Jul 21, 2017

తూర్పుగోదావరి జిల్లాలో జయ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రతిపాదన


మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
ఉప ముఖ్యమంత్రి కేఈ సమక్షంలో కేరళ మంత్రితో చర్చలు
సచివాలయం, జూలై 20: జయ ధాన్యం, బియ్యం  కేరళ ప్రభుత్వానికి సరఫరా చేయడం కోసం తూర్పుగోదావరి జిల్లాలో  ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు  ప్రతిపాదించారు. సచివాలయం 2వ బ్లాక్ లోని తన  చాంబర్ లో కేరళకు ధాన్యం, బియ్యం, మిర్చి, పసుపు వంటివి సరఫరా చేసే అంశం పై ఇరు రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ మంత్రులు ప్రతిత్తిపాటి, పి.తిలోత్తమన్, అధికారులు, మిల్లర్లు, వ్యాపారులతో ఉప ముఖ్య మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి  చర్చించారు. ఈ సందర్భంగా కేరళ అధికారులు మాట్లాడుతూ తమ రాష్ట్రంలో పౌరసరఫరాల దుకాణాల ద్వారా 13 రకాల వస్తువులు సబ్సిడీపై అందజేస్తున్నామని తెలిపారు.  తమకు నెలకు 6,500 టన్నుల చొప్పున ఏడాదికి 72 వేల టన్నుల జయ బాయిల్డ్ బియ్యం అవసరమవుతుందని చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం వండితే రేపు ఉదయం వరకు తినడానికి ఉపయోగపడేవిధంగా ఉండే నాణ్యమైన, స్వచ్ఛమైన జయ బియ్యం కావాలని తెలిపారు. ప్రస్తుతం ఆ బియ్యం రూ.35.55లకు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఓనం పండుగ జరుగుతుందని, ఆగస్ట్ నెలలో తమకు బియ్యం సరఫరా చేయాలని వారు కోరారు.

