Mar 28, 2026

అమరావతి అజేయం… అజరామరం


ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే ఆత్మ

ఎవరూ టచ్ చేయలేరు... ఇంచ్ కూడా కదల్చలేరు

దేశం గర్వించేలా భవిష్యత్‌ నగరంగా రాజధాని నిర్మాణం

రాష్ట్ర కోసం భూములిచ్చిన రైతులకు పాదాభివందనం

రాజధానిపై రోజుకో మాటతో జగన్‌ది ఊసరవెల్లి రాజకీయం

అమరావతికి చట్టబద్దత కోరుతూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు

తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన శాసన సభ

అమరావతి, మార్చి 28 :-*  అమరావతే ఆంధ్రప్రదేశ్ ఆత్మ  అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతి అజేయం.. అద్భుతం.. అజరామరం అని, అమరావతితోనే తెలుగు వైభవమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్ట భద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు.  ఈ తీర్మానానికి మద్దతు పలికిన శాసన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియచేశారు. రాజధానిని ఎవరూ టచ్ చేయలేరని, ఇంచ్ కూడా కదిలించలేరని అన్నారు. ఏపీకి ఒక్కటే రాజధాని అని, అది అమరావతి మాత్రమేని పునరుద్ఘాటించారు. 

*అవే కుట్రలు..కుతంత్రాలు*

రాజధానిపై వైసీపీ బుద్ధి ఇంకా మారలేదని, గతంలో చేసిన కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతూనే ఉందని ముఖ్యమంత్రి ఆక్షేపించారు. దీనిపై సీఎం మాట్లాడుతూ...‘రాజ్యాంగంలో రాజధాని అనే పేరే లేదంటారు. వీళ్లకు ఏమైనా ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందా? రాజారెడ్డి రాజ్యాంగాన్ని వీళ్లు అనుసరిస్తారు. దేశం అనుసరించేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. విభజన అనంతరం రాష్ట్రానికి రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు చేయాలని 46 శాతం మంది కోరుకున్నట్టు శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా చెప్పింది. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ వివిధ జాతీయ స్థాయి సంస్థలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశాం. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి బేషరతుగా రాజధానిగా అమరావతికి మద్దతు ఇస్తున్నామని గతంలో చెప్పాడు. కానీ ఇప్పుడు రోజుకో మాటతో ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాడు. టెక్నాలజీ అందుబాటులో ఉన్న రోజుల్లోనూ రాజకీయ విన్యాసాలు చేస్తున్నాడు. వంద ఎకరాలు తీసుకుని భవనాలు కట్టేసి రాజధాని అని చెప్పేయవచ్చు. కానీ రాష్ట్రానికి ఆర్ధిక వనరులు సమకూరేలా ఓ ప్రాంతం ఉండాలని ఆలోచించాను. ఈ ప్రాంతాంలోని రైతులను సంప్రదించడంతో 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలను రైతులు త్యాగం చేశారు. రాష్ట్రం కోసం రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. రాజధాని పట్ల కుట్రలు చేసిన కొందరు వ్యక్తులు తోటలకు నిప్పు పెట్టారు. రుణాలను అడ్డుకునేందుకు ప్రపంచ బ్యాంకుకు ఈ మెయిళ్లు పంపించారు.  కానీ పవిత్రమైన మట్టి, నీరుతో ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. అందుకే ఇది శాశ్వతంగా నిలుస్తుంది. అమరావతి నిర్మాణ బాధ్యతను పార్లమెంటు తీసుకుంటుందని ప్రధాని కూడా భరోసా ఇచ్చారు. రైతులు ఇచ్చింది కేవలం భూములు మాత్రమే కాదు రాష్ట్రానికి భవిష్యత్తు ఇచ్చారు. సెల్ఫ్ సస్టైయినబుల్ ప్రాజెక్టుగా అమరావతి నిర్మితం అవుతుందని చెప్పాం.. అదే జరిగి తీరుతుంది’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 


*బ్లూ, గ్రీన్ నగరంగా నిర్మితం*

‘రాజధాని ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని వచ్చిన సమయంలో ఓమారు, ఆ తర్వాత మరోమారు, రెండు రోజుల క్రితం అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నాను. హైదరాబాద్, అమరావతి రెండు నగరాలు అభివృద్ధికి చిరునామాలుగా మారాలి. భవిష్యత్ నగరంగా అమరావతి బ్లూ, గ్రీన్ సిటీగా నిర్మితం అవుతుంది. దేశం గర్వించేలా అమరావతిని నిర్మించి తీరుతాం. రాజధాని ఒకటే..కానీ  అభివృద్ధి మాత్రం అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తాం. మూడు రీజియన్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లు విస్తృతంగా అభివృద్ధి అవుతాయి’ అని సీఎం అన్నారు. 

