మృత దేహాం అవశేషాలకు అంత్యక్రియలతో పూర్తిగా ముగిసిపోయిన కేసు
ఆయేషా మీరా మృత దేహాం అవశేషాలకు శుక్రవారం అంత్యక్రియలు పూర్తి కావడంతో ఆమె హత్య కేసు పూర్తిగా ముగిసిపోయినట్లు భావించవచ్చు. విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గా లేడీస్ హాస్టల్‌లో 2007, డిసెంబరు 27 అర్ధరాత్రి జరిగిన ఆయేషా మీరా హత్యకేసులో సమాధానాలు దొరకని ప్రశ్నలు అనేకం ఉత్పన్నమవుతున్నాయి. తెనాలికి చెందిన ఆయేషా విజయవాడలోని నిమ్రా కాలేజ్‌లో ఫస్టియర్ బీఫార్మసీ చదువుతూ హత్యకు గురైన ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు విచారణలో ట్విస్ట్ లు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించి ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో చివరికి దోషిని కనిపెడతారు. అయితే, ఈ కేసు విచారణ 18 ఏళ్లు సుదీర్ఘంగా సాగిన తర్వాత కూడా దోషులను కనిపెట్టకుండానే ఈ కేసుని విజయవాడ సీబీఐ కోర్టు ఈ నెల 20న మూసివేసింది. ఈ కేసులో నిందితులను గుర్తించడానికి తగిన ఆధారాలు లభించలేదని సీబీఐ సమర్పించిన తుది నివేదిక ఆధారంగా ఈ కేసు మూసివేస్తున్నట్లు కోర్టు తెలిపింది. రెండోసారి పోస్టుమార్టం కోసం సేకరించిన ఆయేషా మీరా మృతదేహానికి సంబంధించిన అవశేషాలను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 27వ తేదీన ప్రత్యేక వాహనం, ఎస్కార్ట్, ప్రభుత్వ భద్రతతో తెనాలిలోని ఖబరస్తాన్ లో అంత్యక్రియలు నిర్వహించాలని, ఈ ప్రక్రియను రెవెన్యూ, పోలీసు అధికారులు, మత పెద్దల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ ప్రకారం తెనాలి చెంచుపేటలోని ఖబరస్తాన్ లో ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. దీంతో, ఈ కేసు ప్రక్రియ పూర్తిగా ముగిసిపోయింది. ఆయేషా తల్లి శంషాద్ బేగం, తండ్రి ఇగ్బాల్ బాషాల పోరాటం ఫలించలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. 18 ఏళ్లు పోరాటం చేసి అలిసిపోయామని, ఇక పోరాటం చేసే శక్తి గానీ, ప్రొటెస్ట్ పిటిషన్ వేసే ఆర్థిక స్థోమత గాని తమకు లేవని ఆయేషా తల్లి కోర్టులో కన్నీరు పెట్టుకున్నారు. న్యాయం కోసం ఆ తల్లిదండ్రులు ఎక్కని గడపలేదు. వేడుకోని నాయకులు లేరు.
ఆయేషా హత్య జరిగిన వెంటనే దోషులు, కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేశారు. అందులో వారు విజయం సాధించారు. రాజకీయాలు, కులం, డబ్బు, అధికారం.... వంటి అంశాల ప్రభావంతో దోషులు ఎవరో తేలకుండానే ఈ కేసుని మూసివేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు ఇలా నీరుకారిపోవడానికి వ్యవస్థలోని లోపాలే కారణమని న్యాయనిపుణులు తేల్చారు.
ఆయేషా హత్య జరిగిన తర్వాత తెల్లారిపాటికే అక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండా దోషులు ముందు జాగ్రత్తపడ్డారు. అంతేకాకుండా, పోలీసులు కూడా దోషులకు పూర్తిగా సహకరించారన్న ఆయేషా తల్లిదండ్రులు ఆరోపించారు. పైగా కొత్త ఆధారాలు సృష్టించారు. పోలీసులు ఆయేషా మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె ఛాతీ మీద ‘చిరుత 143’ అని, పొట్ట మీద లవ్ సింబల్ రాసి ఉంది. అక్కడే లభించిన ఓ లెటర్‌లో, ‘‘నన్ను ప్రేమించమని బతిమిలాడినా ఒప్పుకోలేదు. అందుకే కోపంతో హాస్టల్‌కు వచ్చా. ఆమెను కొట్టి, అత్యాచారానికి పాల్పడ్డాను. అడిగినప్పుడు ప్రేమించకపోతే మిగతావారికీ ఇదే గతి పడుతుంది’’ అని రాసి ఉంది.
ఈ కేసులో పోలీసులు మొదట హాస్టల్ వంటమనిషిని అనుమానించి, విచారించారు. అతను కాదని తేలింది. తర్వాత తెనాలికి చెందిన శివాంజనేయులు, జగిత్యాలకు చెందిన ఉపేందర్ సింఘ్, గుర్విందర్ సింఘ్ అలియాస్ లడ్డూలను ఒకరి తర్వాత ఒకరిని అరెస్టులు చేశారు. అయితే, వారి అందరి కుటుంబ సభ్యులు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో వారిని విడుదల చేశారు. ఒకానొక సందర్భంలో ఆయేషా మీరా మేన మామను, మరో సమీప బంధువును కూడా పోలీసులు అనుమానించారు. చివరకు ఇతర నేరాల క్రింద సబ్ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం, అనాసాగర గ్రామానికి చెందిన పిడతల సత్యనారాయణ అలియాస్ సత్యం బాబు అనే యువకుడిని నిందితునిగా పేర్కొని, 2008 ఆగస్టు 11న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారి పద్ధతిలో అతనే ఆయేషాని హత్య చేసినట్లు ఒప్పించారు. సత్యంబాబుని 2010లో విజయవాడ మహిళా సెషన్స్ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టగా, అతను వాస్తవం చెప్పాడు. తాను హత్య చేయలేదని, పోలీసులే తనచేత అలా చెప్పించారని కోర్టుకు తెలిపాడు. పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాల ప్రకారం సత్యంబాబుని నేరస్తునిగా పేర్కొంటూ, మహిళా సెషన్స్ స్పెషల్ కోర్టు అతనికి 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అయితే, సత్యంబాబు నేరస్థుడు కాదని, ఓ మాజీ మంత్రి మనవడే అసలు నేరస్థుడని ఆయేషా తల్లి శంషాద్ బేగం తొలి నుంచి మొత్తుకుంటోంది. హాస్టల్ లోని ముగ్గురు అమ్మాయిలు బయటి వ్యక్తులతో ఉండటం చూసినందుకే ఆయేషాని హత్యచేశారని తల్లిదండ్రుల ఆరోపణ. వారి మాటలు వినే పరిస్థితులు లేవు. సత్యంబాబు బంధువులు హైకోర్టుని ఆశ్రయించారు. బొజ్జా తారకం వంటి వారు కోర్టులో సత్యంబాబు తరఫున వాదించారు. 2017, మార్చి 31న హైకోర్టు సత్యంబాబు నిర్ధోషిగా తీర్పు చెప్పింది. ఆయేషాను సత్యంబాబే హత్య చేశారని చెప్పడానికి తగిన ఆధారాలను పోలీసులు చూపలేకపోయారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. పోలీసులు ఎవరో ఒకరిని నేరస్తునిగా చూపాలన్న దిశగానే దర్యాప్తు చేశారే తప్ప, అసలైన నిందితులను పట్టుకునే ఉద్దేశంతో దర్యాప్తు చేయలేదని హైకోర్టు అభిప్రాయపడింది.
ఆ తర్వాత ఆయేషా మీరా తల్లిదండ్రులు2018 జనవరి 27న హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయమని 2018 నవంబరు 29న హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటికే దిగువ కోర్టులో ఆధారాలు ధ్వంసం చేశారు. హైకోర్టులో కేసు నడుస్తున్న సమయంలో, 2014లోనే విజయవాడ కోర్టులో ఈ కేసు రికార్డులన్నీ ధ్వంసమయ్యాయని సిట్ హైకోర్టుకు తెలిపింది. స్థానిక కోర్టులో ఈ కేసుకు సంబంధించిన రికార్డులు ధ్వంసమయ్యాయని ఆయేషా మీరా తరఫు న్యాయవాదులు ముందే అనుమానం వ్యక్తం చేశారు. వారు అనుమానించినట్లే జరిగింది. సిట్ దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో ఈ కేసుని 2018 డిసెంబరు 16న సీబీఐకి అప్పగించారు. ఆయేషా మృతదేహాన్ని సీబీఐ రీపోస్ట్ మార్టం చేసి, కొత్త ఆధారాలు ఏమీ దొరకలేదని కోర్టుకు తెలపడంతో కోర్టు కేసుని మూసివేసింది.
ఈ నేపథ్యంలో శంషాద్ బేగం వంటి పేద కుటుంబాలకు న్యాయం లభించే అవకాశం లేదా? స్థితిముంతులైతే రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు అండతో తప్పించుకోగలుగుతారా? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా వారు ఎలా తప్పించుకోగలిగారు? న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఏం చేయలేకపోయాయా? శంషాద్ బేగం కుటుంబానికి ఏ రకంగానూ న్యాయం దక్కదా? హత్య జరిగిన నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆనంద్ బదిలీ తర్వాత కేసు మొత్తం ఎలా తారుమారైంది? హాస్టల్ వార్డెన్ కోనేరు పద్మ నోరు తెరిస్తే, అయిదు నిమిషాల్లో కేసులోని నిజానిజాలు వెల్లడవుతాయని ఆయేషా తల్లి శంషాద్ బేగం ఆనాడే చెప్పారు. ఆమె చేత పోలీసులు ఎందుకు నిజం చెప్పించలేకపోయారు? హాస్టల్లో కొందరి రాసలీలలు చూసిందనే తన కుమార్తెని హత్య చేశారని శంషాద్ బేగం చెప్పారు. ఆ రాసలీలలు ఎవరి మధ్య జరిగాయో పోలీసులు ఎందుకు కనిపెట్టలేకపోయారు? తెల్లారేపాటికి సాక్ష్యాలను ఎవరు మాయం చేశారు? పోలీసులు తెలుసుకోలేకపోయారా? ఈ కేసుకు సంబంధించిన రికార్డులు కోర్టులోనే ఎవరు ధ్వంసం చేశారు? ఎందుకు చేశారు? అంతటి తీవ్రమైన నేరాన్ని చేసినవారిని ఇంకా కనుగొనలేదా? వారిని తెలుసుకుని శిక్షించరా? సత్యంబాబు చేయని నేరానికి 8 ఏళ్లు శిక్ష అనుభవించి, నిర్దోషిగా విడుదల అయ్యాడు. హైకోర్టు నష్టపరిహారం కింద లక్ష రూపాయలు ఇవ్వమని తీర్పు ఇచ్చింది. సత్యంబాబు అన్యాయంగా 8 ఏళ్లు శిక్ష అనుభవించడానికి బాధ్యులు ఎవరు? సత్యంబాబు చేయని నేరం అంగీకరించే విధంగా పోలీసులు ఎందుకు చేశారు? అలా చేసిన వారికి శిక్ష ఏమీ లేదా? 8 ఏళ్ల జైలు శిక్షకు నష్ట పరిహారం లక్ష రూపాయలు ఇవ్వమని హైకోర్టు ఆదేశించింది. ఇది న్యాయమేనా? అతను అన్యాయంగా శిక్ష అనుభవించినందుకు, జైల్లో అతను, ఇంటి వద్ద కుటుంబ సభ్యులు అనుభవించిన మనోవేదనకు, బాధలకు, అతని జీవితంలో 8 ఏళ్లు వృధా అయినందుకు, అతనికి నష్టపరిహారం ఇదా? అసలు హంతకులు ఎవరు? ఎందుకు చంపారు? ఈ ప్రశ్నలన్నిటీకీ సమాధానాలు లేవు. హత్య మిస్టరీగానే మిగిలింది. ఈ కేసులో న్యాయం జరగలేదని అందరికీ తెలుసు. అసలు హంతకులను కనిపెట్టలేని దయనీయ స్థితిలో మన వ్యవస్థలు ఉన్నాయా?. లేదా ఆ దోషులు తమకు అనుకూలంగా వాడుకునే స్థితిలో వ్యవస్థలు ఉన్నాయా?. చివరిగా ‘‘ఈ నెల 27న తమ కుమార్తె శరీర భాగాలతో పాటు సత్యం, న్యాయం, ధర్మాన్ని కూడా పూడ్చిపెట్టబోతున్నాం’’ అని ఆయేషా మీరా తల్లిదండ్రులు ఎంతో బాధతో చెప్పారు. న్యాయం కోసం పోరాడి, వేసారిపోయిన తల్లిదండ్రులు ఆయేషా మీరా పేరుతో ఒక విద్యా సంస్థని నెలకొల్పమని, ఇటువంటి బాధితులకు సహాయపడే విధంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆ పని చేస్తుందని ఆశిద్ధాం.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

No comments:
Post a Comment