Nov 16, 2016

అమరావతికి తరలివస్తున్న విద్యా సంస్థలు

v సచివాలయం తరువాత విశ్వవిద్యాలయాలతోనే నగర నిర్మాణం మొదలు
v అమరావతి విద్యానగరానికి పునాది
v 2017లో అడ్మిషన్లకు ‘విట్’ నోటిఫికేషన్ విడుదల
v ఫలితాలనిస్తున్న ప్రభుత్వ నిబంధనలు
v ఆరు పాఠశాలల నిర్మాణానికి సీఆర్ డీఏ టెండర్లు

         నూతన రాజధాని అమరావతిని వచ్చే అయిదేళ్లలో ప్రపంచ స్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగునంగా ప్రముఖ విద్యా సంస్థలు చొరవ చూపుతున్నాయి. తాత్కాలిక సచివాలయం నిర్మాణం  తరువాత  ఇక్కడ విద్యా నగరానికే పునాది పడింది. ప్రభుత్వంతోపాటు  ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. భూ కేటాయింపులు, వెంటనే నిర్మాణాలు చేపట్టి, 2017కి అడ్మిషన్లు జరగాలన్న ప్రభుత్వ నిబంధనలు కూడా ఇందుకు ఒక కారణంగా భావించవచ్చు. అమరావతిలో మొట్టమొదటి విద్యా సంస్థకు ఈ నెల 3 శంకుస్థాపన జరిగింది. ఐనవోలు గ్రామంలో తమిళనాడుకు చెందిన  ప్రతిష్టాత్మకమైన వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రం మంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. ఈ విశ్వవిద్యాలయం కోసం ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించింది. తొలిదశలో 100 ఎకరాల్లో  నిర్మాణం చేపట్టారు. ఇక్కడ విశ్వవిద్యాలయంతోపాటు ఒక మెడికల్ కాలేజీని కూడా ప్రారంభిస్తారు. అమరావతిలో నిర్మించే ప్రాంగణంలో 2017 బీటెక్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఇక్కడ 8 రకాల కోర్సులను ఆఫర్ చేస్తోంది.  మెకానికల్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్(సీఎస్ఈ), సీఎస్ఈ (డేటా ఎనలిస్టిక్స్), సీఎస్ఇ (నెట్ వర్క్ అండ్ సెక్యూరిటీ), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తోపాటు సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, పీహెచ్ డీ కోర్సులు ఉంటాయి.


భవిష్యత్ లో ఈ విశ్వవిద్యాలయంలో ప్రతి ఏటా 32 వేల మంది వరకు సాంకేతి విద్యను అభ్యసించే అవకాశం ఉంది. ఈ శంకుస్థాపనతో  మరిన్ని విద్యా సంస్థలు నిర్మాణాలు మొదలుపెట్టనున్నాయి. విద్యా సంస్థలన్నింటిని ఐనవోలు, నీరుకొండ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అక్కడే భూములను కేటాయిస్తోంది.  

ఆరు పాఠశాలల నిర్మాణానికి సీఆర్ డీఏ టెండర్లు

         రాజధానిలో 160కి పైగా ప్రాథమిక పాఠశాలలు, వందకు పైగా ఉన్నత పాఠశాలలు, 27 జూనియర్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యా సంస్థలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, వృత్తి విద్యా సంస్థలు మూడేసి చొప్పున ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన. 25 నుంచి 30 వరకు పాలిటెక్నిక్ ఇన్ స్టిట్యూషన్స్ నెలకొల్పాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అమరావతిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆరు పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు సీఆర్ డీఏ ఈ నెల 11న టెండర్లను కూడా  ఆహ్వానించింది.

        తమిళనాడు రాజధాని చెన్నైలోని ఎఫ్ఆర్ఎం విశ్వవిద్యాలయం అమరావతిలో తమ ప్రాంగణం శంకుస్థాపనకు సన్మాహాలు చేస్తోంది. ఐనవోలు గ్రామంలోనే ప్రభుత్వం తమకు కేటాయించిన స్థలాన్ని ఈ నెల 10న  ఆ విశ్వవిద్యాలయం ప్రతినిధులు పరిశీలించారు. తొలి దశలో ఈ విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం వంద ఎకరాల స్థలం కేటాయించింది. తరువాత మరో వంద ఎకరాలు కేటాయించే అవకావం ఉంది. వచ్చే విద్యా సంవత్సరం(2017-18) నుంచే ఇక్కడ తరగతులు ప్రారంభించాలని ఎంఓయులో ప్రభుత్వం పేర్కొంది. దాంతో నిర్మాణాలు చేపట్టడానికి ఆ సంస్థ ప్రతినిధులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 24 లేక 25 తేదీలలో ఇక్కడ శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. వచ్చే నెల ఏప్రిల్ నాటికి కొన్ని భవనాల నిర్మాణం  పూర్తి చేసి, తరగతులు ప్రారంభించాలన్న ఉద్దేశంతో వారు ఉన్నారు. ఈ విశ్వవిద్యాలయంలో తొలి దశలో 17 వేల మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుంది.

ప్రపంచస్థాయి వైద్య విద్యాలయం

               ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మెగా వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మాతా అమృతానందమయి ట్రస్ట్ ఆధ్వర్యంలోని అమృత యూనివర్సిటీ ముందుకొచ్చింది. యూనివర్సిటీ ప్రతినిధులు గత ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు.  సంబంధిత ప్రాజెక్టు నివేదికను కూడా  వారు అందజేశారు. రూ.2,500 కోట్ల అంచనాతో విశ్వవిద్యాలయంతోపాటు 2,250 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నెలకొల్పుతారు. ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రీసెర్చ్-హెల్త్   కేర్ క్యాంపస్‌ను సైతం ఏర్పాటు చేస్తారు. తొలి దశ మొదటి ఏడేళ్లలో 18 వేల మంది విద్యార్థులకు, రెండో దశ పూర్తి అయ్యేసరికి 47 వేల మందికి అవకాశం ఉంటుంది. ఈ విశ్వవిద్యాలయానికి తొలి దశలో 150 ఎకరాలు, రెండవ దశలో 50 ఎకరాలు ఇవ్వాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఇంకా పలు ప్రఖ్యాత విద్యా సంస్థలకు స్థలాలు కేటాయించే అవకాశం ఉంది.

