5 రోజులు పనిచేసే అకాశం ప్రభుత్వం కల్పించిందని, అందువల్ల ఉద్యోగులు అందరూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పని చేయాలని తెలిపారు. ఈ నెల 15 నుంచి సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి ఉదయం 10 గంటలకు కార్యాలయంలోని తమ తమ సీట్లలో ఉండాలన్నారు. కార్యాలయం లోపలికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు తప్పనిసరిగా బయోమెట్రిక్ డివైస్ లో నమోదు చేయాలన్నారు. కొంతమంది అధికారులు, ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరుకావడంలేదని, సమావేశాలకు, సమీక్షలకు అందుబాటులో ఉండటంలేదని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. సచివాలయ అధికారులు, ఉద్యోగులు బయోమెట్రిక్ విధానాన్ని పాటించే విధంగా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని, ఆ మేరకు ఉన్నతాధికారులకు ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
డిప్యూటీ సెక్రటరీ ప్రతిరోజూ హాజరు వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. ప్రతి శాఖకు సంబంధించి ఆయా శాఖల కార్యదర్శులు హాజరు వివరాలను కన్సాడిడేట్ చేసి నెలవారీ నివేదికను ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి పంపిస్తారని తెలిపారు.

జారీ చేసిన వారు: పబ్లిసిటీ సెల్, సచివాలయం, అమరావతి  సెల్ నెంబర్ : 9949351604


మరో 15 రోజులకు ధాన్యం కొనుగోలు గడువు పెంపు

·      పౌరసరఫరాల శాఖ మంత్రిగా ప్రత్తిపాటి పుల్లారావు బాధ్యతల స్వీకరణ
    రేషన్ సరకుల పంపిణీలో నగదు రహిత లావాదేవీలు తప్పనిసరి కాదు
          సచివాలయం, ఏప్రిల్ 10 : ధాన్యం కొనుగోలు గడువును మరో 15 రోజులకు పెంచుతున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన రెండ్రోజుల్లో ఆన్ లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తామన్నారు. సచివాలయంలోని నాలుగో నెంబర్ బ్లాకులోని తన ఛాంబర్ లో సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రిగా ప్రతిపాటి పుల్లారావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రేషన్ సరకుల పంపిణీలో నగదు రహిత లావాదేవీలు తప్పనిసరి కాదని పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఎవరైనా నగదు రహిత లావాదేవీలు జరపాలని పట్టుబడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్డుదారులు తమకు వీలైన రీతిలో సరుకులు కొనుగోలు చేసుకోవొచ్చునన్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు నిలిపినట్లు తన దృష్టికి సమాచారం వచ్చిందన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ధాన్యం కొనుగోలు గడువును మరో 15 రోజులకు పెంచుతున్నామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన రెండ్రోజుల్లో ఆన్ లైన్ ద్వారా డబ్బులు చెల్లిస్తామన్నారు. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తామన్నారు. కోటీ 40 లక్షలకు పైగా ఉన్న కార్డుదారులకు నాణ్యమైన సరకులను పంపిణీ చేస్తామన్నారు. పేదలకు అన్నంపెట్టే నిత్యావసర సరకుల పంపిణీలో ఎటువంటి అవకతవకలూ చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు తనపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నెరవేరుస్తానని మంత్రి తెలిపారు. పౌర సరఫరాల శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేవిధంగా కృషి చేస్తానన్నారు. జూన్ నాటికి అందరికీ గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం చక్కెర పంపిణీపై సబ్సిడీ ఎత్తివేసిందన్నారు. ఏప్రిల్ నెలకు కార్డుదారులపై భారం పడకుండా ఉండేలా రాష్ర్ట ప్రభుత్వమే సబ్సిడీపై చక్కెర పంపిణీ చేస్తోందన్నారు. వచ్చే నెల నుంచి ఎలా పంపిణీ చేయాలన్నది త్వరలో సీఎంను సంప్రదించి చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు ఆయన తన ఛాంబర్లో దేవుని చిత్రపటాల ముందు పూజలు జరిపారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ర్ట వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్ సభ్యునిగా రిటైర్డ్ జడ్జి ముత్యాలనాయుడి నియామక ఫైల్ పై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తొలి సంతకం చేశారు. పౌర సరఫరాల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రత్తిపాటి పుల్లారావును, ఎంపి రాయపాటి రాయపాటి సాంబశివరావు, వినుకొండ ఎమ్మెల్యే, టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, జిల్లా పరిషత్ చైర్మన్ జానీమూన్, ఎమ్మెల్యే శ్రావణ్, ఎమ్మెల్సీ రామకృష్ణతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పౌర సరఫరాల శాఖ  కమిషనర్ బి.రాజశేఖర్, డైరెక్టర్ జి.రవిబాబు, గుంటూరు జేసీ కృతికా శుక్లా, డీఎస్ వో చిట్టిబాబు తదితరులు అభినందనలు తెలియజేశారు.
జారీ చేసిన వారు : పబ్లిసిటీ సెల్, సచివాలయం, అమరావతి


