Feb 28, 2026

ఆయేషా మీరా హత్య కేసులో అన్నీ సమాధానాలు దొరకని ప్రశ్నలే!

మృత దేహాం అవశేషాలకు అంత్యక్రియలతో పూర్తిగా ముగిసిపోయిన కేసు

ఆయేషా మీరా మృత దేహాం అవశేషాలకు శుక్రవారం అంత్యక్రియలు పూర్తి కావడంతో ఆమె హత్య కేసు పూర్తిగా ముగిసిపోయినట్లు భావించవచ్చు. విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గా లేడీస్ హాస్టల్‌లో 2007, డిసెంబరు 27 అర్ధరాత్రి జరిగిన ఆయేషా మీరా హత్యకేసులో సమాధానాలు దొరకని ప్రశ్నలు అనేకం ఉత్పన్నమవుతున్నాయి. తెనాలికి చెందిన ఆయేషా విజయవాడలోని నిమ్రా కాలేజ్‌లో ఫస్టియర్ బీఫార్మసీ చదువుతూ హత్యకు గురైన ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు విచారణలో ట్విస్ట్ లు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించి ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో చివరికి దోషిని కనిపెడతారు. అయితే, ఈ కేసు విచారణ 18 ఏళ్లు సుదీర్ఘంగా సాగిన తర్వాత కూడా దోషులను కనిపెట్టకుండానే ఈ కేసుని విజయవాడ సీబీఐ కోర్టు ఈ నెల 20న మూసివేసింది. ఈ కేసులో నిందితులను గుర్తించడానికి తగిన ఆధారాలు లభించలేదని సీబీఐ సమర్పించిన తుది నివేదిక ఆధారంగా ఈ కేసు మూసివేస్తున్నట్లు కోర్టు తెలిపింది. రెండోసారి పోస్టుమార్టం కోసం సేకరించిన ఆయేషా మీరా మృతదేహానికి సంబంధించిన అవశేషాలను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 27వ తేదీన ప్రత్యేక వాహనం, ఎస్కార్ట్, ప్రభుత్వ భద్రతతో తెనాలిలోని ఖబరస్తాన్ లో అంత్యక్రియలు నిర్వహించాలని, ఈ ప్రక్రియను రెవెన్యూ, పోలీసు అధికారులు, మత పెద్దల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ ప్రకారం తెనాలి చెంచుపేటలోని ఖబరస్తాన్ లో ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. దీంతో, ఈ కేసు ప్రక్రియ పూర్తిగా ముగిసిపోయింది. ఆయేషా తల్లి శంషాద్ బేగం, తండ్రి ఇగ్బాల్ బాషాల పోరాటం ఫలించలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. 18 ఏళ్లు పోరాటం చేసి అలిసిపోయామని, ఇక పోరాటం చేసే శక్తి గానీ, ప్రొటెస్ట్ పిటిషన్ వేసే ఆర్థిక స్థోమత గాని తమకు లేవని ఆయేషా తల్లి కోర్టులో కన్నీరు పెట్టుకున్నారు. న్యాయం కోసం ఆ తల్లిదండ్రులు ఎక్కని గడపలేదు. వేడుకోని నాయకులు లేరు.

ఆయేషా హత్య జరిగిన వెంటనే దోషులు, కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేశారు. అందులో వారు విజయం సాధించారు. రాజకీయాలు, కులం, డబ్బు, అధికారం.... వంటి అంశాల ప్రభావంతో దోషులు ఎవరో తేలకుండానే ఈ కేసుని మూసివేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు ఇలా నీరుకారిపోవడానికి వ్యవస్థలోని లోపాలే కారణమని న్యాయనిపుణులు తేల్చారు.
ఆయేషా హత్య జరిగిన తర్వాత తెల్లారిపాటికే అక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండా దోషులు ముందు జాగ్రత్తపడ్డారు. అంతేకాకుండా, పోలీసులు కూడా దోషులకు పూర్తిగా సహకరించారన్న ఆయేషా తల్లిదండ్రులు ఆరోపించారు. పైగా కొత్త ఆధారాలు సృష్టించారు. పోలీసులు ఆయేషా మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె ఛాతీ మీద ‘చిరుత 143’ అని, పొట్ట మీద లవ్ సింబల్ రాసి ఉంది. అక్కడే లభించిన ఓ లెటర్‌లో, ‘‘నన్ను ప్రేమించమని బతిమిలాడినా ఒప్పుకోలేదు. అందుకే కోపంతో హాస్టల్‌కు వచ్చా. ఆమెను కొట్టి, అత్యాచారానికి పాల్పడ్డాను. అడిగినప్పుడు ప్రేమించకపోతే మిగతావారికీ ఇదే గతి పడుతుంది’’ అని రాసి ఉంది.
