Aug 22, 2026

తెలుగువారు గర్వించతగ్గ ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త రాధాకృష్ణ




నేడు ప్రొఫెసర్ రావు వర్ధంతి


తెలుగువారు గర్వించతగ్గ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ గణాంక శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణా రావు.  మన దేశంలో 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసిన ఆయన, ఆ తర్వాత కుమార్తె తేజస్విని, ఆమె పిల్లలతో ఆనందంగా గడిపేందుకు  అమెరికా వెళ్లి, అక్కడ కూడా ప్రొఫెసర్‌ గా కొనసాగారు. పరిశోధనల్లోనే ఆయన ఆనందించేవారు.  75 ఏళ్ల వయసులో అమెరికన్ పౌరసత్వం పొంది, 102 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతితో సమానమైన అత్యున్నత ‘అంతర్జాతీయ గణాంక బహుమతి-2023’పొందారు. ఆ విధంగా మన తెలుగువాడైన   రాధాకృష్ణా రావు  20 శతాబ్ధంలోనే ఓ విశిష్ట వ్యక్తి. ప్రస్తుతం  కర్ణాటక రాష్ట్రంలోని విజయనగరం జిల్లా,  హూవిన హడగలి పట్టణంలో   1920 సెప్టెంబర్ 10న  రాధాకృష్ణా రావు ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు.  సీడీ నాయుడు, ఎ.లక్ష్మీకాంతమ్మ దంపతులకు ఆరుగురు మగ పిల్లలు, నలుగురు ఆడపిల్లలు, మొత్తం  పది మంది సంతానం. వారిలో ఎనిమిదవ వారిగా ఆయన జన్మించారు.   ఎనిమిదవ సంతానం అయినందున శ్రీకృష్ణుని పేరు పెట్టే సంప్రదాయం ప్రకారం రాధాకృష్ణ అని పేరు పెట్టారు. వారి తండ్రి నాయుడు ఉద్యోగరీత్యా పోలీస్ ఇనెస్పెక్టర్ అయినందున, తరచూ బదిలీలపై  ఊర్లు మారుతుండేవారు. ఆ విధంగా ఆయన విద్యాభ్యాసం ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలోని పాఠశాలల్లో  కొనసాగింది. చురుకుగా ఉండే ఆయన ఎప్పుడూ చదువులో మొదటి స్థానంలో ఉండేవారు. తనను తీర్చిదిద్దడంలో తల్లి ప్రముఖ పాత్ర వహించినట్లు ఆయనే స్వయంగా రాసుకున్నారు. "నాలో జ్ఞానాన్వేషణ పెంపొందించినందుకు, నేను మా అమ్మ లక్ష్మీకాంతమ్మకు రుణపడి ఉన్నాను. నా చిన్నతనంలో, ఆమె ప్రతి రోజూ ఉదయం నాలుగు గంటలకు నన్ను నిద్రలేపి, మనసు తాజాగా ఉండే ఉదయపు ప్రశాంత వేళల్లో నేను చదువుకోవడానికి నూనె దీపాన్ని వెలిగించేవారు," అని ‘స్టాటిస్టిక్స్ అండ్ ట్రూత్: పుట్టింగ్ ఛాన్స్ టు వర్క్' అనే తన పుస్తకంలో రాశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గణితశాస్త్రంలో  బి.ఏ (ఆనర్స్) డిగ్రీని  ఫస్ట్ ర్యాంకుతో పూర్తి చేశారు. రెండు మాస్టర్ డిగ్రీలు చేసి ఆయన భార్య భార్గవి కూడా కోల్ కత్తాలోని జాదవ్ పూర్ విశ్వవిద్యాలయంలో మనస్తత్వ శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేశారు.  1940లో రెండవ ప్రపంచ యుద్ధ కాలం రామకృష్ణారావు  జీవిత గమనాన్ని మార్చివేసింది. బ్రిటీష్-ఇండియా సైన్యంలో చేరడానికి  విశాఖ నుంచి కలకత్తా వెళ్లారు. వయసు తక్కువ అవడం వల్ల అతనిని సైన్యంలోకి తీసుకోలేదు. దాంతో అతని చూపు కలకత్తాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్ఐ)పై పడింది. అప్పటి ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వీఎస్ కృష్ణ సిఫారసు లేఖతో  1941లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్ఐ)లో ఏడాది  శిక్షణకు చేరారు. అదే సంవత్సరం జూలైలో కలకత్తా విశ్వవిద్యాలయంలో గణాంక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. అప్పట్లో ఈ డిగ్రీ దేశంలో అక్కడ కొత్తగా ప్రవేశపెట్టారు.  1943లో ఈ డిగ్రీ కూడా మెుదటి ర్యాంకుతో పూర్తి చేశారు.  వెంటనే, ఐఎస్ఐలో ఉద్యోగిగా చేరారు.  అదే సమయంలోనే, 1943 డిసెంబర్‌లో కలకత్తా విశ్వవిద్యాలయంలో గణాంక శాస్త్రంలో పార్ట్-టైమ్ లెక్చరర్‌గా కూడా చేరారు. 1946లో  యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని మ్యూజియం ఆఫ్ ఆర్కియాలజీ అండ్ ఎథ్నాలజీలో రీసెర్చ్ ఫెలోగా చేరారు.  ప్రొఫెసర్ రోనాల్డ్ ఎ. ఫిషర్  ఆధ్వర్యంలో   రాధాకృష్ణా రావు డాక్టరేట్ కోసం పరిశోధన చేశారు. ‘జీవ వర్గీకరణ యొక్క గణాంక సమస్యలు’ అనే సిద్ధాంత వ్యాసానికి 1948లో  ఆయన పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆ తర్వాత,  గణాంక శాస్త్రంలో ఆయన చేసిన పరిశోధనల ఆధారంగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం 1965లో రావుకు డాక్టర్ ఆఫ్ సైన్స్(డీఎస్‌సీ) పట్టాను ప్రదానం చేసింది. కేంబ్రిడ్జ్‌ నుంచి  భారతదేశానికి తిరిగి వచ్చిన  రావు  ఐఎస్ఐలోనే ప్రొఫెసర్ గా చేరారు. అక్కడే రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ స్కూల్(ఆర్‌టీఎస్) విభాగాధిపతిగా కూడా బాధ్యతలు స్వీకరించారు.  ఆ తర్వాత ఐఎస్ఐ డైరెక్టర్‌గా, ఆయన పరిశోధన,  శిక్షణా కార్యక్రమాలను ఎంతగానో అభివృద్ధి చేశారు.  ప్రపంచంలోని ప్రముఖ గణాంక కేంద్రాలలో ఒకటిగా ఐఎస్ఐ ఖ్యాతి పొందడంలో ఆయన కృషి అద్వితీయం. ఐఎస్ఐ నిబంధనల ప్రకారం ఆయన 1979లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ప్రొఫెసర్ రావు జీవితంలో రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. డాక్టర్ సి.ఆర్.రావు, సి.భార్గవి రావు దంపతుల కుమార్తె తేజస్విని రావు (తేజా రావు). ఇక్కడ పదవీ విరమణ చేసిన తర్వాత, వాస్తవానికి ఆయన తన కుమార్తె తేజా రావు, ఆమె పిల్లలతో గడపడానికి అమెరికా వెళ్లారు.  అక్కడ,  పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో 1979 నుంచి 1988 వరకు ప్రొఫెసర్‌గా చేశారు.  పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఎబెర్లీ ఫ్యామిలీ చైర్ ఇన్ స్టాటిస్టిక్స్‌గా  1988 నుంచి 2000 వరకు కొనసాగారు. 1996లో ఆయన అమెరికన్ పౌరసత్వం పొందారు.  2010లో ఆయన న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తర్వాత రాధాకృష్ణ రావు అమెరికాలోని  సెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఎమెరిటస్ ప్రొఫెసర్‌గా, మల్టీవేరియేట్ స్టాటిస్టిక్స్ సెంటర్ డైరెక్టర్‌గా సేవలందించారు. పెన్సిల్వినేనియా స్టేట్ యూనివర్సిటీలో పోషకాహార శాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన ఆయన కుమార్తె తేజస్విని బఫెలోలోని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్(ఎస్‌యూఎన్‌వై) కాలేజీలో డైటెటిక్స్ అండ్ న్యూట్రిషన్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భరతనాట్యం, కూచిపూడి శాస్త్రీయ నృత్య శైలులలో నిష్ణాతురాలైన నర్తకి. నాట్య అనే నృత్య పాఠశాలకు ఆమె డైరెక్టర్‌గా ఉన్నారు.