దేశానికే ఆదర్శంగా గ్రామాల అభివృద్ధి

గ్రామీణాభివృద్ధి శాఖ వర్క్ షాప్ ప్రారంభంలో మంత్రి లోకేష్
         అమరావతి సచివాలయం :ఏప్రిల్ : 7: రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని మోడల్ గ్రామంగా అభివృద్ధి చేసి, రాష్ట్రానికే కాకుండా దేశానికే ఆదర్శంగా నిలవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులకు పిలుపు ఇచ్చారు. సచివాలయంలోని 5వ బ్లాక్ లో శుక్రవారం ఉదయం గ్రామీణాభివృద్ధి శాఖ వర్క్ షాప్ ను ఆయన  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ శాఖ అధికారులతో గ్రామాల అభివృద్ధి, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థలపై ప్రధానంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇష్టమైన, బాధ్యత గల ఈ శాఖను తనకు అప్పగించారన్నారు. సీఎం ఆకాంక్ష మేరకు వచ్చే రెండేళ్లలో ఉపాధి హామీ పథకం నిధులతో రాష్ట్రంలో 1340 మోడల్ గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. ఇందుకు సీనియర్లు బాధ్యత తీసుకోవాలని,  అధికారులు పూర్తిగా సహకరించాలని కోరారు. తాను కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామం దత్తత తీసుకున్నట్లు తెలిపారు.
         పశ్చిమ గోదావరి జిల్లాలోని జగన్నాథపురం, సింగరాజుపాలెం తదితర 11 గ్రామాల్లో పూర్తిగా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. 70 శాతం ఉపాధి హామీ పథకం నిధులు, 20 శాతం జిల్లా పరిషత్ నిధులు, పది శాతం నిధులు ప్రజల నుంచి సేకరించి ఈ పనులు పూర్తి చేసినట్లు వివరించారు. ప్రజల నుంచి దాదాపు ఏడు కోట్ల రూపాయలు సమకూరినట్లు తెలిపారు. ఇప్పుడు ఆ గ్రామాల్లో మురుగు వాసన లేదని, దోమలు లేవని అధికారులు మంత్రికి వివరించారు.
             ఒక గ్రామంలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు  చేయడానికి పట్టే సమయం, ఖర్చు, ఎదురయ్యే సమస్యల గురించి ప్రతి చిన్న అంశం అధికారులను అడిగి తెలుసుకున్నారు. చివరికి మురుగు నీరు ఎక్కడ కలిపేది, పొల్యూషన్ సమస్య తలెత్తకుండా తీసుకునే చర్యలు తదితర విషయాలకు సంబంధించి మంత్రి అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు సవివరంగా సమాధానాలు చెప్పారు.
          ఒక్కో గ్రామానికి ఆరు నెలల సమయం పడుతుందని, కిలో మీటర్ కు రూ.15 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, గ్రామాల్లో నైపుణ్యత గల ప్లంబర్ వర్కర్లు వంటి వారు దొరకడం కష్టమని అధికారులు వివరించారు. టెండర్లు పిలిస్తే ఎక్కువ సమయం 6 నుంచి 8 నెలలు పడుతుందని చెప్పారు. ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టే పనులు అయినందున వీటికి టెండర్లు పిలవకుండా చేపడతారు. అందువల్ల 3 నుంచి 4 నెలల్లో పూర్తి అయ్యే అవకాశం ఉందని ఒక అధికారి వివరించారు.

