Nov 20, 2019


తెలుగు మాద్యమం – కొన్ని వాస్తవాలు
 

        రాష్ట్రంలో ఒక్కసారిగా తెలుగు మీడియం రద్దు చేసి, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే గ్రామీణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలోని వారు అత్యధిక మంది బడి మానివేస్తారు.  మన రాష్ట్రం పూర్తిగా గ్రామీణ నేపధ్యం కలిగిన రాష్ట్రం. 2015లో కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏపీలో  94 పట్టణాలు ఉంటే, 17,521 గ్రామాలున్నాయి. ఈ గ్రామాలలో ప్రజలు ఎక్కువగా వ్యవసాయం,దాని అనుబంధ రంగాలు, చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తుంటారు. ప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో దాదాపు కోటి 42 లక్షల కుటుంబాలు ఉంటే, కోటి 47 లక్షల  తెల్ల కార్డులున్నాయి. అందువల్ల దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న నిజమైన పేదలను అధికారికంగా చెప్పడం కష్టం. రాష్ట్రంలో అల్పాదాయ వర్గాలవారు, నిరుపేదలు దాదాపు 70 శాతం మంది వరకు ఉండే అవకాశం ఉంది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చేతికి అందివచ్చిన పిల్లలను (ఆడ,మగ) ఏదో ఒక పనికి పంపించి ఆదాయం పొందాలన్న ఆలోచనలో తల్లిదండ్రులు ఉంటారు. వారు పెద్దగా చదువుకొని ఉండరు. అయినా ఉచిత విద్య, ప్రభుత్వాల ప్రోత్సాహం, చదువు విలువ తెలుగుసుకవడం  వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపుతున్నారు. పిల్లలను బడికి పంపినా వారి చదువు విషయంలో కనీస శ్రద్ధ తీసుకునే అవకాశం, చదువులో వారి అనుమానాలను నివృత్తి చేసే సామర్ధ్యం వారికి ఉండదు. విద్యార్థులు ఐదవ తరగతిలోకి  వచ్చినా తెలుగు చదవటం, కూడికలు తీసివేతలు వంటి లెక్కలు చేయడం ఎక్కువ మందికి రావటం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి. కారణం పాఠశాలలు కాదు. తల్లి దండ్రులకు  పెద్దగా చదువురాకపోవడం, పేదరికం. పిల్లలను చిన్నకారణానికే బడికి పంపరు. ఇంటివద్ద చదువుకోమని చెప్పే వారు ఉండరు. హోంవర్క్ చేయడం అసలు ఉండదు. అలాంటి పిల్లవాడికి జ్వరం వస్తే ఎన్నాళ్ళకి బడికి పంపుతారో కూడా తెలియదు. ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చేవి కాకుండా ఇతర పుస్తకాలు ఎన్నాళ్ళకు కొంటారో, అసలుకొంటారో కొనరో కూడా తెలియదు. మన ప్రభుత్వపాఠశాలల్లో ఇలాంటి వారే ఎక్కువ. వారికి తెలుగు రావటమే కష్టం. వాస్తవ పరిస్థితులు ఇవి.
                  ఇక ప్రముఖుల పిల్లలు తప్పనిసరిగా ఇంగ్లీష్ మాద్యమంలోనే చదువుతారు. ఒకవేళ వారు చదువులో  వెనకబడితే ఆయా సబ్జెక్టులలో నిష్ణాతులైన ప్రత్యేక టీచర్లు, స్పెషల్ క్లాసుల ద్వారా కోచింగ్ ఇప్పిస్తారు.   ఆ తరువాత వారు  ఏ వృత్తిని ఎంచుకుంటారో దానికి కావలసిన భాష నేర్చుకుంటారు. సినిమా నటుడు కావాలనుకుంటే భాష నేర్పడానికి ఒక టీచర్ ని, నటన నేర్పడానికి మరో టీచర్‌ని పెట్టుకుంటారు. రాజకీయ నాయకుడు కావాలనుకుంటే భాష నేర్పడానికి ఒక టీచర్, మాట్లాడే తీరు నేర్పడానికి మరో టీచర్‌ని నియమించుకుంటారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని పేదలు వారి పిల్లలను అలా చదివించగలరా? అలా ప్రత్యేక శ్రద్ధ చూపడానికి వారికి అవకాశం, జ్ఞానం ఉంటాయా? చదుకునే అవకాశాల విషయంలో ఉన్నత వర్గాల పిల్లలతో మురికివాడల్లోని పిల్లలను పోల్చలేం. వారు పుట్టిపెరిగిన వాతావరణం, పరిసరాలు, ఇంట్లోను, చుట్టుపక్కల వారు మాట్లాడే భాషే వారికి అర్ధమవుతుంది. మాతృ భాషలోనైతేనే వారు విషయ పరిజ్ఞానం పొందడానికి, అర్ధం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారిలో తలెత్తే చిన్నచిన్న ప్రశ్నలకు ఇంగ్లీష్‌లో సమాధానాలు చెప్పేవారు చుట్టుపక్కల ఎవరూ ఉండరు. వారి అనుమానాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉండదు. తక్షణం మాద్యమం మార్చితే వారు చాలా ఇబ్బందులుపడతారు. రాష్ట్రంలో పదవ తరగతి తప్పేవారిలో ఎక్కువ మంది ఇంగ్లీష్ లాంగ్యేజ్ తప్పుతారు. ఏకంగా ఇంగ్లీష్ మాద్యమం ప్రవేశపెడితే వారి పరిస్థితి ఏమిటి? ఏ భాష రాక, చదవలేక, రాయలేక, విషయం అర్ధం కాక నానా అవస్తలు పడవలసి ఉంటుంది. అటూ ఇటూ చెడి వారి జీవితాలు నాశనమవుతాయి.  పిల్లలపై ఇంత వత్తిడి పెట్టడం భావ్యంకాదు. తెలుగే చదవడం, రాయడం సరిగా రాని వారిని ఇంగ్లీష్ మీడియంలో చేర్చితే ఆ వత్తిడిని తట్టుకోలేక పూర్తిగా స్కూల్ మానివేస్తారు. ఇది చాలా ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది.
          ఇక ఉపాధ్యాయుల విషయానికి వస్తే వారిలో అత్యధిక మంది తెలుగు మీడియంలో చదువుకున్నవారే. పదవ తరగతి తరువాత టీచర్ ట్రైనింగ్ అయినవారు కూడా అధికంగానే ఉన్నారు. వారు తెలుగులో చెప్పడానికి అలవాటుపడిపోయారు. ఇతరిత్రా కూడా వారికి ఇంగ్లీష్‌తో పనిలేదు. అందువల్ల వారందరూ చదువుకునే సమయంలో నేర్చుకున్న కాస్త ఇంగ్లీష్‌ని కూడా మరిచిపోయారు. ఈ విషయంలో వారిని తప్పు పట్టవలసిన అవసరంలేదు. ఇప్పుడు వారికి ఇంగ్లీష్ భాషకు సంబంధించి శిక్షణ ఇచ్చినా అతి కొద్ది మంది మాత్రమే ఇంగ్లీష్‌లో బోధించగలరు. పిల్లలతోపాటు వారిపై కూడా మనసికంగా వత్తిడి పెంచడమే. ప్రయోజనం కంటే నష్టాలే అధికంగా ఉంటాయి.  45, 50 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకొని బోధించడం ఆచరణలో సాధ్యంకాదు. అటు విద్యార్థుల పరిస్థితి, బోధన అంశాలు, బోధించే ఉపాధ్యాయుల సామర్ధ్యం...