May 23, 2018


అమిత్ షా వ్యాఖ్యలు లౌకిక స్వరూపానికి ప్రమాదకరం
ఎస్టీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు

                సచివాలయం, మే 23: దేశంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడటానికి, లౌకిక స్వరూప రక్షణకు ప్రార్థనలు చేయమన్న ఢిల్లీలోని ఆర్చిబిషప్ అనీల్ కౌంట్ జోసఫ్ లేఖపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారని, వాటిని టీడీపీ ఖండిస్తున్నట్లు ఎస్టీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు తెలిపారు. సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. వివిధ మతాలు, భాషలు, కులాలు, వర్గాలు ఉన్న భారతదేశ లౌకిక స్వరూపానికి ఆయన వ్యాఖ్యలు  ప్రమాదకరం అన్నారు. ఈ దేశంలో అట్టడుగున ఉన్న అనేక వర్గాలు రాజకీయంగా అభివృద్ధి చెందలేదన్నారు. అందరూ సమానంగా అభివృద్ధి చెంది కుల రహిత సమాజం ఏర్పడాలన్నదే డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ లక్ష్యంగా పేర్కొన్నారు. ఆ విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలన్నారు. గాయపడ్డ హృదయాలు, వ్యక్తులు, సంస్థలు గొంతెత్తి మాట్లాడతాయని, అందులో భాగంగానే జోసఫ్ దేశం కోసం ప్రార్థనలు చేయమన్నారని చెప్పారు. అందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. 2019లో ఏర్పడే ప్రభుత్వం అన్నారేగాని, ఏ ప్రభుత్వమో ఆయన ప్రస్తావించకపోయినా అమిత్ షా ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని, ఆయనకు భయం ఎందుకని ప్రశ్నించారు. కుల, మత, వర్గ వివక్షలేదని ఆయన చెబుతున్నారని, అయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ పేరుతో వివక్ష కొనసాగుతుందన్నారు. క్రైస్తవులు శాంతి కాముకులని, వారు ప్రార్ధనలు మాత్రమే చేస్తారని చెప్పారు.

                 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గానీ, టీడీపీ నేతలు గానీ ఎవరూ జోసఫ్ వ్యాఖ్యలపై మాట్లాడలేదని, అయినా మత ప్రాతిపదికన ప్రజలను సమీకరించడం సరికాదని అమిత్ షా అనడంలో అర్ధంలేదన్నారు. అంబేద్కర ఆశయాలకు అనుగుణంగా అన్ని మతాలు, కులాల వారు ఎదగాలన్నది చంద్రబాబు ఉద్దేశంగా పేర్కొన్నారు. ఎస్సీలతో సమానంగా దళిత క్రైస్తవులకు కూడా సౌకర్యాలు కల్పించాలని ఏప్రిల్ 14న తీర్మానం చేశారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగానికి కట్టుబడిన లౌకికవాద రాజకీయ పార్టీ టీడీపీ అని చెప్పారు. బిజేపీని మతమౌఢ్యంతో సామ్రాజ్యవాద కాంక్షతో వ్యవహరించే పార్టీగా పేర్కొన్నారు. మతవాదులుగా ముద్రపడితే మీకే నష్టం అని ఆయన బిజేపీ నేతలను హెచ్చరించారు. ప్రభుత్వాలకు సేవాదృక్పదం ఉండటం అవసరం అన్నారు. కర్నాటక ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు చెక్ పెట్టినా బీజేపీకి బుద్ధిరాలేదా అని ప్రశ్నించారు. త్రిపుర ఎన్నికల్లో బీజేపీ డబ్బుని విచ్చలవిడి ఖర్చుచేసిందని, గిరిజనులను రెచ్చగొట్టిందని ఆరోపించారు.

                 ప్రజాస్వామ్యవాదులను ఒకటిగా చేయడం కోసం చంద్రబాబు నాయుడు చేసే ప్రయత్నాలను చూసి బీజేపీ సహించలేకపోతోందన్నారు. రాజ్యాంగానికి విలువ ఇస్తూ సమసమాజ సిద్ధాంతం కోసం టిడిపి పని చేస్తుందన్నారు. తమ పార్టీ ఒక మతానికి, ఒక వర్గానికి కొమ్ముకాయదని స్పష్టం చేశారు. బిజేపీ వికృత క్రీడలకు నాయకత్వం వహిస్తోందని విమర్శించారు.  ఆ పార్టీకి గడ్డు కాలం వచ్చిందన్నారు.

                 వైఎస్ఆర్ సీపీ నేతలు ఇక్కడ బైబిల్ పట్టుకొని తిరుగుతారని, ఢిల్లీలో బైబిల్ కు వ్యతిరేకులతో చేయి కలుపుతారని విమర్శించారు. అమిత్ షా వ్యాఖ్యలపై వైఎస్ఆర్ సీపీ వైఖరి తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసుల నుంచి బయటపడటానికి ఆ పార్టీని బీజేపీలో కలిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ క్రైస్తవులకు అండగా ఉంటుందని జూపూడి చెప్పారు.

