Feb 21, 2017

9 నగరాలకు భూముల కేటాయింపు
















 పర్యాటక నగరానికి అత్యధిక భూమి
 పరిపాలన నగరానికి అతి తక్కువ
 ప్రభుత్వానికి 22న అందనున్న రాజధాని ప్రధాన ఆకృతులు


         నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి మహానగరంలో అంతర్భాగంగా నిర్మించే 9 నగరాలకు ప్రభుత్వం భూములు కేటాయించింది.   రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ దాదాపు పూర్తి అయింది. 25,796 మంది రైతులు 32,448 ఎకరాల భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అందజేశారు. కృష్ణా నది ఒడ్డున 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేపట్టింది. నిధుల సమీకరణ ఓ కొలిక్కి వచ్చింది. ఇక డిజైన్ల (ఆకృతులు)ను ఆమోదించి నిర్మాణం మొదలుపెట్టడమే మిగిలింది. రాజధాని అంటే కేవలం  పరిపాలనకే పరిమితం కాకుండా ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం, పరిశోధన, పర్యాటకం, ఆతిథ్యం, కళలు, సాంస్కృతిక, వాణిజ్య, సాంకేతిక కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా నిలవాలన్నది సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష. ఇవన్నీ వస్తే ఉపాధి అవకాశాలు వాటంతట అవే వస్తాయి. ప్రపంచ శ్రేణి నగరంగా అభివృద్ధి చేయడానికి అనువుగా దీనిని నిర్మిస్తారు. మన దేశంలోని గాంధీనగర్, జైపూర్, నయారాయ్ పూర్, ఛండీగఢ్, అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి, ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా, బ్రెజిల్ లోని బ్రాసిలియా, మలేషియాలోని పుత్రజయ, కిజకిస్తాన్ రాజధాని ఆస్థానా వంటి నగరాలను సీఎం స్వయంగా సందర్శించారు. అక్కడి కట్టడాలను వీక్షించారు. ఆయా నగరాల  ఆకృతులు అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. వీటిలో కొన్ని వాటర్ ఫ్రంట్ నగరాలు, మరికొన్ని గ్రీన్ ఫీల్డ్ ప్లాన్డ్ నగరాలు ఉన్నాయి. ఆయా నగరాలలో కార్యకలాపాలను, ఆకృతులను పరిశీలించిన తరువాత అమరావతి మహానగరంలో అంతర్భాగంగా చుట్టూ ఓ మణిహారంలా 9 నగరాలుగా నిర్మించాలని నిర్ణయించారు. 1.ప్రభుత్వ పరిపాలన నగరం 2. న్యాయ నగరం 3. ఆర్థిక నగరం 4.విజ్ఞాన నగరం 5.ఎలక్ట్రానిక్స్ నగరం 6. ఆరోగ్య నగరం 7. ఆటల నగరం 8. మీడియా నగరం 9.పర్యాటక నగరం. ఈ నగరాల్లో కట్టడాలన్నీ మన సంస్కృతి ప్రతిబింభించే విధంగా నిర్మిస్తారు.  అంతర్జాతీయ స్థాయిలో ఆయా రంగాలకు సంబంధించిన అత్యంత ఆధునిక వసతులతోపాటు విద్య, వైద్యం, సాంకేతిక, రవాణా సౌకర్యాలన్నీ ఈ నగరాలలో అందుబాటులో ఉంటాయి. రాజధాని ప్రధాన ఆకృతులను నార్మన్ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ 22న ప్రభుత్వానికి అందజేయనుంది.
           
             ఈ నేపధ్యంలో ఈ 9 నగరాలకు ప్రభుత్వం భూములను కేటాయించింది. రాజధాని నగర పరిధి మొత్తం 53,647 ఎకరాలు. అత్యధికంగా పర్యాటక నగరానికి ఎక్కువ భూమి కేటాయించింది. అతి తక్కువగా పరిపాలన నగరానికి కేటాయించింది. ఆ వివరాలను పరిశీలిస్తే పర్యాటక నగరానికి 11,574 ఎకరాలు, విజ్ఞాన నగరానికి 8,547 ఎకరాలు, ఎలక్ట్రానిక్స్ నగరానికి 6,582, ఆరోగ్యనగరానికి 6,511, ఆర్థిక నగరానికి 5,168, మీడియా నగరానికి 5,107,  క్రీడల నగరానికి 4,150, న్యాయ నగరానికి 3,438, పరిపాలన నగరానికి 2,702 ఎకరాలు కేటాయించారు. ప్రతి నగరంలో వివిధ విభాగాలకు కూడా భూముల కేటాయింపు జరిగిపోయింది. ప్రతి నగరంలో ఆయా రంగాలకు చెందిన కార్యాలయాలతోపాటు ఆయా శాఖల ఉద్యోగుల నివాస గృహాలు ఉంటాయి.
      పర్యాటక నగరం: ఈ నగరాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతారు. అలాగే పర్యాటక రంగానికి చెందిన కార్యాలయాలు, స్టార్ హోటళ్లు ఉంటాయి. ఈ నగరానికి కేటాయించిన మొత్తం 11,574 ఎకరాల్లో వినోద అవసరాలకు, ఇతరత్రా ప్రజోపయోగాల కోసం బహిరంగ ప్రదేశంగా ఉంచడానికి 8,778 ఎకరాలు కేటాయించారు. గృహావసరాలకు 1397 ఎకరాలు, వాణిజ్య అవసరాలకు 451, పరిశ్రమలకు 100, ప్రత్యేక జోన్ కు 156 ఎకరాలు కేటాయించారు. ముందు జాగ్రత్తగా భవిష్యత్ అవసరాల కోసం 692 ఎకరాలను ఉంచారు.
విజ్ఞాన నగరం : ఈ నగరంలో విశ్వవిద్యాలయాలు, టెక్నికల్ ఇన్ స్టిట్యూషన్స్ ఉంటాయి. ఈ నగరంలో గృహావసరాలకు 3562 ఎకరాలు కేటాయించారు. వినోద, ఇతరత్రా ప్రజోప్రయోజనాల కోసం బహిరంగ ప్రదేశంగా ఉంచడానికి 1340 ఎకరాలు, వాణిజ్య అవసరాలకు 1257 ఎకరాలు, ప్రత్యేక జోన్ కు 979, పరిశ్రమలకు 87, భవిష్యత్ అవసరాల కోసం 1322 ఎకరాలు కేటాయించారు.
ఎలక్ట్రానిక్స్ నగరం: ఈ నగరంలో ఎలక్ట్రానిక్స్ కు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, వాటి కార్యాలయాలు ఉంటాయి. ఈ నగరానికి 6,582 ఎకరాలు కేటాయించారు. ఇందులో గృహావసరాలకు 1862 ఎకరాలు, పారిశ్రామిక రంగానికి 1618, వినోదం, ఇతర ప్రయోజనాల కోసం 757, వాణిజ్య అవసరాలకు 682,  ప్రత్యేక జోన్ కు 645, భవిష్యత్ అవసరాలకు 503 ఎకరాలు కేటాయించారు.
ఆరోగ్య నగరం: ఈ నగరంలో ప్రభుత్వ ఆస్పత్రులు, కార్పోరేట్ ఆస్పత్రులు, వైద్య విశ్వవిద్యాలయాలు ఉంటాయి. ఈ నగరానికి 6,511 ఎకరాలు కేటాయించారు. ఈ మొత్తంలో వివిధ విభాగాల కేటాయింపులను పరిశీలిస్తే గృహావసరాలకు 3,306 ఎకరాలు, భవిష్యత్ అవసరాలకు 1072, ప్రత్యేక జోన్ కు 1048, వినోదం, ఇతరత్రా ప్రయోజనాల కోసం  బహిరంగ ప్రదేశంగా ఉంచడానికి 580, వాణిజ్య అవసరాలకు 504 ఎకరాలు కేటాయించారు.
ఆర్థిక నగరం: ఈ నగరంలో ఆర్థిక శాఖకు చెందిన ప్రభుత్వ సంస్థలతోపాటు ఇతర ఆర్థిక సంస్థల కార్యాలయాలు ఉంటాయి. ఈ నగరానికి 5,168 ఎకరాలు కేటాయించారు. ఇందులో గృహావసరాలకు 1389 ఎకరాలు, వినోదం, ఇతర సామాజిక ప్రయోజనాల నిమిత్తం బహిరంగ ప్రదేశంగా ఉంచడానికి 1250, ప్రత్యేక జోన్లకు 844, వాణిజ్య అవసరాలకు 828, భవిష్యత్ అవసరాలకు 756, పారిశ్రామిక రంగానికి 101 ఎకరాలు కేటాయించారు.
క్రీడల నగరం: ఈ నగరంలో క్రీడా మైదానాలతోపాటు ఆ శాఖకు చెందిన పరిపాలన కార్యాలయాలు ఉంటాయి. ఈ నగరానికి 4150 ఎకరాలు కేటాయించారు. వివిధ విభాగాల కేటాయింపులు పరిశీలిస్తే గృహావసరాలకు 1819 ఎకరాలు, భవిష్యత్ అవసరాలకు 693, ఇతర సామాజిక ప్రయోజనాల నిమిత్తం బహిరంగ ప్రదేశంగా ఉంచడానికి 555, వాణిజ్య అవసరాలకు 513, ప్రత్యేక జోన్లకు 436, పారిశ్రామిక అవసరాలకు 134 ఎకరాలు కేటాయించారు.
న్యాయ నగరం: ఈ నగరంలో హైకోర్టుతోపాటు ఇతర న్యాయస్థానాలు, న్యాయవ్యవస్థకు సంబంధించిన పరిపాలనా కార్యాలయాలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర నుంచి ఆ శాఖకు చెందిన ఉద్యోగుల నివాస గృహాలు  ఉంటాయి. ఈ నగరానికి 3,438 ఎకరాలు కేటాయించారు. ఇందులో గృహావసరాలకు 1276 ఎకరాలు, వినోదం, ఇతర సామాజిక అవసరాలకు 692, భవిష్యత్ అవసరాలకు 545, వాణిజ్య అవసరాలకు 467, ప్రత్యేక జోన్లకు 458 ఎకరాలు కేటాయించారు.  
మీడియా నగరం: ఈ నగరంలో ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్ మీడియాలకు చెందిన కార్యాలయాలు, ఆయా సంస్థల ఉద్యోగుల గృహాలు ఉంటాయి. ఈ నగరానికి 5,107 ఎకరాలు కేటాయించారు. ఇందులో గృహావసరాలకు 1862 ఎకరాలు, వినోదం, ఇతర సామాజిక అవసరాలకు బహిరంగ ప్రదేశంగా ఉంచడానికి 1291, భవిష్యత్ అవసరాలకు 567, వాణిజ్య అవసరాలకు 791, ప్రత్యేక జోన్లకు 346, పారిశ్రామిక అవసరాలకు 250 ఎకరాలు కేటాయించారు.
ప్రభుత్వ పరిపాలన నగరం : రాజధానిలో ఇది చాలా కీలకమైనది. శాసనసభ, శాసన మండలి, సచివాలయం తదితర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. అయినా దీనికి అతి తక్కువగా 2,702 ఎకరాలు మాత్రమే కేటాయించారు. ఈ నగరంలో గృహావసరాలకు 833 ఎకరాలు, ప్రత్యేక జోన్లకు 638, వినోదం, ఇతర సామాజిక అవసరాలకు 567, భవిష్యత్ అవసరాలకు 427, వాణిజ్య కార్యకలాపాలకు 237 ఎకరాలు కేటాయించారు.
రాజధాని అమరావతిలో అంతర్జాతీయ నగరాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో సకల హంగులతో ఈ 9 నగరాలను కలుపుతూ విశాలమైన రోడ్లు నిర్మిస్తారు. 60 మీటర్ల వెడల్పున మూడు ప్రధాన రోడ్లు నిర్మిస్తారు. 50 మీటర్ల వెడల్పుతో 275 కిలోమీటర్ల అంతర్గత రోడ్లు, 25 మీటర్ల వెడల్పుతో మరికొన్ని రోడ్లు నిర్మిస్తారు. అంతేకాకుండా 97.5 కిలోమీటర్ల పొడవున ఆరు వరుసల ఇన్నర్ రింగ్ రోడ్డు, 186 కిలోమీటర్ల పొడవున 8 వరుసల అవుటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తారు. 134 కిలో మీటర్ల పొడవున మెట్రో రైలు మార్గం నిర్మించే ప్రతిపాదన కూడా ఉంది. కాలుష్యరహిత రాజధాని నిర్మించాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. జలకళతో పచ్చని చెట్లు, పచ్చికబయళ్లతో నిండిన పర్యావరణాన్ని కల్పించేందుకు సీఆర్డీఏ  (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ)  ప్రణాళికలు సిద్ధం చేసింది.