ఈ కేసులో పోలీసులు మొదట హాస్టల్ వంటమనిషిని అనుమానించి, విచారించారు. అతను కాదని తేలింది. తర్వాత తెనాలికి చెందిన శివాంజనేయులు, జగిత్యాలకు చెందిన ఉపేందర్ సింఘ్, గుర్విందర్ సింఘ్ అలియాస్ లడ్డూలను ఒకరి తర్వాత ఒకరిని అరెస్టులు చేశారు. అయితే, వారి అందరి కుటుంబ సభ్యులు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో వారిని విడుదల చేశారు. ఒకానొక సందర్భంలో ఆయేషా మీరా మేన మామను, మరో సమీప బంధువును కూడా పోలీసులు అనుమానించారు. చివరకు ఇతర నేరాల క్రింద సబ్ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం, అనాసాగర గ్రామానికి చెందిన పిడతల సత్యనారాయణ అలియాస్ సత్యం బాబు అనే యువకుడిని నిందితునిగా పేర్కొని, 2008 ఆగస్టు 11న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారి పద్ధతిలో అతనే ఆయేషాని హత్య చేసినట్లు ఒప్పించారు. సత్యంబాబుని 2010లో విజయవాడ మహిళా సెషన్స్ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టగా, అతను వాస్తవం చెప్పాడు. తాను హత్య చేయలేదని, పోలీసులే తనచేత అలా చెప్పించారని కోర్టుకు తెలిపాడు. పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాల ప్రకారం సత్యంబాబుని నేరస్తునిగా పేర్కొంటూ, మహిళా సెషన్స్ స్పెషల్ కోర్టు అతనికి 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అయితే, సత్యంబాబు నేరస్థుడు కాదని, ఓ మాజీ మంత్రి మనవడే అసలు నేరస్థుడని ఆయేషా తల్లి శంషాద్ బేగం తొలి నుంచి మొత్తుకుంటోంది. హాస్టల్ లోని ముగ్గురు అమ్మాయిలు బయటి వ్యక్తులతో ఉండటం చూసినందుకే ఆయేషాని హత్యచేశారని తల్లిదండ్రుల ఆరోపణ. వారి మాటలు వినే పరిస్థితులు లేవు. సత్యంబాబు బంధువులు హైకోర్టుని ఆశ్రయించారు. బొజ్జా తారకం వంటి వారు కోర్టులో సత్యంబాబు తరఫున వాదించారు. 2017, మార్చి 31న హైకోర్టు సత్యంబాబు నిర్ధోషిగా తీర్పు చెప్పింది. ఆయేషాను సత్యంబాబే హత్య చేశారని చెప్పడానికి తగిన ఆధారాలను పోలీసులు చూపలేకపోయారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. పోలీసులు ఎవరో ఒకరిని నేరస్తునిగా చూపాలన్న దిశగానే దర్యాప్తు చేశారే తప్ప, అసలైన నిందితులను పట్టుకునే ఉద్దేశంతో దర్యాప్తు చేయలేదని హైకోర్టు అభిప్రాయపడింది.
ఆ తర్వాత ఆయేషా మీరా తల్లిదండ్రులు2018 జనవరి 27న హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయమని 2018 నవంబరు 29న హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటికే దిగువ కోర్టులో ఆధారాలు ధ్వంసం చేశారు. హైకోర్టులో కేసు నడుస్తున్న సమయంలో, 2014లోనే విజయవాడ కోర్టులో ఈ కేసు రికార్డులన్నీ ధ్వంసమయ్యాయని సిట్ హైకోర్టుకు తెలిపింది. స్థానిక కోర్టులో ఈ కేసుకు సంబంధించిన రికార్డులు ధ్వంసమయ్యాయని ఆయేషా మీరా తరఫు న్యాయవాదులు ముందే అనుమానం వ్యక్తం చేశారు. వారు అనుమానించినట్లే జరిగింది. సిట్ దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో ఈ కేసుని 2018 డిసెంబరు 16న సీబీఐకి అప్పగించారు. ఆయేషా మృతదేహాన్ని సీబీఐ రీపోస్ట్ మార్టం చేసి, కొత్త ఆధారాలు ఏమీ దొరకలేదని కోర్టుకు తెలపడంతో కోర్టు కేసుని మూసివేసింది.
