రేపటి కోసం ఎడిటోరియల్ పేజీ

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కళాకారులపై కూటమి ప్రభుత్వం చల్లని చూపు పడింది. ఈ ప్రభుత్వం చేనేత వృత్తిని గౌరవించడంతోపాటు చేనేత కార్మికుల చిందించే శ్వేదాన్ని గుర్తించింది. చేనేత ఉత్పత్తులతోపాటు మార్కెటింగ్‌కు కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. చేనేత కళాకారుల జీవనాన్ని మెరుగు పరచడం కోసం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. చేనేత కుటుంబాలలో వెలుగు నింపుతోంది. చేనేత ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంది. అయితే, సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల, చేనేత సహకార సంఘాల నిర్వహణా లోపాల వల్ల చేనేత కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే చర్యల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా చేనేత మగ్గాల మోతలు మోగుతాయి. ప్రభుత్వం చేనేతకు సహకరిస్తే, అది ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. చేనేత రంగం అభివృద్ధి చెందడంతోపాటు చేనేత కుటుంబాలకు, అలాగే, చేనేత అనుబంధ రంగాలలో ఇతరులకూ ఉపాధి అవకాశాలు పెరుగుపడతాయి. చేనేత ఉత్పత్తులు, ఎగుమతులు పెరిగి ఈ రంగం కూడా సంపదని సృష్టిస్తుంది. చేనేత కార్మికులకు ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 7 నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నా. ఈ పథకం ప్రకారం చేనేత మగ్గం ఉన్న కుటుంబానికి 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం. మర మగ్గం ఉన్న కుటుంబానికి 500 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం. ఈ ఉచిత విద్యుత్ పథకం కోసం కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.190 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో చేనేత మగ్గాలు ఉన్న 50 వేల కుటుంబాలు, మర మగ్గాలు ఉన్న 15 వేల కుటుంబాలు లబ్ధి పొందుతాయి. మగ్గానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం అంటే చేనేత కార్మికుడి కష్టానికి గౌరవం ఇవ్వడమే. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద 50 ఏళ్లు దాటిన ఒక్కో చేనేత కళాకారుడికి రూ.4000 పెన్షన్ ఇస్తున్నారు. 92,724 చేనేత కుటుంబాలకు సామాజిక పింఛన్ల కోసం ఏడాదికి రూ.546 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ కింద మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, శ్రీకాళహస్తి, రాజాంలలో రూ.74 కోట్లతో కొత్త చేనేత క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వీటిద్వారా 11,374 మంది చేనేత మహిళలకు లబ్ధి చేకూరుతుంది. నేతన్న నేస్తం పథకం ద్వారా ఒక్కో కుటుంబంలో ఒక చేనేత కళాకారుడుకి ఏడాదికి రూ.25 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, సొంత ఇల్లు లేక, ఇల్లు ఉన్నా మగ్గం పట్టే స్థలం లేక మాస్టర్ వీవర్‌కు చెందిన షెడ్లలో నేత నేసే నిజమైన పేద చేనేత కళాకారులకు కూడా నేతన్న నేస్తం పథకం వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. చేనేత వస్త్రాల అమ్మకంపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న 5 శాతం జీఎస్టీని ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.15 కోట్లు చెల్లించనుంది. గత ప్రభుత్వం నిలిపివేసిన త్రిఫ్ట్ నిధులను కూటమి ప్రభుత్వం మళ్లీ అమలులోకి తీసుకొచ్చింది. 5,386 మంది చేనేత కళాకారులకు రూ.5 కోట్లను విడుదల చేసింది. చేనేత క్లస్టర్స్ లో నమోదైన చేనేత కళాకారులకు మగ్గం, ఇతర మగ్గం పరికరాలు 90 శాతం సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ముద్ర యోజన పథకం క్రింద చేనేత కళాకారులు, చేనేత సహకార సంఘాలు ముడిసరుకుల కొనుగోలుకు బ్యాంకుల ద్వారా 20శాతం సబ్సిడీ తో రుణాలు మంజూరు చేస్తున్నారు. ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన పథకం కింద 18 నుంచి 50 ఏళ్ల లోపు చేనేత కళాకారుడు మరణిస్తే రూ.2 లక్షల జీవిత భీమా చెల్లిస్తారు. ఈ పథకానికి ప్రీమియం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. 18 నుంచి 70 ఏళ్ల మధ్య చేనేత కళాకారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద రూ.2 లక్షల చెల్లిస్తారు. చేనేత కళాకారులకు ఆరోగ్య బీమా పథకం కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రూ.10 వేల కోట్ల పెట్టుబడితో నూతన టెక్స్‌టైల్స్ పాలసీని ప్రభుత్వం రూపొందించింది. 1.51 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల( ఎంఎస్ఎంఈ) పార్కుల్లో చేనేత కళాకారుల కోసం ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. చేనేత సహకార సంఘాలను పటిష్టపరిచేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ సంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
చేనేత కుటుంబాలు ఎక్కువగా ఉన్న మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎన్నికవడం కూడా చేనేత వర్గాలకు కలిసి వచ్చింది. మంత్రి నారా లోకేష్‌తోపాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి కూడా చేనేత రంగం అభివృద్ధిపైనే ఉంటుంది. జాతీయ చేనేత దినోత్సవం రోజు మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో కూడా వారు ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. చేనేత కళాకారులు అధికంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గ ప్రజలు తనను 90,160 మెజార్టీతో గెలిపించారన్న విశ్వాసం కూడ మంత్రి లోకేష్‌కు ఉంది. దాంతో, మంత్రి నారా లోకేష్‌తోపాటు ఆయన సతీమణి బ్రాహ్మణి కూడా చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. గతంలోనే మంత్రి లోకేష్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని మంగళగిరి ఆటోనగర్‌లో వీవర్‌శాల ఏర్పాటు చేశారు. ప్రముఖ జాతీయోద్యమ నాయకుడు, చేనేత పరిశ్రమ రక్షణ కోసం పోరాటం చేసిన యోధుడు, చేనేత సూర్యుడిగా పేరొందిన రాజ్యసభ మాజీ సభ్యుడు ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, మంగళగిరిలో కొత్తగా ఏర్పాటు చేసే పెద్ద పార్కుకి ప్రగడ కోటయ్య పేరు పెట్టి, అక్కడ ఆయన విగ్రహం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. చేనేత వారసత్వాన్ని ప్రదర్శించేందుకు అమరావతిలో చేనేత మ్యూజియం ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. చేనేత పరిశ్రమ ఎదగాలన్న తపన ఉన్న పారిశ్రామికవేత్త సుచిత్ర ఎల్లాను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ కింద రాష్ట్రానికి వచ్చిన తొమ్మిది అవార్డుల్లో నాలుగు చేనేత రంగానికే వచ్చాయి. ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ ద్వారా చేనేత ఉత్పత్తుల మార్కెట్ విస్తరిస్తోంది. ఇప్పటికే రెండు వేల చేనేత ఉత్పత్తులు ఇందులో నమోదయ్యాయి. చేనేతను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914
No comments:
Post a Comment