ఫేస్ బుక్ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్
ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్ అబ్దుల్ రజా హుస్సేన్ సాహిత్యంలో ఓ రికార్డ్ సృష్టించి, సాహితీ శిఖరానికి చేరుకున్నారు. కాఫీ విత్..... పేరిట సాహితీ విమర్శలను ప్రారంభించి ఏకధాటిగా 3331 (మార్చి 21-దాకోజు శివప్రసాద్) ఎపిసోడ్స్ తో కొనసాగిస్తున్నారు. మార్చి 21 రాసిన ఎపిసోడ్ లో అన్నమయ్య -చలం మధ్య పోలిక వివరించారు. వారిద్దరి మధ్య పోలికేంటని ఆశ్చర్యపోకండి. చదివితే తెలుస్తుంది. 3195 ఎపిసోడ్ లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన నందిని సిధారెడ్డి రచించిన దీర్ఘకవిత “అనిమేష” (ఉపద్రవ గాధకావ్యమ్) నూరుపాళ్ళు అకాడెమీ పురస్కారానికి అర్హమైందని పేర్కొన్నారు. ఈ సాహితీ ప్రవాహం ఆగేదికాదు. ఇలాగే కొనసాగుతుంది. అంతేకాకుండా, చిత్రకళా పరిమళం -407 ఎపిసోడ్స్, కొత్త పుస్తకం-278(బీఎస్ రాములు ఆత్మకథ), మనసు విప్పి కాస్సేపు -175(ఆనందో పరబ్రహ్మ), సక్సెస్ స్టోరీలు-192, రమదాన్ - 25 ఎపిసోడ్స్, పచ్చి జ్ఞాపకం...మొదలైన శీర్షికల పేర్లతో వేలకు వేలు రాశారు. రాస్తున్నారు. ఈ మధ్య తన కవిత్వానికి, విశ్లేషణలకు అందమైన, అద్భుతమైన ఫొటోలను కూడా జతచేసి మరీ పోస్ట్ చేస్తున్నారు.
మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ‘‘ప్రజల దగ్గరకు వెళ్ళేది. ప్రజలతో మమేకమయ్యేది కవిత్వం .!!’’ అని మొదలుపెట్టి మనకు తెలిసిన అనేక మంది కవుల ‘ఆకు పచ్చని జ్ఞాపకాలు’ రాశారు. ఉద్యోగ విరమణ తర్వాత ఆయన రాయడమే పనిగా పెట్టుకున్నారు. అలుపెరగకుండా రాస్తున్నారు. సాహితీ లోతులను తవ్వితీస్తున్నారు. కొత్త పుస్తకాలను, కొత్త రచయితలను సాహిత్యలోకానికి పరిచయం చేయడమే పనిగా పెట్టుకున్నారు. గతంలో ‘యువ సంతకాలు’ శీర్షికన నాగభైరవ కోటేశ్వరరావు ‘వార్త’ ఆదివారం అనుబంధంలో యువ కవులను పరిచయం చేశారు. అయితే, ఆయన ఓ 200 మందికిలోపే పరిచయం చేశారు. అది పత్రిక అయినందున పరిమితి ఉంటుంది. ఫేస్ బుక్ అయినందున రజా హుస్సేన్ కు ఆ పరిమితిలేదు. ఓ కవి, ఆయన రాసిన పుస్తకం, రచన, కవిత్వం వెలుగులోకి రావాలంటే, చాలా రకాల సంబంధాలతో ముడిపడి ఉంటుంది. అయితే, రజా హుస్సేన్ కు అవేమీ పట్టవు. మనిషి జీవన శైలి, పుస్తకం, రచన, కవిత్వం నచ్చితే చాలు వెలుగులోకి తీసుకువస్తారు. ఆ విధంగా కొత్త రచయితలకు ఆరాధ్యుడయ్యారు.