Feb 17, 2017

ఐటీ కంపెనీల స్థాపనకు ప్రవాస తెలుగువారి ఆసక్తి

ü ఏపీఎన్ఆర్టీలో 83 దేశాలకు చెందిన 32 వేల మంది సభ్యులు
ü ప్రవాస తెలుగువారికి అన్నిరకాల సహాయసహకారాలు
ü వందల కోట్ల పెట్టుబడులతో వేల మందికి ఉపాధి
ü 86 గ్రామాల దత్తత

          రాష్ట్రాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగువారి సొసైటీ(ఏపీఎన్ఆర్టీ) వివిధ రూపాలలో తనవంతు సాయం అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు నెలకొల్పుతూ వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి, వేల మందికి ఉపాధి కల్పించడానికి ప్రణాళికలు రూపొందించుకుంది. 2016 మేలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి పల్లె రఘునాథ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటైన ఈ సొసైటీలో 83 దేశాలకు చెందిన 32వేల మంది సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ సలహాదారుడైన డాక్టర్ రవి వేమూరి అధ్యక్షులుగా పూర్తీగా ప్రభుత్వ ఆధ్వర్యంలో లాభాపేక్షలేని సొసైటీగా దీనిని ఏర్పాటు చేశారు.  దీని ప్రధాన కార్యాలయం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. 192 మంది అంతర్జాతీయ కోఆర్డినేటర్లు, ఆరుగురు ప్రాంతీయ అడ్మినిస్ట్రేటర్లు ఉన్నారు. ఈ సొసైటీ ఇటు ఏపీ ప్రభుత్వానికి, అటు ప్రవాస తెలుగువారికి మధ్య వారధిలా పని చేస్తోంది. ప్రవాస తెలుగువారికి పలు రకాల సేవలు అందిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రవాస తెలుగువారిని ప్రోత్సహిస్తోంది. ముందుకు వచ్చినవారికి పెట్టుబడులకు సంబంధించిన, న్యాయపరమైన సలహాలు, బ్యాంకింగ్ సేవలు అందజేస్తోంది. పరిశ్రమల స్థాపనలో వివిధ ప్రక్రియలలో వారికి సహాయ సహకారాలు అందజేస్తోంది. వారు స్వదేశానికి వచ్చే సమయంలో ఫ్లైట్ టిక్కెట్ బుకింగ్ దగ్గర నుంచి హోటల్ రూమ్స్, క్యాబ్స్ బుకింగ్, దేవాలయాల సందర్శనలకు సహాయపడుతోంది. ప్రవాస తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో కూడా ఈ సొసైటీ సహకారం అందిస్తుంది.  డాక్యుమెంట్లు, ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్లు, పాస్ పోర్టు, ఓటర్ కార్డు వంటి వాటిని పోగొట్టుకున్నప్పుడు వాటిని వెతికే విషయంలో ఈ సొసైటీకి సంబంధించిన బృందం సహాయపడుతుంది. వారి సమయం వృధాకాకుండా చూస్తుంది. అంతేకాకుండా స్మార్ట్ విలేజ్ కార్యక్రమాలలో వారు పాలుపంచుకునేలా ప్రోత్సహిస్తోంది. గత నవంబర్ వరకు విశాఖపట్నంలో  ప్రవాస తెలుగువారు 9 ఐటీ కంపెనీలను స్థాపించారు. ఆ కంపెనీల (డీజిట్, ఎవాల్యూట్, నెట్ వర్క్ ఆబ్జెక్ట్, రిసికార్ప, కైరోస్,అంజూర్,ప్రిమస్,ఫ్యాబిట్,థాట్ వేవ్) ద్వారా 430 మందికి ఉపాధి లభిస్తోంది.

 ఈ నెల16న  విజయవాడలో యాక్సెల్‌ ఐటీ, హార్జన్‌ ఐటీ, ఎంఎస్‌ఆర్‌ కాస్మోస్‌, అడాప్ట్‌ సొల్యూషన్స్‌, అడ్వాన్స్‌ సాప్ట్‌, ఇంటెల్లి సాఫ్ట్‌, టైమ్‌స్క్వేరిట్‌ వంటి ఐటీ కంపెనీలను ప్రారంభించనున్నారు. ఈ కంపెనీలకు ఆటోనగర్‌లో అత్యాధునికమైన భవనాన్ని కేటాయించారు.  అమెరికా నుంచి వచ్చే ఐటీ కంపెనీలకు అవసరమైన మానవ వనరులను కూడా ఏపీఎన్‌ఆర్టీయే సమకూర్చనుంది.  ఈ కంపెనీల్లో పనిచేయడానికి అనుకూలంగా ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు తగి శిక్షణ ఇప్పించేందుకు మరో 14 కంప్యూటర్‌ శిక్షణా కేంద్రాలను ఇక్కడ  ఏర్పాటు చేయనున్నారు. కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాలకు మంగళగిరి వద్ద ఉన్న ఐటీ టవర్‌లో స్థలం కేటాయించారు. 10 ఐటీ కంపెనీలకు 500 నుంచి వెయ్యి మంది వరకు  అవసరం ఉంటుంది. మూడు మాసాల్లో శిక్షణ పూర్తి చేసి జూన్‌ నాటికి ఐటీ కంపెనీల్లో వారు ఉద్యోగాలు చేసుకునేలా అవకాశం కల్పిస్తారు. అమరావతిని ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అమరావతి నగరాన్ని పెద్ద ఐటీ హబ్‌గా రూపొందించి,  ఇంజినీరింగ్‌ యువతకు స్థానికంగానే ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇప్పటికే డిస్ రప్టివ్ సాఫ్ట్ వేర్, వాటర్ స్పోర్ట్స్ సింపుల్ వంటి సంస్థలు ప్రారంభించారు. అత్యధిక మంది రాష్ట్రంలో ఐటీ కంపెనీలను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నారు.

రూ.201.50 కోట్ల పెట్టుబడితో 2615 మందికి ఉపాధి
          అమరావతి ఇండస్ట్రియల్ అసోసియేట్స్ ఆధ్వర్యంలో విజయవాడ పరిసర ప్రాంతాలలో దాదాపు రూ.201.50 కోట్ల పెట్టుబడులు, వర్కింగ్ క్యాపిటల్ తో 75 పరిశ్రమలను నెలకొల్పనున్నారు. వీటి ద్వారా 2615 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ పరిశ్రమల స్థాపనకు 6348.50 యూనిట్ల హెచ్ పీ విద్యుత్, 8,96,976 గ్యాలన్ల నీరు అవసరం ఉంటుందని వారు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. వాటిలో లక్ష్మీ ప్లాస్టిక్స్, సంజయ్ టెక్నికల్ సర్వీసెస్, శ్రీభరణి ఎంటర్ ప్రైజెస్, సీ అండ్ ఎన్ ఇండస్ట్రీస్, ఎస్వీ పాలిమర్స్,మార్క్ ఆంగ్రో ఇండస్ట్రీస్, గౌతమ్ ఇండస్ట్రీస్, జీఎస్ ఎలక్ట్రికల్స్ వంటి కంపెనీలు  ఉన్నాయి. నాలుగు ఐటీ, ఒక ఆటోమొబైల్ కంపెనీలు విశాఖపట్నంలో తమ యూనిట్లను స్థాపించడానికి వచ్చే ఫిబ్రవరిలో పనులను ప్రారంభిస్తాయి. ఈ యూనిట్ల ద్వారా 600 మందికి ఉపాధి లభిస్తుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆటోమోటిక్ రోబోటిక్స్ సంస్థ రూ.50 కోట్ల పెట్టుబడితో ప్రెసిసింగ్ ఇంజన్ టెస్టింగ్ అండ్ డెవలప్ మెంట్ యూనిట్ ని స్థాపించాలన్న యోచనలో ఉంది. ఈ యూనిట్ స్థాపిస్తే 400 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. అమరావతి, విశాఖలలో వచ్చే మార్చిలో 14 ఐటీ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లను ప్రారంభించనున్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక అంశాలలో  శిక్షణ ఇస్తారు.

86 గ్రామాల దత్తత
           స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా ప్రవాస తెలుగువారు రాష్ట్రంలో 13 జిల్లాల్లో 86 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాల అభివృద్ధికి రూ.15 కోట్లు ఖర్చు చేయాలని వారు నిర్ణయించారు. ఈ గ్రామాలలో వారు వాటర్ ప్లాంట్స్, శ్మశానవాటికలు, పాఠశాలలు, సోలార్ పానెల్స్, లెడ్ బల్బులు ఏర్పాటు చేశారు.

ఎన్ఆర్టీ ఐకాన్ : ఈ సొసైటీ ఇంకా అనేక కొత్త ఆలోచనలు చేస్తోంది. ఎన్ఆర్టీ ఐకాన్ నిర్మించాలని, మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే అమరావతి టెక్ సపోర్ట్ విలేజ్, గల్ఫ్ బాధితులకు మద్దతుగా ఒక సెంటర్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా చేస్తోంది. అమెరికాలోని దేవాలయాల ద్వారా రాష్ట్రంలోని గ్రామాలను దత్తత తీసుకోవాలన్న ప్రతిపాదన కూడా ఉంది. రాష్ట్రాభివృద్ధి విషయంలో బాధ్యతగా తమ వంతు కృషి చేస్తామని ఎన్ఆర్టీ ప్రతినిధులు చెప్పారు.

-          శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

2017-18 ఇ-ప్రగతి పాలన

ü శరవేగంగా జరుగుతున్న పనులుü ఫైబర్‌ గ్రిడ్‌ మొదటి దశ పూర్తి
ü  133 ప్రభుత్వ విభాగాల్లోని సేవలన్నీ డిజిటలైజేషన్
ü  745 సేవల అనుసంధానం

           రాష్ట్ర మంత్రి మండలి 2017-18ని ‘ఇ-ప్రగతి పాలన’ సంవత్సరంగా ప్రకటించింది.  రాష్ట్రంలో ఇ-ప్రగతి ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిజిటల్‌ ఇండియా స్ఫూర్తితో సమాచార, సాంకేతిక రంగాల్లో దేశంలోనే అత్యున్నతంగా నిలిపేందుకు 'ఇ-ప్రగతి' ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కేంద్రం డిజిటల్‌ ఇండియాను రూపొందించడంతో అన్ని రాష్ట్రాల కన్నా ముందే దాని అమలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. కేంద్ర సంస్థలు వచ్చే వరకు ఆగకుండా రాష్ట్రంలో తామే జాతీయ ఆప్టికల్‌ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును నిర్మించుకుంటామని ప్రకటించింది. ఇలా ప్రకటించిన ఘనత ఏపీకే దక్కుతుంది. బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ‘ఇ-ప్రగతి’పై చర్చించారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఇ-ప్రగతి పనులు ముమ్మరంగా జరగాలని నిర్ణయించారు. ఈ సారి జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సు నాటికి ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఆన్ లైన్ లోనే జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఆదేశించారు. ప్రతినెలా ఒక కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించాలన్నారు. ఏ ఏ శాఖలను మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందో ముందు గుర్తించాలని చెప్పారు. ఇ-ప్రగతి ప్రాజెక్ట్ లో ప్రధానంగా  భాగం కావలసినవి పీపుల్స్ హబ్‌, ల్యాండ్ హబ్, ఇ-నిధి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తిచేయాలన్నారు.  ఇ-ప్రగతిలో లోకలైజేషన్, టెంపుల్ మేనేజ్‌మెంట్, హైబ్రిడ్ క్లౌడ్, సన్ రైజ్ స్కోర్ బోర్డ్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనలిటిక్స్, ప్రైమరీ సెక్టార్, ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, కార్డ్ ప్లస్ ప్లస్, ఇ-ప్రగతి కోర్, పెర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్, స్మార్ట్ వాటర్, సేఫ్ ఏపీ, హెల్త్ ప్రాజెక్టులుగా సీఎం వివరించారు. గ్రామస్థాయి నుంచి అన్ని ఫైళ్లు ఆన్‌లైన్‌లో ఉంచాలని, ప్రతి ఫైలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.  రికార్డుల ఇ-ఫైలింగ్ ఎంత మేర పూర్తయ్యింది? చట్టబద్దంగా హార్డ్ కాపీలను ఎలా భద్రపరచాలి? అనే అంశాలపై పూర్లి వివరాలను వచ్చే కలెక్టర్ల  సమావేశం నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు.

           అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో నిలపాలన్న ఉద్ధేశంతో 2015 జులైలో  ఇ-ప్రగతి ప్రాజెక్టును ప్రారంభించారు.  ఫైబర్‌ గ్రిడ్‌తో రాష్ట్రం మొత్తం అనుసంధానం చేసే కార్యక్రమం పూర్తి కావస్తోంది. ఫైబర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రంలో సాంకేతిక విప్లవం మొదలైంది.  ఇంటర్నెట్, మొబైల్ విప్లవంతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఈ రోజు బ్రాడ్ బ్రాండ్ లేని గ్రామం లేదు. అత్యధికులు ఇంటర్నెట్ వాడుతున్నారు. ఈ తరుణంలో బ్రాడ్ బ్రాండ్ విప్లవం ద్వారా అభివృద్ధి సాధించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫైబర్‌నెట్‌ సేవల తొలి దశ పూర్తి అయింది. ఫైబర్ నెట్ సేవలు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లె మండలం మోరీ, మోరిపోడు గ్రామాల్లో గత నెలలో మొదలయ్యాయి. ఏపీఎస్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌(ఏపీఎస్ఎఫ్ఎల్) ఆధ్వర్యంలో ఫైబర్ గ్రిడ్ పనులు జరుగుతున్నాయి. మొదట ఈ రెండు గ్రామాల్లోని పాఠశాలలతోపాటు 1200 ఇళ్లకు ఫైబర్‌ నెట్‌ సేవలు అందించే ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలందించడానికి ఏర్పాట్లు చేశారు.  తొలి దశలో పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఎంఎస్ఓ(మల్టీ సిస్టమ్ ఆపరేటర్)లు, ఎల్సీఓల ద్వారా  ఫైబర్ నెట్ సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికి దాదాపు పది వేల నెట్ కనెక్షన్లు ఇచ్చారు. మంత్రి మండలి సమావేశంలో ఫైబర్ గ్రిడ్ పై అధికారులతో సీఎం చర్చించారు. ఈ నెలాఖరునాటికి లక్ష బాక్సులు అమర్చాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 15 నాటికి పది లక్షల కనెక్షన్లు ఇచ్చే ఏర్పాటు చేయాలన్నారు. 
          దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలలో కూడా  ఫైబర్ గ్రిడ్ సేవలు అందిస్తారు. విస్తృత స్థాయిలో ఈ సేవలను వినియోగించుకోవాడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో మొత్తం లక్షా 30 వేల కనెక్షన్లు ఇవ్వవలసి ఉంది. ఈ ప్రాజెక్టుని ఈ ఏడాది చివరకు పూర్తి చేయాలన్నది లక్ష్యం. దేశంలో ఇటువంటి పథకం చేపట్టిన రాష్ట్రం మనదే.   ఉత్తరాంధ్ర జిల్లాలలతో పాటు 8 జిల్లాలలో ఈ పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన జిల్లాలలో కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మొత్తం 23,500 కిలో మీటర్ల ఆప్టికల్ ఫైబర్ లైన్లు ఏర్పాటు చేయవలసి ఉంది. అందులో  22 వేల కిలో మీటర్లకుపైగా లైన్లు పూర్తి అయ్యాయి.  ఇప్పటికే ప్రభుత్వ విభాగాలన్నింటిలో డిజిటలైజేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. కొన్ని శాఖల్లో నూరు శాతం  పూర్తి అయింది. ఈ విధంగా కొత్త శకానికి నాంది పలికి దేశంలో రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు పొందింది. 

         పారదర్శక పాలన, పౌరులందరికీ సత్వర సేవలు  అందించేందుకు 133 ప్రభుత్వ విభాగాలలో అన్నిరకాల సేవలను డిజిటలైజేషన్ చేస్తున్నారు. 33 శాఖలు, 315 సంస్థలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్చర్‌ (ఏపీఎస్ఈఏ)లో భాగంగా మొత్తం 745 సేవలను అనుసంధానం చేసేలా ఇ-ప్రగతిరూపకల్పన జరిగింది. ఇటువంటి ప్రాజెక్టు చేపట్టిన రాష్ట్రం దేశంలోనేకాదు దక్షిణాసియాలోనే మొదటిది ఏపీ. వాస్తవానికి ఇది ఒక ప్రాజెక్టు కాదు. పరిణామ క్రమంలో కాలానుగుణంగా వచ్చే సాంకేతిక మార్పులు, అవసరాలు, వ్యూహాలు, నూతన ఆవిష్కరణలను అనుసరించి నిరంతరం కొనసాగే ఒక సాంకేతిక ప్రక్రియ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని  పరిపాలనకు అన్వయించడం ద్వారా సర్టిఫికెట్ లెస్ గవర్నమెంట్ సిస్టమ్ (సీఎల్జీఎస్), డయల్ ఏపీ, మన రాష్ట్రం, టెలీహెల్త్, ఇ-ఎడ్యుకేషన్, హరిత, ఇ-మండీ, సిటిజెన్ ఇన్ బాక్స్, డిజిటల్ లిటరసీ, ఇ-ఎస్‌హెచ్‌జీ, స్మార్ట్ సిటీ, స్మార్ట్ గ్రిడ్ తదితర సేవలన్నీ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.  ప్రజల ఆరోగ్యం, పాఠశాలల్లో డ్రాపవుట్ రేటు తదితర ప్రామాణికాల నిర్దారణకు ఇ-ప్రగతి ప్రాజెక్టు ఉపకరిస్తుంది. మీ సేవ, సీఎం డ్యాష్ బోర్డు, మీ భూమి తదితర కామన్ ఆప్లికేషన్లతో పాటు ఆర్థిక, సీఆర్డీఏ, పట్టణాభివృద్ధి వంటి ప్రభుత్వ శాఖల సమగ్ర సమాచారాన్ని పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. కేటగిరిలవారీగా, అన్ని వయసుల వారికి సమగ్ర సమాచారం  అందించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఇందులో భాగంగానే స్మార్ట్‌ పల్స్‌ సర్వే ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, డిజిటలైజ్ చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ వరకు 1,37,42,586 కుటుంబాలకు చెందిన 4,32,55,924 మంది వివరాలు సేకరించారు.
      ఇ-ప్రగతి ద్వారా అన్ని శాఖల సమాచారాన్ని ప్రతి పౌరుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ప్రాథమిక రంగం మిషన్‌లోని వ్యవసాయం, ఉద్యానవనాలు, మత్స్య పరిశ్రమ, పశు సంవర్ధకం తదితర అనుబంధ రంగాల సమాచారాన్ని ఇ-ప్రగతి ప్రాజెక్టు సేవల ద్వారా పొందవచ్చు. పంటలు, భూములు, విత్తనాలు, బీమా, మార్కెటింగ్, ఇ-మండీ తదితర వివరాలన్నీ  లభ్యమవుతాయి.  మాన్యువల్‌గా చేసే వేల కొద్దీ పనులు ఈరోజు ఐటీ సహాయంతో వేగంగా చేయగలుగుతున్నారు. ఐటీ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం, పనుల్లో వేగం సాధ్యమవుతుంది.  రెవిన్యూశాఖలో 113 సర్టిఫికెట్ల కోసం ప్రజలు నిత్యం ఇబ్బంది పడేవారు. ఆ ఇబ్బందిని ఇప్పడు చాలా వరకు తగ్గించారు. ముందుముందు సర్టిఫికెట్‌లెస్ గవర్నెన్స్ సిస్టమ్ ప్రవేశపెడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల అవసరాలకు గతంలో మాదిరిగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసి అవసరం ఇకముందు ఉండదు. ఇప్పటికే కుల, ఆధాయ ధృవీకరణ, ఇసీ, బీ1 అడంగుల్... వంటి దాదాపు 600 సేవలు అందుబాటులోకి వచ్చాయి. లేబర్ లైసెన్సులు, పారిశ్రామిక అనుమతులు, అన్ని రకాల పన్నులు, ఇతర బిల్లుల చెల్లింపులు  వంటివి  ఆన్ లైన్ లో జరిగిపోతున్నాయి.

         అన్ని ప్రభుత్వ శాఖల, రాష్ట్రంలోని భూమి, లేఅవుట్లు, ఇళ్లు, రోడ్లు, దేవాలయాలు, భూగర్భజలాలు.. ఇలా ఒక్కటేమిటి సమగ్ర సమాచారం ఆయా శాఖల వెబ్ సైట్ లలో పొందుపరుస్తున్నారు. ఈ ప్రక్రియ శరవేగంగా జరిగిపోతోంది. ఇప్పటికే కొన్ని శాఖలు తమ పరిధిలోని  సమాచారాన్ని చాలా వరకు వెబ్ సైట్లలో ప్రజలకు అందుబాటులో ఉంచాయి. అందుకు నిదర్శనంగా పట్టణ గ్రామీణ ప్రణాళికా శాఖ (డీటీసీపీ-డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) వెబ్ సైట్ ను పేర్కొనవచ్చు. ఈ వెబ్ సైట్ లో రాష్ట్రంలోని సీఆర్ డీఏ మొదలుకొని పట్టణాభివృద్ధి సంస్థలు, నగరాలు, పట్టణాలు, నగర పంచాయితీల వంటి వాటి మాస్టర్ ప్లాన్లు, అనుమంతి పొందిన లేఅవుట్ల, వాటికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, సంబంధిత చట్టాల సమాచారం అంతా  ఉంది. ఆయా ప్రాంతాలలో లేఅవుట్లు, భవన నిర్మాణాలు, గ్రూప్ హౌస్ లు లాంటి అన్ని రకాల అనుమతులకు కావలసిన దరకాస్తులు ఉన్నాయి. అన్ని దరకాస్తులను ఆన్ లైన్ లోనే చేసుకోవచ్చు. ఫీజులను కూడా ఆన్ లైన్ లోనే చెల్లించవచ్చు. దరకాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు.
       ఈ విధంగా ప్రతి శాఖకు సంబంధించి అందుబాటులో ఉన్న పూర్తి సమాచారంతోపాటు ప్రతి పౌరుడి సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తున్నారు. సీఎం డ్యాష్ బోర్డులో అయితే ప్రభుత్వ విభాగాలలో ఏ పని ఎంత వరకు జరిగిందో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటుంది. కొన్ని విభాగాల్లో ప్రతి 5 నిమిషాలకు జరిగిన మార్పులను ఎంటర్ చేస్తారు. కొన్ని విభాగాలు రోజుకు ఒకసారి, వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి, మరికొన్ని నెలకు ఒకసారి, ఇంకొన్ని మూడు నెలలకు ఒకసారి అప్ డేట్ చేస్తారు.  వర్షపాతం దగ్గర నుంచి భూగర్భ జలాలు, రెవెన్యూ ఆదాయం, ఎక్సైజ్ ఆదాయం, సివిల్ సప్లైస్ వారు రేషన్ డిపోలకు పంపే సరుకుల వివరాలు మొదలైనవన్నీ ఉంటాయి. ఈ విధంగా ఇ-ప్రగతి ప్రాజెక్ట్ పూర్తి అయితే ప్రభుత్వంలోని అన్ని పనులు ఆన్ లైన్ లో జరిగిపోతాయి. ప్రభుత్వ పరంగా ప్రజలకు కావలసిన పనులు త్వరితగతిన అవడానికి అవకాశం ఏర్పడుతుంది.

సీఆర్డీఏ వివరాలన్నీ బహిర్గతమే!

§  పారదర్శకతకు నిదర్శనం
§  రాజధాని అమరావతి కోసం
25,781 మంది రైతుల నుంచి 32,423 ఎకరాల సమీకరణ
§  ప్రధాన వెబ్ సైట్ లో పూర్తి వివరాలు
§  డ్యాష్ బోర్డులో 12 విభాగాల పూర్తి వివరాలు వెల్లడి

            డిజిటలైజేషన్ లో ఏపీ ప్రభుత్వం  దూసుకుపోతోంది. అన్ని రంగాలలో పారదర్శకత ప్రదర్శిస్తోంది. డిజిటలైజేషన్ రంగంలో దేశంలో ఏపీ ప్రథమ స్థానం సాధించి, అవార్డు పొందిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని పలు శాఖలలో డిజిటలైజేషన్ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరిగింది.  అక్రమార్జనకు కళ్లెంపడింది. అవినీతి తగ్గింది. ఈ మేరకు నీతిఅయోగ్ ఏపీని ప్రశంసించింది.   ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ)కు సంబంధించి కూడా సీఎం డ్యాష్ బోర్డు మాదిరి డ్యాష్ బోర్డుని ఏర్పాటు చేశారు.  ఈ డ్యాస్ బోర్డులో సీఆర్డీఏకు సంబంధించిన అన్ని విభాగాల వివరాలు పొందుపరిచారు. ఏపీ ఇ-ప్రొక్యూర్ మెంట్, నా ఇటుక – నా అమరావతి వంటి లింకులను కూడా ప్రధాన వెబ్ సైట్ లో ఉంచారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి సమగ్ర వివరాలు దాపరికంలేకుండా అందరికీ అందుబాటులో ఉంచారు. సీఆర్డీఏ విస్తీర్ణం గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని  8,603 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది.  నూతన రాజధాని అమరావతిని 217 చదరపు కిలోమీటర్లలో నిర్మిస్తారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎంత భూమి కావాలి, ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎంత సేకరించారు, ఎంత మంది రైతులు భూములు ఇచ్చారు, ఎంతమంది భూమిలేని పేదలకు పెన్షన్ ఇస్తున్నారు, మాస్టర్ ప్లాన్, టెండర్లు, ఆమోదించిన, ఆమోదించని ప్లాన్లు తదితర  వివరాలన్నింటిని ప్రధాన వెబ్ సైట్ లో ఉంచారు. పనులు జరిగే క్రమం, టెండర్ల వివరాలు, రైతులకు ప్లాట్ల పంపిణీ వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నారు.

 12 అంశాలతో డ్యాష్ బోర్డు
           ప్రధాన వెబ్ సైట్ కు అనుబంధంగా ఇప్పుడు 12 అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిపేందుకు ఓ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేశారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్(ఎల్పీఎస్), ఒకేసారి రైతుల రుణ మాఫీ, భూములిచ్చిన రైతులకు వార్షిక చెల్లింపు, బిల్డిండ్ పెనలైజేషన్ స్కీమ్(బీపీఎస్), అమరావతి స్కిల్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూషన్(ఏఎస్ డీఐ), మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్-నరేగా), అమరావతి గ్రామాల్లో భూమి లేని నిరుపేదల పెన్షన్ (ఏఎల్ పీపీ), బయోమెట్రిక్ హాజరు, ఇంజనీరింగ్ వర్క్స్, పరిసరాల పచ్చదనం, అమరావతిలో ఎన్టీఆర్ క్యాంటిన్ అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారం పొందుపరచడానికి ఈ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేశారు. ఇందులో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ తప్ప మిగిలిన వివరాలన్నింటినీ అప్ డేట్ చేశారు.  దీనికి సంబంధించి అప్ డేట్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది.

25,781 మంది రైతుల నుంచి 32,423 ఎకరాల సమీకరణ
      డ్యాష్ బోర్డులో తెలిపిన ప్రకారం నూతన రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం 27,874 మంది రైతుల నుంచి 34,281 ఎకరాలు సమీకరించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 25,781 మంది రైతుల నుంచి 32,423 ఎకరాలు సమీకరించింది. ఇంకా 3344 మంది రైతుల నుంచి 1857 ఎకరాలు సమీకరించవలసి ఉంది. ఏ గ్రామంలో ఎంత భూమి సమీకరించారో, ఎంత సమీకరించాలో, పట్టా భూమి, అసైన్డ్ భూమి, దేవాదాయ శాఖ భూమి... తదితర వివరాలు కూడా ఇక్కడ అప్ డేట్ చేశారు.
రూ.85.35 కోట్ల రుణాలు రద్దు: రైతుల రుణాల రద్దులో భాగంగా రాజధాని పరిధిలోని గ్రామాల రైతుల రుణాలను ఒకేసారి రద్దు చేశారు. మొత్తం 25 గ్రామ పంచాయతీల్లోని 19,518 మంది రైతులకు చెందిన రూ.85.35 కోట్ల రుణాలను ఒకేసారి రద్దు చేశారు. గ్రామాల వారీగా వివరాలను కూడా ఇక్కడ ఉంచారు.
వార్షిక చెల్లింపులు రూ.137.44 కోట్లు: స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కాకుండా భూ సారం ఆధారంగా ఏడాదికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పది సంవత్సరాలపాటు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఆ ప్రకారం వార్షిక చెల్లింపులలో భాగంగా 32,423 ఎకరాలకు సంబంధించి 25,781 మంది రైతులకు ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.138.69 కోట్లు విడుదల చేసింది. గ్రామాలు, యూనిట్ల వారీగా పూర్తి వివరాలు ఇందులో ఉంచారు.
బీపీఎస్ కింద 6429 దరకాస్తులు: బిల్డింగ్ పెనలైజేషన్ పథకం (బీపీఎస్)కింద సీఆర్డీఏకు ఇప్పటి వరకు 6429 దరకాస్తులు వచ్చాయి. వాటిలో 2,506కు ప్రొసీడింగ్ లెటర్ పంపారు. 3751 పరిశీలనలో ఉన్నాయి. 172 దరకాస్తులను తిరస్కరించారు. వ్యక్తిగతంగా దరకాస్తు ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి బీపీఎస్ సైట్ లింక్ కూడా అక్కడే ఇచ్చారు.
ఏఎస్ డీఐ: అమరావతి స్కిల్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూషన్(ఏఎస్ డీఐ) ద్వారా 483 మందికి శిక్షణ ఇప్పించారు. వారిలో 386 మందికి ఉపాధి కల్పించారు. 225 మందికి నేరుగా ఉపాధి కల్పించారు. గ్రామాల వారీగా ఎంతెంతమందికి ఉపాధి కల్పించారో పూర్తి వివరాలు పొందుపరిచారు.
ప్రొక్యూర్ మెంట్: వివిధ పనులు, కన్సల్టెన్సీలు, ఉత్పత్తులు, సేవలకు సంబంధించి సీఆర్డీఏ  విడుదల చేసిన టెండర్ నోటిఫికేషన్ల వివరాలు ఈ విభాగంలో పొందుపరిచారు.  ఇప్పటి వరకు రూ.589.42 కోట్ల విలువైన 62 అంశాలకు సంబంధించి టెండర్లు పిలిచారు.
ఏఎల్ పీపీ కింద 20,013 మందికి పెన్షన్: అమరావతి గ్రామాలలో భూమి లేని నిరుపేదల పెన్షన్ (ఏఎల్ పీపీ) పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి నెలకు రూ.2,500 ఇస్తున్నారు.   ఇప్పటి వరకు 20,013 కుటుంబాలకు రూ.5 కోట్లు విడుదల చేశారు. గ్రామాల వారీగా ఏ గ్రామంలో ఎంతమందికి, ఎవరెవరికి ఇచ్చింది వారి పేర్లతోసహా పూర్తి వివరాలు డ్యాష్ బోర్డులో పొందుపరిచారు.
బయోమెట్రిక్ అటెండెన్స్:  సీఆర్డీఏలోని ఉద్యోగులను బయోమెట్రిక్ అటెండెన్స్ రిజిష్టర్ లో నమోదు చేస్తున్నారు. 2017 ఫిబ్రవరి 14వ తేదీ వరకు 326 మంది ఉద్యోగుల పేర్లు నమోదు చేశారు. ఏ రోజు ఎంతమంది ఏ సమయానికి  విధులకు హాజరయ్యారో ఆ వివరాలు ఇక్కడ అందరికీ కనిపిస్తాయి. ఉద్యోగుల పేర్లు, వారి హోదాలు వారు ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకు వెళ్లారు తదితర వివరాలన్నీ నమోదు చేస్తారు.
ఇంజనీరింగ్ పనులు: ఇంజనీరింగ్ పనులు ఏ గ్రామంలో ఏఏ పనులు చేపట్టారు, ఏ పనులు ఎంతవరకు పూర్తి అయ్యాయి... తదితర వివరాలన్నీ ఇందులో ఉంటాయి. కొండవీటివాగు సర్వే పనులు, వీధి దీపాలు ఏర్పాట్లు 95 శాతం పూర్తి అయినట్లు ఇక్కడ నమోదు చేశారు. కొన్ని పనులు వంద శాతం పూర్తి అయినట్లు తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు 55 శాతం పూర్తి అయినట్లు నమోదు చేశారు. అన్ని పనుల వివరాలు, ప్రస్తుతం వాటి స్థాయి అన్నీ ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు.
పరిసరాల పచ్చదనం, సుందరీకరణ:  సీఆర్డీఏ ప్రాంతంలో, రాజధాని పరిధిలో పరిసరాల పచ్చదనం, సుందరీకరణ పనుల వివరాలను ఇక్కడ పొందుపరిచారు. గన్నవరం- తాడిగడప క్రాస్ రోడ్డులో రూ.95 లక్షల రూపాయలతో పనులు చేస్తున్నారు. గన్నవరం-నిడమానూరు రోడ్డుకు ఇరువైపుల సుందరీకరణకు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నిడమానూరు-రామవర్పాడు రింగ్ రోడ్డు వరకు రూ.68 లక్షలతో పనులు చేపట్టారు. భవానీపురం నుంచి ఇబ్రహీంపట్నం వరకు పూల మొక్కలు, పచ్చికబయళ్లు ఏర్పాటు కోసం మూడు కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. అమరావతి పరిధిలో వెలగపూడిలో రూ.4.5 కోట్లు, తుళ్లూరులో రూ.80 లక్షల ఖర్చు చేసి పచ్చదనం నింపుతున్నారు. కడియం, బెంగళూరు, కోల్ కత్తాల నుంచి మొక్కలు తెప్పిస్తున్నారు.   రాజధాని నిర్మాణానికి ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాన చేసిన ప్రదేశం పూల తోటను మరిపించేవిధంగా చేశారు. ఇక్కడ 2,168 చదరపు మీటర్ల ప్రాంతాన్ని పచ్చికబయళ్లుతో నింపారు. అన్ని ప్రాంతాల ఫొటోలతోసహా ఆ వివరాలను డ్యాష్ బోర్డులో ఉంచారు.

ఈ విధంగా సీఆర్డీఏలో జరిగే ప్రతి పనికి సంబంధించిన పూర్తి వివరాలను దాపరికంలేకుండా  ఈ డ్యాష్ బోర్డులో పొందుపరిచారు. నూతన రాజధాని నిర్మాణంలో అన్ని అంశాలకు సంబంధించి సమగ్ర  వివరాలు అందరూ తెలుసుకునే ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా పారదర్శకతలో దేశంలో ఏపీ అగ్రభాగాన నిలుస్తోంది.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

గ్రిడ్ల వ్యవస్థతో ఏపీ సమగ్రాభివృద్ధి

Ø ఫైబర్, రోడ్, పవర్, వాటర్, గ్యాస్ గ్రిడ్ల ఏర్పాటు
Ø ఇంటింటికి గ్యాస్ సరఫరా
Ø మారుమూల గ్రామాలకు తాగునీటి సదుపాయం
Ø రూ.149 లకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఫోన్ సౌకర్యం ప్రారంభం
Ø ప్రతి పల్లె నుంచి రవాణా సౌకర్యం
Ø అత్యంత కీలకంగా విద్యుత్ రంగం గుర్తింపు

        రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం గ్రిడ్ల వ్యవస్థ  ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో అపారంగా ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.  రాష్ట్రంలో అంతులేని జలరాశి పారుతోంది. 974 కిలో మీటర్ల సముద్ర తీరం ఉంది. భూగర్భంలో అమూల్యమైన ఖనిజ సంపద నిక్షిప్తమై ఉంది. ఈ వనరులన్నిటినీ ఒక ప్రణాళిక ప్రకారం  సమర్థవంతంగా వినియోగించుకుంటే రాష్ట్రం  స్వర్ణాంధ్రగా మారిపోతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఉన్నా వనరులను సమంగా పంపిణీ చేసి, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం  గ్రిడ్ల వ్యవస్థను ప్రారంభించింది. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం సమకూర్చే ప్రాథమిక సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు 13 జిల్లాల్లోని మారు మూల ప్రాంతాలకు కూడా  సమానంగా అందుతాయి. గ్యాస్ గ్రిడ్, వాటర్ గ్రిడ్, ఫైబర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, పవర్ గ్రిడ్  మొత్తం అయిదు గ్రిడ్లను ఏర్పాటు చేసింది.
గ్యాస్ గ్రిడ్: కెజి(కృష్ణా, గోదావరి) బేసిన్ లో అపార చమురు నిక్షేపాలు ఉన్నాయి. అవి రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రానున్న అయిదేళ్లలో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. విశాఖపట్నం జిల్లా గంగవరం వద్ద ఎల్ పి జి టెర్మినల్ ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడ డీప్ వాటర్ పోర్టు వద్ద ఫ్లోటింగ్ స్టోరేజ్ రీ-గ్యాసిఫికేషన్ యూనిట్ ను శరవేగంగా నిర్మిస్తున్నారు. కాకినాడ నుంచి విశాఖ వరకు గ్యాస్ పైప్ లైన్, ఫ్లోటింగ్ స్టోరేజ్, రీగ్యాసిఫికేషన్ పనులు చురుకుగా జరుగుతున్నాయి. వీటికి సంబంధించి పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయి. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లాలో  ప్రతి ఇంటికి ఈ  సంవత్సరంలోనే గ్యాస్ పంపిణీ చేసి గ్యాస్ గ్రిడ్ తొలి దశను ప్రారంభిస్తారు. ఈ ఏడాదే  ప్రాజెక్టు తొలిదశ పూర్తి చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది.  కాకినాడ-శ్రీకాకుళం గ్యాస్ పైప్ లైన్ కు సంబంధించి సర్వే దాదాపు పూర్తి అయింది. గ్యాస్ పంపిణీ కోసం గోదావరి గ్యాస్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు. సంబంధిత సర్వే కూడా పూర్తి అయింది. కొవ్వూరు సిఎన్ జి (కంప్రెస్ డ్ నేచురల్ గ్యాస్) స్టేషన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఒక రోజుకు సగటున 50 కిలోల అమ్మకం జరుగుతోంది. ఇటువంటి మరో పది స్టేషన్లను అందుబాటులోకి తేనున్నారు. ప్రయోగాత్మకంగా తొలుత కొవ్వూరు, రాజమహేంద్రవరంలలో ఇంటింటికీ పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తరువాత జూన్ నాటికి భీమవరం, ఏలూరుల్లో సరఫరా చేస్తారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఆర్టీసీ బస్సులకు గ్యాస్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పారిశ్రామిక అవసరాలకు కూడా పైప్ లైన్ల ద్వారా గ్యాస్ పంపిణీ చేసే ఉద్దేశం కూడా ఉంది. రాష్ర్ట వ్యాప్తంగా ఏడు మార్గాల్లో పైప్ లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.  ఏటా అయిదు మిలియన్ టన్నుల గ్యాస్ సరఫరా చేసే సామర్థ్యం కలిగిన ఈ టెర్నినల్ ను త్వరగా పూర్తి చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఈ పైప్ లైన్ల ద్వారా తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలకు కూడా గ్యాస్ పంపిణీ చేసే అవకాశం ఉంది.

