Nov 14, 2019


హైదరాబాద్‌ కేంద్ర పాలిత ప్రాంతం - దేశ రెండో రాజధాని
సర్వత్రా చర్చ
          
  హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం, దేశ రెండవ రాజధాని అవుతుందన్న ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన సమయంలో కేంద్ర పాలిత ప్రాంతం అంశం తెరపైకి వచ్చింది. ఒక దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను విడగొట్టి, హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అయితే  తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం ఎలా చేస్తారన్న విమర్శలు వినవచ్చాయి.   ఆ తరువాత ఆ ఊసే లేదు. అయితే ఇటీవల మళ్లీ హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేసే అవకాశం ఉందని, కేంద్రం ఈ అంశాన్ని పరిశీలిస్తుందని కూడా విస్తృతంగా ప్రచారంలో ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్, పార్టీ, దేశ ప్రయోజనాల రీత్యా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అంతే కాకుండా దక్షిణాదిన బలపడాలన్న ఆలోచనతో బీజేపీ ఉంది. కశ్మీర్ విషయంలో ఎవరూ ఊహించని రీతిలో హఠాత్తుగా సంచలన నిర్ణయం తీసుకుంది.  370 ఆర్టికల్ ని రద్దు చేసి దేశ వ్యాప్తంగా మద్దతు కూడగట్టుకుంది. ఆ క్రమంలో  హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అంతే కాకుండా పలువురు ప్రముఖులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. హైదరాబాద్ ని  కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తన వద్ద సమాచారం ఉందని  మాజీ మంత్రి చింతా మోహన్ ఇటీవల విలేకరులకు చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మారుతుందని సంచలన కామెంట్స్ చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బీజేపీ చిక్కుల్లో పడింది. ఎట్టకేలకు అక్కడ తమ అభ్యర్థినే ముఖ్యమంత్రిని చేస్తోంది. చింతా మోహన్ హైదరాబాద్ గురించే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తిరుపతికి మారుస్తారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ఎవరికీ అచ్చిరాదని, జగన్‌కు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు.  రాజధానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్తగా ఒక కమిటీని నియమించడం, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసే వ్యాఖ్యల వల్ల రాజధానిని మార్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం విషయానికి వచ్చేసరికి అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ నేతలు అవన్నీ వట్టి పుకార్లని కొట్టిపారేశారు. ఆ వార్తలన్నీ వదంతులు మాత్రమేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆ వార్తల్లో  వాస్తవం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.
              ఈ విషయాలన్నీ ఇలా ఉంచితే,  తాజాగా హైదరాబాద్‌ని ఏకంగా దేశ రెండో రాజధాని చేసే అవకాశం ఉన్నట్లు బలంగా వినవస్తోంది. అయితే ఈ అంశం ఇప్పటిదేమీ కాదు.  హైదరాబాద్ ని రెండవ రాజధాని చేయాలని, ఇక్కడ సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. దానికి తోడు  దేశంలో ఉత్తరాది ఆధిపత్యం ఎక్కువైపోయిందన్న  విమర్శలు చాలా కాలంగా వినవస్తున్నాయి.  దక్షిణాదివారికి ఢిల్లీలో భాష కూడా ఓ సమస్య. ఈ నేపధ్యంలో దక్షిణాదిన రెండవ రాజధానిని ఏర్పాటు చేయాలన్న అంశం చాలా కాలంగా పరిశీలనలో ఉంది. హైదరాబాద్ ని దేశ రెండవ రాజధానిగా చేయాలని  సౌత్‌ ఇండియా పొలిటికల్‌ జేఏసీ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఇటీవల ఈ అంశంపై హైదరాబాద్‌లో సదస్సు  కూడా నిర్వహించింది. ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ  దక్షిణాదిన బలహీనంగా ఉంది. ఇక్కడ బలం పుంజుకోవడానికి ఆ పార్టీ వ్యూహ రచన చేస్తోంది. దక్షిణాది  ప్రజల మనసులలో స్థిర స్థానం సంపాదించాలన్న యోచనలో ఆ పార్టీ ఉంది. అందులో భాగంగా రెండవ రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేసి దక్షిణాది ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దానికి తోడు ప్రస్తుత పరిస్థితులు బీజేపీకి కలసి వచ్చాయి. ఢిల్లీ రాజధానిగా ఏర్పడి ఇప్పటికి 87 ఏళ్లయింది. దేశం జనాభాతోపాటు, దేశం నలుమూలల నుంచి వచ్చే జనాభాతో ఢిల్లీలో రద్దీ పెరిగిపోయింది.  వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరకుంది. తొలిసారి ఢిల్లీలో వాయు కాలుష్యం(2.5 పీఎం) 1000 పాయింట్లు దాటి రికార్డు సృష్టించింది. ఢిల్లీ మొత్తం పొగ కమ్మేసింది. అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఊపిరి తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఎంతో అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వమే హెచ్చరికలు జారీ చేస్తోంది. విద్యార్థులు కాలుష్య బారిన పడకుండా  ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. కాలుష్యానికి తోడు నీరు, వసతి, భద్రత... తదితర సమస్యలు కూడా తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో హైదరాబాద్‌ను దేశానికి రెండవ రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్‌ కూడా రాజకీయ నాయకుల నుంచి వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ అంశానికి సంబంధించి మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీహెచ్‌ విద్యాసాగర్ రావు  కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విజృంభించిన వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోవడంతో అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా  భారతరత్న, డాక్టర్ అంబేద్కర్ కోరుకున్న విధంగా హైదరాబాద్ నగరం దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనన్న ఆశా భావం వ్యక్తం చేశారు.  ప్రస్తుత పరిస్థితులలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. విద్యాసాగర్ రావు వంటి వ్యక్తి ఈ రకమైన కీలక వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశంపై చర్చ మొదలైంది. 130 కోట్ల జనాభా, వివిధ భాషా సంస్కృతుల సమ్మేళనం అయిన భారత దేశానికి రెండవ రాజధాని అవసరం ఎంతైనా ఉంది.  సంచలన నిర్ణయాలతో భారతీయులందరినీ ఆకర్షిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా, దేశ రెండవ రాజధానిగా ప్రకటించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.  రాజకీయ, ప్రాంతీయ కారణాల రీత్యా హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
             రాష్ట్రపతికి సిమ్లాలో  వేసవి విడిది  ఉంది.  ఎప్పటి నుంచో హైదరాబాద్ రాష్ట్రపతికి  శీతాకాల విడిదిగా ఉంటోంది. సికింద్రాబాద్‌లో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన ప్రతి ఏడాది 15 రోజులు నివాసం ఉంటారు. పచ్చికబయళ్లు, ఔషధ మొక్కలు, రంగురంగుల పూల తోటలు, పండ్ల తోటలతో ప్రకృతి శోభను సంతరించుకొని అంత్యంత ఆకర్షణీయంగా ఉండే ఈ భవనాన్ని 1860లో అప్పటి నిజాం నవాబు నజీరుద్దౌలా కట్టించారు. ఖర్చు పరంగా కొంత కలిసి వచ్చే అంశం ఇది. ఈ నేపధ్యంలో సంస్కృతి, సంప్రదాయాలు, వాతావరణం, మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాల పరంగా హైదరాబాద్ దేశానికి రెండవ రాజధానిగా ఉండటానికి అనువైనదిగా పలువురు భావిస్తున్నారు. హైదరాబాద్ ని కూడా రద్దీ నగరం అనుకుంటే కొత్తగా నిర్మించే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశ రెండవ రాజధానిగా పరిశీలించే అవకాశం ఉంది.
-      శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Nov 10, 2019