          అమరావతిలో ప్రతిష్టాత్మకమైన ఫిక్కీ (ఎఫ్ఐసీసీఐ - ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ చాంబ‌ర్స్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ - భారతీయ పరిశ్రమలు, వాణిజ్య సమాఖ్య) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పై ఈ నెల 10న ఢిల్లీలో ఆ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. లండన్ లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ ప్రాంగణం కూడా ఇక్కడ నిర్మించే అవకాశం ఉంది. ఈ విషయమై ఆ విశ్వవిద్యాలయం ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు కూడా జరిపింది.   అమరావతిలో స్థలం ఇస్తే గీతం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ఆ విశ్వవిద్యాలయం ప్రో వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎన్.శివప్రసాద్ చెప్పారు. విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరులలో గీతం విశ్వవిద్యాలయ ప్రాంగణాలు ఉన్నాయి. దేశవిదేశాలకు చెందిన  ఉత్తమ విశ్వవిద్యాలయాలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దేశంలో టాప్ 20, ప్రపంచంలో టాప్ 20 విశ్వవిద్యాలయాలను ఏపీకి తీసుకురావల్లన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం. ఆ మేరకు ఇప్పటికే దేశవిదేశాలలోని పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకోవడం, భూములు కేటాయించడం జరిగిపోయాయి. నిర్మాణ పనులు కూడా ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. ఇండో-యూకే ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్ కు మొదటి దశలో 50,  రెండు దశలో 100 కలిపి మొత్తం 150 ఎకరాలు కేటాయించనున్నారు.  నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్(ఎన్ఐడీ)కి 50 ఎకరాలు, సెంట్రల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్ (సీఐటీడీ)కి ఐదు ఎకరాలు, ఆంధ్రప్రదేశ మానవ వనరుల అభివృద్ధి సంస్థకు 25 ఎకరాలు కేటాయించేందుకు సీఆర్‌డీఏ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఐదేళ్లలో అమరావతి ఒక ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా మారడం ఖాయమని భావిస్తున్నారు.
  
జారీ చేసినవారు:
రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగం,
  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.


సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలపై ప్రభుత్వం దృష్టి

Ø ఎంఎస్ఎంఇ పాలసీ 2015 -2020
Ø సబ్సిడీలు, రాయితీలు, రీయింబర్స్ మెంట్స్ తో భారీగా ప్రోత్సాహకాలు
Ø పారిశ్రామిక పార్కులలో 15 శాతం భూమి కేటాయింపు

             స్థానిక వనరులు, ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ-మైక్రో,స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్)ను ప్రోత్సహిస్తోంది.  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సాధించడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే చిన్నతరహా పరిశ్రమలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీటి కోసం ఈ ఏడాది బడ్జెట్ లో 25 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ రంగంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువమందికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంది. అంతే కాకుండా వెనుకబడిన ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో యూనిట్లు నెలకొల్పడం ద్వారా ప్రాంతీయ అసమానతలు తొలగించడానికి వీలవుతుంది. ఉత్పత్తి, ఉపాధి విషయంలో  ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఖాదీ, వ్యవసాయాధారిత వంటి చిన్నచిన్న పరిశ్రమలను అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించడానికి వీలవుతుంది. యూనిట్ల స్థాపనకు నిరుద్యోగ యువతకు బ్యాంకుల నుంచి రుణం పొందడానికి, ఉత్పత్తి అయిన వస్తువుల మార్కెటింగ్ కు పరిశ్రమల శాఖ సహాయ సహకారాలు అందిస్తుంది. అంతేకాకుండా మూతపడిన పారిశ్రామిక యూనిట్లను పునరుద్దించడానికి చేయూతనందిస్తుంది.  ఉత్పత్తి అయిన వస్తువుల సరఫరా, చెల్లింపుల విషయంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలతో ఏవైనా సమస్యలు తలెత్తితే పారిశ్రామిక వసతుల కల్పన మండలి(ఐఎఫ్సీ-ఇండస్ట్రియల్ ఫెసిలిటేషన్ కౌన్సిల్) ద్వారా పరిష్కరించడానికి కృషి చేస్తుంది.
          ప్రభుత్వం రెండంకెల స్థిర అభివృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో ఉత్పత్తి, ఉపాధికి ఎక్కువ  అవకాశాలున్న ఈ రంగంలో గత ఏడాదికంటే ఈ ఏడాది 30 శాతం ఎక్కువగా బ్యాంకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరం(2015-16)లో రాష్ట్రంలో సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ఆధారపడిన 3,76,634 మందికి రూ.16,960 కోట్లు బ్యాంకులు రుణాలుగా ఇచ్చాయి. ఈ ఏడాది రూ. 22 వేల కోట్ల రూపాయలు రుణాలుగా ఇవ్వాలని నాబార్డ్ (వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంకు), రాష్ట్రస్థాయి బ్యాంకింగ్ కమిటీలు నిర్ధేశించాయి.

