Nov 27, 2025

నచ్చిన వారిని ఎన్నుకునే స్వేచ్ఛ


భారత రాజ్యాంగానికి ఈ రోజుతో 76 ఏళ్లు నిండాయి. బ్రిటీష్ వారి పాలన నుంచి మనం స్వరాజ్యం సాధించింది 1947 ఆగస్టు 15న  అయినప్పటికీ పూర్తి స్థాయి రాజ్యాంగం కోసం మరో మూడేళ్లు ఆగవలసి వచ్చింది. అప్పటి వరకు కింగ్‌ జార్జి-5 సారథ్యంలో ప్రభుత్వం కొనసాగింది. స్వతంత్ర దేశానికి  రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం  దేశంలోని సుప్రసిద్ధ నాయకులు, అనుభవజ్ఞులు, విద్యావేత్తలు, న్యాయ కోవిదులు, వివిధ రంగాలకు చెందిన  ప్రముఖులు 284 మందితో 1946 డిసెంబరు 9న రాజ్యాంగ నిర్మాణ సభ లేక రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. అందులో 15 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరంతా  పరోక్ష ఎన్నిక ద్వారా రాష్ట్ర శాసనసభలు,  భారత్ సంస్థానాల నుంచి ఎన్నికయ్యారు. రాజ్యాంగ నిర్మాణ సభ  1947 ఆగస్ట్ 29న ముసాయిదా కమిటీని ఎన్నుకుంది.   భారత దేశ మొదటి న్యాయ శాఖ మంత్రి, న్యాయ, ఆర్థిక, రాజనీతి శాస్త్రాలలో నిష్ణాతుడైన  డాక్టర్  బాబా సాహెబ్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ అధ్యక్షత రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో ప్రముఖ న్యాయనిపుణులు ఏపీకి చెందిన అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, తమిళనాడుకు చెందిన, గోపాల స్వామి అయ్యంగార్,  గుజరాత్‌కు చెందిన కన్నయ్యలాల్ మాణిక్ లాల్ మున్షీ, అస్సామ్‌కు చెందిన సయ్యద్ మహ్మద్ సాదుల్లా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీఎల్ మిట్టల్, దేవి ప్రసాద్ ఖైతాన్ మొత్తం ఆరుగురు సభ్యులుగా ఉన్నారు. అనారోగ్య కారణంగా మిట్టల్ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో కర్ణాటకకు చెందిన న్యాయపతి మాధవరావు, ఖైతాన్ మరణించడంతో ఆ స్థానంలో తమిళనాడుకు చెందిన తిరువళ్లూర్ తట్టై  క‌ృష్ణమాచారి ఎంపికయ్యారు. ఈ కమిటీ మొత్తం 11 సార్లు సమావేశమై రాజ్యాంగ ముసాయిదాపై 165 రోజులు చర్చించింది. ముసాయిదాపై వచ్చిన 7,363 ప్రతిపాదనలు, సవరణలలో 2,473 అంశాలను చర్చించి, పరిష్కరించింది. ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసిన కమిటీ, వాటిలో ఉత్తమమైన వాటిని స్వీకరించింది.  ప్రజాస్వామ్య యుగంలో రాజ్యాంగానికి విశిష్ట స్థానం ఉంది.   రాజ్యాంగం దేశానికి గుండెకాయవంటిది.  ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని జాతులు, తెగలు, కులాలు, అణగారిన, పీడనకు గురైన వర్గాలు, అనేక మతాలు,  భాషలు, విభిన్న సంస్కృతులు మన దేశంలో ఉన్నాయి. వీటికి తోడు ఇక్కడ లింగ వివక్ష, అంటరానితనం వంటి పాశవిక ఆచారాలు ఉన్నాయి. అందువల్ల భారత రాజ్యాంగం రచించడం ఎంతో సంక్లిష్టతతో కూడుకున్న అంశం. రాజ్యాంగం అంటే  కేవలం ప్రభుత్వ వ్యవస్థ, దాని విధివిధానాలు, శాసన సభల రూపకల్పనే కాదు కోట్లాది ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను ప్రతిబింబించేదిగా ఉండాలి. భావితరాలకు సమ న్యాయం అందించాలన్న ఉద్దేశంతో డాక్టర్ అంబేద్కర్ సారధ్యంలోని ముసాయిదా కమిటీ మొత్తం  రెండు సంవత్సరాల 11 నెలల 17 రోజులపాటు  అవిశ్రాంతంగా శ్రమించింది. ఆ కమిటీ కృషి ఫలితంగానే సర్వోత్కృష్ఠమైన,  ప్రపంచంలోనే  అతిపెద్ద  భారత  రాజ్యాంగం రూపు దిద్దుకుంది.  