Oct 20, 2025

గోలి మధు అంటే ఓ మెరుపు, ఓ ఎరుపు

‘ఎదురీత’ పుస్తకం సమీక్ష

చక్కటి  భాష, బిగువైన పద బంధం, విషయంలో స్పష్టత, ప్రేమ, ఆవేశం, ఆవేదన.... అన్నిటినీ ఎరుపెక్కిన కలంతో  సూటిగా, దూకుడుగా కవిత్వీకరించడంలో  గోలి మధు దిట్ట. మూడు దశాబ్దాలుగా అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని ఆధునిక భావాలు, సామాజిక స్పృహతో అభ్యుదయ కవిత్వం రాస్తున్నారు. మనిషీ దూకుడే, అతని కవిత్వమూ దూకుడే. అన్ని వర్గాల ప్రజలు తనవాళ్లే అనుకుని, అందరి సమస్యలపై స్పందిస్తారు. ప్రజలలో, ముఖ్యంగా యువతలో చైతన్యం తీసుకురావాలన్నది ఆయన తపన.   అందుకు కవిత్వం ద్వారా ఎదురీదడమే మార్గంగా ఎన్నుకున్నారు. ఆ కోవలో రాసిన ఆయన తాజా కవితా సంకలనం ‘ఎదురీత’.   ఈ పుస్తకాన్ని మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల(అక్టోబరు) 12న  గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆవిష్కరించారు.  మధు కవిత్వం నచ్చి, ముచ్చటపడి  ఈ సంకలనం ముద్రణకు అయిన ఖర్చు మొత్తాన్ని ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు  నన్నపనేని నాగేశ్వరరావు అందించారు.  మధుకి  జీవితం పట్ల, కవిత్వం పట్ల ఒక స్పష్టమైన దృక్పథం ఉంది. అందువల్ల అతని కవిత్వంలో గజిబిజి గందరగోళం ఉండదు. పాఠకుడి మనసుకు సూటిగా తగిలి, ఆలోచనలు రేకెత్తిస్తుంది. గుడి కప్పులు ధగ ధగ మెరుస్తుంటే - బడి కప్పులు పెచ్చులూడి పడుతున్నాయి... గుళ్ల మీద చూపించిన శ్రద్ధ మనం బడులమీద చూపించడంలేదన్న బాధ వ్యక్తం చేశారు మధు. ఆధునిక పోకడలు, సమాజంలో రుగ్మతలు, అవినీతి, మతోన్మాదం, కుల తత్వం, ఓట్ల రాజకీయం, బాధితుడి మౌనం, ప్రశ్నించకపోవడం.. వంటి అన్ని విషయాలను ఎత్తిచూపి మరీ సమాజాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరిస్తుంటారు. అదే మధు ప్రత్యేకత. ఎవరు ఏ విషయం చెప్పినా, ఆ క్షణంలోనే ఆ అంశంపై కవిత్వం రాయగల సమర్థుడు మధు.  తడి గుడ్డతో గొంతులు తెగుతుంటాయి - తడి గుడ్డ వేసుకుని వేడుక చూస్తున్నంత కాలం.. అని సమాజాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.  మనిషి మనిషికీ మతం మత్తు - సందు సందుకీ కులం కిక్కు...ఎనిమిది పదాలలో  సమాజం తీరుని మన ముందుంచారు. గొంతు మెదపక/ ప్రశ్నించక, ప్రతిధ్వనించక/ కలహించక కూర్చుంటే - నువ్వు మాయం నేను మాయం!! అని మరో హెచ్చరిక చేశారు. ఒకటికి మరొకటి జత చేరనిదే ఒకటి   లేనేలేదు - పరుగు పందెంలో ఒకటో స్థానానికి రెండు కాళ్లు...ఇందులో పలు అర్థాలు స్పురిస్తాయి.  పోరుబాట చతికిల పడితే- సగటు మనిషి ‘చితి’కే...అని తట్టి లేపుతున్నారు.  జాతీయ జెండా నేసినా - ‘మానవ’ మానం కాపాడినా - మగ్గానికి మరణ శాసనమాయె ... అని చేనేత స్థితిని వివరించారు. ఓట్లు మనవే - పాట్లూ మనవే...అని ఓటరు తీరుని వివరించారు. ‘‘దారిద్ర్య రేఖలు చెరపాలని కవిత్వ నావతో నా ఎదురీత’’ అని కూడా ఓ కవితలో స్పష్టంగా చెప్పారు. ‘‘ప్రశ్న సంకెళ్లు తెంచే గండ్రగొడ్డలి’’ అని స్పష్టం చేశారు. అక్షరం ధిక్కారం మరచి అధికారానికి సాష్టాంగమైందన్న బాధ వ్యక్తం చేశారు. మధు ప్రజల పక్షం, బాధితుల పక్షం నిలుస్తారు. మధు  ప్రభుత్వ ఉద్యోగి. అయినా, ప్రభుత్వాలపైనే తిరుగుబాటు కవిత్వం రాయగల ధైర్యవంతుడు. ప్రభుత్వాలేకాదు, సమాజంలోని రుగ్మతలన్నిటిపై   సూటిగా, ఘాటుగా కవితలు రాస్తూ, సమాజాన్ని మేల్కొలపడం ఆయన నైజం.  