నేడు భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు
భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ సుధీర్ఘ మేధోమధనం తర్వాత రూపొందించిన సర్వోత్కృష్ఠమైన భారత రాజ్యాంగాన్ని సరిగ్గా 75 ఏళ్ల క్రితం 1949 నవంబర్ 26న రాజ్యాంగ నిర్మాణ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బ్రిటీష్ పాలన నుంచి మనం స్వాతంత్ర్యం సాధించింది 1947 ఆగస్టు 15న అయినప్పటికీ పూర్తి స్థాయి రాజ్యాంగం కోసం మరో మూడేళ్లు ఆగవలసి వచ్చింది. మన దేశ రాజ్యాంగ రూపకల్పన కోసం దేశంలోని సుప్రసిద్ధ నాయకులు, అనుభవజ్ఞులు, విద్యావేత్తలు, న్యాయ కోవిదులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు 284 మందితో 1946 డిసెంబరు 9న రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పడింది. ఈ సభలో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న వారు, విద్యావంతులైన 15 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరంతా పరోక్ష ఎన్నిక ద్వారా రాష్ట్ర శాసనసభలు, భారత్ సంస్థానాల నుంచి ఎన్నికయ్యారు. రాజ్యాంగ నిర్మాణ సభ 1947 ఆగస్టు 29న ముసాయిదా కమిటీని ఎన్నుకుంది. న్యాయ, ఆర్థిక, రాజనీతి శాస్త్రాలలో నిష్ణాతుడైన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీలో ఉద్దండులైన న్యాయకోవిదులు ఉన్నారు.
భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ : మధ్య ప్రదేశ్‌కు చెందిన భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతలలో ముఖ్యులు. న్యాయ, ఆర్థిక, రాజనీతి శాస్త్రాలలో ఆరితేరిన దిట్ట. సంఘ సంస్కర్త. బొంబాయి విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్, రాజనీతి శాస్త్రంలో డిగ్రీ చదివారు.అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేశారు. 1927లోనే బంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా నామినేట్ అయ్యారు. 1930 రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. 1947లో కేంద్రంలో ఏర్పడిన మొదటి మంత్రి వర్గంలో న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాణ సభకు అందించిన 1949 నవంబర్ 25న చేసిన ప్రసంగం, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ‘‘షెడ్యూల్ కులాల ప్రయోజనాలు పరిరక్షించే ఏకైక లక్ష్యంతోనే నేను రాజ్యాంగ సభలో అడుగుపెట్టాను. అత్యంత బాధ్యతాయుతమైన పనులను నాకు అప్పగిస్తారని నేను ఊహించలేదు. నిజానికి ముసాయిదా కమిటీలో నాకంటే సమర్థుడైన మిత్రుడు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఉన్నారు. అయినా, నా మీద నమ్మకం, విశ్వాసంతో దేశానికి సేవ చేసేందుకు నన్ను ఎన్నుకున్న ఈ సభకు నేనెంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సభ ఎంపిక చేసుకున్న మరో విలువైన వ్యక్తి చీఫ్ డ్రాఫ్ట్స్ మన్ ఎన్.ఎన్.ముఖర్జీ. ఆయన సహకారంలేకుంటే, రాజ్యాంగ రచనకు మరి కొన్ని సంవత్సరాలు పట్టేది. ముసాయిదా ప్రతిని తయారు చేసిన రాజ్యాంగ సలహాదారు బీఎన్ కూడా అభినందనీయులు. రాజ్యాంగం ఎంత మంచిదైనా, దానిని అమలు చేయాల్సినవారు చెడ్డవారైతే, అది చెడు చేస్తుంది. అలాగే, ఒక రాజ్యాంగం ఎంత చడ్డదైనా, దాన్ని అమలు చేసేవారు మంచివారైతే, అది మంచే చేస్తుంది. అదృష్టవశాత్తు సభలో డాక్టర్ పీఎస్ దేశముఖ్, ప్రొఫెసర్ సక్సేనా, పండిట్ ఠాకూర్, ప్రొఫెసర్ కేటీ షా, పండిట్ హృదయనాథ్, కుంజ్రూ, కామత్, సిధ్వ, దాస్ భార్గవ్ వంటి తిరుగుబాటుదారులు ఉన్నారు. వారు లేవనెత్తిన అంశాలు సైద్ధాంతికమైనవి. ఆ సలహాలు నేను అంగీకరించలేదంటే, అవి విలువైనవి కావని అర్థం కాదు’’ అని స్పష్టం చేశారు.