జయ ధాన్యం మన రాష్ట్రంలో ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే పండుతున్నాయని మన రాష్ట్ర అధికారులు, మిల్లర్లు తెలిపారు. మన రాష్ట్రం నుంచి కేరళ రాష్ట్రానికి కావలసిన మొత్తం బియ్యం సరఫరా చేయగలమని, అయితే ప్రస్తుతం ఆ ధరకు సరఫరా చేయడం సాధ్యం కాదని తెలిపారు. వండిన అన్నం 24 గంటల వరకు నిల్వ ఉండాలంటే డబల్ బాయిలింగ్ కు  ప్రాసెసింగ్ సమయం 15 నుంచి 16 గంటలు పడుతుందని, అందువల్ల నాణ్యమైన జయ బియ్యం రూ.45 నుంచి రూ.47లకు సరఫరా చేయడం సాధ్యమవుతుందని వివరించారు. దీర్ఘకాలిక ప్రాతిపదికన పంట సమయంలో కొనుగోలు చేస్తే అటు కేరళ వినియోగదారులకు, ఇటు ఇక్కడ రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రస్తుతం కేరళకు ప్రైవేటు వ్యక్తులు సరఫరా చేసే బియ్యం ఒరిజినల్ జయ రకం కాదని, వాటిని పోలిన కురవ బియ్యం అని తెలిపారు. ఆ ధాన్యం మన రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పండుతాయని, అయితే అవికూడా మంచి రకమేనని, జయ బియ్యం వాటికంటే మంచివని తెలిపారు. అలాగే ప్రైవేటు వ్యక్తులు సరఫరా చేసే బియ్యం బాయిల్డ్ ప్రాసెస్ 8 గంటలే ఉంటుందని చెప్పారు. కార్పోరేషన్ ద్వారా సరఫరా చేసే రకం నాణ్యమైనదై, వండిన తరువాత అన్నం నిల్వ ఉండేదై ఉండాలని, అందువల్ల ఆ ధరలకు సరఫరా చేయడం వీలుకాదని తెలిపారు. ఒక ధర నిర్ణయించి, ఏడాది పొడవునా అదే ధరకు సరఫరా చేయడం కూడా సాధ్యం కాదని తెలిపారు. ఇతర రకాలైతే రూ.30 రూపాయలకే సరఫరా చేయగలమని వ్యాపారులు చెప్పారు.
చివరకు మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ ఆ ధాన్యం ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే పండుతున్నందున కేరళకు సరఫరా చేయడానికి పౌరసరఫరాల కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఆ జిల్లాలో ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే మంచిదన్నారు. ఆ కేంద్రలో కేరళ, తమ కార్పోరేషన్ సిబ్బంది కూడా ఉండి  పంట సమయం మార్చి, ఏప్రిల్ నెలల్లో కొనుగోలు చేస్తారని, రైతుల వద్ద కొనుగోలు చేసిన ధరపై కమిషన్ మాత్రమే తీసుకొని సరఫరా చేయాలన్న ప్రతిపాదన చేశారు. ఆ విధంగా చేస్తే కేరళ వినియోగదారులకు తక్కువ ధరకు బియ్యం లభిస్తాయని, ఇక్కడ రైతులకు లాభం చేకూరుతుందని చెప్పారు. జయ, 1010 రకం ఒరిజినల్  బాయిల్డ్ బియ్యం శాంపిల్ కవర్ ను శుక్రవారం అందజేస్తామని అధికారులు తెలిపారు. తాము కొనుగోలు చేసే బియ్యం శాంపిల్స్ ను కూడా తాము పంపుతామని కేరళ అధికారులు చెప్పారు. మళ్లీ తరువాత సమావేశమై ఒక నిర్ణయం తీసుకుందామని ఇరు రాష్ట్రాల మంత్రులు ఒక అంగీకారానికి వచ్చారు. ఈ విధంగా ఇరు ప్రభుత్వాలు రంగంలోకి దిగితే రైతులు కూడా ఆసక్తి చూపుతారని  పలువురు అభిప్రాయపడ్డారు. పంట సమయంలో కొనుగోలు తాము పూర్తి సహకారం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి కెఈ, మంత్రి ప్రత్తిపాటి కేరళ మంత్రికి హామీ ఇచ్చారు. ఈ చర్చల్లో ఇరు రాష్ట్రాల మంత్రులతోపాటు కేరళ రాష్ట్ర  పౌరసరఫరాల కార్పోరేషన్ చైర్మన్ అండ్ ఎండి ఏపీఎం మోహ్మద్ హనీషా, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ లోహిత్, మన రాష్ట్ర  పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్, పౌరసరఫరాల కార్పోరేషన్ ఎండి కె.రామ్ గోపాల్, మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సెలక్ట్ చానల్ పేరుతో వాటర్ బాటిళ్లను అధిక ధరలకు అమ్ముతూ విదేశీ కంపెనీలు రాష్ట్రంలోని వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నాయని అన్నారు. అటువంటి అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు : తమ రాష్ట్రానికి అతి ముఖ్యమైన ఆహార ధాన్యాల సరఫరాపై చర్చించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తికి కేరళ పౌరసరఫరాల శాఖ మంత్రి తిలోత్తమన్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. సంస్కృతి సంప్రదాయలు, ప్రజాపంపిణీ వ్యవస్థ, విద్య, సాంఘీక సంక్షేమం, ఆహారపు అలవాట్లు, వ్యవసాయం వంటి అంశాల్లో  ఇరు రాష్ట్రాల మధ్య సారూప్యత ఉన్నట్లు పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత ఉన్నందున ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రైవేటు వ్యాపారుల ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. తమకు కావలసిన జయ ధాన్యం తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే పండుతుందన్నారు. అయితే ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎటువంటి ఒప్పొందం లేకపోవడంతో రైతులకు ప్రయోజనం చేకూరటంలేదని,  ప్రైవేటు వ్యాపారులు లాభాలు ఘడిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై ఇరు రాష్ట్రా మధ్య ఒక ఒప్పొందం జరిగితే అటు కేరళ ప్రజలకు, ఇటు ఇక్కడ రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రస్తుతం జరిగిన చర్చల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