         ఆ సమయాన్ని తగ్గించే మార్గాలను మనం వెతకాలని మంత్రి అన్నారు.  ఒక గ్రామంలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సర్వే మొదలు పూర్తి అయ్యేంతవరకు ఏ పనికి ఎంత సమయం పడుతుందో పది రోజుల్లో ఒక నివేదిక ఇవ్వమని అధికారులను కోరారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యత లోపించకుండా ప్రయోగాలు చేసి తక్కువ సమయంలో పూర్తి చేయాలని మంత్రి సలహా ఇచ్చారు.


జారీ చేసిన వారు: పబ్లిసిటీ సెల్, సచివాలయం, సెల్ నెంబర్ : 9949351604



మంత్రి మండలి సమావేశంలో పలు నిర్ణయాలు

మిర్చి ధరల పతనంపై చర్చ   
5వేల చెక్ డ్యాంల నిర్మించాలని నిర్ణయం
మున్సిపాల్టీల్లో ఏపీ ల్యాండ్ డెవలప్ మెంట్ -2017 ముసాయిదా ఆమోదం
తాగునీటికి కొరతలేకుండా పఠిష్టమైన చర్యలు
         
          ఏప్రిల్ 6:  మంత్రివర్గ పునర్యవస్థీకరణ తరువాత సచివాలయంలో గురువారం మొదటిసారిగా జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. సమావేశం అనంతరం రాత్రి 7.30 గంటలకు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా మిర్చి రైతుల సమస్యలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ అంశంపై మంత్రులు తమతమ అభిప్రాయాలు తెలిపినట్లు చెప్పారు. మిర్చి ధర పతనం కావడానికి కారణాలు, ఏం చేస్తే రైతులకు న్యాయం జరుగుతుందో తెలుసుకొని ఒక నివేదిక ఇవ్వవలసిందిగా వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, గుంటూరు జిల్లా మంత్రి పత్తిపాటి పుల్లారావులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. మంత్రులు రైతులతో మాట్లాడి, సమీక్షించి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారని చెప్పారు.  వారి సిఫారసులు అందిన వెంటనే చర్యలు తీసుకోనున్నట్లు సీఎం చెప్పినట్లు తెలిపారు.  మిర్చి రైతుల ప్రస్తుత పరిస్థితిపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

           వేసవి ప్రారంభమైనందున తలెత్తే ప్రధాన సమస్యలపై కూడా చర్చించినట్లు మంత్రి తెలిపారు. తాగునీరు, పశుగ్రాసం, కూలీల కష్టాల తదితర అంశాలపై చర్చించినట్లు వివరించారు. ఈ వేసవిలో 5వేల చెక్ డ్యాంలు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 45 రోజుల ప్రత్యేక కార్యక్రమం చేపట్టి వర్షాకాలం నాటికి చెరువులు, కుంటల మరమ్మతులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. జిల్లాల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని ఉపాధి పథకం నిధులను ఉపయోగించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
           హీరో మోటార్స్ కు భూముల కేటాయింపునకు సంబంధించి కొన్ని సవరణలు చేసినట్లు చెప్పారు. ఆ కంపెనీ మొదటి దశలో రూ.800 కోట్ల పెట్టుబడి పెడుతుందని, రెండు, మూడు దశలల్లో మరో రూ.800 కోట్లు పెట్టుబడి పెడుతుందని వివరించారు. ఆ కంపెనీకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు ఏపీఐఐసీకి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
నగరాలు, మున్సిపాలిటీలు వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఎదురయ్యే సమస్యలను చర్చించినట్లు చెప్పారు. ముఖ్యంగా లేఅవుట్లు, గృహ నిర్మాణం వంటి విషయంలో ఎదురయ్యే సమస్యలకు సంబంధించి కొన్ని సవరణలను ఆమోదించినట్లు తెలిపారు. స్థలాల దురాక్రమణ, అక్రమకట్టడాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశించినట్లు చెప్పారు. ఏపీ ల్యాండ్ డెవలప్ మెంట్ రూల్స్-2017 ముసాయిదాను ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. అక్రమకట్టడాల విషయంలో కట్టిన తరువాత ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ముందుగానే అధికారులు కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు.
వేసవిలో ఉపాధి కూలీల సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకొని  టోల్ ఫ్రీనెంబర్ ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వేసవిలో మంచినీటి సమస్యలపై జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని, పనులను వేగం వంతం చేయాలని మంత్రులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ రాగానే వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకునేవిధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.