రజా హుస్సేన్ రాతల పోకడకు ప్రపంచమే హద్దు. రచయితలు, కవులు, కళాకారులు, నటులు, వృత్తి నిపుణులు..... ఇలా మనిషిలో ఏ నైపుణ్యం ఉన్నా గుర్తించి, మరీ వెలుగులోకి తీసుకురావడం ఆయన ప్రత్యేకత. పురాతన కవుల దగ్గర నుంచి గురజాడ అప్పారావు, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ...... వంటి వారు మొదలుకొని ఖలీల్ జిబ్రాన్ .... వంటివారితోపాటు నేటి తరం యువకవుల వరకు.... గోసంగీల జీవితాలపై పలు రచనలు చేసిన ప్రముఖ తెలుగు రచయిత, పరిశోధకులు గనిశెట్టి రాములు, ఒగ్గు కళకు జీవితాన్ని అంకితం చేసిన తొలి మహిళా కళాకారిణి మల్లారి, జార్ఖండ్ డైనమెట్, డైనమిక్ చిత్రకారుడు మహతో మనీష్ కుమార్, చిత్రాలయ రాజు ప్రత్తిపాటి రాజు, బలిజేపల్లి లక్ష్మీకాంతం, శేషేంద్ర శర్మ, వెల్చాల కొండలరావు, డాక్టర్. వేదాంతం రామలింగశాస్త్రి, రావిరంగారావు, గోలి మధు, ఇషాక్ హుస్సేన్(ఇష్క్), షేక్ కరిముల్లా, తేళ్ళ అరుణ, మంజువాణి కొండపి , జ్యోతిర్మయి మళ్ళ, డాక్టర్ రాయదుర్గం విజయలక్ష్మి, పోర్షియా దేవి, భాగ్యలక్ష్మి నల్లా, నల్లి ధర్మారావు, సినీ ప్రముఖులు కాంచనమాల, కె.విశ్వనాథ్, ఎన్టీఆర్, అక్కినేని, సావిత్రి, జమున....... వంటి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, పురాణాలు, పురాతన భవనాలలో కళా నైపుణ్యం, శ్రీవెంకటేశ్వర శుప్రభాతం...... ఇలా ఎవరినీ, దేనిని వదిలిపెట్టరు. అన్ని రంగాల వారిని, అన్ని అంశాలను విశ్లేషించారు. సాహితీ పంట పండిస్తున్నారు. ఎవరి గురించైనా రాసే ముందు అతను ఆస్తికుడా?, నాస్తికుడా?, హేతువాదా?, ఏ మతం?, ఏ జాతి?, ఏ కులం?, ఏ పార్టీ?, చేనేత ఉద్యమకారుడా?, నక్సలైట్ ఉద్యమకారుడా?..... అనేవి అస్సలు పట్టించుకోరు. అతనిలో తనకు నచ్చిన ప్రతిభ గురించే ఆలోచిస్తారు. అధ్యయనం చేస్తారు. సారం మనకు అందిస్తారు.