Jul 20, 2017

అన్ని హంగులతో అత్యాధునికంగా శాఖమూరు పార్కు


మంత్రి నారాయణ
Ø 4 జోన్లుగా విభజన
Ø వచ్చే సంక్రాంతికి పూర్తి
సచివాలయం, జూలై 19: నూతన రాజధాని అమరావతిలో అన్ని హంగులతో అత్యాధునికంగా శాఖమూరు పార్కును రూపొందించనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.  సీఆర్‌డీఏ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) అధికారులతో బుధవారం మధ్యాహ్నం  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారాంతపు సమీక్ష సమావేశం ముగిసిన తరువాత ఆ వివరాలను మంత్రి మీడియాకు తెలిపారు.  అహ్మదాబాద్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్ మెట్ సంస్థ శాఖమూరు పార్కు డిజైన్ ను  రూపొంది ఇచ్చినట్లు తెలిపారు. 241 ఎకరాలలో ఏర్పాటు చేసే ఈ పార్కుని ప్రధానంగా నాలుగు జోన్లుగా విభజించినట్లు చెప్పారు.  మొదటి జోన్ 85 ఎకరాలు, రెండవ జోన్ 34 ఎకరాలు, మూడవ జోన్ 49 ఎకరాలు, నాలుగో జోన్‌ అంబేద్కర్ పార్కుతో కలిపి 73 ఎకరాలు ఉంటుందని వివరించారు. మొదటి జోన్‌లో 46 ఎకరాలలో ఏర్పాటు చేసే అమ్యూజ్‌మెంట్ పార్కులో వాటర్ వరల్డ్ తోపాటు క్రాఫ్ట్ బజార్ ఉంటాయని తెలిపారు. రెండవ జోన్ ను పూర్తిగా చిల్డ్రన్స్ కు కేటాయించారని, సాహస క్రీడలలు, చిల్డ్రన్ అడ్వెంచర్, అవుట్ డోర్ జిమ్ ఉంటుందని చెప్పారు.  మూడవ జోన్‌లో ఫ్లవర్ గార్డెన్,  డక్ పాండ్ ఉంటుందని తెలిపారు.  జోన్ 4లో కల్చరల్ మ్యూజియం, అంబేద్కర్ పార్కు, ఇండోర్ అథ్లెటిక్ సెంటర్, స్పోర్ట్స్ క్లబ్,   5 స్టార్ హోటల్  వంటివి ఉంటాయని చెప్పారు. ఇక్కడే అంబేద్కర్ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తార్నారు. అన్ని జోన్లలో ఫుడ్ కోర్టులు ఉంటాయని తెలిపారు. త్వరలో పార్కుకు టెండర్లు పిలుస్తారని, వచ్చే సంక్రాంతి నాటికి నిర్మాణం పూర్తి చేసి ఈ పార్కును ప్రారంభిస్తారని మంత్రి నారాయణ చెప్పారు. ఈ పార్కుకు ‘గాంధీ మెమోరియల్’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
రాజధానిలో రోడ్ల ప్యాకేజీలు కూడా చివరి దశకు వచ్చాయని, రోడ్ల నిర్మాణానికి 18 నెలల సమయం ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. అలాగే హోటళ్లు నిర్మించడానికి ఆసక్తి కనపరిచిన వారిని పిలిపించి మాట్లాడినట్లు చెప్పారు. వారికి కేటాయించే భూమి విలువను ఎకరా మూడు కోట్ల రూపాయలుగా ప్రతిపాదించినట్లు తెలిపారు. హోటళ్ల ఏర్పాటుకు ఆర్థికంగా సమర్థులను ఎంపికచేయనున్నట్లు మంత్రి చెప్పారు.

దేశంలోనే మోడల్ గ్రామంగా చల్లపల్లి


స్వచ్చాంధ్ర మిషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సీఎల్ వెంకట్రావు

సచివాలయం, జూలై 19: కృష్ణా జిల్లాలోని చల్లపల్లి గ్రామాన్ని దేశంలోనే మోడల్ గ్రామంగా తీర్చిదిద్దారని స్వచ్చాంధ్ర మిషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సీఎల్ వెంకట్రావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. చల్లపల్లిని పట్టణాలకు ధీటుగా అన్ని విధాలా మోడల్ గ్రామంగా రూపొందించడంలో డాక్టర్ డి. రామకృష్ణ ప్రసాద్, డాక్టర్ పద్మావతి దంపతుల పాత్ర కీలకంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రధాన మంత్రి స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రకటించిన రోజు 2014 అక్టోబరు 2 నుంచి చల్లపల్లిలో ఆయన ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన ‘మనకోసం మనం ట్రస్ట్’ ఏర్పాటు చేసి తన సొంత డబ్బుతోపాటు స్నేహితులు, ఇతరు వద్ద నుంచి నిధులు సేకరిస్తూ ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు.  గ్రామంలో అండర్ గ్రౌడ్ డ్రైనేజీని అభివృద్ధి చేయడంతోపాటు ఆ డ్రైనేజీపైన మొక్కలు పెంచడం, రోడ్ల పక్కన మొక్కలు నాటి, ట్రీగార్డ్స్ ఏర్పాటు చేసి వాటిని సంరక్షించడం, పార్కుని దత్తత తీసుకొని అత్యాధునికమైన టాయిలెట్స్ ఏర్పాటు చేయడం,డంప్ యార్డ్ ని, స్మశానవాటికను, బస్టాండ్ ను శుభ్రం చేయడం వంటి అనేక పనులు చేస్తున్నట్లు వివరించారు. ఆగస్ట్ 7వ తేదీ నాటికి ఆయన ఈ కార్యక్రమాలు చేపట్టి వెయ్యి రోజులు పూర్తి అవుతుందని, ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చల్లపల్లి గ్రామాన్ని సందర్శించి, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తారని చెప్పారు.
 డాక్టర్ రామకృష్ణ ప్రసాద్ సేవలను గుర్తించి సీఎం ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర మిషన్ రాష్ట స్థాయి సభ్యునిగా నియమించినట్లు తెలిపారు. ఈ మిషన్ లో తను కాకుండా  అనధికార సభ్యులు ఎవరూ లేరని, ఇది ఆయనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు వెంకట్రావు చెప్పారు.

Jul 18, 2017

అవినీతి నిర్మూలనే సంతృప్తి


  • సంక్షేమశాఖలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రయత్నం
  • యువత స్థిరపడేందుకు కార్యాచరణ విధానం
  • సాయం కాదు ఉపాధి కల్పించేలా ప్రణాళికలు
  • ఎంఎస్‌ఎంఈ పథకం ద్వారా వెయ్యి గ్రూపులకు రుణం
  • 352 మంది కాపు విద్యార్థులకు విదేశాల్లో విద్య
  • 3.3 లక్షల మంది కాపు విద్యార్ధులకు ఉపకార వేతనాలు
  •  పీపీపీ పద్ధతిలో వృద్ధాశ్రమాల నిర్మాణం       


