Feb 14, 2017

జాతీయ మహిళా పార్లమెంట్ కు భారీ ఏర్పాట్లు

సర్వాంగసుందరంగా రూపుదిద్దుకున్న పవిత్ర సంగమ ప్రదేశం
            కృష్ణా నదీ తీరాన ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద ఈ నెల 10 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న  సదస్సుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవిదేశాలకు చెందిన దాదాపు 12 వేల మంది హాజరయ్యే ఈ సదస్సుకు అదే స్థాయిలో సౌకర్యాలు సమకూరుస్తున్నారు. వచ్చిన అతిధులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని అందుబాటులో ఉంచుతున్నారు. దాదాపు పది వేల మంది ఒకేచోట కూర్చోవడానికి అనువుగా అత్యంత ఆధునికంగా అతి పెద్ద సమావేశ హాలు నిర్మించారు.  కేవలం మూడు రోజుల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసినప్పటికీ  పటిష్టంగా  నిర్మించారు. సదస్సు ప్రదేశానికి ఎదురూగానే అతి పెద్ద డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం సదస్సు హాలు పక్కనే మరో డైనింగ్ హాలు ఏర్పాటు చేశారు. ఆ పక్కనే ముఖ్యమంత్రి సమావేశా హాలు, డైనింగ్ హాలు  నిర్మించారు. వాటన్నిటి లోపల ఏసీలను అమరుస్తున్నారు. మూడు రోజుల పాటు సాయంత్రాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం కోసం నదికి ఆనుకొని బహిరంగ ప్రదేశంలో అత్యంత ఆధునికంగా మరో పెద్ద స్టేజీ నిర్మించారు. అక్కడ కృష్ణా పుష్కరాలు సందర్భంగా నాటిన పూల మొక్కలు అంత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. సమీపంలోనే మీడియా సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
          రాష్ట్రం నుంచి, దేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి అన్ని రంగాలకు చెందిన మహిళలు ఇక్కడ సమావేశమై వారివారి  సమస్యలను చర్చిస్తారు. సమస్యలకు పరిష్కారాలను సూచిస్తారు. కొన్ని ప్రధాన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఇటువంటి సదస్సు దేశంలో జరడం ఇదే మొదటి సారి.  ఇంతటి సదస్సుకు వచ్చే వారందరికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా వివిధ శాఖలకు చెందిన  వేల మంది సిబ్బంది పనులు చేస్తున్నారు. అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అందికీ ఉపయోగపడేవిధంగా తాత్కాలిక మరుగు దొడ్లు ఏర్పాటు చేశారు. శాశ్విత ప్రతిపదికన అత్యంత ఆధునికమైన 30 మరుగుదొడ్లు నిర్మించారు. వాటిలో పురుషులు, మహిళలతోపాటు దివ్యాంగులకు కూడా ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నాయి. వాటికి సోలార్ విద్యుత్ సౌకర్యం కూడా కల్పించారు.  వీఐపీల కోసం ప్రత్యేకంగా 90 మరుగు దొడ్లు ఏర్పాటు చేశారు.  
         సదస్సు జరిగే సమయంలో విద్యుత్ కు ఎటువంటి అంతరాయం కలుగకుండా ఏడు ట్రాన్స్ ఫార్మర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేశారు.   నిర్వహణ ఏర్పాట్లు చూసే బాధ్యులు (ఈవెంట్ మేనేజ్ మెంట్ వారు) ముందు జాగ్రత్తగా దాదాపు 20 జనరేటర్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖ వారు కూడా మరో నాలుగు జనరేటర్లు అందుబాటులో ఉంచారు. డ్వాక్రా ఉత్పత్తులు అమ్మకాలకు 26 స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. డ్వాక్రా మహిళలు వీటిని నిర్వహిస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సదస్సు జరిగేవిధంగా ఏర్పాట్లు చేశారు. పవిత్ర సంగమ ప్రాంతాన్ని అత్యంత మనోహరంగా తీర్చిదిద్దారు.
వైద్య శిబిరాల ఏర్పాటు
         సదస్సుకు హాజరయ్యే వారికి అత్యవసరంగా వైద్యం అందించడం  కోసం వైద్య ఆరోగ్య శాఖ వారు రెండు మెడికల్ క్యాంప్ లు, ఆరు నుంచి పది బెడ్ లతో ఓ తాత్కాలిక మినీ ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మూడు రోజులు ఇక్కడ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. మొత్తం పది మంది  డాక్టర్లు విధులు నిర్వహిస్తారు. ఎవరికైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడితే సమీపంలోని కార్పోరేట్ ఆస్పత్రులకు తరలిస్తారు. అందుకోసం మూడు కార్పోరేట్ ఆస్పత్రులలో, ప్రభుత్వ ఆస్పత్రిలో పదేసి బెట్ల చొప్పున అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాటు చేశారు. అలాగే వివిధ విభాగాలలో డాక్టర్లు అందుబాటులో ఉండేవిధంగా కూడా ఆయా ఆస్పత్రులలోని డాక్టర్లకు విధులు నిర్ణయించారు. అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచుతారు. మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ శామ్యూల్ అనంద కుమార్ బుధవారం సాయంత్రం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసే ప్రదేశాన్ని సందర్శించారు.

       దేశ విదేశాల నుంచి వచ్చే వీఐపీలకు ప్రముఖ హోటళ్లలో వసతి ఏర్పాట్లు చేశారు. కొందరు అధికారులకు ప్రభుత్వ అతిధి గృహాలను కేటాయించారు. విద్యార్థులు, అధ్యాపకుల కోసం విజయవాడ నగరంలోని 46 ప్రాంతాలలో కాలేజీలు, పాఠశాలలను కేటాయించారు. ఆయా ప్రాంతాలలో వారికి సరిపోయేవిధంగా తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు.

భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు
ప్రముఖులు అనేక మంది వస్తున్నందున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ అధికారులు దగ్గర ఉండి అన్ని పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ నగర  పోలీస్ కమిషనర్  గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు బుధవారం సాయంత్రం సంగమ ప్రదేశాన్ని సందర్శించి, ఏర్పాట్లనన్నిటినీ పరిశీలించారు. తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ముందు జాగ్రత్తగా పవిత్ర సంగమ ప్రాంతంలో సదస్సు ప్రదేశం లోపల, బైట మొత్తం 170 సీసీ కెమెరాలు అమరుస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

Feb 8, 2017

రాష్ట్రాభివృద్ధిలో కీలకంగా ఎయిర్ పోర్టులు


ü 2020 నాటికి 12 విమానాశ్రయాలు
ü మౌలిక వసతుల్లో భాగంగా కొత్త నిర్మాణాలు
ü భూసేకరణ బాధ్యతలు కలెక్టర్లకు అప్పగింత

