Nov 17, 2016

ఏపీలో పోర్టుల అభివృద్ధికి విస్తృత అవకాశాలు

Ø ఏడాదికి 550 మెట్రిక్ టన్నుల రవాణా లక్ష్యం
Ø నౌకల రాకపోకల సమయం 1.2 రోజులకు తగ్గించడం
Ø ఏకీకృత సరుకు రవాణా నిల్వ కేంద్రాల ఏర్పాటు
Ø జలమార్గాలతో  రైలు, రోడ్డు మార్గాల అనుసంధానం
Ø జపాన్ తరహాలో పోర్టుల అభివృద్ధి
Ø ఏపీ విజన్ 2029 

             ఏపీలో పోర్టుల అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయి. రాష్ట్రంలో 974 కిలో మీటర్ల  సుదీర్ఘ సముద్రతీరం ఉంది. ఇప్పటికే ఉన్న పోర్టులతోపాటు ప్రతిపాదిత పోర్టులను జపాన్ తరహాలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నడుంబిగించింది. కాకినాడ, కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులను  మెగా పోర్టులుగా అభివృద్ధి పరుస్తారు.  విశాఖపట్నం, భావనపాడు, నరసాపురం, రామాయపట్నం పోర్టులను  పెద్ద పోర్టులుగా తీర్చిదిద్దుతారు.  మేఘవరం, కళింగపట్నం, భీమునిపట్నం, కాకినాడ, వాకట్‌పల్లి, రవ్వ, నిజాంపట్నం ఓడరేవు, దుగ్గరాజపట్నంలను చిన్న పోర్టులుగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించారు. పోర్టుల ఆధారిత వృద్ధిని  ఆర్థిక వృద్ధి కారకాలలో  ఒకటిగా, అత్యధిక వృద్ధి సాధించగల రంగంగా కూడా ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్  2029 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదిగేలా విజన్-2029ని ప్రభుత్వం రూపొందించింది. అందులో భాగంగా పోర్టుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. లక్ష్యసాధనకు ప్రభుత్వం, ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగం అందరినీ కలుపుకొని అనుసంధానం చేసే ఒక పరిపాలనా వ్యవస్థ(విజన్)ను ఏర్పాటు చేసింది.
            రాష్ట్రంలోని నౌకాశ్రయాలు 2029 నాటికి ఏడాదికి 550 మెట్రిక్ టన్నుల సరుకుల రవాణా నిర్వహణ సామర్థ్యం కలిగి ఉండేవిధంగా అభివృద్ధిపరచాలని లక్ష్యంగా నిర్థేశించింది. 2015లో 117 మెట్రిక్ టన్నులుగా ఉన్న సామర్థ్యాన్ని 2019 నాటికి 250 మెట్రిక్ టన్నులకు, 2029 నాటికి 500 టన్నులకు, 2029 నాటికి వెయ్యి టన్నులకు పెంచాలని ప్రభుత్వం భవిష్యత్ పోర్టుల లక్ష్యాలను నిర్ణయించింది. ప్రస్తుతం నౌకల రాకపోకలకు ఒక ట్రిప్పుకు పట్టే సమయం 2.48 రోజులుగా ఉంది. దానిని 2019 నాటికి రెండు రోజులకు, 2022 నాటికి 1.5 రోజులకు, 2029 నాటికి 1.2 రోజులకు తగ్గించాలని నిర్ణయించింది. ఈ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు, రోడ్డు మార్గాలను జలమార్గాలతో అనుసంధానం చేస్తున్నారు. ఓడ రేవుల నుంచి రాష్ట్రంలోని ప్రధాన  రహదారులను కలుపుతూ రోడ్లు వేయడానికి రోడ్డు గ్రిడ్ ను ఏర్పాటు చేశారు. మరోపక్క రాష్ట్రంలోని అన్ని ఓడరేవులను జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తూ కొత్త మార్గాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. లాజిస్టిక్ పార్కులు, జాతీయ, అంతర్జాతీయ ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ ఏకీకృత సరుకు రవాణా నిల్వ కేంద్రాల(ఫ్రైట్ విలేజ్ లు)ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు నేషనల్‌ వాటర్‌వే -4 గా ప్రకటించారు. 10 వేల మెట్రిక్‌ టన్నుల బరువున్న ఓడలు ఈ వాటర్‌వే ద్వారా ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 
పోర్టుల అభివృద్ధి

             రాష్ట్రంలోని పోర్టులన్నిటినీ అన్ని రకాలుగా అభివృద్ధిపరచడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కృష్ణపట్నం, విశాఖ పోర్ట్ లు అంతర్జాతీయ ఎగుమతులకు అనుకూలంగా ఉంటాయి. దుగరాజపట్నం పోర్టును త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నారు. ఉత్తర భారతదేశానికి కార్గో కంటెయినర్లను పంపించేదుకు అనువుగా  రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా పోర్టులను మలుచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోటీ తత్వాన్ని పెంచేందుకు ప్రైవేటు రంగం ద్వారా పోర్టుల అభివృద్ధి చేస్తున్నారు. మచిలీపట్నం పోర్టు 2018 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మచిలీపట్నం, భావనపాడు నౌకాశ్రయాలను అభివృద్ధిపరుస్తారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలో నౌకా నిర్మాణ కేంద్రం ప్రతిపాదనలో ఉంది. అంతే కాకుండా విశాఖపట్నం జిల్లా రాంబిల్లిలో 5 వేల కోట్ల రూపాయలతో నౌకా నిర్మాణ కేంద్రం నిర్మిస్తానని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు.