May 22, 2018


రొయ్యల పెంపకందారుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
ఆ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష

Ø రొయ్యల మార్కెట్ విస్తృత పరచాలి
Ø ఎగుమతులు పెంచాలి
Ø రుణాలు ఇచ్చే అవకాశాలు పరిశీలన
Ø ధరలు పడిపోకుండా చర్యలు 

               సచివాలయం, మే 21: సముద్ర ఉత్పత్తులు, రొయ్యల వ్యాపారాన్ని విస్తృతంచేసి అమ్మకాలను, ఎగుమతులను పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సీఎస్ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం జరిగిన సముద్ర ఉత్పత్తులు, ముఖ్యంగా చెరువులలో రొయ్యల ఉత్పత్తి, ఎగుమతులపై జరిగిన  సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రొయ్యల ధరలు పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధర తగ్గడం, యాంటిబయాటిక్స్ వాడకం వల్ల ఎగుమతులను తిరస్కరిచడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  ఈ పరిస్థితులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. రైతులను ఆదుకోవడానికి అన్నిరకాల చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఫిషరీస్, ఫుడ్ ప్రాసెసింగ్, కేంద ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎంపెడా అధికారులతో సీఎస్ సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ మన రొయ్యల అమ్మకాల మార్కెట్ ని అంతర్జాతీయంగా విస్తరింపజేసి ఎగుమతులను పెంచి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని  అధికారులకు సూచించారు. యాంటిబయాటిక్స్ వాడకుండా రైతులకు అవగాహన కలిగించాలన్నారు.

         గత ఏడాది కిలో రూ.500 ఉన్న రొయ్యల ధరలు రూ.380 లకు పడిపోయినట్లు అధికారులు సీఎస్ కు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ లో మనకు పోటీగా ఉన్న ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాలలో ఉత్పత్తి పెరిగిందని తెలిపారు.  దాంతో వారు ధరలు తగ్గించి ఎగుమతులు చేయడంతో వారి ఎగుమతులు పెరిగాయని చెప్పారు. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్, రష్యాలలో మార్కెట్ పెద్దగాలేదన్నారు.  అంతేకాకుండా మన దేశంలో కూడా ఒడిషా, పశ్చిమబెంగాల్, గుజరాత్, తమిళనాడులలో ఉత్పత్తి పెరిందని చెప్పారు. యాంటి బయాటిక్స్ వాడకం వల్ల మన ఎగుమతులను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. దానికి తోడు అమెరికాలో యాంటి డంపింగ్ డ్యూటీని 0.84 శాతం నుంచి 2.34 శాతానికి పెంచడం వల్ల కూడా ఎగుమతులు తగ్గినట్లు వివరించారు. మన రాష్ట్రంలో కొన్ని ఫార్మా కంపెనీలు తయారు చేసే పొడిలో యాంటిబయాటిక్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

           ఈ పరిస్థితులలో అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ ని విస్తృతపరచి ఎగుమతులు పెంచడానికి చర్యలు తీసుకోవాలని దినేష్ కుమార్ కోరారు. అలాగే ధరలు పడిపోకుండా, రైతులు నష్టపోకుడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా రైతులకు ఇచ్చే మాదిరిగా రొయ్యల సాగు చేసేవారికి రుణాలు ఇచ్చే అవకాశం ఉందేమో మెరైన్ ప్రొడక్ట్ ఎక్స్ పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ(ఎంపీఈడీఏ) ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. యాంటిబయాటిక్స్ ఉన్న పౌడర్ ని తయారుచేసే కంపెనీలపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో రొయ్యల సాగుని, దాని ద్వారా విస్తరించే నీటి, వాయు కాలుష్యాన్ని నియంత్రించాలని అధికారును ఆదేశించారు. కాలుష్యాన్ని నియంత్రించే బాధ్యత జిల్లా యంత్రాంగానిదేనన్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో రొయ్యల సాగు వల్ల తలెత్తే కాలుష్యాన్ని తీవ్రంగా పరిగణించి ఆక్వా విభాగం అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో కాలుష్యాన్ని నియంత్రించాలన్నారు. ఎగుమతులు తగ్గడానికి ప్రధాన కారణమైన యాంటిబయాటిక్ వాడకాన్ని నిరోధించాలని చెప్పారు. నాణ్యమైన రొయ్యల ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ అన్నారు. కాలుష్య నియంత్రణ బోర్డు వారు కాలువల నీటిలో కాలుష్య స్థాయిలను పరీక్షించాలని ఆదేశించారు. బోర్లను ఏపీవాల్టా(నీటి భూమి, చెట్ల చట్టం) ప్రకారం నియంత్రించాలన్నారు.
చేపలు, రొయ్యల సాగు, ఉత్పత్తి, ఎగుమతులు, ఎగుమతులలో పోటీ, ఏపీ ఫిషరీస్ పాలసీ-2015, ప్రోత్సహక పథకాలు, రొయ్య పిల్లల ఉత్పత్తి, ఇన్సూరెన్స్, మార్కెట్ విస్తరణ, అంతర్జాతీయ మార్కెట్ ధరలు, యాంటీబయాటిక్స్ అమ్మకాల నియంత్రణ, ఆక్వాషాపులపై దాడులు, ల్యాబులు, ఆక్వాకు విద్యుత్, సౌరశక్తి, డీజిల్ వినియోగం తదితర అంశాలను చర్చించారు.

