Nov 10, 2019

ఉమ్మడి కుటుంబం – న్యూక్లియర్ ఫ్యామిలీ




        
భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రధానమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ప్రపంచ దేశాలు కూడా దానిని గుర్తించాయి. ఇప్పటికీ ఈ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది.  పాశ్చాత్య దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు, ఆధునిక పోకడల ప్రభావంతో కాలక్రమంలో మన దేశంలో ఈ వ్యవస్థ అంతరించిపోతోంది. మనుషులలో విశాల ధృక్పదం సన్నగిల్లి ఉమ్మడి కుటుంబాలు కుంచించుకుపోయి అతి చిన్న కుటుంబాలు (న్యూక్లియర్ ఫ్యామిలీస్) ఏర్పడుతున్నాయి. అలా అని పాశ్చాత్య సంస్కృతీ సంప్రదాయలను విమర్శించడం కాదు.  పాశ్చాత్య నాగరికతలోని విద్యావిధానం, మతాతీత మానవతావాదం, శాస్త్రీయత, హేతువాదం... వంటి అంశాలను అలవర్చుకున్నా మన సమాజానికి ఉపయుక్తంగా ఉండేది. ఏ సమాజాన్నైనా మంచికంటే చెడే ఎక్కువ ఆకర్షిస్తుంది. ఇక్కడా అదే జరిగింది. చిన్న కుటుంబం అంటే భార్యా, భర్త, తమ పిల్లలు ఒకరు లేక ఇద్దురు, అంతే. అటువంటి కుటుంబాలే పెరిగిపోతున్నాయి. పట్టణాలలో అయితే అన్నీ అవే. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్ల సామాజిక, ఆర్థిక, మానసిక సమస్యలు అనేక తలెత్తుతున్నాయి. సామాజిక కట్టుబాట్లు పతనమయ్యాయి. కుటుంబాల మధ్య సంబంధాలు సన్నగిల్లాయి. కుటుంబం, వ్యక్తుల ప్రభావం సమాజంపై పడి సమాజం పూర్తిగా నాశనమైపోతోంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అమ్మమ్మ, తాతయ్యలు, నానమ్మ, తాతయ్యలు, తల్లితండ్రులు, భార్యా భర్తలు, పిల్లలు, వదిన, మరదలు, పిన్ని, బాబాయిలు, అన్నయ్యలు, తమ్ముళ్లు... ఇలా అందరూ ఉంటారు. వీరంతా ఇప్పుడూ ఉంటారు. కానీ ఎవరి దారి వారిదే. ఎవరి బతుకు వారిదే.  కొంతమంది కలిసి ఉండటానికే ప్రాధాన్యత ఇస్తున్నా, కొందరు వారిని దూరంగా ఉంచుతారు. ఉద్యోగాల రీత్యా, పరిస్థితుల ప్రభావం వల్ల కొందరు తప్పనిసరిగా దూరంగా ఉంచవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. భారతీయ సంస్కృతికి ప్రతీకగా ఇప్పటికి అనేక ప్రాంతాలలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. అయితే అవి చాలా తక్కువ.  ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, విడాకులు, గృహహింసలు, ఆత్మహత్యలు ఉండవు. మానవ సంబంధాలు, ప్రేమానురాగాలు బలంగా ఉంటాయి.  ఓదార్పులు ఉంటాయి.

          న్యూక్లియర్ ఫామిలీలలో భార్యా, భర్తలు ఉద్యోగాలు చేస్తుంటారు. పిల్లల ఆలనాపాలన బాధ్యతగా చూసే అవకాశాలు వారికి ఉండవు. డబ్బు సంపాదిస్తారు, ఎంతైనా ఖర్చు చేస్తారు. కానీ పిల్లలను క్రమశిక్షణలో పెట్టవలసిన వయసులో తల్లిదండ్రులు వారికి అందుబాలులో ఉండరు. మంచీచెడు చెప్పే అవకాశం వారికి ఉండదు. దాంతో వారికి  అవలక్షణాలన్నీ అబ్బుతాయి. వారి స్కూల్ సమస్యలు, శరీర ఎదుగుదలలో వచ్చే సమస్యలు, మానసిక సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. వాస్తవం చెప్పాలంటే అవసరమైనప్పుడు వారిని పట్టించుకునే పరిస్థితి ఉండదు. పిల్లలు ఆడైనా, మగైనా...  చెడు స్నేహాలు - చెడు అలవాట్లు - నేరాలు చేయడం -మానసిక సమస్యలు – విలువలు, మానవ సంబంధాలు తెలియకపోవడం - విచ్చలివిడితనం - ఆత్మహత్యలు- ఎదిగీఎదగని దశలో ప్రేమలు – వికృత చేష్టలు మోసం చేయడం – మోసపోవడం – ఈర్ష్యలు, ధ్వేషాలు - పాఠశాలల్లో, కాలేజీలో వారికి వేధింపులు – ఇటు తల్లిదండ్రలు, అటు టీచర్ల టార్గెట్లు – డ్రగ్స్ కు బాలిసలవడం – హత్యలు చేయడం – చివరికి తల్లిదండ్రులను కూడా హత్య చేయడం .....  వెరసి సమాజం మొత్తంపై ఆ ప్రభావం పడుతుంది. దాంతో మొత్తం సమాజం కలుషితమైపోతోంది. ఇప్పుడు అదే జరుగుతోంది.  ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్లే ఈ సమస్యలన్నీ తలెత్తాయి. అయితే అది విచ్ఛన్నం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కేవలం వ్యక్తులనే అనడానికి వీలులేదు. ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు, సంప్రదాయంగా వస్తున్న కుల వృత్తులు దెబ్బతినడం, జీవన శైలిలో మార్పులు, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లడం... వంటి అనేక కారణాలు ఉన్నాయి.  కుటుంబ వ్యవస్థ బలంగా లేకపోతే ఆ ప్రభావం సమాజంమీద పడి దుష్పరిణామాలు ఎదురవుతాయని ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది. దీనికి ప్రధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మే 15వ తేదీని అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా పరిగణించాలని 1993లో నిర్ణయించింది. దానిని దృష్టిలో పెట్టుకొని న్యూక్లియర్ ఫ్యామిలీలలోని తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం తప్ప చేయగలిగింది ఏమీలేదు.

-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...