పోర్టుల ఆధారిత అభివృద్ధిపై  దృష్టి
            కోస్తా తీరాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ సప్లై చైన్ గా తీర్చిదిద్దటానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇచ్చాపురం నుంచి తడ వరకు 9 జిల్లాలలో విస్తరించి ఉన్న సముద్రతీర ప్రాంతాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి  ప్రణాళికులు సిద్ధం చేసింది.  తీర ప్రాంతాన్ని వినియోగించుకొని పోర్టుల ఆధారిత అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నౌకాశ్రయాలను అభివృద్ధి చేయడం ద్వారా తీర ప్రాంత ఆర్థికాభివృద్ధి వ్యూహాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని  నౌకాశ్రయాలు తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా దేశాలను అనుసంధానంగా నిలుస్తూ, ఆయా దేశాలతో వాణిజ్య సంబంధాలకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. కాకినాడ-పుదుచ్చేరి, కాకినాడ- భద్రాచలం అంతర్గత జల రవాణా మార్గాలను దగ్గరలో ఉన్న పోర్టులతో అనుసంధానం చేయనున్నారు. రాష్ట్రంలో మొదటి సారిగా మెరైన్ బోర్డును కూడా నెలకొల్పాలన్న ఆలోచనలో  ప్రభుత్వం  ఉంది.  ఈ బోర్డు ఏర్పాటైతే సముద్రతీర ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనఓడరేవుల నిర్వహణ, వాటి అభివృద్ధి, హార్బర్సలో ట్రాఫిక్ నియంత్రణ, సముద్ర జలాలకు సంబంధించిన వ్యవహారాలను ఈ బోర్డు చూసుకుంటుంటుంది. ఇండియన్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సహాయంతో ఆంధ్రప్రదేశ్ నాలుగు జాతీయ జలమార్గాలకు చెందిన ప్రాజెక్టులు చేపడుతోంది. సాగరమాల పథకంలో రాష్ట్రం ప్రధాన భాగస్వామి కానుంది. ఆసియా దేశాలలోనే తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లా అంర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ ఏర్పాటు కానుంది. కేంద్ర జాతీయ జలరవాణా మార్గాల అభివృద్ధిలో భాగంగా 888 కిలోమీటర్ల కాకినాడ-పుదుచ్ఛేరి జలరవాణా మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇండియన్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐడబ్ల్యూఏఐ)తో ఈ రకమైన ఒప్పందం చేసుకున్న తొలి రాష్ట్రంగా ఏపి నిలిచింది.

అంతర్జాతీయ సంస్థల సహకారం
         ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీపర్యటనలలో పలు అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి తమ సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చాయి. ఈ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో విశేష అనుభవం ఉన్న సంస్థల సహకారం పొందడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏపీలో పోర్టుల అభివృద్ధికి సహకరిస్తామని జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి యోసుకే తకాగి సీఎంకు హామీ ఇచ్చారు.   మెరైన్ రంగంలో ఏపికి సంపూర్ణ సహాయ సహకారాలు అందజేసేందుకు  రష్యాకు చెందిన యునైటెడ్‌ షిప్‌బిల్లింగ్‌ కార్పొరేషన్‌  అధ్యక్షుడు అలెక్సీ ఎల్‌ రఖ్మనోవ్‌ తన సంసిద్ధత వ్యక్తం చేశారు.  ఏపీలో పోర్టుల అభివృద్ధికి సహకరిస్తామని, పోర్టుల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ అందిస్తామని జపాన్ కు చెందిన యొకోహమా పోర్టు ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని పోర్టుల అభివృద్ధికి తాము సహకరిస్తామని హిటాచి గ్రూప్ జీఎం అకిరా షిముజు కూడా సీఎంకు హామీ ఇచ్చారు. పెట్టుబడులు పెడతామని, అయితే రాయితీలు కల్పించాలని ఆయన కోరారు.  ఏపీలో జపనీస్ డెస్క్ పేరుతో ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం ఆయనకు చెప్పారు. సనరైజ్‌ స్టేట్‌ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీలోని హెంబర్‌ పోర్టు అధికారులు కూడా  ఆసక్తి కనబరిచారు.  
రాష్ట్రంలో నౌకానిర్మాణ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశానికి చెందిన సంస్థలు ఉత్సుకత చూపుతున్నాయని రష్యన్ ఫెడరేషన్ పరిశ్రమలు-వాణిజ్య శాఖల మంత్రి డెనిస్ మాంతురోవ్ చెప్పారు. ఏపీ ఇడీబీ, జేఎస్‌సీ యునైటెడ్ షిప్పింగ్ కార్పొరేషన్ మధ్య ఒక ఒప్పందం కూడా  జరిగింది. జేఎస్‌సీ యునైటెడ్ షిప్పింగ్ కార్పొరేషన్ రష్యా, తూర్పు యూరప్‌లో అతిపెద్ద నౌకా  నిర్మాణ సంస్థగా పేరొందింది. ఈ సంస్థ సబ్ మెరైన్లు, ఉపరితల నౌకలు, సైనిక అవసరాల కోసం ప్రత్యేక జల వాహనాలు, సముద్ర గర్భంలో మంచుగడ్డలు కరిగించే యంత్రాలు, ఆఫ్‌షోర్ సొల్యూషన్స్, ట్రాన్స్‌పోర్టు వెస్సల్స్, స్పెషలైజ్డ్ వెస్సల్స్, జాలర్లకు ఉపయోగపడే వేట పడవలను తయారుచేస్తుంది. జేఎస్‌సీ యునైటెడ్ షిప్పింగ్ సంస్థ, ఏపీ ప్రభుత్వంతో కలిసి సరకు రవాణా, ప్రయాణికుల రవాణాకు వీలయ్యే నౌకలను రూపొందిస్తుంది. వాటి నిర్వహణ  కూడా చేపడుతుంది.
 రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఈ విధమైన చర్యల వల్ల రాష్ట్రంలో పోర్టులు త్వరితగతిన అభివృద్ధిచెందే అవకాశం ఉంది. జలరవాణాకు అవకాశాలు పెరిగి రాష్ట్ర ఆర్థికవృద్ధికి దోహదపడుతుంది.