కమిటీ అధ్యక్షుడు డాక్టర్ అంబేద్కర్  315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్‌తో కూడిన తొలి రాజ్యాంగ ముసాయిదాను  రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు  1949 నవంబరు 25న సమర్పించారు. ఆ రోజున డాక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ, ‘‘షెడ్యూల్ కులాల ప్రయోజనాలు పరిరక్షించే ఏకైక లక్ష్యంతోనే నేను రాజ్యాంగ సభలో అడుగుపెట్టాను. అత్యంత బాధ్యతాయుతమైన పనులను నాకు అప్పగిస్తారని నేను ఊహించలేదు. నిజానికి ముసాయిదా కమిటీలో నాకంటే సమర్థుడైన మిత్రుడు అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్ ఉన్నారు. అయినా, నా మీద నమ్మకం, విశ్వాసంతో దేశానికి సేవ చేసేందుకు నన్ను ఎన్నుకున్న ఈ సభకు నేనెంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సభ ఎంపిక చేసుకున్న మరో విలువైన వ్యక్తి చీఫ్ డ్రాఫ్ట్స్ మన్ ఎన్.ఎన్.ముఖర్జీ. ఆయన సహకారంలేకుంటే, రాజ్యాంగ రచనకు మరి కొన్ని సంవత్సరాలు పట్టేది. రాజ్యాంగం ఎంత మంచిదైనా,  దానిని అమలు చేయాల్సినవారు చెడ్డవారైతే, అది చెడు చేస్తుంది. అలాగే, ఒక రాజ్యాంగం ఎంత చడ్డదైనా, దాన్ని అమలు చేసేవారు మంచివారైతే, అది మంచే చేస్తుంది.’’ అని చెప్పారు. భారత రాజ్యాంగంపై సుధీర్ఘ మేధోమథనం జరిగిన తర్వాత, సరిగ్గా 76 సంవత్సరాల క్రితం  1949 నవంబర్‌ 26న  రాజ్యాంగ నిర్మాణ సభ భారత రాజ్యాంగాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.  సభ  ఆమోదించిన రాజ్యాంగంపై  1950 జనవరి 24న 284 మంది సభ్యులు సంతకాలు చేశారు. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ రోజునే మూడు సింహాలను జాతీయ చిహ్నంగా ఆమోదించారు. అప్పటి వరకు అమలులో ఉన్న బ్రిటీషు కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయిపోయింది. అదే రోజున రాజ్యాంగ సభ కూడా రద్దయింది. అయితే, అదే సభ 1952లో  మొదటి సాధారణ ఎన్నికలు జరిగి, కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు  తాత్కాలిక పార్లమెంట్ గా కొనసాగింది. రాజ్యాంగం ప్రకారం, భారత దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటైంది.  ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా భారత రాజ్యాంగం రూపుదిద్దుకుంది. రాజ్యాంగ పీఠికలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూడు అంశాలను అవిభాజ్యంగా పొందుపరిచారు. మన దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలు,  వివిధ మతాలు, సంస్కృలు, వేల కులాలను దృష్టిలో పెట్టుకుని, అందరికి ఆమోదయోగ్యమైన రీతిలో  భారత లౌకిక రాజ్యాంగాన్ని రూపొందించారు. మతాలతో సంబంధంలేకుండా దేశ పౌరులందరికీ ప్రాథమిక హక్కులు, ఓటు హక్కు కల్పించారు.  జాతీయ భాషలుగా 22 భాషలను గుర్తించారు.  జనాభా ప్రాతిపదికన ప్రతి రాష్ట్రానికి అధికారంలో భాగం ఉండే విధంగా పార్లమెంటరీ వ్యవస్థ(రాజ్యసభ, లోక్ సభ)ని రూపొందించారు. రాజ్యాంగం ప్రవేశికలోనే పౌరులకు సంబంధించిన ప్రాథమిక హక్కులు, సమ న్యాయం, సమానత్వం, సౌభ్రాత్రుత్వం వంటివాటితోపాటు  సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొన్నారు. అదే దీని ప్రత్యేకత. ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగం ఉన్నత విలువలతో కూడినదని  అంతర్జాతీయ స్థాయి న్యాయనిపుణులు పలువురు పేర్కొన్నారు. రాజ్యాంగం దేశ ప్రజలకు అనేక హక్కులతోపాటు  నచ్చిన వారిని పాలకులుగా ఎన్నుకునే స్వేచ్ఛను కూడా ప్రసాదించింది.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914




No comments:

Post a Comment

30న తెలంగాణ బార్ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక

ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...