అభ్యుదయ కవిత్వం నుంచి ప్రేమ కవిత్వం వరకు మనసుకు హత్తుకునేవిధంగా రజా హుస్సేన్ రాస్తారు. ‘స్పర్శ’ పై ఆయన చాలా అద్భుతంగా రాశారు. ఆయన చాలా వివరంగా రాసినప్పటికీ, దానిని చదివితే, మనకు ఇంకా అనేక స్పర్శలు, వాటి ప్రభావాలు, ఫలితాలు... గుర్తుకు వస్తాయి. ఒక్కో డాక్టర్ స్పర్శని హస్తవాసి అంటారు. అది కూడా అలాంటిదే. ‘‘ఈ ప్రేమ వుందే మా చెడ్డది…. ఎవరూ… తెలిసి ప్రేమించరు - ప్రేమించాకే …ప్రేమంటే ఏమిటోతెలుస్తుంది’’ అంటారు. మనం చెట్లు నరుక్కుంటూపోతున్నాం.. నగరాలన్నీ కాంక్రీటు వనాలవుతున్నాయి. అభివృద్ధి పేరుతో అడవుల్ని కాంక్రీటు జంగిల్ గా మారుస్తున్నాం. వన్యజీవులు ఎక్కడ బతకాలి? అని ప్రశ్నిస్తారు. సుఖం వేరు..ఆనందం వేరు. ఈ రెంటిలో ఆనందమే. పరమోన్నతమైంది..!! అని తెలిపారు. బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంపై నోరుజారిన ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావుని ‘ప్రవచనమా... విరోచనమా..?’ అని ఉతికి ఆరేశారు. వందేమాతరం పాటపై కూడా చక్కటి వివరణ ఇచ్చారు. వెంకటేశ్వరుడిని రాజకీయాల్లోకి లాగి నందుకు బాధపడతారు. అలా చేయకండ్రా బాబూ అని వేడుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన తన రచనల ద్వారా మత సామరస్యం కోసం ప్రయత్నిస్తారు. వీటన్నిటినీ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. వేల మంది జీవితాలు, వారి రచనలపై స్పందించారు. విమర్శించారు. మెచ్చుకున్నారు. ఆ విధంగా ఆయన జీవితమే సాహిత్యంతో పెనవేసుకుపోయింది. ఒక్క మనిషి ఇన్ని రాశారా?! అని ఆశ్చర్యపోతున్నారా? అవును. ఫేస్ బుక్ సాక్షిగా ఇది నిజం. సాహితీ అభిమానులకు రజాహుస్సేన్ రచనలు తిరగేయడం అంటే ఓ పండుగ.
రజా హుస్సేన్ పేరు కోసమో, సంపాదన కోసం ఇంతటి సాహిత్యాన్ని మనకు అందించడంలేదు. అది ఆయన ప్రవృత్తి. అత్యంత ఇష్టంగా రాస్తారు. సాహితీ వేత్తలన్నా, శ్రమజీవులన్నా ఆయనకు అంత ప్రేమ. కాఫీ విత్..... పేరిట రాసినవాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని తన సొంత ఖర్చులతో పుస్తక రూపంలో తీసుకురావడం కూడా ఆయన ప్రారంభించారు. మొదటిసారిగా ‘కాఫీ విత్ గోలి మధు’ అనే పుస్తకాన్ని బయటకు తెచ్చారు. భవిష్యత్తులో ఆయన రచనలపై ఎంఫిల్, పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంది. సాహితీ ప్రపంచంలో ఇంతటి సాహిత్యాన్ని గుమ్మరిస్తున్న రజా హుస్సేన్ కు ఆ స్థాయిలో తగిన గుర్తింపు రాలేదు. అందుకు ఆయన ముక్కుసూటి రాతలే అయి ఉండవచ్చన్నది నా భావన. అయితే, ఆయన సాహిత్య సృష్టిని ఎవరూ మెచ్చుకోకుండా ఉండలేరు. అభిమానుల ప్రశంసలకు మించిన అవార్డులు ఏముంటాయని రజా హుస్సేన్ అంటారు. అది కూడా నిజమే కదా! అది కూడా కాదు అదే నిజం.
నేను 2014లో ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ‘రామ్ గోపాల్ వర్మకు తిక్క: ఒక పరిశీలన’ శీర్షికన రాస్తూ, భవిష్యత్ లో అతనిపై యూనివర్సీటీలలో సినిమా - జర్నలిజం - సైకాలజీ - యాడ్స్ - కామర్స్ -హిస్టరీ...వంటి డిపార్ట్ మెంట్లలో పీహెచ్ డీలు చేసే అవకాశం ఉందని రాశాను. అయిదేళ్ల తర్వాత అతనిపై పీహెచ్ డీ చేయడం మొదలైంది. అలాగే, సాహిత్య గని అయిన రజా హుస్సేన్ రచనలపై కూడా తప్పక పీహెచ్ డీ చేస్తారని భావిస్తున్నాను.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914
