జారీ చేసినవారు :  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.


మద్యం కల్తీ, అక్రమ అమ్మకాలపై ఎక్సైజ్ కొరడా

v అనధికార అమ్మకాలపై 4,466  కేసులు - 4,457 మంది అరెస్ట్
v కల్తీ మద్యం కేసులు 13,419 - 8,540 మంది అరెస్ట్
v 14,953 లీటర్ల ఐఎంఎల్, 4,436 లీటర్ల బీరు స్వాధీనం
v 495 వాహనాలు సీజ్
v ఎక్సైజ్ ఆదాయం రూ.7,903 కోట్లు

రాష్ట్రంలో మద్యం కల్తీ, అక్రమ అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ కొరడా ఝుళిపించింది.  ఎక్కడబడితే అక్కడ మద్యం అనధికారికంగా అమ్మకుండా, కల్తీ మద్యం నిరోధించేందుకు  ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఎక్సైజ్ శాఖవారు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల దాడులు అధికం చేశారు. కేసులు నమోదు చేసి, వేల మందిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు అనధికార మద్యం అమ్మకాలకు సంబంధించి 4,466 కేసులు నమోదు చేశారు. 4,457 మందిని అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ శాఖ దాడులలో 14,953 లీటర్ల ఐఎంఎల్ (ఇండియన్ మేడ్ లిక్కర్) ను, 4,436 లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2014 జూన్ నుంచి 16,754 కేసులు నమోదు చేసి, 16,450 మందిని అరెస్ట్ చేశారు.

కల్తీ మద్యం కేసులు 13,419
          రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అరికట్టి, పేదల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం పఠిష్టమైన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ ఫోర్స్ మెంట్ వారు నిర్వహించిన దాడులలో ఈ ఏడాది 13,419 కేసులు నమోదు చేశారు. కల్తీ మద్యం తయారీతో సంబంధం ఉన్న  8,540 మందిని అరెస్ట్ చేశారు. దాడులలో అక్రమంగా తయారు చేసిన 79,158 లీటర్ల కల్తీ మద్యాన్ని పట్టుకున్నారు. 495 వాహనాలను సీజ్ చేశారు.

ఎక్సైజ్ ఆదాయం రూ.7,903 కోట్లు

ఈ ఏడాది ఇప్పటి వరకు ఎక్సైజ్ ఆదాయం మొత్తం రూ. 7,903.45 కోట్లు లభిచింది. ఇందులో ఎక్సైజ్ రెవెన్యూ  రూ.2,764.82 కోట్లు కాగా, వ్యాట్(ఎక్సైజ్) రెవెన్యూ రూ.5,138.63 కోట్లు. ఈ ఏడాది నవంబర్ 4వ తేదీ వరకు రూ. 8,480.05 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఐఎంఎల్ కేసులు 204.99 లక్షలు, బీరు కేసులు 115.07 లక్షలు అమ్ముడుపోయాయి.

22 ఎక్సైజ్ డిపోలు
         రాష్ట్రంలో మొత్తం 22 ఎక్సైజ్ డిపోలు ఉన్నాయి. ఈ డిపోల ద్వారానే అమ్మకాలు జరుగుతాయి. గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలలో మూడేసి డిపోలు ఉన్నాయి.చిత్తూరు, ప్రకాశం, కృష్ణా, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాలలో రెండేసి డిపోలు ఉన్నాయి. మిగిలిన అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఒక్కో డిపో మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడికైనా ఈ డిపోల ద్వారానే మద్యం సరఫరా అవుతుంటుంది.


జారీ చేసినవారు :  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

రాష్ట్రాభివృద్ధికి శాస్త్రీయపద్దతిలో భారీ ప్రణాళిక

ü ప్రతి నియోజకవర్గానికి  సామాజిక, ఆర్థిక సూచికలు
ü 32 విభాగాలలో 487 అంశాల వివరాల సేకరణ
ü జిల్లా, మండల స్థాయిలో స్థూల ఉత్పత్తి విలువలు

           రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం శాస్త్రీయపద్దతిలో భారీ ప్రణాళిక రూపొందించింది.
లక్ష్యాల సాధనకు ఒక పక్క మిషన్స్, గ్రిడ్స్ ప్రాతిపదికగా వృద్ధి వ్యూహ రచన చేసింది. మరో పక్క జిల్లా, మండల స్థాయిలో స్థూల ఉత్పత్తి విలువల గణాంకాలను సేకరిస్తోంది. ఇంకోపక్క ప్రతి నియోజకవర్గానికి సామాజిక, ఆర్థిక సూచికలు తయారు చేస్తోంది. 2022 నాటికి సామాజిక, ఆర్థికాభివృద్ధిలో దేశంలోని మొదటి మూడు రాష్ట్రాలలో ఒకటిగా ఏపీ ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2029 నాటికి అభివృద్ధి చెందిన మొదటి రాష్ట్రంగా నిలపాలన్న ధృడ సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ఇందుకోసమే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి అంశానికి సంబంధించి శాస్త్రీయ పద్దతిలో  సమగ్ర సమాచారం సేకరిస్తోంది. 22 విభాగాలకు సంబంధించి 147 అంశాల వివరాలతో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ప్లానింగ్ శాఖ వారు గత నెలలో 175 నియోజకవర్గాల పుస్తకాలు విడుదల చేశారు. ఈ పుస్తకాలలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి 2014-15, 2015-16, 2016-17కు సంబంధించి సెప్టెంబర్ వరకు వివరాలు చేర్చారు.