ఎంఎస్ఎంఇ పాలసీ 2015 -2020
      ఈ రంగం ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వం ఎంఎస్ఎంఇ పాలసీ 2015 -2020ని రూపొందించింది. ఈ పాలసీ ద్వారా ఈ రంగానికి ప్రభుత్వం అనేక సబ్సిడీలు, రీయింబర్స్ మెంట్స్, రాయితీలు ప్రకటించింది. ఈ రంగంలో పరిశ్రమను నెలకొల్పితే రూ.20 లక్షలకు మించకుండా 15 శాతం పెట్టుబడి సబ్సిడీ ఇస్తారు. ఉత్పత్తి ప్రారంభమైన తరువాత 5 సంవత్సరాల వరకు వ్యాట్, సీఎస్టీ, ఎస్జీఎస్టీ తిరిగి చెల్లిస్తారు. వడ్డీ సబ్సిడీ రీయింబర్స్ చేస్తారు.  నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తారు. విద్యుత్ ఛార్జీలు రీయింబర్స్ చేస్తారు. పరిశ్రమకు ఉపయోగించడం కోసం కొనుగోలు చేసే స్థలం, షెడ్, భవనంపై స్టాంప్, బదిలీ డ్యూటీ వంద శాతం రీయింబర్స్ చేస్తారు. నిబంధనలకు అనుగుణంగా యూనిట్ స్థాపన కోసం భూమి కొనుగోలు చేస్తే రూ.10 లక్షలకు మించకుండా 25 శాతం వరకు రీయింబర్స్ చేస్తారు. బీసీ, ఎస్సీ,ఎస్టీలకైతే రూ.20 లక్షలు మించకుండా 50 శాతం వరకు రీయింబర్స్ చేస్తారు. వ్యవసాయ భూమిని పారిశ్రామిక ఉపయోగాల కోసం మార్పు చేసే చార్జీలలో రూ.10 లక్షల లోపు 25 శాతం వరకు రీయింబర్స్ చేస్తారు. పేటెంట్ రిజిస్ట్రేషన్ కోసం చేసే ఖర్చులు రీయింబర్స్ చేస్తారు. ఉద్యోగులు లేక కార్మికుల వృత్తి నైపుణ్యానికి సంబంధించి శిక్షణకు అయ్యే ఖర్చులను కూడా రీయింబర్స్ చేస్తారు. ఐఎస్ఓ-9000, బీఐఎస్ నాణ్యత ప్రమాణాల ధృవీకరణ పత్రం కోసం రూ.50 వేల వరకు సమకూరుస్తారు. ఉత్పత్తుల నాణ్యత విషయంలో బహుళజాతి కంపెనీలతో పోటీపడాలనేది దీని ముఖ్య ఉద్దేశం. ఉత్పత్తిలో ఎంఎస్ఎంఇ ఇతర రంగాలతో పోటీపడేవిధంగా టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడానికి, ఆధునీకరించడానికి ఒక్కో యూనిట్ కు రూ.2.50 లక్షల వరకు సమకూరుస్తారు. రాష్ట్రంలో ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) అభివృద్ధిపరిచే పారిశ్రామిక పార్కులలో ఎంఎస్ఎంఇ పరిశ్రమలకు 15 శాతం భూమిని రిజర్వు చేస్తారు. కొత్తగా ప్రారంభించే యూనిట్లకైతే మిషనరీ విలువలో పది శాతం ఆర్థిక సహాయం చేస్తారు. ఈ రంగంలో పరిశ్రమల సమస్యల పరిష్కారినికి ఒక డెస్క్ ను ఏర్పాటు చేశారు.

‘ఆంధ్రప్రదేశ్ రత్నాలు’ అవార్డులు
      ఈ రంగంలో ఉత్పాదక సామర్థ్యం, రక్షణ విధానాలు, నూతన పోకడలను గుర్తించి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ‘ఆంధ్రప్రదేశ్ రత్నాలు’ అనే అవార్డులను ప్రభుత్వం ఇస్తోంది. పారిశ్రామికవేత్తల మధ్య పోటీ తత్వాన్ని పెంపొందించడానికి ఈ అవార్డులు ఇస్తున్నారు.

జారీ చేసినవారు :  సమాచార పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం



10 లక్షల 19 వేల మంది రైతులకు వెబ్ ల్యాండ్ రుణాలు

  •    38 లక్షల 10 వేల ఎకరాలపై రూ.9,270 కోట్లు రుణాలు
  •    అత్యధిక రుణాలు పొందిన గుంటూరు, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాలు
  •    మొదటి స్థానంలో భీమవరం మండలం
  •    గత ఏడాది మొదటి 3 స్థానాల్లో వెనుకబడిన జిల్లాలే!
            రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 38,10,305 ఎకరాల వెబ్ ల్యాండ్ పై రూ.9,270 కోట్ల రుణాలు మంజూరు చేశారు. రికార్డుల డిజిటలైజేషన్ లో భాగంగా భూముల వివరాలన్నింటిని రెవెన్యూ శాఖవారు ఆన్ లైన్ లోకి ఎక్కిస్తున్నారు.  ఈ విధంగా ఆన్ లైన్ లో ఎక్కించిన భూములను వెబ్ ల్యాండ్ అంటారు. సర్వే ఇబ్బందులు, వంశపారంపర్య హక్కులకు సంబంధించి వివాదాలు ఉన్న భూములు తప్ప దాదాపు రాష్ట్రంలోని అన్ని భూముల వివరాలు ఆన్ లైన్ లోకి ఎక్కించారు. దీంతో అటు ప్రభుత్వానికి, ఇటు బ్యాంకులకు, ప్రజలకు వెసులుబాటు ఏర్పడింది.  రెవెన్యూ రికార్డులు డిజిటలైజేషన్ అయినందువల్ల రైతులు రుణాలు పొందడానికి ఎక్కువ ఇబ్బందులు పడవలసిన అవసరంలేదు.  వెబ్ ల్యాండ్ పై ఇచ్చిన రుణాల వివరాలను అన్ని బ్యాంకుల వారు ఏ రోజుకారోజు సీఎం డ్యాష్ బోర్డులో ఎక్కిస్తారు. ఏ జిల్లాలో ఏ బ్యాంకు ఎన్ని ఎకరాలపై ఎంత మంది రైతులకు, ఎంత రుణం ఇచ్చిందో పూర్తి వివరాలు అందులో పొందుపరుస్తారు. ఏ గ్రామంలో ఏ బ్యాంకు ఎంత మందికి, ఎంత రుణం ఇచ్చిందో అందరూ తెలుసుకునే అవకాశం ఉంది. పారదర్శకతకు ఇది ఓ పక్కా నిదర్శనం. 

మొదటి స్థానంలో గుంటూరు జిల్లా
         సీఎం డ్యాష్ బోర్డు ప్రకారం నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం వరకు రాష్ట్రంలోని 13 జిల్లాలలో 38,10,305 ఎకరాలపై 10,19,810 మంది రైతులకు  రూ. 9,270.89 కోట్లు రుణాలుగా ఇచ్చారు. అత్యధికంగా రుణాలు ఇచ్చిన జిల్లాలలో గుంటూరు, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాలు వరుసగా మూడు స్థానాలలో ఉన్నాయి. గుంటూరు జిల్లాలో రూ.1462.89 కోట్లు, కర్నూలు జిల్లాలో రూ.1163.95 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో రూ. 1161.07 కోట్లు రుణాలుగా ఇచ్చారు. రూ.160.33 కోట్ల రూణాలు పొంది విజయనగరం జిల్లా చివరి స్థానంలో ఉంది. మిగిలిన జిల్లాలను పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో రూ. 289.12 కోట్లు, విశాఖపట్నం జిల్లాలో రూ. 230.80 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో రూ.554.41 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.673.33 కోట్లు, ప్రకాశం జిల్లాలో రూ.684.13 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ.430.65 కోట్లు, చిత్తూరు జిల్లాలో రూ.728 కోట్లు, కడప జిల్లాలో రూ. 705.91 కోట్లు, అనంతపురం జిల్లాలో 1026.30 కోట్లు రుణాలుగా ఇచ్చారు.

