Jul 10, 2026

ఆంధ్రజ్యోతి పరివారం -4

రమణమూర్తి గారిని 1988లోనే చూశాను


సందర్భానుసారం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, వృత్తిపరంగా క్రియేటివిటీ చూపుతూ, సంచలన వార్తలు రాయగల దమ్మున్న జర్నలిస్ట్ వల్లూరి వెంకట రమణమూర్తి. 1988లో నేను మా ఊరు మంగళగిరికి ఉదయం రిపోర్టర్ గా పని చేసే సమయంలో విజయవాడ బందర్ రోడ్డులోని ఉదయం కార్యాలయం వద్ద రమణమూర్తి గారిని నేను మొదటిసారిగా చూశాను. అప్పటికే ఆయన ఓ సంచలనం సృష్టించారు. అప్పట్లో ఆయన సన్నగా ఉండేవారు. షర్ట్  మాచిపోయింది.  ఇప్పటికి కూడా నా కళ్లకు ఆ రూపం కనిపిస్తోంది. నేను ఉదయం ఆఫీసు లోపల ఉన్నాను. ఆయన లోపలకు వస్తున్నారు. అప్పుడే, అక్కడివారు ‘‘ఈయనే కొండపల్లి సీతారామయ్యని ఇంటర్వ్యూ చేసిన రమణమూర్తి’’ అని గుసగుసలాడినట్లు చెప్పారు. ఆ తర్వాత విశాఖ-ఆంధ్రజ్యోతిలో ఆ రమణమూర్తి గారితో కలిసి పనిచేశాను. ఆయన బ్యూరో ఇన్ చార్జి, నేను సిటీ డెస్క్ ఇన్ చార్జి, అలా మా మధ్య పరిచయం ఎక్కువయింది. ఎంత గొప్ప జర్నలిస్టు అయినా, వేమూరి రాధాకృష్ణ గారిలా అదే పేపర్ కు యజమానులు కాలేరు. రమణమూర్తి గారు వ్యూహాత్మకంగా వ్యవహరించి ‘లీడర్’ అయ్యారు. తెలుగులో అన్ని విధాలా ఆ స్థాయికి ఎదిగి  విజయం సాధించిన జర్నలిస్టులు వేమూరి రాధాకృష్ణ, రావి రామ ప్రసాద్, వీవీ రమణ మూర్తి, రవిప్రకాష్ మాత్రమే కనిపిస్తున్నారు. వీరిలో ముగ్గురు మన ఆంధ్రజ్యోతి వారు కావడం విశేషం.

చాలా మంది సంచలన వార్తలు రాస్తారు. ఆ తర్వాత నిర్ణయం డెస్క్ వారికి వదిలివేస్తారు. అయితే, రమణమూర్తి గారికి సంచలన వార్తలు రాయడంతోపాటు అందులో క్రియోటివిటీ చూపడం కూడా ఆయన ప్రత్యేకత. ఆ వార్తకు పేపర్లో తగిన ప్రాధాన్యత ఇచ్చేవిధంగా, అవసరమైతే తనే బాధ్యత తీసుకునే దమ్ము రమణమూర్తి గారికి ఉంది. మొన్న మనం కలిసినప్పుడు ఓ విద్యార్థి 8వ ర్యాంకు సాధించిన వార్తకు సంబంధించిన విషయాలు చెప్పారు. అప్పుడు నేను సిటీ డెస్క్ లోనే ఉన్నాను. ఆ విద్యార్థి నివాసమైన పూరి గుడిసె ముందు నిలబెట్టిన ఫొటోలు సిటీ టాబ్లాయిడ్ లో నేను కూడా వాడాను. అంతేకాదు, ఆ రోజు నేను, ‘‘అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి ... లాంటి వారు చదువుకోడానికి ఎన్ని కష్టాలు పడ్డారో చదివాను. ఇప్పుడు ఈ విద్యార్థిని చూస్తున్నాను’’ అని అనుకున్నాను. విద్యార్థి నేపథ్యంతో సంబంధంలేకుండా ఫస్ట్ ర్యాంకు వారికి మాత్రమే ఫస్ట్ పేజీలో స్థానం కల్పించే రోజుల్లో, అడిగితే మేనేజ్ మెంట్ కు తానే చెబుతానని రమణమూర్తి గారు పూర్తి బాధ్యత తీసుకుని,  8వ ర్యాంకు వచ్చిన విద్యార్థికి సంబంధించిన ఫొటోలు, వార్త మొదటి పేజీలో వాడించారు. నాకు బాగా గుర్తు అప్పట్లో ఆ వార్త, ఫొటోలు ఫస్ట్ పేజీలో పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. ఆ వార్తని పాఠకులు చాలా ఆసక్తిగా చదివారు. ఆంధ్రజ్యోతిని మెచ్చుకున్నారు. ఆ వార్త ప్రజంటేషన్ లో రమణమూర్తి గారు సంచలనంతోపాటు క్రియేటివిటీ చూపించారు. అప్పటి ఎండీ కానూరి జగదీష్ ప్రసాద్ గారి నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆ తర్వాత అన్ని పత్రికలవారు ఆ ఒరవడిని కొనసాగించారు.

