Sep 7, 2026

టీడీపీ-వైసీపీలతో ప్రజలు విసిగిపోయారు..అందుకే కొత్త పార్టీ

వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పాయింట్స్ః-*

*- మా పార్టీ సీఎం అభ్యర్థి నేను కాదు..నా కుటుంబ సభ్యులూ కాదు..*

*- ఇప్పటివరకూ అధికారానికి దూరమైన కులాల నుండే సీఎం అవుతారు*

*- నా పొలిటికల్ గాడ్ ఫాదర్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే..*

*- ఆ 5 అంశాలపైనే మా నూతన పార్టీ మేనిఫెస్టో.. దసరా తర్వాత పార్టీ ఆవిర్భావం*

*- జెన్-జీకి 66 శాతం సీట్లు..*

*- రైతులకు,గృహావసరాలకు ఉచిత కరెంటు*

*- బలవంతపు మత మార్పిడులు ఇప్పుడూ ఉన్నాయి.. గతంలోనూ ఉన్నాయి..*

*- మత మార్పిడులకు పాల్పడితే.. మా ప్రభుత్వంలో యూపీ తరహా ట్రీట్ మెంటు.* 


*-ః శ్రీ విజయసాయిరెడ్డి*


విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ..


- నేను ఏర్పాటు చేయబోయే నూతన రాజకీయ పార్టీ జెండా-అజెండా ప్రకటించేటటువంటి క్రమంలో భాగంగా, ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ, ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ (థర్డ్ వైబుల్ పొలిటికల్ అల్టర్ నేటివ్ పార్టీ)అవసరమైంది అనే విషయాలను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీముందు ఉంచదలచుకున్నాను.


- రాష్ట్రంలో ప్రధానంగా రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాటితోపాటు జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, మరికొన్ని నూతనంగా ప్రారంభించిన పార్టీలు... ఇవాళ ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికిగానీ, వాటి మీద పోరాడే పటిమనుగానీ చూపించటం లేదనే పరిస్థితుల్లో.. కొత్త రాజకీయ పార్టీ ఆవశ్యకత ఉందని నేను భావిస్తున్నాను.


- ఆంధ్ర రాష్ట్రంలో ఈ రెండు పార్టీల చుట్టు మాత్రమే రాజకీయం తిరుగుతుంది. మొదటిది టీడీపీ-రెండోది వైఎస్ఆర్సీపీ. ఒకసారి టీడీపీ అధికారంలోకి వస్తే.. రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న భావన వారిలో నెలకొంది. 


- ఈ రెండు రాజకీయ పార్టీలు.. ఇవాళ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నాయి.  రెండు ఫ్యాక్షన్ రాజకీయ పార్టీలుగా అవతరించాయి. ఇందులో మొదటిది రెడ్ బుక్ పార్టీ టీడీపీ, రెండోది రప్పా.. రప్పా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈ రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతుంది. 


- ఆ యుద్ధంలో పోలీసులు న్యాయం వైపు పనిచేయాలేగానీ, అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా పని చేయడం దురదృష్టకరం. దీనిని మనమంతా ఖండించాల్సిన అవసరం ఉంది. 


- ఈ రెండు పార్టీల మధ్య ప్రజలు నలిగిపోతూ,మరోవైపు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతూ ఉంది, ఇంకోవైపు ప్రజలకు భద్రత లేకుండా పోవడంతో, కొత్తగా రాజకీయ పార్టీ ఆవిర్భవించవలసిన అవసరం ఉందన్నది నా భావన.


- ఈ రెండు పార్టీలు ఎందుకు కొట్టుకుంటున్నాయి..!? రాష్ట్రంలో ఉన్న కోటి 50 లక్షల కుటుంబాలు, అంటే, 6 కోట్ల ప్రజానీకానికి సంబంధించిన రాష్ట్ర సంపదను ఎవరు దోచుకోవాలనే దానిపైనే ఈ రెండు పార్టీలు పని చేస్తున్నాయి. ఇది రాష్ట్ర ప్రజల దురదృష్టం. 