        రాష్ట్రం అన్ని రంగాలతోపాటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందడానికి మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తూ, కొత్త వాటిని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  మౌలిక సదుపాయల కల్పనలో విమానాశ్రయాలు కీలకంగా ఉంటాయి. దానికి తోడు రాష్ట్రం విడిపోయిన తరువాత ఇక్కడ విమానయాన సేవలు విస్తృతమయ్యాయి.  ముందుముందు విమాన సర్వీసుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.  ఈ నేపధ్యంలో 2020 నాటికి రాష్ట్రంలో మొత్తం 12 విమానాశ్రయాలు విమానా రాకపోకలు నిర్వహించేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్తగా నిర్మించేవాటికి సంబంధించి భూసేకరణ బాధ్యతలను ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించింది.  రాష్ట్రాన్ని విమానయాన హబ్‌గా రూపొందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.  రాష్ట్రంలో ప్రస్తుతం విశాఖపట్నం, రాజమండ్రి, గన్నవరం (విజయవాడ), తిరుపతి, కడప విమానాశ్రయాల నుంచి విమాన సర్వీసులు నడుస్తున్నాయి.   గన్నవరం విమానాశ్రయంలో ఇన్ టెర్మ టెర్మినల్ భవనాన్ని గత నెలలో ప్రారంభించారు. దీనికి అంతర్జాతీయ విమానాశ్రయ హోదా ఇవ్వాలని కేంద్ర పౌరవిమానయాన శాఖను కోరారు. విశాఖలో కస్టమ్స్ విమానాశ్రయం కూడా ఉంది. ఇది ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో ఉంటుంది. మిగిలినవాటిని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) నిర్వహిస్తోంది. విమానాశ్రయ పరిసరాలలో మొక్కలు పెంచి, పచ్చదనం నింపి అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని ఏఏఐ నిర్ణయించింది. ఇందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఏఏఐకి సహకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.  కొత్తగా   విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ ఫీల్డు విమానాశ్రయం, విశాఖ-చెన్నయ్ పారిశ్రామిక కారిడార్ లో నెల్లూరు జిల్లా దగదుర్తి విమానాశ్రయం, కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను కొత్తగా నిర్మిస్తారు. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మిస్తారు. కొత్త విమానాశ్రయాలను పీపీపీ పద్దతిలో నిర్మిస్తారు.  ప్రకాశం జిల్లా దొనకొండలో బ్రిటీష్ కాలంలో ఏర్పాటైన విమానాశ్రయాన్ని పునరుద్దరిస్తారు. దీనిని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ప్రాంతీయ అనుసంధాన పథకం (ఆర్సీఎస్-రీజినల్ కనెక్టివిటీ స్కీమ్) కింద అభివృద్ధి చేయనుంది.

       మంగళగిరి వద్ద  5వేల ఎకరాలలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం(పీపీపీ)లో అంతర్జాతీయ విమానాశ్రయ స్థాయిలో నిర్మిస్తారు. సింగపూర్ సంస్థ రూపొందించిన నూతన రాజధాని ముసాయిదా ప్రణాళికలో కూడా దీనిని పేర్కొన్నారు. అయితే దీనికి ఇంకా స్థల నిర్ణయం జరుగలేదు. భోగాపురం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ  గ్రీన్‌ఫీల్డు విమానాశ్రయంగా నిర్మించేందుకు కేంద్ర విమానయాన శాఖ (ఎంఓసీఏ-మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అంగీకారం తెలిపింది. టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ నివేదిక కూడా పూర్తి అయింది. పీపీపీ పద్దతిలో టెండర్లు కూడా పిలిచారు. ఆసక్తి చూపిన బిడ్డర్లతో రెండు సార్లు ప్రీ-బిడ్ మీటింగ్స్ కూడా నిర్వహించారు. వారికి ప్రతిపాదిత స్థలాన్ని కూడా చూపారు. మొత్తం 5,311 ఎకరాల్లో దీనిని నిర్మిస్తారు. ఇప్పటికే ఈ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి 1237.30 ఎకరాల భూమిని అప్పగించారు. మిగిలిన భూసేకరణను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ విమానాశ్రయాన్ని ఆసియా పసిఫిక్‌కు గేట్‌వేగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. విమానయాన రంగానికి సంబంధించిన తయారీ యూనిట్లను దీని చుట్టూ అభివృద్ధి చేస్తారు. విమాన నిర్వహణ, మరమ్మతు (ఎంఆర్‌ఓ) యూనిట్‌ను, మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ కేంద్రం వంటి వాటిని ఏర్పాటుచేస్తారు. రెండు సమాంతర రన్‌వేలు, ఒక ద్వితీయ శ్రేణి రన్‌వే ఉంటాయి.
       దగదర్తి మండలం కేకేగుంట, దామవరం ప్రాంతంలో దస్తగిరి విమానాశ్రయం నిర్మిస్తారు. దీని నిర్మాణానికి కూడా ఎంఓసీఏ అనుమతి లభించింది. టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ నివేదిక  పూర్తి అయింది. బిడ్ల పరిశీలన జరుగుతోంది. దీనికి సంబంధించి పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులను త్వరగా పరిష్కరించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ని ప్రభుత్వం ఆదేశించింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కన్నమడకల, ఓర్వకల్లు, పూడిచర్ల గ్రామాల సమీపంలో 1082.36 ఎకరాల పరిధిలో ఓర్వకల్లు విమానాశ్రయాన్ని నిర్మిస్తారు. భూసేకరణ పనులను జిల్లా అధికార యంత్రంగా పూర్తి చేసింది. ఈ గ్రీన్‌ఫీల్డు విమానాశ్రయం నిర్మాణానికి రూ.200 కోట్లు ఆర్థికసాయం అందించేందుకు హుడ్కో సంస్థ ముందుకు వచ్చింది.
        ఓర్వకల్లు  గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ మొదటి ప్యాకేజీలో రన్ వే, ప్రహరీగోడ నిర్మాణం టెండర్ ఖరారైంది. రెండవ ప్యాకేజీలోని విమానాశ్రయ టెర్నినల్ భవనం నిర్మాణ టెండర్ ని త్వరలో పిలుస్తారు. దీనికి సంబంధించిన భూసేకరణ, అప్పగింత కార్యక్రమం త్వరగా పూర్తిచేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ ను ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజు ఉన్నందున ఈ పనులన్నీ చెకచెకా జరుగుతున్నాయి.


       అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఒక ప్రైవేట్ విమానాశ్రయం ఉంది. ఇక్కడ రాకపోకలు కొనసాగుతున్నాయి.  గుంటూరు జిల్లా విజయపురిలో నాగార్జున సాగర్ వద్ద కూడా మరో  ప్రైవేటు విమానాశ్రయం ఉంది. దీనిని అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కావలసిన భూసేకరకు సహకరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ విమానాశ్రయం నిర్మిస్తే అటు తెలంగాణ, ఇటు ఏపీకి ఉపయుక్తంగా ఉంటుందని కేంద్రం భావిస్తోంది. అలాగే సాగర్ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధిచెందడానికి అవకాశం ఏర్పడుతుంది.  కర్నూలు జిల్లా శ్రీశైలం, గుంటూరు జిల్లా నాగార్జున సాగర్ లలో ప్రాంతీయ విమానాశ్రయాలు నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వీటిలో చాలావరకు ఈ ఏడాదే పనులు మొదలుపెట్టి 2020 నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా చిత్తూరు జిల్లా కుప్పంలో కూడా విమానాశ్రయం నిర్మించే ఆలోచనలో ఉంది.  

