బడా వ్యాపారులకు రూ.లక్షల కోట్ల మాఫీ - పీఎఫ్ పెన్షనర్లపై లేని కనికరం
ఇటీవల బెంగళూరులో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈపీఎఫ్ కనీస సెన్షన్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకోకపోవడం పెన్షన్ దారులను నిరుత్సాహపరిచింది. కనీస పెన్షన్ పెంచుతారని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రూ.1000లు మాత్రమే పెన్షన్ తీసుకునేవారు బోర్డు చర్యని తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధులకు రూ.4000 సామాజిక పెన్షన్ అందజేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈపీఎఫ్ కనీస పెన్షన్ రూ.1000 మాత్రమే ఇవ్వడం చాలా అన్యాయం అని వారు వాపోతున్నారు. 10,15 ఏళ్లు ప్రైవేటు సంస్థల్లో చిరుద్యోగులుగా, కార్మికులుగా పనిచేసిన పీఎఫ్ పెన్షన్ దారులను కేంద్ర ప్రభుత్వం ఎంత చిన్నచూపుచూస్తోందో అర్థమవుతోందని మండిపడుతున్నారు. కనీసం పది సంవత్సరాలు సర్వీసు ఉన్నవారికి మాత్రమే ఈ పెన్షన్ లభిస్తుంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎఫ్- 95) పరిధిలో 2014 నుంచి కనీస పెన్షన్ నెలకు రూ.1000 అందజేస్తున్నారు. ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కనీస పెన్షన్ రూ.9వేలకు పెంచాలని పలు ట్రేడ్ యూనియన్లు, పెన్షనర్ల అసోసియేషన్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అంతకాకపోయినా, కొద్ది మొత్తంలోనై పెంచుతారని పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురు చూశారు. వారి ఆశలపై నీళ్లు చల్లారు. ఓ పక్క నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోతున్నాయి. మరో పక్క వృద్ధాప్యంలో కావలసిన ముందులకు కూడా ఆ మొత్తం సరిపోదు. ఈ కనీస పెన్షన్ వృద్ధాప్యంలో సరిపోదన్న విషయం సీబీటీకి తెలియనిదేమీకాదు. ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)ని ఏర్పాటు చేశారు. పదవీ విరమణ తర్వాత, ఉద్యోగులు దాచుకున్న సొమ్ము చేతికి వస్తే, వృద్ధాప్యంలో కొంత ఆర్థిక చేయూతగా ఉంటుంది. ముఖ్యంగా ఈపీఎఫ్ పెన్షన్ చిరుద్యోగులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. 11 ఏళ్ల తర్వాత జరిగిన సీబీటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఈపీఎఫ్ఓ లక్ష్యాలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. సీబీటీ సమావేశ నిర్ణయాలు పెన్షన్‌కు తిలోదకాలిచ్చే విధంగా ఉన్నాయని ప్రైవేటు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస పెన్షన్ రూ.1,000 నుండి రూ.7,500 కు పెంచాలని సీబీటీ సమావేశంలో ప్రతిపాదించారు, అయితే, ఈ ప్రతిపాదనను ఆమోదించలేదు. ఈ సమావేశం పీఎఫ్ ఉపసంహరణపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పీఎఫ్ ఉద్యోగి షేర్‌తోపాటు యాజమాన్యం షేర్ నుంచి వంద శాతం విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పించింది. ఈపీఎఫ్ సంస్థలో చందదారుల నగదు నిల్వలు లక్షల కోట్ల రూపాయల మేర పేరుకుపోయాయి. ఆ మొత్తంపై వడ్డీ చెల్లించే భారం నుంచి తప్పించుకునేందుకు చందాదారులకు తిరిగి చెల్లించడానికి సీబీటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ నిర్ణయం ఈపీఎఫ్ లక్ష్యాలకు విరుద్ధం. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని కొన్ని చిన్న చిన్న సౌకర్యాలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాలకు మీడియా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం కల్పించడం కూడా అన్యాయంగా భావిస్తున్నారు. ఉద్యోగి, యాజమాన్యం సొమ్ము మొత్తాన్ని తీసుకునే సౌకర్యం కల్పిస్తే, చివరి దశలో చిరుద్యోగుల పరిస్థితి ఏమిటి? రూ.1000, రూ.2000 పెన్షన్‌తో కుటుంబం గడుస్తుందా? సీబీటీ ఇవన్నీ ఆలోచన చేసే ఈ నిర్ణయం తీసుకుందా? దేశాభివృద్ధికి వివిధ రంగాలలో పనిచేసిన వారు జీవిత చరమాంకంలో ఈ పెన్షన్‌తో బతకడం సాధ్యమేనా? దేశంలో కోట్ల మంది వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక భద్రతా పెన్షన్ కింద ఇంతకు మించి ఇస్తున్నాయి. దేశంలో ఈపీఎఫ్ఓ చందాదారులు 7.8 కోట్ల మంది ఉన్నారు. ఈపీఎఫ్ పెన్షన్ పథకంలో 5.39 కోట్ల మంది ఉన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో పెన్షన్ పొందేవారు 81,48,490 మంది ఉన్నారు. వారిలో రూ.6వేలకు పైగా పెన్షన్ పొందేవారు ఒక్క శాతం కూడా లేరు. 0.65 శాతం మంది మాత్రమే ఉన్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లోక్‌సభలో చెప్పారు. కేవలం రూ.1500 పెన్షన్ పొందేవారు సగం మందికంటే ఎక్కువే అంటే, 49,15,416 మంది ఉన్నారని మంత్రి తెలిపారు. దాదాపు 37 లక్షల మందికి నెలకు రూ.1000 మాత్రమే అందజేస్తున్నారు. పెన్షన్ దారుల కుటుంబాలు, ట్రేడ్ యూనియన్లు, పెన్షనర్ల అసోసియేషన్ల డిమాండ్ల గురించి సీబీటీ పట్టించుకోలేదు. ఉద్యోగి పదవీ విరమణ చేసేనాటికి పొందే జీతంలో సగం పెన్షన్ గా ఇవ్వడం న్యాయం. ధర్మం. ఉద్యోగులు తాము పొదుపుచేసిన మొత్తాన్ని ఎంతో అత్యవసరమైతే తప్ప ఉపసంహరించుకోవడం మంచిదికాదు. అలా ఉపసంహరించుకుంటే, పదవీ విరమణ చేసిన తర్వాత ఆర్థిక భరోసా ఉండదు. ఈపీఎఫ్‌ఓ నుంచి ముందస్తు ఉపసంహరణకు తుది సెటిల్మెంట్ కోసం వేచి ఉండే కాలాన్ని గతంలో ఉన్న 2 నెలల నుంచి 12 నెలలకు పెంచడం, పింఛను నిధి (ఈపీఎస్) విత్ డ్రాకు వేచి ఉండే కాలాన్ని 2 నెలల నుంచి 36 నెలలకు పెంచడం సరైన నిర్ణయం కాదు. చిరుద్యోగులు తమ అత్యవసరాలు తీర్చుకోవడానికి నెలలు నెలలు వేచిచూడాలన్న నిబంధన సరైనది కాదు. ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రైవేటు ఉద్యోగులు, పెన్షనర్లు తాము పొదుపు చేసుకున్న డబ్బుని అవసరమైన కాలంలో పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. అవసరాలు తీర్చుకోవడం కోసం వారు అప్పులపాలు కావలసి వస్తుంది. ఆ రకంగా వారికి అన్యాయం చేసినట్లే లెక్క. ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు ఉద్యోగులకు శిక్ష విధిస్తున్నట్లున్నాయి. దాదాపు 30 కోట్ల మంది జీవితాలతో ఆడుకోవడంగా భావిస్తున్నారు. ప్రవేటు రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రతలేదు. వారి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియదు. ఈ కొత్త నిబంధనలు వారిని ఇంకా చిక్కుల్లో పడేసేవిధంగా ఉన్నాయని చందాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బడా వ్యాపారుల కోసం రూ.లక్షల కోట్లు మాఫీ చేస్తోంది. పదవీ విరమణ చేసిన చిరు ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చే పెన్షన్‌ని ప్రతిపాదించిన విధంగా కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కేంద్ర ప్రభుత్వ అనుమతిలేకుండా సీబీటీ ఈ నిర్ణయం తీసుకోలేదు. కార్మిక వర్గానికి అన్యాయం జరగకుండా, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కనీస పెన్షన్‌ని రూ.9వేలకు పెంచవలసిన అవసరం ఉంది. ఆ దిశగా కేంద్రం ఆలోచించి, నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం.
శిరందాసు నాగార్జున, సీనియర్ సబ్ ఎడిటర్ - 9440222914



