సముద్ర ఉత్పత్తులు, చెరువలలో రొయ్యల పెంపకాన్ని  అభివృద్ధిపరచడం కోసం 9 జిల్లాల్లో 82 ఎగుమతి కేంద్రాలను, 68 ప్రాసెసింగ్ యూనిట్లను, 70 స్టోరేజ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హేచరీస్ ని, ఆక్వాషాపులను తనిఖీ చేస్తున్నట్లు డ్రగ్స్ కంట్రోల్ అధికారి చెప్పారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి జీ.అనంత రాము, ఫిషరీస్ శాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ వైఎస్ ప్రసాద్, ఎంపీఈడీఏ డిప్యూటీ డైరెక్టర్ ఏ.లహరి తదితరులు పాల్గొన్నారు.

May 17, 2018


తిరుమల ఆధ్యాత్మికతకు భంగం కలిగిస్తే ప్రభుత్వం ఉపేక్షించదు
ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి
                 సచివాలయం, మే 17: తిరుమల ఆధ్యాత్మికతకు భంగం కలిగించినా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నాలు ఏ స్థాయివారు చేసినా ప్రభుత్వం ఉపేక్షించదని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ, దేవాదాయ శాఖలు)  కెఈ కృష్ణమూర్తి హెచ్చరించారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులో తన ఛాంబర్ లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవాస్థానాల(టీటీడీ) ప్రధాన అర్చకులు రమణదీక్షితులు  హోదాను మరచి తాను పని చేస్తున్న ధార్మిక క్షేత్ర ప్రతిష్టను దిగజార్చేవిధంగా మాట్లాడారన్నారు. తిరుమల ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమని, దేశవిదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనార్ధం వస్తుంటారని తెలిపారు. అటువంటి క్షేత్రంపై రమణదీక్షితులు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఆయన తన సాంప్రదాయ అర్చక వృత్తిని మరచి రాజకీయ వృత్తిని స్వీకరించినట్లుగా మాట్లాడారన్నారు. ముఖ్యంగా పనిగట్టుకొని పక్క రాష్ట్రమైన తమిళనాడులో ప్రత్యేకంగా ఆహ్వాన కార్డులు పంపి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిమరీ రాజకీయాల నుంచి స్వామివారిని రక్షించుకోవాలన్న వ్యాఖ్యలు చేశారన్నారు. ప్రధాన అర్చకులుగా ఇతరులకు ఆదర్శంగా ఉండవలసిన ఆయన ఈ విధంగా మాట్లాడటం భావ్యంకాదన్నారు. దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ఆలయ నియమనిబంధనలను అతిక్రమించి రమణదీక్షితులు తన మనవడిని అంతరాలయంలోకి తీసుకువెళ్లారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధారణ భక్తులు వెళ్లే మార్గంలోనే స్వామివారిని దర్శనం చేసుకొని, మళ్లీ అదేరీతిలో వస్తారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రమణదీక్షితులు వీఐపీల అతిధిగృహాలకు వెళ్లి ఆశీర్వచనాలు తెలుపుతారని, స్వామి సేవలకంటే ధనికుల సేవే ఆయనకు పరమావధిగా పేర్కొన్నారు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు టీటీడీ పాలక మండలి అర్చకుల వయోపరిమితిని నిర్ణయిస్తూ ఆయనను తొలగించిందన్నారు. రాజ్యాంగం, చట్టాలు ఆధారంగా టీటీడి పాలకమండలి ఏర్పడుతుందని చెప్పారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రాచీన హిందూమత సాంప్రదాయాలను కొనసాగిస్తుందన్నారు. తనవల్లే స్వామివారికి ఇంతటి ప్రాచుర్యం లభించిందన్నట్లు మాట్లాడితే పతనం ప్రారంభమైనట్లేనన్నారు. రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. అర్చకుల మధ్య ఉన్న బేధాభిప్రాయాలు, తగాదాలు ఈ విధంగా బహిర్గతమవుతున్నట్లు తాను భావిస్తున్నానన్నారు. రమణదీక్షితులకు ముగ్గురు కుమారులు ఉన్నారని, వారు చెన్నైలోని ప్రైవేటు సంస్థలలో పని చేస్తున్నట్లు తెలిసిందన్నారు. వారు ఏనాడూ పూజలకు రాలేదన్నారు. అయితే ఆయన వారిని కూడా టీటీడీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

ప్రతిఏడాది స్వామి వారి నగల తనిఖీ
ప్రతి సంవత్సరం స్వామివారి నగలను అధికారులు తనిఖీ చేస్తారని ఉపముఖ్యమంత్రి చెప్పారు. ఈ విషయంలో జస్టిస్ జగన్నాధరావు కమిటీ, జస్టిస్ వాద్వా కమిటీ సమగ్రంగా విచారించి, శ్రీవారి నగల వాడకం, వాటి భద్రత విషయంలో పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. టీటీడీలో ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతుందని చెప్పారు. ఒక ఆర్థిక సలహాదారు, ముగ్గురు ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో టీటీడీ వ్యవహారాలు కొనసాగుతాయన్నారు. తిరుమల ఆలయం గురించి అవాకులు, చవాకులు ఎవరు పేలినా తీవ్రమైన చర్యలు తీసుకుంటామన్నారు.  ఎవరు ఏ విధులు నిర్వహించడానికి నియమితులయ్యారో, ఆ విధులు నిర్వహించడం శ్రేయస్కరం అన్నారు. వాటిని అతిక్రమిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదన్నారు. టీటీడీలో చాలా ఉత్తమమైన విధానాలు అనుసరిస్తున్నారని, ఆ నిబంధనలనే చాలా దేవాలయాల్లో అనుసరిస్తున్నారని తెలిపారు. పాలక మండలి నిర్ణయాలను సమర్థిస్తున్నట్లు చెప్పారు. పాలక మండలే కాకుండా పరిస్థితులను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవలసి బాధ్యత తమపై కూడా ఉంటుందన్నారు. అవసరమైతే టీటీడీ ఆస్తులు, ఆభరణాల తనిఖీకి ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.  సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా పాల్గొన్నారు.