ఉమ్మడి కుటుంబం – న్యూక్లియర్ ఫ్యామిలీ




        
భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రధానమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ప్రపంచ దేశాలు కూడా దానిని గుర్తించాయి. ఇప్పటికీ ఈ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది.  పాశ్చాత్య దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు, ఆధునిక పోకడల ప్రభావంతో కాలక్రమంలో మన దేశంలో ఈ వ్యవస్థ అంతరించిపోతోంది. మనుషులలో విశాల ధృక్పదం సన్నగిల్లి ఉమ్మడి కుటుంబాలు కుంచించుకుపోయి అతి చిన్న కుటుంబాలు (న్యూక్లియర్ ఫ్యామిలీస్) ఏర్పడుతున్నాయి. అలా అని పాశ్చాత్య సంస్కృతీ సంప్రదాయలను విమర్శించడం కాదు.  పాశ్చాత్య నాగరికతలోని విద్యావిధానం, మతాతీత మానవతావాదం, శాస్త్రీయత, హేతువాదం... వంటి అంశాలను అలవర్చుకున్నా మన సమాజానికి ఉపయుక్తంగా ఉండేది. ఏ సమాజాన్నైనా మంచికంటే చెడే ఎక్కువ ఆకర్షిస్తుంది. ఇక్కడా అదే జరిగింది. చిన్న కుటుంబం అంటే భార్యా, భర్త, తమ పిల్లలు ఒకరు లేక ఇద్దురు, అంతే. అటువంటి కుటుంబాలే పెరిగిపోతున్నాయి. పట్టణాలలో అయితే అన్నీ అవే. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్ల సామాజిక, ఆర్థిక, మానసిక సమస్యలు అనేక తలెత్తుతున్నాయి. సామాజిక కట్టుబాట్లు పతనమయ్యాయి. కుటుంబాల మధ్య సంబంధాలు సన్నగిల్లాయి. కుటుంబం, వ్యక్తుల ప్రభావం సమాజంపై పడి సమాజం పూర్తిగా నాశనమైపోతోంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అమ్మమ్మ, తాతయ్యలు, నానమ్మ, తాతయ్యలు, తల్లితండ్రులు, భార్యా భర్తలు, పిల్లలు, వదిన, మరదలు, పిన్ని, బాబాయిలు, అన్నయ్యలు, తమ్ముళ్లు... ఇలా అందరూ ఉంటారు. వీరంతా ఇప్పుడూ ఉంటారు. కానీ ఎవరి దారి వారిదే. ఎవరి బతుకు వారిదే.  కొంతమంది కలిసి ఉండటానికే ప్రాధాన్యత ఇస్తున్నా, కొందరు వారిని దూరంగా ఉంచుతారు. ఉద్యోగాల రీత్యా, పరిస్థితుల ప్రభావం వల్ల కొందరు తప్పనిసరిగా దూరంగా ఉంచవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. భారతీయ సంస్కృతికి ప్రతీకగా ఇప్పటికి అనేక ప్రాంతాలలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. అయితే అవి చాలా తక్కువ.  ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, విడాకులు, గృహహింసలు, ఆత్మహత్యలు ఉండవు. మానవ సంబంధాలు, ప్రేమానురాగాలు బలంగా ఉంటాయి.  ఓదార్పులు ఉంటాయి.

          న్యూక్లియర్ ఫామిలీలలో భార్యా, భర్తలు ఉద్యోగాలు చేస్తుంటారు. పిల్లల ఆలనాపాలన బాధ్యతగా చూసే అవకాశాలు వారికి ఉండవు. డబ్బు సంపాదిస్తారు, ఎంతైనా ఖర్చు చేస్తారు. కానీ పిల్లలను క్రమశిక్షణలో పెట్టవలసిన వయసులో తల్లిదండ్రులు వారికి అందుబాలులో ఉండరు. మంచీచెడు చెప్పే అవకాశం వారికి ఉండదు. దాంతో వారికి  అవలక్షణాలన్నీ అబ్బుతాయి. వారి స్కూల్ సమస్యలు, శరీర ఎదుగుదలలో వచ్చే సమస్యలు, మానసిక సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. వాస్తవం చెప్పాలంటే అవసరమైనప్పుడు వారిని పట్టించుకునే పరిస్థితి ఉండదు. పిల్లలు ఆడైనా, మగైనా...  చెడు స్నేహాలు - చెడు అలవాట్లు - నేరాలు చేయడం -మానసిక సమస్యలు – విలువలు, మానవ సంబంధాలు తెలియకపోవడం - విచ్చలివిడితనం - ఆత్మహత్యలు- ఎదిగీఎదగని దశలో ప్రేమలు – వికృత చేష్టలు మోసం చేయడం – మోసపోవడం – ఈర్ష్యలు, ధ్వేషాలు - పాఠశాలల్లో, కాలేజీలో వారికి వేధింపులు – ఇటు తల్లిదండ్రలు, అటు టీచర్ల టార్గెట్లు – డ్రగ్స్ కు బాలిసలవడం – హత్యలు చేయడం – చివరికి తల్లిదండ్రులను కూడా హత్య చేయడం .....  వెరసి సమాజం మొత్తంపై ఆ ప్రభావం పడుతుంది. దాంతో మొత్తం సమాజం కలుషితమైపోతోంది. ఇప్పుడు అదే జరుగుతోంది.  ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్లే ఈ సమస్యలన్నీ తలెత్తాయి. అయితే అది విచ్ఛన్నం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కేవలం వ్యక్తులనే అనడానికి వీలులేదు. ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు, సంప్రదాయంగా వస్తున్న కుల వృత్తులు దెబ్బతినడం, జీవన శైలిలో మార్పులు, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లడం... వంటి అనేక కారణాలు ఉన్నాయి.  కుటుంబ వ్యవస్థ బలంగా లేకపోతే ఆ ప్రభావం సమాజంమీద పడి దుష్పరిణామాలు ఎదురవుతాయని ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది. దీనికి ప్రధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మే 15వ తేదీని అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా పరిగణించాలని 1993లో నిర్ణయించింది. దానిని దృష్టిలో పెట్టుకొని న్యూక్లియర్ ఫ్యామిలీలలోని తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం తప్ప చేయగలిగింది ఏమీలేదు.

-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Nov 1, 2019

భూముల వివ‌రాలు


గ్రామ కంఠం : గ్రామంలో నివసించడానికి కేటాయించిన భూమినే గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. దీనిలో ప్రభుత్వ సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు.
అసైన్డ్‌ భూమి : భూమి లేని నిరుపేదలకు సాగు చేసుకోవడానికి, ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని అసైన్డ్‌ భూములుగా పేర్కొంటారు. ఈ భూమిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే గాని ఇతరులకు అమ్మడానికి బదలాయించడానికి వీలుండదు.
ఏడబ్ల్యూ భూములు : శిస్తును నిర్థారించిన ప్రభుత్వ భూములు లేదా అసైన్డ్‌ వేస్ట్‌ల్యాండ్‌ అంటారు. శిస్తు కట్టిన ఏడబ్ల్యూ భూములు మెట్ట భూములైతే ల్యాండ్స్‌ అంటారు. వీటిని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది.
బంజరు భూమి : గ్రామం, మండల పరిధిలో ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న భూములను బంజరు భూములుగా గుర్తిస్తారు. వీటిని రెవెన్యూ రికార్డులలో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.
అగ్రహారం : పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా అందజేసిన గ్రామం లేదా అందులో కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.
అడంగల్‌ : దీనినే పహాణి అని కూడా అంటారు. గ్రామంలోని సాగు భూముల వివరాలు ఈ దస్త్రం (రిజిస్టర్‌)లో నమోదు చేస్తుంటారు. దీన్నే గ్రామ లెక్కల మూడో నంబరు రిజిస్టర్‌గా పిలుస్తారు. ఆంధ్రాలో అడంగల్‌ అని పిలుస్తుండగా తెలంగాణాలో పహాణీగా వాడుకలో ఉంది.
చిట్టా : రోజువారీ వసూళ్లు తెలిపే రిజిస్టర్‌ను చిట్టా అంటారు. దీన్ని గ్రామ లెక్క నంబరు-6 అని అంటారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నీటి పన్ను, భూమి శిస్తు వగైరాలను అసామీల వారీగా వసూలు చేసి రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.
జమాబందీ : ప్రభుత్వానికి రావాల్సిన భూమి శిస్తు, నీటి పన్ను, ఇతర బకాయిలు సక్రమంగా లెక్క కట్టడం. రెవెన్యూ లెక్కల్లోకి తీసుకు వచ్చారా లేదా అని నిర్థారించడం, గ్రామ, మండల రెవెన్యూ లెక్కల విస్తృత తనిఖీలను జమాబందీ అంటారు.
అజమాయిషీ : భూమికి సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే గ్రామ లెక్కలు ఉన్నదీ, లేనిదీ తనిఖీ చేయడాన్ని అజమాయిషీ అంటారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, వీఆర్వో రాసిన లెక్కల్లోని వివరాలను సంబంధిత తహశీల్దారు, ఉప తహశీల్దారు తనిఖీలు నిర్వహించాలి. తనిఖీ చేసిన వివరాలను గ్రామ లెక్కనంబరు 3లో నమోదు చేయాలి. ఈ విధంగా అజమాయిషీని ఏటా నిర్వహించాల్సి ఉంటుంది.
దస్తావేజు : భూములకు సంబంధించిన కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం, ఇతర లావాదేవీలను తెలియజేసే పత్రం. భూ బదలాయింపులు చేసే సమయంలో ఈ దస్తావేజులను చట్టపరంగా, రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి.
ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) : భూ స్వరూపాన్ని తెలియ జేసే ధ్రువపత్రం. 32 ఏళ్లలోపు ఓ సర్వే నంబరు భూమికి గల లావాదేవీలను తెలియజేస్తుంది.
ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌ (FMB) : దీనిని ఎఫ్‌ఎంబీ టిప్పన్‌ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డులలో ఎఫ్‌ఎంబీ ఒక భాగం. దీనిలో గ్రామంలోని అన్ని సర్వేనంబర్లు, పట్టాలు, వాటికొలతలు ఉంటాయి.
బందోబస్తు: వ్యవసాయ భూములను సర్వేనిర్వహించి వర్గీకరణ చేపట్టడాన్ని బందోబస్తుగా పేర్కొంటారు.
బీమెమో : ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్న వ్యక్తికి శిస్తు చెల్లించాలని ఆదేశిస్తూ ఇచ్చే నోటీసు. అర్హులైతే కొనసాగిస్తారు. అనర్హులైతే తొలగిస్తారు.
ఫసలీ : ఏటా జులై 1 తర్వాత నుంచి తర్వాత సంవత్సరం జూన్‌ 30 వరకు ఉన్న 12 నెలల కాలాన్ని ‘ఫసలీ’ అంటారు. ఈ పదం మొఘల్‌ చక్రవర్తుల కాలం నుంచి వాడుకలో ఉంది.
ఎకరం : ఇది భూమి విస్తీర్ణానికి కొలమానం. 4,840 చదరపు గజాల స్థలం లేదా 100 సెంట్లు (సెంటు అంటే 48.4 గజాల స్థలం) లేదా 40 కుంటలు (కుంట అంటే 121 చదరపు గజాల స్థలం). వీటిని ఎకరంగా పరిగణిస్తారు.


