Jan 6, 2017

విద్యుత్ భద్రతకు ప్రాధాన్యం

Ø జన్మభూమి-మా ఊరులో ఓ సూత్రం
Ø 24 గంటలు నిరంతరం  విద్యుత్ సరఫరా
Ø ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ
Ø పొదుపు చర్యల్లో ముందున్న రాష్ట్రం
Ø లోటు నుంచి మిగులుకు చేర్చిన సీఎం చంద్రబాబు
Ø మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణ
Ø సౌర, పవన విద్యుత్ కు ప్రోత్సాహం
Ø 2029 నాటికి తలసరి వినియోగం లక్ష్యం 3600 కిలోవాట్లు

      విద్యుత్ ఉత్పత్తి పెంచడం, ఉత్పత్తి ఖర్చు తగ్గించడం, ఆదా చేయడంలో ఏపీ అద్వితీయమైన విజయాలు సాధిస్తోంది. రాష్ట్రాభివృద్ధిలో విద్యుత్ ప్రాముఖ్యతను గుర్తించిన ప్రభుత్వం విద్యుత్ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ‘జన్మభూమి-మా ఊరు’ 4వ విడత కార్యక్రమంలో కుటుంబ వికాసానికి రూపొందించిన 15 సూత్రాలలో దీనిని ఒకటిగా చేర్చింది. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకుంది. 2014లో ఈ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించేనాటికి  రాష్ట్రంలో రోజుకు 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తీసుకున్న చర్యలు, అనుసరించిన విధానాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదల వల్ల  రెండేళ్లలో విద్యుత్ మిగిలే స్థాయికి చేరింది. గృహావసరాలకు, పరిశ్రమలకు 24 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తూ కూడా మిగులు విద్యుత్ సాధించడం విశేషం. రాష్ట్రంలో డిమాండ్ కు సరిప విద్యుత్ సరఫరా అవుతోంది. ఈ నెల 3వ తేదీ మంగళవారం కూడా ఏపీఈపీడీసీఎల్(ఆంధ్రప్రదేశ్ ఈస్టరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) డిమాండ్ కు సరిపడ 2068 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతోంది. అలాగే ఏపీఎస్ పీడీసీఎల్(ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) కూడా డిమాండ్ కు సరిపడ 4018 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తోంది. విద్యుత్ లేక మూతపడిన అనేక చిన్న,మధ్యతరహా పరిశ్రమలను పునరుద్ధరించారు. దాంతో లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
 2029 నాటికి తలసరి విద్యుత్ వినియోగం లక్ష్యం 3600 కిలోవాట్లు
      తలసరి విద్యుత్ వినియోగాన్ని బాగా పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.  2015లో ఉన్న1050 కిలో వాట్ల నుంచి 2019లో 1750 కిలోవాట్లు, 2022లో 2298 కిలోవాట్లు, 2029 నాటికి 3600 కిలో వాట్లకు చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అలాగే పునరుద్ధరణీయ ఇంధన సామర్థ్యం 2015లో ఉన్న 2 గిగావాట్ల నుంచి 2019కి 8, 2022కి 14, 2029 నాటికి 29 గిగావాట్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ధేశించింది.  గృహ వినియోగదారులకు విద్యుత్ ఖర్చు తగ్గించడానికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రెండు ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేశారు. నగరాలు, పట్టణాలలోని వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులను మార్చడం, సౌర, పవన విద్యుత్ ను ప్రోత్సహించడం ద్వారా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది.
 విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, పొదుపు, సంరక్షణ విధానాలలో రాష్ట్రం ప్రపంచంతో పోటీపడుతోంది. విద్యుత్ పొదుపులో రాష్ట్రానికి వరుసగా అవార్డులు వస్తుండటం ఇంధన శాఖ విజయాన్ని తెలియజేస్తోంది. గత ఏడాది అవార్డులు  ఇచ్చే సమయంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి  పియూష్ గోయెల్ మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ, సరఫరాల్లో నష్టాలను తగ్గించడం ఎలాగో చంద్రబాబు ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలని ఇతర రాష్ట్రాలకు సూచించారు. ఈ రంగంలో దేశంలోనే రాష్ట్రప్రభుత్వం మేటిగా నిలవడం అతిపెద్ద విజయం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రానున్న అయిదేళ్లలో విద్యుదుత్పత్తి, ప్రసారాల కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టనుంది. కొన్ని గిరిజన తండాలకు తప్ప రాష్ట్రంలో అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం ఓ రికార్డు.  ఏపీలో వంద శాతం విద్యుదీకరణ దాదాపు పూర్తి అయింది. దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన (డిడియుజిజేవై) ద్వారా రూ.125 లకే విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారు.  
          రాష్ట్రంలో ఇంతకు ముందు అయిదు లక్షల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ లేదు. 4.50 లక్షలకుపైగా ఇళ్లకు కొత్తగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలినవాటికి కూడా కనెక్షన్లు ఇస్తున్నారు. కొద్ది రోజులలోనే ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చి రాష్ట్రం రికార్డు సృష్టించబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో వంద శాతం ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చిన తొలి జిల్లాగా  పశ్చిమగోదావరి జిల్లా రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో అన్ని ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలన్న సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలను ఆ జిల్లా విద్యుత్‌ అధికారులు యుద్ధ ప్రాతిపదికన అమలు చేశారు. గత మార్చి నాటికే వంద శాతం ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించారు.  వ్యవసాయానికి ఏడు గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా జరుగుతోంది. రైతులకు ఉచిత పంపుసెట్ మార్పిడి పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి రైతు పొలంలో ఉన్న నాసిరకం పంపు సెట్ స్థానంలో అత్యంత శక్తివంతమైన, పొదుపుగా విద్యుత్ ను వినియోగించే పంపుసెట్ ను ఉచితంగా మార్పిడి చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 15 లక్షల వ్యవసాయ పంపుసెట్ల ను మారుస్తారు.

           రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటోంది. ఈ నష్టం 2014-15లో 11.81 శాతం కాగా,  2015-16లో 10.29 శాతానికి తగ్గించారు. ఈ ఏడాది ఈ నష్టాన్ని సింగిల్ డిజిట్ కు తగ్గించాలన్నది లక్ష్యం. విద్యుత్ పంపిణీ, సరఫరా సక్రమంగా జరిగేందుకు 25వేల కోట్ల రూపాయలతో ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. 2015-16లో 2290 మెగావాట్ల అదనపు విద్యుత్ సామర్థాన్ని సమకూర్చారు. రానున్న మూడేళ్లలో 4,800 మెగావాట్ల అదనపు సామర్థ్యాన్ని సమకూర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం జిల్లా పూడిమడకలో ఎన్.టి.పి.సి రూ.28వేల కోట్లతో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. 2020 నాటికి రెండు ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. నెల్లూరులో సెమ్ కార్ప్, ఇతర సంస్థలు కలసి రూ.20వేల కోట్లతో 1320 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.   నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో, విజయవాడ విటిపిఎస్ లో ఒక్కోచోట 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాల విస్తరణ కార్యక్రమం చేపట్టారు.  ఏపి జన్ కో ఆధ్వర్యంలో వీటి నిర్మాణం జరుగుతోంది.  విద్యుత్ ఉత్పత్తిని పెంచడంలో, పంపిణీ, సరఫరాలో నష్టాలను తగ్గించడంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు మన రాష్ట్రం ఆదర్శంగా నిలవడం విశేషం.

