Dec 1, 2025

కలిమిశ్రీ సేవలు గుర్తించిన మంగళగిరి సాహితీ కళావేదిక


ప్రముఖ కార్టూనిస్టు, మల్లెతీగ మాసపత్రిక సంపాదకుడు, మిత్రుడు కమిలిశ్రీ(కలిమికొండ సాంబశివరావు)కి ఈ నెల 28వ తేదీ రాత్రి మా ఊరు మంగళగిరిలో మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. కలిమిశ్రీ సాహితీ సేవలను మంగళగిరి సాహితీ కళావేదిక  గుర్తించి పాతమంగళగిరిలోని కామ్రేడ్ పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు కళానిలయంలో  సన్మానించడం సముచితం. నాకు చాలా సంతోషం కలిగించింది.   కలిమిశ్రీ ఇల్లు ఓ సాహిత్య కుటీర పరిశ్రమ. అతను, అతని భార్య, కుమారుడు... అందరూ తెలుగు సాహితీవేత్తల సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి నిరంతరం కృషి చేస్తుంటారు. కవితలు, కథలకు సంబంధించి వందల పుస్తకాలకు, పలు మాస పత్రికలకు ఆయన అద్వితీయంగా రూపకల్పన చేశారు. అతని ఇల్లు ఓ కుటీర పరిశ్రమ అని ఎందుకన్నానంటే, ఓ కవి లేక రచయి కవితలు, కథలు రాసిన పేపర్లు ఆయనకు ఇస్తే చాలు. పుస్తకావిష్కరణలు జరిపించేస్తారు. డీటీపీ, ప్రూఫ్ రీడింగ్ దగ్గర నుంచి కవర్ పేజీ డిజైన్, పుస్తకం డిజైన్, ఫొటోల కూర్పు, ముందు మాటలు, ముద్రణ ... ఆ తర్వాత ఆ పుస్తకం ఆవిష్కరణల వరకు ఆయన, ఆయన కుటుంబ సభ్యులే చూసుకుంటారు. ఈ రకమైన సాహితీ సేవ మాసపత్రికల నిర్వాహకులకు, కవులు, రచయితలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది.  తన కవితలు, కథల కాగితాలు ఇచ్చిన కవులు, రచయితలు, తర్వాత తమ పుస్తకాలను చూసి ఎంత మురిసిపోతారో, ఎంత ఆనందిస్తారో వారి మొఖాలను చూస్తే అర్థమవుతుంది. పుస్తకం ఎలా ఉండాలో ఆయనకు చెప్పవలసిన అవసరంలేదు. చెప్పినా, అంతకు మించి ఆకర్షణీయంగా ఆయన పుస్తకాన్ని తీర్చిదిద్దుతారు. కలిమిశ్రీకి సాహిత్యంతోపాటు సామాజిక అంశాలు, పుస్తక రూపకల్పనపై అవగాహన ఎక్కువ.  కలిమిశ్రీకి సాహిత్యంపై ఉన్న ప్రేమతోనే ఇదంతా సాధ్యమవుతోంది. చూసేవారికి ఇదంతా ఓ వ్యాపారంలా అనిపిస్తుంది. వాస్తవానికి ఇది వ్యాపారమే. అయితే, కలిమిశ్రీ సాహితీ ప్రియుడుగా, శ్రామికుడిగా ఉన్నత శిఖరాలకు చేరారు.  తెలుగు సాహితీ ప్రపంచం గుర్తించుకోతగిన గొప్ప సాహితీ సేవకుడు కలిమిశ్రీ. వందల పుస్తకాలను అన్ని హంగులతో ముద్రించి, ఆవిష్కరణలు చేయించిన కలిమిశ్రీ  వ్యాపారవేత్తగా మాత్రం ఎదగలేకపోయాడు. చేసిన పనికే ఆయనకు డబ్బులు అడగడం తెలియదు. ఇక వ్యాపారవేత్తగా ఏమి ఎదుగుతారు?.   

‘కలిమి’ లేని కలిమిశ్రీ అని మంగళగిరి బుద్ధ విహారం అధ్యక్షుడు కృష్ణార్జున రావు గారు రాశారు. సాహితీ వేత్తగా, సాహితీ సేవకుడిగా, సాహితీ పారిశ్రామికవేత్తగా ఆయన  ఎంత ఉన్నతుడిగా ఎదిగినా, ఆర్థిక వ్యవహారాలలో కలిమిశ్రీ చాలా పూర్. అందుకు ఓ ఉదాహరణ చెబుతాను. ‘‘కలిమిశ్రీకి చేసిన పనికి డబ్బు అడగడం తెలియదు’’ అని దివంగత రిటైర్డ్ డీఎస్పీ బొప్పన విజయకుమార్ నాకు ఒకసారి చెప్పారు. విజయకుమార్ గారి ‘రేపటి కోసం’ మాసపత్రిక నిర్వహణా వ్యవహారాలన్నీ కలిమిశ్రీ చాలా కాలం చూశారు. విజయకుమార్ గారు చెప్పిన విషయం నాకు కూడా స్వానుభవం అయింది. నా ‘ప్రజారాజధాని అమరావతి’ పుస్తకం రూపకల్పన అంతా ఆయనే చేశారు. నేను మేటర్, ఫొటోలు మాత్రమే ఇచ్చాను. ఆయన పనితనం నాకు తెలుసు. అందువల్ల ఆయనకు నేను ఏమీ చెప్పలేదు.  కవర్ పేజీ నుంచి ఏ ఫొటో ఎక్కడ పెట్టాలో అంతా ఆయనే చూసుకుని, అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రింటింగ్ నేనే చేయించుకున్నాను.  నా పుస్తకం అచ్చయి వచ్చిన తర్వాత, దానిని చూసి అందరి రచయితలలానే నేనూ చాలా ఆనందించాను. అంతవరకు ఒక ఎత్తు. నా పుస్తకం ఆవిష్కరణ జరిగిన నెల తర్వాత కూడా ఆయన చేసిన పనికి నన్ను డబ్బులు అడగలేదు. అప్పటికీ, ‘‘ఎంత ఇవ్వమంటారు’’ అని నేనే అడిగాను. అతను అడిగిన అమౌంట్ విన్న తర్వాత, విజయకుమార్ గారు చెప్పినది నిజమేనని నిర్ధారణకు వచ్చాను. అతను అడిగినదానికంటే, నేను ఎక్కువ అమౌంట్ ఇచ్చాను. అలాంటి కలిమిశ్రీ వ్యాపారవేత్తగా ఏమి ఎదుగుతారు!  ఆయన తన వృత్తిలో ఎంత దిట్టో, జీవన శైలిలో అంత సింపుల్‌గా ఉంటారు. ఆయన మాటతీరు, నవడి కూడా అంతే ఉంటుంది. తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చేస్తారు. ఆయన దృష్టిలో పని అంటే, అందరి సాహిత్యానికి మెరుగులు దిద్దడమే!.  తెలుగు సాహిత్యానికి వివిధ రూపాలలో ఇంతటి సేవచేసినవారు, చేస్తున్నవారు కలిమిశ్రీ ఒక్కరేనని నా అభిప్రాయం. విజయానికి శ్రమించడం ఒక్కటే మార్గం అన్నది కలిమిశ్రీకి అక్షరాల వర్తిస్తుంది. 

ఈ నెల 22, 23 తేదీలలో విజయవాడ తుమ్మలపల్లి  కళా క్షేత్రంలో విజయవంతంగా నిర్వహించి   "జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు" నిర్వహణా బాధ్యతలను జిల్లా కలెక్టర్ లక్ష్మీశా  కలిమిశ్రీకి అప్పగించడం చాలా గొప్ప విషయంగా కొందరు భావిస్తున్నారు. అయితే, ఆ ఉత్సవాల నిర్వహణకు అత్యంత సమర్థుడు, అర్హుడు కలిమిశ్రీ అన్నది నా భావన. ప్రపంచంలోని సాహితీవేత్తలు, సాహితీ అభిమానులు, ప్రభుత్వం కూడా కలిమిశ్రీ సాహితీ సేవలను గుర్తించవలసి ఉంది. కలిమిశ్రీ సాహిత్యం కోసం చేస్తున్న కృషిని మంగళగిరి సాహితీ కళావేదిక వారు గుర్తించి, ఆయనను సముచిత రీతిన గౌవించినందుకు వారికి నా అభినందనులు.

- శిరందాసు నాగార్జున

No comments:

Post a Comment

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్  ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...