1969 అక్టోబర్ 1 వ తారీఖు మంగళగిరి "గ్రామ పంచాయితీ" స్థాయి నుండి "మున్సిపాలిటీ" హోదా పొందినది. 1971 లో మంగళగిరి మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరిగి...తొలి మున్సిపల్ చైర్మన్ గా గోలి గోపాలరావు గారు ఎన్నికై 1976 వరకు కొనసాగారు. 1970 దశకంలో మంగళగిరి పట్టణంలో నీటి కొరత తీవ్రంగా ఉండేది. మంగళగిరిలోని బావుల్లో ఉండే నీటిని ఎంతో కష్టపడి చాంతాళ్ళతో తోడుకుని వాడుకునే వారు. ఆ రోజుల్లో మంగళగిరిలో పెళ్ళీడుకొచ్చిన యువకులకు వేరే ఊరివారు పిల్లనివ్వాలంటే ముందుకొచ్చేవారు కాదు. కారణం ఆడపిల్లలు బావుల్లో నీళ్ళు తోడడానికి కష్టపడాల్సి వస్తుందని. గోలి గోపాలరావు మంగళగిరి ప్రజలకున్న ఈ నీటి సమస్యను పరిష్కరించడానికి 1972 లో "పైలెట్ వాటర్ స్కీమ్" ను రూపొందించి పైపుల "కుళాయిలు" ద్వారా మంచినీటిని సరఫరాచేసే విధానం అమలులోకి తెచ్చారు. ఎన్నో దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించినందువలన గోలి గోపాలరావుని "అపర భగీరథుడు" గా మంగళగిరి ప్రజలు చెప్పుకుని ప్రశంసించేవారు. .ఇప్పుడున్న పాతతరం వారు మంగళగిరి వాసులు అప్పటి ఈ విషయాన్ని తరచుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న బైపాస్ రోడ్డు సమీపానగల కొప్పురావుకాలనీని ఏర్పాటు చేసినదీ గోలి గోపాలరావు చొరవవలనే. మంగళగిరిలోని VTJM డిగ్రీ కళాశాల, 1975 లో కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ సముదాయాన్ని నిర్మించినది కూడా గోలి గోపాలరావు కృషి వల్లనే.
నేటికి 36 సంవత్సరాల క్రితం..1990 సెప్టెంబర్ 9 వ తారీఖు గోలి గోపాలరావు వృధాప్యం కారణంగా స్వర్గస్తులైనారు. గోలి గోపాలరావు ఎంతో సౌమ్యులుగా, మంగళగిరి, పరిసర గ్రామాల ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకున్న ధన్యజీవి. మా తాత "మేకల కోటయ్య" మంగళగిరి తహసిల్దార్ కార్యాలయంలో 1979 సంవత్సరానికి పూర్వం రెవెన్యూ ఉద్యోగిగా పనిచేస్తున్న రోజుల్లో గోలి గోపాలరావు, మా తాత మేకల కోటయ్య అత్యంత సన్నిహితంగా ఉండేవారు. గోలి గోపాలరావు కుమారుడు డాక్టర్ గోలి రామ్మోహన రావు మంగళగిరిలో శ్రీ వెంకటేశ్వర టాకీస్ ఎదురుగా కళ్యాణ్ నర్సింగ్ హోమ్ పేరుతో 1982లో ''హాస్పిటల్'' ని ప్రారంభించారు. గత 44 సంవత్సరాలుగా మంగళగిరి, పరిసర గ్రామాల ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. మంగళగిరి ప్రజలకు విశేష సేవలు అందించి, మంగళగిరి నీటి కొరతను పరిష్కరించి "మంగళగిరి అపర భగీరధుడు" గా పేరు సంపాదించుకున్న గోలి గోపాలరావు 36వ వర్ధంతి ఈరోజు జరుగుతున్న సందర్భంగా.. శ్రీ గోలి గోపాలరావు గారిని స్మరించుకుంటూ.. నివాళులర్పిస్తున్నాను.
మేకల మోహనరావు,
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మకర్త.
ఫౌండర్ చైర్మన్, ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎడ్యుకేషనల్ సోసైటీ మంగళగిరి
మోహన్ రావు గారు,
గోలి గోపాల రావు గారి గురించి చాలా బాగా రాశారు. ఆయనతో నాకు పరిచయం ఉంది. ఆయన సీకే జూనియర్ కాలేజీ కమిటీ అధ్యక్షులుగా ఉన్న సమయంలోనే, నేను విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. ఆ సమయంలో నేను చాలాసార్లు ఆయనను కలిశాను. మంగళగిరిలో పైలెట్ వాటర్ స్కీమ్ ప్రారంభించినప్పుడు ఆయనకు భారీఎత్తున సన్మానం జరిగింది. అప్పట్లో దేవస్థానం సమీపంలో మున్సిపల్ కార్యాలయం ఉండేది. దేవస్థానం నుంచి పాత మంగళగిరి దేవాలయం వరకు విద్యుద్దీపాలలో అలకంరించారు. ఆయనను ఊరేగించారు. అప్పట్లో నీటిపారుదల శాఖా మంత్రిగా చల్లా సుబ్బారాయుడు ఉండేవారు. ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మళ్లీ మంగళగిరిలో అంతటి సన్మానం ఎవరికీ జరగలేదు. గోపాలరావు గారు మంచి మనిషి. గోలి రామమోహన్ రావు గారు, గోలి కళ్యాణ్ గారితో కూడా నాకు పరిచయం ఉంది. గోలి గోపాలరావు వర్థంతి సందర్భంగా ఈ ఉదయం ఆయన కుమారులు సీకే హైస్కూల్ లో ఒక కార్యక్రమం నిర్వహించి, 30 మంది పేద విద్యార్థులకు, ఇతర పేదలకు ఆర్థిక సాయం చేశారు.
-శిరందాసు నాగార్జున


No comments:
Post a Comment