కొంతమంది మంత్రులు కొత్తగా బాధ్యతలు స్వీకరించినందున ఆయా విభాగాధిపతులతో కూడా సమావేశమైనట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, వివిధ అంశాలల్లో ఏ ఏ సంవత్సరానికి ఏ మేరకు లక్ష్యాలు నిర్ణయించారో ఆ మేరకు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ విషయంలో ఆయా విభాగాధిపతులు, మంత్రులు బాధ్యత వహించాలని సీఎం చెప్పినట్లు తెలిపారు.  ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటూ ముందుకు వెళదామని సీఎం చెప్పినట్లు వివరించారు.
రాష్ట్రంలోని గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు ఉన్నట్లు కేంద్రం వద్ద నివేదిక ఉండటంతో మనకు నిధులు రావడంలేదని చెప్పారు. అలాగే రాష్ట్రంలో 5 లక్షల మందే ఇళ్లు లేనివారు ఉన్నట్లు కేంద్రం వద్ద లెక్కలు ఉండటంతో ఆ మేరకు తక్కువ నిధులు మనకు వస్తున్నట్లు తెలిపారు. న్యాయంగా మనకు రావలసిన నిధులు రావడంలేదని చెప్పారు.  వాస్తవానికి రాష్ట్రంలో 28 లక్షల నుంచి 30 లక్షల మంది ఇళ్లు లేనివారు ఉన్నారని, వారందరూ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నట్లు  వివరించారు.
వివిధ శాఖల మంత్రులు తమ పరిధిలోని సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని  సీఎం ఆదేశించినట్లు చెప్పారు. ప్రభుత్వ చేపట్టిన ఏడు మిషన్లు, 5 గ్రిడ్లు, 5 ప్రచార అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ మెరుగైన కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్థిక వనరులు, నిధులు సమీకరణ, నిధుల విడుదలకు సంబంధించి అన్ని శాఖలు పది రోజుల్లొ నివేదికలు రూపొందించాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. నీటి సమస్య పరిష్కారానికి వెంటనే తగిన చర్యలు తసుకోవలసిందిగా కూడా సీఎం ఆదేశించినట్లు మంత్రి చెప్పారు.

జారీ చేసిన వారు: పబ్లిసిటీ సెల్, సచివాలయం సెల్ నెంబర్ : 9949351604


శివసేన చర్యలను ఖండించిన మంత్రి కాలవ


        సచివాలయం: ఏప్రిల్ 6: భారత పార్లమెంటరీ వ్యవస్థలో అత్యంత ప్రాముఖ్యత గల లోక్ సభలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు పట్ల శివసేన సభ్యులు దురుసుగా ప్రవర్తించడాన్ని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ఖండించారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ వద్ద గురువారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ అశోక్ గజపతి రాజు మూడున్నర దశాబ్దాలపాటు మచ్చలేనినాయకునిగా పేరు గఢించారన్నారు. అనేక పదవులు అలంకరించి, ఆ పదవులకే వన్నె తెచ్చిన, విలువలకు కట్టుబడిన తమ పార్టీ సీనియర్ నేత అని. అటువంటి వ్యక్తిపై శివసేన సభ్యులు దాడి చేసినంత పని చేయడం అత్యంత దారుణం అన్నారు. పార్లమెంటరీ విలువలువలను దిగజార్చేవిధంగా వారు ప్రవర్తించారని విమర్శించారు. లోక్ సభ వాయిదాపడిన వెంటనే మంత్రి స్థానం వద్దకు వెళ్లి ఆయనను  దూషించడం విచారకరం అన్నారు.

శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విమానయాన సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తిస్తే, విమానయాన సంస్థలు చర్యలు తీసుకోవడం పట్ల ఆ పార్టీ సభ్యులు లోక్ సభలో గొడవ చేశారని చెప్పారు. వారి సమస్యలు చెప్పారు, డిమాండ్లు చెప్పారని, అందులో తప్పులేదన్నారు. శివసేన పార్టీ ముఖ్య నేత అనంత గీత్ వంటి వారు కేంద్ర మంత్రి పట్ల  దురుసుగా ప్రవర్తించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు కాలవ విజ్ఞప్తి చేశారు. 

పేదరిక నిర్మూలన సాధ్యమేనా?

 స్థిరమైన అభివృద్ధి కోసం 17 అంశాలకు అత్యంత ప్రాధాన్యత
 రూపుమాపే దిశగా 2030 వరకు ప్రణాళికలు
      జీసీఐలో 20లోపు స్థానమే లక్ష్యం
          రాష్ట్రంలో పేదరికం సమూలంగా నిర్మూలించడం సాధ్యమేనా? అంటే సాధ్యమేనంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకొని పనులు చేపట్టడంలో ఆయనకు ఆయనే సాటి. హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధికి ఆయన వేసిన పునాదే అందుకు నిదర్శనం. అక్కడ ఐటీ పరిశ్రమ ఏ విధంగా విస్తరించిందో అందరికీ తెలిసిందే.  ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఆ అభివృద్ధి శాశ్వితం. రాష్ట్రం విడిపోయినా ఈ విషయంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాగే రాష్ట్రంలో మారుమూల గ్రామాలతో సహా పేదరికాన్ని నిర్మూలించడానికి కూడా ఆయన నడుం బిగించారు.  ఇందుకోసం ఓ సుదీర్ఘ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. 2030 నాటికి పేదరికాన్ని సమూలంగా తొలగించేవిధంగా లక్ష్యాలను నిర్ధేశించుకొని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆర్థిక వృద్ధి, కుటుంబ వికాసం, సమాజ వికాసం, ఇతర సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఆర్థిక వృద్ధి, సామాజిక సమస్యలు, ఆకలి, పేదరికం, గ్రామపంచాయతీ స్థాయి నుంచి అభివృద్ధి, సంక్షేమం, ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ వంటి 17 అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, 169 లక్ష్యాలను ప్రభుత్వం నిర్ధేశించింది.  2017-18 బడ్జెట్ ని కూడా దీనిని దృష్టిలోపెట్టుకొని రూపొందించారు.
          ముందుగా వేసిన అంచనాల ప్రకారం 2016–17 ఆర్థిక సంవత్సరంలో  12.61 శాతం వృద్ధి రేటు సాధించింది. 2014–15లో 8.5 శాతం, 2015–16లో 10.95 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఒక దశాబ్ధం పాటు స్థిరమైన రెండంకెల సమ్మిళిత వృద్ధి రేటు 12 నుంచి 19 శాతం నమోదు కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2022 నాటికి ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. తలసరి ఆదాయినికి వచ్చేసరికి 2014–15లో రూ.93,699, 2015–16లో రూ.1,07,532, 2016–17లో రూ.1,22,376 ఉంటుందని అంచనా. 2030 నాటికి తలసరి ఆదాయం రూ.9,60,768లకు చేరాలన్నేది లక్ష్యం. మానవాభివృద్ధి సూచిక(హెచ్ డీఎఫ్-హ్యూమన్ డవలప్ మెంట్ ఇండెక్స్) 2015లో 0.67 ఉంది. అది 0.90కి చేరాలన్నది ప్రభుత్వ అంచనా. పేదరిక నిష్పత్తి ప్రాతిపదిక సంవత్సరం 2011-12లో 9.2 ఉంది. దానిని పూర్తిగా నిర్మూలించాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది..
          2015-16 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 45 లక్షల మందికి సామాజిక భద్రత లభిస్తోంది. దానిని వంద శాతానికి చేర్చాలి. రాష్ట్రంలో హెక్టారుకు 2641 కిలోల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. దానిని 4409 కిలోలకు పెంచాలన్నది లక్ష్యంగా నిర్ధేశించారు. 38 శాతం ఉన్న నీటిపారుదల సౌకర్యాన్ని 57శాతానికి పెంచుతారు. 2015లో శిశుమరణాల రేటు వెయ్యికి 35 ఉంది. దానికి 3కి తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రసూతి మరణాల నిష్పత్తి 2015లో లక్షకు 92 ఉంది. దానిని 16కు తగ్గించాలన్నది లక్ష్యం. 2015లో పిల్లల్లో రోగనిరోధక శక్తి 65.3 శాతం ఉంది. దానికి వంద శాతానికి పెంచాలి. 2015లో పోషకాహార లోపం 31.9 గా ఉంది. వంద శాతం మందికి పోహకాహారం అందేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