అటువంటి సంచలనాలు నేను విజయవాడ-ఆంధ్రభూమిలో పనిచేసే సమయంలో తాడి ప్రకాష్ గారు చేయడం చూశాను. విషయం పూర్తిగా గుర్తులేదు. ఓ రోజు వీథిన పడిన ఓ పేద కుటుంబం ఫొటో నాలుగు కాలాలు ఫస్ట్ పేజీలో పెట్టి, రైటప్ రాశారు. రెండు, మూడు లైన్ల రైటప్ లోనే విషయం అంతా ఉంది. అప్పట్లో అలా ఫొటోలు పెట్టడం ఓ సంచలనం. పాఠకులను బాగా ఆకట్టుకునేవి.  సామాజికంగా ప్రాధాన్యత కలిగిన అనేక ఫొటోలు ప్రకాష్ గారు పెట్టేవారు. అప్పుడు అక్కడ సతీష్ చంద్ర గారు బ్యూరో ఇన్ చార్జిగా ఉండేవారు. ఆయన కూడా సంచలన వార్తలు రాయడంలో దిట్ట. రమణమూర్తి గారు కూడా అటువంటి వార్తలు రాయడంతోపాటు ప్రజంటేషన్ లో కొత్తదనం చూపించేవారు. అందువల్లనే జర్నలిస్టుగా విశాఖలో అగ్రస్థానాన నిలిచారు. రాయడమే కాదు, సాగర్... వంటి ఎంతో మంది జర్నలిస్టులను తయారు చేశారు. తయారు చేయడమే కాదు, ఇప్పటికీ సాగర్, రఘు లాంటి వారు, ‘‘జర్నలిజంలో రమణమూర్తి గారే మా గురువు గారు, ఆయన నుంచి ఎన్నో మెళకువలు నేర్చుకున్నాం.’’ అని చెబుతారు. అటువంటి అభిమానం సాధించడం కూడా సామాన్యమైన విషయం ఏమీ కాదు.

ఎటువంటి వార్తనైనా రమణమూర్తిగారు చాలా చాలా స్పీడ్ గా రాయగలరు. బ్యూరో చీఫ్ గా ఆయన అటు మెయిన్ కి, ఇటు టాబ్లాయిడ్ కి ప్రధాన వార్తలు ఇచ్చేవారు. టాబ్లాయిడ్ కి ఎక్కువగా తొలుత రఘు, కళ్యాణ రామ్ ఇచ్చేవారు. సాగర్ వచ్చిన తర్వాత ఆయన కూడా ఇచ్చేవారు. అయినా, ఒక్కోసారి ఫస్ట్ పేజీకి బేనర్ వార్త ఉండేదికాదు. అంటువంటి సందర్భంలో, ‘‘సార్ ఈరోజు టాబ్లాయిడ్ కి బ్యానర్ వార్త లేదు. ఏదో ఒకటి మీరే ఇవ్వాలి’’ అని రమణమూర్తి గారిని అడిగేవాడిని. రాజకీయానికి సంబంధించినదో, మరొకటో ఆయన అరగంటలో రాసి ఇచ్చేవారు. కొన్ని సందర్భాలలో ఆయన వెళుతున్నానని చెప్పి వెళ్లిపోతున్నప్పుడో, చేయి ఊపి వెళ్లిపోతున్నప్పుడో, బేనర్ వార్త లేదని అడిగేవాడిని. అలాంటప్పుడు, 10,15 నిమిషాల్లో ఆసక్తిగా చదివించగలిగే రీతిలో స్టోరీ రాసి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతటి సమర్థత కలిగిన జర్నలిస్ట్ రమణమూర్తి గారు.

1995కి ముందు ఒకసారి ఎన్నికల సమయంలో, ‘‘ఎప్పుడూ డెస్క్ లో కూర్చొని ఉంటే ఎట్లా సార్, రేపు పాడేరు వెళదాం రండి’’ అని రమణమూర్తిగా నన్ను పిలిచారు. ఆయనతో వెళ్లాను. పాడేరులో ఆ రోజు సంత జరుగుతోంది. అక్కడ అటవీ ఉత్పత్తులు అమ్మేవారికి, కొనేవారికి ఎన్టీఆర్ బొమ్మ చూపించి, ‘‘ఇతను ఎవరు?’’ అని వారిని అడిగారు.  ప్రతి ఒక్కరూ, ‘‘ఆయన ఎవరో మాకు తెలియదు’’ అని చెప్పారు. తెలుగులో అంతటి మహానటుడు, ముఖ్యమంత్రిగా చేసిన ఎన్టీఆర్ తెలియకపోవడం ఏమిటని, నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇది నిజం. వారితో చాలా విషయాలు సంభాషించాం. చాలా ప్రశ్నలు వేశారు.  ప్రముఖ  రాజకీయ నాయకుల్లో  వారికి ఒక్క ఇందిరా గాంధీ తప్ప మరెవరూ తెలియదు. ఇందిరా గాంధీ వాళ్లకు ఇళ్లు కట్టించినట్లు చెప్పారు. దూరంగా ఉన్న ఆ ఇళ్లను కూడా చూపారు. దటీజ్ ఇందిరా గాంధీ. రమణమూర్తిగారితో బయటకు వెళ్లడం వల్ల నాకు ఆ విషయం తెలిసింది.

ఎలక్ట్రానిక్ మీడియా తొలితరానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ తోట భావన్నారాయణ గారు సీనియర్ జర్నలిస్టులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. మన సాగర్ ని కూడా ఇంటర్వ్యూ చేశారు.  ఒకసారి నన్ను అడిగారు. ‘‘సార్, డెస్క్ లో పనిచేసే నాలాంటి వారికంటే, రమణ మూర్తి గారి లాంటి వారిని చేయండి చాలా విషయాలు చెబుతారు’’ అని చెప్పాను. ‘‘రమణమూర్తి గారిని అడిగాను. ఇస్తాన్నన్నారు. కుదరడంలేదు. ఆయన ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాను’’ అని భావన్నారాయణ గారు చెప్పారు. రమణమూర్తి గారు ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుంది.  వార్తలు సేకరించే పద్దతులు, స్పీడ్ గా ఇచ్చే టెక్నిక్ లు రమణమూర్తి గారు చెబితే, యువ జర్నలిస్టులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

Jul 8, 2026

ఆంధ్రజ్యోతి పరివారం -3


 విశాఖ నాకు సురేష్‌ని ఇచ్చింది


విశాఖపట్నం జీవితం అంటే నాకు ఇవటూరి సురేష్‌తో ముడిపడి ఉంటుంది. ఓ గొప్ప మిత్రుడు సురేష్‌ని విశాఖ నాకు ఇచ్చింది. నేను చూసిన పరిధిలో, నాకు తెలిసినవారిలో లౌక్యం తెలియని, కల్మషం లేని, అత్యంత నిజాయితీపరుడు సురేష్. సురేష్ నాకు 1989 నుంచి తెలుసు. జర్నలిజం వృత్తిలో మేమిద్దరం చాలా కాలం కలిసి పనిచేశాం. విజయవాడ ఆంధ్రభూమి లాంచింగ్ ఎడిషన్ లో ట్రైనీ సబ్ ఎడిటర్లుగా మేం ఇద్దరం ఒకేసారి జాయిన్ అయ్యాం. విశాఖ ఆంధ్రజ్యోతి లాంచింగ్ ఎడిషన్‌లో సబ్ ఎడిటర్లుగా ఒకే జీతంపై, ఒకే రోజు జాయిన్ అయ్యాం. ఆ తర్వాత విశాఖ వార్త లాంచింగ్ ఎడిషన్‌లో ఒకే రోజు, ఒకే జీతంపై సీనియర్ సబ్ ఎడిటర్లుగా జాయిన్ అయ్యాం.  చెన్నై న్యూఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపులో మాత్రం సురేష్ నాకంటే ముందు జాయిన్ అయ్యాడు.  సురేష్ అక్కడ తెలుగు పీపుల్స్.కామ్ కి  చీఫ్ కంటెంట్ ఎడిటర్ గా, ఇన్ చార్జిగా ఉన్న సమయంలో నేను కూడా అక్కడ చీఫ్ కంటెంట్ ఎడిటర్ గా జాయిన్ అయ్యాను. అలా ఈ వృత్తిలో చాలా కాలం ప్రయాణం చేశాం. కలిసి పనిచేసినంత కాలం ప్రతి రోజూ ఇద్దరం కలిసే ఉండేవాళ్లం. కలిసే పనిచేసేవాళ్లం. సాంకేతికంగా కొత్త అంశాలను ఇద్దరం కలిసే నేర్చుకునేవాళ్లం. ప్రతిరోజూ ఆఫీసులో కలిసి ఉన్నా, ఆఫ్ రోజున కూడా కలిసేవాళ్లం. అంత స్నేహంగా ఉండేవాళ్లం.  సురేష్ తెగ కబుర్లు చెబుతాడు. విశాఖలో ఈనాడు ప్రారంభం రోజు జరిగిన సంఘటనల నుంచి అతను అమెరికా వెళ్లినప్పుడు అక్కడ గమనించిన విషయాల వరకు పూసగుచ్చినట్లు చెప్పేవాడు.   అతనికి ఉన్న పరిచయాల వల్ల అతనికి చాలా విషయాలు తెలుసు. ఎన్నో విషయాలు చెప్పేవాడు. విశాఖలో అతనికి తెలిసినవారినందరినీ పరిచయం చేసేవాడు. సురేష్ ది విశాఖ అయినందు, ఆంధ్రజ్యోతిలో పనిచేసిన నారాయణరావుగారు, రమణమూర్తి గారు, మన నవ్వులరేడు సుబ్బు.. లాంటివారందరూ అతనికి పాత పరిచయస్తులే.

1991 మే 19న ఆంధ్రజ్యోతి విశాఖ ఎడిషన్ ప్రారంభమైంది. అంతకంటే కొద్ది రోజుల ముందే మేమిద్దరం ఆంధ్రజ్యోతిలో చేరిపోయాం. ఈ ఎడిషన్ కోసమే ఎడిటర్ నండూరి రామమోహన్ రావు గారు మమ్మల్ని ఇద్దరినీ ఇంటర్వ్యూచేసి తీసుకున్నారు.   విశాఖ నాకు కొత్త. సురేష్ సొంత ఊరు విశాఖ. అక్కడ అండ, దండ అన్నీ సురేషే.

 నేను విశాఖ వచ్చిన కొత్తలో వసీరా(వక్కలంక సీతారామారావు) అక్కడ ఆంధ్రభూమిలో పనిచేసేవారు. అప్పుడు ఆయన భార్య డెలివరీకి పుట్టింటికి వెళ్లడం వల్ల, వసీరా ఒక్కరే ఇంట్లో ఉండేవారు. దాంతో, నన్ను ఆ ఇంట్లో సెట్ చేసేశారు. మా ఫ్యామిలీని విశాఖ తీసుకువచ్చే వరకు నేను వసీరా గారి ఇంట్లోనే ఉన్నాను. ఆ విధంగా వసీరా నాకు మంచి మిత్రుడు అయ్యారు.   ఇక ప్రముఖ కథా రచయితలు రావి శాస్త్రి(రాచకొంద విశ్వనాథ శాస్త్రి), కారా మాస్టార్(కాళీపట్నం రామారావు), విరసం వ్యవస్థాపకులలో ఒకరైన చలసారి ప్రసాద్, వంగపండు ప్రసాదరావు, కృష్ణాబాయి,  ప్రముఖ నట శిక్షకుడు డాక్టర్ సత్యానంద్, కె.బాలగోపాల్ గారి ప్రియ శిష్యుడు వీఎస్ కృష్ణ(మానవ హక్కుల కృష్ణ - అప్పట్లో డెక్కన్ క్రానికల్ లో పనిచేసేవారు), ఆంధ్రవిశ్వవిద్యాలయం జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విభాగం మాజీ హెడ్ ప్రొఫెసర్ పి.బాబీవర్థన్... వంటి అనేక మందిని సురేష్ నాకు పరిచయం చేశాడు. రావి శాస్త్రి గారు చనిపోయిన రోజు మేం ఇద్దరం కలిసే వెళ్లాం. నేను ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం విద్యార్థిని కాక ముందే బాబీవర్థన్ గారిని సురేష్ నాకు పరిచయం చేశాడు. చలసారి ప్రసాద్, కారా మాస్టార్ లాంటి వారితో సురేష్ కి సాన్నిహిత్యం ఎక్కువ. వాళ్లు సురేష్ తో ఫ్రెండ్స్ లా మాట్లాడేవారు.  జగదాంబ సెంటర్ సమీపంలో  కారా మాస్టార్ గారి అబ్బాయి ఉండేవారు. మాస్టారు కూడా అక్కడే ఉండేవారు. ఒక సాహితీ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి కారా మాస్టార్ గారిని నెల రోజులపాటు మేం ప్రతిరోజూ కలిసేవారం. జగదాంబ సెంటర్ వార్త కార్యాలయం వద్ద  ఓ అరుగుమీద కూర్చొని గంటలు గంటలు మాట్లాడుకునేవారం. అప్పట్లోనే కారా మాస్టార్ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించారు. అయితే, తెల్లారి లేస్తే, ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ, ఆ ప్రభుత్వం ఇచ్చే అవార్డు తీసుకోవడం ఆయనకు ఇష్టంలేదు. తీసుకోవాలా? వద్దా? అన్న మీమాంసలో ఉండేవారు. ఏం చేద్దాం అని సురేష్ ని కూడా అడిగేవారు. చివరకు కారా మాస్టార్ ఆ అవార్డు తీసుకుని, ఆ డబ్బుని ‘కథానిలయం’ కోసం ఖర్చు చేశారు.  ప్రముఖ సంపాదకులు పతంజలి గారిని పరిచయం చేసింది కూడా సురేషే. ఆయన ఎడిటర్ గా ఉన్న సాక్ష్మి లాంచింగ్ ఎడిషన్ లో హైదరాబాద్ లో నేను చీఫ్ సబ్ ఎడిటర్ చేరినప్పటికీ, అంతకు ముందే మహానగర్ కు ఎడిటర్ గా ఉన్న సమయంలో సురేష్ ఆయన వద్దకు తీసుకువెళ్లి పరిచయం చేశాడు. సురేష్ హైదరాబాద్ లో కార్టూనిస్ట్ శ్యామ్ మోహన్ తో కలిసి ఒక రూమ్ లో ఉండేవాడు. అప్పుడు శ్యామ్ మోహన్ ని పరిచయం చేశాడు. పేర్లు గుర్తుకు రావడంలేదు.  ఇలా చాలా  మంది రచయితలను, ఇతర ప్రముఖులను సురేష్ నాకు పరిచయం చేశాడు.

సురేష్‌తో కలిసి దీర్ఘకాలం పనిచేసినందున ఎన్నో మధుర జ్ఞపకాలు ఉన్నాయి. ఒక్క విషయం మాత్రం తప్పక చెప్పాలి. నేను వార్తలో మానివేసిన తర్వాత, టీవీ9కి సెలెక్ట్ అయ్యాను. అయితే, జీతం విషయం రవిప్రకాష్ గారితో మాట్లాడి, అపాయింట్ మెంట్ ఆర్డర్ పంపుతామని మౌళి గారు చెప్పారు. కానీ, అపాయింట్ మెంట్ ఆర్డర్ మాత్రం రాలేదు. అది అందడానికి ఆలస్యం అయ్యేట్లు ఉంది. అదే సమయంలో, చెన్నై న్యూఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు నుంచి వార్తలో  ఇచ్చిన జీతం కంటే 25 శాతం హైక్ తో నాకు అపాయింట్ మెంట్ ఆర్డర్ వచ్చింది. కనీసం ఇంటర్వ్యూకి కూడా హాజరుకాలేదు. ఆ ఆర్డర్ కేవలం సురేష్ వల్లే వచ్చింది. సురేష్ యాజమాన్యంతో మాట్లాడి నాకు ఇంటర్వ్యూ లేకుండా, చీఫ్ కంటెంట్ ఎడిటర్ గా అపాయింట్ మెంట్ ఆర్డర్ పంపించే ఏర్పాటు చేశాడు.  ఆ తర్వాత ఆరు నెలలకే నాకు జీతం పెంచే ఏర్పాటు చేశాడు. చెన్నై ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపులో సురేష్ చెప్పిన అమెరికా (అంతకు కొద్దిరోజుల ముందే అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై అమెరికా వెళ్లి వచ్చాడు) కబుర్లతో ఆనందంగా కాలం గడిపేశాను. మా అబ్బాయి కోరికపై అక్కడ మానేసి, హైదరాబాద్ సాక్ష్మి లాంచింగ్ ఎడిషన్ లో చీఫ్ సబ్ ఎడిటర్ గా జాయిన్ అయ్యాను.