ఈ నేపథ్యంలో శంషాద్ బేగం వంటి పేద కుటుంబాలకు న్యాయం లభించే అవకాశం లేదా? స్థితిముంతులైతే రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు అండతో తప్పించుకోగలుగుతారా? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా వారు ఎలా తప్పించుకోగలిగారు? న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఏం చేయలేకపోయాయా? శంషాద్ బేగం కుటుంబానికి ఏ రకంగానూ న్యాయం దక్కదా? హత్య జరిగిన నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆనంద్ బదిలీ తర్వాత కేసు మొత్తం ఎలా తారుమారైంది? హాస్టల్ వార్డెన్ కోనేరు పద్మ నోరు తెరిస్తే, అయిదు నిమిషాల్లో కేసులోని నిజానిజాలు వెల్లడవుతాయని ఆయేషా తల్లి శంషాద్ బేగం ఆనాడే చెప్పారు. ఆమె చేత పోలీసులు ఎందుకు నిజం చెప్పించలేకపోయారు? హాస్టల్లో కొందరి రాసలీలలు చూసిందనే తన కుమార్తెని హత్య చేశారని శంషాద్ బేగం చెప్పారు. ఆ రాసలీలలు ఎవరి మధ్య జరిగాయో పోలీసులు ఎందుకు కనిపెట్టలేకపోయారు? తెల్లారేపాటికి సాక్ష్యాలను ఎవరు మాయం చేశారు? పోలీసులు తెలుసుకోలేకపోయారా? ఈ కేసుకు సంబంధించిన రికార్డులు కోర్టులోనే ఎవరు ధ్వంసం చేశారు? ఎందుకు చేశారు? అంతటి తీవ్రమైన నేరాన్ని చేసినవారిని ఇంకా కనుగొనలేదా? వారిని తెలుసుకుని శిక్షించరా? సత్యంబాబు చేయని నేరానికి 8 ఏళ్లు శిక్ష అనుభవించి, నిర్దోషిగా విడుదల అయ్యాడు. హైకోర్టు నష్టపరిహారం కింద లక్ష రూపాయలు ఇవ్వమని తీర్పు ఇచ్చింది. సత్యంబాబు అన్యాయంగా 8 ఏళ్లు శిక్ష అనుభవించడానికి బాధ్యులు ఎవరు? సత్యంబాబు చేయని నేరం అంగీకరించే విధంగా పోలీసులు ఎందుకు చేశారు? అలా చేసిన వారికి శిక్ష ఏమీ లేదా? 8 ఏళ్ల జైలు శిక్షకు నష్ట పరిహారం లక్ష రూపాయలు ఇవ్వమని హైకోర్టు ఆదేశించింది. ఇది న్యాయమేనా? అతను అన్యాయంగా శిక్ష అనుభవించినందుకు, జైల్లో అతను, ఇంటి వద్ద కుటుంబ సభ్యులు అనుభవించిన మనోవేదనకు, బాధలకు, అతని జీవితంలో 8 ఏళ్లు వృధా అయినందుకు, అతనికి నష్టపరిహారం ఇదా? అసలు హంతకులు ఎవరు? ఎందుకు చంపారు? ఈ ప్రశ్నలన్నిటీకీ సమాధానాలు లేవు. హత్య మిస్టరీగానే మిగిలింది. ఈ కేసులో న్యాయం జరగలేదని అందరికీ తెలుసు. అసలు హంతకులను కనిపెట్టలేని దయనీయ స్థితిలో మన వ్యవస్థలు ఉన్నాయా?. లేదా ఆ దోషులు తమకు అనుకూలంగా వాడుకునే స్థితిలో వ్యవస్థలు ఉన్నాయా?. చివరిగా ‘‘ఈ నెల 27న తమ కుమార్తె శరీర భాగాలతో పాటు సత్యం, న్యాయం, ధర్మాన్ని కూడా పూడ్చిపెట్టబోతున్నాం’’ అని ఆయేషా మీరా తల్లిదండ్రులు ఎంతో బాధతో చెప్పారు. న్యాయం కోసం పోరాడి, వేసారిపోయిన తల్లిదండ్రులు ఆయేషా మీరా పేరుతో ఒక విద్యా సంస్థని నెలకొల్పమని, ఇటువంటి బాధితులకు సహాయపడే విధంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆ పని చేస్తుందని ఆశిద్ధాం.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Feb 22, 2026