గణాంక శాస్త్రంలో ఆయన అంతర్జాతీయ స్థాయిలో అద్వితీయమైన పరిశోధనలు చేశారు. అనేక ప్రసిద్ధ సిద్ధాంతాలు రూపొందించారు. 15 పుస్తకాల వరకు రాశారు.   భారతదేశంలో శాస్త్రవేత్తకు ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుని 1963లో ఆయన అందుకున్నారు.  భారత ప్రభుత్వం 1968లో ఆయనను పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.  2002లో 82 ఏళ్ల వయసులో  అమెరికాలో వైట్ హౌస్ నుండి ఆయన 'నేషనల్ మెడల్ ఫర్ సైన్స్' పొందారు.  102 ఏళ్ల  వయసులో, అద్భుతమైన ఆరోగ్యంతో  నోబెల్ బహుమతితో సమానమైన  ‘సంఖ్యా శాస్త్రంలో 2023 అంతర్జాతీయ పురస్కారం’ఆయన  అందుకోవడం విశేషం. ఓ విశిష్టమైన ఉదాహరణ. “ప్రొఫెసర్ సి.ఆర్.రావు 75 ఏళ్లకు పైగా చేసిన కృషి, ఇప్పటికీ విజ్ఞానశాస్త్రంపై ప్రగాఢమైన ప్రభావాన్ని  చూపుతూనే ఉందని,  జీవించి ఉన్న అటువంటి దిగ్గజ  శాస్త్రవేత్తకు 2023 అంతర్జాతీయ గణాంక శాస్త్ర పురస్కారం ప్రదానం చేశాం.” అని  పురస్కార ప్రశంసా పత్రంలో వివరించారు.  గణాంక శాస్త్రంలో  ఈ పురస్కారాన్ని 2016లో స్థాపించారు. "విజ్ఞాన, సాంకేతిక,  మానవ సంక్షేమాన్ని అభివృద్ధి చేయడానికి గణాంకాలను ఉపయోగించి, సాధించిన ప్రధాన విజయాలకు"  ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక వ్యక్తికి  లేదా బృందానికి దీనిని ప్రదానం చేస్తారు. ‘‘ప్రొఫెసర్ రావు చేసిన కృషి  ఒక్క గణాంక శాస్త్రాన్నే కాకుండా అర్థశాస్త్రం, జన్యుశాస్త్రం, మానవశాస్త్రం, భూగర్భశాస్త్రం, జాతీయ ప్రణాళిక, జనాభా శాస్త్రం, బయోమెట్రీ, వైద్యశాస్త్రాలను కూడా  ప్రభావితం చేసింది.’’ అని అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ పేర్కొంది.  సరస్వతీ పుత్రుడైన ప్రొఫెసర్ రావు వెలువరించిన క్రామర్-రావు అసమానత, రావు-బ్లాక్ వెల్ సిద్ధాంతాలు, ఆయన రాసిన అంచనా సిద్ధాంతం, బహుళ చరరాశి విశ్లేషణ, మాత్రిక బీజగణితం.. పుస్తకాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. గణాంక శాస్త్ర దిగ్గజంగా పేరు పొందిన ప్రొఫెసర్ రావు ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, ఇంటర్నేషనల్ బయోమెడికల్ సొసైటీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ స్టాటిస్టిక్స్ సంస్థలకు అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన తొలి పరిశోధనా పత్రాలు 'సమాచారం, సాంఖ్యక పారామితుల అంచనాలో సాధించగల కచ్చితత్వం' (1945), 'అంచనా సమస్యలకు అనువర్తనాలతో, అనేక పారామితులకు సంబంధించిన సాంఖ్యక పరికల్పనల యొక్క పెద్ద నమూనా పరీక్షలు'  (1948) రెండూ కూడా చాలా ప్రధానమైనవి. మరో రెండు పరిశోధనా పత్రాలు క్రామెర్-రావు అసమానత, రావు-బ్లాక్‌వెల్ సిద్ధాంతం రెండూ బాగా ప్రసిద్ధి చెందాయి. మంచి ఫలితాలను ఇచ్చాయి.30 ఏళ్లు నిండకముందే, ప్రొఫెసర్ రావు ప్రయోగాత్మక రూపకల్పన, సాంఖ్యక అనుమానం, బహుళచర విశ్లేషణ, బయోస్టాటిస్టిక్స్ వంటి అంశాలపై 45కు పైగా  పరిశోధనా పత్రాలను ప్రచురించారు.  గణాంక శాస్త్రంలోని వివిధ శాఖలలోని ముఖ్యమైన సమస్యలను పరిష్కరిస్తూ, ఆయన విస్తృతంగా పరిశోధనలు కొనసాగించారు. సంభావ్యతా పంపిణీల లక్షణీకరణ వంటి రంగాలపై ఆయన మరింతగా ఆసక్తిని పెంచుకున్నారు.  


