Jan 2, 2017

సీఈజెడ్ ఏర్పడితే మరిన్ని రాయితీలు


Ø ఎగుమతి ఆధారిత ఫ్యాక్టరీలకు అవకాశం
Ø ఉద్యోగా కల్పన ఆధారంగా పన్నుల మినహాయింపు
Ø తీర ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి


          రాష్ట్ర తీరప్రాంతంలో భారీ పరిశ్రమలు నెలకొల్పుతున్న నేపధ్యంలో కేంద్రం ‘తీర ఉపాధి మండలి’ (కోస్టల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ జోన్‌ - సీఈజెడ్‌) ఏర్పాటు చేయడం ద్వారా మరిన్నీ రాయితీలు అభించే అవకాశం ఉంది. రాష్ట్రంలో 974 కిలో మీటర్ల సముద్ర తీరం ఉంది. సముద్రంలోనే కాకుండా తీరం వెంట భూగర్భంలోనూ అపారమైన ఖనిజ సంపద నిక్షిప్తమై ఉంది.  దానికి తోడు రాష్ట్రంలో  నైపుణ్యత కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. నిరంతరం విద్యుత్ సరఫరా అవుతూ ఉంటుంది. సాగర తీరంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి, జల రవాణాకు అనేక అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటినీ సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఇటు ప్రభుత్వం రంగంలోనూ, అటు ప్రైవేటు రంగంలోనూ  పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం అనేక ప్రణాళికలు సిద్ధం చేసింది. తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఈ నేపధ్యంలో విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్ (విసిఐసి) ఏర్పడుతోంది. దేశంలో తీరప్రాంతంలో ఏర్పడే  మొదటి కారిడార్ ఇది. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం నుంచి తమిళనాడులోని చెన్నై వరకు 2500 కిలో మీటర్లు విస్తరించి ఉండే కారిడార్ ఇది.  భవిష్యత్ లో ఇది తూర్పు ఆర్థిక  కారిడార్ గా కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. వీటన్ని దృష్ట్యా దేశీయంగా, అంతర్జాతీయంగా పేరొందిన పలు సంస్థలు తీర ప్రాంతంలో భారీ పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వస్తున్నాయి. ఇక్కడ నైపుణ్యత గల మానవ వనరులు అందుబాటులో ఉండటం,  తక్కువ జీతాలకే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉండటంతో విదేశీ సంస్థలు అనేకం రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ఆసక్తి చూపుతున్నాయి. కొన్ని బహుళజాతి కంపెనీలు  రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు(ఎంఓయు) కూడా చేసుకున్నాయి.

           ఇదిలా ఉండగా, దేశంలో తీర ప్రాంతంలో స్థానికంగా ఉండే మానవ వనరుల్లో నైపుణ్యాలను ఉపయోగించుకుని వారికి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్న యోచనలో కేంద్రం ఉంది. ఇందు కోసం నీతి (నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్సఫార్మేషన్ ఇండియా - ఎన్ఐటీఐ) అయోగ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో  తీర ఉపాధి మండళిఏర్పాటు చేయనుంది. గతంలో ఏర్పాటైన ఎస్‌ఈజెడ్‌ (ప్రత్యేక ఆర్థిక మండలి)లు, ఎన్ఐఎంజెడ్ (నేషనల్ ఇన్ వెస్ట్ మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్- ప్రత్యేక పెట్టుబడి, పారిశ్రామిక, ఉత్పాదక మండలి)లకు భిన్నంగా ఇది ఉంటుంది. దీనిని కనీసం 400-500 చదరపు కిలోమీటర్ల  విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. ఈ జోన్ లో ఎగుమతి ఆధారిత యూనిట్లను ప్రోత్సహించాలన్న యోచనలో కేంద్రం ఉంది. అందువల్ల తీర ప్రాంతంలో, పోర్టులకు దగర్లో దీనిని  ఏర్పాటు చేస్తారు.  పరిశ్రమలో ఉపాధి పొందే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా ఐదేళ్ల నుంచీ పదేళ్ల వరకూ కేంద్రం పన్ను మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. పదివేల మంది ఉపాధి కల్పిస్తే ఐదేళ్లు, 20 వేల మంది ఉద్యోగులు ఉంటే 10 ఏళ్ల వరకు పన్ను మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మరికొన్ని కార్పొరేట్‌ రాయితీలు ఇస్తారు.
          సాగరమాల ప్రాజెక్ట్ లో భాగంగా   ప్రస్తుతం దేశంలో రెండు సీఈజెడ్ లను ఏర్పాటు చేస్తారు. తూర్పున ఏపీలో, పశ్చిమాన గుజరాత్ లో  వీటిని ఏర్పాటు చేస్తారు. వచ్చే బడ్జెట్‌లో  సీఈజెడ్‌లపై కేంద్రం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు ఆచార్య అరవింద్‌ పనగారియా సారధ్యంలో ఒక బృందం ఏపీలో సీఈజెడ్‌ ఏర్పాటుకి ఉన్న అవకాశాలను సెప్టెంబర్ లో పరిశీలించింది. సీఈజెడ్‌ ఏర్పాటుకి ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం-గంగవరం, కృష్ణపట్నం ఓడరేవు ప్రాంతాలు అనువైనవిగా ఈ బృందం భావించింది.
          విశాఖ మేజర్ పోర్టుతోపాటు గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి పలు మీడియం పోర్టులు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ ఎగుమతులకు ఈ పోర్టులు అనుకూలంగా ఉన్నాయి.  పారిశ్రామికంగా అభివృద్ధిపరచడానికి అనువైన ప్రాంతంగా దీనిని గుర్తించారు. మెరైన్ ఉత్పత్తుల్లో దేశంలో ఏపీ అత్యున్నత స్థానంలో ఉంది. ఎగుమతులు కూడా అధికంగా ఇక్కడ నుంచే జరుగుతున్నాయి. మెరైన్ కార్గోలను  పంపే మేజర్ పోర్టులలో విశాఖపట్నం పోర్ట్ ఒకటి.   2015-16 లో ఏపీ నుంచి రూ. 9,328 కోట్ల విలువైన 1,67,130 టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.  అందువల్ల పెద్ద పెద్ద పారిశ్రామిక యూనిట్లతోపాటు ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపనపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది.  రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహాకలతోపాటు తీర ఉపాధి మండలి కూడా ఏర్పడితే ఇక్కడి తీరం పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా అవతరిస్తుంది.