అత్యధిక రుణాలు పొందిన భీమవరం మండలం
       రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అత్యధికంగా రుణాలు ఇచ్చిన మండలాలను పరిశీలిస్తే పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం రూ.191.55 కోట్ల రుణాలతో మొదటి స్థానంలో నిలిచింది. గుంటూరు జిల్లా గుంటూరు మండలంలో 115.76 కోట్లు, కర్నూలు జిల్లా ఆదోని మండలంలో రూ. 81.11 కోట్లు, అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో రూ. 67.29 కోట్లు, శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలంలో రూ.25.44 కోట్లు, విజయనగరం జిల్లా సాలూరు మండలంలో రూ. 22.55 కోట్లు, విశాఖపట్నం జిల్లా విశాఖ రూరల్ మండలంలో రూ. 24.97 కోట్లు రుణాలు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అర్బన్ మండలంలో రూ. 53.06 కోట్లు, కృష్ణా జిల్లా విజయవాడ అర్బన్ మండలంలో రూ. 64.72 కోట్లు, ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలో రూ. 44.28 కోట్లు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో రూ.47.05 కోట్లు, చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో రూ.34.41 కోట్లు, కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో రూ.55.26 కోట్లు రుణాలు ఇచ్చారు.

గత ఏడాది మొదటి 3 స్థానాల్లో వెనుకబడిన జిల్లాలే!
       ఇదిలా ఉండగా, గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో 17,75,722 మంది రైతులకు రూ.11,870.32 కోట్లు వెబ్ ల్యాండ్ రుణాలు ఇచ్చారు. గత ఏడాది మొదటి మూడు స్థానాలలో వెనుక బడిన జిల్లాలే ఉన్నాయి. రూ.2,412.64 కోట్ల రుణాలతో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో, రూ.1,468.46 కోట్లతో ప్రకాశం జిల్లా రెండవ స్థానంలో, రూ.1,404.59 కోట్లతో కర్నూలు జిల్లా మూడవ స్థానంలో ఉన్నాయి.

జారీ చేసినవారు :  సమాచార పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం


Nov 12, 2016

ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా

·       రాష్ట్రంలో 1,18,55,366 కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు
·       ఖాతా వాడుకలో ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం
·       2019 నాటికి వంద శాతం ఆధార్ తో అనుసంధానం
·       రాష్ట్ర వ్యాప్త అనుసంధానిత వ్యవస్థ
·       పీఎంజేడీవై పథకం కింద దేశంలో 25.45 కోట్లు, రాష్ట్రంలో 79,10,585 ఖాతాలు

         రాష్ట్రంలో 2019 నాటికి ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండి, అది వాడుకలో ఉండేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. చాలా కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉన్నా అందులో లావాదేవీలు జరగడంలేదు.  బ్యాంకు ఖాతా తెరవడమే కాకుండా, అది చలామణిలో ఉండాలని కూడా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ విజన్-2029లో ప్రభుత్వం పేర్కొంది. రుణాలు, పొదుపు, సబ్బిడీలు, జీవిత బీమా, ప్రమాద బీమా, స్కాలర్ షిప్స్, పెన్షన్, ప్రభుత్వ ఆర్థిక సాయం, రాయితీలు, రైతులకు పంట రుణాలు, డ్వాక్రా గ్రూపు రుణాలు, ఉపాధి హామీ పథకం కింద వేతనాలు, పేదలు ఇతర మార్గాలలో లబ్ధిపొందడానికి బ్యాంకు ఖాతాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలావరకు ఆర్థిక సాయాన్ని బ్యాంకు ఖాతాల ద్వారానే చెల్లిస్తోంది. అయితే బ్యాంకు ఖాతాలు లేక అనేక మంది లబ్దిపొందలేకపోతున్నారు. కొందరికి బ్యాంకు ఖాతాలున్నా వాడుకలోలేవు. అందువల్ల బ్యాంకు ఖాతా ద్వారా పొందే ప్రయోజనాలను ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పథకాలు, రాయితీలు పేదలకు, నిజమైన లబ్ధిదారులకు అందజేయడంలో బ్యాంకు ఖాతాల వల్ల పారదర్శకతకు తావుంటుంది. 2011 జన గణన ప్రకారం దేశంలో ఉన్న ప్రతి 5 కుటుంబాలలో మూడు కుటుంబాలకు  మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అంటే దేశంలో దాదాపు 40 శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు లేవు. బ్యాంకింగ్ వ్యవస్థకు వారు పూర్తిగా దూరంగా ఉన్నారు. దాంతో ప్రతి కుటుంబం బ్యాంకు ఖాతా కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం దేశంలో 2011-14 మధ్య బ్యాంకు ఖాతాలు 35 శాతం నుంచి 53 శాతానికి పెరిగాయి. ఈ మూడేళ్ల కాలంలో 17.5 కోట్ల మంది కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిచారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

   దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా లక్ష్యంగా కేంద్రప్రభుత్వం 2014 ఆగస్ట్ 28న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) పథకం ప్రారంభించింది. ఇది మంచి ఫలితాలనిచ్చింది. దేశం మొత్తంమీద అయిదు నెలల్లోనే ఈ పథకం కింద 11.5 కోట్ల మంది బ్యాంకు ఖాతాలను తెరిచారు. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కు ఎక్కింది. ఈ నెల 2వ తేదీ  వరకు దేశంలో ఈ పథకం కింద మొత్తం 25.45 కోట్ల ఖాతాలు తెరిచారు. ఆంధ్రప్రదేశ్ లో 79,10,585 ఖాతాలు తెరిచారు. వాటిలో గ్రామీణ ప్రాంత ఖాతాలు 44,81,387 ఉండగా, పట్టణ ప్రాంత ఖాతాలు 34,29,198 ఉన్నాయి. మొత్తంలో 61,31,892 ఖాతాలకు ఆధార్ నెంబర్ ను అనుసంధానం చేశారు.  పీఎంజేడీవై నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1,18,55,366 కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య కచ్చితంగా తెలియదు. ప్రజాసాధికార సర్వే పూర్తి అయితే తెలుస్తుంది. కొన్ని కుటుంబాలలో ఉన్న సభ్యులందరికీ ఖాతాలు ఉంటున్నాయి. ఒక్కో సభ్యునికి రెండు మూడు ఖాతాలు కూడా ఉంటున్నాయి. ఒక్క ఖాతా కూడా లేని కుటుంబాలు కూడా ఉన్నాయి.  పీఎంజేడీవై పథకానికి ఇటు ప్రజల నుంచి, అటు బ్యాంకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి ఇది తోడ్పడుతుంది. ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందించడంలో జేఏఎం(జన్ ధన్, ఆధార్, మొబైల్) కీలక పాత్ర పోషిస్తుంది.
రాష్ట్ర వ్యాప్త అనుసంధానిత వ్యవస్థ
           భవిష్యత్ లో రాష్ట్రం అన్ని  రంగాలలో అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం విజన్-2029 ముసాయిదా పత్రాన్ని రూపొందించింది.   సమ్మిళిత అభివృద్ధికి దోహదపడేవాటిలో అందరికి తప్పనిసరిగా కావలసిన 12 కనీస అవసరాలను ప్రభుత్వం గుర్తించింది. బ్యాంకు ఖాతా ప్రాధాన్యతను గుర్తించి వాటిలో దీనిని కూడా చేర్చింది. సత్వర పారదర్శక పాలనకు ఉపయోగపడే పరివర్తన వ్యూహాలు, మెరుగైన జీవనానికి అవకాశాలలో కూడా దీనిని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను రూపొందించి, వాటిని సమగ్రంగా, సమర్థవంతంగా నిజమైన లబ్ధిదారులకు అందజేయడానికి, పారదర్శకతకు అనువైన ఒక రాష్ట్ర వ్యాప్త అనుసంధానిత వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ-ప్రగతి సాంకేతిక సహకారంతో సమర్థవంతంగా సేవలు అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనికోసం మొదటి దశలో ప్రభుత్వం రూ.2,398 కోట్లు పెట్టుబడి పెడుతుంది.
        బ్యాంకు ఖాతాతో ఆధార్ నెంబర్, మొబైల్ తో సమన్వయం
        బ్యాంకు ఖాతాతో ఆధార్ నెంబర్ ను మొబైల్ నెంబర్ తో సమన్వయం చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడానికి వీలవుతుంది. నగదు బదిలీ పథకానికి కూడా ఈ ఖాతాలు తప్పనిసరి. అవినీతికి తావులేకుండా ప్రభుత్వ సహాయం నేరుగా లబ్దిదారుని ఖతాలో చేరిపోతుంది. ప్రజాధనానికి భద్రత చేకూరుతుంది. ఈ-ప్రగతిలో భాగంగా బ్యాంకు ఖాతాలను తప్పనిసరి చేశారు. 2019 నాటికి ఆధార్ తో అనుసంధానమైన జన్ ధన్ బ్యాంకు ఖాతాలు వంద శాతం కుటుంబాలు కలిగి ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మారుమూల గ్రామాలలో కూడా జాతీయ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు తమ బ్యాంచ్ లను ప్రారంభించడంతో అందరూ బ్యాంకు ఖాతాలు తెరవడం సులభమైంది. ప్రభుత్వ చర్యలతో ప్రజలలో అవగాహన పెరగడం,  బ్యాంకుల చొరవ వల్ల నిర్ణీత సమయానికంటే ముందుగానే లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. 

Nov 10, 2016

మెరైన్ ఎగుమతుల్లో ఏపీ నెంబర్ 1

             
§  ఏపీ నుంచి రూ. 9,328 కోట్ల విలువైన ఎగుమతులు
§  అధిక భాగం రొయ్యలే!
§  విశాఖ నుంచి 1,28,718 టన్నుల ఎగుమతి 
§కృష్ణపట్నం నుంచి 38,412 టన్నుల ఎగుమతి
§  ఎక్కవగా అమెరికాకు ఎగుమతి
§  రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో మెరైన్ రంగం కీలకం
§  ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో అధిక లాభం
§  మెరైన్ బోర్డు ఏర్పాటుయత్నం
  
  మెరైన్ ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోకెల్లా అత్యున్నత స్థానంలో ఉంది. కేంద్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని  మెరైన్ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపీఈడీఏ) తాజా లెక్కల ప్రకారం 2015-16 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 9,45,892 మెట్రిక్ టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.  రూ.30,420.83 కోట్ల ఆదాయం లభించింది. ఎగుమతి అయినవాటిలో ఎక్కువ భాగం రొయ్యలు, చేపలు ఉన్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 5.6 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఎంపిఈడిఎ అంచనా. సముద్ర ఉత్పత్తులు భారత ఆర్ధిక వ్యవస్థకు గొప్ప వరం. మన దేశంలో 8,129 కిలో మీటర్ల సుదీర్ఘమైన తీరప్రాంతం ఉంది. 9 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న ఈ తీర ప్రాంతంలో  దాదాపు 31 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తులకు అవకాశం ఉంది.
        రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి తడ వరకు 9 జిల్లాలలో 974 కిలో మీటర్ల సముద్రతీర ప్రాంతం ఉంది. సముద్రం ఉత్పత్తులను పెంచుకోవడానికి అవకాశం మెండుగా ఉంది. ఈ రంగం ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంది.  2015-16లో ఏపీ నుంచి రూ. 9,328 కోట్ల విలువైన 1,67,130 టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.  వీటిలో 98,553 టన్నులు ఒక్క అమెరికాకే ఎగుమతి అయ్యాయి. సముద్ర ఉత్పత్తుల మొత్తం  ఎగుమతులలో  అత్యధిక భాగం 1,58.100 టన్నులు రొయ్యలే ఉన్నాయి. విశాఖపట్నంలో రిజిస్టర్ అయిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులు 61 మంది ఉన్నారు. 2015 -16లో విశాఖపట్నం ఓడ రేవు నుంచి రూ. 7,161 కోట్ల విలువైన 1,28,718 టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. అంతకు ముందు సంవత్సరం 1,15,672 టన్నులు ఎగుమతి అయ్యాయి. 11.28 శాతం వృద్ధి కనిపించింది.  దేశంలో మెరైన్ కార్గోలను  పంపే మేజర్ పోర్టులలో విశాఖపట్నం పోర్ట్ ఒకటి.  కృష్ణపట్నం నుంచి రూ.2,167 కోట్ల విలువైన 38,412 టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. అంతకు ముందు సంవత్సరం 30,690 టన్నులు ఎగుమతి అయ్యాయి. 25.16 శాతం అధికంగా ఎగుమతులయ్యాయి. ఈ లెక్కల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు కీలకం కానున్నాయి.   

       వనామీ, బ్లాక్ టైగర్ వంటి అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నటువంటి విభిన్న వెరైటీల రొయ్యల ఎగుమతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.  ఆక్వా రంగంలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆధునిక పద్దతులను అమలు చేయడం ద్వారా ఈ ఏడాది నుంచి ఆదాయాన్ని మరింత పెంచుకొనే వ్యూహరచన చేసింది.  గత నెలలో మూడు రోజుల పాటు విశాఖపట్నంలో జరిగిన 20వ అంతర్జాతీయ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శన కూడా ఈ రంగంలో నాణ్యమైన ఉత్పత్తులు, ఎగుమతులు పెరగడానికి దోహదపడుతుంది. ఈ ప్రదర్శనలో దేశవిదేశాలకు చెందిన మూడు వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 300 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన ద్వారా రాష్ట్రంలోని వ్యాపారులు, రైతులు సముద్ర ఉత్పత్తుల దిగుబడిని పెంచడంలో అనుసరించే ఆధునిక పద్దతులను, ప్రొసెసింగ్, రవాణా, ఎగుమతులలో మెళకువలను తెలుసుకున్నారు. ఈ ప్రదర్శన ద్వారా రాష్ట్రం దేశవిదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించగలిగింది.
      భారత్ సముద్ర ఉత్పత్తులు ఎక్కువగా అమెరికా దిగుమతి చేసుకుంటుంది. అమెరికాకి దిగుమతి అయ్యే సముద్ర ఉత్పత్తుల్లో భారత్ వాటా 28.46 శాతం.  గడచిన ఏదాడి 1,53,695 టన్నుల సముద్ర ఉత్పత్తులు అమెరికా ఇక్కడి నుంచి దిగుమతి చేసుకుంది. ఆగ్నేయాసియా దేశాలు 24.59 శాతం ఉత్పత్తులను ఇక్కడ నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. యూరోపియన్ యూనియన్ దేశాలు 20.71 శాతం, జపాన్ 8.61 శాతం, మధ్య ఆసియ 5.90 శాతం, చైనా 4.71 శాతం, ఇతర దేశాలు 7.03 శాతం సముద్ర ఉత్పత్తులను భారత దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి.
          
ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
            ఆక్వా రైతులకు మంచి లాభాలు తెచ్చి పెట్టె వాటిలో ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు ప్రధానమైనవి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆక్వా రైతులు తమ ఉత్పత్తులను చెన్నై లేదా విశాఖపట్నం నుంచి మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. రవాణాకు ఆరు గంటలకు పైగా సమయం పట్టడం వల్ల ఉత్పత్తుల నాణ్యతపై దాని ప్రభావం పడుతోంది. మెరైన్ ఉత్పత్తులను యురోపియన్ యూనియన్ ప్రమాణాల ప్రకారం శుద్ధి చేయాలి. మన దేశం నుంచి దాదాపు వంద దేశాలు మెరైన్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. వారు నాణ్యత ప్రమాణాలపై ఎక్కువ దృష్టి పెడతారు. ఆక్వా ఉత్పత్తులకు విలువ మరింత పెరగాలంటే ప్రాసెసింగ్ యూనిట్లు ఉపకరిస్తాయి. ఉత్పత్తి భారీగా  ఉన్నప్పుడు రైతులు వాటిని తక్కువ ధరకే అమ్మకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అటువంటి సమయంలో ప్రాసెసింగ్ యూనిట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. మంచి ధర లభించే అవకాశం ఉంటుంది. సముద్ర ఉత్పత్తులు (చేపలు, రొయ్యలు) లభ్యమయ్యే ప్రాంతాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల వల్ల పర్యావరణానికి ముప్పు ఉండదన్న అభిప్రాయం కొందరిలో ఉంది. అయితే అది వాస్తవం కాదు. అలాంటి ప్రమాదం ఏమీ లేదని  రాష్ర కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. ఈ యూనిట్లు ఆరెంజ్ కేటగిరీ కింద వస్తాయి.  అందువల్ల వీటి నుంచి చాలా తక్కువ కాలుష్యం వెలువడుతుంది. శుద్ధి తర్వాత విడుదలయ్యే జలాలు పంటల సాగుకు కూడా ఉపయోగించుకోవచ్చు.

 మెరైన్ బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు

           రాష్ట్రంలో మెరైన్ బోర్డు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో మాత్రమే ఇటువంటి బోర్డు ఉంది.  ఆ రాష్ట్రంలో 720 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. 1996లో మహారాష్ట్ర ప్రభుత్వం మారిటైమ్ బోర్డును ఏర్పాటు చేసింది. ఏపీలో మెరైన్ బోర్డు ఏర్పాటైతే సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుంది.  సముద్రతీర ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన,  ఓడరేవుల నిర్వహణ, వాటి అభివృద్ధి, హార్బర్సలో ట్రాఫిక్ నియంత్రణ, సముద్ర జలాలకు సంబంధించిన వ్యవహారాలను ఈ బోర్డు చూసుకుంటుంటుంది.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రష్యా పర్యటనలో రాష్ట్రంలో మెరైన్ రంగం అభివృద్ధికి దోహదపడే చర్చలు జరిగాయి. మెరైన్ రంగంలో ఏపికి సంపూర్ణ సహాయ సహకారాలు అందజేసేందుకు  రష్యాకు చెందిన యునైటెడ్‌ షిప్‌బిల్డింగ్‌ కార్పొరేషన్‌ తన సంసిద్ధత తెలిపింది. 

బహుముఖ వ్యూహాలతో ఏపీ అభివృద్ధి

·       మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 12.26 శాతం
·       వ్యవసాయ రంగంలో 22.96 శాతం వృద్ధి
·     మత్స్య పరిశ్రమలో 34.14 శాతం వృద్ధి
·       రికార్డు స్థాయిలో 349.54 శాతం పెరిగిన రొయ్యల ఉత్పత్తి

         సమర్థవంతమైన పాలన, ఆర్థిక వృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బహుముఖ వ్యూహాలు ఫలిస్తున్నాయి. పాలన వేగవంతం చేసేందుకు ప్రారంభించిన ఏడు మిషన్లు (ప్రాధమిక రంగం, సామాజిక సాధికారిత, పరిజ్ఞాన నైపుణ్యాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పారిశ్రమలు, మౌలికసదుపాయాలు, సేవల రంగం), ఐదు గ్రిడ్లు (గ్యాస్, వాటర్, ఫైబర్, రోడ్, పవర్) మరో ఐదు (నీరు-చెట్టు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, పేదరికంపై గెలుపు, పరిశుభ్ర-ప్రజారోగ్యం) ప్రచార కార్యక్రమాలు నిర్ణీత వ్యవధిలో నిర్ధేశించిన లక్ష్యాలు చేరుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మొదటి త్రైమాసిక (ఏప్రిల్-జూలై) రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్ డీఫీ) రూ.1,10,583 కోట్లు లక్ష్యం కాగా, రూ. రూ.1,07,099 కోట్లు నమోదైంది. అంటే 97 శాతం లక్ష్యానికి చేరుకోగలిగింది.

           రాష్ట్ర ప్రణాళికా శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో రాష్ట్రం స్థూల ఉత్పత్తి (జిఎస్ డిపి) వృద్ధి రేటు 10.99 శాతం సాధించి దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. దేశ సగటు వృద్ధి రేటు 7.57 శాతం కంటే 3.42 శాతం అధికంగా సాధించింది. ఈ ఏడాది 15.91 శాతం వృద్ధి రేటు సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జీఏవీ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) 12.26 శాతం వృద్ధి రేటు సాధించింది. గత సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీఏవీ రూ.95,403 కోట్లు ఉండగా, ఈ ఏడాది అదే కాలంలో రూ.1,07,099 కోట్లు నమోదైంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగంలో 22.96 శాతం, పరిశ్రమల రంగంలో 10.49 శాతం, సేవల రంగం 10.16 శాతం వృద్ధి రేటు నమోదయ్యాయి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో గత ఏడాది మొదటి త్రైమాసికంలో జీఏవీ రూ.14,898 కోట్లు కాగా, ఈ ఏడాది అదే కాలంలో 18,319 కోట్లుగా లెక్క తేలింది.
 జాతీయ స్థాయిలో 7.30 శాతం వృద్ధి
       కేంద్ర గణాంక కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జాతీయ స్థాయిలో  జీఏవీ రూ.27,38,318తో 7.30 శాతం వృద్ధి రేటు నమోదైంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో 1.80 శాతం, పరిశ్రమల రంగంలో 6.03 శాతం, సేవల రంగంలో 9.53 శాతం వృద్ధి రేటుగా లెక్క తేలింది. 
మత్స్య పరిశ్రమ వృద్ధి రేటు 34.14
      రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలను పరిశీలిస్తే ప్రధాన వృద్ధి కారకం (గ్రోత్ ఇంజన్)గా ప్రభుత్వం గుర్తించిన మత్స్య పరిశ్రమ అత్యధికంగా 34.14 శాతం వృద్ధిరేటు సాధించి అగ్రభాగాన నిలిచింది. మంచి నీటి రొయ్యల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 349.54 శాతం పెరిగింది.  లైవ్ స్టాక్ (పశువులు, గొర్రెలు, మేకల పెంపకం) రంగంలో 14.67 శాతం వృద్ధి రేటు నమోదైంది. అలాగే పాల ఉత్పత్తిలో 14.24 శాతం, మాంసం ఉత్పత్తిలో 12.68 శాతం, గుడ్ల ఉత్పత్తిలో 14.95 శాతం పెరుగుదల కనిపించింది.


           రాష్ట్రంలో సరాసరి తలసరి ఆదాయం గత ఏడాదే లక్ష రూపాయలు దాటి రికార్డు సృష్టించింది. పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో ఏపీ  మొదటి స్థానానికి ఎగబాకింది. విద్యుత్ రంగంలో లోటు నుంచి మిగులుకు చేరింది. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తూ రికార్డు నెలకొల్పింది. అన్ని రంగాలలో సమ్మిళిత వృద్ధితో స్థిరమైన రెండంకెల వృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ ధ్యేయం. ఆ దిశగా అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రణాళికలు ఆచరణలో అద్వితీయమైన విజయాలు సాధిస్తున్నాయి. ఈ క్రమంలో 2022 నాటికి దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన మూడు రాష్ట్రాలలో ఒకటిగా ఏపీని నిలపాలన్న ప్రభుత్వ లక్ష్యం తప్పక నెరవేరుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం అవసరంలేదు. 

