• మనసా వాచా కర్మణా మద్దతు
• గత ప్రభుత్వం అమరావతిలో యుద్ధ వాతావరణం సృష్టించింది
• భూములు ఇచ్చిన రైతులను హింసించింది
• రాజధానిగా అమరావతే ఉండాలని కూటమి కట్టాం
• రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు మళ్లీ రారు
• మనమంతా ఒకటే నేల..ఒకటే భాష.. ఒకటే జాతిగా ముందుకెళ్లాలి
• రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది
• సరైన ప్రణాళిక లేకుండా విభజించారు
• రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అకుంఠిత దీక్షతో పని చేస్తున్నారు
• అమరావతి ప్రపంచ శక్తిగా, ప్రజా రాజధాని రూపుదిద్దుకుంటోంది
• అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై అసెంబ్లీలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్
‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉందని, అది అమరావతి మాత్రమేన’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇష్టపూర్వకంగా ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అమరావతిపై కక్ష కట్టారని, యుద్ధ వాతావరణం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండాపోయిందని, రాజధాని కోసం భూములిచ్చిన రైతులను హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో సమస్యను జటిలం చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై శనివారం అసెంబ్లీలో మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “51 ఏళ్ల వయసులో 58 రోజుల పాటు ఆమరణనిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ఆయన పోరాటమే మూలం. ఆనాడు తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రం అవతరించేది కాదు. ఈ రోజు తెలంగాణలో నాందేడ్, పర్బానీ, బీడ్, శంభాజీనగర్ ప్రాంతాలు ఉండేవి. వాటిని మహారాష్ట్రలో చేర్చారు. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మలబార్, కాసర్ గోడ్, కొచ్చిన్, ట్రావెన్ కోర్ కలిసి కేరళ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. బొంబాయి ప్రావిన్స్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్ ఏర్పాటు ఏర్పడ్డాయి. పంజాబ్, హర్యానా ఇలా అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ త్యాగంతోనే అవతరించాయి.
• తెలుగు నేల అనే భావనే ఉండేది
కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజధాని కోసం కొట్టుకుంటున్నాం. ఇప్పటికీ రాజధాని, సరైన హైకోర్టు, పరిపాలన భవనాలు లేదని తలచుకుంటే బాధేస్తోంది. రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం చాలా ముఖ్యం. జాతీయ భావాలతో పెరగడంతో ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు అనే భావన మాకెప్పుడూ కలగలేదు. తెలుగునేల అనేదొక్కటే మా భావన. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించలేదు. వాళ్లు చేసిన పొరపాటు వల్లే మనం ఇంకా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాం. రాష్ట్రంపై ప్రేమతోనే ఎలాంటి షరతులు లేకుండా 2014లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చాను. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సరైన కార్యాలయాలు కూడా లేని క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయని, అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, బలమైన ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్లారు. రాజధాని భూ సమీకరణ అంటే చాలా గొడవలు వస్తాయని భయం ఉండేది. అయితే 80 నుంచి 90 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. మెజారిటీ శాతం ప్రజలు ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చారు. ఉద్దండరాయునిపాలెంలో దళిత కులానికి చెందిన కొందరు ఎక్కువ పరిహారం ఇప్పించమని అడిగితే వారికీ న్యాయం చేసి ముందుకు వెళ్లారు. మంత్రి శ్రీ నారాయణ గారి ఆధ్వర్యంలో ఎక్కడా గొడవలు లేకుండా భూ సమీకరణ ప్రక్రియ మొత్తం సానుకూలంగా సాగింది. ఎలాంటి గొడవలు లేకుండా 33 వేల ఎకరాలు సేకరించారు.
• భూములు ఇచ్చిన రైతులపై కక్ష కట్టారు
2019లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిపై కక్ష కట్టారు. ముందు నుంచే రాజధానిపై అబాంఢాలు వేశారు. ఇక్కడ రాజధాని లేదని చెప్పారు. సమస్య పరిష్కరించకపోగా మూడు రాజధానుల పేరిట సమస్యను జటిలం చేశారు. చివరికి ఎప్పుడూ ఇళ్లలో నుంచి బయటకు రాని ఆడవారు, శారీరక శ్రమ తప్ప ఏమీ తెలియని రైతులు కూడా రోడ్డెక్కాల్సి వచ్చింది. వారు చేసిన పోరాటాలు, తిన్న దెబ్బలు జనసేన కార్యాలయానికి వచ్చి చూపించారు. మా బిడ్డల భవిష్యత్తు కోసం వస్తే విచక్షణా రహితంగా కొట్టారని, ఎక్కడెక్కడ కొట్టారో చెప్పలేకపోతున్నామని హృదయ విదారకంగా చెప్పుకున్నారు. అమరావతి రైతులకి మద్దతుగా నేను వెళ్తే పోలీసులు ముళ్ల కంచెలు వేసి కూర్చొబెట్టారు. వాటిని దాటుకొని వెళ్లి వారి కన్నీరు, కష్టాలు విన్నాను. మాటలు కూడా రాని బిడ్డలను సైతం వదలలేదు. నాటి అమరావతి - నేడు చూస్తున్న ప్రాంతంలా లేదు. ఈ ప్రాంతంలో ఒక యుద్ధ వాతావరణం ఉండేది. వైసీపీ హయాంలో చట్టసభల్లో శాసన సభ్యులకే రక్షణ లేకపోతే రైతులకి ఎలా ఉంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను హింసించారు. మాకు అండగా నిలబడాలని నాడు అమరావతి రైతులు అడిగితే విషయాన్ని పొత్తులో ఉన్న కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాను. అప్పుడు ఒక్కటే నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని బలంగా నిర్ణయం తీసుకున్నాం. కూటమి కట్టడం వెనుక అసలు ఉద్దేశం కూడా రాజధానే. ఈ రోజున అసెంబ్లీ సాక్షిగా బలమైన పాదముద్ర పడింది.
• రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు మళ్లీ రారు
చట్ట సభల్లో శాసన సభ్యులు ఇచ్చే వాగ్దానాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా తప్పకూడదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిని ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉంది. చట్ట సభల్లో ఇచ్చే మాటను నిలబెట్టుకోకుంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోవాల్సి వస్తుంది. ఒక వేళ మళ్లీ రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు వస్తే అన్న అనుమానం చాలా మందిలో ఉంది. వాళ్ళు మళ్లీ రారు. భూమి ఇచ్చిన ప్రతి రైతు రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం కోరుతున్నారు. భవిష్యత్తులో మనమంతా ఒకటే మాట మీద ఉండి అమరావతి రైతాంగానికి అండగా నిలబడాలి. మేము మాట మార్చం. ముందుకే వెళ్తాం.
• మనమంతా ఒకటే నేల.. ఒకటే జాతి..
భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిన ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ ఒక రాజధాని లేక కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. కేంద్రం వద్దకు వెళ్లి దేహీ అనాల్సిన పరిస్థితి. ఏది అడగాలన్నా మన గొంతుబలంగా ఉండాలి. అలా ఉండాలి అంటే ప్రాంతాల వారీగా విడదీసి మాట్లాడడం మానేయాలి. మనలో మనకి సబ్ డివిజన్లు పెట్టుకుంటే రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరు. మనమంతా ఒకటే నేల.. ఒకటే రాష్ట్రం.. ఒకటే భాష.. ఒకటే జాతి అని బలంగా బల్లగుద్ది చెప్పకపోతే మన అనైక్యత ఎదుటివారికి బలం అవుతుంది. మన అనైక్యత వారికి బలం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఒక తరానికి స్థిరత్వం ఇవ్వాలి. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు మళ్లీ ఉత్పన్నం కాకూడదు. స్థిరత్వంతో కూడిన పాలన ఉంటేనే పెట్టుబడులు సాధ్యం.
• విజన్ ఉన్న నాయకుడు తరం కోసం ఆలోచిస్తాడు
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోవడం నేను ప్రత్యక్షంగా చూశాను. మేము చూస్తుండగా రోడ్లు వెడల్పు అయ్యాయి. ఆయన్ని అంతా విమర్శించే వారు. దాని విలువ ఈతరం అనుభవిస్తోంది. సాధారణ రాజకీయ నాయకుడు తదుపరి ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. విజన్ ఉన్న నాయకుడు ఒక తరం కోసం ఆలోచిస్తాడు. దార్శనికత కలిగిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదే చేశారు.. సైబరాబాద్ ఆయన సృష్టే. ఆయన నాయకత్వంలో నేడు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక సంఖ్యలో పెట్టుబడులు ఆకర్షిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారే స్వయంగా చెప్పారు.
• ప్రపంచ శక్తిగా ప్రజా రాజధాని
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రైతులకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాజధాని నిర్మాణ ప్రక్రియను పునః ప్రారంభించాం. 2025 మే 2వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా పునర్నిర్మాణ పనులు ప్రారంభించాం. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేశాం. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి రూ. 15,000 కోట్లు, హడ్కో నుంచి రూ. 11,000 కోట్లు, నాబార్డు నుంచి రూ. 7,387 కోట్లు సమీకరించి పనులు చేపట్టాం. రాజధానికి పెట్టుబడుల రాక మొదలయ్యింది. ఒకేసారి 15 జాతీయ బ్యాంకులు తమ కార్యాలయాల ఏర్పాటుకి శ్రీకారం చుట్టాయి. మరో రూ. 28,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అమరావతి ఒక సాధారణ రాజధాని కాదు.. ప్రజా రాజధాని. ప్రపంచ శక్తిగా రూపుదిద్దుకోనున్న రాజధాని. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరఫున మనసా, వాచా, కర్మణా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను” అన్నారు.

No comments:
Post a Comment