            2011 లెక్కల ప్రకారం అక్షరాస్యత 67.4 శాతం మాత్రమే ఉంది. దానిని వందశాతానికి పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. మహిళల అక్షరాస్యత 60 శాతం మాత్రమే ఉంది. దానిని నూరు శాతానికి పెంచాలి. 2015-16లో సెకండరీ పాఠశాలల వరకు 80.5 శాతంగా ఉన్న జీఈఆర్(గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో-స్థూల నమోదు నిష్పత్తి)ని వంద శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2015లో 0.29 గా ఉన్న జిని కోఎఫిషియంట్( ఒక దేశం లేక ఒక ప్రాంతంలో దుర్భర పేదరికాన్ని విశ్లేషించే ప్రక్రియ) 0.26కి తగ్గించాలన్నది లక్ష్యం. 2015లో నైపుణ్యత గల కార్మికులు కేవలం 5 శాతం మంది మాత్రమే ఉన్నారు. వారిని రెండు కోట్లకు పెంచవలసి ఉంది. ఇందుకోసం నిధులను కూడా పెంచారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 48 శాతం మందికి మాత్రమే సురక్షితమైన తాగునీరు అందుతోంది. దానిని వంద శాతానికి పెంచడానికి ప్రణాళికలు రూపొందించారు. అలాగే పారిశుధ్యాన్నికి ప్రాధాన్యత ఇస్తూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. 2015-16లో 52.4 శాతం మందికి మాత్రమే మరుగుదొడ్ల సౌకర్యం ఉంది. వంద శాతం మందికి అందుబాటులోకి తీసుకురావడానికి మరుగుదొడ్లు నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రాన్ని త్వరలోనే బహిరంగ మలమూత్ర విసర్జన లేని ప్రాంతంగా ప్రకటించడానికి సీఎం పట్టుదలతో ఉన్నారు. 2015లో 67.4 శాతం ఉన్న ప్రాథమిక సేవలను వంద శాతం పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇ-ప్రగతిలో భాగంగా 2015 నాటికి 329 ప్రభుత్వ సేవలను ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చారు. వంద శాతం ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి చురుకుగా పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఫైబర్ గ్రిడ్ పనులు దాదాపు 90 శాతం పూర్తి అయ్యాయి. త్వరలోనే ఇ-ప్రగతి సాధించిన రాష్ట్రంగా ప్రకటించే అవకాశం ఉంది. 2015-16 నాటికి రాష్ట్రంలో విద్యుత్ స్థాపన సామర్ధ్యం 9486 మెగావాట్లుగా ఉంది. దానిని 42 వేల మెగావాట్లకు పెంచాలన్నది లక్ష్యం. ఇళ్ల వినియోగానికి ఇప్పటికే 24 గంటలు వంద శాతం విద్యుత్ సరఫరా అవుతోంది. 2015-16లో రిన్యూవబుల్ ఎనర్జీ(పునరుత్పదక శక్తి) వాటా5.14 శాతం ఉంది. దానిని 30 శాతానికి పెంచాలన్నది ప్రతిపాదన. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను  వంద శాతానికి తీసుకువెళ్లాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనం నింపే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 2015-16 నాటికి 26 శాతం ఉన్న పచ్చదనాన్ని 50 శాతానికి
పెంచడానికి చర్యలు చేపట్టారు. స్వావలంభన సాధించి, అన్ని రంగాల్లో మహిళలు భాగస్వామ్యం పెరిగే విధంగా ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోంది. 2015లో 37 శాతంగా ఉన్న వారి భాగస్వామ్యం 50 శాతానికి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అలాగే అన్ని రంగాల్లో రాష్ట్రం అంతర్జాతీయ స్థాయికి ఎదిగేవిధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.  2015 అంతర్జాతీయ పోటీ సూచిక (జీసీఐ-గ్లోబల్ కాంపిటేటివ్ ఇంన్ డెక్స్) ప్రకారం 51వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని మొదటి  20 స్థానాల్లో ఒకటిగా నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆయా రంగాలకు కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు చేసి, రూపొందించిన ప్రణాళికలన్నీ సక్రమంగా, అనుకున్న రీతిలో అమలు జరిగితే  లక్ష్యం మేరకు 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యమవుతుంది.
-         శిరందాసు నాగార్జున, డెవలప్ మెంట్ జర్నలిస్ట్ -9440222914