అమరావతి మౌలిక వసతుల ప్రణాళిక పూర్తి


Ø 90 శాతం పైగా భూమి స్వాధీనం
Ø ప్రధాన రోడ్లకు టెండర్ల పిలుపు
Ø ప్రముఖ సంస్థలకు భూముల కేటాయింపు
Ø మౌలిక వసతులు, భూగర్భ కేబుల్ కు త్వరలో టెండర్లు
Ø 742 ఎంఎల్డీ మంచినీరు – 592 ఎంఎల్డీ మురుగునీరు
Ø 3355 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు - 2710 మెగా వాట్ల విద్యుత్ సరఫరా
          
          నూతన ప్రజా రాజధాని అమరావతి మహానగరానికి కావలసిన అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రణాళిక పూర్తి అయింది. అత్యున్నత స్థాయిలో మౌలిక వసతులతోపాటు పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, ఉన్నత జీవనం, పర్యావరణ అనుకూల అభివృద్ధి అమరావతికి మూలస్థంభాలుగా ప్రభుత్వం భావిస్తోంది. వీటిని దృష్టిలో పెట్టుకొని సీఆర్డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) ప్రణాళికలకు రూపకల్పన చేస్తోంది. ఉన్నత స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకోనున్న రాజధానికి అవసరమైన ప్రధాన రోడ్లు, నీరు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ సరఫరా, కేబుల్ వ్యవస్థ వంటి మౌలిక అవసరాలను తీర్చడానికి కావలసిన చర్యలను ప్రభుత్వం మొదలు పెట్టింది. ఆధునిక రాజధానికి 742 ఎంఎల్ డీ(మిలియన్ ఆఫ్ లీటర్స్ పర్ డే) నీరు అవసరమవుతుందని అంచనా వేశారు. ఇంత నీటి సరఫరాకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యాధునికమైన రీతిలో మురుగునీటి పారుదల వ్యవస్థను రూపొందించారు. 592 ఎంఎల్ డీల మురుగు నీరు ప్రవహించే అవకాశం ఉందని లెక్క తేల్చారు. ఇందు కోసం 316 (నాళాలు, అనుబంధ నాళాలు) కిలోమీటర్లు +277 (సంగ్రాహకాలు) కిలో మీటర్ల మేర మురుగు కాలువల నిర్మాణం చేస్తారు. అలాగే 3355 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 2710 మెగా వాట్ల విద్యుత్ సరఫరాకు కావలసిన చర్యలు చేపట్టారు. ఇన్ ఫ్రాస్టక్చర్, పీఎంసీ(ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ కన్సల్టెంట్), బ్రూ అండ్ గ్రీన్ (జలకళ-పచ్చదనం) ... అందరు కన్సల్టెంట్లతో సీఆర్డీఏ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. మౌలిక వసతుల అభివృద్ధి, గృహ నిర్మాణం, వాణిజ్యాభివృద్ధి, ఆరోగ్య రక్షణ, విద్య ప్రాజెక్టులు, పర్యాటకం, దాని అనుబంధ ప్రాజెక్టులు, పరిశ్రమలు, సేవల రంగం వంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.

90 శాతం పైగా భూమి స్వాధీనం
            అమరావతి మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేశారు. 90 శాతం పైగా భూమిని సీఆర్టీఏ స్వాధీనం చేసుకుంది.  రాజధాని పరిధిలో 53,478 ఎకరాల భూమి ఉంది. ఇందులో 37,505 ఎకరాలను లాండ్ పూలింగ్ పథకం కింద సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 34,984 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. 217 కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  అత్యంత ఆధునిక ప్రభుత్వ భవనాల మాస్టర్ ఆర్కిటెక్ట్ లుగా లండన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్, మన దేశానికి చెందిన హఫీజ్ కాంట్రాక్టర్ లను ఎంపిక చేశారు. మిగిలిన ప్రభుత్వ భవనాల ఆర్కిటెక్ట్ ల ఎంపికకు కూడా టెండర్లను పిలిచారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా అత్యంత సౌకర్యంగా ప్రజా రవాణా వ్యవస్థకు రూపకల్పన చేశారు. దానికి అనుగుణంగానే ప్రధానమైన రోడ్లు అన్నిటికి టెండర్లు పిలిచారు. భూగర్భంలో ఈహెచ్ టీ(ఎలక్ట్రానిక్ హై టెక్షన్) కేబుల్ లైన్స్ అమర్చడానికి టెండర్లను త్వరలో పిలుస్తారు.

