శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలుగురు చేనేత బిడ్డలకు ‘ఉగాది పురస్కారాలు-2026’ ప్రకటించింది. మొత్తం 164 మందికి (40 కళారత్న, 124 ఉగాది) పురస్కారాలు ప్రకటించినట్లు పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మంగళవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారిలో చేనేత కుటుంబాలకు చెందిన జామ్దానీ నేత కళాకారుడు గౌరాబత్తిని రమణయ్య, సీనియర్ జర్నలిస్టులు డాక్టర్ గుత్తికొండ కొండలరావు, ఉడతా రామకృష్ణ, ఆర్టిస్ట్ కౌతరపు పార్వతి ఉన్నారు.
గౌరాబత్తిని రమణయ్య: తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు గౌరాబత్తిని రమణయ్యకు చేనేత రంగంలో జామ్‌దానీ నేత కళలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. రమణయ్య దాదాపు ఆరు దశాబ్దాలుగా చేనేత రంగంలో విశేష సేవలందిస్తున్నారు. చీరలపై అరుదైన డిజైన్లను నేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 2003లో చీరపై నేసిన రామచిలుక డిజైన్‌కు జాతీయ అవార్డు అందుకున్నారు. 2005లో ఎద్దు డిజైన్‌కు రాష్ట్ర అవార్డు, 2006లో “ట్రీ ఆఫ్ లైఫ్” డిజైన్‌కు యునెస్కో అవార్డు, 2009లో కల్పవృక్షం డిజైన్‌కు సంత్ కబీర్ అవార్డు అందుకున్నారు. 2014లో “డబుల్ ట్రీ” డిజైన్‌కు వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ అవార్డు చైనాలో అందుకున్నారు. 2021లో వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డును కూడా అందుకున్నారు. రమణయ్య తయారు చేసిన ప్రత్యేక వస్త్రాన్ని బంగ్లాదేశ్ ప్రధాని హసీనా బేగంకు మన ప్రధాని నరేంద్ర మోదీ బహుమతిగా అందజేశారు. రమణయ్య ప్రస్తుతం రిలయన్స్ వంటి ప్రముఖ సంస్థలకు ప్రత్యేక వాల్ హ్యాంగింగ్స్ తయారు చేస్తూ ఆధునిక చేనేత కళను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.
కౌతరపు పార్వతి: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయిని, చిత్రకారిణి కౌతరపు పార్వతి(ఆమ్రపాలి)ని, ఆమె చిత్రకళా నైపుణ్యానికి గుర్తుగా ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ (బీఎఫ్ఏ) డిగ్రీ చేసిన పార్వతి ప్రభుత్వ పాఠ్యపుస్తకాలకు చిత్రకారిణిగా పనిచేశారు. ప్రముఖ కవులు, రచయితల పుస్తకాలకు కవర్ పేజీలు రూపొందించారు. అమెరికాలోని తానా వారి మాసపత్రిక తెలుగునాడికి ముఖచిత్రాలతోపాటు అనేక లోపలి పేజీల చిత్రాలు గీశారు. ఆమె చిత్రకళా నైపుణ్యాన్ని దేశవిదేశాల్లో అనేక మంది ప్రముఖులు మెచ్చుకున్నారు. ప్రశంసించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ ఎంబసీ, ఆర్ట్ గ్యాలరీలో జరిగిన ప్రతిష్టాత్మక ప్రదర్శనల్లో ఆమె పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో చైనా, రష్యా, బ్యాంకాక్, ఈజిప్టు, వియత్నాం, మాల్దీవులతోపాటు జాతీయ స్థాయిలో న్యూఢిల్లీ, నాగపూర్, అస్సాం, ముంబై, హైదరాబాద్, విజయవాడ, అమరావతి, గుంటూరు తదితర నగరాలలో నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. పార్వతి 2008లో ఉత్తమ ఉపాధ్యయపుస్కారం, 2021లో మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ పీస్ అవార్డు, ఉమ్మిడిశెట్టి సత్యాదేవి ప్రతిభా పురస్కారం.... వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. పార్వతి స్వీయరచన, దర్శకత్వంలో ‘బతుకు చిత్రం’ పేరుతో ఒక లఘుచిత్రాన్ని కూడా నిర్మించారు.