Feb 6, 2017

మూడేళ్లలో అమరావతికి ఒక రూపం


·       నిర్మాణానికి భారీస్థాయిలో దేశ, విదేశీ సంస్థల ఆర్థిక సాయం
·       మెట్రో రైల్ కు రూ.100 కోట్ల కేటాయింపు
·       ప్రపంచ స్థాయి విద్యా కేంద్రం
·       23 గ్రామాల్లో రైతులకు ప్లాట్ల కేటాయింపు
·       పలు సంస్థలకు భూముల కేటాయింపు
·       ప్రధాన ఆర్కిటెక్ట్ ఖరారు - 22న ప్రధాన ఆకృతులు అందజేత
·       హోటళ్లు, పాఠశాలల నిర్మాణానికి టెండర్లు
·       తాజా అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం రూ.58వేల కోట్లు
·       4 వరుసలతో 7 ప్రధాన రోడ్ల నిర్మాణం

       ఆంధ్రప్రదేశ్  నూతన ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి దేశవిదేశాలోని ఆర్థిక సంస్థలు భారీ స్థాయిలో ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. భూ సమీకరణ దాదాపు పూర్తి అయింది. నిధుల సమీకరణ కూడా ఓ కొలిక్కి వచ్చింది. ఇక డిజైన్ల (ఆకృతులు)ను ఆమోదించి నిర్మాణం మొదలుపెట్టడమే మిగిలింది. కృష్ణా నది ఒడ్డున 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేపట్టింది. రాష్ట్రంలోని 5.23 కోట్ల మందికి చెందిన ఇంతటి భారీ ప్రాజెక్టు విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలన్నింటినీ ప్రభుత్వం తీసుకుంటోంది. అందుకు తగ్గట్టుగానే అమరావతి బ్రాండ్ నేమ్ ప్రచారం చేయడానికి, పారిశ్రామిక పెట్టుబడులు రాబట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ప్రభుత్వ ప్రతినిధులు అనేకమంది పలు దేశాల పర్యటన ఫలితాలనిస్తోంది. సింగపూర్, మలేషియా, చైనా, జపాన్, బ్రిటన్, రష్యా, కజకిస్తాన్ వంటి దేశాలు తమ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచలోని పలు ప్రముఖ ఆర్థిక, పారిశ్రామిక, విద్య, వైద్య సంస్థల ప్రతినిధులు ప్రజా రాజధాని అమరావతిని సందర్శించారు. ఇక్కడ పరిస్థితులను పరిశీలించారు. ఇక్కడ చేపట్టే నిర్మాణల గురించి తెలుసుకున్నారు. దీని నిర్మాణంలో అన్నిదశలలో పాలుపొచుకోవడానికి అందరూ ముందుకు వస్తున్నారు.
రూ.58వేల కోట్లు ఖర్చు :     తాజా అంచనాల ప్రకారం రాజధాని నిర్మాణానికి రూ.58వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1425 కోట్లు మాత్రమే సమకూరుస్తుంది. కొంత భాగం కేంద్రం ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటికే కేంద్రం రూ.2,500 కోట్లు విడుదల చేసింది. మిగిలిన మొత్తం దేశ, విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ మార్గాలలో నిధుల సేకరణకు ఏపీసీఆర్ డీఏ (ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ) ప్రయత్నాలు చేస్తోంది.  కొన్ని ప్రాజెక్టులను ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతుల్లో మొదలు పెట్టేందుకు ప్రాజెక్టులు, జాతీయ పెట్టుబడి సంస్థల నుంచి అవసరమైన నిధుల సమీకరిస్తారు. అమరావతి నిర్మాణానికి ముందకు వచ్చినవాటిలో ప్రపంచ బ్యాంక్(ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకనస్ట్రక్షన్ అండ్ డవలప్ మెంట్), ఏఐఐబీ(ఆసియా మౌలికవసతుల పెట్టుబడి బ్యాంక్), భారత ప్రభుత్వ సంస్థ హడ్కో(హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్) వంటి ఆర్థిక సంస్థలు ఉన్నాయి. అమరావతిలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు మొదటి విడతగా 50 కోట్ల డాలర్లు (సుమారుగా 3350 కోట్లు) రుణం ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. ఈ ప్రాజెక్టుకి ప్రపంచబ్యాంకు గుర్తింపు నెంబరు కూడా ఇచ్చింది. నెంబరు ఇస్తే ప్రాజెక్టుకి బ్యాంకు దాదాపు ఆమోద ముద్ర వేసినట్లే. హడ్కో రూ.7500 కోట్లు రుణం ఇస్తుంది. హడ్కో వడ్డీ శాతాన్ని కూడా 10.5  నుంచి 9.5 శాతానికి తగ్గించనుంది.  కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ) సూచన మేరకు ఇతర మార్గాలలో కూడా నిధులు సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాండ్స్ ద్వారా కూడా నిధులు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాండ్లు తీసుకునేవారికి పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు కల్పిస్తారు. బాండ్లు ద్వారా రెండు వేల కోట్ల రూపాయల వరకు సమకూరుతాయని భావిస్తున్నారు. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మసాలా బాండ్లు(రూపీ-డినామినేటెడ్ బాండ్లు) రూపంలో కూడా నిధులు సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలలో రాజధాని నిర్మాణానికి సీఆర్డీఏ నిధులు సమకూర్చుకుంటోంది.
ప్రజా భాగస్వామ్యం: ప్రజారాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలు కూడా భాగస్వాములవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుని అందుకుని ‘నా ఇటుక- నా అమరావతి’ ద్వారా లక్షల మంది విరాళాలు అందజేస్తున్నారు. అమరావతి వెబ్ సైట్ ద్వారా దేశవిదేశాలలోని తెలుగు ప్రజలు ఒక్కో ఇటుక పది రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ‘నా ఇటుక- నా అమరావతి’ ద్వారా ఇప్పటి వరకు రెండు 26 వేల  మందికి పైగా ప్రజలు 56 లక్షలకుపైగా ఇటుకలు కొనుగోలు చేశారు.
23 గ్రామాల్లో ప్లాట్ల కేటాయింపు: ఒక పక్క భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను కేటాయిస్తూ, మరో పక్క రాజధానిలో భవనాల నిర్మాణానికి డిజైన్లను ఆమోదించడం, రోడ్లు, పాఠశాలల నిర్మాణానికి బిడ్లు పిలవడంలో సీఆర్డీఏ బీజిబీగా ఉంది.  ఇప్పటి వరకు 23 గ్రామాలలోని రైతులకు నివాస, వాణిజ్య ప్లాట్లు పంపిణీ చేశారు.
34,984 ఎకరాల సమీకరణ:  అమరావతి మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేశారు. 90 శాతం పైగా భూమిని సీఆర్టీఏ స్వాధీనం చేసుకుంది.  రాజధాని పరిధిలో 53,478 ఎకరాల భూమి ఉంది. ఇందులో 37,505 ఎకరాలను లాండ్ పూలింగ్ పథకం కింద సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 34,984 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. కృష్ణా నది ఒడ్డున 15 కిలోమీటర్ల పొడవున 217 కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  అత్యంత ఆధునిక ప్రభుత్వ భవనాల మాస్టర్ ఆర్కిటెక్ట్ లుగా లండన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్, మన దేశానికి చెందిన హఫీజ్ కాంట్రాక్టర్ లను ఎంపిక చేశారు. శాసనసభ, హైకోర్టు, ఇతర ప్రధాన ప్రభుత్వ భవనాల ఆకృతుల విషయమై వారితో సీఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.  రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రధాన ఆకృతులను నార్మన్ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ వచ్చే నెలలో ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది. మూడేళ్లలో రాజధానికి ఒక రూపం తీసుకురావాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.  క్యాపిటల్ జోన్ లో భవనాల కోసం రూ.10,519 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.7,390 కోట్లు, భవిష్యత్ అవసరాల కోసం కల్పించవలసిన మౌలిక వసతులకు రూ. 9,181 కోట్లు ఖర్చవుతాయని అంచనా. మిగిలిన ప్రభుత్వ భవనాల ఆర్కిటెక్ట్ ల ఎంపికకు కూడా టెండర్లను పిలిచారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా అత్యంత సౌకర్యవంతంగా ప్రజా రవాణా వ్యవస్థకు రూపకల్పన చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రధానమైన రోడ్లు అన్నిటికి టెండర్లు పిలిచారు. భూగర్భంలో ఈహెచ్ టీ(ఎలక్ట్రానిక్ హై టెక్షన్) కేబుల్ లైన్స్ అమర్చడానికి టెండర్లను త్వరలో పిలుస్తారు.
ప్రపంచ స్థాయి విద్యా కేంద్రం:  రానున్న అయిదేళ్లలో ప్రపంచ స్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి అనుగునంగా రాజధానిలో వివిధ ప్రముఖ విద్య, వైద్య సంస్థలకు భూములు కేటాయించారు. దేశంలో టాప్ 20, ప్రపంచంలో టాప్ 20 విశ్వవిద్యాలయాలను ఏపీకి తీసుకురావల్లన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం. ఆ మేరకు ఇప్పటికే దేశవిదేశాలలోని పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకోవడం, భూములు కేటాయించడం జరిగిపోయాయి. వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్), శ్రీరామస్వామి మెమోరియల్ (ఎస్ఆర్ఎం) యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, ఇండో-యుకే హెల్త్ ఇన్ స్టిట్యూట్, డాక్టర్ బీఆర్ శెట్టి మెడికల్ సిటీ వంటి వాటితోపాటు వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూములు కేటాయించారు.  ఇండో-యూకే ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్ కు మొదటి దశలో 50,  రెండు దశలో 100 కలిపి మొత్తం 150 ఎకరాలు కేటాయించనున్నారు.  నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్(ఎన్ఐడీ)కి 50 ఎకరాలు, సెంట్రల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్ (సీఐటీడీ)కి ఐదు ఎకరాలు, ఆంధ్రప్రదేశ మానవ వనరుల అభివృద్ధి సంస్థకు 25 ఎకరాలు కేటాయించేందుకు సీఆర్‌డీఏ నిర్ణయం తీసుకుంది.

