https://des.telangana.gov.in/
రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతం, ముస్లిం బీసీ జనాభా 10.08 శాతం
ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం
ఓసీ జనాభా 13.21 శాతం, ముస్లిం ఓసీ జనాభా 2.48 శాతం
తెలంగాణ రాష్ట్రంలో ఏయే సామాజిక వర్గాలు ఎంత శాతం ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో వెల్లడైంది. ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న బీసీ ఉప సంఘానికి ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నోడల్ అధికారి అనుదీప్ దురిశెట్టి సర్వే నివేదికను అందజేశారు.
సర్వేలో 96.9 శాతం మంది లేదా 3.54 కోట్ల మంది పాల్గొన్నారు. 3.1 శాతం మంది లేదా 16 లక్షల మంది సర్వేకు అందుబాటులో లేకుండా దూరంగా ఉన్నారు.
ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతంగా ఉంది. ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, ఓసీలు 15.79 శాతం ఉన్నారు.
సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం, తెలంగాణలో మొత్తం 1,15,79,457 కుటుంబాలు ఉన్నాయి. ఈ సర్వేలో 1,12,15,134 (96.4 శాతం) కుటుంబాలు పాల్గొన్నాయి. సర్వేకు దూరంగా 3,64,323 (3.1 శాతం) కుటుంబాలు ఉన్నాయి. సర్వేలో 3,54,77,554 కోట్ల జనాభా పాల్గొంది. సర్వేకు దూరంగా 16,00,000 మంది ఉన్నారు.
జనాభాలో పురుషులు 1,79,21,183 (50.51 శాతం) మంది, మహిళలు 1,75,42,597 (49.45 శాతం) మంది ఉండగా, థర్డ్ జెండర్ 13,774 (0.04 శాతం) మంది ఉన్నారు.
సామాజిక వర్గాల వారీగా చూస్తే బీసీ జనాభా 1,64,09,179 (46.25 శాతం), ఎస్సీ 61,84,319 (17.43 శాతం), ఎస్టీ 37,05,929 (10.45 శాతం), ఓసీ 47,21,115 (13.21 శాతం), ముస్లిం బీసీ 35,76,588 (10.08 శాతం), ముస్లిం ఓసీ జనాభా 8,80,424 (2.48 శాతం) ఉన్నారు.
తెలంగాణలో 7 కులాల చేతుల్లోనే సగానికి పైగా భూమి
రాష్ట్ర కులగణన సర్వేలో భూ యాజమాన్యానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర జనాభాలో 32 శాతంగా ఉన్న రెడ్డి, యాదవ, లంబాడీ, ముదిరాజ్, మున్నూరుకాపు, కురుమ, కోయ కులాలు మొత్తం భూముల్లో 51.4 శాతాన్ని కలిగి ఉన్నాయి. 4.8 శాతం జనాభా కలిగిన రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా 13.5 శాతం భూమితో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఎస్సీ మాదిగ వంటి సామాజిక వర్గాల్లో 90 శాతం కుటుంబాలకు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నట్లు సర్వే తేల్చింది.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మొత్తం భూముల్లో సగానికి పైగా కేవలం ఏడు కులాల యాజమాన్యంలోనే ఉందని తేలింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో భూ యాజమాన్యానికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం సాగు భూమి 1.37 కోట్ల ఎకరాలు కాగా.. సగానికి పైగా రెడ్డి, యాదవ, లంబాడీ, ముదిరాజ్, మున్నూరుకాపు, కురుమ, కోయ కులాల చేతుల్లో ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర జనాభాలో వీరు 32 శాతం కాగా.. వీరి వద్ద ఉన్న భూమి మాత్రం 51.4 శాతంగా ఉంది. అంటే జనాభా నిష్పత్తి కన్నా భూ యాజమాన్యం వీరి వద్దే అధికంగా ఉంది.
ఓసీ విభాగంలోని రెడ్డి కులం భూ యాజమాన్యంలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర జనాభాలో ఈ కులం వాటా కేవలం 4.8 శాతం కాగా.. రాష్ట్రంలోని మొత్తం భూముల్లో 13.5 శాతం భూమి వీరి యాజమాన్యంలోనే ఉంది. వీరితో పాటు మరో 25 కులాలు తమ జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ భూమిని కలిగి ఉండగా.. మిగిలిన అనేక కులాలు జనాభా కంటే తక్కువ భూమితో సరిపెట్టుకుంటున్నాయి. రెడ్డి కులం తర్వాత 5.7 శాతం ఉన్న యాదవ కులం వారి వద్ద 8.7 శాతం భూమి ఉంది. ఎస్టీ లంబాడా జనాభా 6.8 కాగా.. భూమి 8.6 ఉంది. ముదిరాజ్ జనాభా 7.4 శాతం కాగా.. భూమి 7.8 శాతం కలిగి ఉంది. మున్నూరు కాపు 3.9 శాతం జనాభా ఉండగా.. భూమి 6.4 శాతం కలిగి ఉన్నారు. కురమ 2.2 శాతం జనాభా ఉండగా.. భూమి 3.6 శాతం ఉంది. కోయ 1.2 శాతం ఉండగా.. భూమి 2.8 శాతం కలిగి ఉన్నారు. ఇలా ఈ ఏడు కులాల మెుత్తం జనాభా 32 శాతం కాగా.. వీరి వద్ద ఉన్న భూమి మాత్రం 51.4 శాతంగా ఉంది.
బీసీ-బి కేటగిరీకి చెందిన కురుబ, కురుమ కులాల్లో భూమి ఉన్న కుటుంబాల సంఖ్య అత్యధికంగా ఉంది. ఈ కులాల్లో దాదాపు 62 శాతం కుటుంబాలకు సొంత భూమి ఉంది. వీరి తర్వాత ఆరేవాళ్లు, ఎస్టీ విభాగంలో కోయ, లంబాడీలు, ఎస్సీ విభాగంలో మాదాసి కులాల్లో దాదాపు 60 శాతం కుటుంబాలు భూ యాజమాన్యం కలిగి ఉన్నాయి. అయితే, ఓసీ విభాగంలోని రాజులు, బ్రాహ్మణులు, ముస్లింలు, జైన్లలో భూమి ఉన్న కుటుంబాల శాతం 10 కంటే తక్కువగా ఉండటం విశేషం. ఎస్సీ మాదిగ 10.3 శాతం ఉండగా.. భూమి 6.5 శాతంగా ఉంది. ముస్లిం 7.9 శాతం జనాభా కాగా.. భూమి 2.0 శాతం ఉంది. ఓసీ వెలమ 0.4 శాతం జనాబా ఉండగా.. భూమి 1 శాతం ఉంది.
పెద్ద కమతాలు (5-20 ఎకరాలు): ఓసీ రాజులు, బ్రాహ్మణులు, కాపులు, ఎస్టీ గోండు, కోయ కులాల్లో భూమి ఉన్న వారిలో 30 శాతం కుటుంబాలకు 5 నుంచి 20 ఎకరాల వరకు భూమి ఉంది.
చిన్న కమతాలు (5 ఎకరాల లోపు): ఎస్సీ బేడ, మాదిగ కులాల్లో 90 శాతం కుటుంబాలకు 5 ఎకరాల కన్నా తక్కువ భూమి మాత్రమే ఉంది.
భారీ కమతాలు (20 ఎకరాల పైబడి): 20 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న కుటుంబాలు అత్యధికంగా జైన్లలో (8.2 శాతం), రాజుల్లో (7.5 శాతం), బ్రాహ్మణుల్లో (6.8 శాతం), బీసీ గంగిరెడ్లవారిలో (6 శాతం) ఉన్నాయి.
----------------------
పద్మశాలీలను బలిచేశారు
కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కులగణనలో పద్మశాలీలకు తీవ్ర అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 2015లో 18 లక్షల జనాభాను చూపించారు. సర్కార్ తాజాగా ప్రకటించిన కులగణన సర్వేలో పద్మశాలీలను కేవలం 11,79,031గా చూపించింది. 11 ఏండ్లలో జనాభా పెరగాలి కానీ తగ్గుతుందా? ఇది పూర్తిగా బీసీల్లో పద్మశాలీలను అణగదొక్కే ప్రయత్నంగానే భావిస్తున్నాం. ఉద్దేశపూర్వకంగానే జనాభాను తక్కువగా చూపిస్తున్నారు. వాస్తవానికి 30 లక్షల నుంచి 35 లక్షల జనాభా ఉన్నది. 18 లక్షల ఉన్న జనాభా 11 లక్షలకు ఏట్లా వస్తది? అందులో 19 ఉపకులాలు ఉండగా ఉపకులాలు ఊసేలేదు. వారికి నచ్చినట్టు మార్పులు చేసుకొని డిక్లేర్ చేసుకున్నారు. ఎక్కువ జనాభా చూపిస్తే ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ల అధికారం కోసం, సీట్ల కోసం పద్మశాలీలను బలిపెట్టారు.
– వల్లకాటి రాజ్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం అధ్యక్షుడు

No comments:
Post a Comment