విశాఖలో ఆరోగ్యం బాగోక నేను సీడీఆర్ లో చేరినప్పుడు,  సురేష్ దగ్గర ఉండి చూసుకున్నాడు. నన్నే కాదు, రమణమూర్తి గారిని అయితే, ఇంకా ఎక్కువగా చూశాడు.  ఒక సారి రమణమూర్తి గారు కూడా ఆరోగ్యం బాగోక సీడీఆర్ లో చేరారు. ఎక్కువసేపు ఆయన దగ్గరే ఉండి కుటుంబ సభ్యుడు కంటే ఎక్కువగా చూశాడు. అప్పుడు నేను ప్రతిరోజు రమణమూర్తి గారిని చూడటానికి ఆస్పత్రికి వెళ్లేవాడిని, నాకంటే ముందే వచ్చి సురేష్ అక్కడ ఉండేవాడు. ఒక్కోసారి రాత్రి పూట కూడా అక్కడే ఉండేవాడు.  సురేష్ వ్యక్తిత్వం అంత గొప్పది. నా జీవితంలో ఎన్నో విషయాలలో అత్యంత ముఖ్యుడు సురేష్. వాస్తవానికి సురేష్ తో నా అనుబంధం గురించే చెప్పేటంతటి భాష నాకు తెలియదు. అటువంటి సురేష్ ని నాకు అందించి, అత్యంత సన్నిహితుడ్ని చేసింది విశాఖ.  అందుకే విశాఖ అంటే నాకు చాలా ఇష్టం. సముద్ర తీరం అంటే నాకు ఎంతో ఇష్టం. విశాఖ, చెన్నై రెండు సముద్రతీర నగరాలలో మేం ఇద్దరం కలిసి పనిచేశాం.

ఇక విశాఖ ఆంధ్రజ్యోతి రావి రామప్రసాద్, గారపాటి నరశింహారావు,  గుంటూరు చంద్రశేఖర్, కొమ్మూరి రాజా, గోపరాజు నారాయణరావు, వీవీ రమణమూర్తి, బి.నారాయణరావు గార్లతోపాటు, మోహన్ రావు, శ్రీనివాసరెడ్డి, సాగర్‌, కోటేశ్వరావు(స్పోర్ట్స్), సుబ్బు,  రఘు, కళ్యాణరామ్, అబ్దుల్లా, అకౌంటెంట్ మూర్తి, స్పాట్ న్యూస్ మూర్తి..... లాంటివారిని అనేక మందిని ఇచ్చింది. నాకు విశాఖలో తెలిసిన వారిలో ఎక్కువ మంది సురేష్, సాగర్, నవత, షర్మిల, అబ్దుల్లా, కృష్ణ... వంటి వారందరూ సామాజికంగా మార్పు కోరుకునే రెబల్సే. వారి జీవన శైలిని గమనిస్తే మనకు అర్థమవుతుంది. దేశంలో అత్యంత నిజాయితీపరులైన విలేకరులలో సాగర్ ఒకరు.  విలేకరిగా సాగర్ నిజాయితీ గురించి నేను ఎంతో మందికి చెప్పాను. ఇక ముందు కూడా చెబుతూ ఉంటాను.  నిజాయితీయే కాదు, మనిషిగా కూడా సాగర్ చాలా ఎత్తుకు ఎదిగారు.

Jul 6, 2026

ఆంధ్రజ్యోతి పరివారం -2



ఆంధ్రజ్యోతి పరివారం ఆత్మీక కలయిక ఓ అద్భుతం

నాకు ఆంధ్రజ్యోతితో 1984 నుంచి అనుబంధం ఉంది. అందులో విశాఖ-ఆంధ్రజ్యోతి

అనుబంధం ఓ భాగం. అయితే, ఎన్నో తీపి, మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఆంధ్రజ్యోతి, అక్కడ స్టాఫ్, రామకృష్ణ బీచ్, ఆంధ్రయూనివర్సిటీ, సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్.... ఇలా ఎన్నో జ్ఞాపకాలు అనుబంధాలు. ఆంధ్రజ్యోతి ఉద్యోగులు కాకుండా ఇతర గొప్ప వ్యక్తలు, ముఖ్యంగా సమాజం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించే అనేక మందితో పరిచయం. అన్నిటికంటే ముఖ్యం. విశాఖ వాతావరణం. బీచ్ అందాలు, పచ్చని ప్రదేశాలు, మరి ముఖ్యంగా సామాజికంగా ప్రశాంత వాతావరణ... ఇలా ఎన్నో. నాకు విజయవాడతో అనుబంధం ఎక్కువ, ఆ తర్వాత హైదరాబాద్. అందువల్ల విశాఖలో ప్రశాంతత నాకు చాలా చాలా బాగా నచ్చింది.

ఇక మన ఆంధ్రజ్యోతి పరివారం విషయానికి వస్తే, మన లీడర్ వీవీ రమణమూర్తి గారు, కోనేరు షర్మిల గారు, వింజమూరి ఆనంద్ గారు(రమణమూర్తి గారు చెప్పినట్లు ఆనంద్ మొదటిసారిగా చాలా కష్టపడ్డారు) పూనుకొని మనల్ని అందరినీ కలిపారు. వారి వల్ల మనం ఎంతో ఆనందాన్ని అనుభవించాం. దీర్ఘకాలం తర్వాత ఎంతోమంది మిత్రులను చూడగలిగాం. వారి ముఖాలలో ఆనందాన్ని చూసి చాలా సంతోషించాం. ఆర్థిక భారం, పనిభారం అంతా రమణమూర్తి గారిదే అనుకోండి. మనలో ఒకరు ‘లీడర్’గా ఎదగడం వల్లే మనల్ని అందరినీ బాధ్యతగా, మరి ముఖ్యంగా ప్రేమ, ఆత్మీయతతో కలపగలిగారు. చాలా సంతోషం. ఈరోజుల్లో ఇంత డబ్బు ఖర్చుచేసి, ఇంత ఆత్మీయత, ప్రేమ చూపగలిగేవారు దొరకడం మన అదృష్టం.  రమణమూర్తి గారికి, ఇంత ఖర్చుచేసి, ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆయనకు సంపూర్ణ సహకారం అందిస్తున్న ఆయన సతీమణి గారికి ప్రత్యేకంగా అభినందనలు.

మన వారిలో ఇవటూరి సురేష్, చంద్రశేఖర్ గారు, గోపరాజు నారాయణ రావు గారు, పారుపల్లి శ్రీధర్ గారు, ఎం.శ్రీనివాసరెడ్డి, అవ్వారు శ్రీనివాసరావు, ఫ్రొఫెసర్ డాక్టర్ రెడ్డి తిరుపతిరావు, ఐ అండ్ పీఆర్ డిపార్ట్ మెంట్ డి.రమేష్, ఆర్.రమేష్ చంద్ర, ఇ.సదాశివరావు, కాపు మోహన్ రావు, కేఎస్ఎస్ బాపూజీ, ఐవీ రాజేశ్వరరావు, చింతపల్లి పైడిరాజు... తదితరులతో టచ్ లోనే ఉన్నాను.  మిగిలిన అందరినీ చూసి 30 ఏళ్లు దాటిపోయింది.

మన గ్రూపులో నా ఫొటో చూసి, నన్ను గుర్తుపట్టిన వెంటనే, మన విశాఖ-ఆంధ్రజ్యోతి మొదటి బ్యూరో ఇన్ చార్జి బి.నారాయణ రావు గారు నాకు ఫోన్ చేసి, ‘‘విశాఖకు వస్తున్న మీరు మా ఇంట్లోనే దిగాలి’’ అని ఆహ్వానించారు. నన్నే కాదు చాలా మందిని ఆహ్వానించారు. అయితే, గుంటూరు చంద్రశేఖర్ గారు, డాక్టర్ గోపరాజు నారాయణ రావు గారు, పారుపల్లి శ్రీధర్ గారు, నేను వారి ఇంట్లోనే దిగాం. నేను ఒక రోజు ముందే శనివారం వచ్చాను. రెండు రోజులు ఆయన అతిథి  మర్యాదలు స్వీకరించాను.

 నేను విశాఖలో దిగడంతోనే మన వీఎస్ ఆనంద్ నవ్వుతూ స్వాగతం పలికారు. తన కారులో నారాయణ రావు గారి ఇంటికి తీసుకువెళ్లారు. ఆటోనగర్ లో ఉన్న నా పుస్తకాల బండిల్ ని వర్షం, ట్రాఫిక్ జామ్ లో ఎంతో శ్రమపడి లీడర్ కార్యాలయానికి చేర్చారు. ఆదివారం ఉదయం నారాయణ రావు గారి ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ కారులో లీడర్ కార్యాలయానికి తీసుకువచ్చారు. మధ్యలో ఓ హోటల్ లో టిఫిన్ పెట్టించారు. కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మమ్మల్ని అందరినీ తన కారులో మళ్లీ నారాయణ రావు గారి ఇంటి వద్ద దింపారు. ఇలా ఎన్నో రకాలుగా ఆనంద్ ఈ రెండు రోజులు నాకు ఎంతో సహాయపడ్డారు. ఆనంద్ ఈరోజు ఒక్కరోజు మాత్రమే కష్టపడ్డారని రమణమూర్తి గారు జోక్ చేశారు. కష్టపడటం ఆనంద్ కు పెద్ద కష్టం ఏమీ కాదు. మరో ముఖ్యం విషయం ఏమిటంటే, మనకు ఇచ్చిన జ్ఞాపికలో ఆనంద్ పేరు ఎదురుగా full time enjoy life అని రాసి ఉంది. ఆ రకంగా ఆనంద్ కష్టజీవి మాత్రమే కాదు, పేరుకు తగినట్లు  తొటివారికి సహాయపడుతూ ఆనందంగా జీవించడం ఆయన సహజలక్షణం.  ఆనంద్ తో జరిపిన క్షణాలు నా మదిలో పదిలం.

ఇప్పటికే గ్రూపులో చాలా మంది తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాయడానికి తెలిసిన పదాలు చాలడంలేదన్నారు. అది నిజం. కొందరు చాలా దూరం నుంచి వచ్చారు.  అందరం ఆనందంగా గడిపాం. ఈ 30 ఏళ్లలో చాలా మంది వివిధ రకాల హోదాలకు ఎదిగిపోయారు. అయినా, అందరూ ఆ నాటి ఆంధ్రజ్యోతి ఉద్యోగులుగానే వ్యహరించారు. అందరూ చాలా ఆప్యాయంగా పలకరించారు. ఆ మధుర క్షణాల అనుభూతులు అందరిలో స్పష్టంగా కనిపించాయి. రామప్రసాద్ గారి దగ్గర నుంచి రమణమూర్తి గారు, నారాయణ రావు గారు, నవత గారు, షర్మిల గారు, శ్రీనివాసరెడ్డి, రాజేశ్వరరావు, రఘు, కళ్యాణరామ్, సుబ్బు, విజయ్, సాంబ, ప్రసాదరావు గారు, అబ్దుల్లా, నల్లనయ్య గారు,  సీతమ్మధార రమేష్, గాజువాక పైడిరాజు... వంటి వారిని కలవడం చాలా అనందం కలిగించింది. చాలా మంది పేర్లు గుర్తులేవు. మనషులు అందరూ గుర్తు ఉన్నారు. అక్కడ వారి పేర్లు చెప్పినా, అంతలోనే మరచిపోయాను. మన అందరి మనసులు, శరీరాలు రీచార్జి అయ్యాయి. రోజులు కాదు, నెలలు, ఏళ్లకు సరిపడ రీచార్జి అయ్యాయి.

చివరలో మనందరికీ వంటచేసి, చేయించిపెట్టిన మహిళను సన్మానించడం నాకు చాలా బాగా నచ్చింది. దటీజ్ రమణమూర్తి. రమణమూర్తిగారి మనవడి ఏకపాత్రాభినయం చాలా చాలా బాగుంది. ఆ వయసులో అంతటి సుదీర్ఘమైన డైలాగ్స్ గుర్తుపెట్టుకుని, హావభావాలు ప్రదర్శిస్తూ ఏకపాత్రాభినయం చేయడం గ్రేట్.

మిత్రులారా ఇంతటితో అయిపోలేదు. ఇంకా చాలా బంధాలు, అనుబంధాలు, జ్ఞాపకాలు రాయాలి. మన రవీంద్ర చెప్పినట్లు  రాస్తాను.

 

విశాఖ జ్ఞాపకాలు

ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ ఉద్యోగం చేసే సమయంలోనే శ్రీనివాసరెడ్డి, నేను కలిసి బీజేఎంసీ, ఎంజేఎంసీ రెండు డ్రిగ్రీలు చాలా కష్టపడి పూర్తి చేశాం. ఆ రకంగా శ్రీనివాసరెడ్డి నా సహ ఉద్యోగి మాత్రమే కాదు, నా క్లాస్ మేట్ కూడా.   మా ఇద్దరికి జర్నలిస్టుల కోటాలోనే సీట్లు వచ్చాయి.  కష్టపడి అని ఎందుకు చెప్పానంటే, మేం ఇద్దరం దీర్ఘ కాలం సిటీ డెస్క్ లో చేశాం. అందువల్ల అర్థరాత్రి 2 గంటల వరకు ఆఫీసులోనే ఉండేవారం. ఉదయం 10 గంటలకు తప్పనిసరిగా క్లాసులకు వెళ్లేవారం. ఆ వెళ్లడం కూడా ఎలా అంటే, ఇద్దరం చెరో సైకిల్ మీద బస్టాండ్ వరకు వెళ్లేవాళ్లం. అక్కడ నుంచి యూనివర్సిటీకి వెళ్లే రోడ్డు చాలా ఎత్తు ఉంటుంది. తొక్కడం కష్టం. అందువల్ల బస్టాండ్ లో సైకిళ్లు పెట్టి, బస్సులో యూనివర్సిటీకి వెళ్లేవాళ్లం. మన సీతమ్మధార రమేష్, కంచరపాలెం రిపోర్టర్ (పేరు గుర్తులేదు), వీరి ఇద్దరిలో ఎవరో ఒకరు మా ఇద్దరి పేర్లపై ప్రతి నెల బస్సు పాసులు తీసుకు వచ్చి, ఇచ్చేవారు. ఓ పేపర్ పై టైప్ చేసిన బస్ పాస్ నెలకొకసారి ఇచ్చేవారు. ఇవి అక్రెడిటేషన్ లేకుండా ఇచ్చే పాస్ లు. పాస్ లేనప్పుడు, పాస్ రావడం ఆలస్యం అయినప్పుడు కొన్ని సార్లు రొప్పుకుంటారోసుకుంటా సైకిల్ పై వెళ్లేవాళ్లం. మరికొన్ని సార్లు నడిచికూడా వెళ్లేవాళ్లం. అలా ఆ రెండు డిగ్రీ పూర్తి చేశాం. శ్రీనివాసరెడ్డి రెండు గోల్డ్ మెడల్స్ కూడా సాధించారు. విశాఖ తీపి గుర్తుల్లో ఇది ఒకటి.

Jul 5, 2026

36 ఏళ్ల తర్వాత… విశాఖ-ఆంధ్రజ్యోతి టీమ్ రీయూనియన్



ఒకప్పుడు వార్తల కోసం ఊళ్లు తిరిగిన మేము…

ఈరోజు జ్ఞాపకాల కోసం ఒకచోట చేరాం!

అప్పుడు “బ్రేకింగ్ న్యూస్” కోసం పరుగులు…

ఇప్పుడు “షుగర్ ఎంత?”, “బీపీ ఎంత?” అన్నదే బ్రేకింగ్ న్యూస్! 

రమణమూర్తి పెద్దరికం ఇంకా అలాగే…

నవతమ్మ ఉండతనం ఏమాత్రం తగ్గలేదు…

రఘు కంగారు ఇప్పటికీ అదే…

సాగర్ చిరునవ్వు మాత్రం ఎవర్‌గ్రీన్…

కళ్యాణ్ చిలిపి పనులు ఇంకా ఆగలేదు…

సుబ్బు సెటైర్లు ఇప్పటికీ ఫుల్ ఫామ్‌లోనే…

సాంబ చూపులు మాత్రం అందరినీ నవ్వించేశాయి…

నారాయణరావు నెమ్మది చూసి గడియారం కూడా ఆగిపోతుందేమో అనిపించింది! 

మాటల్లో ఆటలు…

నవ్వుల్లో జ్ఞాపకాలు…

ఒక్కరోజు పాటు మళ్లీ 36 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాం.

చివరికి తీసుకున్న ఈ గ్రూప్ ఫోటో…

ఒక ఫోటో కాదు…

మా యవ్వనాన్ని మళ్లీ ఒకసారి ఫ్రేమ్‌లో బంధించిన మధుర జ్ఞాపకం!

ఆంధ్రజ్యోతి పాత టీమ్…

వయసు పెరిగింది… కానీ అల్లరి మాత్రం ఇంకా తగ్గలేదు! ❤


ఫొటోగ్రాఫర్ విజయ్

ఆంధ్రజ్యోతి పరివారం -1

ఆంధ్రజ్యోతితో నా అనుబంధం 42 ఏళ్ల నాటిది

 
డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే రోజుల్లో నేను రాసిన మొట్టమొదటి ఎడిటోరియల్ పేజీ ఆర్టికల్ 1984లో ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అప్పట్లో దానికి పారితోషికంగా రూ.50లు ఎంఓ చేశారు. నేను రాసిన ఆర్టికల్ కి ఎడిటర్ నండూరి రామమోహన్ రావు గారే హెడ్డింగ్ పెట్టారు. ఆంధ్రజ్యోతి విశాఖలో చేరడానికి ముందు చేసిన ఇంటర్వ్యూలో, నేను ఆ ఆర్టికల్ చూపించాను. ఆ హెడ్డింగ్ తానే పెట్టినట్లు చెప్పి, ఆరోజు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆప్పటి నుంచి తరచూ నా ఆర్టికల్స్ ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో వస్తూనే ఉన్నాయి. 1991-95 కాలంలో దాదాపు 5 ఏళ్లు విశాఖ-ఆంధ్రజ్యోతిలో పని చేశాను. ఎక్కువ కాలం  సిటీ డెస్క్ ఇన్ చార్జిగా చేశాను. విశాఖలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్లీ కరోనా సమయంలో రెండున్నరేళ్లు ఆంధ్రజ్యోతి హైదరాబాద్ సెంట్రల్ డెస్క్ లో చీఫ్ సబ్ ఎడిటర్ గా చేశాను.

Jun 15, 2026

మంగళగిరిలో ముగ్గురు ప్రముఖులకు సన్మానం

 

మంగళగిరి: మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో మూడు రంగాలలో  ముగ్గురు నగర ప్రముఖులు గుత్తికొండ ధనుంజయ రావు, గోలి మధు, శిరందాసు నాగార్జున రావులను ఆ టెక్ పార్క్ బిల్డర్లలో ఒకరైన యింజమూరి శ్రీనివాసరావు ఆదివారం రాత్రి సన్మానించారు. చేనేత నేత గుత్తికొండ ధనుంజయ రావు 14 ఏళ్ల వయసులోనే టీడీపీలో చేరి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎదిగి, ఆ పార్టీ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు.  ప్రముఖ అభ్యుదయ కవి  గోలి మధు భారతీయ ధర్మ విశ్లేషణ, నవశకం, రైతు సమరభేరి, గమనం, సంఘర్షణ, ఎదురీత వంటి కవితా సంపుటిలతో తెలుగు కవితా లోకంలో తనకంటూ ఒక పేజీని సొంతం చేసుకున్నారు. మంగళగిరిలో జర్నలిజంలో మొట్టమొదట మాస్టర్ డిగ్రీ చేసిన సీనియర్ జర్నలిస్ట్ శిరందాసు నాగార్జున రిపోర్టర్-సబ్ ఎడిటర్ నుంచి న్యూస్ ఎడిటర్ వరకు ప్రముఖ దినపత్రికలలో పనిచేసి,  40 ఏళ్లకుపైగా అనుభవంతో ‘ప్రజారాజధాని అమరావతి’ అనే పుస్తకం రాశారు. ఈ ముగ్గురుని యింజమూరి శ్రీనివాసరావు శాలువాలతో సన్మానించి, గౌరవించారు.

















Jun 12, 2026

తొలి సన్మానం


నాకు తొలి సన్మనం జరిగిన ప్రదేశానికి ఒక విశిష్టత ఉంది. సాదారణంగా నాకు సన్మానాలంటే ఇష్టం ఉండదు. అందువల్ల ఎవరైనా సన్మానం చేస్తానంటే వద్దని చెప్పేవాడిని. సంవత్సరం సరిగా గుర్తులేదు, 2002 లేదా 2003లో కడప జిల్లా  ప్రొద్దుటూరు సన్మానం చేయించుకోవలసి వచ్చింది. అక్కడి దేవాలయాలు చూడటానికి మా కుటుంబంతో వెళ్లాను.  అప్పుడు అక్కడి వార్త స్టాఫ్ రిపోర్టర్ ప్రసాద్ దగ్గర ఉండి, దేవాలన్నీ చూపించారు. చివరికి ఒక దేవాలయంలోకి వెళ్లినప్పుడు, దర్శనం అయిన తర్వాత ‘‘ఆలయ కమిటీవారు మీకు సన్మానం చేస్తారట’’ సార్ అని ప్రసాద్ చెప్పారు. ‘‘నాకు సన్మాలంటే ఇష్టం ఉండదు, వద్దు’’అని చెప్పాను. అయితే, ప్రసాద్ పట్టుబట్టారు. ‘‘ఇక్కడ బహుభాషా కోవిదుడు, 'సరస్వతీపుత్ర' పుట్టపర్తి నారాయణాచార్యులు ఈ అగస్తేశ్వర ఆలయంలోనే ఈ చెట్టు క్రింద కూర్చొని   ‘శివతాండవం’ కావ్యం రాశారు. అదే చెట్టు క్రింద మీకు సన్మానం చేస్తారు. వద్దనకండి సార్’’బతిమిలాడినట్లు అడిగారు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే నాకు తొలిసారిగా సన్మానం చేశారు.  పుట్టపర్తి నారాయణాచార్యులు అత్తగారి ఊరు  ప్రొద్దుటూరు. ఆయన అక్కడ కొంత కాలం ఉన్నారు. ఆ సమయంలోనే శివతాండవం కావ్యం రాశారు. 


https://www.youtube.com/watch?v=wSsDbPTmc_k



అత్యంత నిజాయితీపరుడైన రాజకీయ నేత ప్రగడ కోటయ్య

  జూలై 26 ఆ మహానేత 110వ జయంతి రాజకీయాలలో అత్యంత నిజాయితీపరుడైన నేత, ప్రజాబంధు  ప్రగడ కోటయ్య. టంగూటరి ప్రకాశం పంతులు, దామోదరం సంజీవయ్య, పుచ్...