Oct 9, 2025

న్యాయవ్యవస్థలో పారదర్శకత పెరగాలి

దేశంలో న్యాయవ్యవస్థ తీరుతెన్నులు

మన దేశంలో ఎన్నడూ లేనంతగా న్యాయవ్యవస్థ వార్తల కెక్కుతోంది. కొంత మంది న్యాయమూర్తులు అవినీతికి పాల్పడుతుంటే, మరికొంత మంది తీవ్ర విమర్శలను, ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. హైకోర్టులతోపాటు సుప్రీం కోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు, చేసిన వ్యాఖ్యానాలు విస్మయం కలిగిస్తున్నాయి. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ, మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగు మూల స్తంభాలు. వీటిలో ఏ ఒక్కటీ మరొకదాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేసినా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ముఖ్యంగా అస్థిరమైన రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా న్యాయవ్యవస్థ ఉండాలి. ఆ దిశగా న్యాయవ్యవస్థ స్వీయప్రక్షాళనకు దిగింది. అయినా,  న్యాయం అందరికీ సమానంగా అందుతుందా? బెయిల్ విషయంలో పేదవాడికి ఒక రకంగా, రాజకీయ నాయకుడు, ఆర్థిక నేరగాళ్లకు ఒక రకంగా ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి. న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం అత్యంత ప్రమాదకరం. అది ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తుంది. రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయింది.  ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం, జైళ్లపాలు కావడంతో, న్యాయమూర్తులు తమకు అనుకూలమైన వారుగా ఉండాలనే భావన వారిలో మొదలైంది. ఈ రకమైన ఆలోచనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అయినా,   న్యాయవ్యవస్థలో ప్రభుత్వం జోక్యానికి ఎమర్జెన్సీ కాలంలోనే బీజం పడింది. అప్పటి ప్రధానమంత్రి ఎన్నికను అలహాబాద్ కోర్టు రద్దు చేసింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో  తీర్పు తమకు అనుకూలంగా రావాలన్న ఆలోచన ఆనాటి ప్రభుత్వ పెద్దల్లో వచ్చింది. దాంతో, అప్పుడు సీనియారిటీ ప్రకారం సుప్రీంకోర్టు  సీనియర్  జడ్జిని కాదని, 4వ స్థానంలో ఉన్న జడ్జిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.   ఆ నియామకాన్ని వ్యతిరేకిస్తూ,  సీనియర్ జడ్జీలు రాజీనామాలు చేశారు. అప్పటి నుంచి కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా,  జడ్జీల నియామకాల్లో, బదిలీల్లో ప్రభుత్వ జోక్యం చేసుకుంటూ వస్తోంది. అవినీతికి పాల్పడిన కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు న్యాయమూర్తులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కొందరు న్యాయమూర్తులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు.  రూ.1.9 కోట్ల మోసం కేసులో సరైన ఆధారాలు లేకుండా నిందితులైన దంపతులకు బెయిల్ మంజూరు చేసిన  ఢిల్లీ సెషన్స్ కోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులకు గత సెప్టెంబరు నెలలో సుప్రీం కోర్టు శిక్ష విధించింది. గతంలో కూడా అనేక సంఘటనలు జరిగాయి. 2009లో అప్పటి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో, ఆయన రాజీనామా చేశారు.  అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి ఒకరు   2011లో రాజీనామా చేశారు.  రాజ్యసభ అభిశంసనకు గురైన తొలి న్యాయమూర్తిగా ఆయన నిలిచారు. ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితుడు గాలి జనార్ధన రెడ్డి ప్రలోభాలకు లోనై బెయిలు ఇచ్చిన కేసులో 2012లో నలుగురు జడ్జీలు అరెస్ట్ అవడం అప్పట్లో సంచలనం కలిగించింది. ఇటీవల అలహాబాద్ హైకోర్టుకు చెందిన ఓ  న్యాయమూర్తి ఇంట్లో కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికాయి. ఆయనపై రాజ్యసభలో, లోక్‌సభలో వివిధ రాజకీయ పార్టీలు అభిశంసన నోటీసులు కూడా ఇచ్చాయి. ఇవన్నీ బహిరంగమైన అంశాలు. న్యాయమూర్తుల అవినీతికి సంబంధించిన అన్ని అంశాలు వెల్లడికావు. ఇందుకు సంబంధించి వారికి అంతర్గత విచారణ వ్యవస్థ ఒకటి ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులపై ఫిర్యాదులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి మాత్రమే చేరతాయి. న్యాయవ్యవస్థ పనితీరు, అవినీతి ఆరోపణలకు సంబంధించి 2017 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు 1631 ఫిర్యాదులు అందాయి. కేంద్ర మంత్రి లోక్‌సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ద్వారా ఈ విషయాలు తెలిశాయి. అయితే, అంతర్గత విచారణ వ్యవస్థ రహస్యంగా ఉంటుంది. అందువల్ల, ఈ ఫిర్యాదులపై విచారణ ఏ స్థాయిలో ఉందో,  ఏ రకమైన చర్యలు తీసుకున్నారో బయటకు తెలియదు. ఇంతే కాకుండా, కోర్టు వ్యాఖ్యలు, తీర్పులపై కూడా అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లైన తర్వాత భార్య అయినా, భర్త అయినా మరొకరితో ఇష్టంగా శృంగారంలో పాల్గొంటే నేరం కాదని  సుప్రీం కోర్టు పేర్కొంది. భార్య అనుమతి లేకుండా ఆమెతో భర్త అసహజ శృంగారం జరపడం నేరం కాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇటువంటి తీర్పులను కొందరు వ్యతిరేకిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛాతర్‌పూర్ జిల్లాలో ప్రఖ్యాత ఖజురహో ఆలయ సముదాయంలోని విష్టుమూర్తి విగ్రహం విషయమై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి.