32 విభాగాలలో 487 అంశాల వివరాల సేకరణ
           ప్రభుత్వం ఈ సారి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 32 విభాగాలలో 487 అంశాల వివరాలను సేకరిస్తోంది. పరిపాలన, జనాభా, ఆర్థిక, వ్యవసాయం, ఉద్యానవనాలు, పట్టుపరిశ్రమ, మార్కెటింగ్, పశుసంరక్షణ, మత్స్య శాఖ, పరిశ్రమలు, విద్యుత్ శక్తి, పౌరసరఫరాలు, పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీరు, పారిశుధ్యం, గ్రామీణాభివృద్ధి, జలవనరులు, గృహనిర్మాణం, విద్య, ఉన్నత విద్య, వయోజన విద్య, స్కాలర్ షిప్స్, వైద్య ఆరోగ్యం, సంక్షేమం, గ్రామీణ పట్టణాభివృద్ధి, రోడ్లు భవనాలు, రెవెన్యూ, ప్రభుత్వ సహాయం, శాంతిభద్రతలు, సమాచార సాంకేతిక, పర్యాటకం, ద్రవ్యోల్బణం, వాతావరణ, బడ్జెట్, ఇతర సామాజిక, ఆర్థిక సూచికలు విభాగాలలో మొత్తం 487 అంశాల వివరాలు సమగ్రంగా సేకరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాలలో మౌలిక సదుపాయలు, జనాభా, అన్ని రకాల ఉత్పత్తులు, వనరులు, ఆదాయం, తలసరి ఆదాయం, వ్యవసాయ ఉత్పత్తులు, పంటలు, ఏ పంట ఉత్పత్తి ఎంత,  వర్షాలు, ఎరువులు, పాలు, మాంసం, చేపలు వంటి ఉత్పత్తులు,  నీటి సౌకర్యం, నీటి ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, రోడ్లు, రవాణా సౌకర్యం, పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమలు, గనులు,  విద్యుత్ సబ్ స్టేషన్లు, బ్యాంకులు, రుణాలు, రోడ్లు, పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, స్కిల్ డెవలప్ మెంట్, అన్ని ప్రభుత్వ పథకాల అమలు, అబ్దిదారులు... ఇలా ప్రతి అంశానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. వీటన్నిటితోపాటు కరువు,  పేదరికం, మానవాభివృద్ధి, సంతోషం వంటి సూచికలను కూడా రూపొందిస్తారు. ప్రతి నియోజకవర్గ సామాజిక, ఆర్థిక, భౌగోళిక స్వరూపంతోపాటు మ్యాపులు, అన్ని అంశాల సమగ్ర వివరాలతో పుస్తకాలను ప్రభుత్వం విడుదల చేస్తుంది.

వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు
           ఆయా నియోజకవర్గాల వాస్తవ సమాచారం ఆధారంగా అక్కడి సమాజిక, ఆర్థిక పరిస్థితులను, వెనుకబాటుతనాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ సూచికల ఆదారంగా ఏఏ ప్రాంతాలు, ఏఏ రంగాలలో ఎంత స్థాయిలో వెనుకబడ్డాయో స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రతి నియోజకవర్గంలో వెనుకబడి రంగాలను గుర్తిస్తారు. ఆ ప్రాంతాలు ఆయా రంగాలలో అభివృద్ధి సాధించడానికి సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాలను రూపొందిస్తుంది.  ప్రత్యేక ప్రణాళికల  ద్వారా ఆ ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వ దృష్టిపెడుతుంది. అలాగే అభివృద్ధి కారకాలను గుర్తించి ఆయా రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడానికి కృషి చేస్తుంది. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఆదాయం కూడా ఆశించినమేర పెరుగుతుంది. పౌరుల జీవన ప్రమాణ స్థాయి పెరగడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ విధమైన  శాస్త్రీయ పద్దతుల ద్వారా దూరదృష్టితో ఇటువంటి చర్యలు చేపట్టడం వల్ల ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను, నిర్ణీత వ్యవధిలో సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం సంకల్పించినట్లు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలవడానికి మార్గం ఏర్పడుతుంది.

జారీ చేసినవారు :  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.



రిటైల్ రంగాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం


v రూ.5,142 కోట్ల పెట్టుబడులు, 25 వేల ఉద్యోగ అవకాశాలు
v ఏపీ రిటైల్ పాలసీ 2015 – 2020
v ఇటువంటి పాలసీని రూపొందించిన మొదటి రాష్ట్రం
v మలేషియా ‘పెమండు’తో ఒప్పందం

          పెట్టుబడులను ఆకర్షించడంలో, ఉద్యోగ అవకాశాల కల్పనలో రిటైల్ రంగం కీలకం కానుంది. రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఈ రంగం ప్రధాన భూమిక పోషించనుంది. ప్రధాన ఆర్థిక వృద్ధి కారకాలలో ఇది కూడా ఒకటిగా ప్రభుత్వం గుర్తించింది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలోపెట్టుకొని  రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రిటైల్ పాలసీ 2015-2020 ని రూపొందించింది. దేశంలో ఇటువంటి పాలసీని రూపొందించిన మొదటి రాష్ట్రం ఏపీ. ప్రస్తుతం దేశంలో ఉన్న రిటైల్ మార్కెట్ 2020 నాటికి రెండింతలవుతుందని అంచనా. అందులో ఏపీ పాత్ర కీలకంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే వ్యాపార అనుకూల విధానాలు, కల్పించే సౌకర్యాల వల్ల 2021 నాటికి రాష్ట్రంలో కనీసం రూ.5,142 కోట్ల పెట్టుబడులు, 25 వేల ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. రిటైల్ రంగానికి సంబంధించి ఉత్పత్తులు స్వయం సహాయక గ్రూపులు, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఇ) నుంచి సరఫరా అవుతాయి. ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కిరాణా షాపులు వంటి వాటిలో పెట్టుబడులు పెడతారు.