 రానున్న అయిదేళ్లలో ప్రపంచ స్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి అనుగునంగా రాజధానిలో వివిధ ప్రముఖ విద్య, వైద్య సంస్థలకు భూములు కేటాయించారు. దేశంలో టాప్ 20, ప్రపంచంలో టాప్ 20 విశ్వవిద్యాలయాలను ఏపీకి తీసుకురావల్లన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం. ఆ మేరకు ఇప్పటికే దేశవిదేశాలలోని పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకోవడం, భూములు కేటాయించడం జరిగిపోయాయి. వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్), శ్రీరామస్వామి మెమోరియల్ (ఎస్ఆర్ఎం) యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, ఇండో-యుకే హెల్త్ ఇన్ స్టిట్యూట్, డాక్టర్ బీఆర్ శెట్టి మెడికల్ సిటీ వంటి వాటితోపాటు వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూములు కేటాయించారు.  ఇండో-యూకే ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్ కు మొదటి దశలో 50,  రెండు దశలో 100 కలిపి మొత్తం 150 ఎకరాలు కేటాయించనున్నారు.  నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్(ఎన్ఐడీ)కి 50 ఎకరాలు, సెంట్రల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్ (సీఐటీడీ)కి ఐదు ఎకరాలు, ఆంధ్రప్రదేశ మానవ వనరుల అభివృద్ధి సంస్థకు 25 ఎకరాలు కేటాయించేందుకు సీఆర్‌డీఏ నిర్ణయం తీసుకుంది.

  రాజధానిలో పాఠశాలలు, స్టార్ హోటళ్లు, హాస్పటళ్లు, ఎంఐసీఈ(మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఈవెంట్స్) సెక్టార్ లో నిర్మాణానికి సీఆర్డీఏ ఆర్.ఎఫ్.పీ.లను ఆహ్వానించింది.  160కి పైగా ప్రాథమిక పాఠశాలలు, వందకు పైగా ఉన్నత పాఠశాలలు, 27 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన. అందులో భాగంగా  జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆరు పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు సీఆర్ డీఏ ఆర్ఎఫ్ పీలను ఆహ్వానించింది. అలాగే ఒక 5స్టార్, ఒక 4స్టార్, 4 త్రీస్టార్ హోటళ్లకు ఆర్ఎఫ్ పీలను విడుదల చేసింది. ఇప్పుడే ప్రత్యేక పరిశ్రమగా ఎదుగుతున్న ఎంఐసీఈ రంగంలో కూడా టెండర్లను పిలిచారు. మంచినీరు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ శక్తి వంటి వాటికి త్వరలో టెండర్లు పిలవనున్నట్లు సీఆర్డీఏ వర్గాలు తెలిపాయి.

రాజధాని అమరావతిలో 27 పట్టణాలు


§  క్రమపద్దతిలో వాణిజ్య కేంద్రాల నిర్మాణం
§  ప్రణాళికా బద్ధంగా పట్టణాలు, ప్రాంతాలు, రోడ్లు, పార్కులు
§  ప్రతి పట్టణంలో జూనియర్ కాలేజీ, మెట్రో స్టేషన్
§  సీఆర్డీఏ ప్రాజెక్ట్ నివేదిక

         ఆధునిక  రాజధాని అమరావతి మహానగరంలో 27 పట్టణాలు ఉండేవిధంగా  సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) ప్రాజెక్ట్ నివేదిక రూపొందించింది. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలలోని 24 రెవెన్యూ గ్రామాల పరిధిలో 53,478 ఎకరాలలో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇందులో గ్రీన్-బ్లూ (పచ్చదనం-జలకళ) ప్రాంతానికి 29.5 శాతం భూమిని కేటాయించారు. కృష్ణా నది ఒడ్డున 15 కిలో మీటర్ల ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరుగుతుంది.  రాజధానిలో వివిధ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ 9 నగరాలు (పరిపాలన, ఆర్థిక, న్యాయ, వైద్య, పర్యాటక, మీడియా, ఎలక్ట్రానిక్, విజ్ఞాన, క్రీడల నగరాలు) నిర్మిస్తారు. వాటిని మళ్లీ 27 నగరాలుగా విభజిస్తారు. ఒక్కో పట్టణం వెయ్యి ఎకరాలలో రెండు చదరపు కిలోమీటర్ల విస్తరించి ఉంటుంది. దాదాపు 28 వేల ఇళ్లు, లక్ష మంది జనాభా ఉంటారు. ఒక్కో పట్టణంలో నాలుగు రహదారులు నిర్మిస్తారు. వాటిని పట్టణ సరిహద్దులలో నిర్మించే ప్రధాన రోడ్లకు అనుసంధానం చేస్తారు. ప్రతి పట్టణంలో ఒక జూనియర్ కాలేజీ,  ఒక మెట్రో స్టేషన్ నిర్మిస్తారు.
          ఒక్కో పట్టణాన్ని నాలుగు సమాన ప్రాంతాలు (నైబర్ హుడ్- ఇరుగుపొరుగు) గా విభజిస్తారు. 250 ఎకరాలలో కిలోమీటర్ లోపల ఉండే ఒక్కో ప్రాంతంలో దాదాపు 7 వేల గృహాలు, 25 వేల జనాభా ఉంటారు. ఈ ప్రాంతంలో ఉండే అందరికి నడచి వెళ్లేంత దూరంలో ప్రాథమిక పాఠశాల, షాపింగ్ మాల్ వంటివి అందుబాటులో ఉంటాయి. రాజధానిలో ఇటువంటి ప్రాంతాలు వంద వరకు ఉంటాయి.  ఒక్కో ఇరుగుపొరుగు ప్రాంతాన్ని మళ్లీ నాలుగు సమానమైన చిన్ని చిన్న ప్రాంతాలు(కమ్యునిటీలు)గా విభజిస్తారు. 62.5 ఎకరాలలో అర కిలోమీటరు పరిధిలో ఉండే ఈ కమ్యునిటీలో దాదాపు 1700 ఇళ్లు, ఆరు వేల జనాభా ఉంటారు. ఒక్కో  కమ్యునిటీని మళ్లీ రెండు నుంచి నాలుగు క్లస్టర్(పరిమిత ప్రదేశం)లుగా విభజిస్తారు. ఒక్కో క్లస్టర్ లో ఒక్కో పార్కు ఉంటుంది. అలాగే ఆ ప్రదేశంలో ఉండేవారందరికీ కలిపి వాహనాలు నిలుపుకోవడానికి ఉమ్మడి పార్కింగ్ ప్రదేశం ఉంటుంది. ఒక్కో క్లస్టర్ 15 నుంచి 30 ఎకరాల ప్రదేశంలో ఉంటుంది. ఇందులో మూడు వందల నుంచి 8 వందల కుటుంబాల వరకు ఉంటాయి. జనాభా 1500 నుంచి మూడు వేల వరకు ఉంటారు. ప్రణాళికాబద్దంగా నిర్మిస్తున్న నగరమైనందున కావలసిన రీతిలో పట్టణాలు, ప్రాంతాలు, క్లస్టర్లు, రోడ్లు, వాణిజ్య కేంద్రాలు, కాలేజీలు, మెట్రో స్టేషన్లు, పార్కులు, పార్కింగ్ ప్రదేశాలు విభజించుకోవడానికి, నిర్మించుకోవడానికి వీలవుతుంది.