May 11, 2018




           రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలే కీలకం
జనరల్ మేనేజర్లు, జోనల్ మేనేజర్లతో మంత్రి అమరనాధ రెడ్డి సమీక్ష


Ø జూన్ లేక జూలైలో ఎంఎస్ఎంఈ సదస్సు
Ø మొదటి దశలో ప్రతి రెవెన్యూ డివిజన్ లో ఏర్పాటు
Ø 42 ప్రాంతాల్లో  ఏపీఐఐసీ స్వాధీనంలో భూములు
Ø అధికారులకు మే 31 డెడ్ లైన్
Ø ప్రకాశం జిల్లాపై ప్రత్యేక దృష్టి
            సచివాలయం, మే11: రాష్ట్రాభివృద్ధిలో పరిశ్రమలే కీలకంగా ఉంటాయని పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమరనాధ రెడ్డి అన్నారు. సచివాలయం 2వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం ఏపీఐఐసీ జిల్లా పరిశ్రమల కేంద్రాల జనరల్ మేనేజర్లు, జోనల్ మేనేజర్ల సమావేశంలో ఎంఎస్ఎంఇ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానికంగా ఉన్న చిన్నచిన్న పారిశ్రామికవేత్తలకు మద్దతుగా నిలిచేందుకు నియోజకవర్గ స్థాయిలోనే ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం  ప్రతి నియోజకవర్గంలో సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ-మైక్రో,స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్) పార్క్ ఏర్పాటు చేయడానికి కావలసిన భూములను త్వరగా గుర్తించి, సేకరించాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో ప్రతి రెవెన్యూ డివిజన్ లో ఒక పార్కు  ఏర్పాటు చేస్తామన్నారు. జూన్ లేక జూలైలో ఎంఎస్ఎంఈ సదస్సు నిర్వహించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి ఉన్నట్లు చెప్పారు.  అప్పటికల్లా ఎంఎస్ఎంఈలకు సంబంధించి వీలైనన్ని ఎక్కువ ఎంఒయులు అయ్యేలా కృషి చేయాలన్నారు. ఈ నెల 31వ తేదీ లోపల ప్రతి రెవెన్యూ డివిజన్ లో పార్కుకు సరిపడ  భూమిని గుర్తించి స్వాధీనం చేసుకోవాలన్నారు. మొదట అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములకు ప్రాధాన్యత ఇచ్చి స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. తరువాత అసైన్ట్ భూములకు, ప్రైవేటు భూములకు వరుసక్రమంలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భూముల సేకరణ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆయా జిల్లా కలెక్టర్ల సహకారంతో పరిష్కరించాలని చెప్పారు. సందర్భం, అవసరానుసారం పరిశ్రమల శాఖ కార్యదర్శి, కమిషనర్, ఏపీఐఐసీ ఎండి, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల మంత్రులు, తన స్థాయిలో ఎవరి అవసరమైతే వారితో చెప్పించి భూములు స్వాధీనం చేసుకోవాలన్నారు. అత్యధిక మందికి ఉపాధి కల్పించే పార్కుల ఏర్పాటుకు  అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పనిని నిర్ణీత సమయం నిర్ధేశించుకొని పూర్తి చేయాలన్నారు.  ఈ నెల 31వ తేదీ లోపల ఈ పనులన్నీ పూర్తి చేయాలని, మళ్లీ ఏర్పాటు చేసే సమీక్షా సమావేశానికి అందరూ పూర్తి వివరాలతో రావాలని చెప్పారు.  పార్కుకు ఎంపిక చేసిన స్థలంలో లేఅవుట్లు,  రోడ్లు, కాలువలు, నీరు, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక వసతులను సమకూర్చడానికి కూడా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  అలాగే పార్కులలో పెట్టుబడులు పెట్టడానికి, చిన్న పరిశ్రమలను స్థాపించడానికి ముందుకు వచ్చినవారి వద్ద నుంచి డీపీఆర్ (డిటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్)లు తీసుకొని పంపించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో స్థాపించే పరిశ్రమలకు అవసరమైనమేరకు మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు.  