‘పెమండు’తో ఒప్పందం
ఈ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న మలేషియాలోని పెమండు (ఫర్మామెన్స్ మేనేజ్ మెంట్ అండ్ డెలీవరీ యూనిట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ మలేషియా) విధానాలను రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు పెమండుతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం(ఎంఓయు) కూడా కుదుర్చుకుంది. స్థిరమైన అభివృద్ధికి ఉపయోగడే ప్రభుత్వం గుర్తించిన అత్యంత ప్రాధాన్యత కలిగిన కీలక రంగాలలో పెమండు సహాయపడుతుంది. ఈ ఒప్పందంలో భాగంగా మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వ, పెమండు బృందాలు విద్య, రిటైల్ రంగాలపై అద్యయనాలు, పరిశోధనలు మొదలుపెట్టాయి. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఈ బృందాలు అధ్యయనం చేశాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పర్యటించి, ప్రభుత్వ ఉన్నతాధికారులు మొదలుకొని వివిధ శాఖల అధికారులను, సిబ్బందిని, కార్మిక శాఖ, పరిశ్రమలు, వాణిజ్య, మునిసిపల్ శాఖల అధికారులను కలిశారు. రిటైల్ రంగానికి సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, సమస్యలు, సమస్యలకు మూల కారణాలను సమగ్రంగా అధ్యయనం చేశాయి.
రాష్ట్ర రిటైల్ రంగం ప్రధానంగా ఎదుక్కొనే సమస్యలను పెమండు గుర్తించింది. నగరాలు, పట్టణాలు ప్రణాళికాబద్దంగా ఏర్పాటు కానందున రిటైల్ జోన్స్ ఏర్పాటు చేయడానికి తగినంత స్థలం లేదు. ఈ రంగానికి అనుకూలమైన మౌలిక సదుపాయాలు లేవు. ప్రస్తుతం ఉన్న రిటైల్ జోన్స్ అసంఘటితంగా, అక్కడక్కడ ఉన్నాయి. వాటికి సమీపంలో వాహనాల పార్కింగ్ కు స్థలాలు లేవు. దానికితోడు గిడ్డంగులు కూడా అందుబాటులో లేవు. ప్రైవేటు వ్యాపారులను, పెట్టుబడులను ఆకర్షించేవిధంగా ప్రభుత్వ చట్టాలు, నిబంధనలు లేవు.  రిటైల్ వ్యాపారులు లైసెన్సులు పొందే విధానాలు వారికి అనుకూలంగా లేవు. పెట్టుబడులు సమకూర్చుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు.
         పెమండు బృందం సమస్యలకు పరిష్కారాలు కనుగొని, అభివృద్ధికి మార్గాలు, కొత్తకొత్త ఆలోచనలతో ఈ రంగంలో ఆశించిన ఫలితాలు సాధించడానికి ఆచరణాత్మకమైన కార్యక్రమాలను రూపొందించింది. దిగువ స్థాయి నుంచి ప్రతి దశలో ఆచరణకు అవకాశం ఉన్న వ్యూహాత్మక ప్రణాళికలను రచించింది. మొత్తం రిటైల్ రంగం అభివృద్ధి ప్రక్రియలో ప్రధానంగా 3 దశలు ఉంటాయి. వీటిని వివరించడానికి పెమండు బృందం వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ షాపు కూడా నిర్వహించింది. రాష్ట్రంలో రిటైల్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందడానికి, భారీ స్థాయిలో శీఘ్ర ఫలితాలను ఇచ్చే అంశాలను గుర్తించింది. ఆచరణలో ఉత్తమ ఫలితాలు పొందడానికి పెమండు బిగ్ ఫాస్ట్ రిజల్ట్స్(బీఎఫ్ఆర్) విధాన్ని ఉపయోగిస్తోంది. ఈ విధానంలో 8 దశలు ఉన్నాయి. రిటైల్ రంగానికి కావలసిన నిధులను అంచనా వేసి, వాటిని సమకూర్చుకునే విధానాలను రూపొందించింది.

ప్రధాన  సిఫారసులు
1.ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ ఫెసిలిటేషన్ సెంటర్ (ఏపీఎంఎఫ్ సీ) ఏర్పాటు
2. జిల్లా సేకరణ కేంద్రం (డీసీసీ) ఏర్పాటు
3. అత్యంత ప్రధానమైన నగరాలలో రిటైల్ పార్కుల ఏర్పాటు
4. ఎంపిక చేసిన మునిసిపాల్టీలలో సెమీ అర్బన్, గ్రామీణ రిటైల్ పార్కుల ఏర్పాటు
5. విధానపరమైన సంస్కరణల ద్వారా ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు సమకూర్చుకునే అవకాశం కల్పించాలి. వ్యాపారానికి అనుకూల పరిస్థితులు కల్పించాలి.
6.రిటైల్ వ్యాపారం రిజిస్ట్రేషన్ విధానాన్ని సరళీకరించాలి. (సింగిల్ డెస్క్ పాలసీ)
7.మండల్ నోడల్ స్టోర్స్(ఎంఎన్ఎస్) ఏర్పాటు చేయాలి.
8. కిరాణా షాపులలో సౌకర్యాలు మెరుగుపరుచుకునే అవకాశం కల్పించాలి.
రిటైల్ రంగాన్ని అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. సింగిల్ డెస్క్ విధానం ద్వారా లైసెన్స్ పొందడం సులభతరం చేసింది. చిన్న వ్యాపారులకు రుణాలు పొందే అవకాశం కల్పించింది. మిగిలిన  సిఫారసులను కూడా అమలు చేసి రిటైల్ రంగంలో పెట్టుబడులు రావడానికి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

జారీ చేసినవారు :  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.


