Oct 13, 2025

సాహిత్యంతోనే తెల్లారుతుంది... పొద్దుపోతుంది

మరో వ్యాపకం తెలియని రజా హుస్సేన్!

2650కి పైగా విమర్శలు, విశ్లేషణలు రాసిన దిట్ట
ఆయనకు సాహిత్యంతోనే తెల్లవారుతుంది. సాహిత్యంతోనే పొద్దుపోతుంది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ఆయనకు అదేపని. సాహిత్య, సాహిత్యం, సాహిత్యం...అన్ని ప్రక్రియలలో సాహిత్యాన్ని చీల్చిచెడాడతారు. ఆయనే జర్నలిస్ట్, ప్రముఖ కవి, సాహితీ విమర్శకుడు, విశ్లేషకుడు అబ్దుల్ రజా హుస్సేన్. ఆయను సంబంధించినంతివరకు ఇది ఓ నిరంతర ప్రక్రియ. పదవీ విరమణ చేసినవారు ఎక్కువ మంది కృష్ణా!రామా!! అంటూ గడిపేస్తున్నట్లు, ఆయన కవిత్వం, విమర్శ, విశ్లేషణ... అంటూ కుమ్మేస్తుంటారు. గడిపేస్తుంటారు. ఆయనకు మరో వ్యాపకం లేదు. తెలియదు. 1972 నుంచి రజాహుస్సేన్ సాహితీ రచనలు, పుస్తక సమీక్షలు కొనసాగిస్తున్నారు. తెలుగు సాహిత్యంలో మాస్టర్ డిగ్రీ చేసిన ఆయన తెలుగులో మంచి పట్టు సాధించారు. సాహిత్యంపై ఆయనకు మక్కువ ఎక్కువ. రచనా వ్యాసంగంలో ఆయన స్వర్ణోత్సవం పూర్తి చేశారు. రిటైర్ అయిన తర్వాత విశృంఖలంగా రాయడం మొదలెట్టారు. ఏమాత్రం సమయం దొరికినా సాహితీవేత్తలను కలుస్తుంటారు. ఇష్టంగా వారితో సాహిత్య చర్చలు కొనసాగిస్తుంటారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని మరీ ఆయన దూసుకువెళుతున్నారు. సాహిత్యం కోసం సెల్ ఫోన్‌ని, ఫేస్‌బుక్‌ని ఆయన ఉపయోగించుకుంటున్నంతగా ఎవరూ ఉపయోగించుని ఉడరని చెప్పడం అతిశయోక్తికాదు. పదేళ్లుగా సాహిత్యంతో ఫేస్‌బుక్‌ని కమ్మేశారు. నింపేస్తున్నారు. సాహిత్యం ఆయనను ఆవహించిందో, ఆయన సాహిత్యాన్యి ఆవహించారో చెప్పడం కష్టం. ఫేస్‌బుక్ వేదికగా కాఫీవిత్... పేరుతో రజా హుస్సేన్ 2650కి పైగా ఎపిసోడ్లు పూర్తిచేశారు. ఎంతో మంది జీవితాలను, పుస్తకాలను, కొత్త కొత్త ఆలోచనలను పరిచయం చేశారు. ఇవే కాకుండా ఇతర ఆర్టికల్స్ కూడా వందల సంఖ్యలో రాశారు. ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన జీవించినంత కాలం కొనసాగిస్తూనే ఉంటారనిపిస్తోంది. సాహిత్యం అంటే ఆయనకు అంత వల్లమాలిన ప్రేమ. పురాతన తెలుగు సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్య వరకు అన్ని ప్రక్రియలను విశ్లేషిస్తారు. ఆదికవి నన్నయ్య వంటి మహామహుల దగ్గర నుంచి కొత్త తరానికి చెందిన ఆధునిక యువ కవుల వరకు ఎవరినీ వదలరు. ప్రోత్సాహంలేక మరుగునపడిన అనేక మందిని వెలుగులోకి తీసుకువచ్చి, ప్రోత్సహిస్తుంటారు. అత్యంత నిరుపేద కవులు, కళాకారులు, చిత్రకారులు, రచయితలు, కథకులను అనేక మందిని సాహితీ ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన జర్నలిస్టు కూడా అయినందున, అందరికీ అర్థమయయే రీతిలో చిన్నచిన్న పదాలతో వాడుక భాషలో రచనలు చేయగల దిట్ట. ఇంతగా సాహిత్యాన్ని ప్రేమిస్తూ, అదే ప్రపంచంగా, అందులోనే మునిగితేలుతూ, దానితోనే సహజీవనం చేస్తున్న రజా హుస్సేన్‌ని ఆయన భార్య ఫాతిమా ఎలా భరిస్తున్నారో అని ఒక్కోసారి అనిపిస్తోంది. సాహిత్యమే జీవితంగా గడిపేస్తున్న ఆయనకు అన్ని విధాల సహకరించే ఫాతిమా లాంటి భార్య దొరకడం అదృష్టం. పద్యం, కవిత్యం, జానపదం, కథ... సాహితీ విశ్లేషణ, ప్రోత్సాహం, విమర్శలతో వేల మంది సాహితీకారుల సాహిత్య లోతులలోకి చొచ్చుకుకుపోవడమే కాకుండా, వారి జీవితాలను కూడా స్పృశించారు. వారందరి ఆలోచనలు, భావాలు, కవిత్వం, వారి సాహితీ పరిమళం, జీవన శైలిని ఆయన శైలిలో మనకు అందించారు. అదే ఆయన ప్రత్యేకత. తన సాహితీ ప్రస్థానం విమర్శ, విశ్లేషణ, కవిత్వం ముప్పేటల ముడి అని ఆయనే పేర్కొన్నారు. సాహిత్యలో మునిగితేలుతూ, ఇంతటి అధ్యయనం చేస్తున్న రజా హుస్సేన్‌ను ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఏదో ఒక విశ్వవిద్యాలయం గుర్తించి, ఆయనను డాక్టరేట్‌తో గౌరవిస్తుందని ఆశిస్తున్నాను. అంతే కాకుండా, విశ్వవిద్యాలయాల తెలుగు విభాగాల వారు, తెలుగు సాహిత్య అకాడమీ.. వంటి వారు భాషా పటిమ గల రజా హుస్సేన్ రాసిన కవిత్వం, సాహితీ విమర్శలు, విశ్లేషణలు, ఇతర సాహితీ ప్రక్రియలతో కూడిన ఎపిసోడ్‌లు అన్నిటిని పుస్తకరూపంలో తీసుకువచ్చి, నిక్షిప్తం చేసి, ముందు తరాల వారికి అందించవలసిన బాధ్యత ఉందన్నది నా అభిప్రాయం.