పనులు వేగంగా జరగడం కోసం రాష్ట్రస్థాయి అధికారాలను కూడా జిల్లా అధికారులకు అప్పగించామన్నారు. ఆన్ లైన్ లో పారిశ్రామిక ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఆలస్యం లేకుండా వెంటనే చెల్లించాలన్నారు. ప్రోత్సాహకాలు ప్రకటించడంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. రానున్న పది రోజుల్లో రూ.2వేల కోట్ల బ్యాంకు రుణం రానున్నట్లు తెలిపారు. పెండింగ్ లో ఉన్న ప్రోత్సాహకాలన్నింటీని క్లియర్ చేయాలనే ఉద్యేశంతో ఆ రుణం మొత్తం ప్రోత్సాహకాలకే ఉపయోగిస్తున్నామని మంత్రి తెలిపారు. ఎప్పుడైతే పరిశ్రమలకు సరైన సమయంలో సక్రమంగా ప్రోత్సాహకాలు అందజేస్తే అప్పుడు ప్రభుత్వంపై వారికి నమ్మకం ఏర్పాడుతుందని, తద్వారా మరింత మంది పారిశ్రామికవేత్తలు రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని వెల్లడించారు. ఇక ఇప్పటివరకు చేసుకున్న ఎంఒయులపై ప్రత్యేకమైన దృష్టిపెట్టి వాటిని గ్రౌండ్ అయ్యేలా చూడాలని అధికారులను కోరారు. ఇక జిల్లా పరిశ్రమల కేంద్రాల కార్యాలయాలు లేనిచోట కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని చెప్పారు. పరిశ్రమల అధికారులపైనే ఈ రాష్ర్ట భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. కాబట్టి అధికారుల వద్దకు వచ్చే పారిశ్రామికవేత్తలకు సహకరించి వారు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.    సింగిల్ డెస్క్ పోర్టల్ పనితీరు బాగుందని ప్రశంసించారు.
ప్రకాశం జిల్లాపై ప్రత్యేక దృష్టి
పారిశ్రామికపరంగా వెనకబడిన ప్రకాశం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రకాశం జిల్లా ఎంఎస్ఎఈ పార్కులకు అనుకూలంగా ఉంటుందన్నారు. వీలైనన్ని ఎక్కువ ఎంఒయులు ఆ జిల్లాకు వచ్చేలా అధికారులు కృషి చేయాలని చెప్పారు. అలాగే శ్రీకాకుళం జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని, అందువల్ల ఆ ఎంఒయులు చేయాలని సూచించారు.
ఏపీఐఐసీ స్వాధీనంలో 42 ఎంఎస్ఎంఈ పార్కుల భూములు
         రాష్ట్రం వ్యాప్తంగా 42 ఎంఎస్ఎంఈ పార్కులకు సంబంధించిన భూములు ఏపీఐఐసీ స్వాధీనంలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. మరికొన్ని నియోజకవర్గాల్లో భూములను గుర్తించినట్లు తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ భూములు లేవని, ప్రైవేటు పట్టాభూములు కొనుగోలు చేయాలని చెప్పారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, నియోజకవర్గాల వారీగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు, ఎంఎస్ఎంఈ పార్కుల కోసం ఎంపిక చేసిన భూములు, వాటి స్వాధీనం, భూములకు సంబంధించిన సమస్యలు, ఏపీఐఐసీ స్వాధీనంలోని  భూములు, మౌలిక వసతులకు టెండర్లు, మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాలు, ఆటోనగర్ల ఏర్పాటు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, చిత్తూరు జిల్లాలో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు, పార్కులలో భవన నిర్మాణాలు, పారిశ్రామిక క్లస్టర్లు, ఆన్ లైన్, మీసేవలకు సంబంధించి సాంకేతిక సమస్యలు, పెద్ద ప్రాజెక్టులు, మెగా ప్రాజెక్టులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పెట్టుబడి సబ్సిడీ బకాయిలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఎంఓయులు, మెగా ఫుడ్ పార్క్, ప్రైవేటు ఫుడ్ పార్కులు మొదలైన పలు అంశాలను ఈ సమావేశంలో సమీక్షించారు.
                ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రీతం రెడ్డి,  కార్యదర్శి సాలమన్ అరోకియా రాజ్, కమిషనర్ సిద్ధార్ధ జైన్, ఏపీ పరిశ్రమల మౌలిక వసతుల సంస్థ(ఏపీఐఐసీ) మేనేజింగ్ డైరెక్టర్ బాబు.ఏ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ వైఎస్ ప్రసాద్, పరిశ్రమల శాఖ 13 జిల్లాల జనరల్ మేనేజర్లు, జోనల్ మేనేజర్లు పాల్గొన్నారు.