కుల వ్యవస్థపై నిర్మితమైన మన సమాజంలో న్యాయమూర్తుల నియామకాల విషయంలో కూడా కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  2018 నుంచి  మొత్తం 715 మంది హైకోర్టు న్యాయమూర్తులను నియమించారు. వారిలో 551 మంది (77.06%) అగ్రవర్ణాలకు చెందినవారే ఉన్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి  ఈ ఏడాదిలో మార్చిలో రాజ్యసభలో వెల్లడించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌మేఘ్వాల్‌  తెలిపిన ప్రకారం,  2018 నుంచి ఈ ఏడాది జూలై వరకు హైకోర్టు  న్యాయమూర్తులుగా నియమితులైన 743 మందిలో 93 మంది ఓబీసీలు (12.5 శాతం) మాత్రమే ఉన్నారు. 23 మంది ఎస్సీలు (3 శాతం), 17 మంది ఎస్టీలు (2.2 శాతం) ఉన్నారు. 105 మంది (14 శాతం) మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. మిగిలిన 164 మంది  ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు చెందినవారు. వారిలో 22 మంది ఎస్సీ  (3.08%), 16 మంది ఎస్టీ  (2.24%), 89 మంది ఓబీసీ  (12.45%), 37 మంది మైనారిటీలు (5.17%) ఉన్నారు. అగ్రవర్ణాలలో అత్యధిక మంది  బ్రాహ్మణులే ఉన్నారని తెలుస్తోంది. మహిళలకు తగిన స్థాయిలో ప్రతినిధ్యం లేదు.అంతే కాకుండా, పదవీవిరమణ చేసిన వెంటనే కొందరు న్యాయమూర్తులు పదవులలో నియమితులు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ విధంగా ప్రభుత్వ పదవులు పొందడం మంచి పద్దతి కాదు. ఆ పదవులు ఆశించే, న్యాయమూర్తులు పదవిలో ఉండగా, ప్రభుత్వాలకు,  రాజకీయ నాయకులకు అనుకూలంగా తీర్పులు ఇచ్చారని ప్రజలు భావించే అవకాశం ఉంది.

మరోవైపు, రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయేలా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, సుప్రీం కోర్టు, వివిధ హైకోర్టులకు చెందిన 21 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 600 మంది న్యాయవాదులు గత ఏడాది ఏప్రిల్‌లో సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అనవసర ఒత్తిళ్ల నుంచి న్యాయవ్యవస్థను రక్షించుకోవాల్సిన అవసరం  ఉందని  పేర్కొన్నారు.  కొన్ని రాజకీయ సమూహాలు న్యాయవ్యవస్థను దెబ్బతీసేలా నిరాధారమైన సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ, వారికి అనుకూల ఫలితాలు పొందేలా వ్యూహరచన చేస్తున్నట్లు తెలిపారు. సుప్రీం కోర్టు నేతృత్వంలోని న్యాయవ్యవస్థ ఏ విధమైన ఒత్తిళ్లకు లొంగకుండా న్యాయవ్యవస్థ పవిత్రత, స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవలసిన బాధ్యతను గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో, లోపాలను సవరిదిద్దడంతోపాటు న్యాయవ్యవస్థ స్వతంత్రను కూడా కాపాడాలి.  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులపై జరుగుతున్న విచారణ స్థాయిలో న్యాయమూర్తులపై విచారణ జరగడంలేదన్న విమర్శ సర్వత్రా వ్యక్తమవుతోంది. న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేందుకు అటు రాజకీయ వ్యవస్థ, ఇటు న్యాయవ్యవస్థ తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.  ఈ నేపథ్యంలో, న్యాయవ్యవస్థ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను, విశ్వసనీయతను పరిరక్షించడంలో   పలువురు  న్యాయమూర్తులు  పదవీవిరమణ  తర్వాత ప్రభుత్వం నుండి ఎలాంటి పదవులు తీసుకోరాదని బహిరంగంగా ప్రతిన చేశారు. అలాగే, 21 మంది న్యాయమూర్తులు వారి ఆస్తుల వివరాలను  వెల్లడించారు. ఆ వివరాలను సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ సంతోషించతగిన అంశాలు. ఈ విధంగా న్యాయవ్యవస్థ స్వీయ ప్రక్షాళనకు రంగంలోకి దిగడం అభినందనీయం.

-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914  

No comments:

Post a Comment

30న తెలంగాణ బార్ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక

ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...