Nov 3, 2025

ప్రైవేటు ఆస్పత్రులకూ పాట్లు!


కార్పోరేట్ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులపై ఎక్కువ మందికి సదభిప్రాయం లేదు. ఏ చిన్న సమస్య చెప్పినా నాలుగైదు రకాల టెస్టులు రాస్తారని, మందులతో తగ్గిపోయే అనారోగ్య సమస్యలకు కూడా  ఆపరేషన్ అంటారని, బిల్లు అధికంగా చేస్తారని... ఇలా అనేక భయాలు అన్ని వర్గాల ప్రజలకు ఉన్నాయి. గర్భిణీని తీసుకువెళితే, సాధారణ కాన్పుకు అవకాశం ఉన్నా, సిజేరియన్ ఆపరేషన్ అంటారని కూడా విమర్శలు ఉన్నాయి. నానా రకాలుగా రోగి కుటుంబాన్ని  భయపెట్టి పీల్చిపిప్పిచేస్తారని,  ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే, అప్పలుపాలు కావడమేనన్న అభిప్రాయాన్ని అత్యధిక మంది వ్యక్తం చేస్తుంటారు. వారికి డబ్బే ప్రధానమని, రోగి ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోరని చెబుతుంటారు. కొన్ని సందర్భాలలో ‘ఠాగూర్’ సినిమాలో మాదిరిగా చనిపోయినవారికి కూడా వైద్యం చేసినట్లు నటించి, డబ్బు గుంజుతుంటారని వినవస్తుంటుంది.  ఇక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే, మరీ ఎక్కువ బిల్లు చేస్తారని కూడా ఆరోపణలు వినవస్తుంటాయి.  ఇందులో చాలా వరకు నిజాలున్నప్పటికీ, అందరూ ఇలానే చేస్తారని చెప్పలేం. నిజాయితీగా,  ధర్మబద్ధంగా ఫీజులు వసూలు చేసేవారు కూడా చాలా మంది ఉంటారు. రూపాయి ఫీజుతో వైద్యం చేసే డాక్టర్లు కూడా అనేక మంది ఉన్నారు.  నాణానానికి రెండో వైపు ఉన్నట్లే, ప్రైవేటు ఆస్పత్రులు, ముఖ్యంగా చిన్న చిన్న ఆస్పత్రుల వారి బాధలు  వర్ణనాతీతం. డాక్టర్ పట్టా పొందగానే, ఆస్పత్రి ఏర్పాటు, నిర్వహణ అంత తేలికైన విషయం ఏమీ కాదు. దానికి చాలా తతంగాలు ఉంటాయి. ఆస్పత్రులు అంటే, ప్రభుత్వ నిబంధనలు అంత సామాన్యంగా ఉండవు. ఆస్పత్రి భవనానికి ప్లాన్ అనుమతి పొందే దగ్గర నుంచి డాక్లర్ల పాట్లు మొదలవుతాయి. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి(DMHO) అనుమతి నుంచి లేబర్ ఆఫీసర్,  పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫైర్ సేఫ్టీ (ఏ గవర్నమెంట్ బిల్డింగ్స్ కి ఉండదు)  మొదలైన అనుమతులు దాదాపు 11 వరకు పొందాలి. ఇన్ని అనుమతులు పొందడం మన వ్యవస్థలో ఎంత ఖర్చు, కాలంలో కూడుకున్నదో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు. ట్రేడ్ లైసెన్స్ పేరిట చదరపు అడుగుకి రోడ్ వెడల్పునిబట్టి మున్సిపాలిటీకి కట్టే ప్రాపర్టీ టాక్స్ భారీగా ఉంటుంది.అంతే కాకుండా, మునిసిపాలిటీకి ప్రొఫెషనల్ టాక్స్, వాయు కాలుష్య టాక్స్,   బెడ్ కి ఇంతని బయో వేస్ట్ ట్యాక్స్, జనరల్ వేస్ట్ టాక్స్... మొదలైనవి చెల్లించాలి. చిన్న పట్టణాలలో పాత భవనంలో ఆస్పత్రి ప్రారంభించాలనుకుంటే, పార్కింగ్ ప్రదేశం లేదని అనుమని ఇవ్వరు. ఏ ఇతర వ్యాపారానికి లేని నిబంధనలన్నీ ఆస్పత్రులకు ఉన్నాయి. విద్యుత్‌కు  వాణిజ్య ధర చెల్లించాలి. ఇక చందాల పేరుతో రాజకీయ పార్టీలు, పేపర్ ప్రకటనలు, కేలండర్ ప్రకటనలు, టీవీ ప్రకటనలు, యూట్యూబ్ చానల్ ప్రకటనల పేరుతో అనేక మంది వస్తుంటారు. ఇటీవల కాలంలో ఈ తాగికి ఎక్కువైపోయింది.  వారికి ఎంతో కొంత ఇవ్వాలి. ఎంత చిన్న ఆస్పత్రి అయినా ఇవన్నీ తప్పవు. వీటన్నిటిని దాటుకుని ఆస్పత్రి ప్రారంభించి, డాక్టర్ ప్రాక్టీస్ మొదలుపెడితే, పేషెంట్లు వచ్చేదానిపై ఆదాయం ఆధారపడుతుంది.  ముందు ఆ ఆదాయం ఆస్పత్రి నిర్వహణకు సరిపోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొన్ని కొన్ని సందర్భాలలో చికిత్స చేసే సమయంలో  రోగికి ఏదైనా జరిగితే, అందులో డాక్టర్ తప్పు ఉన్నా లేకపోయినా, రోగి బంధువులు తిరగబడుతుంటారు. ప్రైవేటు ఆస్పత్రుల వారు ఇటువంటి అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కనీస అనుమతులు లేకుండా,  నిబంధనలు పాటించని ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవలసిందే. అయితే, అదే సమయంలో నిజాయితీగా, నిబద్ధతతో వైద్య సేవలు అందించే ఆస్పత్రులను, డాక్టర్లను ప్రభుత్వం ప్రోత్సహించవలసి ఉంది. ప్రభుత్వ నిబంధనలన్నీ ముఖ్యంగా చిన్న చిన్న ఆస్పత్రులు పెట్టేవారికి భారంగా తయారయ్యాయి. వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని చిన్న ఆస్పత్రులు నిర్వహించే డాక్టర్లు వాపోతున్నారు. వైద్యం కార్పొరేట్ ఆస్పత్రులకే  పరిమితం అయ్యే విధంగా కాకుండా, చిన్న చిన్న  పట్టణాలలో పేద, మధ్యతరగతి వర్గాల వారికి వైద్యం అందించే విషయంలో మొదటి వరుసలో ఉన్న చిన్న ఆస్పత్రులు మనుగడ సాగించే విధంగా నిబంధనలు సవరించాలని వారు కోరుతున్నారు. 

 - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


No comments:

Post a Comment

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్  ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...