అమరావతి మెడలో నవ నగర మణిహారం



       ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి,  మండలాలలోని 25 రెవెన్యూ గ్రామల(29 గ్రామాలు)పరిధిలో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడ ఏమి నిర్మించాలనేది ఈ మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచారు. చారిత్రకంగా నాగరికత వెలసిల్లిన ప్రాంతాలు, నగరాలు అన్నీ నది ఒడ్డునే ఉన్నాయి. ఇప్పుడు మనకు నది ఒడ్డున ఇంతటి విశాల నగర నిర్మాణం జరగడం ఆంధ్రుల అదృష్టం.  అమరావతి మహానగరంలో అంతర్భాగంగా 9 నగరాలు నిర్మిస్తారు. అమరావతి లోపల చుట్టూ ఈ నవ నగరాలు ఓ మణిహారంలా ఉంటాయి. క్రమశిక్షణకు, పారదర్శకమైన పాలనలో పేరుగాంచిన సింగపూర్ ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ ను రూపొందించి గత మే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉచితంగా అందజేసింది. ప్రపంచ శ్రేణి నగరంగా అభివృద్ధి చేయడానికి అనువుగా దీనిని తయారు చేశారు. రాజధాని అంటే కేవలం  పరిపాలనకే పరిమితం కాకుండా ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం, పరిశోధన, పర్యాటకం, ఆతిథ్యం, కళలు, సాంస్కృతిక, వాణిజ్య, సాంకేతిక కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా నిలవాలన్నది సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష. ఇవన్నీ వస్తే ఉపాధి అవకాశాలు వాటంతట అవే వస్తాయి.
      వాస్తవానికి  విభజన జరగడంతో రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఇంకా ఎదుర్కొంటూనే ఉంది.  అయినా రాజధాని నిర్మించుకోవడం రాష్ట్రం తక్షణ కర్తవ్యం. ప్రణాళిక ప్రకారం రాజధాని నిర్మించుకునే అవకాశం కొద్ది మందికి మాత్రమే వస్తుంది. అటువంటి అవకాశం మనకు వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ఆధునికంగా నిర్మించిన నగరాల సరసన నిలిచేవిధంగా దీనిని నిర్మించతలంచారు చంద్రబాబు నాయుడు. అందుకే దేశంలోనే కాకుండా  ప్రపంచంలోని అనేక ప్రముఖ నగరాలను సందర్శించి, అక్కడి కట్టడాలను పరిశీలించారు. మన దేశంలోని గాంధీనగర్, జైపూర్, నయారాయ్ పూర్, ఛండీగఢ్, అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి, ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా, బ్రెజిల్ లోని బ్రాసిలియా, మలేషియాలోని పుత్రజయ, కిజకిస్తాన్ రాజధాని ఆస్థానా వంటి నగరాలను సీఎం స్వయంగా సందర్శించారు. అక్కడి కట్టడాలను వీక్షించారు. ఈ నగర ప్లాన్లను అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. వీటిలో కొన్ని వాటర్ ఫ్రంట్ నగరాలు, మరికొన్ని గ్రీన్ ఫీల్డ్ ప్లాన్డ్ నగరాలు ఉన్నాయి. ఆయా నగరాలలో కార్యకలాపాలను, ప్లాన్లను పరిశీలించిన తరువాత అమరావతి మహానగరంలో అంతర్భాగంగా 9 నగరాలుగా నిర్మించాలని నిర్ణయించారు. 1.ప్రభుత్వ పరిపాలన నగరం 2. న్యాయ నగరం 3. ఆర్థిక నగరం 4.విజ్ఞాన నగరం 5.ఎలక్ట్రానిక్స్ నగరం 6. ఆరోగ్య నగరం 7. ఆటల నగరం 8. మీడియా నగరం 9.పర్యాటక నగరం. దేశ,విదేశాలలో పలు నగరాలను చూసి, వాటి స్ఫూర్తితో ఈ విధంగా ప్రత్యేక నగరాలు నిర్మించాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. అంతేకాకుండా కట్టడాలన్నీ మన సంస్కృతి ప్రతిబింభించే విధంగా ఉండాలన్న అభిప్రాయంతో ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయా రంగాలకు సంబంధించిన అత్యంత ఆధునిక వసతులతోపాటు విద్య, వైద్యం, సాంకేతిక, రవాణా సౌకర్యాలన్నీ ఈ నగరాలలో అందుబాటులో ఉంటాయి. వివిధ అంశాలకు సంబంధించి 9 నగరాలు నిర్మించినప్పటికీ అన్ని నగరాలలో ఆయా అంశాలు అందుబాటులో ఉంటాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. విశాలమైన రోడ్లు, వాటిలో సైకిల్ ట్రాక్ లు,  పచ్చదనం పరిచినట్లు పచ్చికబయళ్లు, పూల మొక్కలు, చల్లదనాన్ని ఇచ్చే చెట్లు, ఫౌంటెన్లు.... ఇలా అందమైన ఓ సుందర నగరం ఏర్పడుతుంది.  ఈ నగరాలను కలుపుతూ మెట్రో రైలు మార్గం నిర్మిస్తారు.


         ప్రస్తుతానికి సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అందించినప్పటికీ, ఈ 9 నగరాలలో నిర్మించే భవనాలకు సంబంధించిన ప్లాన్లను ఆమోదించవలసి ఉంది. ఆయా భవనాల ఆకృతులు రూపొందించవలసిందిగా అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ ను ప్రభుత్వం కోరింది. మలేషియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హ్యారిస్ గ్రూప్ కంపెనీల’ చైర్మన్ హ్యారిస్  అమరావతి రాజధానిలో వివిధ భవనాల కోసం రూపొందించిన ఆకృతులను గత నెలలో సీఎం చంద్రబాబు నాయుడుకు  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. వివిధ దేశాలలో పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన అనుభం ఉన్న ఈ సంస్థ  రాజధానిలో నిర్మించే ట్విన్ టవర్స్ కు సంబంధించి పలు నమూనాలు చూపించింది.  ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చరిత్ర, కళలు, బౌద్ధిజం.. మొదలైన అంశాలు ప్రతిబింబించేవిధంగా వాటిని రూపొందించారు. అయితే సీఎం వాటిని ఖరారు చేయలేదు. మరి కొందరు అంతర్జాతీయ ఆర్టిటెక్ట్ లు రూపొందించిన ప్లాన్లను కూడా చూసి, ఉత్తమమైన వాటిని ఎంపిక చేయాలన్న ఆలోచనతో సీఎం ఉన్నారు. ప్లాన్లు ఖరారైన తరువాత, నగరాల నిర్మాణానికి ప్రభుత్వం  టెండర్లను పిలుస్తుంది. ఇప్పటికే రాజధానిలో కొన్ని రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. మరికొన్ని రోడ్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవనున్నట్లు సీఆర్డీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ చెప్పారు. రోడ్ల నిర్మాణం జరిగి, భవనాల నిర్మాణం కూడా మొదలైతే ఈ ప్రాంతంలోని స్థలాలకు మంచి ధరలు వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చి, ఫ్లాట్లు పొందిన రైతులు లాభపడే అవకాశం ఉంది. ఇదంతా జరగడానికి రెండు మూడేళ్ల సమయం పడుతుందని జైన్ చెప్పారు. 
   విజయవాడ, గుంటూరుల నుంచే కాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి కూడా అమరావతికి అనుసంధానం చేస్తూ ఆరు లైన్ల రోడ్లు నిర్మిస్తారు.  రాజధాని అమరావతి అభివృద్ధి కోసం సింగపూర్, జపాన్, చైనా, రష్యా, యునైటెడ్ కింగ్ డమ్ తదితర దేశాలతోనూ, అంతర్జాతీయ వ్యాపార సంస్థలతోనూ వాణిజ్యం, పెట్టుబడులు, ఉమ్మడి సంస్థలు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళికలు, స్మార్ట్ నగరాలు, సంప్రదాయేతర ఇంధన వనరులు, విద్య, వైద్యం, పర్యావరణం, రవాణా వ్యవస్థలు, సామాజిక సంక్షేమం మొదలైన రంగాలలో పరస్పర సహకారం కొరకు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఇంకా చేసుకుంటూనే ఉంది. ఈ 9 నగరాల నిర్మాణం పూర్తి అయితే మహాఅద్భుతంగా అమరావతి మహానగరం రూపుదిద్దుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరంలేదు.