Apr 23, 2026

ఏపీలో ప్లాస్టిక్ ఫ్రీ విప్లవం


రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్రీ విప్లవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుంది. చంద్రబాబు నాయకత్వంలో మానవ వనరులు అభివృద్ధి,  విద్య,  ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో   స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఈ ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకువెళుతున్నారు. ప్లాస్టిక్ వాడకం పెరిగిపోవడం వల్ల మానవాళికి, పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది.   మనుషులకు, జంతువులకు అత్యంత ప్రమాదకరమైన మైక్రో ప్లాస్టింగ్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసేందుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్  చర్యలు తీసుకుంటోంది. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి వందల ఏళ్లు పడుతుంది.  మైక్రో, నానో రూపాల్లో ప్లాస్టిక్ మన శరీరంలోకి, పశువుల కడుపులోకి చొచ్చుకుపోతుంది.   చివరికి పసికందుల రక్తంలోకి కూడా చేరుతోందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.  ఇంతటి ప్రమాదకరమైన  ప్లాస్టిక్‌కు బ్రేక్ వేయాలన్న ఉద్దేశంతో  ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా జనపనార, కాటన్ సంచుల వినియోగాన్ని  ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.  ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టి భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు,  నేలను అందించాలన్నది సీఎం చంద్రబాబు ఆకాంక్ష. ఇందుకు ప్రజల భాగస్వామ్యం కూడా ముఖ్యం. ఇదే అసలైన గేమ్ ఛేంజర్. ఇందుకోసం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రజలలో,  ఉద్యోగులలో, విద్యార్థులలో  విస్తృత ప్రచారం ద్వారా అవగాహన కల్పిస్తోంది.  ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, రీసైకిల్ చేయడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.  రాష్ట్రంలోని ఉపాధ్యాయులు,  విద్యార్థులు,  వ్యాపార, వివిధ అసోసియేషన్ల, రిటైర్డ్ ఉద్యోగుల, స్వయం సహాయక సంఘాల,  మహిళా సంఘాల సహకారంతో ఈ గేమ్ ఛేంజర్ ని తీసుకురానుంది.  క్లాత్ బ్యాగ్‌లు, జూట్ బ్యాగ్‌లు, పేపర్ ప్యాకేజింగ్ తయారీకి మహిళా సంఘాలను భాగస్వాములను చేస్తోంది. ‘క్లీన్ ఏపీ – గ్రీన్ ఏపీ’ అన్న నినాదంతో  స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్  ముందుకు వెళుతోంది.




పట్టాభిరామ్ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత రాష్ట్రపతి చేతులమీదుగా కార్పొరేషన్ 5 జాతీయ అవార్డులు అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25  అవార్డులలో ఆంధ్రప్రదేశ్‌కు ఐదు జాతీయ పురస్కారాలు లభించాయి.  విజయవాడ, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లు ఈ అవార్డులను కైవసం చేసుకున్నాయి. స్పెషల్‌ కేటగిరీ మినిస్టీరియల్‌ అవార్డు విశాఖ నగరానికి, రాష్ట్ర స్థాయి మినిస్టీరియల్‌ అవార్డు రాజమహేంద్రవరం నగరానికి, స్వచ్ఛ సూపర్‌లీగ్‌ సిటీస్‌ అవార్డులు విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలకు దక్కాయి. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏపీ పురపాలక శాఖ ఈ అవార్డులను అందుకుంది. 

రెండు వేలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలతో చెత్తను శుభ్రపర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో చెత్త పేరుకుపోకుండా ఉండేదుకు 75 వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు, 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ‘స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా 2025 అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ (గ్గాసులు, కవర్లు, బాటిళ్లు, స్ట్రాలు...)ను పూర్తిగా నిషేధించే చర్యలకు పూనుకుంది. వచ్చే జూన్ నాటికి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం. అమరావతిలోని సచివాలయం నుంచి మొదలు పెట్టి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్  కార్యాలయం,   రాష్ట్రంలోని  26 జిల్లాల్లోని 20 జిల్లాల్లో ఇప్పటికే  62 మునిసిపల్ కార్యాలయాలలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారు. వాటిని  సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ కార్యాలయాలుగా మార్చారు. ఈ కార్యాలయాల్లో ప్లాస్టిక్ బదులు త్రాగునీటి కోసం గాజు, స్టీల్ బాటిళ్లు ... వంటి ప్రత్యామ్నాయాలను వినియోగిస్తున్నారు.  రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో కూడా త్వరలోనే ఈ నిషేధం విధిస్తారు.

స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్‌కు 2025 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక స్కాచ్ గోల్డ్ అవార్డ్ లభించింది. అమరావతిలోని సచివాలయాన్ని అత్యుత్తమ పనితీరుతో దేశంలోనే మొదటిసారిగా ప్లాస్టిక్ ఫ్రీ సెక్రటేరియట్ గా మార్చినందుకు కార్పోరేషన్‌కు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. ఢిల్లీలో మార్చి నెలలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్‌ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ డి.దశరధరామిరెడ్డి ఈ అవార్డుని అందుకున్నారు. ఆ అవార్డును కార్పొరేషన్ ఎండీ బి.అనిల్ కుమార్ రెడ్డి, ఈడీ అర్జునరావులు  స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్‌ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు అందజేశారు. త్వరలో లక్ష్యాన్ని చేరుకునే విధంగా, ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వారిలో చైతన్యం కలిగించే విధంగా ప్రభుత్వం అనేక రూపాలలో ప్రచారం నిర్వహిస్తోంది.  గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెత్త పన్నుని కూటమి ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. అంతే, కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  తన స్టైల్లో  చెత్త నుంచి సంపద సృష్టించే ప్రక్రియలను కూడా ప్రారంభించారు.  సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ గ్లాసులు, సీసాలు, కవర్లు, సంచులు.... వంటి వాటిని ఇస్తే ప్రోత్సాహక బహుమతులు ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా  కొన్ని పట్టణాలలో,  గ్రామాలలో అమలు చేస్తున్నారు.  కొన్ని పట్టణాలలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ సేకరణ కేంద్రానికి వెళ్లి ఇస్తే, అక్కడ నిత్యావసర వస్తువులు వంటి వాటిని బహుమతులుగా ఇస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో  ప్లాస్టిక్ వేస్ట్ ఇస్తే, నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు.  ఇందు కోసం తెనాలి మున్సిపల్‌ కార్యాలయం, శివాజీ చౌక్‌లలో ప్లాస్టిక్‌ ప్రత్యేక  సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.  విద్యార్థులు పాత పుస్తకాలు, కార్డు బోర్టులు... వంటివాటిని ఇస్తే వారికి ప్రశంసా పత్రాలతోపాటు కొత్త పుస్తకాలు బహుమతిగా అందజేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి,  వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ‘స్వచ్ఛ రథం’ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని  ప్రారంభించింది. ఇందులో చెత్తను (ప్లాస్టిక్, బాటిళ్లు వంటివి) ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా నిత్యావసర సరుకులను పొందుతారు. ఈ కార్యక్రమం ద్వారా చెత్తను రీసైక్లింగ్ చేసి, గ్రామాల పరిశుభ్రతను పెంచుతూ,  ప్రజలకు ప్రయోజనం, పర్యావరణానికి రక్షణ చేకూరుస్తున్నారు.  ప్రస్తుతం 25 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు పనిచేస్తున్నాయి.  వాటి ద్వారా పొడి చెత్తను సేకరిస్తున్నారు. స్వచ్ఛ రథాల సంఖ్య త్వరలో వందకు పెంచుతారు.

స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కు చంద్రబాబు నాయుడే బ్రాండ్ అంబాసిడర్. ప్రతినెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర డేగా ప్రకటించి, స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర పేరిట పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో సీఎం చంద్రబాబు తప్పనిసరిగా పాల్గొంటున్నారు. 12 వేలకు పైగా ట్రైసైకిల్స్, ఇతర వాహనాల ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఐదు లక్షల ఇళ్లల్లో హోం కంపోస్టు తయారు చేయాలన్నది లక్ష్యం. ప్రస్తుతం 3.91 లక్షల ఇళ్లల్లో జరుగుతోంది. గ్రామీణ ప్రాంతంలో పది లక్షల ఇళ్లల్లో హోం కంపోస్టు తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.  త్వరలోనే ఆ లక్ష్యానికి చేరుకుంటారు.

సర్క్యులర్ ఎకానమీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లను, పార్కులను ప్రభుత్వం  ఏర్పాటు చేస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి  ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి, వేరు చేసి, శుభ్రపరుస్తారు.  యంత్రాల ద్వారా చిన్న ముక్కలుగా చేసి, కరిగించి, గుళికలు లేదా రేకులు  తయారు చేస్తారు. ఈ గుళికలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేస్తారు. వాటిని మళ్లీ కొత్త ప్లాస్టిక్ వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు. ఈ రకంగా చేయడం ద్వారా తక్కువ ముడిపదార్థాలతో  కొత్త ప్లాస్టిక్‌ వస్తువులు  ఉత్పత్తి అవుతాయి. భూమిలో ప్లాస్టిక్ పేరుకుపోవడం తగ్గుతుంది. ఆ విధంగా మనం త్వరలోనే స్వచ్ఛ అంధ్రని, స్వర్ణ అంధ్రని చూడబోతున్నాం.

 -      శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914

No comments:

Post a Comment

ఏపీలో ప్లాస్టిక్ ఫ్రీ విప్లవం

రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్రీ విప్లవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుంది. చంద్రబాబు నాయకత్వంలో మానవ వనరులు అభివృద్ధి,  విద్య...