వంటి అన్నిటినీ సమగ్ర పరిశీలన, అధ్యయనం చేసిన విద్యావేత్తలు, మేథావులు విద్యాబోధన మాతృ భాషలోనే ఉత్తమమని తేల్చారు. యునెస్కో కూడా అదే చెప్పింది. చైనా, జర్మనీ, జపాన్ వంటి దేశాలలో మాతృభాషకే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషల వారు ముందు మాతృ భాష, ఆ తరువాత ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. విశ్వవ్యాప్తంగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ప్రపంచంలో పోటీని తట్టుకోవడానికి ఇంగ్లీషు నేర్చుకోవలసిన అవసరం తప్పనిసరిగా ఉంది. అత్యధిక ఉద్యోగాలకు స్పోకెన్ ఇంగ్లీష్ సరిపోతుంది. ప్రాధమిక స్థాయిలో విషయ పరిజ్ఞానికి, ముఖ్యంగా మన రాష్ట్రం వంటి గ్రామీణ నేపధ్యం కలిగిన ప్రాంతంలో మాతృ భాషకు మించినదిలేదు. పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం ఓ  పెద్ద వరమని మభ్యపెట్టడం సరైన విధానం కాదు.  విద్యాభివృద్ధిలో భాగంగా తెలుగుతోపాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలి.  కానీ తెలుగు మీడియంని పూర్తిగా రద్దు చేయవలసిన అవసరంలేదు. ఏ మీడియంలోనైనా చదువుకునే స్వేచ్ఛ వారికి ఉండాలి. అలా రద్దు చేయడం వారి హక్కుని హరించడమే. ఇది రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధం. ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలో ఇంగ్లీష్ మాద్యమం ప్రవేశపెడతారు, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మాద్యమంలో చదువుకునే అవకాశం కల్పిస్తారా? వారికి తెలుగులో ప్రశ్నాపత్రాలు తయారు చేస్తారా?  దానిని స్పష్టం చేయవలసి ఉంది. జాతీయ స్థాయిలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. యూపీపీఎస్సీ ప్రశ్నాపత్రాలను ప్రాంతీయ భాషలలో రూపొందిస్తోంది. జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ప్రశ్నాపత్రం గుజరాత్ భాషలో కూడా రూపొందిస్తున్నారు. పక్క రాష్ట్రాలలో ఆయా ప్రాంతీయ భాషల మాద్యమాలతోపాటు తెలుగు మాద్యమం కూడా ఉంది. ఈ పరిస్థితులలో తెలుగు రాష్ట్రంలో తెలుగు మాద్యమం రద్దు చేయడం ఎంతవరకు సమంజసం? ఆ రాష్ట్రాలలో తెలుగు మాద్యమం ఎత్తివేస్తే కావాలని మనం అడగగలమా? ప్రస్తుతం ఉన్నమాదిరిగా రెండు మాధ్యమాలు కొనసాగిస్తూ, దశలవారీగా ఇంగ్లీష్ మాధ్యమం తరగతులను పెంచడం మంచిది. రెండు మాద్యమాలు ఉండాలి. మాద్యమం ఎన్నుకునే స్వేచ్ఛ విద్యార్థికి ఉండాలి. విద్యార్థులలో ఇంగ్లీష్ పరిజ్ఞానం పెంచడం కోసం ప్రతి తరగతిలో తప్పనిసరిగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించాలి.  భవిష్యత్ లో ఎడ్యుకేషన్ డిప్లమా, బీఈడీలలో ఇంగ్లీష్ బోధనా పద్దతులు మెరుగుపరచాలి. అక్కడ నుంచే ఇంగ్లీష్ ప్రాధాన్యం పెంచాలి.  ఇంగ్లీష్‌లో బోధించగలిగినవారినే ఉపాధ్యాయులుగా నియమించాలి.  ఇటువంటి విషయాలలో వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. విద్యావేత్తలు, వివిధ విద్యా కమిటీలు ప్రాథమిక విద్య, మాతృభాషలపై సమర్పించిన నివేదికలను పరిశీలించవలసిన అవసరం ఉంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...