3 వేలకుపైగా సాహితీ ఎపిసోడ్స్‌తో రజా హుస్సేన్ రికార్డ్
ఆయన చూపు పడిన ఏదైనా రజా హుస్సేనిజానికి రూపాంతరం చెందుతుంది. ఇజం అంటే ఏమిటో అని కంగారు పడకండి. ఇక్కడ ఇజం అంటే సాహితీ సేవనం, విమర్శ, ముఖ పుస్తక సాహితీ ప్రక్రియ. ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్ అబ్దుల్ రజా హుస్సేన్ కంటపడిన ఏ పుస్తకమైనా, పురాతన భవనమైనా, మరేదైనా వాటికి సాహితీ తీగ అల్లుకుంటుంది. వాటి లోతులకు వెళ్లి, అంతగా పెనవేసుకుపోతారు. గుంటూరు జిల్లా, తెనాలి మండలం నంది వెలుగు గ్రామంలోని వందేళ్లనాటి పచ్చి పులుసు వారి మేడ గురించి కూడా చాలా అద్భుతంగా రాశారు. ఫేస్ బుక్ వేదికగా ‘కాఫీ విత్’ శీర్షికన ఇప్పటి వరకు 3123 విమర్శలు, విశ్లేషణలు రాసిన సాహితీ దిగ్గజం రజా హుస్సేన్. తెలుగు సాహిత్యంలో ఇదో రికార్డ్. పాత, కొత్త అనే భేదంలేకుండా తెలుగు సాహిత్యంలో కాకలుతీరిన పురాతన కవుల దగ్గర నుంచి వర్ధమాన కవుల వరకు, వారి కవిత్వ సమగ్ర విశ్లేషణే ఈ శీర్షిక ప్రధాన లక్ష్యం. సోషల్ మీడియాలో సాహితీ లోకం మొత్తాన్ని ఇప్పుడు అమితంగా ఆకర్షిస్తున్న శీర్షిక ఇది. ఈ శీర్షికే కాకుండా, చిత్రకళా పరిమళం పేరుతో మరో 400 ఎపిసోడ్స్ రాశారు. ఇంకా అనేక శీర్షికలతో పుంఖానుపుంఖాలుగా పలు అంశాలపై విమర్శలు, విశ్లేషణలు చేశారు. రాస్తున్నారు. ఇలా నిరంతరం అంటే, రాత్రి, పగలు సాహితీ సేద్యం చేయడమే ఆయనకు అత్యంత ఇష్టమైన పని. రచనా వ్యాసంగంలో స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న ఆయన చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు, అందులోని ఫేస్ బుక్ లో ఇబ్బడిముబ్బడిగా సాహిత్యం పండిస్తారు. కవులు, కళాకారులు, చిత్రకారులు, రచయితలు.... ఇలా అనేక రంగాల వారి గురించి, వారి సాహిత్య, కళా నైపుణ్యాల గురించి విశ్లేషించారు. ఇలా ఎన్నో వేల మంది గురించి రాసిన విమర్శకుడు రజా హుస్సేన్. తెలుగు సాహిత్యానికి ఇంత సేవచేస్తున్నవారు ప్రస్తుతానికి మరొకరులేరని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.
‘కాఫీ విత్’ శీర్షికన రాసిన కవుల గురించి ఒక్కో పుస్తకం తీసుకురావలన్న సంకల్పంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ప్రముఖ ప్రగతిశీల కవి గోలి మధు కవిత్వ విశ్లేషణతో ఈ సీరీస్ ను మొదలు పెట్టారు. రచయిత హుస్సేన్ స్వగ్రామానికి చెందినవాడు కావడం వల్ల మధుకు ఆ అదృష్టం పట్టింది. 20 ఏళ్ల క్రితమే సరదాగా కవిత్వం రాయడం మొదలుపెట్టిన గోలి మధు, మూడునాలుగేళ్ల నుంచి మాత్రమే సీరియస్ గా రాస్తున్నారు. తల్లి గోలి పార్వతి నుంచి వారసత్వంగా మధుకు కవిత్వం రాయడం అబ్బింది. కళ్ల ముందు అన్యాయం జరిగితే సహించలేడు. కళ్లెర్రచేసి మరీ కవిత్వం రాయగల ఘటికుడు గోలి మధు అన్నది రజా హుస్సేన్ అభిప్రాయం.
ఇప్పటి వరకు మధు రాసిన భారతీయ ధర్మ విశ్లేషణ(2003), నవశకం(2006), రైతు సమరభేరి(2020,2021), గమనం(2021), సంఘర్షణ (2023), ఎదురీత(2025) అనే ఆరు పుస్తకాలు వచ్చాయి. తొలినాళ్లలోనే అభ్యుదయ భావాలతో మధు కవిత్వంలోకి అడుగుపెట్టాడు. చేనేత సామాజిక వర్గం నేపథ్యం కలిగిన కవి మధు చేనేతకారుల ఈతిబాధలు, వారి బతుకుల్లో కష్టాలు, నష్టాల చిక్కులు తీయాలనే ప్రయత్నం ‘నవశకం’ కవితా సంపుటిలో కనిపిస్తుంది. కవిగా మధు రెక్కలు తొడుగుతున్న దశలో సామాజిక స్పృహతో రాసిన కవితలు ‘గమనం’ సంపుటిలో ఉన్నాయి. ఎవరి పక్షాన నిలిచాడో చెప్పాడు. అన్నదాత రైతు పక్షాన రాసిన ‘రైతు సమరభేరి’ ఇప్పటికే రెండు ముద్రణలు జరగడం విశేషం. ఢిల్లీ ఉద్యమ నేపథ్యంలో రైతు సమస్యను కేంద్రంగా చేసుకుని రాసిన కవిత్వం ‘సంఘర్షణ’ అని రజా హుస్సేన్ పేర్కొన్నారు.
కడుపు తీపి, కాలచక్రం, ప్రేమఖైది, జ్ఞాన నేత్రం, కర్తవ్యం, నాలోనీవు, మౌనం ... వంటి పలు కవితలను రజా హుస్సేన్ తనదైన స్టైల్లో విశ్లేషించారు. రైతులు, చేనేత కార్మికుల వెతలు, మణిపూర్ లో నగ్నకవాతు, పత్రికల తీరు, బౌద్ధం మొదలు కొని ప్రేమ కవిత్వం వరకు మధు రాసిన అనేక కవితలపై చాలా లోతుగా రాసిన విశ్లేషణలు ఇందులో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తంగా మధుని ఆవిష్కరించిన పుస్తకం ఇది. ఏది రాసినా ఆసక్తిగా చదివించే శక్తి రజా హుస్సేన్ కలానికి ఉంది. అదే ఆయన ప్రత్యేకత. రజా హుస్సేన్ రచనలను భవిష్యత్ తరాల కోసం విశ్వవిద్యాలయాలు, సాహిత్య అకాడమీలు, సాహితీ సంస్థలు భద్రపరచవలసిన అవసరం ఉంది.
కాఫీ విత్ గోలి మధు పుస్తకం వెల : రూ.100
పుస్తకాల కోసం సెల్: 9063167117
పుస్తక సమీక్ష : శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

No comments:
Post a Comment