 హోటళ్లు, పాఠశాలలు, రోడ్ల నిర్మాణానికి టెండర్లు: ప్రముఖ సంస్థలకు భూలు, రైతులకు ప్లాట్ల కేటాయింపు, రోడ్లు, హోటళ్లు, పాఠశాలల నిర్మాణానికి టెండర్లు పిలవడం, ప్లాన్ల పరిశీలనలో సీఆర్డీఏ నిమగ్నమై ఉంది.  రాజధానిలో రోడ్లు, పాఠశాలలు, స్టార్ హోటళ్లు, హాస్పటళ్లు, ఎంఐసీఈ(మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఈవెంట్స్) సెక్టార్ లో నిర్మాణానికి సీఆర్డీఏ ఆర్.ఎఫ్.పీ.లను ఆహ్వానించింది.  అమరావతి మెట్రో రైల్ నిర్మాణానికి 2017-18 కేంద్ర బడ్జెట్ లో రూ.100 కోట్లు కేటాయించారు. 160కి పైగా ప్రాథమిక పాఠశాలలు, వందకు పైగా ఉన్నత పాఠశాలలు, 27 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన. అందులో భాగంగా  జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆరు పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు సీఆర్ డీఏ ఆర్ఎఫ్ పీలను ఆహ్వానించింది. అలాగే ఒక 5 స్టార్, ఒక 4 స్టార్, 4 త్రీస్టార్ హోటళ్లకు ఆర్ఎఫ్ పీలను విడుదల చేసింది. రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. మరోవైపు నిర్మాణ నాణ్యతకు సంబంధించి యంత్రాల ద్వారా వంద అడుగుల లోతు వరకు మట్టి నమూనాలను కూడా సేకరిస్తున్నారు.  రాజధాని లోపల 320 కిలోమీటర్ల మేర 4 వరుసలతో 7 ప్రధాన రోడ్లు నిర్మిస్తారు. ఈ రోడ్లకు భూసేకరణ పనులు కూడా మొదలయ్యాయి. 14 నెలల్లో ఈ రోడ్లు నిర్మాణం పూర్తి చేయడానికి సీఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడే ప్రత్యేక పరిశ్రమగా ఎదుగుతున్న ఎంఐసీఈ రంగంలో కూడా టెండర్లను పిలిచారు. మంచినీరు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ శక్తి వంటి వాటికి త్వరలో టెండర్లు పిలవనున్నారు.  అమరావతిలో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్ల వ్యయంతో అంబేద్కర్ స్మృతి వనం నిర్మిస్తారు. ఇందులోనే బౌద్ధ ధ్యా నకేంద్రం, ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంటాయి. అంతేకాకుండా విజయవాడ – అమరావతి – గుంటూరు – తెనాలి – కేసీ కెనాల్ మీదగా విజయవాడకు 105 కిలోమీటర్ల పొడవున హై స్పీడ్ సర్క్యులర్ రైలు మార్గం నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. రూ.10 వేల కోట్లు ఖర్చు కాగల ఈ ప్రాజెక్టు సంబంధించి రాష్ట్ర  ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ పనులన్నీ అనుకున్నట్లుగానే శరవేగంగా జరిగితే మూడేళ్లలో రాజధానికి ఒక రూపం వస్తుంది.

-          శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


మహిళా శక్తి ఒకేచోట ఏకం కానున్న వేళ!

Ø 10 నుంచి 3 రోజులు మహిళా పార్లమెంటేరియన్ సదస్సు
Ø పవిత్ర సంగమం  వద్ద భారీ  ఏర్పాట్లు
Ø దేశవిదేశాలకు చెందిన ప్రముఖ మహిళలు రాక
Ø 15వేల మంది హాజరయ్యే అవకాశం
Ø ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు

         రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన సదస్సులను తలదన్నేవిధంగా జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే అధికారులు కృషి చేస్తున్నారు. విజయవాడ కృష్ణా నదీ తీరం ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో మూడు రోజులపాటు ఈ సదస్సు నిర్వహించనున్న విషయం తెలిసిందే.  సమాజంలో అన్ని రంగాల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలన్న ఉన్నత లక్ష్యంతో, స్ఫూర్తి కలిగించి, వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు  దీనిని నిర్వహిస్తున్నారు.  దేశంలో మొదటిసారిగా జరుగుతున్న ఈ సదస్సుకు అపూర్వ స్పందన లభిస్తోంది. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే దేశవిదేశాల నుంచి దాదాపు 9వేల మంది తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. ఈ సంఖ్య 15వేలకు చేరే అవకాశం ఉంది. వీరిలో అత్యధిక మంది విద్యార్థినులు ఉంటారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పూర్తితో చైర్మన్ గా శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్, చీఫ్ పేట్రన్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,  పేట్రన్ గా ప్రముఖ గాంధేయవాది ఈలా భట్, కన్వీనర్ గా  ప్రముఖ విద్యావేత్త రాహుల్ వి. కరద్  ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.  నూతన రాజధానిలో ఇటువంటి అద్వితీయమైన సదస్సు నిర్వహించడం గొప్ప అవకాశంగా భావించవచ్చు. దీనిని విజయవంతం చేయడానికి విస్తృత స్థాయిలో ప్రచారం కూడా కల్పించారు.  
         సామాజికంగా, వాణిజ్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మహిళలు ఎదుగుతున్నారు. పలు రంగాలలో దూసుకుపోతున్నారు. మనదేశంలో వివిధ రంగాల్లో మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్ సభ మాజీ స్పీకర్, మీరాకుమార్, ప్రస్తుత స్పీకర్ సుమిత్రా మహాజన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ, మ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ, కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్, మేనకా గాంధీ, స్మృతి ఇరాని, పెప్సికో సీఈఓ ఇంద్రనూయీ, ఎస్ బీఐ చైర్ పర్శన్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ సీఈఓ చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంక్ సీఈఓ ఎండీ శిఖా శర్మ, శ్రీరాం లైఫ్ ఇన్సురెన్స్ ఎండీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అఖిలా శ్రీనివాసన్, బయోకాన్ ఫౌండర్ చైర్మన్ ఎండీ కిరణ్ మజుందార్, లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఎండీ ఉషా సంగ్వాన్, వీరే కాకుండా కార్పోరేట్ రంగంలో విజయలక్ష్మీ అయ్యర్, నైనాలాల్ కిద్వాయ్, అర్చనా భార్గవ, శుభలక్ష్మీ పన్సే, కకు నకటే, రేణు చల్లూ,  రోషిణి నాడార్, కీర్తిగా రెడ్డి, నీలం ధావన్, అరుణా జయంతి, దిబ్జానీ ఘోష్, రేఖా ఎం.మీనన్, రూపా కుడ్వా, వనితా నారాయణన్ వంటి వారు బాగా రాణిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగాన్ని మహిళలు ఏలుతున్నారు.  అంగ్ సాన్ సూకీ, కిరణ్ బేడీ, తస్లిమా సస్రీన్ వంటి వారితోపాటు సాహిత్యం, సినిమా,  క్రీడలు వంటి రంగాల్లో కూడా మహిళలు తమ శక్తి సామర్థ్యాలను చాటుతున్నారు.
          ఈ సదస్సుకు హాజరైన మహిళలతో రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహిస్తారు. ఆకాశంలో సగమైన మహిళలకూ బాధ్యతలు, బాధలు,  కోరికలు, ఆలోచనలు, అభిప్రాయాలు, సమస్యలు ఉంటాయి.  అన్ని మతాలు, ప్రాంతాలు, కులాలు, సంస్కృతులు, వివిధ సామాజిక వర్గాలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన మహిళలందరూ ఈ సదస్సుకు హాజరవుతారు. అలాగే రాజకీయ, విద్య, క్రీడలు, పరిశ్రమలు, మీడియా, సినిమా, కళలు, న్యాయ వ్యవస్థల నుంచి మహిళలతోపాటు విద్యార్థినులు భారీ సంఖ్యలో పాల్గొని వారివారి అనుభవాలను తెలియజేస్తారు. రాజకీయ, పారిశ్రామిక, విద్యా, పరిశోధన, శాస్త్రసాంకేతిక రంగాలలో మహిళల ఎదుగుదలకు గల అవకాశాలను చర్చిస్తారు. అంతేకాకుండా భారతదేశం సుసంపన్నం కావడానికి మహిళా శక్తిని ఏవిధంగా వినియోగించాలి వంటి అంశాలను కూడా తెలియజేస్తారు. జాతీయ స్థాయిలో మహిళలు ఎదుర్కొనే రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలు చర్చించి, వాటిని అధిగమించడానికి తీసుకోవలసిన చర్యలు, విధివిధానాలు ఈ సమావేశంలో రూపొందిస్తారు. దేశ,విదేశాలకు చెందిన రాజకీయ ప్రతినిధులతోపాటు ప్రముఖ కార్పోరేట్ సంస్థలకు చెందిన మహిళలు కూడా ఈ సదస్సుకు హాజరవుతారు. దేశం నలుమూలల నుంచి 405 మంది మహిళా శాసనసభ్యులు, 92 మంది మహిళా పార్లమెంట్ సభ్యులు, కార్పోరేట్ సంస్థల నుంచి మూడు వందలమందికి పైగా మహిళా ప్రతినిధులు హాజరవుతారు.
        ఈ సదస్సులో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించే అవకాశం ఉంది. గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెల, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు దలైలామా, రవి శంకర్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, కామన్ వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ అక్బర్ ఖాన్, యుపిఎస్సీ మాజీ చైర్ పర్సన్ ఆల్కా సిరోహి, ఎమ్మెల్యే అఖిల ప్రియ, అనిత, భారత సంతతికి చెందిన మేరిల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్ సభ్యురాలు, అరుంధతి భట్టాచార్య,  క్రీడాకారిణులు అరుణిమా సిన్హా, పి.వి.సింధు,  మయన్మార్ స్టేట్ కౌన్సెలర్ అంగ్ సాన్ సూకీ, ఎన్డీటీవీ కన్సల్టింగ్ ఎడిటర్ బర్క్తా దత్, చందా కోచర్, భావనా దోషి, దీపా వెంకట్, ఈలా బెన్ భట్, లైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్ సన్ సిర్లీఫ్, యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరినా బొకోవా, హెచ్ ఎస్ బీ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రసిడెంట్ డాక్టర్ గనేష్ నటరాజన్,  ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీ. రోహిణి, ప్రొఫెసర్ హరిదాస్, సచిన్ టెండూల్కర్, ఇందిరా దత్, ఇంద్రనూయి, మనిషా కోయిరాల, జూహీచావ్లా,  ఎంపి కల్వకుంట్ల కవిత, కిరణ్ మజుందార్ షా, కిరణ్ బేడీ, లతా మంగేష్కర్, లలితా కుమార మంగళం, లక్ష్మి అగర్వాల్, నారా బ్రాహ్మణి, నోబెల్ ఫ్రైజ్ విజేత ప్రొఫెసర్ ముహ్మద్ యూనస్, సుధామూర్తి, పద్మశ్రీ వారియర్, సోనాల్ మాన్ సింగ్, సీమా రావు, శైలజా కిరణ్, నందితా దాస్, కేంద్ర మంత్రులు నిర్మాలా సీతారామన్, స్మృతి ఇరాని,  కవితా జైన్, పూసపాటి అశోక్ గజపతి రాజు, వైఎస్ చౌదరి,  రాష్ట్ర మంత్రి పీతల సుజాతలతోపాటు దేశవిదేశాలకు చెందిన పలువురు ప్రముఖ మహిళలు ప్రసంగించే అవకాశం ఉంది. మూడు రోజులపాటు 7 విభాగాలు జరిగే ఈ సదస్సులో వివిధ రంగాలకు చెందిన 60 మంది నిష్ణాతులు తమ విలువైన సందేశాలను ఇస్తారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు వస్తున్నందున ఆ స్థాయిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సదస్సు జరిగే విధంగా  ఏర్పాట్లు చేస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు ఇస్తారు.  ప్రతినిధులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా  జిల్లా అధికారయంత్రాంగంతోపాటు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 

Feb 3, 2017

కేంద్ర నిధులు పూర్తిగా వినియోగించే యత్నం

 ·       రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు విడుదల చేయాలని నిర్ణయం