సౌరవిద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక శ్రద్ధ
ఎల్ఈడీ బల్బుల వినియోగం ద్వారా విద్యుత్ ని పొదుపు చేయడంతోపాటు విద్యుత్ ఉత్పత్తి  ఖర్చు తగ్గించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా సౌర విద్యుత్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యుత్ రంగంలో అనేక ఘనవిజయాలు సాధించి, విద్యుత్ పొదుపులో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిన మన రాష్ట్రం సౌరవిద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అతి మారుమూల ఉన్న కొద్దిపాటి గిరిజనుల ఇళ్లకు తప్ప రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన వాటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం సాధ్యం కాదు. అందువల్ల ఆ ఇళ్లకు  సౌర విద్యుత్ అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఈ ఏడాది జూలై నాటికి రాష్ట్రంలో నాలుగు వేల మెగావాట్ల సౌర విద్యుచ్ఛక్తిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. పదేళ్లలో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌, 8 వేల మెగావాట్ల పవన విద్యుత్‌ ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ రంగంలో గ్లోబల్‌ హబ్‌ ఏర్పాటుకు విదేశీ కంపెనీలు కూడా తమ సంసిద్థతను తెలిపాయి.
         రాష్ట్రంలో 30వేల కోట్ల రూపాయలతో సౌర విద్యుత్ పార్కులను అభివృద్ధి చేస్తున్నారు.  కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ పార్కులను కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పరుస్తున్నారు. ఎన్.టి.పి.సి. ద్వారా అనంతపురం జిల్లాలోని సౌర విద్యుత్ పార్కు నుంచి మొదటి దశ కింద 250 మెగావాట్ల విద్యుత్ ను అందుబాటులోకి తెచ్చారు. రికార్డు స్థాయిలో కేవలం 10 నెలల్లోనే దీనిని  అభివృద్ధిపరిచారు.  రెండవ దశలో ఈ ఏడాది మార్చి నాటికి మరో 750 మెగావాట్ల విద్యుత్ ను అందుబాటులోకి తేనున్నారు. ఇదే జిల్లా తాడిపత్రిలో ఏపి జెన్ కో ఆధ్వర్యంలో 500 మెగావాట్ల సోలార్ పార్కు ఏర్పాటు కానుంది. కర్నూలు జిల్లాలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ పార్కును నెలకొల్పనున్నారు. ఎన్.వి.వి.ఎల్. ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును ఎస్ బి ఎనర్జీ, సన్ ఎడిసన్, అజూర్ పవర్, అదాని గ్రూపు చేపడుతున్నాయి.  మార్చి లోపలే ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కడప జిల్లా గాలివీడులో సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా 500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును చేపడుతోంది. ఇదే జిల్లా మైలవరం ఎంపిటిసి, సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాల ఆధ్వర్యంలో 1500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు ఆగస్టు నాటికి ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. దేశంలోనే మొదటిసారిగా వంద మెగావాట్ల సామర్థ్యం గల సౌరవిద్యుత్ నిల్వ యూనిట్లను కడప జిల్లాలో ప్రయోగాత్మకంగా నెలకొల్పనున్నారు.
        సౌర విద్యుత్ పంపు సెట్ల పథకంలో భాగంగా 5,013 పంపు సెట్లు బిగించి దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. రానున్న మూడేళ్ల కాలంలో ఏడాదికి పది వేల చొప్పున 30వేల పంపు సెట్లు బిగిస్తారు. ప్రత్యామ్నాయ విద్యుత్ వనరుల విషయంలో ఇప్పటికే మన రాష్ట్రం జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. భవిష్యత్ లో సౌరవిద్యుత్ రంగంలో ఏపీ నెంబర్ వన్ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.

ఏపీకి  జాతీయ స్థాయి అవార్డులు
        ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన సత్తా చాటుకుంటోంది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ ఈ ఏడాది బెస్ట్ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూసర్’, బెస్ట్ నోడల్ ఏజెన్సీ గా ఎంపికయింది. కేంద్ర ఎనర్జీజ్యూరీ  ఇచ్చే అవార్డుకు నెడ్ క్యాప్(జాతీయ సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ) వరుసగా గెలుచుకున్న ఏడో అవార్డు. ఈ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేసింది. ఇంధన రంగంలో 2015లో ప్రకటించిన 5 జాతీయ పురస్కారాలను మన రాష్ట్రం కైవసం చేసుకుంది. జాతీయ స్థాయిలో ఒక రాష్ట్రం ఒకే రంగంలో ఇన్ని అవార్డులను సాధించడం ఓ రికార్డ్. విద్యుత్‌ సమర్ధ వినియోగం, పర్యవేక్షణ, అమలు చేస్తున్న ఉత్తమ డిజైన్‌ ఏజెన్సీ (ఎస్‌.డీ.ఏ.) విభాగంగా రాష్ట్ర ప్రభు త్వానికి ఈ పురస్కారాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ సరఫరా కంపెనీ (ఏపీడీసీఎల్‌), ఐదు జిల్లాల్లో ఎల్‌ఈడీ దీపాల సరఫరా సమర్ధవంతంగా నిర్వహించినందుకు 'బెస్ట్‌ డిస్కం'గా ఎంపికైంది. విశాఖ మహానగర పాలక సంస్థ విద్యుత్‌ ఆదా చేసే ఎల్‌ఈడీ వీధి దీపాల వ్యవస్థను ఏర్పాటు చేసి జాతీయ అవార్డు సాధించింది.

Jan 4, 2017

ఇక గ్రామవీధుల్లోనూ ఎల్ఈడీ బల్బులే!

·       ఎల్ఈడీ బల్బుల వినియోగంపై జన్మభూమిలో విస్తృత ప్రచారం
·       విశాఖలో 48 శాతం విద్యుత్ ఆదా
·       సాధారణ బల్బు కంటే ‘లెడ్’ జీవిత కాలం 4 రెట్లు ఎక్కువ
·       రాష్ట్రంలో 1,90,33,333 బల్బుల పంపిణీ
·       2.32 కోట్ల లెడ్ బల్బుల పంపిణీ లక్ష్యం
·       అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు

           రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల వీధులను  లెడ్ (ఎల్ఈడి-లైట్ ఎమిట్టింగ్ డైయోడ్) బల్బుల వెలుగులతో నింపిన ప్రభుత్వం ఇక అన్ని గ్రామాల వీధులలో కూడా వీటిని అమర్చాలని నిర్ణయించింది.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లె నుంచే శ్రీకారం చుట్టారు. ఈ గ్రామంలోని 120 సాధారణ వీధి బల్బుల స్థానంలో  లెడ్ బల్బులు అమర్చారు. విద్యుత్ ని పొదుపు చేయడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లెడ్ బల్బులను వినియోగిస్తోంది.  ఈ బల్బుల వినియోగం వల్ల 45 నుంచి 50 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. దేశం మొత్తం మీద ఏడాదికి రూ.9,876 కోట్లు ఆదా అయింది. రాష్ట్రానికి వచ్చేసరికి 24,71,809 ఎండబ్లూహెచ్ (మెగావాట్ అవర్స్),  రూ.989 కోట్లు ఆదా అయింది. పీక్ అవర్ డిమాండ్ 495 మెగావాట్స్ కు తగ్గింది. లెడ్ బల్బుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్  దేశంలో  అగ్రభాగాన నిలిచింది. విద్యుత్ ని ఆదా చేయడంలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. జాతీయ స్థాయిలో పలు బహుమతులను కూడా గెలుచుకుంది. మునిసిపల్ కార్పోరేషన్లు, మునిసిపాలిటీలు, ఇళ్లలోనూ లెడ్ లైటింగ్ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఓ ఛాలెంచ్ గా తీసుకొని దిగ్విజయంగా అమలు చేస్తోంది. మళ్లీ ఇప్పుడు లెడ్ బల్బుల వినియోగం వల్ల అయ్యే విద్యుత్ ఆదా గురించి  ‘జన్మభూమి-మా ఊరు‘ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కలిగించి, విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బల్బులను వినియోగించి విద్యుత్ ని సాధ్యమైనంత ఎక్కువగా ఆదా చేయాన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు.
 గ్రామవీధుల్లో లెడ్ కాంతులు
            రాష్ట్రంలోని నగర వీధులన్నిటినీ లెడ్ బల్బుల వెలుగులతో నింపేశారు. పట్టణాల వీధుల్లో కూడా పూర్తిగా ఈ బల్బులను అమరుస్తున్నారు. చాలా వరకు పూర్తి చేశారు. ఇక గ్రామ వీధులపై దృష్టి పెట్టారు. విశాఖ నగర వీధుల్లో అత్యధికంగా 95,600 బల్సులను అమర్చారు. ఇక్కడ 48 శాతం విద్యుత్ ఆదా అవుతోంది. విజయవాడలో 32,296 బల్బులు, నెల్లూరులో 18,641, కాకినాడలో 12,310, గుంటూరులో 10,096, అనంతపురంలో 9,912, విజయనగరంలో 9,450, తిరుపతిలో 9,038, ఏలూరులో 7,249, కర్నూలులో 5,353, రాజమండ్రిలో 3,017 బల్సులు అమర్చారు. మునిసిపల్ వీధులలో కూడా ఈ బల్బులే కాంతులు వెదజల్లుతున్నాయి. కావలి వీధుల్లో 6,007 బల్బులు, హిందూపూర్ లో 6,397, నరసరావు పేట వీధుల్లో 4,871 బల్బులు అమర్చారు. మిగిలిన మునిసిపాలిటీలలో ఆయా పట్టణాల పరిధిని బట్టి వెయ్యి నుంచి నాలుగు వేల వరకు ఈ బల్బులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 12,909 గ్రామాల్లోని 25 లక్షల సాధారణ వీధి బల్బుల స్థానంలో లెడ్ బల్బులను అమర్చడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కొన్ని గ్రామాలలో వీటిని అమర్చారు. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చించారు.  అన్ని గ్రామాలలో ఈ బల్బులను అమరిస్తే ఏడాదికి 165 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందా అవుతుందని అంచనా.
 ఏపీలో 1,90,33,333 బల్బుల పంపిణీ
          ఉజాల(యుజెఏఎల్ఏ-ఉన్నత్ జ్యోతి బై అఫర్డబుల్ లెడ్స్ ఫర్ ఆల్) పథకాన్ని రాష్ట్రంలో 2014 అక్టోబరు 2న ప్రారంభించారు. ఈ పథకం కింద 9 వాట్ల లెడ్ బల్బును రాయితీపైన పది రూపాయలకే ఇచ్చారు.  ఒక్కో ఇంటికి రెండు బల్బులు ఇచ్చారు. ఇళ్లలో  60 వాట్ల బల్బు వాడే స్థానంలో వీటిని వాడుతున్నారు.  ఈ విధంగా ఇళ్లలో వినియోగించే లెడ్ బల్బులను 2016 డిసెంబర్ 31 సాయంత్రానికి  దేశంలో 19,01,15,264 పంపిణీ చేయగా, ఏపీలో 1,90,33,333 పంపిణీ చేశారు. అత్యధికంగా 23,77,951 బల్బులు పంపిణీ చేసి తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 18,84,896 బల్బులతో గుంటూరు జిల్లా రెండవ స్థానం, 18,09,230 బల్బులతో కృష్ణా జిల్లా మూడవ స్థానం దక్కిచ్చుకున్నాయి. 8,98,518 బల్బులు మాత్రమే పంపిణి చేసి విజయనగరం జిల్లా చివరి స్థానంలో ఉంది. మిగిలిన జిల్లాలను పరిశీలిస్తే విశాఖపట్నం జిల్లాలో 18,05,295 బల్బులు, పశ్చిమగోదావరి జిల్లాలో 16,91,638, చిత్తూరు జిల్లాలో 15,93,920, కర్నూలు జిల్లాలో 13, 06,799, ప్రకాశం జిల్లాలో 12,23,142, నెల్లూరు జిల్లాలో 12,02,001, అనంతపురం జిల్లాలో 11,38,845, శ్రీకాకుళం జిల్లాలో 11,15,201,కడప జిల్లాలో 9,85,895 బల్బులు పంపిణీ చేశారు.
 2.32 కోట్ల లెడ్ బల్బుల పంపిణీ లక్ష్యం
          వంద శాతం ఇళ్లలో వినియోగించడానికి మొత్తం 2.32 కోట్ల లెడ్ బల్బులు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకం మొత్తం అమలయితే 1291 ఎంయు(మిలియన్ యూనిట్స్) విద్యుత్ ను పొదుపు చేయవచ్చని అంచనా. పీక్ అవర్స్ లో లోడ్ ను 620 మెగావాట్స్ కు తగ్గించవచ్చని భావిస్తున్నారు.  60 వాట్స్ సాధారణ బల్బు జీవిత కాలం 1200 గంటలయితే, 6-8 వాట్స్ లెడ్ బల్బు జీవిత కాలం 50 వేల గంటలు. సాధారణ బల్బుతో పోల్చితే లెడ్ బల్బు జీవిత కాలం నాలుగు రెట్లు ఎక్కువ.  అలాగే సాధారణ 60 వాట్స్ బల్బుతో సమానంగా 8 వాట్స్ లెడ్ బల్బు కాంతిని ఇస్తుంది. అంటే చాలా తక్కువ విద్యుత్ తో ఎక్కవ కాంతిని పొందవచ్చు. ఈ బల్బులను వినియోగించడం వల్ల వినియోగదారుల విద్యుత్ బిల్లును చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాలలో అమలు చేశారు. ఓ సర్వే ప్రకారం ఆ జిల్లాలలో 58 వేల మంది వినియోగదారులు ఒక్కో బల్బుకు ఏడాదికి 73.7 యూనిట్స్ విద్యుత్ ను ఆదా చేశారు. ఒప్పందం ప్రకారం 55.65 యూనిట్ల కంటే 33 శాతం విద్యుత్ అదనంగా ఆదా అయింది.
 విశాఖలో 48 శాతం విద్యుత్ ఆదా
        విశాఖపట్నంలో అన్ని వీధి దీపాలు హుద్ హుద్ తుపానుకు ధ్వంసం అయ్యాయి. వాటి స్థానంలో లెడ్ బల్బులను అమర్చారు. 92 వేల లెడ్ వీధి బల్బులను 45 రోజులలో అమర్చి రికార్డు సృష్టించారు. ఈ లెడ్ బల్బుల వల్ల నెలకు 40 నుంచి 45 శాతం వరకు విద్యుత్ ఆదా అయింది. ఆ ప్రకారం 2015 సంవత్సరం మొత్తం మీద విద్యుత్ బిల్లు రూ.4.23 కోట్లు తగ్గింది. ప్రస్తుతం విశాఖలో 48 శాతం విద్యుత్ ఆదా అవుతోంది.  రాష్ట్రంలోని 111 మునిసిపాలిటీలలో 5.7 లక్షల వీధి బల్బుల స్థానంలో లెడ్ బల్బులను అమర్చటానికి పూనుకున్నారు. ఇప్పటికే చాలావరకు మునిసిపాలిటీలలో బల్బులు మార్చారు. రాష్ట్రంలోని 12,909 గ్రామాలలోని సాధారణ వీధి దీపాల స్థానంలో లెడ్ లైట్లను బిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో మొత్తం 25 లక్షల లెడ్ వీధి లైట్లను అమర్చినట్లైతే ఏడాదికి 165 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యే అవకాశం ఉంది.
 అంతర్జాతీయ స్థాయిలో ప్రసంశలు
         రాష్ట్రంలో జరుగుతున్న లెడ్ లైటింగ్ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు లభించాయి. ప్రపంచ బ్యాంక్, ఫ్రాన్స్ లోని అంతర్జాతీయ ఎనర్జీ ఏజన్సీ (ఐఇఏ) వంటి సంస్థలు పనితీరును మెచ్చుకున్నాయి. పారిస్ లో జరిగిన సిఓపి-21 సమ్మిట్ లో లెడ్ వీధి లైట్ల వినియోగం ద్వారా గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ)లో  ఆదా అయిన విద్యుత్ అంశాన్ని చర్చించారు. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా,చైనా, ఇండియా,సౌత్ ఆఫ్రికా) వర్కింగ్ గ్రూప్ సమ్మిట్ లో భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టునే ప్రదర్శించి, ఇతర దేశాలకు ఓ రోల్ మోడల్ గా నిలిచింది.