అధికారులను ఆకట్టుకుంటున్న యువనేత నారా లోకేష్


రాజకీయంగా ఎదగాలన్న ఆకాంక్ష, అదే సమయంలో వేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి తన వంతు కృషి చేయాలన్న  తపన ఉన్న యువనేత నారా లోకేష్. మంత్రి పదవి చేపట్టిన ప్రారంభంలోనే తన ప్రవర్తన,  తండ్రి లాగా ఇన్నొవేటివ్ ఆలోచనలతో అధికారులను బాగా ఆకట్టుకుంటున్నారు. అధికారుల పట్ల వినయ విధేయతలతో వ్యవహరించడం, వారి సీనియార్టీని, సామర్ధ్యాన్ని గుర్తించి గౌరవిస్తున్న తీరుపట్ల వారు ఆకర్షితులవుతున్నారు.  మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అమరావతి సచివాలయంలో జరిగిన గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల మొదటి సమీక్షా సమావేశంలో చాలా హుందాగా వ్యవహరించి లోకేష్ అందరి దష్టిని ఆకర్షించారు. అందకి చేతులు జోడించి చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేశారు.  ఆధునిక సాంకేతిక అంశాల మేళవింపుతో కొత్తగా ఆలోచనలు చేయడం తండ్రి నుంచి వంటపట్టించుకున్నట్లు కనిపిస్తోంది. పనుల్లో వేగం పెంచడానికి తండ్రి మాదిరే అధికారులపై వత్తిడి పెంచుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పోల్చితే నవ్వుతూ పలకరించడం, నవ్వుతూ ప్రతి నమస్కారం చేయడం, నవ్వుతూ మాట్లాడటం లోకేష్ ప్రత్యేకత. ఓ బిడ్డకు తండ్రి అయినా మంచి జోష్ తో ఇంకా కుర్రవాడిగానే కనిపిస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కుమారుడైనా ఆ దర్పం ప్రదర్శించడంలేదు. అధికారులకు అది బాగా నచ్చుతోంది. సమావేశానికి రావడం కొంచం అలస్యం కావడంతో రావటం రావటంతోనే క్షమాపణలు కోరారు.


