Oct 10, 2025

తెలుగు రాష్ట్రాలకు ఓ వరం మంగళగిరి ఎయిమ్స్





రికార్డు స్థాయిలో 28 లక్షలు దాటిన అవుట్ పేషెంట్లు

అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యసేవలు

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఏఐఐఎంఎస్-ఎయిమ్స్) రెండు తెలుగు రాష్ట్రాలకు ఓ వరం. పచ్చని కొండల నడుమ ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో 183.11 ఎకరాల విస్తీర్ణంలో  ఎయిమ్స్ కోసం భారీ భవనాలు నిర్మించారు. అతి తక్కువ ఖర్చుతో అత్యంత ఆధునికమైన  కార్పోరేట్  వైద్య సేవలు  ఇక్కడ అందిస్తారు. నిపుణులైన వైద్యులు అత్యంత శ్రద్ధతో  రోగులకు ఇక్కడ వైద్యం చేస్తారు.  ఔట్ పేషెంట్ ఆధార్ కార్డు చూపించి,  రూ.10 రూపాయలు ఫీజు చెల్లిస్తే చాలు వైద్యసేవలు అందిస్తారు. వైద్య పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్‌లలో అయ్యే ఖర్చులో పోలిస్తే, మూడవ వంతు మాత్రమే అవుతుంది.  ప్రైవేటు ఆస్పత్రులలో మాదిరి ఇక్కడి వైద్యులు తొందరపడి ఆపరేషన్లు సూచించరు. వృద్ధుల విషయంలో మరీ జాగ్రత్తలు తీసుకుంటారు. సాధారణ వైద్యంతోపాటు ప్రత్యేక వైద్య బృందాల ద్వారా రోగుల అవసరాలను తీర్చడానికి బహుళ విభాగాలలోని సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. 2018లో ఇక్కడ ఎయిమ్ సేవలు మొదలయ్యాయి. మంగళగిరి ఎయిమ్స్‌కి చెందిన వైద్యసేవలు తొలుత విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలోని తాత్కాలిక క్యాంపస్‌లో ప్రారంభమయ్యాయి. మంగళగిరిలో రెండు కొండల మధ్య ప్రశాంత వాతావరణంలో గతంలో టీబీ శానిటోరియం ఉండేది. ఈ  ప్రాంతాన్ని ఎయిమ్స్‌కి కేటాయించారు. ఇక్కడ నిర్మించిన  భవనాలలో 2019 మార్చిలో  శాశ్వత క్యాంపస్‌లో ఓపీడీ సేవలు ప్రారంభించారు. ఆ తర్వాత ఇన్ పేషెంట్ సేవలు కూడా  మొదలయ్యాయి. 2024 ఫిబ్రవరి 25న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా మంగళగిరి ఎయిమ్స్‌ని జాతికి అంకితం చేశారు. 2024, డిసెంబరు 17న  జరిగిన ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళగిరి ఎయిమ్స్‌కు వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ప్రారంభంలో రోజుకు 50, 100 మంది వచ్చే రోగులు  ఇప్పుడు 3500 నుంచి 4000 వరకు వస్తున్నారు. ఇక్కడ ఎయిమ్స్ మొదలైనప్పటి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు  అవుట్ పేషెంట్(ఓపీ)ల సంఖ్య 28 లక్షలు దాటిపోయింది. ఔట్ పేషెంట్లకు వైద్య సేవలు అందించడంలో ఎయిమ్స్ చరిత్రలో ఇది మరో మైలురాయి. 50 వేలకు పైగా ఎమర్జర్సీ కేసులను చూశారు. 49 లక్షలకుపైగా ల్యాబ్ టెస్టులు చేశారు. ఇక్కడ జనరల్ వార్డులలో 651 బెడ్స్, ఐసీయూలో 76 బెడ్స్, ప్రైవేటు వార్డులో 17 బెడ్స్, డే కేర్ సర్వీస్ వార్డులో 104 బెడ్స్  ఉన్నాయి. ఎయిమ్స్ డ్రోన్ సేవలు కూడా ప్రారంభించింది. రక్త నమూనాలను సేకరించి రక్త పరీక్షలు చేస్తున్నారు. అన్ని విభాగాలలో అత్యాధునిక వైద్య పరికరాలను సమకూరుస్తున్నారు.    ఇక్కడి వచ్చే రోగులలో దాదాపు 50 శాతం మంది గుంటూరు, కృష్ణా జిల్లాల వారే ఉంటారు. ఆ తర్వాతే ఇతర జిల్లాల వారు ఉంటారు. తెలంగాణ నుంచి వచ్చేవారిలో   ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాల నుంచి వచ్చేవారే ఎక్కువ. కర్ణాటక, బీహార్ ప్రాంతాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తున్నారు. ఈ ఏడాది ఇండియన్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకిగ్ ఫ్రేమ్‌వర్క్‌( Indian Institutional Ranking Framework)లో మంగళగిరి ఎయిమ్స్ దేశంలో 29వ ర్యాంక్ లో, ఏపీలో నెంబర్ వన్ ర్యాంక్‌తో రాష్ట్రంలో అగ్రశ్రేణి వైద్య సంస్థగా నిలిచింది. ఎయిమ్స్ కు సమీపంలోనే జాతీయ రహదారికి ఆనుకుని ట్రామా కేర్ సెంటర్ నిర్మాణానికి మరో పది ఎకరాలు కేటాయించాలన్న ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉంది.

సమస్యలు:


ఎయిమ్స్‌లో నిపుణులైన వైద్యులతోపాటు ఇన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నప్పటికీ పలు సమస్యలు కూడా ఉన్నాయి. రోగులు పెరుగుతున్న స్థాయిలో వైద్యులను, సిబ్బందిని, మెడికల్  షాప్ కౌంటర్లను, క్యాంటిన్‌లో సౌకర్యాలను పెంచలేదు. నిర్వహణ చాలా లోపభూయిష్టంగా ఉంది. లోపలికి వెళ్లడానికి, ఓపీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి, డిపార్ట్ మెంట్‌లో రిజిస్ట్రేషన్‌కు, డాక్టర్‌ని కలవడానికి, టెస్టులకు ఫీజులు చెల్లించడానికి, టెస్ట్‌లు చేయించుకోవడానికి, మందులు కొనడానికి దాదాపు ఏడెనిమిది చోట్ల క్యూలలో నిలబడాలి.  అదే స్పెషలిస్ట్‌కు చూపించవలసిన అవసరం వస్తే మరోసారి క్యూలో నిలబడాలి.   ఒక్కోచోట గంటసేపు కూడా ఎదురు చూడాలి. టెస్ట్‌లకు డబ్బు చెల్లించే కౌంటర్లు ఒక చోట ఉండవు. తెలియక ఒక కౌంటర్ వద్ద క్యూలో నిలబడి, దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ కాదని చెబుతారు. అప్పుడు మరో కౌంటర్ వద్ద మళ్లీ క్యూలో నిలబడాలి. రోగులను క్రమ పద్దతిలో క్యూలో నిలపడానికి తగినంతమంది సిబ్బంది లేకపోవడంతో రోగుల మధ్య గొడవలు, తోపులాటలు సర్వసాధారణం. ఇక్కడ ఓపీ వైద్యం పూర్తి కావడానికి ఒక పూట నుంచి రోజు పడుతుంది.  అందించేది కార్పోరేట్ వైద్యం అయినా, రోగుల కష్టాలు వర్ణనాతీతం.  కొన్ని చోట్ల రోగులు లేక వారి బంధువులు  సిబ్బంది చిత్కారాలకు గురికావలసి వస్తోంది.డాక్టర్లు అందరూ రోగుల పట్ల చాలా మర్యాదగా వ్యవహరిస్తారు. ఎంతో ఓపికతో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు. అయితే,  సిబ్బందిలో కొందరు మాత్రం రోగుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తుంటారు. కొందరు ఎక్కువ సమయం సెల్ ఫోన్‌లో మాట్లాడుతుంటారు. రోగులను పట్టించుకోరు.  గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు తగిన సమాచారం ఎవ్వరూ సరిగా ఇవ్వరు. దాంతో వాళ్లు అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు సాయంత్రం వారి ఊరు వెళ్లి, మళ్లీ రెండవ రోజు రావాలి. కొన్ని టెస్ట్‌లు ఆ రోజు లేక మరుసటి రోజు చేస్తారు.

రిపోర్టులు కూడా మరుసటి రోజు ఇస్తారు. సీటీస్కాన్‌, ఆల్ట్రా స్కాన్, ఎమ్మారై స్కాన్‌, వినికిడి టెస్ట్... వంటి వాటికి  నెల రోజులకు పైగా ఎదురు చూడవలసి ఉంటుంది. అలాగే, భోజనశాల, క్యాంటిన్ నిర్వహణ కూడా చాలా అధ్వాన్నంగా ఉంది. భోజనశాలలో టేబుల్‌పై  మంచి నీళ్ల జగ్గులు, గ్లాసులు ఉండవు. వాటర్ బాటిల్ కొనుక్కోమని ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఈ విషయమై రోగులు ఆందోళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మెడికల్ షాపుల నిర్వహణ కూడా అధ్వాన్నంగా ఉంది. ఎయిమ్స్‌లో అతి తక్కువ ఖర్చుతో మంచి వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ, నిర్వహణ పరంగా రోగులు, వారి బంధువులు అనేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా దిగువ స్థాయి సిబ్బంది చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. రోగుల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు సిబ్బందిని విసిగించే మాట వాస్తవమే. అయితే, వారికి ఓపికగా సమాధానం చెప్పవలసిన బాధ్యత సిబ్బందిపై ఉంటుంది.




చేయవలసిన మార్పులు:


అన్ని విభాగాలలో డాక్ట దగ్గర నుంచి సెక్యూరిటీ సిబ్బంది వరకు తగినంత మందిని నియమించాలి. సాంకేతికతను వినియోగించుకుని  నిర్వహణలో సమూలంగా మార్పులు తీసుకురావలసిన అవసరం ఉంది. రోగులు అయిదు, ఆరు సార్లు క్యూలో నిలబడవలసిన అవసరంలేకుండా మార్పులు చేయాలి.  రోగులు అన్నిచోట్ల గంటల తరబడి క్యూలో నిలబడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితి వర్ణనాతీతం.       ప్రతి విభాగంలో, క్యూలో రోగులు నిలబడిన ప్రతిచోట ఒక సెక్యూరిటీ గార్డును తప్పనిసరిగా నియమించాలి. వారు క్యూని నియంత్రించాలి. ఎయిమ్స్ వంటి సంస్థ ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించవలసిన అవసరం ఉంది.  రోగి ఏ విషయం అడిగినా, వారికి అర్థమయ్యే రీతిలో ఓపికగా సమాధానం చెప్పే విధంగా ప్రత్యేక సమాచార కౌంటర్ ఏర్పాటు చేయాలి. అలాగే, రోగులు, వారి బంధువుల పట్ల మర్యాదగా ప్రవర్తించే విధంగా సిబ్బందికి తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలి. రోగులు, వారి బంధువులు వందల మంది తమ ఇళ్ల వద్ద నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని ఎయిమ్స్ ఆవరణలో ఎక్కడబడితే అక్కడ కూర్చొని భోజనం చేస్తుంటారు. వారిని త్వరగా భోజనం చేసి వెళ్లిపొమ్మని సెక్యూరిటీ సిబ్బంది గదమాయిస్తుంటారు. ఇక్కడ సెక్యూరిటీ సిబ్బందిని కూడా తప్పు పట్టలేము. వారు అలా ఎక్కడబడితే అక్కడ భోజనం చేయడం వల్ల ఆస్పత్రి పరిసరాలు అపరిశుభ్రం అవుతాయి. అందువల్ల వారు భోజనాలు చేయడానికి ఒక ప్రత్యేక భోజనశాలను ఏర్పాటు చేయాలి.

కోట్ల రూపాయల వ్యయం చేసి, పలు భవనాలు నిర్మించారు. అవుట్ పేషెంట్లు భోజనం చేసే సౌకర్యం కల్పించకపోవడం పెద్ద లోపమే. ఎయిమ్స్ యాజమాన్యం తలుచుకుంటే ఈ సమస్యలను పరిష్కరించడం భారమైన విషయం ఏమీ కాదు. ఎయిమ్స్‌కు వచ్చే రోగుల సమస్యలు, వారు పడుతున్న ఇబ్బందులను అధ్యయనం చేసి, తగిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఒక కమిటీని నియమించవలసిన అవసరం ఉంది. ఆ కమిటీ నివేదిక ప్రకారం తగిన చర్యలు తీసుకుంటే ఈ సమస్యలన్నీ సునాయాసంగా పరిష్కారం అవుతాయి.   ఎయిమ్స్ యాజమాన్యం ఆధునిక వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు నిర్వహణా లోపాలను సరిదిద్దుతుందని ఆశిద్దాం.


- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914








No comments:

Post a Comment

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్  ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...