క్రమపద్దతిలో వాణిజ్య కేంద్రాల నిర్మాణం
కృష్ణా నది ఒడ్డున ఒక క్రమ పద్దతిలో వాణిజ్య కేంద్రాలను(భవనాలు) నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ప్రాంతాన్ని ప్రధాన వాణిజ్య కేంద్రం (సీబీడీ-సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్)గా తీర్చిదిద్దుతారు. ఇక్కడ ముఖ్యమైన ఆర్థిక సంస్థలు, కార్పోరేట్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు. వాణిజ్యపరంగా మూడు ప్రాంతీయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. స్థానిక వాణిజ్య అవసరాలకు ప్రతి కమ్యునిటీలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తారు.

60 మీటర్ల వెడల్పున మూడు ప్రధాన రోడ్లు
అంతర్జాతీయ నగరాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో సకల హంగులతో విశాలమైన రోడ్లు నిర్మిస్తారు. 60 మీటర్ల వెడల్పున మూడు ప్రధాన రోడ్లు నిర్మిస్తారు. 50 మీటర్ల వెడల్పుతో 275 కిలోమీటర్ల అంతర్గత రోడ్లు, 25 మీటర్ల వెడల్పుతో మరికొన్ని రోడ్లు నిర్మిస్తారు. అంతేకాకుండా 97.5 కిలోమీటర్ల పొడవున ఆరు వరుసల ఇన్నర్ రింగ్ రోడ్డు, 186 కిలోమీటర్ల పొడవున 8 వరుసల అవుటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తారు. 134 కిలో మీటర్ల పొడవున మెట్రో రైలు మార్గం నిర్మించే ప్రతిపాదన కూడా ఉంది. కాలుష్యరహిత రాజధాని నిర్మించాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. జలకళతో పచ్చని చెట్లు, పచ్చికబయళ్లతో నిండిన పర్యావరణాన్ని కల్పించేందుకు సీఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది.  ఆహ్లాదకరమైన వాతావరణం కోసం  3 నగర స్థాయి పార్కులు, 27 పట్టణ స్థాయి పార్కులు, వందకు పైగా చిన్న పార్కులు ఏర్పాటు చేస్తారు. అత్యంత ఆధునికంగా ప్రపంచ స్థాయిలో మహా అద్భుత నగర నిర్మాణ పనులలో సీఆర్డీఏ నిమగ్నమై ఉంది.


జారీ చేసినవారు: రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగంసమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.







ఏపీలో 44 శాతం పెరిగిన విమాన ప్రయాణికులు


·       అత్యధికంగా గన్నవరం నుంచి 76 శాతం పెరుగుదల
·       తిరుపతి నుంచి 43 శాతం పెరుగుదల
·       విశాఖలో 15 లక్షలు దాటిన ప్రయాణికులు
·       విమానాశ్రయాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి

           రాష్ట్రంలో రోజురోజుకు విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. నూతన రాజధాని అమరావతి నిర్మాణం, పారిశ్రామికంగా, విద్య,వైద్య పరంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న క్రమంలో దేశ, విదేశీ ప్రయాణికులు వచ్చిపోతుండటంతో విమాన సర్వీసులు కూడా పెంచారు. రాష్ట్రంలో ప్రధానంగా విశాఖపట్నం, తిరుపతి, గన్నవరం, రాజమండ్రి విమానాశ్రయాలు ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 8 నెలల కాలంలో, ఈ ఏడాది అదే కాలంలో ఆయా విమానాశ్రయాల నుంచి ప్రయాణించిన ప్రయాణికుల వివరాలను సంబంధిత అధికారులు విడుదల చేశారు. గత ఏడాది రాష్ట్రంలో  16,91,448 మంది ప్రయాణించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 24,28,612 మందికి చేరింది. అంటే 44 శాతం పెరిగింది. జాతీయ స్థాయిలో గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్బోబర్ వరకు ప్రయాణించిన ప్రయాణికులను ఈ ఏడాది అదే కాలంతో పోల్చితే 19 శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది.
           గన్నవరం విమానాశ్రయంలో అత్యధికంగా 76 శాతం మంది ప్రయాణికులు పెరిగారు. అమరావతికి విదేశీ ప్రముఖులు, దేశవిదేశీ పారిశ్రామికవేత్తలు, విశ్వవిద్యాలయాలు, ఇతర రంగాలకు చెందిన ప్రతినిధులు తాకిడి ఎక్కువైంది. దాంతో అమరావతికి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న గన్నవరం విమానాశ్రయానికి వచ్చిపోయే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. గత ఏడాది 8 నెలల్లో ఈ విమానాశ్రయం నుంచి 2,48,662 మంది ప్రయాణించగా, ఈ ఏడాది అదే కాలంలో 4,37,928 మంది ప్రయాణించారు. విశాఖ నగరం వివిధ పరిశ్రమలు, ఐటీ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి గత ఏడాది 11,00,114 మంది ప్రయాణించగా, ఈ ఏడాది 15,25,518 మంది ప్రయాణించారు. 39 శాతం మంది ప్రయాణికులు పెరిగారు. ఏడుకొండల స్వామివారికి భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో తిరుపతి విమానాశ్రయం నుంచి కూడా ప్రయాణికుల సంఖ్య 43 శాతం పెరిగింది. గత ఏడాది ఇక్కడ నుంచి 2,01,272 మంది ప్రయాణించగా, ఈ ఏడాది 2,87,131 మంది ప్రయాణించారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందే క్రమంలో ఇక్కడ నుంచి కూడా ప్రయాణికుల సంఖ్య 21 శాతం పెరిగింది. గత ఏడాది ఇక్కడ నుంచి 1,41,440 మంది ప్రయాణించగా, ఈ ఏడాది 1,71,491 మంది ప్రయాణించారు.  కడప విమానాశ్రయంలో ఈ ఏడాదే రాకపోకలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఇక్కడ నుంచి 6,544 మంది ప్రయాణించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఓ ప్రైవేటు విమానాశ్రయం కూడా ఉంది.
             రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ స్థిరమైన రెండంకెల ఆర్థిక వృద్ధి రేటు సాధించే క్రమంలో విమాన ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దాంతో
మౌలిక వసతుల కల్పనలో భాగంగా  రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధి కోసం ఎయిర్ పోర్ట్  ఆథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు-పబ్లిక్ భాగస్వామ్యంతో విమాన రంగాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపుతో  ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. అవసరమైన ప్రణాళికలను కూడా సిద్ధం చేశారు. రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉండటంతో దీని ప్రాధాన్యత పెరిగింది. ఇక్కడి నుంచి విదేశాలకు కూడా విమాన సర్వీసులు నడపటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే దేశంలోని అన్ని నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విమానాశ్రయంలో నిర్మించిన కొత్త టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ టెర్మినల్ తో దీనికి అంతర్జాతీయ విమానాశ్రయ హోదా లభిస్తుంది. గన్నవరం - విశాఖపట్నం, గన్నవరం - హైదరాబాద్, గన్నవరం - తిరుపతి, గన్నవరం - కడప మధ్య సర్వీసులు పెంచుతారు. అందువల్ల తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతారు.  రాష్ట్రంలో అతి పెద్దదైన విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాలకు కూడా విమాన సర్వీ సులు నడుస్తున్నాయి. దీనిని  కూడా  అభివృద్ధి చేస్తారు. రాజమండ్రిలోని మధురపూడి  విమానాశ్రయంలో రన్ వేని విస్తరణ కోసం 850 ఎకరాలు సేకరించారు. ప్రస్తుతం ఉన్న 1750 మీటర్ల  రన్ వేను 3,165 మీటర్ల కు పొడిగిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో  జరుగుతున్న ఈ రన్ వే విస్తరణ పనులు 2018 ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తారు.

   కొత్త విమానాశ్రయాల నిర్మాణం:  విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ ఫీల్డు విమానాశ్రయం, విశాఖ-చెన్నయ్ పారిశ్రామిక కారిడార్ లో నెల్లూరు జిల్లా దగదుర్తి విమానాశ్రయం, కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను కొత్తగా నిర్మిస్తారు. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దేశవిదేశీ వ్యాపారులు, అధికారులు, పర్యాటకులకు గన్నవరం విమానాశ్రయం ఒక్కటే సరిపోదన్న ఆలోచనతో దీనిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 వేల ఎకరాలలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం(పీపీపీ)తో అంతర్జాతీయ స్థాయిలో దీనిని నిర్మిస్తారు. అయితే దీనికి ఇంకా స్థల నిర్ణయం జరుగలేదు.

జారీ చేసినవారు: రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగంసమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఆశాజనకంగా వ్యవసాయం, అనుబంధ రంగాలు

