Aug 22, 2026

20 శతాబ్ధంలోనే ఓ విశిష్ట వ్యక్తిగా నిలిచిన మన తెలుగువాడు

నేడు భారతీయ-అమెరికన్ గణాంక శాస్త్రవేత్త  రాధాకృష్ణా రావు వర్ధంతి


మన దేశంలో 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసిన ఓ శాస్త్రవేత్త, ఆ తర్వాత అమెరికా వెళ్లి, అక్కడ కూడా ప్రొఫెసర్‌ గా కొనసాగి, 75 ఏళ్ల వయసులో అమెరికన్ పౌరసత్వం పొంది, 102 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతితో సమానమైన అత్యున్నత ‘అంతర్జాతీయ గణాంక బహుమతి’పొందారు. ఆ విధంగా మన తెలుగువాడైన  ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ గణాంక శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణా రావు  20 శతాబ్ధంలోనే ఓ విశిష్ట వ్యక్తిగా నిలిచారు. ‘‘ప్రొఫెసర్ రావు చేసిన కృషి  ఒక్క గణాంక శాస్త్రాన్నే కాకుండా అర్థశాస్త్రం, జన్యుశాస్త్రం, మానవశాస్త్రం, భూగర్భశాస్త్రం, జాతీయ ప్రణాళిక, జనాభా శాస్త్రం, బయోమెట్రీ, వైద్యశాస్త్ర్రాలను కూడా  ప్రభావితం చేసింది.’’ అని అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ పేర్కొంది. “ప్రొఫెసర్ సి.ఆర్. రావు 75 ఏళ్లకు పైగా చేసిన కృషి, ఇప్పటికీ విజ్ఞానశాస్త్రంపై ప్రగాఢమైన ప్రభావాన్ని  చూపుతూనే ఉందని,  జీవించి ఉన్న అటువంటి దిగ్గజ  శాస్త్రవేత్తకు 2023 అంతర్జాతీయ గణాంక శాస్త్ర్ర పురస్కారం ప్రదానం చేశాం.” అని  పురస్కార ప్రశంసాపత్రంలో వివరించారు.  సరస్వతీ పుత్రుడైన ప్రొఫెసర్ రావు వెలువరించిన క్రామర్-రావు అసమానత, రావు-బ్లాక్ వెల్ సిద్ధాంతాలు, ఆయన రాసిన అంచనా సిద్ధాంతం, బహుళ చరరాశి విశ్లేషణ, మాత్రిక బీజగణితం.. పుస్తకాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. గణాంక శాస్త్ర దిగ్గజంగా పేరు పొందిన ప్రొఫెసర్ రావు ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, ఇంటర్నేషనల్ బయోమెడికల్ సొసైటీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ స్టాటిస్టిక్స్ సంస్థలకు అధ్యక్షుడిగా పని చేశారు.


ప్రస్తుతం  కర్ణాటక రాష్ట్రంలోని విజయనగరం జిల్లా,  హూవిన హడగలి పట్టణంలో  ఓ తెలుగు కుటుంబంలో 1920 సెప్టెంబర్ 10న  రాధాకృష్ణా రావు జన్మించారు.  సీడీ నాయుడు, ఎ.లక్ష్మీకాంతమ్మ దంపతుల  పది మంది సంతానంలో ఎనిమిదవ వారిగా ఆయన జన్మించారు. తండ్రి నాయుడు ఉద్యోగరీత్యా పోలీస్ ఇనెస్పెక్టర్ అయినందున, తరచూ బదిలీలపై ఊర్లు మారుతుండేవారు. ఆ విధంగా  ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలోని పాఠశాలల్లో ఆయన చదువుకున్నారు. ఆయన ఎప్పుడూ చదువులో ఫస్ట్ ఉండేవారు. తనను తీర్చిదిద్దడంలో తల్లి ప్రముఖ పాత్ర వహించినట్లు ఆయనే స్వయంగా రాసుకున్నారు. "నాలో జ్ఞానాన్వేషణ పెంపొందించినందుకు, నేను మా అమ్మ లక్ష్మీకాంతమ్మకు రుణపడి ఉన్నాను. నా చిన్నతనంలో, ఆమె ప్రతి రోజూ ఉదయం నాలుగు గంటలకు నన్ను నిద్రలేపి, మనసు తాజాగా ఉండే ఉదయపు ప్రశాంత వేళల్లో నేను చదువుకోవడానికి నూనె దీపాన్ని వెలిగించేవారు," అని ‘స్టాటిస్టిక్స్ అండ్ ట్రూత్: పుట్టింగ్ ఛాన్స్ టు వర్క్' అనే తన పుస్తకంలో రాశారు.   ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గణితశాస్త్రంలో ప్రథమ ర్యాంకుతో బి.ఏ (ఆనర్స్) డిగ్రీని పూర్తి చేశారు.   1941లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్ఐ)లో  శిక్షణ పొందారు.  అదే సంవత్సరం జూలైలో కలకత్తా విశ్వవిద్యాలయంలోని గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. అప్పట్లో ఈ డిగ్రీ దేశంలో కొత్తగా ప్రవేశపెట్టారు.  1943లో ఈ డిగ్రీ కూడా మెుదటి ర్యాంకుతో ఉత్తీర్ణులయ్యారు.  వెంటనే, ఐఎస్ఐలో ఉద్యోగిగా చేరారు.  1943 డిసెంబర్‌లో కలకత్తా విశ్వవిద్యాలయంలో గణాంకశాస్త్రంలో పార్ట్-టైమ్ లెక్చరర్‌గా చేరారు. 1946లో  యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని మ్యూజియం ఆఫ్ ఆర్కియాలజీ అండ్ ఎథ్నాలజీలో రీసెర్చ్ ఫెలోగా చేరారు.  ప్రొఫెసర్ రోనాల్డ్ ఎ. ఫిషర్  ఆధ్వర్యంలో   రాధాకృష్ణా రావు డాక్టరేట్ కోసం పరిశోధన చేశారు. ‘జీవ వర్గీకరణ యొక్క గణాంక సమస్యలు’ అనే సిద్ధాంత వ్యాసానికి 1948లో  ఆయన పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆ తర్వాత,  గణాంక శాస్త్రంలో ఆయన చేసిన పరిశోధనల ఆధారంగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం 1965లో రావుకు డాక్టర్ ఆఫ్ సైన్స్(డీఎస్‌సీ) పట్టాను ప్రదానం చేసింది. కేంబ్రిడ్జ్‌ నుంచి  భారతదేశానికి తిరిగి వచ్చిన  రావు  ఐఎస్ఐలో ప్రొఫెసర్ గా చేరారు. అక్కడే రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ స్కూల్(ఆర్‌టీఎస్) విభాగాధిపతిగా కూడా బాధ్యతలు స్వీకరించారు.  ఆ తర్వాత ఐఎస్ఐ డైరెక్టర్‌గా, ఆయన పరిశోధన,  శిక్షణా కార్యక్రమాలను ఎంతగానో అభివృద్ధి చేశారు.  ప్రపంచంలోని ప్రముఖ గణాంక కేంద్రాలలో ఒకటిగా ఐఎస్ఐ ఖ్యాతి పొందడంలో ఆయన కృషి అద్వితీయం. ఐఎస్ఐ నిబంధనల ప్రకారం ఆయన 1979లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ప్రొఫెసర్ రావు జీవితంలో రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అమెరికా వెళ్లి అక్కడ,  పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో 1979 నుంచి 1988 వరకు ప్రొఫెసర్‌గా చేశారు.  పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఎబెర్లీ ఫ్యామిలీ చైర్ ఇన్ స్టాటిస్టిక్స్‌గా  1988 నుంచి 2000 వరకు కొనసాగారు. 2010లో ఆయన న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తర్వాత రాధాకృష్ణ రావు అమెరికాలోని  సెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఎమెరిటస్ ప్రొఫెసర్‌గా, మల్టీవేరియేట్ స్టాటిస్టిక్స్ సెంటర్ డైరెక్టర్‌గా సేవలందించారు.

 అకడమిక్ పరంగా  ఆయన అనేక మంది పీహెచ్‌డీ విద్యార్థులకు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. మన దేశంలో, అమెరికాలో ఆయన వద్ద  విద్యార్థులుగా  శిక్షణ పొందిన వారు  చాలామంది ఉన్నత స్థాయి శాస్త్రవేత్తలుగా ఎదిగారు.  గణాంక శాస్త్రంలో ఆయన అంతర్జాతీయ స్థాయిలో అద్వితీయమైన పరిశోధనలు చేశారు. అనేక ప్రసిద్ధ సిద్ధాంతాలు రూపొందించారు. 15 పుస్తకాల వరకు రాశారు. భారత ప్రభుత్వం 1968లో ఆయనను పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 2002లో 82 ఏళ్ల వయసులో  అమెరికాలో వైట్ హౌస్ నుండి ఆయన 'నేషనల్ మెడల్ ఫర్ సైన్స్' పొందారు.  102 ఏళ్ల  వయసులో, అద్భుతమైన ఆరోగ్యంతో  నోబెల్ బహుమతితో సమానమైన  ‘సంఖ్యా శాస్త్రంలో 2023 అంతర్జాతీయ పురస్కారం’ఆయన  అందుకోవడం విశేషం. ఓ విశిష్టమైన ఉదాహరణ.  భారతీయ గణాంక విద్యా వ్యవస్థ పితామహుడైన ప్రొఫెసర్ రావు తన 102వ ఏట 2023, ఆగస్టు 22వ తేదీన కన్నుమూశారు. పదవీ విరమణ అంటే నిష్క్రియగా మారడం కాదని, చివరి శ్వాస వరకు పూర్తి ఉత్సాహంతో జీవించవచ్చని ప్రొఫెసర్ రాధాకృష్ణా రావు నిరూపించారు. ఆయన  జీవితం మనకు స్ఫూర్తిదాయకం.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

తెలుగువారు గర్వించతగ్గ ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త రాధాకృష్ణ

నేడు ప్రొఫెసర్ రావు వర్ధంతి తెలుగువారు గర్వించతగ్గ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ గణాంక శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణా రావు.  మన దేశంలో 60 ఏళ్ల...