- ఈ రెండు కుటుంబాలకు చెందిన ఈ పార్టీల రాజకీయ అజెండా ఒక్కటే.." ప్రజలకు గోరంత- మాకు కొండంత.." అనే ఒకే ఒక్క సిద్ధాంతంతో వీళ్ళు ముందుకు వెళుతున్నారు. వీరిద్దరి ధ్యేయం ఒక్కటే, పొలాల్లో మట్టి తీసుకున్నా, వాగుల్లో ఇసుక తీసుకున్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, ఏ పర్మిషన్ కావాలన్నా, ఎన్ వోసీ కావాలన్నా, వ్యాపారం చేసుకోవాలన్నా రౌడీ మామూళ్ళు కట్టాలి., రాజకీయ నాయకులకు, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, పాలనలో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ రౌడీ మామూళ్ళు చెల్లించినదే  పనులు పూర్తి కావు.


- నిద్ర లేస్తే.. ఈ ఒక్క రాజకీయ పార్టీల నాయకులకు సెటిల్ మెంట్లు, దందాలు చేయడం రొటీన్ యాక్టివిటీగా మారింది. గత ఎన్నికల్లో రూ. 20 కోట్లు, 40 కోట్లు ఖర్చు పెట్టాను.. వాటిని రికవరీ చేసుకోవాలి, రాబోయే ఎన్నికలకు మళ్ళీ కూడబెట్టుకోవాలనే లక్ష్యంతోనే ఈ పార్టీల నాయకులు పనిచేస్తున్నారు. 


- గతంలో తమిళనాడులో ఏ తరహా రాజకీయాలు ఉండేవో.. ఆ తరహా రాజాకీయాలను ఈ పార్టీల వారు, ఏపీకి తీసుకొచ్చారు. ఎవరు అధికారంలో ఉంటే.. ప్రత్యర్థులపై కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేసి జైలుకు పంపించడం అజెండాగా మారింది.


- ప్రజల శ్రేయస్సుకోసం ముందుకు వెళతాం, నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తాం..  అన్న దృక్పథాన్ని వదిలేసి.. రక్తాన్ని పారిస్తామన్న ధోరణిలో ఈ రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి. 


- ఆడబిడ్డల్ని రోడ్ల మీద వివస్త్రను చేసి కొట్టినా, హత్యలు చేసినా, ఆత్మాభిమానంతో గోదావరి నదిలో దూకినా.. వీళ్ళు పట్టించుకోవడం లేదు. 


- రాష్ట్రంలో... ఎంతసేపటికి లక్షల కోట్లు సంపాదించుకోవాలన్న ధ్యేయంతో ఈ రెండు పార్టీల రాజకీయ నాయకులు ముందుకు వెళుతున్నారు. 


- రాష్ట్రంలో కోటి 50 లక్షల కుటుంబాల తరఫున మాట్లాడేటటువంటి రాజకీయ పార్టీనే లేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. 6 కోట్ల ప్రజానీకం కోసం ఈ రెండు పార్టీలు ఉన్నాయా...!? లేక, ఈ రెండు కుటుంబ రాజకీయ పార్టీల కోసం 6 కోట్ల ప్రజానీకం ఉన్నారా..!? అన్నది ప్రజలు గమనించాలి. 


- అందుకే ఈ కొత్త రాజకీయ పార్టీని నిర్మించాలన్న ఆశయంతో ప్రజల ముందుకు వస్తున్నాను. నాపైన చేసిన ఆరోపణలకు నిజానిజాలు ఏమిటనేవి మీరే తెలుసుకోండి. 


సీఎం అభ్యర్థి నేను కాదు..


- స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేను ఉండటం లేదు. ఈ రాష్ట్రంలో రెండు కుటుంబాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా..!? రెండు రాజకీయ పార్టీలు మాత్రమే పరిపాలించాలా..!? రాష్ట్రంలో రెడ్లు, కమ్మ వాళ్ళు మాత్రమే కాదు.. చాలా కులాలు, బీసీల్లో 140 కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, క్రైస్తవులు మొత్తం 6 కోట్ల మంది ప్రజానీకం ఉన్నారు. ప్రధానమైన కులాల్లో రెడ్డి, కమ్మ కాకుండా, కాపులు ఉన్నారు, వెలమలు ఉన్నారు.  కాపులు, వెలమలు, బీసీవర్గాలు, రజకులు, ఎస్సీలు సీఎం కాలేదే.. !?  ఎందుకు!? వాళ్ళల్లో సామర్థ్యం ఉన్న వాళ్ళు లేరా..!? ఉన్నారు.  వాళ్ళను అణగదొక్కుతూ, ఈ రెండు వర్గాలు మాత్రమే అధికారంలోకి వస్తున్నాయి. పదవులను ఆక్రమించుకుంటున్నాయి. 