Ø మత్స్య సంపదలో తిరులేని పురోగతి
Ø అగ్ర రాష్ట్రాల స్థాయికి ఎగబాకుతున్న ఏపీ
            రాష్ట్రంలో ఈ ఏడాది అర్థ సంవత్సరంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి వ్యూహాత్మకంగా రూపొందించిన ప్రణాళికలు ఫలించాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి  రూ. 2,21,907 కోట్ల(2011-12 ధరలలో)తో వృద్ధి రేటు 12.23 శాతం ఉండగా, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో రూ. 42,006 కోట్లతో 24.44 శాతంగా ఉంది. జాతీయ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 7.20 శాతం కాగా, వ్యవసాయం, అనుబంధ రంగాలలలో 2.51 శాతం మాత్రమే వృద్ధి రేటు నమోదైంది. రెండంకెల సమ్మిళిత వృద్ధిని సాధించేందుకు ప్రధాన వృద్ధి కారకం (గ్రోత్ ఇంజన్)గా  మత్స్య పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.  ఈ రంగం రూ.17,578 కోట్ల ఉత్పత్తితో  తిరుగులేనివిధంగా 42.57 శాతం వృద్ధి రేటు సాధించింది.   చేపలు, రొయ్యల ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో  రాష్ట్రం నిలిచింది. అద్వితీయమైన మత్స్య సంపదకు ఏపీ చిరునామాగా మారింది. జాతీయ స్థాయిలో ఈ అర్ధ సంవత్సరంలో 5.26 శాతం మాత్రమే వృద్ధి రేటు నమోదైంది. ఆ తరువాత పండ్లు, పూలు ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో ఉద్యానవన రంగం లక్ష్యానికి మించి రూ.3,151 కోట్లతో 18.33 శాతం వృద్ధి సాధించింది. ఇక ప్రధానమైన వ్యవసాయ రంగం 759 కోట్ల ఉత్పత్తితో 3.69 శాతం వృద్ధి రేటు నమోదైంది. జాతీయ స్థాయిలో ఈ రంగంలో వృద్ధి రేటు 1.55 శాతం మాత్రమే నమోదైంది.
పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 9.98 శాతం

పారిశ్రామిక రంగంలో ఈ ఏడాది అర్థ సంవత్సరంలో రాష్ట్రం ఉత్పత్తి రూ.63,229 కోట్లతో  9.98 శాతం నమోదైంది. జాతీయ స్థాయిలో 5.60 శాతం వృద్ధి రేటు మాత్రమే సాధించింది. పారిశ్రామిక రంగంలో వివిధ విభాగాలను పరిశీలిస్తే విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా విభాగాలు రూ.9,125 కోట్లతో 11.70 శాతం, మైనింగ్, క్వారీలు రూ. 5,750 కోట్లతో 12.20 శాతం, ఉత్పత్తి విభాగం రూ.25,798 కోట్లతో 10.20 శాతం, నిర్మాణ విభాగం రూ.22,556 కోట్లతో 8.52 శాతం వృద్ధి రేటు సాధించాయి.
సేవల రంగం ఈ అర్థ సంవత్సరంలో రూ.1,16,672 కోట్లతో 9.57 శాతం వృద్ధి రేటు సాధించగా, జాతీయ స్థాయిలో 9.20 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఈ రంగంలో వివిధ విభాగాలను పరిశీలిస్తే ఒక్క రైల్వేస్ లో జాతీయ స్థాయి గణాంకాల ప్రకారం రాష్ట్రంలో  మైనస్ 5.30 వృద్ధి రేటు నమోదైంది. మిగిలిన విభాగాలు 8 నుంచి 10 శాతం పైగా వృద్ధి రేటు నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్, వ్యాపార సేవలు రూ.25,212 కోట్లతో 11.11 శాతం, కమ్యూనికేష్స్ విభాగం రూ.4,842 కోట్లతో 8.37 శాతం, రవాణా విభాగం రూ.18,065 కోట్లతో 9.61 శాతం,  బ్యాంకింగ్, బీమా వంటి ఆర్థిక సేవలు రూ.11,407 కోట్లతో 8.20 శాతం, వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు రూ. 22,592 కోట్లతో 9.15 శాతం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం రూ.12,387 కోట్లతో 9.63 శాతం వృద్ధి రేట్లు సాధించాయి.
ఈ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్ డీపీ)లో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జీఎస్ డీపీ రూ.4,93,641 కోట్లతో 10.99 శాతం వృద్ధి రేటుతో ప్రథమ స్థానంలో నిలిచింది.   ఈ ఏడాది అర్థ సంవత్సరంలో కూడా అగ్రభాగానే ఉంది. దాదాపు అన్ని రంగాలలో జాతీయ స్థాయిని మించి అభివృద్ధి నమోదవుతోంది. వృద్ధి రేటు ఇదేవిధంగా కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం మేరకు 2022 నాటికి దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాలలో ఏపీ ఒకటిగా నివడం ఖాయం.

జారీ చేసినవారు: రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగంసమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

