Aug 1, 2019


అక్రమ కట్టడాల కూల్చివేత
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం        
  వైఎస్ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎవరూ ఊహించని విధంగా అనేక సంచల నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటువంటి వాటిలో అక్రమ కట్టడాల కూల్చివేత నిర్ణయం ఒకటి. ఉండవల్ల సమీపంలో కరకట్ట పక్కన కృష్ణానది ఒడ్డున  ప్రజావేదికలో జూన్ 24న జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ‘‘మనందరం  పరిస్థితులను ఒక్కసారి గమనించాలి. వ్యవస్థ ఏ స్థాయిలో దిజగారిపోయిందో చూడాలి.  ఈ హాల్లో ఇంత మంది కలెక్టర్లు, కార్యదర్శులు, హెచ్‌ఓడీలు, మంత్రులు, సాక్షాత్తూ ముఖ్యమంత్రి కూర్చున్నారు. ఈ భవనం  చట్టపరంగా సరైనదేనా?
నిబంధనలకు విరుద్ధంగా, చట్టానికి వ్యతిరేకంగా, అవినీతితో కట్టిన భవనం ఇది. నది వరద మట్టం స్థాయి 24 మీటర్లు, కాని ఈ భవనం ప్రస్తుతం ఉన్న స్థాయి 19 మీటర్లు. ప్రజావేదిక హాలు ఇక్కడ కట్టొద్దని  కృష్ణా సెంట్రల్‌ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ గత ప్రభుత్వానికి లేఖ ఇచ్చారు. నదీ పరిరక్షణ చట్టాన్ని, లోకాయుక్త సిఫార్సులు పట్టించుకోలేదు. ఇది చూపించడానికి, మన ప్రవర్తన ఎలా ఉండాలి అన్న ఆత్మపరిశీలన చేసుకోవడానికే ఇక్కడే మీటింగ్‌ పెట్టమని చెప్పాను. ఒక అక్రమ నిర్మాణంలో కూర్చొని, పర్యావరణ చట్టాలు, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు, నదీ పరిరక్షణ చట్టాలన్నిటినీ ప్రభుత్వమే దగ్గరుండి బేఖాతర్‌ చేసిన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని తెలుసుకోవాలి. ఎవరైనా చిన్నవాళ్లు ఇదే పనిచేస్తే మనం ఏం చేసేవాళ్లం? అక్రమ నిర్మాణం ఎందుకు కడుతున్నామని అడిగేవాళ్లం. ఎవరైనా బలహీనులు ఈ పనిచేస్తే.. మనం అక్కడకు వెళ్లి ఆ నిర్మాణాన్ని తొలగిస్తాం. కాని మనమే ముఖ్యమంత్రిగా ఉండి, మనం రూల్స్‌ ను, నియమాలను ఉల్లంఘిస్తున్నాం. అంతరాత్మను మనం ప్రశ్నించుకోవాలి. ఈ హాలు నుంచే ఆదేశాలు ఇస్తున్నా. ఈ హాలులో ఇదే చివరి మీటింగ్‌.  మొదటి అక్రమ నిర్మాణం కూల్చివేత ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి’’ అని తెగేసి చెప్పారు. 25వ తేదీ ఎస్పీలతో సమావేశం ముగిసిన తరువాత దానిని కూల్చివేశారు. ఆ తరువాత విశాఖలోని అక్రమ నిర్మాణాలకు జీవీఎంసీ, కృష్ణా కరకట్ట వెంట నిర్మాణాలకు సీఆర్డీఏ నోటీసులు జారీ చేశాయి. కరకట్ట పక్కన మాజీ సీఎం చంద్రబాబు నివాసం ఉండే భవనానికి సంబంధించి లింగమనేని రమేష్ పేరిట సీఆర్‌డీఏ అధికారులు నోటీస్ జారీ చేశారు. నోటీస్ కాపీని భవనం బయట గోడకు అతికించారు. బీజేపీ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుకు చెందిన భూమి, అతను దానం ఇచ్చిన భూములలోనే ఎక్కువ కట్టడాలు ఉన్నాయి. అన్ని అనుమతులతోనే వాటిని నిర్మించినట్లు ఆయన చెప్పారు. విశాఖపట్నంలో ప్లాన్‌ లేకుండా నిర్మించిన టిడిపి మాజీ ఎంపి మురళీమోహన్‌కు చెందిన జయభేరి ట్రూ వ్యాల్యూ కార్‌ షోరూమ్‌ తోపాటు పలు భవనాలను టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూల్చేశారు.  భీమిలిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన క్యాంప్‌ కార్యాలయం మరి కొన్ని నిర్మాణాలకు అనుమతులు లేనట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు.
          స్పందన కార్యక్రమంలో తొలి ఫిర్యాదుతో  రాజధాని అమరావతి పరిధి మంగళగిరి మండలం  నవులూరు గ్రామంలో ఓ అక్రమ కట్టడాన్ని రెవెన్యూ అధికారులు జూలై 5న కూల్చివేశారు. గ్రామంలో రోడ్డును ఆక్రమించి  ఓ టీడీపీ నాయకుడు రేకుల షెడ్డు నిర్మించాడు.  ఈ విషయంపై స్థానికులు గతంలో పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత చేసిన ఫిర్యాదుకు  రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి అక్రమ కట్టడాన్ని ప్రొక్లెయిన్ సహాయంతో  కూల్చివేశారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూల్చివేయనున్నారు. దాంతో పర్యావరణ పరిరక్షణతోపాటు ట్రాఫిక్ సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.  
-శిరందాసు నాగార్జున

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...