Aug 4, 2019

అవినీతిపై జగన్ ఉక్కుపాదం

         
వ్యవస్థ మొత్తం అవినీతిలో కూరుపోయింది. ప్రభుత్వంలోని కొన్ని శాఖలలో ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, రిజిస్ట్రేషన్, వైద్యం ... వంటి శాఖలలో లంచం ఇవ్వనిదే పనులు జరగవు. వారు  మానవత్వాన్ని కూడా ఏనాడో మరచిపోయారు.  వృద్ధులకు పెన్షన్ కోసం లంచం, రిజిస్ట్రార్  కార్యాలయంలో డాక్యుమెంట్ లో వారు చేసిన తప్పులు సరిదిద్దడానికి కూడా లంచం, పొలం కొలవాలంటే లంచం, పాస్ పుస్తకానికి లంచం, డ్రైవింగ్ లైసెన్స్ కు లంచం, ఇంటి ప్లాన్ కు లంచం, ప్రభుత్వ ఇల్లు మంజూరుకు లంచం, రేషన్ కార్డుకు లంచం, దివ్యాంగుడు కుంటుకుంటూ వచ్చి ధృవపత్రం ఇవ్వమన్నా లంచం... ఈ విధంగా పౌరుల పట్ల వారి వ్యవహార శైలి అత్యంత దారుణంగా ఉంటోంది. అంతా లంచాల మయం. ఇది జగమెరిగిన సత్యం. అటెండర్ దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు లంచాలు తినమరిగారు. అవినీతి నిరోధక శాఖ దాడులలో  బయటపడే అధికారుల ఆస్తుల లెక్కలే ఇందుకు నిదర్శనం. కొందరు ఉద్యోగులు లంచం తీసుకోవడం తమ హక్కుగా భావించే స్థితి నెలకొంది. ఉద్యోగులు తమ హక్కుల కోసం, జీతాలు పెంచమని పోరాడతారు. అవినీతి నిర్మూలన గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించరు. అది తమ పనికాదన్నట్లు వ్యవహరిస్తారు. ఇటువంటి వ్యవస్థలో, ఈ ఉద్యోగులలో మార్పు తీసుకురావడం అంత సామాన్యమైన విషయం కాదు. ఈ పరిస్థితులలో అవినీతిపై ఉక్కుపాదం మోపడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి సిద్దం పడ్డారు.  వ్యవస్థలో మార్పు తీసుకువచ్చి, దిగువ స్థాయి నుంచి అత్యున్నత స్ధాయి వరకు అవినీతిని రూపుమాపడానికి ఆయన పూనుకున్నారు. సీఎం తన స్థాయిలో తాను అవినీతి ప్రక్షాళన మొదలు పెట్టారు. జిల్లాలలో ఆ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు అప్పగించారు. మనసుపెట్టి పని చేయమని వారిని కోరారు. రెండు, మూడు నెలల్లో మార్పు కనిపించాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు. అవినీతి నిర్మూలన కావాలని, లంచం తీసుకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని  ఓ పక్క  సీఎం హెచ్చరిస్తున్నా, కొందరు మాత్రం ఏ మాత్రం భయం లేకుండా వారి ధోరణిలో వారు వ్యవహరిస్తున్నారు. అటువంటి వారికి కౌన్సిలింగ్ లాంటి చర్యల వల్ల పెద్దగా ఫలితం ఉండదు. ముఖ్యంగా వారికి సహాయపడేవారిపైన, వారికి మధ్యవర్తులుగా వ్యవహరించేవారిపైన కూడా కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఫలితం ఉంటుంది.  ఇదే పట్టుదలతో ప్రభుత్వం వ్యవహరిస్తూ, అవినీతికి పాల్పడే కొంతమందినైనా తొలగిస్తే ఏడాది, రెండేళ్లలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యవస్థలో పదం ఏదైనా  ‘లంచంఅనే అర్ధం వచ్చే మాటను పలకడానికి ప్రతి ఉద్యోగి భయపడే పరిస్థితి రావాలి. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా ప్రజలకు కావలసిన పనులు లంచం ఇవ్వకుండా నిర్ణీత సమయంలో జరగాలి.  ఆ రకమైన మార్పు వస్తే వచ్చే ఎన్నికలలో ఈ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు మళ్లీ  పోటీ చేస్తే ఎన్నికల ప్రచారానికి కూడా వారు డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు. ప్రజలే స్వచ్ఛందంగా వారికి మద్దతు పలుకుతారు. ఓటర్లు బారులుతీరి మరీ వారికే ఓట్లు వేస్తారు. ఈ ప్రభుత్వం చేపట్టే చర్యల వల్ల వ్యవస్థలో మార్పులు వస్తాయని ఆశిద్ధాం.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...