- నా కుటుంబ సభ్యులు కూడా సీఎం అభ్యర్థులు కాదు. ఎవరైతే సామర్థ్యం ఉంటుందో, అనుభవం ఉంటుందో, రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించగలరో,  ఏకులానికి చెందిన వారైనా సీఎం అయ్యే అవకాశం కొత్తగా పెట్టబోయే రాజకీయ పార్టీలో ఉంటుంది.. అని నేను నమ్మిన వెంకటేశ్వరస్వామి సాక్షిగా చెబుతున్నాను. 


- నా రోల్ ఎలా ఉంటుందంటే.. ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో బాల్ థాక్రే మాదిరిగా ఒక మెంటర్ గా ఉంటూ, ఎలా ప్రభుత్వాన్ని నడిపించారో, అలానే సలహాలు, సూచనలు మాత్రమే నేను ఇస్తాను. 


- సీఎం అభ్యర్థికి సామర్థ్యంతోపాటు ముఖ్యంగా దేశ భక్తి ఉండాలి అని నొక్కి నొక్కి చెబుతున్నాను. 


- రాజకీయ సన్యాసం అన్నారు.. ఎందుకు రెండేళ్లు మాట్లాడలేదని అడగవచ్చు. రెండేళ్లు నేను మౌనంగా ఉండలేదు.  మనం ఏ కులంలో పుట్టాలో మనం కోరుకోం. ఏడాది పాటు నేను ఒక పుస్తకం కోసం కృషి చేశాను. అది యాథృచ్ఛికమే. రెడ్డి సామాజికవర్గం ఎలా ఆవిర్భవించింది. కాపుల నుంచి రెడ్డి సామాజిక వర్గం గ్రామాల్లో గ్రామ పెద్దలుగా ఉండి, ఈ సామాజికవర్గం ఎలా ఉద్భవించింది. రెడ్డి రాజులు ఎలా పరిపాలించారు..? అనే దానిపై 350 పేజీల పుస్తకాన్ని రచించాను. చరిత్రకారుల నుంచి, బ్రిటీష్ కాలం నాటి రికార్డుల నుంచి, వాస్తవాలను మాత్రమే ఈ పుస్తకంలో పొందుపరిచాను. ఈ పుస్తకాన్ని ఎడిటింగ్ కు ఇచ్చాను. తర్వాత అనువదిస్తాం. అడిగిన ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకం ద్వారా, సంవత్సరం రోజుల కృషిని నేను ప్రజల దృష్టికి తీసుకు వస్తాను.  ఇది క్యాస్ట్ ఫీలింగ్ తో చేసింది కాదు. నాకు ఇంట్రస్ట్ కొద్దీ ఈ పని చేశాను. 


ఆ 5 అంశాలే.. మా పార్టీ మేనిఫెస్టో..


- 5 అంశాలను మీ దృష్టికి తీసుకు వస్తాను. అవే పెట్టబోయే మా పార్టీకి మేనిఫెస్టోగా ఉంటాయి. నేను ప్రెస్ మీట్ లు పెట్టబోయే, అనంతపురం, విశాఖ, తిరుపతిలో మూడు ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టి చర్చించడం జరుగుతుంది. మీరు కూడా సలహాలను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. 


- ఖర్చు కన్నా ఆదాయం తక్కువగా ఉంది. 80 శాతం మంది ప్రజలకు ఈ పరిస్థితి ఉంది. ఖర్చులు ఎలా తగ్గించాలి, ఆదాయం ఎలా పెంచాలి. 80 శాతం మంది ప్రజలు ఏదో ఒక అప్పుల ఊబిలో ఇరుక్కుని ఉన్నారు. వీరంతా ఎలా అప్పుల ఊబిలో నుంచి బయట పడాలి, ఆదాయ వనరులను ఎలా పెంచాలి.


- నిత్యావసరాలు పెరుగుదలః ఉప్పు, పప్పు నుంచి కరెంటు బిల్లులు.. అన్నీ పెరుగుతూ వస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఎలా తగ్గించాలని చర్చిస్తాం. 


- ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు రూ. లక్షా 2 వేల కోట్ల అప్పు ఉంటే.. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో పది-పన్నెండు లక్షల కోట్లకు పెరిగిందని అంటున్నారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు ఉంది..? గ్యారెంటీలు ఎంత? కేంద్రం నుంచి తీసుకున్న రుణాలు ఎంత? ఇవన్నీ తీసుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 12 లక్షల కోట్ల అప్పు ఉంటే.. వీళ్ళు రాష్ట్రాభివృద్ధికి ఏం చేశారు. ఇది ఎవరి జేబుల్లోకి ఎంత పోయిందని ప్రశ్నిస్తున్నాను. 


- అమరావతి క్యాపిటల్ ను నేను వ్యతిరేకించటం లేదు. శివరామకృష్ణన్ నివేదిక ప్రకారం రాజధాని లేదు అని గుర్తించి, దానిని అనుసరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం చెప్పాను. సుమారు రూ. 70 వేల కోట్లు రాజధాని మీద ఖర్చు పెట్టిన తర్వాత, అమరావతిని మార్చాలనుకోవడం అవివేకం. ఇష్టం ఉన్నా, లేకపోయినా అదే రాజధాని, వ్యతిరేకించకూడదు. రాజధాని అభివృద్ధి పేరుతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయవద్దు. ప్రభుత్వంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి, అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకురండి, ప్రజల డబ్బులను దుర్వినియోగం చేయొద్దు అని చెబుతున్నాను.


జెన్-జీకి 66 శాతం సీట్లు..

1- ఈ ప్రభుత్వాలు జెన్-జీకి ఎందుకు భయపడుతున్నాయి..? యువత, రాష్ట్రంలోగానీ, దేశంలో గానీ తిరగబడతా ఉంది. ప్రభుత్వాలు చేస్తున్న తప్పుడు పనులను జెన్ - జీ ప్రశ్నిస్తున్నారు కాబట్టే, ప్రభుత్వాలు భయపడతూ ఉన్నాయి. ప్రశ్నిస్తున్నారు కాబట్టే ప్రభుత్వాలు భయపడుతున్నాయి.  

- కొత్తగా పెట్టబోయే పార్టీలో, ఇవాల్టికి 22 ఏళ్ళు పూర్తి అయినవాళ్ళకి,  2029 నాటికి 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటే, వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, అది అసెంబ్లీగానీ,  పార్లమెంటుగానీ, స్థానిక ఎన్నికలుగానీ.. 25-40 ఏళ్ళ యువతకు అన్ని పదవుల్లో 66 శాతం సీట్లు కేటాయిస్తాను. అది ఏ కులం అయినా కావచ్చు. ఏ కులం అయినా,  సామర్థ్యం ఉన్న తెలివైన యువతను ప్రోత్సహిస్తూ.. 66 శాతం వారికి కేటాయిస్తాను. 


రైతులకు, గృహావసరాలకు ఉచిత కరెంటు..

2- విద్యుత్ః  వైఎస్ఆర్ గారు రైతులకు ఉచిత కరెంటు ఇచ్చారు.వాస్తవానికి, రైతులకుగానీ, గృహావసరాలకు గానీ ఉచిత విద్యుత్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ ఖజానా మీద భారం పడకుండా, కేంద్రం ఇచ్చే సబ్సిడీతో, రాష్ట్రం కూడా సబ్సిడీ ఇస్తే,వాటితో సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే, నామినల్ పెట్టుబడితో, ప్రజలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయవచ్చు. ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క రైతుకు ఉచితంగా కరెంటు ఇస్తాం. మా పార్టీ ఈ విధంగా ప్రయాణం చేస్తుంది. గత ప్రభుత్వాలు ఎందుకు ఇలా పనిచేయలేదు. ఎందుకంటే,   విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీల నుంచి కరెంటు కొనుగోలు చేస్తేనే.. రాజకీయ పార్టీలకు, అధికార పార్టీకిగానీ కమీషన్లు వస్తాయి. ఆ విధంగా రేట్లు పెంచేసి, తద్వారా కమీషన్లు గుంజుకుంటాయి. ఇవేవీ లేకుండా, ఏపీని సోలార్ రాష్ట్రంగా మారుస్తాం. ప్రజలే ప్రభుత్వానికి కరెంటు అమ్మే పరిస్థితిని తీసుకువస్తాను. పరిశ్రమలకు తప్ప మిగతా వారికి ఉచిత కరెంటు ఇస్తాం. 


పెట్రో ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించి, ధరలు తగ్గిస్తాం..

3- ధరలు తగ్గించాలిః ధరలు తగ్గించాలంటే.. పెట్రోలియం ప్రొడక్ట్స్ ధరల ప్రభావం ఉంటుంది. వీటి ధరలు పెరిగినంతకాలం.. మనం నిత్యావసర సరుకుల ధరలు తగ్గించలేం. మన రాష్ట్రంలో దేశంలోనే అత్యధికంగా ఏపీ, తెలంగాణలో  జీఎస్టీ 31 శాతం విధిస్తున్నారు. అతి తక్కువ అరుణాచల్ ప్రదేశ్ లో 15 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో 31 శాతం జీస్టీ కాకుండా, రూ. 4 అదనంగా వసూలు చేస్తున్నారు. అంటి, ఇంచుమించుగా 40 శాతం పన్నులు విధిస్తున్నారు.  35 నుంచి 15 శాతానికి పన్నులు తగ్గించగలిగితే..రాష్ట్ర ఆదాయం కోల్పోయినా ఫర్వాలేదు, ప్రజల ఆదాయం పెరగాలంటే, ఇది చేయాలి. పెట్రోలు ధర రూ. 100 కు మించకుండా చేసి, నిత్యావసరాల రవాణా ఖర్చులు తగ్గించి, నిత్యావసరాల ధరలు తగ్గించి,  ప్రజల ఆదాయాన్ని పెంచాలి. 


3000 టీఎంసీలకు నీటి నిల్వలు పెంచుతాం..

4- నీటి పారుదలః ఈ రాష్ట్రంలో నీటి నిల్వ సామర్థ్యం 1000 టీఎంసీలు. వాస్తవానికి, మనకు అవసరం-1500 టీఎంసీలు ఉంది. 1200 టీఎంసీలు ఉన్నా.. తెలంగాణ భాగస్వామ్యం వల్ల మనకు రావటం లేదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు గారిని అడిగితే, ఎల్ నినో, వస్తుంది. సాగునీరు, తాగు నీరు ఇబ్బంది వస్తుంది అని చెబుతున్నారు. వరి పంట వేయొద్దు అని చెప్పటం తప్పు. మీరు నిజంగా విజినరీ అయితే, 1000 టీఎంసీల కెపాసిటీని.. మూడింతలు పెంచి ఉండేవాళ్లు. పెంచితే, రెండేళ్లు నిరంతరాయంగా  కరవు వచ్చినా మనకు సాగునీరు, తాగు నీరుకు ఇబ్బంది రాదు. దీనికి ట్రిబ్యునళ్ళు అంగీకరిస్తాయా అని అడగవచ్చు. మరి, ఎవర్ని అడిగి తెలంగాణ, కర్ణాటకలో ప్రాజెక్టులు కట్టారు. !?


- సముద్రంలో కలిసే నీరు 4000 టీఎంసీలు ఉంది. వర్షాలు బాగా పడితే 5500 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. వీటిని రిజర్వాయర్లలోకి ఎలా మళ్లించాలి, ఎలా సాగు, తాగు నీటిగా మార్చుకోవాలి అన్నది ఆలోచించాలి. మా పార్టీ అధికారంలోకి వస్తే.. 1000 టీఎంసీల కెపాసిటీని, మూడింతలు పెంచి, అంటే 3000 టీఎంసీలు నిల్వ చేసే సామర్థ్యాన్ని పెంచి, రెండు, మూడేళ్లు కరవు వచ్చినా, రైతులకు సాగు, ప్రజలకు తాగు నీటికి ఇబ్బంది పడకుండా చేస్తాం. 


 - మరోవైపు రైతులకు సేవలు అందించాల్సిన అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు... ఎలా దోచుకుంటున్నాయో అన్ని ప్రభుత్వాల్లో చూస్తున్నాం. 


- ఈ రెండు రాజకీయ పార్టీలు మారవు. ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నంత వరకూ నీళ్ళు దొరకవు. ఎల్ నినోలు వస్తానే ఉంటాయి. వ్యవసాయం దెబ్బతింటుంది. రైతులు బతకరు. ఒక పార్టీని మరొకరు నిందించుకుంటూనే కాలం వెళ్ళబుచ్చుతారు. అందుకే ప్రత్యామ్నాయ పార్టీ అవసరం. 



ఏపీపీఎస్సీ-డీఎస్సీ స్కాంలపై సీబీఐ విచారణ జరగాలి..

5- విద్య.. యువతరానికి కావాల్సింది, విద్య, ఉద్యోగం. ఉద్యోగాలు వచ్చే విద్య వారికి కావాలి. ఉద్యోగాలు రానటువంటి కోర్సులను విస్మరించాలి. మాన్యుఫ్యాక్చరింగ్ రంగాన్ని అభివృద్ధి చేయాలి. టీచర్లపై ఓవర్ బర్డన్ కూడా తగ్గించాలి. చదువు చెప్పటం వరకే వారిని పరిమితం చేయాలి. మేం అధికారంలోకి వస్తే అదే చేస్తాం. 


- గత ప్రభుత్వంలో జరిగిన ఏపీపీఎస్సీ స్కాంగానీ- ఈ ప్రభుత్వంలో జరిగిన డీఎస్సీ స్కాం గానీ.. రెండింటినీ నేను ఒప్పుకుంటాను. రెండింటిపై సీబీఐ విచారణ వేయాలని ప్రతిపక్షం అడుగుతుంది. ఈ  రెండింటినీ సీబీఐకి ఇచ్చి, నిష్పాక్షికంగా విచారణ చేసి, తప్పు చేసిన వారిని శిక్షించాలి. 


- ఏ రిక్రూట్ మెంటు అయినా పారదర్శకంగా జరగాలంటే, యూపీపీఎస్సీ, ఏపీపీఎస్సీ తరహాలో,  టీచర్ ఉద్యోగాలకు కూడా, ఆంధ్రప్రదేశ్ టీచింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేసి, వ్రాత పరీక్ష, ఇంటర్వూ పాస్ అయితేనే ఉద్యోగాలు కల్పిస్తాను అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మేం అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ టీచింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేస్తాం. 


- 2014లోగానీ, 2019లోగానీ చంద్రబాబు గారు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఈరోజు దాని గురించి మాట్లాడరు. నిరుద్యోగులను గాలికి వదిలేశారు. 

- అధికారంలోకి వస్తే.. ఈ సమస్య పరిష్కారానికి, కేంద్రం ప్రతిపాదించినట్టుగా, గ్రాడ్యుయేట్ బ్రిడ్జ్ అలవెన్స్, అంటే నిర్ణీత కాలం, యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయి, బయటకు వచ్చిన ప్రతి ఒక్క నిరుద్యోగికి, నిర్ణిత కాలం నాలుగేళ్ళో, ఐదేళ్ళో అలవెన్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఉదాహరణకు,  పనికి ఆహార పథకం కూలీలకు ఉంది. నిరుద్యోగ యువతకు అటువంటి పథకాలేవీలేవు. వారికి ఉద్యోగాలు లేవు. యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చి ఏం చేయాలో తెలియదు. వీరికోసం గ్రాడ్యుయేట్ బ్రిడ్జ్ అలవెన్స్ ఏర్పాటు చేస్తాం. 


- విద్యకు సంబంధించి టీడీపీకి ఒక లక్ష్యం ఉంది.. అదేంటంటే, ప్రభుత్వ బడులను బలహీనం చేసి, నారాయణ, చైతన్యలను బలోపేతం చేయాలన్నదే చంద్రబాబు గారి విధానం. 16 ఏళ్ళుగా చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు అదే జరుగుతూ ఉంది.  ఆయన హయాంలో ప్రభుత్వ బడులు మూసివేయడం జరిగింది. ప్రశ్నా పత్రాలు ఎలా లీక్ అవుతున్నాయి. ఈ ప్రైవేట్ సంస్థలకే ఎందుకు ర్యాంకులు వస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివితే ర్యాంకులు ఎందుకు రావు అనే భావన ఎందుకు ఉంది. దీనికి కారకులు ఎవరు?. మేం అధికారంలోకి వస్తే.. ప్రభుత్వ బడులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి అభివృద్ధి చేస్తాం. 


- నీటి పారుదల, సోలార్ విద్యుత్, పెట్రో, డీజిల్ ధరలు తగ్గింపు- నిత్యావసర సరుకుల ధరలు తగ్గింపు, ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్, రైతుకు రెండు పంటలకు ఉచిత విద్యుత్, లోన్ యాప్ లకు చెక్ పెట్టి, వారిని చట్ట పరిధిలోకి తీసుకురావడం, ప్రజల ఆదాయాన్ని ఎలా పెంచడం, 66 శాతం సీట్లను 25-40 ఏళ్ళ మధ్య యువతకు కేటాయించడం..,మిగతా 34 శాతం సీనియర్లు, రాజకీయ అనుభవం కలిగిన సీనియర్లకు అవకాశం కల్పించడమే మా పార్టీ అభిమతం . ఎందుకంటే, 40 ఏళ్ళ లోపు యువత దేశంలో 66 శాతం ఉన్నారు. అందులో 33 శాతం యువ మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది. 


- మీ వెనక ఏ నాయకుడు లేడే.. ఎలా సాధిస్తారని మీరు అడగవచ్చు.. ఒక్క 6 నెలలు ఆగండి. ఎంతమంది వస్తారో.. మీరే మీ కళ్ళతో చూస్తారు. యువతే మా పార్టీకి ప్రాణం. 


- తర్వాత అనంతపురంలో ప్రెస్ మీట్.. ఆ తర్వాత విశాఖ.. తిరుపతి.లో ప్రెస్ మీట్ పెడతాను. ఆ తర్వాత కాన్ క్లేవ్ పెట్టి పార్టీ పేరు, జెండా ప్రకటిస్తాను. విజయ దశమి తర్వాత, అది మరుసటిరోజు అయినా కావొచ్చు, పార్టీ స్థాపన జరుగుతుంది. ప్రాంతీయ పార్టీ మాది. ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం. 


మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..


- సంక్షేమాన్ని, అభివృద్ధి మధ్యలో సమతుల్యత పాటిస్తూ.. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడమే మా కొత్త పార్టీ లక్ష్యం. 


- ఈ రాష్ట్రం దేశంలో ఒక భాగం. రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి దేశ భక్తి ఉండాలి. లేకపోతే, రాష్ట్రం ముక్కలు చెక్కలు అవుతుంది. 


- రెడ్డి కుటుంబంలో పుట్టినా కూడా, పెట్టబోయే పార్టీలో కూడా రెడ్డి, కమ్మలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం అని కాదు. మిగతా కులాల్లో ఎవరికైనా అధికారంలో అవకాశం ఉంటుంది. నాకు, నా కుటుంబానికి తప్ప. 


- ప్రజా ధనాన్ని దోచేసిన వ్యక్తి అని మాట్లాడిన వ్యక్తి.. ఈరోజు ఈ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు. నేను దోచుకుని ఉంటే.. నాపై చర్యలు తీసుకోండి. నాపైన కేసులు పెట్టండి. అరెస్టు చేయండి. ఉత్తుత్తి ఆరోపణలు ఎందుకు.. బహిరంగ సవాల్ విసురుతున్నాను. 


- పార్టీ కోసం తమిళనాడులో విజయ్ జోసెఫ్ ఎంత ఖర్చు పెట్టారు. నా ఇమేజ్ ఏంటో మీరే చూస్తారు. మరో మూడేళ్ళలో మా పార్టీ ఏ విధంగా ముందుకు వెళుతుందో మీ కళ్ళతో మీరే చూస్తారు. 


- టీడీపీ-వైసీపీ ఇద్దరూ నాకు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే. నాకు శత్రువులు కాదు. వైసీపీలో కోటరీ కూడా ప్రత్యర్థులే. శత్రువులు కాదు. 


- కేఏ పాల్ పార్టీ అని మాట్లాడితే.. కేఏ పాల్ మంచోడు కాదనా.. అలా మాట్లాడిన వ్యక్తి ఉద్దేశమా..? అలా మాట్లాడిన వ్యక్తి ఎన్ని పార్టీలు మారాడు. అతని చరిత్ర ఏంటి. ఆయన చేసిన ఘోరాలు ఏమిటి!? విజయమ్మ గారిని ఏ విధంగా తిట్టాడు. వైఎస్ఆర్ గారి గురించి ఏం మాట్లాడాడు..  వాస్తవాలను మీరే అర్థం చేసుకోవచ్చు. 


- నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లకు నేను వ్యతిరేకిని కాదు. దేశ భక్తి ఎవరిలో ఉంటుందో, ఎవరైతే చట్టాన్ని గౌరవిస్తారో, ఎవరైతే హత్యలు చేయరో, ఎవరైతే మానభంగాలు చేయరూ వారందర్నీ నేను సమర్థిస్తాను. క్రిస్టియన్ వ్యతిరేకి, ముస్లిం వ్యతిరేకి అనటం కరెక్టు కాదు. ఆరోజు కాకినాడలో లవ్ జీహాద్ ఘటనలో ముస్లిం యువకుడు అవటం యాధృచ్ఛికమే అయినా, గుంటూరులో జరిగిన ఘటనలో, లవ్ జీహాద్   కాదని ఎస్పీ గారు చెప్పినా వీటిపై చర్చ జరగాలి. 


- ఇప్పటికి నేను ఎవరితో కలిసి పోటీ చేయాలనే ఉద్దేశం లేదు. భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయో చూడాలి. మా పార్టీకి కాబోయే ముఖ్యమంత్రి, ముస్లిం, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా కావొచ్చు..


- 40 ఏళ్ళు వైఎస్ కుటుంబానికి పనిచేసిన మాట వాస్తవమే.. ఏ కారణాల వల్ల బయటకు వచ్చానో, ఏ కారణాల వల్ల నన్ను బయటకు గెంటారో.. నేను బహిరంగ లేఖలో చెప్పాను. ఆ విషయాలను ఛాలెంజ్ చేసి, కోటరీ చాలా మంచిది అని నా లేఖను ఖండిస్తే.. మరికొన్ని విషయాలను మరో బహిరంగ లేఖ ద్వారా వివరిస్తాను. నన్ను నమ్మక ద్రోహి అంటే.. ఎలా ఎదుర్కొంటానో మీడియా ద్వారా చెబుతాను. 


-నా పొలిటికల్ గాడ్ ఫాదర్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే. 


- బలవంతపు మత మార్పిడులపై.. మత మార్పిడులు కేవలం గత ఏడేళ్లలో మాత్రమే జరిగినవి కాదు. అంతకు ముందు కూడా జరిగాయి. ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారికి యూపీ తరహా ట్రీట్ మెంట్ ఉంటుంది. ఈరోజు బలవంతపు మత మార్పిడులు జరగటం లేదని చంద్రబాబు గారిని చెప్పమనండి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీని చెప్పమనండి. ఈ రాష్ట్రం విడిపోయిన-2014 నుంచి..  2019 వరకు, 2019 నుంచి 2024 వరకు, 2024 నుంచి 2026 వరకు ఎన్ని మత మార్పిడులుజరిగాయి.. ఎంత మంది పార్టీ టికెట్ ఆశావహులు మతాలు మారారు.. అన్నీ మీరే మీడియాలో చూస్తున్నారు.నేను చెప్పేది ఏమిటంటే, గతంలో మత మార్పిడులు ఉన్నాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. 


- నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను. 140 బీసీ కులాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీలు ఉన్నారు. సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరైనా సీఎం కావొచ్చు. 


- తప్పకుండా పాదయాత్ర చేస్తా. కేవలం రోడ్ల మీద నడవను. రాష్ట్రంలోని 660 మండలాలకు వెళ్ళి ప్రజల మధ్య నేను పాదయాత్ర చేస్తాను. గిన్నీస్ బుక్ రికార్డుల కోసం మాత్రమే నేను పాదయాత్ర చేయను... అని విజయసాయిరెడ్డి గారు స్పష్టం చేశారు. 

-----

No comments:

Post a Comment

నేడు మంగళగిరి మున్సిపాలిటీ మొట్టమొదటి చైర్మన్ గోలి గోపాలరావు 36వ వర్ధంతి

1969  అక్టోబర్ 1 వ తారీఖు మంగళగిరి "గ్రామ పంచాయితీ" స్థాయి నుండి "మున్సిపాలిటీ" హోదా పొందినది. 1971 లో మంగళగిరి మున్సిపా...