4 కోట్లు దాటిన స్మార్ట్ పల్స్ సర్వే

·       కోటి 27 లక్షలకు పైగా కుటుంబాలను కలసిన ఎన్యూమరేటర్లు
·       దేశంలో ఇటువంటి సర్వే చేస్తున్న మొదటి రాష్ట్రం
·       ప్రతి ఒక్కరి వేలి ముద్ర సేకరణ 

         రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాసాధికార సర్వే-2016(స్మార్ట్ పల్స్ సర్వే) లో నాలుగు కోట్ల మంది సర్వే పూర్తి అయింది. ఈ ఏడాది జూలై 8న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచే ఈ సర్వేను ప్రారంభించారు.  రాష్ట్రంలో 5.23 కోట్ల మంది జనాభా ఉండగా, నవంబర్ 1వ తేదీ మంగళవారానికి 4 కోట్ల మందికి పైగా వివరాలు సేకరించారు. ఈ-ప్రగతిలో భాగంగా ప్రభుత్వం ప్రజల ఆర్థిక, సామాజిక స్థితుల సమగ్ర సమాచారం సేకరిస్తోంది. అలాగే అర్హులకు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ సర్వే ద్వారా సేకరించి, క్రోడీకరించిన సమాచారం నిజమైన బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ఉపయోగపడుతుందన్నది ప్రభుత్వ అభిప్రాయం. రియల్ టైమ్ గవర్నెన్స్ కు కూడా  ఇది దోహదపడుతుంది.  దాదాపు 30 వేల మంది ఎన్యూమరేటర్లు ఈ సర్వే నిర్వహిస్తున్నారు.  ప్రభుత్వంలోని 17 శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు. పది సంవత్సరాలకు ఒకసారి చేపట్టే జనాభా లెక్కల మాదిరిగా కాకుండా, ఈ సర్వే అంతకు మించి ప్రతి పౌరుని వాస్తవ పరిస్థితులకు అద్దంపట్టేలా వివరాలు సేకరిస్తున్నారు.  ఎన్యూమరేటర్లు ఎప్పటికప్పుడు సర్వే వెబ్ సైట్ లో లాగిన్ అయి, డేటాను ఎంటర్ చేస్తున్నారు. ఈ సర్వేలో ప్రతి వ్యక్తిని 32 రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. వాటిలో 12 ప్రశ్నలకు ఆధారాలతో సహా జవాబులు చెప్పాలి. కుటుంబ యజమాని, ఇంటి పరిస్థితి, స్థిర,చరాస్తులు, కుటుంబ సభ్యులు, విద్య, ఉపాధి, రేషన్ కార్డు, పింఛన్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాల ద్వారా ఆ కుటుంబం పొందే లబ్ది..మొదలైన వివరాలన్నింటినీ సేకరిస్తున్నారు. ఇవేకాకుండా ఇంటిలోని మౌలిక సదుపాయాలు, గదులు, త్రాగునీరు, విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆండ్రాయిడ్ ఫోన్, అప్పులు, వంటకు వాడే ఇంధనం, సొంత భూమి, ఇల్లు, వాహన వివరాలు, పిల్లల చదువులు, వారి ఉపాధి... వంటి సమాచారం కూడా నమోదు చేస్తున్నారు. సర్వేలో తొలుత కుటుంబ పెద్ద లేక అందుబాటులో ఉన్న వారి వేలిముద్ర మాత్రమే సేకరించారు. ఆ తరువాత ప్రతి వ్యక్తి వేలి ముద్ర సేకరిస్తున్నారు. గతంలో సర్వే చేసిన కుటుంబాలలోని ప్రతి వ్యక్తి వేలి ముద్రను ఆన్ లైన్ లోకి ఎక్కిస్తున్నారు. దాంతో అనుకున్న సమయానికంటే కొంత ఆలస్యం అవుతోంది. ఆధార్ వివరాలను ప్రతి వ్యక్తి మొబైల్ నెంబర్ తో అనుసంధానం చేస్తున్నారు.  ఇప్పటికే జారీ చేసిన ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే వీరు సరిచేస్తారు. ఆధార్ రికార్డులలో నమోదై, ఆ తరువాత చనిపోయినవారి పేర్లను తొలగిస్తున్నారు. ఈ సర్వే సమాచారం మొత్తాన్ని జియోట్యాగ్ చేస్తున్నారు.
సర్వే ప్రారంభంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. సాఫ్ట్ వేర్ వెర్షన్స్ లో మార్పులు చేయవలసి వచ్చింది.  అయితే ఇప్పుడు వాటిని  అధిగమించారు. కొంతమంది సిబ్బంది పుష్కరాలు, కరువు సహాయక చర్యలలో పాల్గొన్నందున కొన్ని జిల్లాలలో సర్వే పనులలో కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం అన్ని జిల్లాలలో సిబ్బంది చురుకుగా, వేగంగా సర్వే నిర్వహిస్తున్నారు.

  సీఎం డ్యాష్ బోర్డులో నమోదైన ప్రకారం జూలై 8వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ మంగళవారం రాత్రి 7.05 గంటల వరకు ఎన్యూమరేటర్లు 1,27,08,985 కుటుంబాలను కలసి, 4,00,00,173 మందిని సర్వే చేశారు. 5 నెలలలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తిగతంగా ఇంతమందికి చెందిన సామాజిక, ఆర్థిక అంశాల సమగ్ర సమాచారాన్ని సేకరించడం ఓ గొప్ప విజయం. సర్వే వివరాలలో కచ్చితత్వం ఉండేలా అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా వ్యవహరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఈ సర్వేను సమీక్షిస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారు.