మంగళగిరిలో చేనేత కులాల గర్జన

నేడు మహా ప్రదర్శన, భారీ బహిరంగ సభ


దేశంలో వ్యవసాయ తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే చేనేత రంగం నేడు దయనీయ పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వ హామీలు సరైన రీతిలో అమలు కాకపోవడంతో రాష్ట్రంలోని చేనేత కార్మికుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చేనేత సంఘాలన్నీ ఏకమై ‘చలో మంగళగిరి’ పిలుపును ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ‘చేనేత గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాయి. సమస్త చేనేత కులాల వారు ఏకంకండి అని పిలుపునిచ్చాయి. తమ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలన్న సంకల్పంతో చేనేత కార్మికులు మంగళగిరిలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నుంచి ఎన్ఆర్ఐ ఆస్పత్రి సమీపంలోని వై జంక్షన్ వద్ద చేనేత సర్కిల్ వరకు మహా ప్రదర్శన నిర్వహించి, అక్కడే పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ ‘చేనేత గర్జన’ విజయవంతం చేసేందుకు వివిధ చేనేత సంఘాల నేతలు నెల రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వివిధ చేనేత కులాలకు చెందిన చేనేత కార్మికులను ఏకం చేశారు. ఉద్యమబాట పట్టించారు. ప్రభుత్వాల మాటలు కాగితాలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడంలేదన్నది వారి బాధ. శాసనసభల్లో తమకు తగిన ప్రాధాన్యత లేదన్నది వారి ఆవేదన.
రాష్ట్రంలో తరతరాలుగా చేనేత వృత్తిపైనే జీవించే కులాలు అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుసాలి, తొగటవీరక్షత్రియ, స్వకులశాలి, కుర్హీనసెట్టి (కుర్ణి)(నెస్సి), సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు,కరికాల భక్తులు, సాధనాసూరులు, బావసార క్షత్రియ, ఖత్రి, నీలి, నీలకంఠి, కోస్టి, ముదలియార్ మొత్తం 18 చేనేత కులాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇవి అంత్యంత వెనుకబడిన కులాల(ఎంబీసీ) జాబితాలో ఉన్నాయి. ప్రభుత్వ వద్ద అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 1,77,447 మంది చేనేత కార్మికులు ఉన్నారు. ప్రస్తుతం మూడు లక్షల మంది ప్రత్యక్షంగా, 8 లక్షల మంది పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.ఎంతో ప్రాధాన్యత కలిగిన ఇన్ని చేనేత కులాల నుంచి శాసనసభలో కదిరి నుంచి కందికుంట వెంకట ప్రసాద్, శాసనమండలిలో విజయవాడ నుంచి పంచుమర్తి అనురాధ ఇద్దరు మాత్రమే ఉన్నారు.
రాజకీయ ప్రాధాన్యత అలా ఉంటే, వృత్తిపరంగా చేనేతకు సంబంధించిన నూలు, సిల్క్, రంగులు, రసాయనాలు ముడిసరుకులు వంటి వాటి ధరలు, చేనేత ఉత్పత్తులు, అమ్మకాలు, ఎగుమతులు, పన్నులు, సబ్జిడీలు, ఇతర సౌకర్యాల వంటి అనేక సమస్యలు ఉన్నాయి. చేనేతకు సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల, చేనేత సహకార సంఘాల నిర్వహణా లోపాల వల్ల చేనేత కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యలను ఆచరణాత్మకంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం వల్ల చేనేత కార్మికుల సమస్యలు రోజురోజుకు పేరుకుపోతున్నాయి. సమస్యల పరిష్కారం దిశగా కూడా అడుగులు పడటంలేదన్నది వారి ఆరోపణ. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అర్హులు అందరికీ ఇవ్వాలన్నది వారి డిమాండ్. నేతన్న నేస్తం పథకం ద్వారా ఒక్కో కుటుంబంలో ఒక చేనేత కళాకారుడుకి ఏడాదికి రూ.25 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, సొంత ఇల్లు లేక, ఇల్లు ఉన్నా మగ్గం పట్టే స్థలం లేక మాస్టర్ వీవర్‌కు చెందిన షెడ్లలో నేత నేసే నిజమైన పేద చేనేత కళాకారులకు కూడా నేతన్న నేస్తం పథకం వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ప్రభుత్వానికి, మంత్రులకు, అధికారులకు చేనేత కార్మికుని బతుకు చిత్రం తెలియకపోవడం వల్ల కూడా వారి సమస్యలు పరిష్కారం కావడంలేదన్న భావన ఉంది. రాష్ట్రంలోని చేనేత కార్మికుల స్థితిగతులను, వృత్తిపరంగా వారు ఎదుర్కునే సమస్యలను ప్రభుత్వానికి అర్థమయ్యేరీతిలో వివరించగల గల నేతలు ఎదిగి, శాసనసభలకు ఎన్నిక కావలసి ఉంది. చేనేత వర్గాల నుంచి, చేనేత రంగంపై సంపూర్ణ అవగాహన ఉన్న నేతలు మాచాని సోమప్ప, ప్రగడ కోటయ్య, పుచ్చల సత్యనారాయణ, కుండా రామయ్య, అగిశం వీరప్ప, దామర్ల రమాకాంతరావు, గోలి వీరాంజనేయులు వంటివారు మరణించిన తరువాత ఈ రంగం నుంచి రాజకీయంగా నాయకత్వం లోపం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. వారికి చేనేత సమస్యలపై పూర్తి అవగాహన ఉండేది. అందువల్ల వారి హయాంలో ఈ రంగానికి ఎంతో మేలు జరిగింది. ఆ తరువాత ఈ కులాల వారు రాజకీయంగా బలహీనమవడం వల్ల చేనేత రంగానికి తీవ్ర నష్టం జరుగుతూ వస్తోంది.
చేనేత వర్గాల వారు దాదాపు 65 లక్షల మంది, అంటే రాష్ట్ర జనాభాలో 12 శాతం మంది ఉన్నా ఒక్క మంత్రి పదవి కూడా లేదు. చేనేత మంత్రిత్వ శాఖ ఈ వృత్తి గురించి తెలియని, మరో కులం వారు నిర్వహించడం వల్ల వారికి చేనేత సమస్యలపై అవగాహన ఉండదు. నేరుగా చేనేత రంగంతో సంబంధం ఉన్న, చేనేత వృత్తి, ఆ రంగంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నవారు శాసనసభలో, మంత్రి మండలిలో ఉండవలసిన అవసరం ఉంది.
రాజకీయపరమైన, వృత్తి పరమైన అన్ని సమస్యలను ఎలుగెత్తి చాటేందుకు ఈ చేనేత గర్జన నిర్వహించనున్నారు.
‘చేనేత గర్జన’ డిమాండ్లు
1. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల వార్షిక బడ్జెట్ల కేటాయింపుల్లో చేనేతకు న్యాయం చేయాలి.
2.జౌళి పరిశ్రమకు అనుకూల, చేనేత వ్యతిరేక విధానాలలో మార్పు రావాలి.
3.ప్రభుత్వాలు చేనేత పరిశ్రమ రక్షణకు, కార్మికుల జీవనానికీ, మనుగడకూ తోడ్పడే నిర్ణయాలు తీసుకోవాలి.
4.చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలి.
5. కేంద్ర బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ.25 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో రూ.2 వేల కోట్లు కేటాయించాలి.
6. చేనేత కార్మికులతోపాటు చేనేత ఉప వృత్తులు చేసుకునే కార్మికులందరికీ ప్రతి సంవత్సరం రూ.25వేల ఆర్థిక సహాయం అందించాలి.
7. అర్హులైన అందరికీ పెన్షన్ మంజూరు చేయాలి.
8. సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించవలసిన రూ.203 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
9. చేనేత సహకార సంగా రుణాలు రద్దు చేయాలి.
10.చిలప నూలు, పట్టు, రంగులు, రసాయనాలను సబ్సిడీ రేట్లకు సప్లై చేయాలి.
11. ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలను నెరవేర్చాలి.
12. నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి.
13. ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో నేత కార్మికులకు రూ.10 వేల ఆర్థిక సహకారం అందించాలి.
14.ఆత్మహత్యలు, ఆకలి చావులతో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.