          రాష్ట్రాభివృద్ధికి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అదే క్రమంలో  కేంద్రం నుంచి రావలసిన అన్ని రకాల నిధులు రాబట్టాలని నిర్ణయించింది. వివిధ పథకాల కింద ఈ ఆర్థిక సంవత్సరం(2016-17)లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులన్నిటినీ పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇక రెండు నెలలే సమయం ఉంది. ఈ కాలంలోనే కేంద్ర ప్రభుత్వం సహాయం అందించే  31 పథకాల(సీఎస్ఎస్)తోపాటు ఇతర నిధులకు సంబంధించిన పనులను   పూర్తి చేయాలి. వీటికి తోడు 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా ఖర్చు చేసి ఆ పనులను  త్వరితగతిన పూర్తిచేయాలని నిర్ణయించింది.  పథకానికి సంబంధించిన నిబంధనల ప్రకారం ఒక్కో పథకానికి ఒక్కో నిష్పత్తిలో కేంద్రం నిధులు కేటాయిస్తుంది. కేంద్రం నిధులు అందించేవాటిలో ఎంజీఎన్ఆర్ఈజీఏ(మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం), గృహ నిర్మాణం (ప్రధాన మంత్రి ఆవాస్ యోజన), సర్వశిక్ష అభియాన్, స్వచ్ఛభారత్ అభియాన్, స్మార్ట్ సిటీలు, జాతీయ గ్రామీణ త్రాగునీటి కార్యక్రమం (ఎన్ఆర్డీడబ్ల్యూపి),  జాతీయ ఆరోగ్య మిషన్, ఐసీడీఎస్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన(పీఎంజీఎస్ వై), సమగ్ర నీటి సరఫరా పథకం (సీపీడబ్ల్యూఎస్ఎస్), నేషనల్ అర్బన్ మిషన్, ప్రధానమంత్రి క్రిషి సించయీ యోజన, రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్(ఆర్జీఎస్ఏ- 75 శాతం కేంద,25 శాతం రాష్ట్ర నిధులు) వంటి పథకాలు ఉన్నాయి. అంతే కాకుండా వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కూడా కేంద్రం నిధులు మంజూరు చేసింది. అమరావతిని వారసత్వ సంపదగా ప్రకటిస్తూ కేంద్రం  హృదయ్’ (హెరిటేజ్ సిటీస్ డెవలప్‌మెంట్ అండ్ ఆగుమెంటేషన్ యోజన) పథకం కింద  రూ.22.26 కోట్ల నిధులు మంజూరు చేసింది. దాదాపు అన్ని శాఖలలో కేంద్రం ఆర్థిక సహాయం అందించే పథకాలు అనేకం ఉన్నాయి. వాటిలో చాలా వరకు చివరి దశకు వచ్చాయి. అయితే ఇంకా పలు శాఖలలో పనులు మిగిలిపోయి ఉన్నాయి. ఈ రెండు నెలల లోపల ఆ పనులు పూర్తి చేస్తేనే కేంద్ర నిధులు విడుదల చేస్తుంది. లేకపోతే అవి మురిగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల దీనిని దృష్టిలో పెట్టుకొని అ పనులు అన్నిటినీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు విడుదల చేయాలని నిర్ణయం
           కేంద్రంతో జతపడి ఉన్న పనులు పూర్తి కావడానికి నిష్పత్తి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం  కూడా నిధులు మంజూరు చేయాలి. చాలా పథకాలకు సంబంధించి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మంజూరు చేయవలసిన నిధులు ఏమైనా ఉంటే వాటిని వెంటనే మంజూరు చేస్తామని, ఆ పనులను ఈ రెండు నెలల లోపల పూర్తి చేయాలని ఆర్థిక మంత్రి యనమల రామ కృష్ణుడు మంగళవారం జరిగిన ముందస్తు బడ్జెట్ సమావేశాలలో అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. పనులు పూర్తి చేయడం ద్వారా  కేంద్రం నుంచి రావలసిన నిధులను పూర్తిగా రాబట్టాలని చెప్పారు. ప్రతి పథకం తాలూక పనులను కూడా ఆయన సమీక్షించారు. నిధుల వినియోగానికి సంబంధించి ఆయన కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు.  మంత్రులను, అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ మనలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారమేనని, అందరూ మనసుపెట్టి గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఇళ్లు లేని నిరుపేదలకు గృహ వసతి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గృహ నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ఇళ్ల నిర్మాణం వేగం పెంచాలని సంబంధిత అధికారులను మంత్రి రామకృష్ణుడు ఆదేశించారు. సమయం తక్కువగా ఉన్నందున కేంద్ర పథకాలకు సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేసే పనులలో ఆర్థిక శాఖ నిమగ్నమై ఉంది.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు బడ్జెట్ లో కేటాయించిన నిధులతోపాటు అవసరమైన పథకాలకు అదనపు నిధులను కూడా ప్రభుత్వం మంజూరు చేస్తోంది. అలాగే మ్యాచింగ్ గ్రాంట్ కూడా విడుదల చేసి కేంద్రం నిధులను పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తోంది.

అమరావతికి అత్యంత ప్రాధాన్యత


v 2017-18 కేంద్ర బడ్జెట్
v వినూత్న పథకానికి ప్రత్యేక మినహాయింపు
v 25,614 మంది రైతులకు లబ్ధి
v మెట్రో రైల్ కు రూ.101 కోట్లు

లోక్ సభలో బుధవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ -2017-18లో ఏపీకి ముఖ్యంగా నూతన రాజధాని అమరావతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల త్యాగాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు మూలధన లాభాలపై ఈ బడ్జెట్ లో పన్ను మినహాయింపు ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల పరిధిని నూతన రాజధాని అమరావతిగా ప్రకటించిన విషయం తెలిసిందే.   ఇప్పటి వరకు ఈ గ్రామాలకు చెందిన 25,614 మంది రైతులు 32,221.67 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఇచ్చారు. వారందరికీ ఈ మినహాయింపు వర్తిస్తుంది. రైతులు వ్యవసాయ భూములను అమ్మితే ఎటువంటి పన్ను చెల్లించవలసిన అవసరంలేదు.  అయితే రాజధాని నిర్మాణం జరుగుతున్నందున ఇక్కడి వ్యవసాయ భూములన్నీ పట్టణ పరిధిలోకి వచ్చాయి.  అంతేకాకుండా ఆ భూములను లే-అవుట్లు, నివాస, వాణిజ్య ప్లాట్లుగా మార్చినందున వాటిని అమ్మితే  భూమి విలువపై 20 శాతం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్(మూలధన లాభంపై పన్ను) ప్రభుత్వానికి చెల్లించాలి. సీఆర్‌డీఏ కేటాయించిన ప్లాట్లను రైతులు తమ పిల్లల పేరున  రాయాలన్నా ఈ పన్ను చెల్లించాలి. ఇప్పుడు ఆ పన్ను చెల్లించవలసిన అవసరంలేదు.  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన ప్రకారం రాష్ట్ర విభజన జరిగిన  2014 జూన్ 2వ తేదీ నుంచి భూ సమీకరణలో భూములు ఇచ్చిన వారికి మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. రైతులు ప్లాట్లు పొందిన ఆర్థిక సంవత్సరం నుంచి రెండేళ్ల లోపు జరిగే మొదటి లావేదేవీకి మాత్రమే ఈ మినహాయింపు లభిస్తుంది. భూముల విలువ పెరిగిన నేపధ్యంలో ఈ మినహాయింపు వల్ల దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు రైతులు లబ్ధిపొందే అవకాశం ఉందని అంచనా. భూ సమీకరణ జరిగిన తీరును బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ప్రశంసించారు. ఇదో వినూత్న పథకం. అదే రీతిలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు.
కొత్త ఒరవడి సృష్టించిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఆలోచనే పూలింగ్ ద్వారా భూ సమీకరణ విధానం. ఇది ఓ అద్వితీయమైన ఆలోచన. రైతులకు సమన్యాయం అందించేవిధంగా  ఓ కొత్త విధానం మన రాష్ట్రంలో రూపుదిద్దుకుంది. సిఎం పిలుపునకు స్పందించి రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు తమ భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఇంత భూమి ఈ విధంగా సమీకరించలేదు. ఇక్కడి రైతుల త్యాగనిరతి చరిత్రలో శాశ్వితంగా నిలిచిపోతుంది. ఇప్పటివరకు చరిత్రలో ప్రజావసరాలకు భూమిని రైతుల నుంచి బలవంతంగా సేకరించేవారు. స్వచ్ఛందంగా కూడా ఇలా భూ సమీకరణ చేయవచ్చని   చంద్రబాబు నాయుడు ఓ కొత్త వరవడి సృష్టించారు. అనేక విషయాలతోపాటు ఈ విషయంలో కూడా ఆయన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు.
ఇతర అంశాలను పరిశీలిస్తే, విజయవాడ నగర మెట్రో రైలుకు రూ.101 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని ప్రకృతి వైపరీత్యాల ప్రాజెక్టుకు రూ.250 కోట్లు, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టుకు రూ.150 కోట్లు కేటాయించారు.  ఏపీ సెంట్రల్ విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు, ఏపీ ట్రైబల్ విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు, ఏపీ ఐఐటీ(ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)కి రూ.50 కోట్లు, ఏపీ ఐఐఎం(ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ మెంట్)కు రూ.40 కోట్లు, ఏపీ ఎస్ఐటీ(నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)కి రూ.10 కోట్లు, ఏపీ ఐఐఎస్ఈఆర్(ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) కు రూ.50 కోట్లు, ఏపీ ఐఐఐటీ(ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)కి రూ.30 కోట్లు కేటాయించారు. విశాఖపట్నం పోర్టుకు రూ.15 కోట్లు కేటాయించారు. ఇవే కాకుండా మునిసిపల్ అభివృద్ధి,  రోడ్డు సెక్టార్ వంటి ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయించారు.  రైల్వే బడ్జెట్  2016-17లో ఏపీకి 2,195.7 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్ లో రూ.3,406 కోట్లు కేటాయించారు.
ఇవే కాకుండా ఇతర పథకాలకు కేటాయించిన నిధులలో మన రాష్ట్రానికి వచ్చే వాట ద్వారా పలు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్‌) గ్రామాలన్నింటికి పైపులైను ద్వారా నీరు సరఫరా చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. దీంతో రాష్ట్రంలో వేల గ్రామాలు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఆ గ్రామాల్లో కొళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన తాగునీరు సరఫరా చేస్తారు. బడ్జెట్ లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచినందున అవి  గ్రామీణాభివృద్ధికి ఉపయోగపడతాయి. సీసీ రోడ్లు, నీటి కుంటలు వంటి వాటి నిర్మాణానికి ఈ నిధులను వినియోగించుకోవచ్చు. దేశ వ్యాప్తంగా సౌర విద్యుత్ కు రూ.4,034 కోట్లు కేటాయించారు. మన రాష్ట్రంలో 4వేల మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ పార్కులకు కూడా నిధులు కేటాయిస్తారు. సముద్ర తీర ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు కొత్త రోడ్లు నిర్మించడానికి నిధులు కేటాయించారు. మన రాష్ట్రంలో 974 కిలో మీటర్ల తీర ప్రాంతం ఉన్నందున ఇక్కడ రోడ్ల అభివృద్ధికి, కొత్త రోడ్ల నిర్మాణానికి అవకాశం ఉంది.  కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన వివిధ పన్నుల నుంచి రాష్ట్రానికి రూ.29,138.82 కోట్లు వచ్చాయి. మొత్తం కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా 4.305 శాతంగా ఉంది.

భారీ స్థాయిలో పోటీ!

§  గ్రూప్ –I సిలబస్
     §  సిద్ధం కావడం ఎలా?
 
        ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రభుత్వంలోని వివిధ  శాఖల్లో భర్తీ చేసే ఖాళీలలో కీలకమైనవి గ్రూప్-1 సర్వీస్ పోస్టులే. జీతం స్కేల్(రూ.40,270 – 93,780) కూడా ఈ ఉద్యోగాలకే ఎక్కువ.  గ్రూప్-1 కి పోటీపడే అభ్యర్థులు డిప్యూటీ కలెక్టర్, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మునిసిపల్ కమిషనర్ గ్రేడ్-II, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్,
అసిస్టెంట్ ప్రొహెబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెట్  వంటి పోస్టులకు ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఈ కేటగిరిలో 78 పోస్టులను భర్తీ చేయడానికి గత నెలలో కమిషన్   నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువగా రాష్ట్ర స్థాయి పోస్టులే ఉన్నాయి. అత్యధికంగా డీఎస్పీ పోస్టులు 24, ఆ తరువాత కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ పోస్టులు 13 ఉన్నాయి.  ప్రభుత్వంలో సివిల్ సర్వీస్ తరువాత ఉన్నతమైన ఉద్యోగాలు ఇవే అయినందున ఆ స్థాయిలోనే తీవ్రమైన పోటీ ఉంటుంది. లక్ష్యం నిర్ధేశించుకొని పట్టుదలతో, అంకితభావంతో చదివే అభ్యర్థులే ఎక్కువగా ఈ పోటీ పరీక్షకు హారవుతారు. ఆషామాషీగా చదివి ఈ పరీక్షలో నెగ్గడం సాధ్యంకాదు. ప్రణాళిక ప్రకారం అత్యధిక సమయం చదవుకే కేటాయించాలి. తూలనాత్మక అధ్యయనం చేయాలి.