దేశంలో మొదటి రాష్ట్రం
దేశంలో వ్యక్తిగతంగా ఇటువంటి సమగ్ర సర్వే చేస్తున్న మొదటి రాష్ట్రం ఏపీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. సీఎన్ బీసీ-టీవీ 18 సిస్కో డిజిటలైజింగ్ ఇండియా అవార్డును కూడా ఏపీ దక్కించుకుంది.               పరిపాలనలో సాంకేతికతను అత్యంత సమర్థవంతంగా జోడించిన ఘనత ఏపీదే. అందువల్లనే ఈ సర్వే ఇంత త్వరితగతిన పూర్తి అవుతోంది. ఈపాస్‌, పింఛన్ల పంపిణీ, భూగర్భ జలాల కొలత, ఆధార్‌ అనుసంధానం, రైతులు, డ్వాక్రా సంఘాల ఖాతాలను ఆన్‌లైన్‌ చేయటం, ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ వంటి చర్యలతో ఐటీ వినియోగంలో ఏపీ ముందంజలో ఉంది. ఈ-ప్రగతిలో భాగంగానే ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతుల సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం ఈ సర్వే ద్వారా సేకరిస్తోంది. పారదర్శక పాలన అందించడానికి,  సంక్షేమ పథకాలు అర్హులకు సక్రమంగా అందడానికి, మరిన్ని ప్రజా ప్రయోజనకర పథకాలు ప్రవేశపెట్టాడానికి వీలుగా సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఈ సర్వేను చేపట్టారు.  ఈ సర్వే ద్వారా సేకరించే సమగ్ర సమాచారం  ప్రజలకు, ప్రభుత్వానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 


జారీ చేసినవారు : సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

వాణిజ్య పన్నుల ఆదాయం రూ.8283.94 కోట్లు

 §  7 నెలల వివరాలు విడుదల
§  పెట్రో ఉత్పత్తుల నుంచి అత్యధిక ఆదాయం రూ.5110.68 కోట్లు
§  అత్యధికంగా విజయవాడ-II డివిజన్ నుంచి రూ.2666.26 కోట్లు
§  అత్యల్పంగా విజయనగరం డివిజన్ నుంచి రూ. 189.47 కోట్లు
§  అక్టోబర్ లో 24,77,174 వేబిల్లులు ఆన్ లైన్ లో జారీ
§  విస్తరిస్తున్న ఆన్ లైన్ కార్యకలాపాలు
           రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు 7 నెలలో వాణిజ్య పన్నుల ఆదాయం రూ. 8283.94 కోట్లు సమకూరింది. రాష్ట్రంలో ఆదాయపన్ను డివిజన్లు మొత్తం 13  ఉన్నాయి. ఆదాయంలో నాలుగు అంకెలతో మొదటి రెండు స్థానాలలో విజయవాడ-2, విశాఖపట్నం డివిజన్లు ఉన్నాయి. విజయవాడ-2 డివిజన్ నుంచి రూ.2666.26 కోట్లు రాగా, విశాఖపట్నం డివిజన్ నుంచి 1080.76 కోట్లు లభించింది. విజయవాడ-1 డివిజన్ నుంచి రూ.701.91 కోట్లు, చిత్తూరు నుంచి రూ. 587.86 కోట్లు, నెల్లూరు నుంచి రూ.550.88 కోట్లు, కాకినాడ నుంచి రూ. 587.12 కోట్లు, గుంటూరు నుంచి రూ.473.36 కోట్లు, అనంతపురం నుంచి రూ. 316 కోట్లు, ఏలూరు నుంచి రూ. 294.99 కోట్లు, నరసరావుపేట నుంచి రూ. 293.94 కోట్లు, కర్నూలు నుంచి 303.76 కోట్లు, కడప నుంచి రూ. 224.47 కోట్లు, విజయనగరం నుంచి 189.47 కోట్లు ఆదాయం అభించింది.  సర్కిళ్ల వారీగా చూస్తే అత్యధికంగా ఎల్ టీయు విజయవాడ-2 సర్కిల్ నుంచి రూ. 1715.34 కోట్లు వసూలు కాగా, అత్యల్పంగా వినుకొండ సర్కిల్ నుంచి రూ.5.32 కోట్లు వసూలైంది.
పెట్రో ఉత్పత్తుల నుంచి అత్యధిక ఆదాయం
ఉత్పత్తులవారీగా చూస్తే పెట్రో ఉత్పత్తులకు సంబంధించి అత్యధికంగా రూ.5110.68 కోట్లు వచ్చింది. ఆ తరువాత మద్యం ఉత్పత్తుల నుంచి రూ.4888.17 కోట్లు, సిగరెట్ ఉత్పత్తుల నుంచి రూ.407.32 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది అక్టోబర్ వరకు 1,84,756 సంస్థలు రిజిస్టర్ అయ్యాయి. రాష్ట్రంలో ఆధార్ నెంబర్ కలిగి ఉన్న డీలర్లు 1,81,816 మంది ఉన్నారు.
అక్టోబర్ నెల వివరాలు
ఇదిలా ఉండగా, ప్రభుత్వంలోని అన్ని శాఖలలో మాదిరిగానే వాణిజ్య పన్నుల శాఖలో కూడా ఆన్ లైన్ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి.  ఈ శాఖలో లావాదేవీలు చాలా వరకు ఆన్ లైన్ లోనే జరిగిపోతున్నాయి. అక్టోబరు నెలలో ఆన్ లైన్ లో వ్యాట్(వీఏటీ) రిటర్న్ దాఖలు చేసినవారు 1,57,158 మంది, సీఎస్టీ రిటర్న్ దాఖలు చేసిన వారు 95,559 మంది ఉన్నారు. ఆన్ లైన్ లో 59,821 చెల్లింపులు జరిగాయి. 30,058 చెల్లింపులు మాన్యువల్ గా జరిగాయి. అక్టోబర్ లో 24,77,174 వేబిల్లులు ఆన్ లైన్ లో జారీ చేశారు.