జీకే: పశ్చిమగోదావరి జిల్లా తిరుపతి పురం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, విజయవాడ దూరదర్శన్ కేంద్రం న్యూస్ హెడ్(ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్)గా పదవీవిరమణ చేసిన డాక్టర్ గుత్తికొండ కొండలరావు (జీకే)కు, జర్నలిజం రంగంలో తను చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంజేఎంసీలో గోల్డ్ మెడల్ సాధించిన జీకే గిరిజన ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగంపై పీహెచ్‌డీ చేశారు. జర్నలిజంలో డాక్టరేట్ చేసిన జీకే ప్రాంతీయ వార్తా విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. జీకే మొదట్లో కొద్దికాలం ఈనాడులో పనిచేశారు. ఆ తరువాత ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్)కు ఎన్నికయ్యారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ)లో ముంబై, విజయవాడలలో పని చేశారు. క్షేత్రస్థాయి ప్రచార విభాగం(డైరెక్టరేట్ ఫీల్డ్ పబ్లిసిటీ)లో శ్రీకాకుళంలోని మారుమూల ప్రాంతాల్లో, మత్స్యకార గ్రామాల్లో పని చేశారు. క్షేత్రప్రచారాధికారిగా జీకే ఉత్తర కోస్తాలో ఎంతో సేవచేశారు. ఆ తర్వాత ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా సేవలందించారు. తర్వాత విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అధిపతిగా అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారు. కరోనా సమయంలో ఆకాశవాణిలో ‘జింగిల్స్’ వంటి కొత్త ప్రయోగాలతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. 12 వేలకు పైగా జింగిల్స్ ప్రసారం చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. పలు విశ్వవిద్యాలయాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహించిన సెమినార్లలో ఆయన పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఆయన రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు అనేకం జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. ఆయన మొట్టమొదటి ఇంటర్వూ దివంగత మదర్ థెరిస్సాను చేశారు. అంతర్జీతీయ చలన చిత్రోత్సవాల్లో కూడా పాల్గొన్నారు. కొండలరావు జీకే అనే కలం పేరుతో వందల వ్యాసాలు రాశారు.
ఉడతా రామకృష్ణ : కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, పుస్తక రచయిత ఉడతా రామకృష్ణను, జర్నలిజం రంగంలో తను చేసిన విశిష్ఠ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. చేనేత కార్మికుడిగా మొదలైన ఆయన జీవితం 1989లో జర్నలిజం వైపునకు మళ్లింది. 14 ఏళ్ళు దారాలను అల్లిన చేతులు అక్షరాలను అల్లడం మొదలుపెట్టాయి. మూడున్నర దశాబ్ధాల ఆయన జర్నలిస్ట్ ప్రస్థానం అంతా ప్రజాశక్తి దినపత్రికతోనే ముడిపడింది. ఆ పత్రికలో ఆయన విలేకరిగా, స్టాఫ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్ గా, డెస్క్ ఇన్ చార్జిగా, ఎడిషన్ ఇన్ చార్జిగా, కోస్తా జిల్లాల న్యూస్ కోఆర్డినేటర్ గా, ఫీచర్ రైటర్ గా, ప్రజాశక్తి జర్నలిజం కళాశాల ఇన్ చార్జి ప్రిన్సిపాల్, మొఫిషియల్ నెట్ వర్క్ ఇన్ చార్జిగా, క్వాలిటీ సెల్ ఇన్ చార్జిగా, కేంద్ర ఎడిటోరియల్ బోర్డు సభ్యులుగా, ప్రజాశక్తి ప్రచురణ సంస్థ అసిస్టెంట్ ఎడిటర్ గా.... ఇలా ఒక్క ఎడిటర్ పోస్టు తప్ప అన్నీ చేశారు. ఇప్పటికీ ప్రజాశక్తికి చెందిన ‘రైతువాణి’ మాసపత్రికకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రజాశక్తి దినపత్రికలో ఎన్నో శీర్షికలను నిర్వహించడంతోపాటు వేల వ్యాసాలు, వార్తా కథనాలు రాశారు. ఆ రంగం ఈ రంగం అని ఏమీలేదు రాజకీయ, సాహిత్య, కళలు.... ఇలా అన్ని రంగాలపై వ్యాసాలు రాశారు. అనే మంది ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశారు. నిత్య స్ఫూర్తి(డాక్టర్ డి.సాంబశివరావు), ప్రతిభామూర్తులు వంటి పది పుస్తకాల వరకు రాశారు. దశాబ్దానికి పైగా మగ్గం నేసిన చేతులతో ఓ చేనేత కార్మికుడు జర్నలిస్టుగా వేయికి పైగా వ్యాసాలు రాసి ఈ స్థాయికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం అందుకోవడం అభినందనీయం.
విజయవాడలోని అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్‌లో మార్చి 19న జరిగే వేడుకలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పురస్కారాలతో వారిని సత్కరిస్తారు. ఉగాది పురస్కారం గ్రహీతలకు రూ. 10వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914






No comments:
Post a Comment