వాటర్ గ్రిడ్: రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చడానికి ఈ గ్రిడ్ ను ఏర్పాటు చేశారు.  ఈ గ్రిడ్ ద్వారా పట్టణ ప్రాంతాలతోపాటు అన్ని గ్రామాలకు 365 రోజులూ తాగునీటి సదుపాయ కల్పించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీని ద్వారా జలవనరులు సక్రమంగా పంపిణీ జరిగిగృహ అవసరాలు, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలు తీరతాయి. 2019 నాటికి రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలలో కూడా తాగునీటి సమస్య లేకుండా చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనికి పది వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులు పూర్తి చేయడానికి వెయ్యి కోట్ల రూపాయలను జాతీయ గ్రామీణ తాగునీటి పథకం (ఎన్ఆర్ డి డబ్ల్యూపి) కింద పొందడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఫైబర్ గ్రిడ్:         ఫైబర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రంలో సాంకేతిక విప్లవం మొదలైంది.  ఇంటర్నెట్, మొబైల్ విప్లవంతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఈ రోజు బ్రాడ్ బ్రాండ్ లేని గ్రామం లేదు. అత్యధికులు ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇంటర్నెట్ ఒక మానవ హక్కుగా మారిన తరుణంలో బ్రాడ్ బ్రాండ్ విప్లవం ద్వారా అభివృద్ధి సాధించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫైబర్‌నెట్‌ సేవల తొలి దశ పూర్తి అయింది. మొదట ఫైబర్ నెట్ సేవలు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లె మండలం మోరీ, మోరిపోడు గ్రామాల్లో మొదలయ్యాయి. ఏపీఎస్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌(ఏపీఎస్ఎఫ్ఎల్) ఆధ్వర్యంలో ఫైబర్ గ్రిడ్ పనులు జరుగుతున్నాయి. మొదట ఈ రెండు గ్రామాల్లోని పాఠశాలలతోపాటు 1200 ఇళ్లకు ఫైబర్‌ నెట్‌ సేవలు అందించే ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలందించడానికి ఏర్పాట్లు చేశారు.  తొలి దశలో పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఎంఎస్ఓ(మల్టీ సిస్టమ్ ఆపరేటర్)లు, ఎల్సీఓల ద్వారా  ఫైబర్ నెట్ సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం పది లక్షల సీపీఈ బాక్సులకు ఆర్డర్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం పదివేలకుపైగా కనెక్షన్లు ఇచ్చారు. మార్చి చివరకు పది లక్షల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలలో కూడా  ఫైబర్ గ్రిడ్ సేవలు అందిస్తారు. విస్తృత స్థాయిలో ఈ సేవలను వినియోగించుకోవాడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో మొత్తం లక్షా 30 వేల కనెక్షన్లు ఇవ్వవలసి ఉంది. ఈ ప్రాజెక్టుని ఈ ఏడాది చివరకు పూర్తి చేయాలన్నది లక్ష్యం. దేశంలో ఇటువంటి పథకం చేపట్టిన రాష్ట్రం మనదే.  ఈ పథకాన్ని దేశమంతటా విస్తరింపజేయడానికి కేంద్రం మన రాష్ట్ర ప్రభుత్వ సహాయాన్ని అభ్యర్థిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలలతో పాటు 8 జిల్లాలలో ఇప్పటికే ఈ పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన జిల్లాలలో కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మొత్తం 23,500 కిలో మీటర్ల ఆప్టికల్ ఫైబర్ లైన్లు ఏర్పాటు చేయవలసి ఉంది. అందులో  22 వేల కిలో మీటర్లకుపైగా లైన్లు పూర్తి అయ్యాయి.  రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి బ్రాడ్ బ్రాండ్ విప్లవం ఒక ప్రధాన సాధన అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహంలేదు. ఇప్పటికే ప్రభుత్వ విభాగాలన్నింటిలో డిజిటలైజేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. కొన్ని శాఖల్లో నూరు శాతం కూడా పూర్తి అయింది. ఈ విధంగా కొత్త శకానికి నాంది పలికి దేశంలో రాష్ట్రం  గుర్తింపు పొందింది. 
రోడ్ గ్రిడ్ : రాష్ట్రంలోని మారు మూల గ్రామాల నుంచి, 9 జిల్లాలలోని  సముద్రతీరం నుంచి జాతీయ రహదారులను కలిపేవిధంగా రోడ్లను నిర్మించడానికి ఈ రోడ్ గ్రిడ్ ను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామానికి బిటి రోడ్డు, గ్రామాల నుంచి మండల కేంద్రానికి సింగిల్ లైన్ రోడ్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరసల రోడ్లు, జాతీయ మార్గాల అవసరాలను బట్టి నాలుగు, ఆరు వరుసల రోడ్లు నిర్మిస్తారు. జిల్లా కేంద్రాల నుంచి ప్రధాన నగరాలకు ఆరు వరుసల రోడ్లు నిర్మిస్తారు. ప్రధాన నగరాల చుట్టూ ఔటర్ రింగ్ రోడ్లును ఏర్పాట చేస్తారు. ఓడ రేవులతో రాష్ట్ర రహదారులను అనుసంధానం చేసి, రాష్ట్రం నుంచి దేశమంతటికి రవాణా సౌకర్యం కల్పిస్తారు. రాష్ట్రంలోని 46,440 కిలో మీటర్ల దహదారులను క్రమంగా జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఓడరేవులకు ఈ రహదారులను అనుసంధానించి కారిడార్లుగా వినియోగించేందుకు వీలుగా ఈ గ్రిడ్ ద్వారా  ప్రణాళికలు రూపొందించారు. అలాగే నూతన రాజధాని అమరావతికి కూడా అటు రాయలసీమ నుంచి, ఇటు ఉత్తరాంధ్ర నుంచి అనుసంధానంగా ప్రత్యేక రోడ్లు నిర్మిస్తారు. ప్రస్తుతం అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే కోసం భూసేకరణ, సమీకణ పనులు జరుగుతున్నాయి.
పవర్ గ్రిడ్: రాష్ట్ర ప్రగతికి చోదకంగా నిలిచే విద్యుచ్ఛక్తి రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకంగా గుర్తించింది. అన్ని ప్రాంతాలకు అంతరాయంలేకుండా విద్యుత్ సరఫరా సవ్యంగా జరిగేందుకు ఈ గ్రిడ్ ను ఏర్పాటు చేసింది. విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అద్వితీయమైన విజయాలు సాధించింది. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ప్రభుత్వం 2014లో బాధ్యతలు స్వీకరించేనాటికి  రాష్ట్రంలో రోజుకు 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండేది. రెండేళ్లలో మిగులు రాష్ట్రంలో నిలిచింది. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, పొదుపు, సంరక్షణ విధానాలలో రాష్ట్రం వరుసగా అవార్డులు అందుకుంది. గృహావసరాలకు, పరిశ్రమలకు 24 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తూ కూడా మిగులు విద్యుత్ సాధించడం విశేషం. రాష్ట్రంలో డిమాండ్ కు సరిప విద్యుత్ సరఫరా అవుతోంది. విద్యుత్ లేక మూతపడిన అనేక చిన్న,మధ్యతరహా పరిశ్రమలను పునరుద్ధరించారు. దాంతో లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
రాష్ట్రంలో అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం ఓ రికార్డు.  ఏపీలో వంద శాతం విద్యుదీకరణ పూర్తయింది. రాష్ట్రంలో ఇంతకు ముందు అయిదు లక్షల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ లేదు. 4.5 లక్షలకుపైగా ఇళ్లకు కొత్తగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలినవాటికి కూడా కనెక్షన్లు ఇస్తున్నారు. కొద్ది రోజులలోనే ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చి రాష్ట్రం రికార్డు సృష్టించబోతోంది. విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడానికి సాధ్యంకాని గిరిజన ప్రాంతాల్లో సౌరవిద్యుత్ అందించే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వంద శాతం ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చిన తొలి జిల్లాగా  పశ్చిమగోదావరి జిల్లా రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఏడు గంటల విద్యుత్ అందిస్తున్నారు. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడ్దా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా భూగర్భ విద్యుత్ లైన్లను శరవేగంగా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి రూ.3,010 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
      తలసరి విద్యుత్ వినియోగాన్ని బాగా పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.  2015లో ఉన్న1050 కిలో వాట్ల నుంచి 2019లో 1750 కిలోవాట్లు, 2022లో 2298 కిలోవాట్లు, 2029 నాటికి 3600 కిలో వాట్లకు చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అలాగే పునరుద్ధరణీయ ఇంధన సామర్థ్యం 2015లో ఉన్న 2 గిగావాట్ల నుంచి 2019కి 8, 2022కి 14, 2029 నాటికి 29 గిగావాట్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ధేశించింది.  గృహ వినియోగదారులకు విద్యుత్ ఖర్చు తగ్గించడానికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రెండు ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేశారు. నగరాలు, పట్టణాలలోని వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులను మార్చడం, సౌర, పవన విద్యుత్ ను ప్రోత్సహించడం ద్వారా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది.
           రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటోంది. ఈ నష్టం 2014-15లో 11.81 శాతం కాగా2015-16లో 10.29 శాతానికి తగ్గించారు. ఈ ఏడాది ఈ నష్టాన్ని సింగిల్ డిజిట్ కు తగ్గించాలన్నది లక్ష్యం. విద్యుత్ పంపిణీ, సరఫరా సక్రమంగా జరిగేందుకు 25వేల కోట్ల రూపాయలతో ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. 2015-16లో 2290 మెగావాట్ల అదనపు విద్యుత్ సామర్థాన్ని సమకూర్చారు. రానున్న మూడేళ్లలో 4,800 మెగావాట్ల అదనపు సామర్థ్యాన్ని సమకూర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం జిల్లా పూడిమడకలో ఎన్.టి.పి.సి రూ.28వేల కోట్లతో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. 2020 నాటికి రెండు ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. నెల్లూరులో సెమ్ కార్ప్, ఇతర సంస్థలు కలసి రూ.20వేల కోట్లతో 1320 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.   నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో, విజయవాడ విటిపిఎస్ లో ఒక్కోచోట 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాల విస్తరణ కార్యక్రమం చేపట్టారు.  ఏపి జన్ కో ఆధ్వర్యంలో వీటి నిర్మాణం జరుగుతోంది. 
  పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ ఈ ఏడాది బెస్ట్ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూసర్’, బెస్ట్ నోడల్ ఏజెన్సీ గా ఎంపికయింది. కేంద్ర ఎనర్జీజ్యూరీ  ఇచ్చే అవార్డుకు నెడ్ క్యాప్(జాతీయ సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ) వరుసగా గెలుచుకున్న ఏడో అవార్డు. ఈ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేసింది. ఇంధన రంగంలో 2015లో ప్రకటించిన 5 జాతీయ పురస్కారాలను మన రాష్ట్రం కైవసం చేసుకుంది. జాతీయ స్థాయిలో ఒక రాష్ట్రం ఒకే రంగంలో ఇన్ని అవార్డులను సాధించడం ఓ రికార్డ్. విద్యుత్‌ సమర్ధ వినియోగం, పర్యవేక్షణ, అమలు చేస్తున్న ఉత్తమ డిజైన్‌ ఏజెన్సీ (ఎస్‌.డీ.ఏ.) విభాగంగా రాష్ట్ర ప్రభు త్వానికి ఈ పురస్కారాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ సరఫరా కంపెనీ (ఏపీడీసీఎల్‌), ఐదు జిల్లాల్లో ఎల్‌ఈడీ దీపాల సరఫరా సమర్ధవంతంగా నిర్వహించినందుకు 'బెస్ట్‌ డిస్కం'గా ఎంపికైంది. విశాఖ మహానగర పాలక సంస్థ విద్యుత్‌ ఆదా చేసే ఎల్‌ఈడీ వీధి దీపాల వ్యవస్థను ఏర్పాటు చేసి జాతీయ అవార్డు సాధించింది.
 ఈ గ్రిడ్లు ద్వారా  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. వనరులు సమంగా పంపిణీ జరిగి అన్ని జిల్లాలలో ఉత్పత్తి, ఉత్పాదకత, ఉపాధి అవకాశాలు పెరిగితే రాష్ట్రం స్థిరమైన రెండంకెల అభివృద్ధిని సాధిస్తుంది. 