Oct 23, 2019


ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం
బ్యాంకింగ్ వ్యవస్థ ప్రక్షాళన తక్షణం అవస్యం

           
  ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. ముఖ్యంగా అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం ప్రభావం యూరప్ మీద పడనుంది. కొన్ని ప్రధాన దేశాలు దిగుమతుల సుంకం పెంచడంతో ఆ ప్రభావం భారత్ పై కూడా పడే అకాశం ఉంది. ఏదైనా ఒక సంవత్సరంలో వరుసగా మూడు త్రైమాసికాలు స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీపీ)వృద్ధి రేటు క్షీణిస్తూ ఉంటే ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళుతున్నాట్లు పరిగణిస్తారు. వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గడం వల్ల  వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుంది. మార్కెట్లో వస్తు, సేవలకు డిమాండ్‌ తగ్గుతుంది. దాంతో కంపెనీలు, పరిశ్రమలు తమ ఉత్పత్తి తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కారణంగా భారీ సంఖ్యలో ఉద్యోగాలకు కోతపడుతుంది. దేశంలో 2019-20 మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 8 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో  5.8  శాతం వృద్ధి రేటు నమోదైంది. నరేంద్ర మోదీ హయాంలో అతి తక్కువ వృద్ధి ఇదే అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇంత మాత్రాన మాంద్యం ఏర్పడినట్లు కాదు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి వేగం మందగించింది. దేశం మాంద్యం వైపు వెళుతోంది.   2008లో అమెరికాలో వచ్చిన ఆర్థిక మాంద్యం ప్రభావం ప్రపంచం అంతటిపైనా  పడింది. పటిష్టంగా ఉన్న అప్పటి భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ దానిని తట్టుకొని నిలబడగలిగింది. అప్పట్లో ఆర్‌బీఐ కఠిన పరపతి విధానాలు అందుకు దోహదపడ్డాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రస్తుతం భారత్‌ వివిధ అంశాలలో పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ ... వంటి రంగాలు బాగా క్షీణించాయి. ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తిని కూడా తగ్గించారు. అమెరికా, చైనా దిగుమతి సుంకాలను పెంచిన ప్రభావం యూరప్ తోపాటు ప్రపంచం అంతటా పడే ప్రమాదం ఉంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఈ రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య మొదలైన వాణిజ్య యుద్ధం ఎటు దారి తీస్తుందో ఊహించడం కష్టం. 2007-09 మధ్య తలెత్తినటువంటి ఆర్థిక విపత్తు సంభవించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రపంచం వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి రేటు పడిపోయింది.  ఆ ప్రభావంతో  భారత్ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంది.
              దానికితోడు  బడా వ్యాపార వేత్తలు అత్యంత సునాయాసంగా బ్యాంకులను మోసం చేయగలుగుతున్నారు. లక్షల కోట్ల రూపాయలు ఎగవేయగలుగుతున్నారు. బ్యాంకుల మొండి బకాయిలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని బ్యాంకులు మొండి బకాయిల ఊబిలో కూరుకుపోయాయి.  దేశంలో రానురాను ఉన్నత వర్గాలు, పారిశ్రామికవేత్తలకే బ్యాంకులు ఊడిగం చేస్తున్నట్లు అనిపిస్తోంది. రైతులు, వ్యవసాయదారులు, గ్రామీణ ప్రజానీకానికి,  సాధారణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు ఆశించిన స్థాయిలో  అందుబాటులో లేవు.  బ్యాంకులు జాతీయం చేసి 50ఏళ్లు గడిచినా  ఏ ఉద్దేశాలతో  జాతీయం చేశారో ఆ ఉద్దేశాలు నెరవేరలేదంటే వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు భావించాలి. బ్యాంకింగ్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి, మొండి బకాయిలు ముక్కు పిండి వసూలు చేసే వ్యవస్థ మనదేశంలో లేదు. అందువల్లనే పలువురు పారిశ్రామికవేత్తలు బ్యాంకులను అందినకాడికి దోచుకుంటున్నారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులను మోసం చేసిన  కేసుల సంఖ్య 15 శాతం పెరిగింది. మోసం చేసిన నగదు విలువ 73.8 శాతం పెరిగింది. 2017-18లో రూ.41,167.04 కోట్లకు బ్యాంకులను మోసం చేయగా, 2018-19కి అది రూ.71,542.93 కోట్లకు పెరిగింది. ఈ మోసాలకు ప్రభుత్వ రంగ బ్యాంకులే ఎక్కువగా నష్టపోతున్నాయి.  2018-19లో బడాబాబుల మోసాల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.64,509.43 కోట్ల మేర నష్టపోయాయి. రుణాల ఎగవేత సమస్య బ్యాంకింగ్‌ వ్యవస్థను కొంతకాలంగా కుదిపేస్తోంది. నకిలీ పత్రాలు దాఖలు చేసి అధిక మొత్తంలో రుణాలు తీసుకొని ఎగ్గొట్టడం ఆందోళన కలిగిస్తోంది. బ్యాంకులకు సంబంధించి నిరర్ధక ఆస్తుల మొత్తం దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు దాటిందని అంచనా.  ఒక వంద మంది లోపే లక్షల కోట్ల రూపాయలు ఎగవేసినట్లు తేలింది. ఈ ప్రకారం అతి కొద్ది మంది మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నారు. ఈ రకమైన చర్యల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం సడలే ప్రమాదం ఉంది. రైతులు, మధ్య తరగతివారు, చిరు వ్యాపారులు రుణం తీసుకోవాలంటే బ్యాంకులు ఎక్కడలేని నిబంధనలు అమలు చేస్తాయి. అదే బడా బాబులకు వచ్చేసరికి ఆ నిబంధనలను తుంగలో తొక్కి వందల కోట్ల రూపాయలు ఇస్తారు. బ్యాంకుల ద్వారా ప్రజాధనాన్ని రుణాలుగా తీసుకొని విదేశాలకు పారిపోయే విజయ మాల్యా, నీరవ్‌ మోడీ ...లాంటి వారు ఎక్కువైపోతున్నారు. మోసపూరిత సంస్థలకు రుణాలు మంజూరు అవుతుండటంతో బ్యాంకింగ్‌ వ్యవస్థ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది.  
       ఇదిలా ఉంటే, గత మూడేళ్లలో భారత బ్యాంకింగ్‌ వ్యవస్థలో రూ. లక్షా 76 వేల కోట్ల మొండి బకాయిలను రైటాఫ్‌ (ఖాతాల్లోంచి కొట్టివేయడం) చేశారు. ఈ బకాయిలన్నీ 416 మంది రుణగ్రహీతలు ఎగవేసినవి కావడం గమనార్హం.  వీరంతా రూ.100 కోట్లు, అంతకు మించి ఎగవేసినవారే.  2014-15 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో మొండిబకాయిల కొట్టివేతలు బాగా పెరిగాయి. ఈ రకమైన చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తాయి. 2015-18 మధ్యకాలంలో షెడ్యూలు కమర్షియల్‌ బ్యాంకులు రూ.2.17 లక్షల బకాయిలను కొట్టివేశాయి. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ కొట్టివేతలు బాగా పెరిగాయి. బ్యాంకుల్లో పేరుకుపోతున్న మొండి బకాయిల సమస్య పరిష్కారానికి కేంద్రం రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కు విశేషాధికారాలు  ఇచ్చినా ఫలితం కనిపించలేదు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయవలసిన ఆవస్యకత కనిపిస్తోంది. బకాయిల వసూలు విషయంలో చట్టపరమైన అడ్డంకులు తొలగించి, ఉన్న చట్టాల సవరణ  లేదా కొత్త చట్టాల రూపకల్పన చేయవలసిన అవసరం ఉంది.
శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914

కూటమి అభ్యర్థులను గెలిపించండి : పట్టాభిరామ్ పిలుపు

కూటమి ఆధ్వర్యంలో విజయవాడలో భారీ రోడ్ షో విజయవాడ: విజయవాడ కార్పోరేషన్ ఎన్నికలలో  టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు...