Aug 1, 2019


ఒకనాటి మిస్టర్ ఆంధ్ర నేడు స్పీకర్         
          
 రెండు సార్లు మిస్టర్ ఆంధ్ర, మూడు సార్లు మంత్రి, అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తమ్మినేని సీతారామ్ 15వ శాసనసభ స్పీకర్ గా  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస శాసనసభ నియోజకవర్గం నుంచి  శాసనసభ్యునిగా ఎన్నికైన సీతారామ్ ఆ జిల్లా నుంచి ఎంపికైన నాలుగవ స్పీకర్. తమ్మినేని సీతారామ్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తొగరాం గ్రామం. 1955 జూన్ 10న తమ్మినేని శ్రీరామమూర్తి, ఇందువతమ్మ దంపతులకు 5వ సంతానంగా ఆయన జన్మించారు. ఆ కుటుంబంలో ఆయనే చిన్నవారు. ఆయనకు ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు ఉన్నారు. డిగ్రీ వరకు చదివిన సీతారామ్ వాణిశ్రీని పెళ్లి చేసుకున్నారు.  ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగ్, కుమర్తె నాగినీ విజయలక్ష్మి. అల్లుడు హనుమంతు రాజీవ్ గాంధీ ఐఏఎస్ అధికారి. మొదటి నుంచి సీతారామ్ వ్యాయామం, క్రీడల పట్ల ఎక్కువ ఆసక్తి చూపేవారు. శరీర దారుఢ్యం, ఆరోగ్యం విషయంలో ఆయన చాలా శ్రద్ధ వహిస్తారు. గతంలో ఆయన మిస్టర్ ఆంధ్రగా రెండు సార్లు ఎంపికయ్యారు.  ప్రొటీన్లు ఎక్కువ, క్యాలరీస్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటారు. ప్రతి రోజూ వాకింగ్ చేస్తారు.

                  విద్యార్థి  దశ నుంచే ఆయన రాజకీయాలలో చురుకుగా పాల్గొనేవారు.  స్టూడెంట్ యూనియన్ నాయకులుగా ఎదిగారు. 1982లో ఆమదాలవలస సహకార చెక్కర కర్మాగారం డైరెక్టర్ గా పని చేశారు.  పాల్గొన్నారు. 1983లో ఎన్టీఆర్  పిలుపుతో టీడీపీలో చేరారు. 2007 వరకు ఆ పార్టీలోనే ఉన్నారు. 1983లో తొలిసారిగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.  వాక్ఛాతుర్యం కలిగిన సీతారామ్ 1985లో రెండవ సారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్ గా పని చేశారు.  ఇప్పటి వరకు ఆరు సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. 1989లో పైడి శ్రీరామమూర్తితో పోటీ చేసి ఓడిపోయారు. 1991, 1994, 1999లో వరుసగా మూడు సార్లు గెలిచారు. 2004 వరకు శాసనసభ్యులుగా ఉన్నారు. 2004, 2009లో బొడ్డేపల్లి సత్యవతిపై పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కూన రవికుమార్ తో పోటీ చేసి ఓడిపోయారు.  ఆయనకు విశేష రాజకీయ అనుభవం ఉంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రచార ప్రతినిధిగా పనిచేశారు.  సీతారామ్ అనర్ఘళంగా ప్రసంగించగల దిట్ట. ఆయనకు ఆవేశం కూడా కాస్త ఎక్కువే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  శాప్ వైస్ ప్రసిడెంట్ గా, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, యువజన, ఖాదీ, లిడ్ క్యాప్,  క్రీడలు, మున్సిపల్ , చిన్నతరహా పరిశ్రమలు,  సమాచార, పర్యాటక, ఎక్సైజ్, న్యాయ  తదితర 18 శాఖలకు 9 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో టీడీపీ నుంచి ఆ పార్టీలో  చేరారు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో మళ్లీ టీడీపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో 2014లో టీడీపీని వదిలిపెట్టి వైసీపీలో చేరారు.  వైసీపీ శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షునిగా, రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యునిగా పని చేశారు.  కాళింగ సామాజికవర్గానికి చెందిన తమ్మినేని ఐదుసార్లు ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడుసార్లు టీడీపీ నుంచి,  ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా, ఇప్పుడు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
-శిరందాసు నాగార్జున

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...