మానవ అక్రమ రవాణా, వ్యభిచారం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. మానవ అక్రమ రవాణా విషయంలో ఆడ, మగ తేడాలేదు. అయితే, ఆడపిల్లలే అధికంగా ఉన్నారని సమాచారం. బాలికలను, మహిళలను వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారు. అవయవాల కోసం కూడా మానవ అక్రమ రవాణా జరుగుతోంది. రాష్ట్రంలో మహిళా సెక్స్ వర్కర్లు గణనీయంగా ఉన్నారు. ఓ పక్క అక్రమ రవాణా, మరోపక్క ఆర్థిక పరిస్థితుల వల్ల సెక్స్ వర్కర్ల సంఖ్య పెరుగుతోంది. ఇది చాలా ఆందోళన కరమైన అంశం. ఒక నివేదిక ప్రకారం 2021లో 1,33,447 మంది మహిళా సెక్స్ వర్కర్లతో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, 2024లో 1,19,367 మందితో రెండవ స్థానంలో ఉంది. మానవ అక్రమరవాణా, వ్యభిచారం నిరోధించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఈ అంశాన్ని ప్రభుత్వాలు ఏవీ తీవ్రంగా పరిగణిస్తుట్లు కనిపించడంలేదు. ఇందుకోసం రాష్ట్రంలో ఓ పటిష్టవంతమైన వ్యవస్థలేదు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో మానవ అక్రమరవాణా నిరోధక యూనిట్స్ (యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్-ఏహెచ్‌టీయూ)లను ఏర్పాటు చేశారు. వాటికి పోలీస్ స్టేషన్ హోదా కల్పించారు. అయితే, ఇప్పటి వరకు ఏ ఒక్క యూనిట్‌లో ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నేరుగా నమోదు చేయలేదు. స్థానిక పోలీస్ స్టేషన్‌లు తమ వద్ద ఉన్న పిల్లలు, యువతుల మిస్సింగ్, అక్రమ రవాణా కేసులు ఈ మానవ అక్రమరవాణా నిరోధక యూనిట్స్‌కు బదిలీ చేయవలసి ఉంది. ఆ కేసులను ఏహెచ్‌టీయూలు స్వతంత్రంగా దర్యాప్తు చేపట్టాలి, కానీ వాస్తవ పరిస్థితుల్లో అలా జరగడం లేదు. దాంతో ఆ కేసులు విచారణ నీరుగారి పోతోంది. గత 5 ఏళ్ళుగా కనీసం 10 శాతం మంది నిందితులకు కూడా శిక్షలు పడలేదు. శారీరక దోపిడీ లేదా లైంగిక దోపిడీ, బానిసత్వం, దాస్యం లేదా అవయవాలను బలవంతంగా తొలగించడం, పిల్లలు, మానవ అక్రమ రవాణా ముప్పును ఎదుర్కోవడానికి భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 370, 370A ఉన్నాయి. లైంగిక వేధింపులు, దోపిడీ నుండి పిల్లలను రక్షించడానికి లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ-పోక్సో (పీఓసీఎస్ఓ) చట్టం చేశారు. బాలికలు, మహిళలను అమ్మడం, కొనడం, స్త్రీలు, పిల్లల అక్రమ రవాణాకు సంబంధించి భారతీయ శిక్షాస్మృతిలో నిర్దిష్ట చట్టాలు అనేకం ఉన్నాయి. రాష్ట్రం కూడా వారి రక్షణకు GOMs.No.1 (2003), GOMs.No.28 (2012), GOMs.No.43 (2015 ) జారీ చేసింది. ఇన్ని చట్టాలు, జీఓలు ఉన్నప్పటికీ ఫలితంలేదు. వాటిని అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోంది. బాధిత బాలికలకు, మహిళలకు తగిన రీతిలో పునరావాసం, పరిహారం లభించడంలేదు. 2016 నుండి 2022 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 2,460 మందిని అక్రమ రవాణా, వ్యభిచార గృహాల నుంచి రక్షించారు. వారిలో పది శాతం మందికి కూడా పునరావాస సహాయం లభించలేదు. దీని వలన వారు తిరిగి లైంగిక దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉంది. అక్రమ రవాణాదారులకు శిక్ష విధించే రేటు 8 శాతం మించిలేదు. వీరికి అందాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవీ అందలేదు. పునరావాస కార్యక్రమాలు, నష్టపరిహారం అందించడంలో ఆ నాటి రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా నల్సా (నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ) వారు 2015లో రూపొందించిన పథకం ప్రకారం నరక కూపాల నుంచి విముక్తి పొందిన ప్రతి మహిళకు లేదా బాలికకు లక్ష రూపాయల నుంచి రూ.8 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా, జీవో ఎంఎస్ నెంబర్ 28 ప్రకారం విముక్తి పొందిన బాధితులకు రూ.20 వేలు తక్షణ ఆర్థిక సహాయం అందజేయాలి. కానీ, విముక్తి పొందినవారిలో ఐదు శాతం మందికి మించి ఆర్థిక సహాయం అందలేదు.
బాధితులకు రక్షణ కరువైంది. బాధితుల పిల్లలు వివక్షకు గురవడం మరో తీవ్రమైన అంశం. ఇది బాధిత మహిళలకు అయిన గాయాలను ఇంకా తీవ్ర చేస్తోంది. సెక్స్ వర్కర్లను అనధికారిక కార్మికులుగా పరిగణించి, వారికి అందించే అన్ని సంక్షేమ పథకాలు వీరికి కూడా వర్తింపచేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ ఆదేశాలు అమలు కావడంలేదు. న్యాయ వ్యవస్థ కూడా ఈ బాధిత మహిళలు, బాలికల రక్షణ, వారి పునరావాసం, ఉపాధి... వంటి విషయాలలో ప్రత్యేక దృష్టి సారించవలసి ఉంది. సెక్స్ వర్కర్లను, వ్యభిచార గృహాలు, అక్రమ రవాణా నుంచి రక్షించబడినవారి సంక్షేమం కోసం అక్రమ రవాణా బాధిత మహిళల రాష్ట్ర సమాఖ్య ‘విముక్తి’, హెచ్ఈఎల్‌పీ(సొసైటీ ఫర్ హెల్ప్ ఎంటైర్ లోయర్ అంద్ రూరల్ పీపుల్)వంటి స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నాయి. బాధిత మహిళల తరఫున పోరాటం చేస్తున్నాయి. అయినా, ప్రభుత్వాల నుంచి తగినంత స్థాయిలో స్పందన రాకపోవడం బాధాకరం. విముక్తి పొందిన బాలికలు, యువతుల సంక్షేమంపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిపెట్టవలసి ఉంది. వారికి న్యాయం, గౌరవం, ఉపాధి, ఆర్థిక భద్రత కల్పించడం వంటి అంశాల విషయమై ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవలసి ఉంది. వ్యభిచారం, అక్రమ రవాణా నుండి బయటపడేవారికి ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించాలి. దానిని పటిష్టవంతంగా అమలు చేయాలి. వారు మళ్లీ గౌరప్రదంగా సమాజంలో బతికే వెసులుబాటు కల్పించాలి. వ్యభిచారం, అక్రమ రవాణా నుండి బయటపడిన వారికి రక్షణ, సంక్షేమం, నష్ట పరిహారం కోసం సింగిల్ విండో విధానం ద్వారా వారు ప్రయోజనాలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవలసి ఉంది. అక్రమ రవాణాలో బయటపడిన వారిని నేరస్థుల వలే షెల్టర్ హోమ్‌లలో సంవత్సరాల పాటు నిర్బంధంలో ఉంచడం భావ్యంకాదు. అందుకు ప్రత్యామ్నయంగా కమ్యూనిటీ-ఆధారిత పునరావాసం కోసం సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయవలసి ఉంది. తద్వారా వారు సమాజంలో కలిసిపోయి జీవించేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ రవాణా బాధిత మహిళలు కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, సహాయక సేవల సమీక్ష, పర్యవేక్షణ, వాటి అమలు కోసం ఏర్పాటు చేసే కమిటీలలో సెక్స్ వర్కర్లు, అక్రమ రవాణా నుండి బయటపడిన వారికి ప్రాతినిధ్యం కల్పించవలసి ఉంది. బాధితులు తమ హక్కులు తిరిగి పొందేందుకు, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు స్పష్టమైన, పటిష్టమైన విధానాలు, సంస్కరణలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని అన్ని విధాల ఆదుకోవలసిన అవసరం ఉంది.