 ప్రభుత్వం పేదల అభ్యున్నతికి ఎన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా అవినీతిని నిర్మూలించిన నాడే ప్రజల్లో సంతృప్తి కనిపిస్తుంది.  అందువల్ల ఎక్కడా అవినీతి జరగకుండా లబ్దిదారునికి వందశాతం ప్రయోజనం చేకూరేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థలో సాంకేతికతను విస్తృతస్థాయిలో వినియోగిస్తోంది.  అధికారులు-ఉద్యోగుల్లో జవాబుదారీతనాన్ని పెంచుతోంది.  2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను సంతృప్తికరమైన రాష్ట్రం(హ్యాపీ స్టేట్‌)గా చేసేందుకు అవినీతి నిర్మూలనతోపాటు కుటుంబ వికాసం, సమాజ వికాసం, జీవీఏ(రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల్లో ఉత్పత్తి విలువ), ముఖ్యమైన పనితీరు సూచిక, సమ్మిళిత వృద్ధి లక్ష్యాల సాధనే ప్రాతిపదికగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది.  అన్నిటా రాయితీలు కాకుండా ప్రజల  తల రాతలు మార్చాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. సమాజంలో ఆర్ధికంగా వెనుకబడిన అందరినీ మిగిలినవారితో సమానంగా అన్ని రంగాల్లో ఎదిగేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆ లక్ష్యం నెరవేరాలంటే ఉచిత పథకాలు, రాయితీలు సరిపోవు. ప్రతి ఒక్కరు కనీసం నెలకు రూ. 10 వేల ఆదాయమైనా ఆర్జించేలా మార్గాలు రూపొందిస్తోంది. ప్రజా సాధికార సర్వే ఆధారంగా దళిత, గిరిజన ప్రజల ఆర్ధిక, సామాజిక స్థితిగతులను అంచనా వేసి వారికి చేయూతను ఇచ్చేందుకు సూక్ష్మ, విస్తృత స్థాయి ప్రణాళికలు అమలు చేయనుంది.  గత విద్యా సంవత్సరంలో 14,69,321 మంది ఎస్సీ విద్యార్ధులకు రూ. 3,031 కోట్ల ఉపకార వేతనాలు అందించింది.  జ్ఞానభుమి వెబ్‌సైట్‌ లో నమోదు చేసిన తరువాత విద్యార్ధులకు ప్రతి నెలా ఉపకార వేతనాలు అందే ఏర్పాటు చేస్తోంది.  జాతీయ స్థాయిలో పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చినవారిని రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు తీసుకువెళ్లి,  వారి విజయగాధలను విద్యార్ధులకు తెలియజేసి వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాపు, బ్రాహ్మణ కార్పోరేషన్‌లతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి సంక్షేమ పథకాలలో సారూప్యత తీసుకురావాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది.  యువత జీవితంలో స్థిరపడేలా అధికారులు, బ్యాంకర్లు కార్యాచరణ విధానం రూపొందించి అమలు చేయాలని, నెలనెలా నివేదికలు రూపొందించి లోపాలను సరిదిద్దే ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇప్పటివరకు ప్రభుత్వ సాయంతో యువత నెలకొల్పదలచిన స్వయం ఉపాధి యూనిట్లు వచ్చే ఆగస్ట్ 31 నాటికి వంద శాతం కార్యరూపం దాల్చాలని  లక్ష్యంగా  నిర్దేశించారు. ప్రభుత్వం అందించే సాయం వారికి జీవితాంతం ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు.  స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న వారి నైపుణ్యాలు గుర్తించి, అవసరమైన నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించిన అనంతరం యూనిట్లు మంజూరు చేస్తారు. సంక్షేమ కార్యక్రమాల అమలులోనూ బయోమెట్రిక్ విధానం తప్పనిసరి చేయనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను సమాజంలో అందరితో సమానంగా ఎదిగేలా అవకాశాలు కల్పించడంతో పాటు అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన కాపులు, బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. కాపులకు రూ. వెయ్యి కోట్లు, బ్రాహ్మణులకు రూ. 75 కోట్లు కేటాయించింది. గతేడాది 58,685 మంది కాపు యువతకు స్వయం ఉపాధి పథకం కింద ఆర్ధిక సాయం చేయాలని లక్ష్యం పెట్టుకోగా, 52,776 మందికి సాయం అందించింది. అలాగే చిన్నచిన్న సంఘాలుగా ఏర్పడే వారికి ఎంఎస్‌ఎంఈ పథకం కింద రూ. 250 కోట్లను కనీసం వెయ్యి గ్రూపులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ గ్రూపులన్నీ ఈ నెలాఖరులోపల  యూనిట్లు నెలకొల్పనున్నాయి. 2016-17లో విదేశీ విద్యా దీవెన పథకం కింద విదేశాల్లో చదివేందుకు 398 మంది కాపు విద్యార్దులు అర్హత సాధించగా, 352 మంది ఇప్పటికే విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం 34.30 కోట్లు వ్యయం చేసింది. ఈ పథకానికి ఈ విద్యాసంవత్సరం మరింత స్పందన వచ్చింది.  510 మంది విద్యార్ధులు విదేశాల్లో చదివేందుకు ఆసక్తి కనబరుస్తూ దరఖాస్తులు సమర్పించారు.
సివిల్స్, బ్యాంకింగ్ సహా వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇప్పించే విద్యోన్నతి పథకం కింద గతేడాది 5,796 మంది కాపు అభ్యర్ధులు ఎంపికయ్యారు. వీరంతా దాదాపు 50 ప్రముఖ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. కాపు యువతలో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇవ్వడంతో పాటు విజయవాడ, తిరుపతిలో జాబ్ మేళాలు నిర్వహించింది. ఇంటర్మీడియేట్ చదివే పేద కాపు విద్యార్ధులకు రూ. 6 వేలు, డిగ్రీ ఇంకా ఉన్నత విద్యాభ్యాసం చేసే వాళ్లకు రూ. 10 వేల చొప్పున ఉపకార వేతనాలు ఇస్తోంది. గత విద్యా సంవత్సరం 3.3 లక్షల మంది కాపు విద్యార్ధులకు ఉపకార వేతనాల కోసం రూ. 238 కోట్లు కేటాయించింది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ రెండు ఎకరాల విస్తీర్ణంలో ఒకొక్కటి రూ. 5 కోట్ల వ్యయంతో కాపు భవనాలను  నిర్మిస్తోంది. కాకినాడ, ఏలూరు, కడప, తిరుపతి, నెల్లూరులో ఇప్పటికే భూకేటాయింపులు పూర్తికాగా కర్నూలు, గుంటూరు, అనంతపురం, విజయనగరంలో భూమిని గుర్తించారు.    బ్రాహ్మణులకు విజయవాడలో బ్రాహ్మణ కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంకును ప్రారంభించారు. అరుంధతి పేరుతో బ్రాహ్మణ మహిళా సంఘాలకు, వశిష్ట పేరుతో బ్రాహ్మణ పురుషుల సంఘాలకు రుణాలు అందిస్తున్నారు. కశ్యప ఆహార-ఆవాస పథకం కింద బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన 6,500 మంది వృద్ధులు, వితంతువులకు నెల నెలా రూ.1,000 చొప్పున బ్యాంక్ ఖాతాలలో బ్రాహ్మణ కార్పోరేషన్ జమ చేస్తోంది. ఇందుకోసం ఏడాదికి రూ. 7 కోట్లు వినియోగిస్తోంది. 
        వికలాంగులకు నెలనెలా రూ. 1,500 పింఛను ఇస్తున్న ప్రభుత్వం వారు కులాంతర వివాహాలు చేసుకుంటే రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు సాయం చేస్తోంది. 5,500 మంది విభిన్న ప్రతిభావంతులకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌లు ఇస్తోంది. వికలాంగుల కోసం విజయవాడలో ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, అంధుల కోసం కాకినాడ, అనంతపురంలో పాఠశాలలు ఏర్పాటు చేస్తోంది. వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీతో పాటు ప్రభుత్వం చేపట్టే గృహనిర్మాణంలో వారికి 3శాతం  రిజర్వేషన్ కల్పించాలని, 2,500 మోటరైజ్డ్ ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు ఈ ఏడాది పంపిణీ చేయాలని నిర్ణయించారు. మొత్తంమ్మీద వికలాంగుల సంక్షేమానికి ఈ ఏడాది రూ. 89.51 కోట్లు కేటాయించింది. అలాగే ఏ ఆదరణ లేని వయోవృద్ధుల కోసం విశాఖపట్నం, గుంటూరు, అనంతపురంలో పీపీపీ పద్ధతిలో వృద్ధాశ్రమాలు నిర్మించనున్నారు. 