సభ్యులు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ : ప్రముఖ న్యాయవాది. దాదాపు 15 ఏళ్లు మద్రాస్ రాష్ట్రానికి అడ్వకేట్ జనరల్ గా వ్యవహరించారు. నెల్లూరులో పుట్టిన తెలుగువారు. ముసాయిదా కమిటీలో ప్రధాన సభ్యుడు. రాజ్యాంగ సభకు సంబంధించిన ఇతర కమిటీల్లో కూడా ఉన్నారు. నిజానికి ముసాయిదా కమిటీలో తనకంటే సమర్థుడైన మిత్రుడు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఉన్నట్లు డాక్టర్ అంబేద్కర్ స్వయంగా పేర్కొన్నారు.
ఎన్. గోపాల స్వామి అయ్యర్ : రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రాసిన న్యాయకోవిదుడు నరసింహ గోపాలస్వామి అయ్యర్. తమిళనాడులోని తంజావూరులో జిల్లాలో పుట్టిన అయ్యర్ బ్రిటీష్ ప్రభుత్వంలో ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారిగా పనిచేశారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. నెహ్రూ మంత్రి మండలిలో రైల్వే, రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.
కేఎం మున్షీ: గుజరాత్ కు చెందిన కన్నయ్యలాల్ మాణిక్‌లాల్ మున్షి స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ న్యాయవాది, రచయిత. స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్న మున్షి 1938లో మహాత్మా గాంధీ సహాయసహకారాలతో భారతీయ విధ్యా భవన్‌ను ప్రారంభించారు. రాజ్యాంగ సభకు చెందిన పలు కమిటీల్లో కూడా ఈయన సభ్యుడుగా ఉన్నారు. కేంద్రంలో వ్యవసాయ, ఆహార మంత్రిగా పనిచేశారు.
మహ్మ ద్ సాదుల్లా : అస్సాంకు చెందిన ముస్లింలీగ్ నాయకుడు సయ్యద్ మహ్మద్ సాదుల్లా న్యాయవాదిగా మంచి గుర్తింపు పొందారు. 1936లో బ్రిటీష్ ఇండియాలో కాంగ్రేసేతర పార్టీల కూటమి ఏర్పాటు చేసి అస్సాంకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. రాజ్యాంగ రచనలో పాల్గొన్న ఒకే ఒక్క ముస్లిం సభ్యుడు. ఈశాన్య రాష్ట్రాల నుంచి ముసాయిదా కమిటీకి ఎన్నికైన ఒకే ఒక సభ్యుడు.
బీఎల్ మిట్టల్ : రాజరికంలో ఉన్న రాష్ట్రాలు దేశంలో విలీనం కావడానికి, రాష్ట్ర పాలకులు సంబంధించిన అంశాలపై పశ్చిమ బెంగాల్ కు చెందిన బీఎల్ మిట్టల్ కృషి చేశారు. అయితే, ఆనారోగ్య కారాణాలతో ఆయన ముసాయిదా కమిటీకి రాజీనామా చేయడంతో, ఆ స్థానంలో ఎన్. మాధవరావు ఎంపికయ్యారు.
ఎన్.మాధవరావు: మైసూర్ సివిల్ సర్వీస్ అధికారిగా పనిచేసిన మాధవరావు లండన్‌లో జరిగిన రౌండ్‌టేబుట్ సమావేశంలో పాల్గొన్నారు.
డీపీ ఖైతాన్ : భారతదేశంలో పురాతన ప్రైవేటు న్యాయవ్య సంస్థ ‘ఖైతాన్ అండ్ కో’ వ్యవస్థాపకులైన దేవి ప్రసాద్ ఖైతాన్ కొద్దికాలం మాత్రమే ముసాయిదా కమిటీలో సభ్యుడుగా ఉన్నారు. 1948లో ఖైతాన్ మరణించడంతో ఆయన స్థానంలో టీటీ కృష్ణమాచారి ఎంపికయ్యారు.
టీటీ కృష్ణమాచారి : తమిళనాడుకు చెందిన తిరువళ్లూరు తట్టై కృష్ణమాచారి 1937లో మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి, 1942లో సెంట్రల్ లెజిస్టేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి పనిచేశారు.
భారత రాజ్యాంగంపై సుధీర్ఘ మేధోమథనం జరిగిన తర్వాత, 75 సంవత్సరాల క్రితం 1949 నవంబర్ 26న రాజ్యాంగ నిర్మాణ సభ భారత రాజ్యాంగాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. సభ ఆమోదించిన రాజ్యాంగంపై 1950 జనవరి 24న 284 మంది సభ్యులు సంతకాలు చేశారు. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ రోజునే మూడు సింహాలను జాతీయ చిహ్నంగా ఆమోదించారు. అప్పటి వరకు అమలులో ఉన్న బ్రిటీషు కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయిపోయింది. అదే రోజున రాజ్యాంగ సభ కూడా రద్దయింది. అయితే, అదే సభ 1952లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగి, కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు తాత్కాలిక పార్లమెంట్ గా కొనసాగింది. రాజ్యాంగం ప్రకారం, భారత దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటైంది. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా భారత రాజ్యాంగం రూపుదిద్దుకుంది.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:
Post a Comment