Aug 1, 2019


నవ్యాంధ్ర తొలి మహిళా హోం మంత్రి సుచరిత
             
  సంచలన నిర్ణయాలతో అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్న యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి మంత్రి వర్గ కూర్పులో కూడా సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే మహిళలకు సముచిత స్థానం కల్పించి కీలకమైన బాధ్యతలు అప్పగించారు. ఎస్టీ వర్గానికి పాముల పుష్ప శ్రీవాణికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఎస్సీ వర్గానికి చెందిన  మేకతోటి సుచరితకు ఏకంగా హోం మంత్రిత్వ శాఖ అప్పగించారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో సబిత ఇంద్రా రెడ్డికి  హోం శాఖ బాధ్యతలు అప్పగించి సంచలనం సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలో హోం శాఖా మంత్రిగా పని చేసిన  తొలి మహిళ ఆమె.  తండ్రి బాటలోనే జగన్ కూడా నవ్యాంధ్ర తొలి హోం మంత్రి బాధ్యతలు  ఓ మహిళకు అప్పగించారు.

          గుంటూరు జిల్లా ఫిరంగిపురం గ్రామానికి చెందిన మేకతోటి సుచరిత 1972 డిసెంబర్ 25న పొన్నూరులో జన్మించారు. డాక్టర్ నన్నం అంకారావు, ధనమ్మ దంపతుల కుమార్తె అయిన సుచరిత బీఏఎంఎస్( బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ) చేశారు.  మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో డిగ్రీ పొందారు. 1995 మే 21న మేకతోటి దయాసాగర్ ను ఆమె వివాహం చేసుకున్నారు. ఆయన ఇన్ కం టాక్స్ కమిషనర్ గా పని చేస్తున్నారు.   వారికి ఇద్దరు పిల్లలు కుమారుడు హర్షిత, కుమార్తె రితిక. టీవీ చూడటంతోపాటు పుస్తకాలు చవడం కూడా   సుచరితకు ఎంతో ఇష్టం. మాంసాహార ప్రియులు. హైదరాబాద్ బిర్యాని అంటే ఆమెకు చాలా ఇష్టం.

మొదటి నుంచి ఆమె  సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మంచినీటి బోర్లు వేయించడం, మెడికల్ క్యాంపులు, మొక్కలు నాటడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు.  డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రేరణతో 2006లో ఆమె రాజకీయాలలోకి వచ్చారు.  2006 నుంచి 2009 వరకు ఫిరంగిపురం జడ్పీటీసీగా  పని చేశారు. రాజకీయాలలో డాక్టర్ వైస్సే ఆమెకు గాడ్ ఫాధర్. 2009లో  ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ వైఎస్ ఆమెకు ఇప్పించారు.  తొలి ప్రయత్నంలోనే టీడీపీ అభ్యర్థి కందుకూరి వీరయ్యపై 2042 ఓట్ల మెజార్టీతో శాసనసభ్యురాలిగా ఆమె విజయం సాధించారు. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో  ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి కందుకూరి వీరయ్యపై 16,781 ఓట్ల మెజారిటీతో రెండో సారి  గెలిచారు. శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. మొదటి నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో సన్నిహితంగా ఉండే సుచరిత ఆయన మరణానంతరం జగన్ వెంటే నిలిచారు. 2014లో వైసీపీ  తరుపున మరోసారి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి రావెల కిషోర్ బాబు చేతిలో 7,405 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్, పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యురాలిగా ఆమె పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. 2019లో వైసీపీ తరఫున మరోసారి పోటీ చేసి ఇద్దరు మాజీ మంత్రులు డొక్కా మాణిక్య వరప్రసాద్, రావెల కిషోర్ బాబులను ఓడించి  7,398 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి హోం మంత్రి అయ్యారు.
-శిరందాసు నాగార్జున

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...