జన్మభూమి మొదటి రెండు రోజుల్లో  58,017 ఇళ్లు మంజూరు
ü  ‘జన్మభూమి’లో దరకాస్తుల సేకరణ, ఇళ్ల మంజూరు
ü 2017-18లో 5 లక్షల ఇళ్ల నిర్మాణం
ü రాష్ట్రంలో ప్రతి పేదవానికి గృహ భద్రత
ü 2022 నాటికి అందరికీ గృహ వసతి

           రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేదవానికి గృహ భద్రత కల్పించాలని ప్రభుత్వ నిర్ణయించింది. పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం బృహత్తర ప్రణాళిక రూపొందించింది. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. పేద,మధ్య తరగతి వారికి తక్కువ ధరలకు గృహవసతి కల్పించాలన్న ధృసంకల్పంతో అపార్ట్ మెంట్ల నిర్మాణం చేపట్టింది. మరో పక్క రాష్ట్రంలోని ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేస్తున్నారు. దానిని ఆధార్ తో అనుసంధానం చేసి ఇల్లు లేని ప్రతి పేదవానికి గృహ భద్రత కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. కనీస అవసరాలలో భాగంగా పేదలందరికీ సముచితమైన అనువైన గృహ వసతి కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకం కింద గ్రామాలలో నిర్మించే ఒక్కో ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం లక్షా 50 వేల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ పథకం కింద ఒక్కో నియోజకవర్గానికి 1250 ఇళ్లు కేటాయించారు. ఇవి కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో 55 వేల ఇళ్లు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణానికి కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం చొప్పున రెండు లక్షల రూపాయలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించే ఇళ్లకు రూ.3.5 లక్షలు ఖర్చు చేస్తారు. ఇందులో రూ.1.5 లక్షలు  కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. రూ.25వేలు లబ్దిదారుడు భరించాలి.  మిగిలిన రూ.75 వేలు బ్యాంకులు రుణాలుగా ఇస్తాయి. ఆ రుణాన్ని లబ్దిదారుడు తిరిగి చెల్లించవలసి ఉంటుంది.

13 జిల్లాలకు 2,37,842 ఇళ్లు కేటాయింపు
           రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాలకు ఈ నెల 4వ తేదీ నాటికి ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద ప్రభుత్వం 2,37,842 ఇళ్లు కేటాయించింది. ఈ గృహాలు పొందడానికి 1,54,408 మంది అర్హులను ఎంపిక చేసింది. 2022 నాటికి అందరికీ గృహ వసతి కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందరికీ అనువైన గృహవసతి అనే విధానం కింద 2022 నాటికి పది లక్షల ఇళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2017-18లో 5 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జన్మభూమి-మా ఊరు 4వ విడత కార్యక్రమంలో కుటుంబ భద్రతకు రూపొందించిన 15 సూత్రాలలో గృహ భద్రతను చేర్చారు. ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో కొత్త ఇళ్లను పొందడానికి అర్హులను ధృవీకరిస్తున్నారు. ఇళ్లను మంజూరు చేస్తున్నారు.

మొదటి రెండు రోజుల్లో 58,017 ఇళ్లు మంజూరు
        జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో మొదటి రెండు రోజుల్లో ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద 58,017 ఇళ్లు మంజూరు చేశారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే ఈ రెండు రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో 7,264, ఇళ్లు, విజయనగరం జిల్లాలో 4,938, విశాఖపట్నం జిల్లాలో 4,512, తూర్పుగోదావరి జిల్లాలో 6,220, పశ్చిమగోదావరి జిల్లాలో 4,716, కృష్ణా జిల్లాలో 4,590 ఇళ్లు మంజూరు చేశారు. గుంటూరు జిల్లాలో 5,426, ప్రకాశం జిల్లాలో 3,181, నెల్లూరు జిల్లాలో 3,441, చిత్తూరు జిల్లాలో 3,590, కడప జిల్లాలో 2,519, అనంతపురం జిల్లాలో 5,113, కర్నూలు జిల్లాలో 2,487 ఇళ్లు మంజూరు చేశారు. పట్టణ గృహ నిర్మాణ పథకం కింద అన్ని ప్రాధమిక సౌకర్యాలతో ఇళ్లను నిర్మిస్తారు. ఈ ఇళ్లకు నీరు, పారిశుధ్యం, విద్యుత్, రోడ్లు, గ్యాస్ కనెక్షన్ వంటి సౌకర్యాలు కల్పిస్తారు.