-          శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ 

Feb 14, 2017

సమాన అవకాశాలు సాధించేవరకు మహిళలకు సంపూర్ణ మద్దతు

జాతీయ మహిళా పార్లమెంట్ ముగింపు సదస్సులో సీఎం చంద్రబాబు
·       త్వరలో ‘తల్లికి వందనం’ కార్యక్రమం
·       మరో దుర్గా మాత సుమిత్రా మహాజన్
·       ప్రతి ఏటా జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహణ
·       అమరావతి వాస్తు బాగుంది
అమరావతి: ఫిబ్రవరి 12:    సమాన అవకాశాలు సాధించేవరకు మహిళలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడ ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంఘం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన  జాతీయ మహిళా పార్లమెంట్ ముగింపు సదస్సులో ఆయన ప్రసంగించారు. సమాన అవకాశాల ఉంటే తప్ప మహిళలు ఎదగలేరన్నారు. అందరి సహకారం తీసుకొని మహిళలకు సమాన అవకాశాలు వచ్చేవరకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. మూడు రోజులపాటు చరిత్రాత్మకంగా జరిగిన ఈ సదస్సు లక్షలాదిమంది మహిళలకు ప్రేరణగా నిలిచిందన్నారు. రెండు నదుల పవిత్ర సంగమ ప్రదేశంలో ఈ సదస్సు జరగడం అపూర్వం అన్నారు.  ఈ సదస్సుకు అద్వితీయ స్పందన లభించిందని సంతృప్తి వ్యక్తం చేశారు. పది వేల మంది వస్తారనుకుంటే 22 వేల మంది వచ్చారన్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ నుంచి స్పూర్తి పొందారని చెప్పారు.  జనాభాలో 50 శాతం పైగా మహిళలు ఉన్నారని, లింగ వివక్ష అనేది నిన్నటి మాట అని, లింగ సమానత నేటి నినాదం అన్నారు. విజ్ఞానంలో గానీ, ఆర్థిక విషయాల్లో గానీ, రాజకీయాల్లో గానీ ఏ అంశంలోనూ మహిళలు తక్కువ కాదని చెప్పారు. మహిళలు ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ, అన్ని రంగాల్లో రాణించాలని పిలుపు ఇచ్చారు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో అవకాశాలు మీ ముందు ఉన్నాయన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.  చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కావాలని ఈ మహిళా పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానిస్తోందని చెప్పారు. మహిళా బిల్లు పార్లమెంట్ లో నెగ్గడానికి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ముందుండి దేశవ్యాప్తంగా ప్రజలు, రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టాలని కోరారు.
       ఈ సదస్సు సందర్భంగా ఇక్కడ జరిగిన 54 రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఉన్నత విద్య, న్యాయం, పౌష్టికాహారం, మహిళా శక్తి, సామాజిక అభివృద్ధి, పార్లమెంట్ వంటి అంశాలపై చర్చించినట్లు వివరించారు. ఇక్కడ చర్చించిన అన్ని అంశాలు అమలు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఉపాధికల్పనలో లింగవ్యత్యాసం చూపకూడదన్నారు. కార్యాలయాల్లో, పాఠశాలల్లో, ఇళ్లల్లో మహిళలను గౌరవించాలన్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ సదస్సు ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రభంజనం సృష్టించిందన్నారు. 60 కోట్ల మందిని ఆకట్టుకుందని చెప్పారు. మహిళా సాధికారిత అంటే ఏమిటని అడిగితే 25.90 శాతం మంది మహిళలను గౌరవించడం అని చెప్పినట్లు తెలిపారు.
తల్లికి వందనం
       ఇండోనేషియా, ఫిన్లాండ్ వంటి దేశాలలో ఏడాదిలో ఒక రోజు తల్లికి కేటాయించి గౌరవిస్తారని, అది ఎంతో మంచి సంప్రదాయమన్నారు. త్వరలో మన రాష్ట్రంలో కూడా అటువంటి కార్యక్రమం ఒకటి పెద్ద ఎత్తున ‘తల్లికి వందనం‘ అనే పేరుతో  ప్రకటిస్తామని చెప్పారు. ఆ రోజు ప్రతి పాఠశాలకు తల్లులను పిలిపించి విద్యార్థినీ విద్యార్థులు వారి వారి తల్లుల పాదాలు కడిగి, వారిని గౌరవించేవిధంగా కార్యక్రమం రూపొందిస్తామన్నారు. అందరూ తల్లులను గౌరవించిననాడే సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించగలుగుతారని చెప్పారు.  మహిళలను గౌరవించే సంస్కృతి మన ఇంటి నుంచే మొదలుకావాలని పిలువు ఇచ్చారు. స్త్రీ, పురుషులు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాలన్నారు. మహిళలను గౌరవించిననాడే ఏ సమాజమైనా అభివృద్ధి చెందుతుందన్న స్వామి వివేకానంద మాటలను గుర్తు చేశారు. ఒక్క కాలితోగానీ లేక బలహీనంగా ఉన్న కాలితో గాని పక్షి ఎలా ఎగరలేదో అలాగే మహిళలను గౌవించని దేశం కూడా అభివృద్ధి చెందలేదని వివేకానందుడు ఆనాడే చెప్పారన్నారు.
సదస్సు నిరంతర ప్రక్రియ
         ఈ పార్లమెంట్ అనేది ఒక రోజు, మూడు రోజుల సదస్సు కాదని, ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. ఈ సదస్సు ద్వారా మహిళలు ఉత్సాహం, ఉత్తేజం పొందారని చెప్పారు. అన్ని రంగాల్లో భాగస్వాములై దీనిని ఒక జాతీయ ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలన్నారు.  జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు ప్రతి సంవత్సరం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒక్కో ఏడాది ఒక్కో రాష్ట్రంలో జరగడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు.
మరో దుర్గామాత సుమిత్రా మహాజన్
           దేశవిదేశాల నుంచి వచ్చిన మహోన్నత మహిళల ప్రసంగాలతో మహిళలు, విద్యార్థినులు స్పుర్తి పొందారన్నారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.  ఆమె పెళ్లి  జరిగిన తరువాత డిగ్రీ పూర్తి చేశారని చెప్పారు. మేయర్ గా, 27 ఏళ్లు ఎంపీగా ఉన్నారని వివరించారు. లోక్ సభను క్రమశిక్షణగా నిర్వహించడంలో ఆమె దిట్ట అన్నారు. ఈ విషయంలో ఆమె మరో దుర్గామాతగా అభివర్ణించారు.  మరో ముఖ్య విషయం ‘‘ మా అత్తగారి మద్దతు వల్లే నేను ఈ స్థానంలో నిలబడ్డాను’’ అని సుమిత్రా మహాజన్ తనకు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు.

అమరావతి వాస్తు
       నూతన రాజధాని అమరావతి వాస్తు బాగుందని సీఎం చెప్పారు. ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుందన్నారు. ఎవరైనా ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే వాళ్లే ఇబ్బందులు పడతారన్నారు. 

నేడే జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు

·       ఉన్నత శిఖరాలకు చేరిన మహిళలు కలిసే పవిత్ర సంగమం
     
          జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో అత్యున్న స్థానానికి ఎదిగిన మహిళలు ఈ రోజు కృష్ణా తీరంలో కొలువుకానున్నారు. విజయవాడ
కృష్ణా నదీ తీరాన ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద శుక్రవారం ఉదయం 10 గంటలకు జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు ప్రారంభమవుతుంది. వరుసగా మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన సదస్సులను మరిమించే విధంగా అత్యంత భారీ స్థాయిలో ఈ సదస్సు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. దేశంలో మొదటిసారి జరుగుతున్న ఈ సదస్సులో దాదాపు 12వేల మంది పాల్గొనే అవకాశం ఉంది. దేశవిదేశాలకు చెందిన ప్రముఖ మహిళలతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 8 వేల మంది విద్యార్థినులు పాల్గొననున్నారు.
రాజకీయ, విద్య, క్రీడలు, పరిశ్రమలు, మీడియా, సినిమా, కళలు, న్యాయ వ్యవస్థల నుంచి మహిళలతోపాటు విద్యార్థినులు భారీ సంఖ్యలో పాల్గొని వారివారి అనుభవాలను తెలియజేస్తారు.... 
          రాజకీయ, పారిశ్రామిక, విద్యా, పరిశోధన, మీడియా, సినిమా, వివిధ కళలు, న్యాయవ్యవస్థ, శాస్త్రసాంకేతిక తదితర అన్ని రంగాలలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇక్కడ చర్చిస్తారు. పలువురు మహిళలు, విద్యార్థినులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, అనుభవాలు వివరిస్తారు. అలాగే పరిష్కారమార్గాలను సూచిస్తారు. కొన్ని విధాన నిర్ణయాలు తీసుకుంటారు. అంతర్జాతీయ స్థాయిలో మహిళా సాధికారితకు సంబంధించి అమూల్యమైన, ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు.
         
         సదస్సు ప్రారంభానికి ముందు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు పాల్గొనేవారి పేర్లు నమోదు చేసుకుంటారు. ఇప్పటికే పది వేల మంది ఆన్ లైన్ తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మిగిలిన వారు సదస్సు ప్రదేశంలో రిజిస్టర్ చేసుకుంటారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే  ప్రారంభ సదస్సులో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు హెచ్.హెచ్. దలైలామా, ప్రముఖ గాంధేయవాధి ఈలా భట్, సినిమా నటి జూహీ చావ్లా, శాసనసభ మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ డిప్యూటీ డైరెక్టర్ కేథరిన్ హే, శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్, ప్రఖ్యాత గాయని లతామంగేష్కర్, రాష్ట్ర మంత్రి పీతల సుజాత, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పూనమ్ మాలకొండయ్య, సదస్సు  కన్వీనర్ గా  ప్రముఖ విద్యావేత్త రాహుల్ వి. కరద్, సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ రంజనీ కుమారి, ముకుల్ మాధవ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ రితూ చాబ్రియా, బాంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ డాక్టర్ శిరిన్ షార్మిన్ చౌదరి, భరత్ బయోటెక్ లిమిటెడ్ కో-ఫౌండర్ సుచిత్రా ఇల్లా   ప్రసంగిస్తారు.
          మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 గంటల వరకు లంచ్ బ్రేక్.
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.40 గంటల వరకు మొదటి ప్లీనరీ సదస్సు జరుగుతుంది. ఈ విభాగంలో మహిళలు రాజకీయంగా  ఎదుర్కొనే సమస్యలపై చర్చిస్తారు. స్టాప్ యాసిడ్ ఎటాక్ మిషన్ క్రుసేడర్ లక్ష్మీ అగర్వాల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక గజపతి రాజు, సినిమా నటి మనీషా కోయిరాలా, భారత సంతతికి చెందిన అమెరికా రాజకీయ నాయకురాలు అరుణా మిల్లర్, నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ ముహ్మద్ యూనస్, ఆసియన్ న్యూస్ ఇంటర్నేషన్ ఎడిటర్ స్మితా ప్రకాష్, కినెటిక్ ఇంజనీరింగ్ ఫౌండర్, వైస్ చైర్ పర్సన్ సులజ్జా ఫిరోడియా మోట్వానీ, పశ్చిమ ఆఫ్రికా సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కామెరా సనగాకబా  ప్రసంగిస్తారు.
సాయంత్రం 4.40 గంటల నుంచి 6.30 గంటల వరకు యువతులు, విద్యార్థినులకు సంబంధించిన సమస్యలపై సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో స్కూల్ గవర్నమెంట్ మిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ శైలశ్రీ హరిదాస్, తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత, నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య, ఏపీ మహిళా స్వయంసేవక సంఘాల కమ్యునిటీ ఆర్గనైజర్ విజయభారతి ప్రసంగిస్తారు. 
సాంస్కృతి కార్యక్రమాలు
        రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు పవిత్ర సంగమం వద్ద అమరావతి అంతర్జాతీయ సంగీత నృత్యోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 5.00 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. 5 దేశాలకు చెందిన అంతర్జాతీయ కళా బృందాలతోపాటు మనదేశానికి చెందిన ప్రఖ్యాత కళాకారులు ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో తమతమ ప్రదర్శనలు ఇస్తారు.