ఎంపిక  విధానం : ప్రిలిమినరీ, మెయిన్  రెండు పరీక్షలు, ఇంటర్వ్యూ
ప్రిలిమినరీ పరీక్ష: గ్రూప్-1లో  మొదట మే 7న ఆదివారం స్క్రీనింగ్ టెస్ లేక ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు జిల్లాకు ఒక  కేంద్రం ఉంటుంది. కృష్ణా, చిత్తూరు జిల్లాలకు సంబంధించి విజయవాడ, తిరుపతిలలో, మిగిలిన అన్ని  జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్దతిలో ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. 150 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఈ పరీక్షలో మైనస్ మార్కులు ఉంటాయి. ఏదైన ఒక ప్రశ్నకు జవాబు తప్పుగా మార్క్ చేస్తే, ఒన్ థర్డ్ మార్క్ మైనస్ చేస్తారు. అంటే మూడు జవాబులు తప్పుగా మార్క్ చేస్తే ఒక మార్క్ మైనస్ చేస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జవాబులను చాలా జాగ్రత్తగా మార్క్ చేయాలి. ప్రతి ప్రశ్నకు నిమిషం సమయం ఉన్నందున ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించి జవాబు మార్క్ చేయాలి.
స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్
1.     జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన సంఘటనలు.
2.    జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ స్థాయిలో కరెంట్ ఎఫైర్స్.
3.    సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సమకాలీనాభివృద్ధితోపాటు రోజువారీ దైనందిక జీవితంలో జనరల్ సైన్స్ ఉపయోగాలు.
4.    జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర భౌగోళిక స్వరూపం.
5.    భారతదేశ ప్రాచీన, మధ్య, ఆధునిక చరిత్ర. భారత జాతీయోధ్యమం ముఖ్యంగా సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ అంశాలు.
6.    భారత రాజకీయాలు, పరిపానాంశాలు. రాజ్యాంగ సమస్యలు, పాలనా విధానాల రూపకల్పన, వాటి అమలు, పరిపాలనా సంస్కరణలు, ఇ-గవర్నెస్ కు తీసుకుంటున్న చర్యలు.
7.    స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఆర్థికాభివృద్ధి. ప్రణాళిక పాత్ర. ప్లానింగ్ కమిషన్, నీతి అయోగ్.  భారత ఆర్థిక వ్యవస్థలో పేదరికం, నిరుద్యోగం, త్రాగునీరు, సాగునీరు, వ్యవసాయ వంటి సమస్యలు. స్థిరమైన ఆర్థికాభివృద్ధి, ఆర్థిక వృద్ధి,  ద్రవ్యోల్బణం, బడ్జెట్, సామాజిక న్యాయం.
8.    కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, ఫైనాన్స్ కమిషన్, కేంద్ర రాష్ట్రాల మధ్య వనరుల విభజన,అధికార వికేంద్రీకరణ.
9.    భారత దేశంలో ఆర్థిక సంస్కరణలు. బ్యాంకింగ్, ఫైనాన్స్, వాణిజ్యం, సామాజిక రంగాలు. ప్రపంచీకరణ నేపథ్యంలో దేశం ఎదుర్కొనే పరిస్థితులు. అంతర్జాతీయ పోటీ, ఆర్థిక పరంగా మార్కెట్ అస్థిరత్వం, విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల ప్రవాహం, వస్తువులు, సేవల పన్నులు.
10.                       పర్యావరణ పరిస్థితులు దిగజారడానికి కారణాలు. వాటిని ఎదుర్కోవడానికి ఎదురయ్యే పరిస్థితులు. పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి.
11.           విపత్తుల నిర్వహణ. ప్రకృతీవైపరీత్యాలు ఏర్పడే పరిస్థితులు, వాటి నివారణ, ఉపశమనానికి వ్యూహాలు. విపత్తులు అంచనా వేసే, గ్రహించే భౌగోళిక సమాచార వ్యవస్థ.
12.           లాజికల్ రీజనింగ్, గణాంకాలను ఉపయోగించి విశ్లేషణ చేసే సామర్థ్యం.
13.           గణాంకాల విశ్లేషణ: గణంకాల టేబుల్ రూపొందించడం.  గణాంకాలను దృశ్య రూపం. ప్రాథమికంగా గణాంకాల విశ్లేషణ, గణంకాలను సంక్షిప్తీకరించడం, వివరించడం.
14.           ఆంధ్రప్రదేశ్ విభజన, దాని పరిణామాలు. దాని వల్ల తలెత్తిన పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృత, రాజకీయ, న్యాయసంబంధ అంశాలు. సమస్యలు. రాజధానిని నష్టపోవడం, కొత్త రాజధాని నిర్మాణం, దానికి సంబంధించిన ఆర్థిక అంశాలు. ఉమ్మడిగా ఉన్న సంస్థల విభజన, వాటి పునర్నిర్మాణం. ఉద్యోగుల విభజన, వారి స్థాన చలనం, వారి స్థానికత సమస్యలు. వాణిజ్యం, వ్యాపారవేత్తలపై విభజన ప్రభావం. రాష్ట్ర విభజన తరువాత మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులకు అవకాశాలు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు, జనాభాపై విభజన ప్రభావం. నదీజలాల పంపిణీపై విభజన ప్రభావం.  తత్ఫలితంగా సంభవించే పరిణామాలు. ఆంధ్రప్రదేశ్ పునర్వవస్తీకరణ చట్టం-2014,  నిబంధనల రూపకల్పనలో ఏక పక్ష నిర్ణయాలు.

అబ్జెక్టివ్ పరీక్ష అయినప్పటికీ గ్రూప్-1 ప్రిలిమినరీ అయినందున ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. చరిత్రలో ముఖ్యమైన తేదీలను, గణాంకాలను గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలతోపాటు భారత దేశ చరిత్రను ఆమూలాగ్రం చదవాలి. అంతర్జాతీయ పరంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో వచ్చే మార్పులను చదివి ఆకళింపు చేసుకోవాలి. రాష్ట్రాంశాలకు వచ్చేసరికి ముఖ్యంగా విభజనకు సంబంధించి ప్రతి అంశం తెలిసి ఉండాలి. విభజనకు ముందు, జరిగిన తీరు, ఆ తరువాత పరిణామాలు, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలు చిన్నచిన్న సంఘటనలతోసహా గుర్తు పెట్టుకోవలసిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో మరిముఖ్యంగా రాజధాని ఆధునిక అమరావతి నిర్మాణం విషయంలో పచ్చదనం అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో పర్యావరణంపై కూడా శ్రద్ధ వహించాలి. ఇక లాజికల్ రీజనింగ్, గణాంకాల సంక్షిప్తీకరణ, విశ్లేషణ వంటివి ప్రతి పోటీ పరీక్షకు తప్పనిసరిగా అవసరమైనవి.


ఈ పరీక్షకు పోటీపడేవారు దినపత్రికలు, ముఖ్యమైన వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలను చదవడంతోపాటు ఇంటర్నెట్ పరిజ్ఞానం చాలా అవసరం. నెట్ లో తెలుగులో కూడా సమాచారం లభిస్తుంది.   ప్రణాళికా సంఘం, జనాభా లెక్కలు, గ్రామీణాభివృద్ధి, ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఆర్థిక, గణాంక శాఖల... వంటి వెబ్ సైట్లను అధ్యయనం చేయాలి.  అలాగే ఆయా అంశాలకు సంబంధించిన  వెబ్ సైట్లను కూడా పరిశీలించాలి. కృషి, పట్టుదలతో విషయ పరిజ్ఞానం పెంచుకుంటే విజయం మిమ్మల్నే వరిస్తుంది. ఈ పరీక్ష ద్వారా అర్హత సాధించినవారే మెయిన్ పరీక్షకు అర్హులవుతారు.


మెయిన్ పరీక్ష: ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించినవారికి ఆగస్ట్ 17 నుంచి 27 వరకు మెయిన్ పరీక్ష (రాత పరీక్ష) నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరీక్షను విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం 4 కేంద్రాల్లో మాత్రమే నిర్వహిస్తారు. మెయిల్ లో ఇంటర్వ్యూకు అర్హత సాధించడానికి 150 మార్కులకు ఒక పేపర్ ఉంటుంది. ఇది పదవ తరగతి స్థాయిలో జనరల్ ఇంగ్లీష్ లో ఉంటుంది. ఇది కాకుండా మరో 5 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ కు 150 మార్కులు. మరో 75 మార్కులు ఇంటర్వ్యూకు ఉంటాయి. మొత్తం 825 మార్కులు. ఇందులో అత్యధిక మార్కులు వచ్చిన వారిని ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

-          శిరందాసు నాగార్జున