May 10, 2018


వాస్తవంగా ఇళ్లు లేని పేదవారికి ఇళ్లు
మంత్రి మండలి ఉపసంఘం నిర్ణయం
                      సచివాలయం, మే 10: అధికారుల పరిశీలనలో వాస్తవంగా ఇళ్లు లేని పేదవారికి ఇళ్లు మంజూరు చేయాలని సచివాలయం 2వ బ్లాక్ లోని ఆర్థిక మంత్రి సమావేశ మందిరంలో జరిగిన మంత్రి మండలి ఉపసంఘం సమావేశం నిర్ణయించింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు డాక్టర్ పి.నారాయణ, కింజరాపు అచ్చన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో లబ్దిదారులకు  తెలియకుండా వారిపేర్లుపై ఇళ్లు మంజూరు చేసిన అంశం చర్చకు వచ్చింది.  వారు ఇప్పుడు దరకాస్తు చేసుకుంటే వారి పేర్లపై ఇళ్లు మంజూరైనట్లు రికార్డులలో నమోదుకావడంతో ఇళ్లు మంజూరు చేయడం కుదరడంలేదని అధికారులు తెలిపారు. అటువంటి దరకాస్తులను పరిశీలించి, అధికారులు స్వయంగా వెళ్లి తనిఖీ చేసి, వారికి నిజంగా ఇల్లు లేకపోతే, పాత రికార్డులలో వారి పేర్లు తొలగించి, కొత్తగా ఇల్లు మంజూరు చేయమని ఉపసంఘం ఆదేశించింది. 2004కు ముందు ఎస్టీలకు రూ.7500 లతో నిర్మించిన  పూరిళ్లు, షెడ్లు పూర్తిగా దెబ్బతినడంతో వారికి కూడా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. గృహ నిర్మాణ నిధులకు కొరతలేదని, నిర్మాణం వేగం పెంచాలని  మంత్రి యనమల ఆదేశించారు. కొన్ని కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కావాలని అధికారులు కోరగా మంత్రి మంజూరు చేస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాలల్లో గృహ నిర్మాణ వ్యయం ఒకే రకంగా ఉండాలని, మెటీరియల్, ఇతర అదనపు సౌకర్యాలకు అదనంగా అయ్యే ఖర్చుని లబ్దిదారుడు భరాయించడానికి సిద్దంగా ఉంటే అందుకు అనుమతించాలన్నారు.  నిర్మాణం పూర్తి అయి, మౌలిక వసతులు లేక స్వాధీనం చేసుకోని ఇళ్లకు మౌలిక వసతులు సమకూర్చాలని నిర్ణయించారు.
                   ఇళ్ల నిర్మాణ వ్యయం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉద్యోగ హామీ పథకం(నరేగా) కింద 90 రోజుల పని దినాలు,  గ్రూప్ ఇళ్లు, మెటీరియల్, పట్టణ, గ్రామీణ ఇళ్ల నిర్మాణం, అపార్ట్ మెంట్లు, వ్యక్తిగత ఇళ్లు, అగనంపూడి, రాజంపేటలలో ఇళ్ల నిర్మాణం, కడప శాటిలైట్ టౌన్ షిప్, పీఎంఏవై ఇళ్ల నిర్మాణం, హడ్కో రుణం, వడ్డీ శాతం వంటి పలు అంశాలను చర్చించారు. సమావేశంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.కరికాలవలవన్, గృహ నిర్మాణ సంస్థ ఎండి కాంతిలాల్ దండే తదితరులు పాల్గొన్నారు.

May 7, 2018


 సమాఖ్య పరిరక్షణకే ఆర్థిక మంత్రుల సమావేశం
మంత్రి యనమల రామకృష్ణుడు
            సచివాలయం, మే 7: సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసమే ఆర్థిక మంత్రుల సమావేశం ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. సచివాలయం 1వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో సోమవారం  జరిగిన వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది రాజకీయ సమావేశం కాదని, రాజ్యాంగ పరంగా, పాలనాపరంగా రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటానికి ఏర్పాటు చేసిన సమావేశంగా పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నియమనిబంధనలు, జీఎస్టీ వల్ల ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా నష్టం వాటిల్లుతోందని,  సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలుగుతోందని చెప్పారు. ఎఫ్ఆర్ బీఎం(ఫిస్కల్ రెస్పాన్సబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్) చట్టం ప్రకారం రాష్ట్రాలు పొందే రుణాలపై ఆంక్షలు, పథకాలకు నిధులు కేటాయించడంలో అనుసరించే పద్దతుల వల్ల ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా నష్టం జరుగుతోందన్నారు.  రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నందున ఆర్థిక మంత్రులు సమావేశమై వివిధ అంశాలను చర్చించి, రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం ఒక ముసాయిదాను కూడా రూపొందించామని, దానిని ఆయా ముఖ్యమంత్రులు అంగీకరించిన తరువాత రాష్ట్రపతికి అందజేస్తామన్నారు. సమావేశం ఇక్కడ నిర్వహిస్తున్నందున అన్ని రాష్ట్రాల వారితో తాను మాట్లాడానని చెప్పారు. ఈ సమావేశానికి రానివారు కూడా 15వ ఆర్థిక సంఘంలోని నియమనిబంధనలపై అభ్యంతరం తెలియజేస్తూ  ప్రధాన మంత్రికి లేఖలు రాశారని తెలిపారు.
కేరళ ఆర్థిక మంత్రి  డాక్టర్ టీఎం థామస్ ఇసాక్ మాట్లాడుతూ జీఎస్టీలో 9 అంశాలకు సంబంధించి అభ్యంతరాలు ఉన్నట్లు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిబంధనల వల్ల తమకు నష్టం వాటిల్లుతున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఆర్ధిక మంత్రి డాక్టర్ అమిత్ మిత్ర మాట్లాడుతూ ఉదయం జరిగిన సమావేశంలో దేశంలోని దక్షిణ, తూర్పు, ఉత్తర ప్రాంతాలకు చెందిన రాష్ట్రాల ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు. సమాఖ్య వ్యవస్థకు అద్దంపట్టేవిధంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మూడు గంటల సేపు పాల్గొన్నాట్లు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం 30 పథకాలను రద్దు చేసిందని చెప్పారు. దాదాపు 28 పథకాలకు గతంలో 10 శాతం ఉన్న రాష్ట్రాల వాటాను 30 శాతం నుంచి 50 శాతానికి పెంచారన్నారు. కేంద్రం రాష్ట్రాల అధికారాల్లోకి చొరబడుతోందన్నారు. తాము కేంద్రానికి వ్యతిరేకం కాదని, సమాఖ్య వ్యవస్థను పరిరక్షించి, రాష్ట్రాల అధికారాలను కాపాడాలన్నదే తమ ప్రధాన ఉద్దేశం అన్నారు. ఆర్థిక మంత్రుల మొదటి సమావేశం గత నెలలో త్రివేండ్రలో జరిగిందని, రెండవ సమావేశం అమరావతిలో జరుపుకున్నామని, మూడవ సమావేశం ఢిల్లీలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
             పంజాబ్ ఆర్ధిక మంత్రి మన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ తాను భారతీయునిగా, రాజకీయ నాయకునిగా మంచి సమయంలో ఉండటం సంతోషంగా ఉందన్నారు. 1950 నుంచి 1990 వరకు దేశంలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదని, ఒక శాతం మాత్రం అభివృద్ధిచెందినట్లు చెప్పారు. ఆర్థిక పరంగా సమాఖ్య వ్యవస్థను రక్షించవలసిన అవసరం ఉందన్నారు.  కేంద్రం తన సొంత ఎజండాతో సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తోందన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకరమైన పరిస్థితులలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల అధికారాలు పరిరక్షించవలసి ఉందన్నారు. ఢిల్లీ డెప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్షపాత ధోరణితో చూస్తోందన్నారు. ఈ సమావేశంలో ఏపి ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర, ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ తదితరులు  పాల్గొన్నారు.