15. 200 యూనిట్ల వరకూ విద్యుత్‌ను ఉచితంగా అందించే పథకాన్ని వెంటనే అమలుపరచాలి.
16. కేంద్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ బోర్డును పునరుద్ధరించాలి.
17. చేనేత సహకార సంఘాల పాలక వర్గాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలి.
18. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి మూడు సెంట్లు భూమి ఇచ్చి, అందులో వర్క్‌ షెడ్లను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Feb 18, 2026

ప్రశ్నించే పాత్రికేయమే సత్యాన్వేషణ

బండారు రాధాకృష్ణ వ్యాసాలపై సమీక్ష


జర్నలిస్ట్ కు సామాజిక స్పృహ ఉండాలి. దానికి నూరు శాతం న్యాయం చేశారు ప్రముఖ నటుడు, విద్యావేత్త, సీనియర్ జర్నలిస్ట్ బండారు రాధాకృష్ణ. వృత్తి ధర్మానికి కట్టుబడిన వ్యక్తి. 86 ఏళ్ల వయసులో కూడా సామాజిక చైతన్యంతో విధంగా వివిధ పత్రికలకు వ్యాసాలు రాయడంతోపాటు విశాలాంధ్ర దినపత్రికలో ప్రతి శుక్రవారం ‘వివేచన’ పేరుతో ఓ కాలం కూడా నిర్వహిస్తున్నారు. వయసు మీదపడుతున్నా, సడలని దృఢత్వంతో, సామాజిక బాధ్యతతో, ముఢనమ్మకాలకు వ్యతిరేకంగా, యువతని మేల్కొలిపే విధంగా ఎంతో చురుకుగా తన రచనలు కొనసాగిస్తున్నారు. చిన్నప్పటి నుంచి వామపక్ష భావాలు పుణికిపుచ్చుకున్న రాధాకృష్ణ మంచి నటుడు. 50కి పైగా నాటకాలలో నటించారు. లంబాడీ రాందాసు అనే నాటకాన్ని ఆటపాటి లక్ష్మి హీరోయిన్ గా 50 చోట్ల ప్రదర్శించారు. 26 ఏళ్లకుపైగా ఈనాడు విలేకరిగా పనిచేసిన రాధాకృష్ణ 65 ఏళ్ల క్రితమే ఇంజనీరింగ్ చదివి, సింగరేణి కాలరీస్ లో ఉద్యోగం చేశారు. ఆ సమయంలోనే కమ్మూనిస్టు కార్మిక సంఘాలతో కలిసి పనిచేశారు. అప్పటి నుంచే కమ్మూనిస్టు నేతలతో పరిచయాలు. కమ్యూనిస్టు భావజాలంతో ఎరుపెక్కిన ఆయన కలానికి ఇప్పటికీ పవర్ తగ్గలేదు. యువకుడిగా ఉన్నప్పుడు ఎలా రాసేవారో, ఇప్పుడు కూడా అదే స్ఫూర్తి, అదే స్పందన, అదే రాత. అదే ఆయన ప్రత్యేకత. 2020 నుంచి 2025 వరకు ఆయన రాసిన 50 వ్యాసాల సంపుటిని ఇటీవల విజయవాడలో ఆవిష్కరించారు. పాఠకులను ఆకట్టుకునే విధంగా, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో తన వ్యాసాలను బావా బావా అనుకునే రెండు పాత్రలతో మొదలు పెట్టి సమకాలీన సమాజంలో జరిగే, జరుగుతున్న అనేక అంశాల లోతులకు వెళతారు. మనిషికి తలెత్తే అనేక ప్రశ్నలు ‘సత్యాన్వేషణ’లో ఉన్నాయి. 172 పేజీల ఈ వ్యాస సంపుటిలో పలు ప్రశ్నలకు సమాధానాలు కూడా ఉన్నాయి.
గుడి-బడి అనే వ్యాసంలో ఈ సమాజంలోని మనుషులకు గుడులమీద ఉన్న శ్రద్ధ బడులపై లేకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించి, యువత ఆలోచనను వ్యవసాయంవైపు మళ్లించాలన్నది ఆయన ఆకాంక్ష. శివం శవం అనే వ్యాసంలో తాము సృష్టించిన దేవుడే అంతా చేస్తారన్న భావనను మనుషులందరిలోకి మత పెద్దలు చొప్పించారని, దాంతో, తాము నిమిత్తమాత్రులం, నిస్సహాయులం అన్న దోరణిలో మనుషులున్నారన్న బాధ వ్యక్తం చేశారు. తనకు తెలియనివాడు మరణించినా, ఆ మృతదేహం వద్దకు వెళ్లి చూస్తే చాలు, ఇంటికి వెళ్లి స్నానం చేసే స్థితిలో మనిషి ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేస్తారు. తత్వం లక్ష్యం సత్యాన్వేషణ అని, మతం లక్ష్యం అసత్యంపై విశ్వాసం కలిగి ఉండటం అని తెలిపారు. మనిషిని మతానికి బానిసగా మారుస్తున్న వ్యవస్థపై రచయితలు అక్షరాన్ని సంధించాలని పిలుపు ఇచ్చారు రాధాకృష్ణ.
ఒకప్పుడు ఆంగ్లేయులను తరిమికొట్టిన అక్షరం, నేడు రాజకీయ నాయకుల చేతిలో నలిగిపోతుంది, కాదు ఉరితీయబడుతోందని ఆవేశంగా చెప్పారు. మరో వ్యాసంలో అక్షరం ఆయుధం కన్నా గొప్పదని, కోట్ల మందిని చైతన్యపరుస్తుందని, ప్రభుత్వాలను సైతం పడగొడుతుందన్నారు. కళలన్నిటిలోకి దృశ్య కావ్యం మనిషి మనసుని తాకి, మార్పుకు నాంది పలుకుతుందని ఇంకో వ్యాసంలో చెప్పారు. ఇందులో నాటక రంగ చరిత్రని సంక్షిప్తీకరించారు. ప్రశ్నించకపోతే నిజం బయటపడదు. కానీ, నేడు ప్రశ్నించిన మనిషి జైలులో ఉంటున్నాడని చెప్పారు. సామాజిక స్పృహతో సమాజం కోసం నినదించిన, 90శాతం వైకల్యం ఉన్న
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా జైలులోనే మగ్గిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పౌరహక్కులు హరించుకుపోతుంటే, నిద్రపోతున్న మానవాళిని మేల్కొలపవలసిన అగత్యం ఏర్పడిందన్న బాధ్య వ్యక్తం చేశారు.
ప్రపంచంలో అత్యంత దుర్మార్గమైన మనుస్మృతిని అంబేద్కర్ బహిరంగంగా దహనం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. యువత ఆలోచించకుండా, గుడ్డిగా నాయకులను అనుసరించడమే దేశ అభివృద్ధి మందగమనానికి కారణం అని తేల్చిచెప్పారు. 80 శాతం మంది పార్లమెంట్ సభ్యులు కుబేరులుగా ఉన్న మన దేశం ప్రజాస్వామ్యం దేశం కాదని, ధనిక స్వామ్యదేశం అని పేర్కొన్నారు.
కమ్యూనిస్టు ఉద్ధండులైన పుచ్చలపల్లి సుందరయ్య, ఏకె గోపాలన్, నంబూద్రిపాద్, జ్యోతిబసు, ప్రమోద్ దాస్ గుప్త, రణదివే, పి.రామమూర్తిలతోపాటు రావిపూడి వెంకటాద్రి, కొంగర జగ్గయ్య, రామోజీరావు, ఎన్టీ రామారావు... వంటి వారి పరిచయం, విరసంతో అనుబంధం కలిగి ఉండటంతో ఆయన అనుభవాల సారాంశం ఈ వ్యాసాలలో కనిపిస్తాయి. అది ఇదనేమీలేదు, జీవితానికి, సమాజానికి సంబంధించిన అన్ని అంశాలపై ఆయన వ్యాసాలు రాశారు. ప్రాథమికంగా మనిషి ఆలోచనా విధానంలో మార్పు రావాలన్న తపన రాధాకృష్ణ వ్యాసాలలో కనిపిస్తుంది.
సత్యాన్వేషణ పుస్తకం వెల : రూ.160
పుస్తకాల కోసం సెల్: 9390686100
పుస్తక సమీక్ష : శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

‘కాఫీ విత్... గోలి మధు’పై విశ్లేషణ

3 వేలకుపైగా సాహితీ ఎపిసోడ్స్‌తో రజా హుస్సేన్ రికార్డ్ ఆయన చూపు పడిన ఏదైనా రజా హుస్సేనిజానికి రూపాంతరం చెందుతుంది. ఇజం అంటే ఏమిటో అని కంగారు ...