        విద్యార్ధులు, యువతలో నైపుణ్యాభివృద్ధిని మెరుగుపరిచి ఉద్యోగ-ఉపాధి అవకాశాలను సుగుమం చేస్తోంది. 2016-17 సంవత్సరంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 1,51,311 మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వగా, 36,940 మందికి ఉపాధి లభించింది. నైపుణ్యాభివృద్ధి పెంపు కార్యక్రమం కింద మొత్త 13 జిల్లాల్లో 47 జాబ్ మేళాలను నిర్వహించింది. 19 ఐటీఐలను వరల్డ్ బ్యాంక్ నిధులతో అభివృద్ధి పరుస్తోంది. మరో 31 ఐటీఐలను పీపీపీ పద్ధతిలో ఉన్నతీకరిస్తోంది. మైనారిటీ విద్యార్ధుల కోసం నరసరావుపేటలో ప్రత్యేకంగా ఒక ఐటీఐని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇంకా మోడల్ ఆర్ఐటీఐలను ప్రత్తిపాడు, తిరుపతిలో ఎస్సీల కోసం, అచ్యుతాపురంలో ఎస్టీల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వంలో అన్ని స్థాయిల్లో అవినీతిని రూపుమాపి  విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల్లో సంతృప్తి కనిపించేవిధంగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.
-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్


కూటమి అభ్యర్థులను గెలిపించండి : పట్టాభిరామ్ పిలుపు

కూటమి ఆధ్వర్యంలో విజయవాడలో భారీ రోడ్ షో విజయవాడ: విజయవాడ కార్పోరేషన్ ఎన్నికలలో  టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు...