ఏపీ వెటరన్ జర్నలిస్టుల యూనియన్ నాయకులు ఈ రోజు(శనివారం) మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి, రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ పథకం ప్రవేశపెట్టమని కోరారు. జర్నలిస్టుగా 20 ఏళ్ల అనుభవం ఉండి, 58 సంవత్సరాలు పూర్తి చేసినవారు రాష్ట్రంలో 500 మందికి మించి ఉండరని తెలిపారు. ఈ పథకం వల్ల ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక భారం ఉండదని చెప్పారు. దేశంలో 19 రాష్ట్రాలలో ఈ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రిటైర్ అయిన జర్నలిస్టుల పరిస్థితిని, ఇతర రాష్ట్రాలలో ఇస్తున్న పెన్షన్ వివరాలు, వాటికి సంబంధించిన జీవోలతో కూడిన ఒక వినతి పత్రాన్ని సీఎంకు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. పరిశీలిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో ఏపీ వెటరన్ జర్నలిస్టుల యూనియన్ గౌరవాధ్యక్షులు శిరందాసు నాగార్జున రావు, జనరల్ సెక్రటరీ జి.చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు కాకర్ల వెంకటరత్నం, జి.రామారావు, ట్రెజరర్ ఎంపీ రామారావు ఉన్నారు.
-------------------------------
సీఎంకు ఇచ్చిన లేఖ
గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దివ్య సముఖమునకు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
అయ్యా...
విషయం: వెటరన్ జర్నలిస్టుల ఫించన్ మంజూరు, ఆరోగ్యపరంగా,ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెటరన్ జర్నలిస్టులకు ఉచిత వైద్యసదుపాయం తదితర సదుపాయాలు కల్పించుట
ప్రస్తుత వెటరన్ జర్నలిస్టులు ఒకప్పుడు వర్కింగ్ జర్నలిస్టులే.అప్పుడే వారి జీవితం అరకొరగా నడిచేది.ఇక రిటైర్ అయిన తరువాత మరింత అధోగతి పాలవుతున్నది. 365 రోజులు,24 గంటలు పనిచేసిన ఈ జర్నలిస్టులు వృద్ధాప్యంలో ఆరోగ్యపరంగా ,ఆర్ధికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సమయంలో వైద్యఖర్చులకు లేక అనేక మంది మృతి చెందారు. అందుకు ఆదోనికి చెందిన అండా రామారావు సాక్ష్యం. అలాగే కడుపుకు తింటానికి సరైన ఆహారం లేక మృతి చెందిన మా యూనియన్ అధ్యక్షుడు మణికుమార్ ఉదాహరణ. ఇలా వెలుగులోకి రాని వారు ఎందరో. కనీసం రెండు పూటలా తింటానికీ లేక అల్లాడుతున్నారు.అనారోగ్య పరిస్థితుల్లో సరైన వైద్యం అందడంలేదు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని జర్నలిస్టుల ఫించన్ పథకం ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
దక్షిణాది రాష్ట్రాల లోనే వెటరన్/ సీనియర్ జర్నలిస్టులకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ ఫించను ఇస్తున్నారు. మన రాష్ట్రంలో 300 మంది లోపు ఉండే వీరికి ఫించన్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నాం.
పెన్షన్ తో పాటు ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలి.జర్నలిస్ట్ ఆరోగ్య బీమా 10 లక్షలరూపాయలు ఉండేలా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
పెన్షన్ విషయంలో మన దేశంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానం అనుసరిస్తున్నాయి.
కనీసం 20 ఏళ్ల సర్వీసు లేక 58 ఏళ్లు నిండిన
జర్నలిస్ట్ మరణిస్తే భాగస్వామికి సగం పెన్షన్
డెత్ బెనిఫిట్స్ రూ.2 లక్షలు వచ్చేలా ప్రభుత్వం ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
మన దేశంలో ప్రస్తుతం 16 రాష్ట్రాలు ఫించన్ ఇస్తున్నాయి.
కర్నాటక ...రూ.15,000
హర్యాణా - రూ.15,000
తమిళనాడు - రూ.8,000
పశ్చిమ బెంగాల్ - రూ.2,500
యూపీ - రూ.8,000
మహారాష్ట్ర - రూ.10,000
మణిపూర్ - రూ.10,000
పాండిచేరి - రూ.6,000
బిహార్ - రూ.6,000
పంజాబ్ - రూ.12,000
అస్సాం - రూ.8,000
గోవా - రూ.8,500
కేరళ - రూ.11,000 నెలనెలా ఫించన్ ఇస్తున్నాయి. పక్క రాష్ట్రాలు ఆచరిస్తున్న ఈ పథకాన్ని ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న జర్నలిస్టుల దయనీయ పరిస్థితుల దృష్ట్యా మన రాష్ట్రం కూడా గౌరవ ఫించన్ ప్రారంభించాలని కోరుతున్నాం.
2) పూర్తి ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలి.హెల్త్ కార్డ్ మంజూరు చేయాలి.తెల్లకార్డ్ లబ్దిదారుల తరహాలో వెటరన్ జర్నలిస్టులకు ఇవ్వాలని కోరుతున్నాం.
3)ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి.1/3 తో అన్ని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా స్టేట్ పాస్ మంజూరు చేయాలి.ఆనారోగ్యం దృష్ట్యా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తుంది. దీన్ని దయతో పరిశీలించగలరు.
4) దూరప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చేవృత్తి నిమిత్తం,ఆనారోగ్యందృష్ట్యా వచ్చే జర్నలిస్టులకు ఒకటి,రెండురోజులు ఉండేలా ఉచిత వసతి గృహం ఏర్పాటు చేయాలి.
5) ఇల్లు లేని వెటరన్స్ కు 50 శాతం సబ్సిడీ తో స్థలం లేదా ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
6) రైల్వే పాసులను పునరుద్ధరించాలి.వృద్ధాప్యం దృష్ట్యా రైలు ప్రయాణం వెటరన్స్ కు సౌకర్యంగా ఉంటుంది. కనుక ఈ విషయాన్ని కూడా పరిశీలించగలరు. మా యూనియన్ సభ్యుల జాబితా జతచేర్చుతున్నాం.భవదీయ గౌరవనీయులు గమనించగలరు.
మీ సహాయాన్ని అర్ధిస్తున్న వెటరన్ జర్నలిస్టులు
భవదీయులు
ఏపీ వెటరన్ జర్నలిస్టుల యూనియన్ గౌరవాధ్యక్షులు శిరందాసు నాగార్జున రావు, జనరల్ సెక్రటరీ జి.చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు కాకర్ల వెంకటరత్నం, జి.రామారావు, ట్రెజరర్ ఎంపీ రామారావు .


No comments:
Post a Comment