రాష్ట్రంలో 13,182 పరిశ్రమలకు అనుమతి

§  మొత్తం దరకాస్తులు 14,181
§  తిరస్కరించినవి 811
§  పరిశ్రమల స్థాపనకు ఏపీ అనుకూలం
       పారిశ్రామీకరణకు రాష్ట్రంలో ఉన్న అనూకల పరిస్థితుల నేపధ్యంలో వేల పరిశ్రమలు నెలకొల్పడానికి అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. వీటిలో అతి భారీ, భారీ నుంచి మధ్య తరహా, చిన్న సూక్ష పరిశ్రమల వరకు ఉన్నాయి. ప్రభుత్వ విధానాలు – భౌగోళికంగా, ఉత్పత్తి, వాణిజ్యానికి అనుకూల పరిస్థితులతోపాటు నైపుణ్యత గల మానవ వనరులు అందుబాటులో ఉంటంతో దేశవిదేశీ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో వ్యాపారం చేయడానికి, పరిశ్రమలు స్థాపించడానికి ఆసక్తి చూపుతున్నారు. వీటన్నిటికీ తోడు ప్రభుత్వం అనేక రాయితీలు కల్పించడంతోపాటు ఏ పరిశ్రమకైనా కావలసిన పత్రాల్ననీ సక్రమంగా ఉంటే 14 రోజుల్లోనే ఆన్ లైన్ లో అనుమతులు ఇస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం 2015 ఏప్రిల్ 29న సింగిల్ డెస్క్ పోర్టల్ ను ప్రారంభించింది.  పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా  రాష్ట్రంలో ఏపీ పారిశ్రామిక, మౌలిక వసతుల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) లక్షా 21 వేల 655 ఎకరాలలో 300 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసింది.
             రాష్ట్రంలో ఇన్ని అనుకూల పరిస్థితులు ఉండటం వల్ల సింగిల్ డెస్క్ విధానం ప్రారంభించిన నాటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు వివిధ రకాల పరిశ్రమల స్థాపనకు 14,181 దరకాస్తులు వచ్చాయి. వాటిలో 13,182 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారు. అత్యధికంగా ఎనర్జీ విభాగంలో 2926 దరకాస్తులకు ఏపీఎస్ పీడీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబూషన్ కంపెనీ లిమిటెడ్) ఆమోదం తెలిపింది. ఆ తరువాత పరిశ్రమల శాఖ 1594 దరకాస్తులకు పరిశ్రమ ప్లాన్ల అనుమతులు మంజూరు చేసింది. అనుమతులు పొందినవాటిలో  అతి భారీ పరిశ్రమలు(మెగాప్రాజెక్టులు), భారీ పరిశ్రమలు, సూక్ష, మధ్య, చిన్న తరహా అన్ని పరిశ్రమలు  ఉన్నాయి. 811 దరకాస్తులు తిరస్కరించారు. సర్వీస్ లెవల్ ఎగ్రిమెంట్ పరిధిలో 188 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ విధంగా 14 రోజుల్లో పూర్తిగా ఆన్ లైన్ లో అనుమతులు మంజూరు చేసే రాష్ట్రం ఏపీ ఒక్కటే.
          పరిశ్రమ స్థాపించడానికి  ఉత్పత్తి అయ్యే వస్తువు, వాడే ముడిపదార్ధం, ప్రమాదకర వ్యర్థాల తీవ్రత తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వంలోని 14 శాఖల నుంచి 20 నుంచి 30 రకాల అనుమతులు పొందాలి. పరిశ్రమల శాఖ మొదలుకొని కాలుష్యం నియంత్రణ, విద్యుత్, పౌరసరఫరాలు, అటవీ, భూగర్భజలాలు, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, మునిసిపాలిటీ, పంచాయతీరాజ్, వాణిజ్యపన్నులు, రెవెన్యూ, జలవనరులు, కార్మిక, బాయిలర్, సీఏటీ, సీఎస్టీ తదితర అనుమతుల పొందాలి. ఈ అనుమతులు పొందడానికి గతంలో ఆయా సంస్థల ప్రతినిధులు ప్రభుత్వ శాఖల చుట్టూ తిరగవలసి వచ్చేది. ఇందుకు  సుదీర్ఘ కాలం పట్టేది. అయితే ఇప్పుడు  ఆ జాప్యాన్ని నివారించారు.  రాష్ట్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టిన సింగిల్ డెస్క్ ద్వారా కావలసిన అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 14 రోజులలోనే అనుమతులు మంజూరు చేస్తున్నారు. మెగా ప్రాజెక్టులు మొదలుకొని చిన్న తరహా పరిశ్రమల వరకు కావలసిన ఫ్యాక్టరీ ప్లాన్, భవన నిర్మాణాలకు అనుమతి, పట్టణ, గ్రామీణ ప్రణాళికా శాఖ, గాలి, నీరు చట్టాలకు సంబంధించి రెడ్ క్యాటగిరీ, ఆరంజ్ క్యాటగిరి, పవర్ ఫీజుబిలిటీ సర్టిఫికెట్,  బాయిలర్ సర్టిఫికెట్, విద్యుత్ శాఖ, గ్రామ పంచాయతీ, ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్, ప్రమాదకర వ్యర్థాలకు సంబంధించి, బావుల తవ్వకం, అగ్నిమాపక శాఖ, వ్యాట్, సీఎస్టీ  రిజిస్ట్రేషన్, 11కేవీ లేక 35 కేవీ విద్యుత్ సరఫరా వంటి అనుమతులు చాలా వరకు మంజూరు చేశారు. కొన్ని పరిశ్రమలకు  సంబంధించి ఉత్పత్తుల ఆధారంగా ఆయా శాఖలు కోరిన విధంగా కంపెనీలను వివరణ కోరారు. పరిశ్రమలకు కావలసిన ముడిపదార్ధాలు బొగ్గు, ఆల్కాహాల్ వంటి వాటి కేటాయింపుల విధానాన్ని  కూడా సింగిల్ డెస్క్  పరిధిలోకే తీసుకువచ్చారు. ఇంతటి అద్భుతమైన ఈ సింగిల్ డెస్క్ పోర్టల్ విధానాన్ని  ప్రపంచ బ్యాంకు కూడా ప్రశంసించింది. 

జారీ చేసినవారు: రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగంసమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

Dec 13, 2016

రాజధాని నిర్మాణానికి బాండ్స్ ద్వారా నిధుల సేకరణ

v  9వ తేదీ వరకు ఆర్ఎఫ్ పీల స్వీకరణ
v వివిధ మార్గాలలో నిధుల సమీకరణ
v మసాలా బాండ్లకు ప్రయత్నాలు
v ఇప్పటి వరకు 2, 26, 554 మంది ప్రజల భాగస్వామ్యం
v మూడేళ్లలో రాజధానికి ఒక రూపం

           నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి మహానగర నిర్మాణం కోసం బాండ్స్ ద్వారా కూడా నిధులు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆహ్వానించిన ప్రకారం బ్యాంకుల నుంచి వచ్చిన టెండర్లను ఈ నెల 9న తెరుస్తారు. గుంటూరు జిల్లాలో కృష్ణా నది ఒడ్డున 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో రాజధాని మహా నగరాన్ని నిర్మించాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని వేగంగా నిర్మాణ పనులు కొనసాగించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. రాజధానిలో  వివిధ అంశాలకు సంబంధించి 9 నగరాలను నిర్మించదలచిన విషయం తెలిసిందే. ఆధునిక అమరావతి నిర్మాణానికి ప్రపంచదేశాలు సింగపూర్, మలేషియా, చైనా, జపాన్, బ్రిటన్, రష్యా, చైనా, ఆస్థానా వంటి అనేక దేశాలు  సహాయ సహకారాలు అందించడానికి తమ సంసిద్ధత తెలిపాయి.

మూడేళ్లలో రాజధానికి ఒక రూపం
      తాజా అంచనాల ప్రకారం రాజధానిని బ్లూ-గ్రీన్ (జలకళ-పచ్చదనం) నగరంగా అభివృద్ధి చేయడానికి రూ.58 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇందులో 70 శాతం నిధులను రాబోయే మూడేళ్లలో ఖర్చుచేసి రాజధానికి ఒక రూపం తీసుకురావలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఇదే కాలంలో రాయలసీమలోని అనంతపురం – కర్నూలు -కడపల  నుంచి అమరావతికి రూ.27,600 కోట్ల అంచనా వ్యయంతో ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. అత్యధిక నిధులు మౌలిక సదుపాయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇందులో కొన్ని ప్రాజెక్టులను ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతుల్లో మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పద్ధతిలో చేపట్టే ప్రాజెక్టుల ఆమోదానికి, పర్యవేక్షణకు ఒక సాధికార కమిటీని ఏర్పాటు చేస్తారు.  రాజధాని నిర్మాణంలో పాలు పంచుకోవడానికి ఆసక్తి చూపే దేశాలను ఇందులో భాగస్వాములను చేస్తారు.  మిశ్రమ ప్రాయోజక అభివృద్ధి (మిక్స్‌డ్‌ యూజ్‌ డెవలప్‌మెంట్‌), సాంఘిక మౌలిక సదుపాయాలను కల్పిస్తారు.  కట్టడాల నిర్మాణంలో ఉపయోగించే సామాగ్రికి కొరతలేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ సామాగ్రి ఎంత అవసరమో, ఎక్కడ నుంచి తెప్పించాలో వంటి విషయాలపై కూడా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న 25 రెవెన్యూ గ్రామాలలో కూడా రూ.2,537 కోట్లతో మౌలికసదుపాయాలు కల్పిస్తారు.  

వివిధ మార్గాలలో నిధుల సేకరణ
      నిర్మాణానికి వివిధ మార్గాలలో నిధులు సేకరించడానికి ఏపీసీఆర్డీఏ (ఆంధ్రప్రదేశ్ ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) తగిన ఏర్పాట్లు చేస్తోంది. అమరావతి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రపంచ బ్యాంకు(ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకంనస్ట్రక్షన్ అండ్ డవలప్ మెంట్), ఆసియా మౌలికవసతుల పెట్టుబడి బ్యాంకు (ఎఐఐబీ), భారత ప్రభుత్వ సంస్థ హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్) నిధులు సమకూరుస్తున్నాయి. రాజధాని నిర్మాణానికి నిధులు కొరతలేకుండా చూడాలన్న  సీఎం ఆదేశాలు, కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ) సూచించిన మేరకు ఇతర ఆర్థిక సంస్థల నుంచి కూడా ఏపీసీఆర్డీఏ నిధులు సేకరించే ప్రయత్నాలు మొదలుపెట్టింది.  ప్రాజెక్టులు, జాతీయ పెట్టుబడి సంస్థల నుంచి అవసరమైన నిధుల సమీకరించే ప్రయత్నంలో ఉంది. దానికి తోడు బాండ్ల ద్వారా కూడా నిధులు సేకరించాలని నిర్ణయించింది. ఈ బాండ్లు తీసుకునే వారికి పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు కల్పిస్తారు. బాండ్స్ ద్వారా రెండు వేల కోట్ల రూపాయల వరకు నిధులు సమకూరుతాయని అంచనా.  ఇందుకోసం మర్చంట్ బ్యాంకుల నుంచి టెండర్లను ఆహ్వానిస్తూ గత నెల 23 నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు ఆర్ఎఫ్ పీ(రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్)లను స్వీకరిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఆర్ఎఫ్ పీలను తెరుస్తారు. ఈ నెల 12వ తేదీన అర్హత గల సంస్థలను, 13 తేదీన సాంకేతికంగా అర్హత గల సంస్థలను ప్రకటించే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన ప్రతిపాదనలను ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు తెరుస్తారు. అంతేకాకుండా అమరావతి నిర్మాణానికి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మసాలా బాండ్ల (రూపీ-డినామినేటెడ్ బాండ్లు) రూపంలో  నిధులు సేకరించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

ప్రజా భాగస్వామ్యం : ప్రజారాజధాని నిర్మాణంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్న సీఎం పిలుపుని అందుకుని ‘నా ఇటుక- నా అమరావతి’ ద్వారా లక్షల మంది విరాళాలు అందజేస్తున్నారు. అమరావతి వెబ్ సైట్ ద్వారా దేశవిదేశాలలోని తెలుగు ప్రజలు ఒక్కో ఇటుక పది రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీ మంగళవారం  మధ్యాహ్నం వరకు ‘నా ఇటుక- నా అమరావతి’ ద్వారా 2,26,554 మంది 56,27,184 ఇటుకలు కొనుగోలు చేశారు.
  
జారీ చేసినవారు: రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగంసమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.