Jan 2, 2017

ఇక దృష్టంతా ఆ జిల్లాలపైనే


·       వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
·       వెనుకబడిన రంగాల గుర్తింపు
·       శాస్త్రీయ దృక్ఫధంతో తగిన కసరత్తు

అభివృద్ధిలో రాష్ట్రంలో  వెనుకబడిన  జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి(ఎస్ జీడిపి-స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్) వృద్ధి రేటు గత సంవత్సరం (2015-16) 10.99 శాతం, ఈ ఏడాది అర్ధ సంవత్సరంలో 12.23 శాతం సాధించి దేశంలో అగ్రభాగాన నిలిచింది. అయినప్పటికీ  రాబోయే 5 ఏళ్లలో 15 శాతం వృద్ధి రేటు కొనసాగించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఈ ఏడాది కూడా నిర్ధేశించుకున్న 15.23 శాతం వృద్ధి రేటును సాధించాలన్న  పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఇందు కోసం తలసరి ఆదాయం, జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ- గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్) తక్కువగా వున్న జిల్లాలపై ఇక పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం విజయవాడలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో స్పష్టం చేశారు.
తలసరి అదాయం, జిల్లా స్థూల ఉత్పత్తిలో చివరనున్న శ్రీకాకుళం
జిల్లా స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం రెండింటిలో శ్రీకాకుళం జిల్లా వెనకబడి చివరి స్థానంలో ఉంది. వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో కూడా ఈ జిల్లా చివరి స్థానంలోనే ఉంది.  గత సంవత్సరం సరాసరి తలసరి ఆదాయం రూ.1,07,532  ఉండగా విశాఖ జిల్లా రూ. 1,40,593 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది.   శ్రీకాకుళం జిల్లా రూ.74,638 లతో చివరి స్థానం(13)లో ఉంది. రూ.86,223 తో విజయనగరం జిల్లా 12వ స్థానంలో, రూ.88,308తో కర్నూలు జిల్లా 11వ స్థానంలో, రూ.98,084తో అనంతపురం జిల్లా 10వ స్థానంలో, రూ.91,888తో కడప జిల్లా 9వ స్థానంలో, రూ.1,00,443తో చిత్తూరు జిల్లా 8వ స్థానంలో ఉన్నాయి.
గత సంవత్సరం రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 6,03,376 కోట్లతో వృద్ధి రేటు 10.99 శాతం సాధించడం జరిగింది. జిల్లా స్థూల ఉత్పత్తితో కృష్ణా జిల్లా రూ.72,219 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా,  శ్రీకాకుళం రూ.22,707 కోట్లతో చివరి స్థానం(13)లో ఉంది. విజయనగరం జిల్లా రూ.22,924 కోట్లతో 12వ స్థానంలో, కడప జిల్లా రూ.29,826 కోట్లతో 11వ స్థానంలో, నెల్లూరు జిల్లా రూ.38,793 కోట్లతో 10వ స్థానంలో, కర్నూలు జిల్లా రూ. 39,876 కోట్లతో 9వ స్థానంలో, ప్రకాశం జిల్లా రూ. 40,732 కోట్లతో 8వ స్థానంలో ఉన్నాయి.
శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలు పారిశ్రామికంగా వరుసగా చివరి ఆరు స్థానాలలో ఉన్నాయి. ఈ జిల్లాలన్నీ ఏ ఏ రంగాలలో, ఎందుకు వెనుకబడి ఉన్నాయో అధ్యయనం చేసి, ఆ రంగాలలో ఆయా జిల్లాలు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందింస్తోంది. వృద్ధి, అభివృద్ధి సమాంతరంగా సాధించడానికి శాస్త్రీయ దృక్ఫధంతో తగిన కసరత్తు జరుగుతోంది. సుస్థిర వృద్ధి లక్ష్యాలు, సమాజ అభివృద్ధికి పది లక్ష్యాలు, ప్రతిభా కొలమాన సూచికలు, ఉత్తమ పాలనా పద్దతులు, అంతర్జాతీయ కొలమానాలు తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వ శాఖలు ముందుకు వెళ్లుతున్నాయి. 15 శాతం చొప్పున 15 ఏళ్ల పాటు వృద్ధి రేటు  కొనసాగితే రాష్ట్రానికి తిరుగుండదు. ఈ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు, అనుసరిస్తున్న పథకాలు, ఆచరణలో ఆర్థిక రంగంలో సాధించిన విజయాలను పరిశీలిస్తే భవిష్యత్ లో రాష్ట్రం స్థిరమైన అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది.

రొయ్యల సాగులో లాభాల పంట

        ఆంధ్రప్రదేశ్ లో మత్స్య పరిశ్రమ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఉత్పత్తిలోనూ, ఉపాధి అవకాశాల కల్పనలోనూ ఈ రంగం మంచి ఫలితాలను సాధిస్తోంది. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ఏపీ దేశంలో అగ్రగామిగా నిలిచింది. మంచినీటి చేపలు, ఉప్పునీటి (బ్రేకింగ్ వాటర్) రొయ్యలు, వనమి రొయ్యల ఉత్పత్తిలో ఏపీదే అగ్రస్థానం.  రాష్ట్రంలో రెండంకెల స్థిరమైన వృద్ధి రేటును సాధించేందుకు మత్స్య పరిశ్రమను ప్రధాన వృద్ధి కారకం (గ్రోత్ ఇంజన్)గా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. అదేవిధంగా ఏడాదికేడాది వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతోంది.  
 అర్ధ సంవత్సరంలో 47.57 శాతం వృద్ధి రేటు నమోదు
         ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం వారు 2011-12 ధరల ఆధారంగా ఏపీలో చేపలు, రొయ్యల స్థూల ఉత్పత్తిని లెక్కకడతారు. ఆ వివరాల ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.17,621 కోట్ల ఉత్పత్తితో 13.56 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, 2015 -16లో  రూ.23,397 కోట్ల విలువైన 23.52 లక్షల టన్నుల ఉత్పత్తితో 32.78 శాతం వృద్ధి రేటు సాధించింది. దాంతో ఈ ఏడాది (2016-17) ఉత్పత్తి లక్ష్యాన్ని రూ.30,440 కోట్లు (26.40 లక్షల టన్నులు)గా, అర్ధ సంవత్సరం లక్ష్యాన్ని రూ. రూ.16,430 కోట్లుగా  ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ అర్ధ సంవత్సరం (ఏప్రిల్-సెప్టెంబర్)లో లక్ష్యానికి మించి రూ. 17,578 కోట్ల ఉత్పత్తి జరిగింది. గత ఏడాది జరిగిన అర్ధ సంవత్సరం ఉత్పత్తి రూ.12,329 కోట్లతో పోల్చితే 42.57 శాతం వృద్ధి రేటు సాధించడం జరిగింది. ఈ అర్ధ సంవత్సరంలో రాష్ట్రంలో ఏ రంగంలోనూ ఇంత వృద్ధి రేటు నమోదు కాలేదు. జాతీయ స్థాయిలో కూడా ఈ రంగంలో 5.26 శాతం మాత్రమే వృద్ధి రేటు నమోదైంది.
 విదేశీ మారకద్రవ్యంలో కీలక పాత్ర
           విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెట్టడంలో ఈ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోంది. మన దేశం నుంచి 75 దేశాలకు చేపలు ఎగుమతి అవుతున్నాయి.  2014-15లో దేశం నుంచి ఎగుమతి అయిన సముద్ర ఉత్పత్తుల విలువ రూ.35 వేల కోట్లు కాగా, రాష్ట్రం నుంచి ఎగుమతి అయిన వాటి విలువ దాదాపు 16 వేల కోట్ల రూపాయలు. దేశం నుంచి ఎగుమతి అయ్యే మత్స్య ఉత్పత్తులలో ఏపీ నుంచి 45 శాతం ఎగుమతి అవుతున్నాయి. వనమిరకం రొయ్యలు ఏపీ నుంచే అత్యధికంగా 70 శాతం వరకు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.  ఇచ్చాపురం నుంచి తడ వరకు 9 జిల్లాలలో 974 కిలో మీటర్ల సముద్రతీరం ఉండటంతో సముద్ర ఉత్పత్తులలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, దేశ మత్స్య పరిశ్రమ రాజధానిగా ఏపీ వెలుగొందుతోంది.
 5 ఏళ్లలో వంద శాతం వృద్ధి లక్ష్యం
         వచ్చే అయిదేళ్లలో ఆక్వా ఉత్పత్తులను వంద శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేపలు, రొయ్యల చెరువుల సాగుదార్లకు  అనేక రాయితీలు ఇస్తోంది. మత్స్య శాఖకు సంబంధించిన ఉత్పత్తులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో ప్రభుత్వం నూతన మత్స్య విధానం ప్రకటించింది.  అసైన్డ్ భూముల్లో కూడా రైతులు రొయ్యలు, చేపల చెరువులను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది.  మత్స్య శాఖ  బడ్జెట్ అంచనాలను కూడా ప్రభుత్వం పెంచింది. గత సంవత్సరం బడ్జెట్ అంచనా రూ.187.19 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేశారు. ఈ ఏడాది (2016-17) ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్  అంచనాలను రూ.339 కోట్లకు పెంచారు. రైతులకు నాణ్యమైన చేప పిల్లలను అందించాలన్న లక్ష్యంతో గుంటూరు జిల్లా బాపట్లలో రూ.20 కోట్లతో హేచరీ ఏర్పాటు చేస్తున్నారు. జాలర్ల సంక్షేమానికి కూడా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. గత సంవత్సరం వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు భృతిగా రూ.2 వేలు ఇచ్చారు. దానిని ఈ ఏడాది రూ.4వేలకు  పెంచారు. ఈ పథకం ద్వారా 60 వేల 500 మంది ప్రయోజనం పొందుతున్నారు.

          
10.65 లక్షల మంది ఉపాధి
  రాష్ట్రంలో మత్స్య శాఖ ద్వారా 10.65 లక్షల మంది ఉపాధి లభిస్తోంది. మత్స్య సంబంధమైన శాస్త్రీయ పరిశోధనలు,అధ్యయనాలకు ఊతం ఇచ్చే విధంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రభుత్వం ఆక్వా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీలో  అపారంగా ఉన్న సముద్ర తీరాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని, సముద్ర ఉత్పత్తులు పెరగడానికి, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి, ఎగుమతుల పెరుగుదలకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.  అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులు సాధించడం, మందుల వాడకంలో జాగ్రత్తలు పాటించడం, మత్స్య ఉత్పత్తుల ప్రాసెసింగ్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. ఫలితాలను సాధిస్తోంది. ప్రభుత్వం ప్రోత్సాహం వల్ల సముద్ర ఉత్పత్తులు పెరగటమే కాకుండా, ఎక్కువ మందికి ఉపాధి కూడా లభించే అవకాశం ఉంది.
 n శిరందాసు నాగార్జున, - 9440222914
    
      02.01.2017 సోమవారం ఎడిటోరియల్ పేజీ

స్మార్ట్ గ్రామాలే లక్ష్యం


ü గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి
ü 20 ప్రమాణాల నిర్ధేశన
ü ఎన్ఆర్ఇజీఏ పథకం కింద 9,16,295 పనులు పూర్తి
ü రూ.9,695 కోట్ల వ్యయం
ü పలు ప్రోత్సహాకాల ప్రకటన

           స్మార్ట్ గ్రామాలే లక్ష్యంగా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిపై దృష్టి పెట్టింది. గ్రామాలు అన్ని విధాలా అభివృద్ధి చెందడంతోపాటు సకల సదుపాయాలు గ్రామాలకు అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పలు ప్రణాళికలు సిద్ధం చేసింది. పంచాయతీరాజ్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలతోపాటు ప్రధాన శాఖలను అనుసంధానం చేసుకుంటూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఇజీఏ) కింద రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం(2016-17)లో అనేక లక్షల పనులు చేపట్టి పూర్తి చేశారు. శాస్త్ర సాంకేతిక ఫలాలను అందిపుచ్చుకుంటూ పేదరికం, ఆర్థిక అసమానతలు లేని, ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన గ్రామాలను రూపొందించడమే స్మార్ట్ గ్రామాల లక్ష్యం. స్మార్ట్ గ్రామానికి 20 ప్రమాణాలను నిర్ధేశించుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గ్రామంలో అందరికీ మరుగుదొడ్డి, సురక్షిత తాగునీరు, నిరంతర విద్యుత్ సదుపాయాలతో కూడిన ఇళ్లు ఉండేలా చేస్తోంది. ప్రతి కుటుంబానికి తగిన జీవనోపాధి అవకాశాలు కల్పిస్తోంది. స్వయం సహాయక సంఘ సభ్యులు, గ్రామీణ యువకులు బ్యాంకులు, మార్కెట్లతో అనుసంధానం కావడానికి వారికి నైపుణ్యతో కూడిన శిక్షణ ఇస్తున్నారు. బహిరంగ మల విసర్జన లేకుండా ఓ ఉద్యమమే  చేపట్టారు.  ఘన, ద్రవ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించే ఏర్పాటు చేస్తున్నారు. మాతా, శిశు మరణాలు తగ్గించడానికి తగిన వైద్యసేవలు అందిస్తున్నారు. నూరు శాతం ఆస్పత్రి ప్రసవాలు సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 12వ తరగతి వరకు బాల బాలికలు బడి మానివేయకుండా చదువు కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు. అంగన్ వాడీ కేంద్రాలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయం, ఆరోగ్య కేంద్రం, ఇతర ప్రభుత్వ భవనాలలో త్రాగునీరు, మరుగుదొడ్డి, విద్యుత్ సౌకర్యాలను అందుబాటులో ఉంచుతున్నారు. 9 సంవత్సరాల లోపు పిల్లలలో పౌష్టికాహారం లోపంలేకుండా చేస్తున్నారు. బాల్య వివాహాలు చేయకుండా ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. అన్ని వ్యవసాయ నేలలలో భూసార పరీక్షలు నిర్వహించి, ప్రతి రైతుకు భూసార కార్డులు అందజేస్తున్నారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి ఒక బ్యాంకు ఖాతా తెరిచేలా చర్యలు చేపట్టారు. ప్రజా భాగస్వామ్యంతో ప్రతి గ్రామంలో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారు. గ్రామాల సరిహద్దులలో పచ్చని మొక్కలు నాటి, చెట్లను పెంచే ఏర్పాట్లు చేశారు. నీటి సంరక్షణకై నీటి నిల్వ నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రతి  గ్రామంలో సమాచార కేంద్రాన్ని, ఒక కంప్యూటర్ ల్యాబ్ ని , మీ-సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. టెలిఫోన్, ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. మూడింట రెండువంతుల హాజరుతో ఏడాదికి నాలుగు సార్లు వార్డు సభలను, గ్రామ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. ఫిర్యాదులు సత్వర పరిష్కారానికి తగు వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ సక్రమంగా సమకూరిన గ్రామాన్ని స్మార్ట్ గ్రామంగా ప్రకటిస్తారు.

ఎన్ఆర్ఇజీఏ పథకం కింద 9,16,295 పనులు పూర్తి
             స్మార్ట్ గ్రామాలను రూపొందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఇజీఏ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటోంది. ఈ పథకం కింద రాష్ట్రంలో 84,76,242 మందికి జాబ్ కార్డులు జారీ చేశారు. ఈ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్ నుంచి మార్చి వరకు)లో కనీసం వంద రోజులు పని కల్పించాలి. స్త్రీ, పురుషులకు సమాన వేతనం ఇవ్వడం ఈ ప్రథకం ప్రత్యేకత. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 13,104 గ్రామాలు, 47,638 నివాస ప్రాంతాలలో  పనులు చేపట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.9,695 కోట్ల అంచనా వ్యయంతో ఎన్ఆర్ఇజీఏ పథకం కింద చేపట్టిన 9,16,295 పనులను ఈ నెల 14వ తేదీ నాటికి పూర్తి చేశారు.  రూ.15,778 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన  6,90,511 పనులు జరుగుతూ ఉన్నాయి.
          గ్రామ పంచాయతీ నిధులకు గ్రామీణ ఉపాధి హామీ నిధులు కూడా తోడుకావడంతో గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా  పంచాయతీ కార్యాలయాలు నిర్మిస్తున్నారు. వాడవాడలా చంద్రన్న బాటలు వేశారు. అంగన్ వాడీ భవనాల నిర్మాణం, పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడం, గ్రామాల పచ్చదనం, నర్సరీల పెంపకం, వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటు, స్మశానాల పునరుద్ధరణ వంటి పనులు చేపట్టారు. రాష్ట్రంలోని గ్రామాలన్నింటినీ స్మార్ట్ గ్రామాలుగా రూపొందించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. అభివృద్ధి పనులు ముమ్మరంగా జరిగేందుకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి, బహిరంగ మలవిసర్జన రహితంగా ప్రకటించిన గ్రామ పంచాయతీకి రూ.5 లక్షలు ఇస్తారు. వంద పంట సంజీవనులు(ఫారం ఫాండ్) పూర్తి చేసిన గ్రామానికి రూ.4 లక్షలు ఇస్తారు. అన్ని ఇళ్లకు ఇంకుడు గుంతలు పూర్తి చేస్తే రూ.2 లక్షలు ఇస్తారు. ఈ విధంగా అనేక రకాల ప్రోత్సాహకాలు ప్రభుత్వం ఇస్తోంది. అన్ని అంశాలు పూర్తి చేసిన గ్రామ పంచాయతీకి గరిష్టంగా రూ.22 లక్షలు, జిల్లాకు రూ.11 కోట్ల వరకు ప్రోత్సాహకాలు ఇస్తారు. ఇదే క్రమంలో ముమ్మరంగా పనులు జరిగితే రాష్ట్రంలోని పంచాయతీలన్నీ త్వరలోనే స్మార్ట్ గ్రామాలుగా అభివృద్ధి చెందుతాయి.

రాష్ట్రంలో 27 లక్షల రూపే కార్డుల జారీ


ü విజయనగరం జిల్లాలో అత్యధిక కార్డుల జారీ
ü క్యాష్ లెస్ లావాదేవీలు ముమ్మరం
ü గ్రామీణులకు క్యాష్ లెస్ లావాదేవీలలో శిక్షణ
ü విశాఖ జిల్లాలో అత్యధికమందికి శిక్షణ
ü 5291 గ్రామ పంచాయితీలలో బ్యాంక్ మిత్ర సేవలు

              రాష్ట్రంలో క్యాష్ లెస్ లావాదేవీలు ముమ్మరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.  పెద్ద నోట్ల చలామణిపై తీవ్రమైన ఆంక్షలు, కొత్త నోట్ల కొరత వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు వేలల్లో ఈ-పాస్ (పీఓఎస్- పాయింట్ ఆఫ్ సేల్) మిషన్లు సరఫరా చేస్తున్నారు. లక్షల్లో రూపే కార్డులు పంపిణీ చేస్తున్నారు. రూ.1000, రూ.500 నోట్లపై ఆంక్షలు విధించిన నవంబర్ 8 నుంచి అన్ని ప్రాంతాలలో నగదురహిత లావా దేవీలు పెరిగిపోయాయి. రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పడికప్పుడు ఈ వ్యవహారలన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. రిజర్వు బ్యాంకు అధికారులతో మాట్లాడి కొత్త నోట్లు రాష్ట్రానికి తెప్పించారు. అలాగే ఈ-పాస్ మిషన్లు, రూపే కార్డుల పంపిణీ గురించి తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ప్రజలు, ముఖ్యంగా గ్రామీణులు ఇబ్బందులు పడకూడదని ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది.
           దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక చర్యలు తీసుకుంది. ఈ నెల 19వ తేదీ వరకు రాష్ట్రంలోని 13 జిల్లాలలో 27,41,244 రూపే కార్డులు జారీ చేశారు. ఇవి ఏటీఎం కార్డులు లాంటివే. అయితే ఇవి దానికంటే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి. వీటీని ఇటు ఏటీఎంలలోనూ, అటు గ్రామీణ ప్రాంతాలలోని సీఎస్పీ(కస్టమర్ సర్వీస్ పాయింట్), బ్యాంకు మిత్రల వద్ద ఉండే మైక్రో మిషన్లలో కూడా ఉపయోగించవచ్చు. ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతా ప్రారంభించిన వారందరికీ రూపే కార్డులు ఇస్తున్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే విజయనగరం జిల్లాలో అత్యధికంగా 4,49,587 కార్డులు జారీ చేశారు. 4,01,309 కార్డుల జారీతో కృష్టా జిల్లాలో ఆ తరువాతి స్థానంలో ఉంది. అనంతపురం జిల్లాలో 2,17,882 కార్డులు, చిత్తూరు జిల్లాలో 1,34,987, తూర్పుగోదావరి జిల్లాలో 1,82,511, గుంటూరు జిల్లాలో 1,87,298, కడప జిల్లాలో 1,85,500, కర్నూలు జిల్లాలో 1,78,877, ప్రకాశంలో 2,05,688, నెల్లూరు జిల్లాలో 1,41,475, శ్రీకుళం జిల్లాలో 1,60,964, విశాఖపట్నం జిల్లాలో 1,45,150, పశ్చిమగోదావరి జిల్లాలో 1,50,016 కార్డులు జారీ చేశారు.

గ్రామీణులకు క్యాష్ లెస్ లావాదేవీలలో శిక్షణ
            రాష్ట్రంలోని పేదలకు, గ్రామీణులకు క్యాష్ లెస్  లావాదేవీలలో ప్రభుత్వం శిక్షణ ఇప్పిస్తోంది. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఇజీఏ) సిబ్బంది, విద్యార్థులు వారికి తెలియజేస్తున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 84,47,960 కుటుంబాలకు జాబ్ కార్డులు జారీ చేశారు. 80,10,722 మంది మాత్రమే చురుకుగా పనులలో పాల్గొంటున్నారు. వారిలో 33,98,046 మందికి క్యాష్ లెస్ లావాదేవీలలో శిక్షణ ఇచ్చినట్లు ఉపాధి హామీ పథకం ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పారు. జిల్లాలవారీగా పరిశీలిస్తే విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 6,40,000 మందికి శిక్షణ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 3,75,923 మందికి, తూర్పుగోదావరి జిల్లాలో 3,47.921 మందికి, విజయనగరం జిల్లాలో 3,46,470 మందికి శిక్షణ ఇచ్చారు. మిగిలిన వాటిలో అనంతపురం జిల్లాలో 2,57,864 మందికి, చిత్తూరు జిల్లాలో 2,62,230 మందికి, గుంటూరు జిల్లాలో 74,560 మిందికి, కడప జిల్లాలో 1,80,982 మందికి, కృష్ణా జిల్లాలో 2,87,820 మందికి, కర్నూలు జిల్లాలో 1,78,877 మందికి, ప్రకాశం జిల్లాలో 4,753 మందికి, నెల్లూరు జిల్లాలో 2,18,341 మందికి, శ్రీకాకుళం జిల్లాలో 2,22,305

మందికి క్యాష్ లెస్ లావాదేవీలలో శిక్షణ ఇచ్చారు.
          నెట్ కనెక్టివిటీ ఉన్న అన్ని గ్రామాలలో ఈ-పాస్ మిషన్లు, సీఎస్పీ, బ్యాంకు మిత్ర సెంటర్ల ద్వారా క్యాష్ లెస్ లావాదేవీలు జరుగుతున్నాయి. అన్ని చోట్ల రూపే కార్డులను ఉపయోగించవచ్చు. రాష్ట్రంలో 13,104 గ్రామాలు ఉన్నాయి. అయితే  ఆరు వందల గ్రామాలలో మాత్రమే నెట్ కనెట్టివిటీ లేదు. అటువంటి గ్రామాలలో  సీఎస్పీ, బ్యాంకు మిత్ర సెంటర్ల ద్వారా ఆధార్ బయోమీటర్, ఐరిస్ లు సరిచూసుకొని క్యాష్ లెస్ లావాదేవీలు జరుపుతున్నారు. అన్ని గ్రామ పంచాయతీలలో బ్యాంకు సేవలు అందే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బ్యాంకు బ్రాంచ్ లు లేని 5291 గ్రామ పంచాయితీలలో బ్యాంకు మిత్రలు చురుకుగా తమ సేవలందిస్తున్నారు. మిగిలిన గ్రామాలలో కూడా బ్యాంకు మిత్ర సేవలు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్యాంకు ఖాతాలు లేని వారికి ఖాతాలను తెరుస్తున్నారు. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలలో కూడా క్యాష్ లెస్ లావాదేవీలు ఎక్కువగా జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
21.12.2016

భూ సమీకరణ చర్యలు వేగవంతం


·       కలెక్టర్లకు ఆదేశాలు
·       మచిలీపట్నం పోర్టుకు భూ సమీకరణ
·       భావనపాడు పోర్ట్ భూ సేకరణ

     రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు, పలు రకాల అభివృద్ధి పనుల కోసం త్వరితగతిన భూమిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోర్టులు, రోడ్లు, జల మార్గాలు, బీచ్ కారిడార్ తదితరాలకు నిర్ణయించిన ప్రకారం  భూ సమీకరణ జరపాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లో భూముల ధరలు, స్థానిక పరిస్థితుల ఆధారంగా భూ సమీకరణ లేక భూ సేకరణ చేస్తారు. ఈ భూ సమీకరణ ప్రక్రియ కోసం రెవెన్యూ, సర్వే సిబ్బందిని కేటాయించి, వారిని రిలీవ్ చేయాలని అందరు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. మచిలీపట్నం పోర్టుకు సంబంధించి భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్)కు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఏ భూ సమీకరణ పనులు వేగవంతం చేశారు. త్వరలోనే ఆయన భూమిని సమీకరించి ప్రభుత్వానికి అప్పగించే అవకాశం ఉంది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరకు అనుసరించిన పద్దతులనే  పోర్టు నిర్మాణానికి సమీకరించే భూముల విషయంలో కూడా అనుసరిస్తున్నారు. ఇందు కోసం పట్టా భూములు 14 వేల ఎకరాలు, ప్రభుత్వ భూమి  5200 ఎకరాలను సమీకరిస్తారు. పోర్టు నిర్మాణ పనులను 2017లో పార్రంభించి, 2018 నాటికి పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పోర్ట్ మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి కన్సెల్టెంట్ ని నియమించే ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

భావనపాడు పోర్టు: శ్రీకాకుళం జిల్లా భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు కోసం 2050 ఎకరాల భూ సేకరణను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంతబొమ్మాళి మండలం భావనపాడు, మర్రిపాడు, దేవునల్తాడ గ్రామాల పరిధిలో ఈ భూమిని సేకరిస్తారు. ఆ మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వం తగిన సూచనలు, సలహాలు కూడా ఇచ్చింది.  ఈ పోర్టు నిర్మాణ టెండర్ ని అంతర్జాతీయంగా పేరుపొందిన ప్రముఖ నౌకా నిర్మాణ సంస్థ అదానీ కంపెనీ దక్కిచ్చుకుంది. అందువల్ల భూసేకరణ జరిగిన వెంటనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అంతర్గత జల మార్గం: రాష్ట్రంలో అంతర్గత జల మార్గాన్ని అభివృద్ధి చేసి, జల రవాణాకు ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్లపై ట్రాఫిక్‌ను తగ్గించడంతోపాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ సామగ్రిని తరలించేందుకు జల రవాణా ఉపయోగపడుతుంది. కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు బకింగ్‌హామ్ కెనాల్‌ను పునరుద్ధరించి కాలువలు, నదులను అనుసంధానం చేసుకుంటూ ఈ జల మార్గం రూపకల్పన చేశారు.  ఇందులో భాగంగా ఇటు కృష్ణా, అటు గోదావరి నదుల మధ్య భూ సేకరణకు సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తి చేశారు.   ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో అంతర్గత జల మార్గం కోసం భూమిని గుర్తించారు. ఆ భూమిని సేకరించడాన్ని  వేగవంతం చేశారు.  ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో 74 కిలోమీటర్ల పొడవునా ఏలూరు కాలువను ఆధునీకరిస్తారు. నిడదవోలుఏలూరు మధ్య ప్రధాన కాలువను వెడల్పు చేసి ఓడల ద్వారా సరుకుల రవాణా చేసేందుకు వీలుగా 35 గ్రామాలు, ఏలూరు, తాడేపల్లిగూడెంలలో భూసేకరణ  చేపడుతున్నారు.

బీచ్ కారిడార్:  పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు కాగల బీచ్ కారిడార్ ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు బీచ్ కారిడార్ గా అభివృద్ధి చేయనున్నారు.  ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో గుర్తించవలసి ఉంది. ఈ బాధ్యతలను ఆయా కలెక్టర్లకు అప్పగించారు. కాకినాడ నుంచి భోగాపురం వరకు 170 నుంచి 180 కిలోమీటర్ల  గ్రీన్ ఫీల్డ్ బీచ్ రోడ్డును కూడా నిర్మిస్తారు.

లాజిస్టిక్స్ పార్కులు: విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నంలలో లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖలో 98 ఎకరాల్లో, కాకినాడలో 89 ఎకరాల్లో, కృష్ణపట్నంలో 142 ఎకరాల్లో ఈ పార్కులను నెలకొల్పుతారు. రెండేళ్లలో వీటిని ప్రారంభిస్తారు.