ప్రపంచంలో ఒక్క శాతానికి మించి  కంప్యూటర్ అనే పదమే తెలియని రోజుల్లో 1969లో 'కంప్యూటర్స్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ' అనే పుస్తకాన్ని ప్రొఫెసర్ రావు రాశారు. అంతేకాదు, ఈనాడు  దాని ద్వారా మనం పొందే లాభ నష్టాలను కూడా  ఆయన అప్పుడే రాశారు. గణాంక శాస్త్రానికి సంబంధించి సరళమైన రీతిలో అనేక పరిశోధనా పత్రాలు ఆయన ప్రచురించారు. ఆయన దాదాపు 473 పరిశోధనా పత్రాలను, 15 పుస్తకాలను ప్రచురించారు. ఎల్సెవియర్ ప్రచురించిన 'హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్'  సిరీస్‌లో భాగంగా వచ్చిన వాటితో సహా అనేక ఇతర పుస్తకాలకు సంయుక్తంగా ఆయన సంపాదకత్వం వహించారు. ఆయన రాసిన 'అడ్వాన్స్‌డ్ స్టాటిస్టికల్ మెథడ్స్ ఇన్ బయోమెట్రిక్ రీసెర్చ్',  'లీనియర్ స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్' అనే పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందిన ప్రామాణిక గ్రంథాలుగా నిలిచాయి. ఆయన 1989లో రాసిన  'స్టాటిస్టిక్స్ అండ్ ట్రూత్: పుట్టింగ్ ఛాన్స్ టు వర్క్'(రామానుజన్ మెమోరియల్ లెక్చర్) అనేది గణాంకాలలోని తాత్విక సమస్యలను చర్చించడం జరిగింది. ప్రొఫెసర్ రావుకు కళాత్మక ద‌ష్టి ఎక్కువ.  1970లో ఆయన ఢిల్లీలోని ఐఎస్ఐలో ప్రొఫెసర్ గా చేరిన సమయంలో  అక్కడ కూచిపూడిని బోధించడానికి నృత్య పాఠశాల ఏదీ లేదని తెలిసి ఆశ్చర్యపోయారు. భారతీయ శాస్త్రీయ నృత్యంపై ఆయనకున్న ఆసక్తి కారణంగా, ఆయన ఢిల్లీలో ఒక కూచిపూడి నృత్య అకాడమీని ప్రారంభించారు.  1979లో అమెరికా వెళ్లే వరకు ఆయన దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఎనిమిదేళ్ల వయసులో తమ కుమార్తె తేజస్వినిని న‌‌ృత్యం నేర్చుకునేందుకు ఒక నృత్య పాఠశాలలో చేర్పించారు. ఆయన పరిశోధనల పరంగా ఎంత బిజీగా ఉన్నా, తమ కుమార్తె  బహిరంగ నృత్య ప్రదర్శనలు ఇచ్చినప్పుడు,  తరచుగా ప్రదర్శనలు, సంగీతం, పరిచయాలు,  లైటింగ్‌ వంటివాటిన ఆయనే స్వయంగా పర్యవేక్షించేవారు. అప్పట్లోనే, ఆమె నృత్య సంగీతానికి ఆంగ్ల అనువాదాలు అందించే ఏర్పాటు చేసేవారు.  అకడమిక్ పరంగా  ఆయన 50 మంది పీహెచ్‌డీ విద్యార్థుల పరిశోధనకు మార్గనిర్దేశకుడుగా ఉన్నారు. దాదాపు 350 మంది విద్యార్థులకు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. మన దేశంలో, అమెరికాలో ఆయన వద్ద  విద్యార్థులుగా  శిక్షణ పొందిన వారు  చాలామంది ఉన్నత స్థాయి శాస్త్రవేత్తలుగా ఎదిగారు.  ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్తలు రామస్వామి రంగారావు, కె.ఆర్. పార్థసారథి, వీరవల్లి ఎస్. వరదరాజన్, ఎస్.ఆర్. శ్రీనివాస వరదన్ నలుగురూ ఐఎస్ఐలో ప్రొఫెసర్ రావు శిష్యులే.  సి.ఆర్. రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ (AIMSCS). ఆయన భారతదేశంలోని ఈ ప్రాంతానికి చెందినవారు కాబట్టి, ఇది రావు గారికి తగిన నివాళి. భారతీయ గణాంక విద్యా వ్యవస్థ పితామహుడైన ప్రొఫెసర్ రావు తన 102వ ఏట 2023, ఆగస్టు 22వ తేదీన కన్నుమూశారు. పదవీ విరమణ అంటే నిష్క్రియగా మారడం కాదని, చివరి శ్వాస వరకు పూర్తి ఉత్సాహంతో జీవించవచ్చని ప్రొఫెసర్ రాధాకృష్ణా రావు నిరూపించారు. ఆయన  జీవితం మనకు స్ఫూర్తిదాయకం.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914





No comments:

Post a Comment

తెలుగువారు గర్వించతగ్గ ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త రాధాకృష్ణ

నేడు ప్రొఫెసర్ రావు వర్ధంతి తెలుగువారు గర్వించతగ్గ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ గణాంక శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణా రావు.  మన దేశంలో 60 ఏళ్ల...