జారీ చేసినవారు :  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.


రాష్ట్రంలో రూ.41,265 కోట్ల రుణాలు మంజూరు

§  తొలి త్రైమాసికంలో రుణప్రణాళిక లక్ష్యం 25 శాతం పూర్తి
§  అనంతపురం జిల్లాలో 34 శాతం
§  తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలలో అత్యధిక రుణాలు
§  పంట రుణాలు రూ. 21,062 కోట్లు మంజూరు
§  సంతృప్తికరంగా  బకాయిల వసూలు
          రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన రుణ ప్రణాళికలో మొదటి త్రైమాసికంలో రూ.41,265 కోట్ల రుణాలు మంజూరు చేశారు. 25 శాతం లక్ష్యం పూర్తి అయింది. రాష్ట్రంలో అన్ని విధాలా అత్యంత వెనుకబడిన ప్రాంతమైన అనంతపురం జిల్లాలో రూ. 3949 కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఈ జిల్లాలో 34 శాతం లక్ష్యం పూర్తి చేశారు.  విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి 94వ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో రూ.1,65,538 కోట్ల రూపాయలతో 2016-17 రుణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రం ఆర్థిక వృద్ధి పెరుగుదలకు ఉపయోగపడే  ప్రాధమికమైన వ్యవసాయ రంగంతోపాటు, దాని అనుబంధ రంగాలకు, స్వయంసహాయ గ్రూపులకు చెందిన మహిళలకు, సూక్ష,చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణాలు ఇవ్వడానికి ఈ ప్రణాళికను రూపొందించారు. రాష్ట్రంలో ఈ రుణ ప్రణాళికను నాబార్డ్ (జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్) అనుబంధ సంస్థ అయిన నాబ్ కాన్స్ (నాబార్డ్ కన్సల్ టెన్సీ సర్వీస్) సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలోపెట్టుకొని బ్యాంకుల సహకారంతో  రుణప్రణాళికను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.
లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్స్(ఎల్ డీఎంలు) పంపిన సమాచారం అధారంగా రూపొందించిన తొలి త్రైమాసిక (ఏప్రిల్, మే,జూన్) వివరాలను రాష్ట్ర ప్రణాళికా శాఖ విడుదల చేసింది. అత్యధికంగా రూ. 5,178 కోట్ల రుణాలు (27 శాతం) ఇచ్చిన తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో, రూ. 4,855 కోట్ల రూణాలు (28 శాతం) ఇచ్చిన కృష్ణా జిల్లా రెండవ స్థానంలో నిలిచాయి. చిత్తూరు జిల్లాలో రూ. 3,275 కోట్లు (28 శాతం), విశాఖపట్నం జిల్లాలో రూ. 3,921 కోట్లు (28 శాతం), కర్నూలు జిల్లాలో రూ. 2,680 కోట్లు (26 శాతం), నెల్లూరు జిల్లాలో రూ. 2,744 కోట్లు (25 శాతం), కడప జిల్లాలో రూ. 2,072 కోట్లు (24 శాతం), ప్రకాశం జిల్లాలో రూ. 2,756 కోట్లు ( 24 శాతం), విజయనగరం జిల్లాలో రూ. 1,016 కోట్లు (22 శాతం), పశ్చిమగోదావరి జిల్లాలో రూ. 3,866 కోట్లు (21 శాతం), శ్రీకాకుళం జిల్లాలో రూ. 1,049 కోట్లు (19 శాతం), గుంటూరు జిల్లాలో రూ. 3,903 కోట్లు (18 శాతం) రుణాలు మంజూరు చేశారు. మూడు నెలల కాలంలో 7 జిల్లాలలో 25 శాతానికి మించి రుణాలు మంజూరు చేశారు.

పంట రుణాలు రూ. 21,062 కోట్లు

      రుణ ప్రణాళికను విభాగాల వారీగా పరిశీలిస్తే, ఈ ఏడాది పంట రుణాల లక్ష్యం రూ. 60,000 కోట్లు కాగా, మొదటి మూడు నెలలలోనే రూ. 21,062 కోట్లు మంజూరు చేసి, 35 శాతం లక్ష్యం పూర్తి చేశారు. వ్యవసాయానికి సంబంధించి కాలపరిమితి రుణాలు రూ. 965 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలలో రూ. 1,209 కోట్లు రుణాలు మంజూరు చేశారు. , సూక్ష,చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ ఎంఇ)కు రూ. 4225 కోట్లు మంజూరు చేశారు.
        ఈ రుణాలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలతోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు  పెట్టుబడులు సమకూరుస్తాయి. అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు మెరుగుపడటానికి, ఆర్థిక వృద్ధికి ఉపయోగపడతాయి.

సంతృప్తికరంగా  బకాయిల వసూలు
     ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రుణ బకాయిల వసూలు సంతృప్తికరంగా ఉంది.  మంజూరు చేసిన రుణ మొత్తానికి మించి బకాయిలు వసూలయ్యాయి. రూ. 41,265 కోట్ల రుణాలు ఇవ్వగా, రూ. 50,246 కోట్లు బకాయిలు వసూలయ్యాయి. స్వల్పకాలిక రుణాలు రూ. 20,753 కోట్లు, కాలపరిమితి వ్యవసాయ రుణాలు రూ. 2,033 కోట్లు వసూలయ్యాయి. వ్యవసాయ అనుబంధ రంగాలలో రూ.7,146 కోట్లు, , సూక్ష,చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి రూ.6,810 కోట్లు వసూలయ్యాయి. ఈ రకమైన రుణ బకాయిల వసూలు ఆశాజనకమైన పరిణామంగా భావిస్తున్నారు.

జారీ చేసినవారు :  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.