    పేదరిక నిర్మూలనే మా ధ్యేయం
ఆర్థిక మంత్రుల సమావేశంలో సీఎం చంద్రబాబు
             సచివాలయం, మే 7: పేదరిక నిర్మూలనే తమ ధ్యేయమని, పేదరిక నిర్మూలన కోసం రాష్ట్రంలో  అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం జరిగిన వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను వ్యతిరేకించే విషయంలో ఒకే అభిప్రాయం కలిగిన పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల తొలి సమావేశం ఏప్రిల్ 10న కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. రెండవ సమావేశానికి ఏపీ రాజధాని అమరావతి ఆతిధ్యమిచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జనాభా నియంత్రణలో కేరళ అందరికన్నా ముందుందని, ఆ తరువాత తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని వివరించారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ జనాభా నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చామని, పెద్దఎత్తున ప్రచారం చేశామని, ఏడెనిమిది ఏళ్లలో జనాభా పెరుగుదల రేటును తగ్గించగలిగామని చెప్పారు. జనాభా నియంత్రణ పాటించడం వల్ల నియోజక వర్గాల పునర్‌ విభజన జరిగితే  దక్షిణ భారతంలో పార్లమెంట్  సీట్ల సంఖ్య తగ్గిపోతుందన్నారు. ప్రస్తుతం జనాభా నియంత్రణ తమ విధానం కాదన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్రం  నిధులను  కేటాయిస్తే పురోగమనంలో వున్న రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. అక్షరాశ్యత పెంపొందించడం ద్వారా జనాభాను నియంత్రణపై అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు. నేటి యువత ఉద్యోగానికి, జీవితంలో స్థిరపడటానికి ప్రాధాన్యత ఇస్తూ పెళ్లిని వాయిదా వేస్తుందన్నారు. పెళ్లి చేసుకున్న ఒక్కరితోనే సరిపుచ్చుకుంటున్నారని చెప్పారు. దాంతో జనాభా గణనీయంగా తగ్గుతోందన్నారు. దక్షిణ కొరియాలో పెళ్లి కాని యువత 35 శాతం వరకు ఉన్నట్లు తెలిపారు. సమాఖ్య విధానానికి విఘాతం కలిగించేవిధంగా కేంద్ర వ్యవహరిస్తోందని విమర్శించారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలను దండించడం సరికాదన్నారు. భారత ప్రభుత్వం సహకార సమాఖ్య వ్యవస్థను గౌరవించాలన్నారు. గతంలో టిడిపి వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆందోళన మేరకు సర్కారియా కమిషన్ ఏర్పడిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ కమిషన్ కేంద్ర రాష్ట్ర సంబంధాలను స్పష్టంగా తెలియజేసిందన్నారు. రాష్ట్రం విడిపోవడంతో అత్యధిక ఆదాయం కలిగిన హైదరాబాద్ ను కోల్పోయినట్లు తెలిపారు. విభజన సమయంలో పార్లమెంటులో అప్పటి ప్రధాన మంత్రి  ప్రకటించిన విధంగా ప్రత్యేక హోదా ఇవ్వని అంశాన్ని ప్రస్తావించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కఠిన విభజన వల్ల తలసరి ఆదాయంలో వెనుకబడి వున్నామన్నారు. రాష్ట్రం అనేక వడిదుడుకులను ఎదుర్కొంటూ రెండంకెల వృద్ధి రేటుని సాధిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ సరఫరా, గ్యాస్ సరఫరాలో వంద శాతం ఫలితాలను సాధించినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో వనరులు బాగా ఉన్నాయని, టెక్నాలజీ సపోర్టుతో భవిష్యత్ లో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామికి న్యాయవాదిగా రాజ్యాంగం గురించి విపులంగా తెలుసని,  ఇక్కడ హాజరైన వారంతా వివిధ రంగాల్లో  ప్రముఖ నేపథ్యం కలిగినవారు కావడం విశేషంగా చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం తీరు ప్రగతిశీల రాష్ట్రాలకు శిక్ష విధించినట్టుగా వుందని పేర్కొన్నారు. పురోగతిలో వున్న రాష్ట్రాలు ఎట్టిపరిస్థితుల్లోనూ నష్ట పోవడానికి వీల్లేదని,  ఈ అన్యాయాన్ని సహించేది లేదని,  న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి వస్తోందని, 2011 జనాభా లెక్కల ఆధారంగా కేంద్ర నిధుల కేటాయింపు జరపడం సరికాదన్నారు. కష్టపడుతోన్న వారినే శిక్షించేలా కేంద్రం వ్యవహరిస్తోందని, తమ రాష్ట్రం విషయంలో అదే జరుగుతోందన్నారు. కేంద్రం నిధులూ ఇవ్వదు, రాష్ట్రాలు అప్పులు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించదని అన్నారు. 15వ ఆర్ధిక సంఘం విధి విధానాలను మార్చాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతిని కలుద్దామని అన్నారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని గౌరవించాలని అన్నారు.
            ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ 15వ ఆర్ధిక సంఘం రూపొందించిన విధివిధానాల వల్ల  రాష్ట్రాలు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని కోల్పోతున్నాయన్నారు.  యుద్ధ సమయంలో ఇలాంటి విధానాన్ని అమలు చేయాల్సి వుందని, కేంద్రం ఇందుకు విరుద్ధంగా సాధారణ పరిస్థితుల్లోనూ సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా వుండాలో సర్కారియా కమిషన్ స్పష్టంగా పేర్కొందని చెప్పారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల సమాఖ్య సమతుల్యత దెబ్బతింటుందన్నారు.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి  మాట్లాడుతూ కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రాలను సంప్రదించవలసిన అవసరం ఉందన్నారు. కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ఏ రకంగా సమాఖ్య స్పూర్తి అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ ఏకపక్ష ధోరణిపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్  రెవెన్యూ లోటుతో ఇబ్బంది పడుతోందన్నారు. రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. గత నెల 10న కేరళలో జరిగిన సమావేశంలో  నాలుగు రాష్ట్రాల మద్దతే లభించిందని, ఈ సమావేశానికి మద్దతిచ్చే రాష్ట్రాల సంఖ్య పెరిగిందని కేరళ ఆర్థిక మంత్రి  డాక్టర్ టీఎం థామస్ ఇసాక్ చెప్పారు. 15వ ఆర్ధిక సంఘం విధి విధానాలను వ్యతిరేకించే రాష్ట్రాల సంఖ్య భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని  భావిస్తున్నామన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నిధులు కేటాయిస్తామంటే జనాభా నియంత్రణను అమలు చేసిన రాష్ట్రాలు నష్టపోతాయన్నారు.  ఏపీని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు నిరంతరం  కృషి చేస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ఆర్ధిక మంత్రి డాక్టర్ అమిత్ మిత్ర కొనియాడారు.  గ్రీన్ ఫీల్డ్ రాజధాని ఏర్పాటు చేయడాన్ని చంద్రబాబు ఛాలెంజ్ గా తీసుకున్నారన్నారు. ఐటీ రంగంలో చంద్రబాబు ఎటువంటి కృషి చేశారో అందరికీ తెలుసని చెప్పారు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. 15వ ఆర్ధిక సంఘం ద్వారానే కాదు, వివిధ రూపాల్లో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. గతంలో ఏ కేంద్రం వ్యవహరించని విధంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.  ప్రజాకర్ష పథకాలకు నిధుల కోత పెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందని,  15వ ఆర్ధిక సంఘం విధి విధానాల విషయంలో కేంద్రం వ్యవహరిస్తోన్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు రాష్ట్రపతి దగ్గరకు వెళ్లాల్సి ఉందని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 15వ ఆర్ధిక సంఘం విధి విధానాలు ఇబ్బందికరంగా ఉన్నాయని ఢిల్లీ డెప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. కేరళలో జరిగిన ఆర్థిక మంత్రుల సదస్సులో తీసుకున్న నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందన్నారు. పంజాబ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి కేవలం 29 శాతం నిధులు మాత్రమే వస్తున్నాయని, కొన్ని రాష్ట్రాలకు కేంద్ర వాటా ఎక్కువగా వెళ్తోందని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా కేంద్రం వ్యవహరిస్తోందని  పంజాబ్ ఆర్ధిక మంత్రి మన్ ప్రీత్ సింగ్ అన్నారు.

కూటమి అభ్యర్థులను గెలిపించండి : పట్టాభిరామ్ పిలుపు

కూటమి ఆధ్వర్యంలో విజయవాడలో భారీ రోడ్ షో విజయవాడ: విజయవాడ కార్పోరేషన్ ఎన్నికలలో  టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు...