మంగళగిరి: తెలుగుదేశం పార్టీ పదవులు పద్మశాలి ప్రముఖులు ముగ్గురిని వరించాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఉదయం పార్టీ పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన గుత్తికొండ ధనుంజయ రావు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా ప్రమాణస్వీకారం చేయగా, రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన పంచుమర్తి అనురాధ, కర్నూలుకు చెందిన డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్ లు ప్రమాణ స్వీకారం చేశారు.
గుత్తికొండ ధనుంజయ: గుత్తికొండ సీతారామయ్య, లక్ష్మీకాంతమ్మ దంపతులకు ధనుంజయ రావు 1968 జూన్ 1వ తేదీన జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య 5వ తరగతి వరకు మంగళగిరి మూర్తి స్కూల్ లో చదివారు. ఆ తర్వాత చింతక్రిది కనకయ్య హైస్కూల్ లో 6వ తరగతి చదివారు. వివిధ కారణాల వల్ల చదువు మానివేశారు. ఆ తర్వాత 1989లో ప్రైవేటుగా ఆంధ్ర యూనివర్సిటీ మెట్రిక్ పరీక్ష రాసి పాసయ్యారు. 1990 మే 5న గుంటూరుకు చెందిన కాకుమాను పాపయ్య, తేరోజమ్మల కుమార్తె విజయకుమారిని వివాహం చేసుకున్నారు.
14 సంవత్సరాల వయసులో చేనేత మగ్గం నేస్తూ.. అప్పుడే పుట్టిన తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. ఎన్టీఆర్ మీద అభిమానంతో ఆయన ఎక్కడ సభలు పెట్టినా అక్కడికి వెళ్లేవారు. మొట్టమొదటిసారిగా మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా 1983లో, 1985లో పోటీ చేసిన డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావుకి, 1989లో ఎలయన్స్ లో సిపిఎం అభ్యర్థి సింహాద్రి శివారెడ్డికి, 1994 సిపిఎం అభ్యర్థి నిమ్మగడ్డ రామ్మోహన్ రావు, 1999లో బిజెపి అభ్యర్థి ఎడ్లపాటి రఘునాథ బాబుకి, 2004లో బిజెపి అభ్యర్థి తమ్మిశెట్టి జానకి దేవికి, 2009లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మాదల రాజేంద్రకి, 2014లో గంజి చిరంజీవికి, 2019లొ నారా లోకేష్ కి ఎన్నికల్లోమద్దతుగా పనిచేశారు. 2024 లో నారా లోకేష్ విజయం కోసం అంకితభావంతో పనిచేశారు. 1988లో పట్టణ తెలుగు నాడు చేనేత కార్మిక సంఘం ఉపాధ్యక్షులుగా, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులుగా 1994 వరకు పనిచేశారు. 1995 నుండి పట్టణ తెలుగు నాడు చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా నిరంతరం శ్రమించారు. 2006లో కొత్తగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర చేనేత విభాగం ఏర్పాటు చేయగా, రాష్ట్ర కార్యవర్గంలో చేనేత విభాగం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా 2019 వరకు కొనసాగారు. 2022 నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. బీసీలను కూడగట్టడంలో విశేష కృషి చేశారు. బీసీలను పార్టీ వైపు మళ్లించడానికి నిరంతరం శ్రమించి బీసీ నేతగా ఎదిగారు. ఓ పక్క చేనేత కార్మికుల కోసం పోరాడుతూ, మరోపక్క బీసీలను ఐక్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ, మరో పక్క అయిదేళ్ల నుంచి మంగళగిరి సాహితీ కళా వేదిక కన్వీనర్ గా కళాసేవ చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీనే నమ్ముకుని పని చేస్తూ, సౌమ్యుడిగా పేరు పొందిన ధనుంజయరావుని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమించింది.
పంచుమర్తి అనురాధ: పంచుమర్తి అనురాధ: స్వర్గం పుల్లారావు, లక్ష్మి దంపతులకు పంచుమర్తి అనురాధ 1974లో జన్మించారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆమె విద్యాభ్యాసం వివిధ ప్రాంతాలలో చేశారు. ప్రాథమిక విద్య హైదరాబాద్ సెయింట్ ఆన్స్ పాఠశాలలో, ఆ తర్వాత విజయవాడ అట్కిన్‌సన్ హైస్కూల్‌లో చదివారు. విజయవాడ స్టెల్లా కాలేజీల ఇంటర్ , గుంటూరు జేకేసీ కళాశాలలో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేశారు. డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగానే, ఆమె పారిశ్రామికవేత్త పంచుమర్తి శ్రీధర్ తో వివాహం జరిగింది. అనూరాధ వివాహానంతరం 2010లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చేశారు.
ఆమె తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2000లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. మేయర్ టికెట్ కోసం ఆమె టీడీపీకి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 18 మంది పోటీ పడగా, విద్యాధికురాలైన అనురాధకు చంద్రబాబు నాయుడు టికెట్ ఖరారు చేశారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి 6,800 ఓట్ల మెజారిటీతో మేయర్‌గా గెలిచారు. మేయర్‌గా ఎన్నికైన నాటికి ఆమె వయసు 26 సంవత్సరాలు మాత్రమే. దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్‌గా ఆమె పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. పంచుమర్తి అనురాధ ఆ తరువాత పార్టీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. అధికార ప్రతినిధిగా ప్రతిపక్షాల విమర్శలకు ధీటైన రీతిలో సమాధానాలు చెబుతూ, ఫైర్ బ్రాండ్ గా పేరుపొందారు. 2023లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేలు ఎంపిక చేసే కోటాలో ఆమె గెలుపొందారు. 2024 నవంబర్ 12న ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చీఫ్ విప్‌గా అనురాధ నియమితురాలయ్యారు. ఇప్పుడు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలయ్యారు.
డాక్టర్ సంజీవ్ కుమార్: వస్త్ర వ్యాపారరంగంలో ప్రముఖులైన శ్రీ శింగరి శ్రీరంగం, రంగమ్మ పుణ్య దంపతులకు 1967 జనవరి 3న కర్నూలు నగరంలో డాక్టర్ సంజీవ్ కుమార్ జన్మించారు. సంజీవ్ కుమార్ బాల్యం నుంచి ఆట పాటలతోపాటు చదువులో ప్రతిభ కనపరిచేవారు. శింగరి శ్రీరంగం కుటుంబంలో సంజీవ్ కుమార్ ఒక్కరే డాక్టర్ కాదు. ఆయన ఇద్దరు సోదరులు, ముగ్గురు సోదరీమణులు మొత్తం ఆరుగురూ డాక్టర్లే. వారంతా ప్రభుత్వ కాలేజీలలో ఎంబీబీఎస్ సీట్లు సాధించడం విశేషం. అంతే కాదు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లు కూడా డాక్టర్లే. ఈ కుటుంబంలో మొత్తం 21 మంది డాక్టర్లు ఉన్నారు. 1984-1990లో కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులయ్యారు. 1992-1995 మధ్య కాలంలో కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంఎస్ జనరల్ సర్జరీ చదివారు. సంజీవ్ కుమార్ 1992 మార్చి 4న డాక్టర్ వసుంధరనుపెళ్లి చేసుకున్నారు. డాక్టర్ సంజీవ్ కుమార్ 2006 నుంచి 2022 వరకు‘ఆయుష్మాన్ ద ఫ్యామిలీ హాస్పిటల్’ద్వారా పేదలకు అందుబాటులో వైద్యం సేవలు చేశారు. రాజకీయాలలో స్థిరపడి, ప్రజలకు ఇంకా చేరువై సేవచేయాలని 2019లో రాజకీయాలలోకి ప్రవేశించారు. 2019 ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు లోక్ సభ నియోజకవర్గం నుంచి లక్షా 48వేల ఓట్ల మెజార్టీతో సంజీవ్ కుమార్ విజయం సాధించారు.
కర్నూలు ఎంపీగా ప్రశ్నలు అడగడంలో, ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టడంలో, చర్చలలో పాల్గొనడంలో ఆయన ఓ రికార్డును స్థాపించారు. డాక్టర్ సంజీవ్ కుమార్ 6 ప్రైవేటు బిల్లులు లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. పార్లమెంట్ 72 సంవత్సరాల చరిత్రలో కర్నూలు ఎంపీగా ఎన్నికైన ఎవరూ సభలో ఇన్ని ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టలేదు. కర్నూలుకు సంబంధించి లోక్ సభ చరిత్రలో డాక్టర్ సంజీవ్ కుమార్ సృష్టించిన రికార్డు ఇది. 17వ లోక్ సభలో డాక్టర్ సంజీవ్ కుమార్ 225 ప్రశ్నలు లేవనెత్తారు. ఒక పద్మశాలి లోక్ సభ సభ్యుడు ఈ స్థాయిలో ప్రశ్నించడం, చర్చలలో పాల్గొనడం, ప్రశ్నలు లేవనెత్తడం చేనేత వర్గాలు గర్వకారణంగా భావించాయి. ఉన్నత చదువులు చదివిన నిజాయితీపరులు లోక్ సభకు ఎన్నికైతే దేశానికి ఎంత ప్రయోజనకరమో డాక్టర్ సంజీవ్ కుమార్ చేసి చూపించారు. 2024 ఎన్నికల ముందే ఆయన టీడీపీలో చేరారు. డాక్టర్ సంజీవ్ కుమార్ విద్యార్హతలు, ప్రజాసేవా కార్యక్రమాలు, పార్లమెంటులో ఆయన చూపిన ప్రతిభ ఆదారంగా, ఆయనను పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎంపిక చేశారు.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914
No comments:
Post a Comment