ఏమీ ఆశించకుండా, తన పెన్షన్‌ డబ్బుని కూడా ఖర్చు చేస్తూ సాహితీ సేవకు అంకితమైపోయిన రజా హుస్సేన్‌ గుంటూరు జిల్లా మంగళగిరిలో అబ్దుల్ రసూల్, ఫరీద్ బీ దంపతులకు 1957, ఏప్రిల్ 11న జన్మించారు. మంగళగిరి పంచాయతీ పాఠశాల, చింతక్రింది కనకయ్య ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. గుంటూరు హిందూ కళాశాలలో డిగ్రీ, నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగులో ఎంఏ పూర్తి చేశారు. అక్కడే కొంత కాలం ఎంఫిల్ విద్యార్థిగా పరిశోధన పరిశోధన చేశారు. అయితే, ఎంఫిల్ పూర్తి చేయలేకపోయారు. ఆ తర్వాత ఈనాడు దినపత్రికకు మంగళగిరిలో విలేకరిగా పని చేశారు. 1981లో ఒక ఏడాది పాటు మంగళగిరిలోని వెనిగళ్ల తాతయ్య, జంజనం మంగళాద్రి(వీటీజేఎం) డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పని చేశారు. ఆ తర్వాత కూడా ఈనాడులో వివిధ ప్రాంతాలలో ఎనిమిదేళ్లు జర్నలిస్టుగా పని చేశారు. 1988లో రాష్ట్ర కర్షక పరిషత్‌ చైర్మన్ నారా చంద్రబాబు నాయుడుకు ప్రజాసంబంధాల అధికారి(పీఆర్‌ఓ)గా పని చేశారు. ఆ తర్వాత వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన రెడ్డికి స్పెషల్ పీఆర్ఓగా, ఆ తర్వాత అప్పటి మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మికి ఓఎస్‌డీగా పని చేశారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా, అదే శాఖకు చెందిన శిక్షణా సంస్థలో ప్రిన్సిపాల్‌గా కూడా చేశారు. 2015లో తెలంగాణ ప్రభుత్వంలో పదవీ విరమణ చేశారు. అక్కడ నుంచి సాహిత్యమే ఆయన ప్రపంచమైది. ఫేస్‌బుక్ వేదికగా నిరంతరం సాహిత్య అధ్యయనం చేస్తున్నారు. ఉద్యోగరీత్యా ఆయన 40 ఏళ్లు హైదరాబాద్‌లోనే నివాసం ఉన్నారు. రిటైర్ అయిన తర్వాత గుంటూరు జిల్లా తెనాలి దగ్గరలోని అత్తగారి గ్రామం నందివెలుగులో కూడా ఉంటూ, హైదరాబాద్‌కు, ఈ గ్రామానికి రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఆ విధంగా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జీవిస్తున్నారు. రజా హుస్సేన్‌ 52 ఏళ్ల సాహితీ జీవితంలో ఇప్పటి వరకు పింగళి వెంకయ్య, చుక్కా రామయ్య, నేదురుమల్లి జనార్దన రెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, బండి గోపాలరెడ్డి... వంటివారి జీవిత చరిత్రలతోపాటు సాహిత్య వ్యాసాల సంకలనం, తిరంగా ముసల్మాన్, హజ్ యాత్ర-మార్గదర్శకాలు, ఎయిడ్స్ బాధితుల యదార్థ గాధలు, చలమిజం, స్ఫూర్తి ప్రదాతలు, మణిపూర్ నగ్నకవాతు, కళల సిరి...మంగళగిరి.... వంటి 27 పుస్తకాలు ప్రచురించారు. మరో వంద పుస్తకాలకు సరిపడా అముద్రిత రచనలు ఉన్నాయి. వాటిని కూడా వెలుగులోకి తీసుకురావలసి ఉంది. ముఖ్యంగా రజా హుస్సేన్‌ రచనలు, ఫేస్‌బుక్ ఎపిసోడ్‌లు తెలుగు భాషలో మాస్టర్ డిగ్రీ చేసేవారికి, పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడతాయి. భవిష్యత్తులో రజా హుస్సేన్ రచనలపై ఎంఫిల్, పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ఉంటుంది.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914

No comments:

Post a Comment

30న తెలంగాణ బార్ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక

ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...