              తనకు అప్పగించిన శాఖ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని, వేగంగా గ్రామాలు అభివృద్ధి చెందాలని, అంతే వేగంగా చేపట్టిన పనులు పూర్తి చేయాలన్న ధృడ సంకల్పం లోకేష్ లో బాగా కనిపిస్తోంది. చాలా ఉత్సాహంగా మనిషి మంచి తేజస్సుతో ఉన్నారు.  అంతే కాకుండా ప్రతి అంశాన్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గ్రామీణాభివద్ధిలో ప్రధానమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజి (భూగర్భ మురుగునీటి పారుదల) వ్యవస్థపై అధికారులను అనేక ప్రశ్నలు అడిగి  అన్ని విషయాలను తెలుసుకున్నారు. ఒక గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తి కావడానికి సర్వే మొదలుకొని పూర్తి అయ్యే వరకు పట్టే సమయం- దానికి వాడే టెక్నాలజీ- అయ్యే ఖర్చు- ఉపాధి హామీ నిధులు –
ఇతర మార్గాల్లో నిధుల సమీకరణ - సీసీ రోడ్లు లేని చోట- ఉన్న చోట పనులు చేపట్టే విధానం, వివిధ దశలలో ఉత్పన్నమయ్యే  సమస్యలు- పైపులు బిగించే పద్దతులు- చివరకు మురుగు నీరు చేరే ప్రదేశం-ప్లాస్టిక్ చెత్త- మురుగు వాసన- దోమలు- కాలుష్యం ఏర్పడకుండా తీసుకునే చర్యలు- గ్రామ సర్పంచ్ లు, స్థానికుల సహకారం....ఇలా అన్ని అంశాలు అధికారులను అడిగి సమగ్రంగా తెలుసుకున్నారు. లోకేష్  ప్రశ్నలు  అడిగే తీరు అందరికీ బాగా నచ్చింది. ప్రశ్నలు అడిగే సమయంలో ‘మీకు టెస్ట్ కాదు, నేను తెలుసుకోవడానికి’ అని వినమ్రంగా చెప్పడం బాగుంది. నర్మగర్భంగా ఆయా అధికారుల అవగాహన, విషయ పరిజ్ఞానం, సామర్థ్యం తెలుసుకోవడానికి కావచ్చు లేదా నిజంగానే తాను తెలుసుకోవడానికి కావచ్చు. ఏదిఏమైనా సీనియర్ అధికారులను గౌరవిస్తూ, పనిని ఇంకా వేగవంతం చేసే విధంగా వారిని ఉత్సాహపరిచారు. దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా గ్రామాలను అభివృద్ధి చేయాలన్న తన ఉద్దేశాన్ని తెలియజేశారు. మధ్య మధ్యలో తన తండ్రి ప్రస్తావన తెస్తూ, ఈ పనులలో వేగం పెరగాలని, త్వరగా పూర్తి కావాలన్నది ముఖ్యమంత్రి గారి ఉద్దేశమని చెప్పారు. ఎంతో బాధ్యత గల ఈ శాఖను తనకు అప్పగించారని లక్ష్యం మేరకు రాబోయే రెండేళ్లలో 1340 గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను అందరం కలసి పూర్తి చేద్దామని చెప్పారు. తక్కువ సమయంలో ఈ పనులు పూర్తి చేయడానికి తీసుకోవలసిన చర్యలు, తలెత్తే సమస్యలతో పది రోజుల్లో ఒక నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పనులు త్వరగా పూర్తి కావడానికి కావలసిన అన్ని తాను సమకూరుస్తానని వారికి భరోసా ఇచ్చారు. అలాగే శాఖాపరంగా, పనులు పరంగా మనందరం ఒకటేనని, పరస్పర సహకారంతో కలసికట్టుగా పనిచేయాలని వారిలో ఒక రకమైన ఐక్యభావాన్ని, ఉత్తేజాన్ని కలిగించారు. తనపై ఫోకస్ ఎక్కువ ఉంటుందని, అందువల్ల అధికారులు అందరూ తమతమ విధుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని ఒకటికి రెండుసార్ల హెచ్చరించారు.   గ్రామాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందడంతోపాటు  రాజకీయ నాయకుడిగా కూడా తాను ఈ పనులు వేగంగా పూర్తి చేయవలసిన అవసరం ఉందని అర్ధమొచ్చేవిధంగా  లోకేష్ అధికారులకు సరదాగా నవ్వుతూ చక్కగా వివరించిన తీరు ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనంగా చెప్పవచ్చు. అదేవిధంగా సమావేశం మధ్యలో అభినందనలు తెలియజేయడానికి వచ్చిన  మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులను అన్నా అని ఎంతో మర్యాదగా పలకరించడం, కొందరితో మీరు పెద్దవారని ఆప్యాయంగా పలకరించడం, నవ్వుతూ ప్రతి నమస్కారం చేసే తీరు భవిష్యత్ లో ఆయన రాజకీయ ఎదుగుదలను సూచిస్తున్నాయి. అటు అధికారులు, ఇటు పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల పట్ల లోకేష్ వ్యవహరించే తీరుని అందరూ ప్రశంసిస్తున్నారు. 

-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914