*రాజధానులు కోల్పోతూ వచ్చాం*

‘కృష్ణా- గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని అమరావతిని రాజధానిగా చేసుకుని శాతవాహన రాజులు పరిపాలించారు. బ్రిటిష్ మ్యూజియంలోనూ అమరావతి గ్యాలరీ ఆనాటి చరిత్రను స్పష్టంగా చెప్తోంది.  అంతటి ప్రాచీన, ఘన చరిత్ర మన తెలుగు జాతిది. సంస్కృతీ సంప్రదాయాలతో విలసిల్లిన తెలుగునేల ఇది. బ్రిటిష్ వారు వచ్చాక పరిస్థితులు మారాయి. 200 ఏళ్ల పాటు మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రాభవం కోల్పోయాం. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాకే మద్రాసీల నుంచి ఆంధ్రులుగా మనకు వచ్చింది. పొట్టిశ్రీరాములు ప్రాణ త్యాగంతో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ అవతరించింది. మొదట కర్నూలుకు, ఆ తర్వాత హైదరాబాద్‌కు రాజధాని మారింది. ఇప్పుడు అమరావతికి మార్చుకున్నాం. రాజధానులు కోల్పోవటంతో పాటు విమర్శలు, వివక్ష, అవమానాలు భరిస్తూనే వచ్చాం. 1953లో ఆంధ్రరాష్ట్రం, 1956లో ఆంధ్రప్రదేశ్, 2014లో మరోమారు మన రాష్ట్ర అవతరణ తేదీలు మారాయి. మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఏది చేసుకోవాలో తెలీని గందరగోళం నెలకొంది. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసిన రోజును స్మతీ దినంగా జరుపుకుంటున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. 


*మోస్ట్ లివబుల్ సిటీగా అమరావతి*

‘1991లో వచ్చిన ఆర్ధిక సంస్కరణల్ని అందిపుచ్చుకున్నాం. 2020 విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకున్నాం. ఐటీ రివల్యూషన్‌ను ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్‌గా అందిపుచ్చుకున్నాం. అప్పుడు చేసిన విజన్ కారణంగా రూ.1.05 లక్షల కోట్లు రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తోంది. సైబరాబాద్‌ను ఇటుకా ఇటుకా పేర్చి నిర్మాణం చేశాం. ఫలితాలు వచ్చాయి. అందుకే మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ నిలిచింది. ఇప్పుడు అమరావతిని కూడా మోస్ట్ లివబుల్ సిటీగా నిర్మాణం చేస్తున్నాం.  2014 విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేయాలని కోరాను. ఇప్పుటి వైసీపీ నాయకుడు నాడు పార్లమెంటులో కెమెరాలు నుంచి తప్పించుకు తిరిగాడు. 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పటికీ ఏపీకి సొంత రాజధాని నిర్మాణం చేయాలని ఇక్కడికి వచ్చాం. 9 నెలల్లో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, సచివాలయ ప్రాంగణాలను నిర్మించుకున్నాం. సింగపూర్ సహకారంతో ప్రపంచ స్థాయిలో రాజధాని నిర్మాణం కోసం ప్రణాళికలు ఇవ్వాలని కోరాం. ముందు దేశం బాగుండాలి, అలా ఉండాలంటే మన జాతి బాగుండాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. తెలుగు వాళ్లకు చెందిన హైదరాబాద్, అమరావతి తొలి రెండు స్థానాల్లో ఉండాలన్నదే నా సంకల్పం’ అని సీఎం చంద్రబుబ స్పష్టం చేశారు

*ఐదేళ్లు కీచకపర్వం సాగించారు*

‘రాజధాని వల్ల ఏం జరుగుతుందనే వ్యక్తులు హైదరాబాద్ నుంచి ఏడాదికి 1.05 లక్ష కోట్ల మేర వస్తున్న ఆదాయం చూడాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రాంతంగా అమరావతి ఉంటుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. 2019లో ఒక్కఛాన్స్‌తో అధికారంలోకి వచ్చి ప్రజావేదిక కూల్చి విధ్వంస పాలన మొదలు పెట్టారు. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కు నెట్టారు. రైతులపై ఉక్కు పాదం మోపారు. కేసులు పెట్టి, బూట్లతో తన్నారు, లాఠీలతో కొట్టారు. అడ్డగోలుగా కేసులు పెట్టి కీచకపర్వం సాగించారు. శాసన మండలిలో సెలెక్ట్ కమిటీతో బిల్లు పాస్ చేయాలని చూశారు. అయినా హైకోర్టు న్యాయస్థానం కాపాడింది. ఈ తరహా పాలన తుగ్లక్ నిర్ణయం అని, పెట్టుబడులు రావని మీడియా పెద్ద ఎత్తున రాసింది. గత పాలనలో నేను, పవన్ కల్యాణ్ సహా అంతా బాధితులమే. కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించాం. మన ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.15వేల కోట్లు తక్షణ సాయం అందించింది. అమరావతి పనులు రీస్టార్ట్ చేశాం. 2028కి పనులు అన్నీ పూర్తి చేసి అమరావతికి ఒక రూపు తీసుకువస్తాం. 2027 నాటికి ట్రంక్ రోడ్లు, లేఅవుట్స్ సహా వివిధ మౌలిక సదుపాయాలు పూర్తి అవుతాయి. రూ.56 వేల కోట్ల విలువైన 91 పనులు వేగంగా జరుగుతున్నాయి’ అని సీఎం వివరించారు. 

*ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం*

అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా అమోదించింది. విభజన చట్టం సెక్షన్-5(2)ను సవరించాలని కోరుతూ ‘ఎట్ అమరావతి’ అనే పదాన్ని చట్టంలో చేర్చేలా అసెంబ్లీ తీర్మానించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం నోటిఫై చేసిన ప్రాంతాలకు కూడా రాజధాని పరిధి వర్తింప చేసేలా చట్ట సవరణ కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. శాసన సభ ఆమోదం పొందిన ఈ తీర్మానాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌కు పంపించారు. అలాగే కేంద్ర హోంమంత్రికి ఆమోదం పొందిన తీర్మానం ప్రతిని స్పీకర్ పంపారు. తీర్మానం కాపీలను అటు కేంద్ర హోం కార్యదర్శి, ఏపీ సీఎస్‌కు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పంపించారు. 

No comments:

Post a Comment

ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతిగా శాసనసభలో తీర్మానం

 ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతిగా శాసనసభలో తీర్మానం