మనిషిగా ఎంత ఒదిగి ఉన్నా, కవిగా  మాత్రం దేనికీ తగ్గేదేలే అన్న రీతిలో తలెత్తుకుని మరీ కవిత్వం రాస్తారు. ఎంత ఆవేశంతో, ఆవేదనతో తిరుగుబాటు కవిత్వం రాసినా,  ఉద్యోగం మాత్రం నిజాయితీ, నిబద్ధత, అంకితభావంతో చేస్తారు. రాత్రి వేళల్లోనే ఆయన ఆలోచనలకు అక్షర రూపం ఇస్తారు. కంట తడిపెట్టించే కవిత్వం కూడా ఆయన రాస్తారు.  తమ పెంపుడు కుక్క ‘మిలో’ మరణించినప్పుడు  మధు రాసిన 8 పేజీల కవిత పాఠకులు చదివి తీరవలసిందే. ఒక్కొక్కరికి ఒక్కో అనుభూతి మిగులుస్తుంది ఈ కవిత.  పెంపుడు కుక్కలతో ఆ ఇంటి వారి అనుబంధం, వాటి చేష్టలు, చూపులు, అల్లరి, అరుపులు, ప్రేమ, వారిపైకి ఎగబడటం .., వాటిపై  ఇంట్లో వారు చూపించే ప్రేమ, అవి మరణించినప్పుడు వారు పడే బాధ...  ఇలా అన్ని విషయాలను కవిత్వీకరించారు. కుక్కలను పెంచుకునేవారిని కదిలిస్తుంది. కంటతడిపెట్టిస్తుంది ‘మిలో....రేయ్...మిలో’ కవిత. ఈ సంకలంలోని 55 కవితలలో అనేక పార్శ్వాలు  స్పృశించారు.  చదవడం మొదలు పెడితే, 150 పేజీల పుస్తకం పూర్తి అయ్యేంత వరకు మూయలేం. అంత ఆసక్తిగా మనల్ని చదివిస్తారు మధు. ఆయన కవిత్వంలో అంతటి బిగువుంది.  మధు కవిత్వం ఆలోచనలు రేకెత్తిస్తుంది. ప్రశ్నించడం నేర్పుతుంది.  సజావుగా సాగే జీవితం తలక్రిందులైతే, కాలానికి ఎదురీది, తనని, తన చెల్లిని పెంచిన అమ్మ గోలి పార్వతీ దేవే తన ఎదురీతకు స్ఫూర్తి అని  మధు వినమ్రంగా వివరించారు. తల్లంటే మధుకి అమితమైన ప్రేమ, అభిమానం. అలాగే,  మంగళగిరి లయన్స్ క్లబ్ అధ్యక్షురాలిగా ప్రజాసేవలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన దివంగత నన్నపనేని లక్ష్మికి ఈ పుస్తకం అంకితం ఇచ్చి, తనకు మహిళల పట్ల ఉండే గౌరవాన్ని వ్యక్తం చేశారు మధు. ఈ సంకలనం మొదటి పేజీలో భారత రాజ్యాంగ ప్రవేశికను ముద్రించి, పౌరుడుగా బాధ్యతగా వ్యవహరించారు.  గోలి మధు ఇంతకు ముందు భారతీయ ధర్మ విశ్లేషణ(2003), నవశకం(2006), రైతు సమరభేరి(2020,2021), గమనం(2021), సంఘర్షణ (2023) అనే అయిదు కవితా సంకలనాలు అందించారు.   ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమానికి బాసటగా  2020లో తెచ్చిన ‘రైతు సమరభేరి’ కవితా సంపుటి 2021లో రెండవ ముద్రణకు నోచుకోవడం విశేషం. మధు కవిత్వం ప్రజలలోకి దూసుకువెళుతుందనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ కవితా సంపుటి కవర్ పేజీని తెనాలికి చెందిన దివి హేమంత్ కుమార్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. 

150 పేజీల ‘ఎదురీత’ వెల : రూ.150

కవి గోలి మధు సెల్: 9989186883

ప్రతులకు : 9848199098

                                      సమీక్షకులు : శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914

No comments:

Post a Comment

30న తెలంగాణ బార్ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక

ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...